ఝరి – 80 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

“అమ్మా! వీడేదో అంటున్నాడు, నాకేం అర్థం కాలేదు” వెళ్ళి తల్లితో ఫిర్యాదు చేసాడు మాధవ్.
“ఏం జరిగిందిరా?” అడిగింది లక్ష్మి.
“వసంత్ వాళ్ళింటికి వెళ్ళాడు, అక్కడేం జరిగిందో తెలీదు, నన్నిలా అన్నాడు” అన్నాడు అయోమయంగా.
“వాసూ! వాసూ!” రెండుసార్లు పిలిచాక గదిలోంచీ వచ్చాడతను. ముఖం ఎర్రగా వుంది. ఆవిడ అడిగింది, అతను చెప్పాడు.
“మామయ్య రాసిచ్చిన స్థలం వాళ్ళింట్లోభాగంగా వాళ్ళ ప్రహరీలోనే వుంటుంది. చెట్లూ అవీ వున్నాయి. ఇప్పుడు మేస్త్రీని వెంటబెట్టుకుని వెళ్ళి ఆ స్థలం మాకు రాసిచ్చావుగాబట్టని కొలుచుకుని, హద్దులు పెట్టుకుని రావాలా? ఉన్న చెట్లూ అవీ కొట్టేసి, అక్కడో ఇల్లు కట్టుకుని ఇక్కడినుంచీ వెళ్ళిపోవాలా? ఏం, నేను ఇక్కడి మనిషిని కానా? నిన్నూ, నాన్ననీ వదిలిపెట్టి ఎందుకు వెళ్తాను? ఎప్పుడో కృష్ణ చదువై, వాడికి వుద్యోగం వచ్చాక అక్కాతమ్ముళ్ళిద్దరూ అనుకుని కట్టుకుంటే కట్టుకుంటారు. అప్పుడేనా అద్దెకి ఇచ్చుకుంటాంగానీ అక్కడికెళ్ళి ఎందుకుంటాం?” అన్నాడు ఆవేశంగా.
“ఈమాటలేవో అక్కడే అనకపోయావా? నువ్వేనా, రాణా యింటికి వెళ్ళి అక్కడ బెదిరించి వచ్చినది?” అంది లక్ష్మి.
“అదీ యిదీ వేరు. వీళ్ళు అసలిలా అనుకుంటున్నారని వూహించలేదు”
లక్ష్మి లేచి వెళ్ళి ఫోన్ తీసుకుని పద్మకి చేసింది.
“ఏం మాట్లాడారే, వాసుతో నువ్వూ మీ ఆయనాను? మరిదిగారేదో అన్నారనుకో, పక్కన కూర్చుని నువ్వేం చేసావు? వాసుని వేరే వెళ్ళిపొమ్మని అనడమేమిటి? ఉద్యోగరీత్యా నీ కొడుకు వేరే వెళ్ళాడేమో! వీళ్ళు ముగ్గురికీ ఇక్కడే వుద్యోగాలు. ఎక్కడికో ఎందుకెళ్తారు, పెద్దాడేనా, చిన్నాడేనా? మనందరం పెట్టుకున్నట్టే అన్నయ్య తనకున్నది తను కూతురికి పెట్టుకున్నాడు. పెట్టుపోతలు కొందరు పిల్లలకి ఎక్కువ జరుగుతాయి, కొందరికి తక్కువ జరుగుతాయి. అత్తవారిచ్చిన ఆమాంబాపతులమీదే బతికేస్తారేమిటి మగపిల్లలు? నా కొడుకులేమీ అంత చేతకానివాళ్ళు కాదు. వాసు గీత జీతం ముట్టుకోడు. చిన్నపిల్ల, తను సంపాదించి ఇవ్వటమేమిటని దానికే వదిలేసాడు. స్థలంమాత్రం ముట్టుకుంటాడా? అక్కాతమ్ముళ్ళు చూసుకుంటారన్నారన్నాడు. వాళ్ల వెనక అన్నయ్య వున్నాడు. నువ్వు సలహాలివ్వడమేమిటి?” అన్నది మరిదే అని అర్థమైనా, అతన్నేమీ అనలేదుకాబట్టి, చెల్లెల్నే దులిపేసింది.
“ఆయన అన్నదాంట్లో తప్పేముందే? ఎవరి పిల్లలబాగు వాళ్ళం చూసుకుంటున్నాం. ఎటొచ్చీ మాధవే వెనక ఎవరూ లేకుండా మిగిలాడని అన్నారు” అంది పద్మ.
“మాధవ్‍కేం తక్కువ? బాధ్యతల్లేవు. గెజెటెడాఫీసరు. తండ్రింకా సర్వీసులో వున్నాడు. వాసు బాగు వాసు చూసుకోలేదా, వాడి బాగు వాడు చూసుకోడా? పిల్లలకి పెళ్ళిళ్ళు చేసారు, మనవలెత్తారు. మీ కాలక్షేపం మీరు చేసుకుంటే మంచిది” అని ఫోన్ పెట్టేసింది. కానీ మనసులో ఒక ప్రశ్న. ఇలాంటి ఆలోచన ఎందుకు తలెత్తింది? దీనికి మూలం ఎక్కడుందని.
ఆమె అలా మాట్లాడాక అన్నదమ్ములిద్దరూ ఎవరిదారిన వాళ్ళు ఆఫీసులకి వెళ్ళిపోయారు. అప్పటికది ఒక చిన్న నిప్పురవ్వ. ఇక్కడ చల్లారినట్టే వుందిగానీ ఇంకెక్కడికో నిశబ్దంగా చేరింది. ఆలోచన అనేది రాకూడదు, వచ్చాక అది విస్తరించకుండా వుండదు. ఎంతోకొంత ప్రభావాన్ని చూపించకుండా వుండదు.
ఆఫీసుకెళ్ళాక మాధవ్ ప్రహ్లాద్‍కి ఫోన్ చేసి గొడవంతా చెప్పాడు.
“వసంత్‍వాళ్ళ నాన్న అలా అన్నాడేమిట్రా? నేనే అనిపించానని వాసు అనుకున్నాడు. చాలా బాధేసిపోయింది. అంత చేతకానివాడిలా కనిపిస్తున్నాన్రా, నేను? మాకు ఇల్లుందికాబట్టి వేరే స్థలాలూ అవీ కొనాలన్న ఆలోచన రాలేదు. చెల్లి పెళ్ళి చేసేసాం. మా నాన్నకింకా ఏడాదో ఆర్నెల్లో సర్వీసుంది. ఆయన ఎంతొచ్చినా తెచ్చి అమ్మ చేతిలో పెడతారుగానీ స్వంతానికి ఒక్క పైస ఖర్చుపెట్టుకోరు. నాకేం తక్కువరా? నామీద జాలెందుకు? ఈ పెద్దాళ్లకి చెయ్యడానికేమీ లేకపోతే ఇలా అన్నిట్లోనూ వేలుపెట్టి తమాషా చూస్తారా ఏమిటి, ఖర్మ? మామయ్యకి తెలిస్తే ఎంత అసహ్యంగా వుంటుంది? ఆయనదాకా ఎందుకు, గీతకే అనిపించదా? అన్నిటినీ మించి నీలిమ ఏమనుకుంటుంది? ” అన్నాడు.
“పోయిపోయి ఆయన వాసుతోనే పెట్టుకున్నాడా? రాణావాళ్ళ నాన్నలాంటివాడు కాదుకదా, అందుకని కాస్త ఆలోచించి వుంటాడు. లేకపోతే ఎక్కడో ముళ్ళుపెట్టేసి బైటపడేవాడు” అని నవ్వాడు ప్రహ్లాద్. “వసంత్‍తో నువ్వు ఇప్పుడేం మాట్లాడకు. మీరిద్దరూ ఫ్లేరప్ ఔతే కష్టం. వాడితో నేను మాట్లాడతాను. సాయంత్రం అందరం కలిసి మీయింటికి వస్తాం. కూర్చుని మాట్లాడుకుందాం” అన్నాడు. సరేనని పెట్టేసాడు మాధవ్. అతని మనసంతా అలజడిగా వుంది. వాళ్ళు అనడంకాదుగానీ వాసు అలా ఎలా అనుకున్నాడని బాధపడ్డాడు.
సాయంత్రం వాసు, గీత ఇంటికి తొందరగా వచ్చారు. తను మళ్ళీ తండ్రి కాబోతున్నాడన్న వార్త పొద్దుటి గొడవలో మర్చిపోయాడతను. గీతతో బైటికి వెళ్దామని వాళ్ళ ఆఫీసుకి వెళ్ళి తీసుకొచ్చాడు. తీరా ఇద్దరూ బయల్దేరే సమయానికి ప్రహ్లాద్ ఫోన్ చేసాడు.
“నేనూ, వసంత్ వస్తున్నాంరా!” అని. ఇద్దరూ ఆగిపోయారు. వాసు భృకుటి ముడిపడింది. ఎందుకు వస్తున్నట్టు? రాజీకా? రాయబారానికా? అక్కడే వున్న మాధవ్‍కేసి సాలోచనగా చూసి, తర్జనితో బెదిరించాడు. అతను తనకేమీ తెలీదన్నట్టు రెండుచేతులూ జోడించి దణ్ణం పెట్టేసాడు.
వాళ్ళిద్దరూ బైటికి వెళ్తున్నారంటే మొదట్లో ఒకసారి నీలిమ సరదాగా అడిగింది మాధవ్‍ని.
“ఎక్కడికెళ్తారు వాళ్ళు? ఆవిడ చీరలు కొనుక్కోదు. నగలు కొనుక్కోదు. బయట తినదు. ఇంకేం చేస్తారు?’ఇక్కడ చెప్పుకోగా మిగిలిపోయిన కబుర్లేం వుంటాయి?” అని. మాధవ్‌ నవ్వేసాడు.
“నగరవిహారం, నదీవిహారం చేస్తారు” అన్నాడు.
“అంటే?”
“రివర్‍సైడ్‍కి వెళ్తారు. అక్కడ పడవలు తిరుగుతుంటాయి. ఓ గంటో రెండుగంటలో తిరిగేసి వస్తారు. బైసికిల్ ట్రాక్స్ వున్నాయి. ఇద్దరూ చెరో సైకిలూ తీసుకుని తిరుగుతారు. వాసు స్విమ్మింగ్ చేస్తాడు. వదినకీ నేర్పించాడేమో తెలీదు. స్విమ్ సూటైతే కొన్నాడు తనకి. వాడికి ఫోటోగ్రఫీ హాబీ. చాలామంచి కెమేరా వుంది వాడిదగ్గిర. ఎవ్వరడిగినా ఇవ్వడు” అన్నాడు.
“అందరూ వుండరూ?” అడిగింది.
“తెలీనివాళ్ళెవరు? సగంమందికిపైగా మాతో స్కూల్లోనూ, కాలేజిలోనూ చదువుకున్నవాళ్ళే” జవాబిచ్చాడు మాధవ్. వింతగా అనిపించింది నీలిమకి. భార్యా, భర్తా అనే తేడాగానీ, ఆడా,మగా అనే స్పృహగానీ లేకుండా అలా బతికేవాళ్లని ఆమె ఎప్పుడూ చూడలేదు. గీత విషయంలో కలిగిన ఆశ్చర్యం సుమతి, లతల టూర్లగురించి తెలిసినప్పుడు మునకలెత్తింది.
ఫోన్ చేసిన అరగంటలో ప్రహ్లాద్, మాధురీ వచ్చేసారు. మరో పదినిముషాలకి వసంత్, మానసా వచ్చారు. పలకరింపులు అయ్యాయి. మానస దగ్గర్నుంచీ పాపని తీసుకుని ఎత్తుకుంది గీత. పిల్ల కొత్త చేసి ఏడుపు మొదలుపెడితే మళ్ళీ తిరిగి యిచ్చేసింది. కొద్దిసేపటికి కొత్త తగ్గి, తల్లి చేతిలోంచీ కిందికి జారి పాకడం మొదలుపెట్టింది. మరోవైపు మయూఖ్ ప్రహ్లాద్ కూతుర్తో ఆటల్లో పడ్డాడు. తామంతా ఆడుకున్నచోట తమ పిల్లలు ఆడుకుంటుంటే వింతగా అనిపించింది గీతకి. ఇదేచోట వాసు తండ్రి, మేనత్తలుకూడా ఆడుకుని వుంటారన్న లీలామాత్రపు ఆలోచనకూడా కలిగింది. పొద్దున్నే కాలు కింద పెట్టేముందు భూదేవికి దణ్ణం పెట్టమని అందుకే అంటారేమో! ఎందరో నడిచిన నేల అని.
నీలిమ లోపలికి వెళ్ళి అందరికీ తినడానికీ, మంచినీళ్ళూ తీసుకొచ్చింది. వసంత్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. ముఖం ఇంకా ముడుచుకునే వుంది. తప్పు చేసినట్టు తెలెత్తుకోలేకపోతున్నాడు. తనదొక చిన్న వస్తువు ముట్టుకుంటేనే సమీర వూరుకోదు. కట్నం తేని పిల్లని, కట్నం తేలేదంటేనే మానస సహించదు. అలాంటిది గీతా, వాసులమీద జరిగిన దాడి…
మహతి పెళ్ళినుంచీ వచ్చి ఇది రెండోరోజు. అక్కడ అంపకాలు పెట్టేసి ఎవరిళ్ళకి వాళ్ళు తిరిగి వచ్చారు. అరుణ, నిర్మల ఆడబడుచు, మహతితో వెళ్ళారు. వ్రతం అయాక యానాళ్ళు. ఆ తర్వాత పదహార్రోజుల పండగదాకా హడావిడి వుంటుంది. మళ్ళీ ఇంకో పెళ్ళో, శ్రీమంతమో, బారసాలో… నిత్యకళ్యాణంలాగే వుంది.
“మగపెళ్ళివారు కాస్త అదరగండం మనుషుల్లా వున్నార్రా! కట్నం దగ్గిరే రెండు నెలలు సాగదీసారు. దీనికేమో నోట్లో నాలిక లేదు. ఎలా సర్దుకుంటుందో, ఏమో!” అంది లక్ష్మి దిగులుగా. ఆడపిల్లకి పెళ్ళి చేసాక వుండే ఈ దిగులు ఒక నిజం. దాన్ని తట్టుకోలేకపోవటం ఇంకో నిజం. ఆడపిల్లల అప్పగింతలప్పుడు వుండే దు:ఖం ఈ మగపిల్లలకి ఎప్పటికప్పుడు కొత్తే. మహతిని పంపించిన దు:ఖం ఇంకా పచ్చిగావుంది ప్రహ్లాద్‍కి.
“పెళ్ళిలో గీతా, రవళీ- సుధీర్ తాళం పట్టించారు ఆమ్మా!” అన్నాడు మాటమార్చి.
“గీత కాదు, వదిన” అంది గీత.
“ముందు నువ్వు నన్ను మరిదిగారని పిలిచి మర్యాదలు చెయ్యి. అప్పుడు పిలుస్తాను” అన్నాడు ప్రహ్లాద్ వేళాకోళంగా.
“మొన్నామధ్యని ఎవరో కలిసారు… మీ తమ్ముడెలా వున్నాడని అడిగారు. కృష్ణ గురించనుకుని బానే చదువుతున్నాడని చెప్పాను. వాళ్ళు వింతగా చూసార్రా! వాళ్లడిగింది నీగురించని ఇప్పుడే అర్థమైంది” అంది గీత. అతను నవ్వేసాడు. మాధురి చురుగ్గా చూసింది.
“ఏం ముట్టించావే?” అడిగింది లక్ష్మి గీతని.
“నేను కాదు రవళి. సుధీర్, సుమంత్ కలిసి తిరుగుతుంటే మామ్మ శఠారుల్లా అలా తిరక్కపోతే మీరూ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చుకదా అందట. రవళి వింది. ఇద్దరూ డాక్టర్లుకదా, శఠారులంటే అశ్వినీదేవతలనుకుందట. కానీ అనుమానం తీరక నన్నడిగింది”
“అందర్లో కూర్చుని మరీ” అన్నాడు మాధవ్.
“అబ్బా! నువ్వో పండితురాలివనీ, అది నిన్ను అడగటం” అంది లక్ష్మి.
“ఇద్దరూ తోక కాలిన పిల్లుల్లా చెరోవైపుకీ పారిపోయారు” అంది గీత.
“తోక తెగిన బల్లి వుంటుంది, కాలు కాలిన పిల్లి వుంటుంది. తోక కాలిన పిల్లేమిటి? పిచ్చిభాష మాట్లాడకు. మయూకూడా నిన్ను చూసి నేర్చుకుంటున్నాడు.” వాసు సరిచేసాడు.
“వాళ్ళిద్దర్నీ చూస్తుంటే ఆ నిముషంలో అవి రెండూ గుర్తొచ్చాయి” అంది గీత.
మానస నవ్వాపుకోవడానికి ప్రయాసపడితే నీలిమ, మాధురీ ముఖాలు చూసుకున్నారు.
“అసలు మీ నాన్న అలా ఎందుకన్నాడురా? పెద్దవాళ్లం నేనూ, పెద్దనాన్నా ఇంకా బతికే వున్నాం, వేర్లుపడమని మా పిల్లలకి సలహా యివ్వడమేమిటి?” అంది లక్ష్మి వసంత్‍తో.
“నాన్న తరపున క్షమించమని నేను అడుగుతున్నాను ఆమ్మా!” అన్నాడు అతను మొహం దించుకుని.
“అన్నదమ్ములేవో గొడవలుపడుతుంటే ఇవ్వదగ్గ సలహా అది. అలాంటిదేమీ లేదు మాయింట్లో. అసలీ ఆలోచన ఎందుకు పుట్టుకొచ్చింది? మాధవ్ అడిగించాడని వాసు అనుకోడా? వాళ్ళిద్దరిమధ్యా లేనిపోని అపార్థాలు కాదురా?” అంది లక్ష్మి.
“ఛ… అలాంటిదేం లేదు పిన్నీ! ఎవరిమీది వుక్రోషాన్నో తీర్చుకోవడానికి ఇంకెవర్నో అనడం. అంతే. మీ అందరి పెళ్ళిళ్ళూ చెయ్యడానికి పెద్దమామయ్య ఎన్ని ఇబ్బందులూ, కష్టాలూ పడ్డాడో మాకందరికీ తెలుసు. అది దృష్టిలో వుంచుకునే ఎవరికివాళ్ళం కట్నం తీసుకోకూడదనుకున్నాం. చెల్లికి ఇచ్చినప్పుడు మనం తీసుకుంటే తప్పేమిటని నాన్న వాదన. వద్దనడానికి వున్న అవకాశం తీసుకోవద్దనడానికి వుండదు. అదే చెప్పి వప్పించానుగానీ అయిష్టంగా మా పెళ్ళికి వప్పుకున్నారు. వాసుని చూసి అందరం తీసుకోవడం మానేసామని అనుకుంటున్నారు. ఆ కోపంతో ఏదో అనేసారు. అంతే” అన్నాడు.
“ఐనా మనవరాలుకూడా పుట్టేసాక ఇంకా ఏమిట్రా?”
“అయనకి ఎవరం ఏం చెప్పలేం ఆమ్మా! ఆ అసంతృప్తి చాలా వుంది. దానికితోడు అమ్మకూడా ఏదో ఒకటి అంటుంది. నాలుగురోజులేకదా, ఇక్కడికి వచ్చి, వాళ్లదగ్గిర వుండేది, పట్టించుకోవద్దంటే మానస వినదు”
మానస చురుగ్గా కళ్లెత్తి చూసింది.
లక్ష్మి అంత తేలిగ్గా తీసుకోలేకపోయింది. మాధవ్ తన కొడుకు. అతని గురించి తనకి తెలీనిది కాదు. ఇంత అసంబద్ధంగా కోరుకునే మనిషి కాడు. అతని వెనక ఏదేనా జరిగిందా అనే విషయం అర్థం కావటం లేదు. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఎవరికేనా అలాంటి ఆలోచన వచ్చిందా? లేక వాళ్ళ నాన్నకి? వాళ్ల కారణంగా గొడవలు పడద్దని కొడుకుల్ని విడిగా పిలిచి హెచ్చరించాలి.
“మాయింట్లోంచీ తట్టాబుట్టా సర్దుకుని నన్నే వెళ్ళిపొమ్మని అనేసరికి కోపం వచ్చిందిరా! మాధవ్‍కి ఎవరూ లేకపోవడమేమిటి? నేను లేనా? మామయ్య లేడా? గీతతో నా పెళ్ళవడంతో చుట్టరికాలన్నీ మారిపోయాయా? ఇప్పటికీ ఆయన రాగానే అందరికన్నా ముందు ఎదురెళ్ళేది వాడే” అన్నాడు వాసు. అక్కడితో ఆ విషయాన్నిగురించి బైటికి అనుకోవడం ఆగిపోయింది. ఒక్కసారి స్వర్గందాకా ఎగిరి కిందపడ్డట్టు అనిపించింది నీలిమకి. ముందురోజు రాత్రే తనంది, వేరుకాపురాన్నిగురించి. ఉదయం గొడవ జరిగింది. రాత్రికి అంతా సమసిపోయింది. మాధురికి చెల్లెలిమీద జాలేసిపోయింది. వసంత్ ఆ వెంటనే కోప్పడ్డాడుకాబట్టి మానస ఆలోచన అక్కడ ఆగింది.
“భోజనాలు చేసి వెళ్ళండి” అంది లక్ష్మి. వంట చెయ్యడానికి లేచింది గీత. నీలిమకి అక్కచెల్లెళ్లతో మాట్లాడుతూ కూర్చోవాలని వుందిగానీ, తప్పదని లేచి, ఆమె వెంట వెళ్ళింది. మాధురీ, మానసా అనుసరించారు. పాతికమంది విశాలంగా కూర్చుని భోజనం చెయ్యగలిగేంత విశాలమైన వంటింటినీ, అందులో పొందిగ్గా అమర్చి వున్న సామాన్లనీ రెప్పలార్చుకుని చూసారు వీళ్ళిద్దరూ. నీలిమ అన్నీ అందిస్తుంటే చకచక వండేసింది గీత. ఆమె పనిలోని చురుకూ, నేర్పూ మానస చూపులని దాటిపోలేదు. ఏదో ఆకర్షణ కనిపించింది గీతలో. కానీ ఆ భావం బలపడి ఆమె గీత ప్రభావంలోకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టింది.
వంట పూర్తౌతుంటే వాళ్ళున్న దగ్గిరకి వచ్చాడు వసంత్.
“సారీ గీతా!” అన్నాడు నెమ్మదిగా.
“మా నాన్న, అత్త, వాసు… ఇందరున్నారు ఈ విషయాలు చూసుకోవడానికి. నువ్వూ నేనూ తలలు బద్దలు కొట్టుకోవలసిన అవసరం లేదు” అంది చాలా మామూలుగా. ఆ జవాబుతో అతని మనసు తేలికపడింది. మాధురికి గీతని చూస్తే ఛాలెంజిగా అనిపించింది. ఏంటీ, ఈమె నమ్మకం? వాళ్ళెవరూ అన్యాయం జరగనివ్వరనా, లేక అంతా తనమాటమీదే జరుగుతుందనా?
“థేంక్స్. ఇందులో మాధవ్ ప్రమేయం ఏమీ లేదు. వాసుకి చెప్పు” అన్నాడు.
“వాళ్ళిద్దరూ చూసుకుంటార్లే. మధ్యలో నా రికమెండేషనెందుకు?” అంది. ఆకుని అందకుండా, పోకని పొందకుండా పనిసాగించుకోవడమంటే ఇదేననిపించింది నీలిమకి. రోజూ అనుభవమే. ఏ చిన్న స్పర్థలోనూ తలదూర్చదు గీత. తను పరుషంగా ఒక్కమాట ఎవర్నీ అనదు. పనిమనిషినికూడా గట్టిగా కోప్పడదు. కానీ ఆమె పనులన్నీ నిరాటంకంగా జరిగిపోతాయి.
లక్ష్మి కేకేస్తే అందరూ భోజనాలకి లేచారు. భోజనాలయ్యాయి. మయూఖ్‍ని పడుకోబెట్టడానికి తమగదిలోకి తీసుకెళ్ళింది గీత. లక్ష్మి వాసూవాళ్ళతో ముందుగదిలోకి వెళ్తే మిగిలిన ముగ్గురూ నీలిమ గదిలోకి చేరారు.
“ఆమెకి మూడో నెల” అంది నీలిమ నెమ్మదిగా. ఆమె ముఖం కళతప్పింది. గొంతు చిన్నగా వణికింది. నిరాశ, నిస్పృహ… ఎంత బలవంతంగా ఆపుకుంటోందో, అంత బలంగా వ్యక్తమయ్యాయి.
“అదేమిటే?” అంది మాధురి, ఇంకేం అనాలో తోచక.