ఝరి – 83 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

లక్ష్మి చూపించినట్టు పిల్లలని అక్కడున్న దివాన్‍మీద పడుకోబెట్టి, తను కింద కూర్చోబోయింది యమున. ఇష్టమో, బలవంతమో, తమ కుటుంబంలోకి వచ్చింది. చెల్లెలి కొడుక్కి ఇద్దరు పిల్లల్ని కన్నది. పరాయిది ఎలా ఔతుందనుకుంది లక్ష్మి.
“పైన కూర్చోమ్మా! అలా కింద కూర్చోకూడదు” అంది. బెరుగ్గా సోఫా అంచుని కూర్చుంది యమున. ఆమె తండ్రికి ఎంత చెప్పినా వినలేదు. కిందనే మఠం వేసుకుని కూర్చున్నాడు. ఉతుకులకి కోరారంగుకి మారిన ధోవతి, పైన బాగా నలిగిపోయి ముడతలున్న పాతచొక్కా వేసుకున్నాడు. గీత లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తూ విజ్జెమ్మని వెంటబెట్టుకుని వచ్చింది.
“రాణా అమ్మమ్మని. మీ యిద్దరూ కలిసి మా యింటికి వచ్చారు, గుర్తుందా?” అని అడిగి, “దీన్ని చూసావా? నా మనవరాలు. నా పెద్దకొడుకు కూతురు. మాయిళ్ళలో ఏ ఒక్కళ్ళు బాధపడుతున్నా ఓర్చుకోలేదు. వాళ్ల నాన్న నేర్పించాడు దానికి అలాగ. దాని మాటకికూడా మాయింట్లో అంత విలువ” అంటూ గీతనిగురించి చెప్పి, “నీలిమేదే?” అని అడిగింది. ఆమె అక్కడ వుండి వుంటే, “ఇది నా కూతురి చిన్నకోడలు. కుందనాల బొమ్మ. వీళ్ళ అక్కపెళ్ళిలో చూసి, మనసు పారేసుకున్నాడు నా మనవడు” అని చెప్పేది.
“ఇప్పటిదాకా ఇక్కడే వుంది. ఈమధ్య దానికి చిన్న సందడికికూడా తలనెప్పి వచ్చేస్తోంది. వెళ్ళి పడుక్కున్నట్టుంది” అంది లక్ష్మి, కొంచెం విసుగ్గా. ఈమధ్య నీలిమ ప్రవర్తన ఆవిడకి నచ్చట్లేదు. ఇంటికి ఎవరేనా వచ్చేసరికి తలనెప్పని గదిలో తలుపేసుకుని కూర్చుంటోంది. పిల్లలగురించి అడుగుతారు. ఎందరని మమూలుగా అడిగేవాళ్ళు, ఇన్నేళ్ళైంది, ఇంకా కాలేదా అని అడిగేవాళ్ళు ఎవైరికి తోచినట్టు వాళ్ళు ప్రేమతోనో, కుతూహలంతోనో అడుగుతారు. చెప్పేవిధంగా చెప్పాలి. గదిలో ఎన్నాళ్ళు దాక్కోగలదు? వచ్చినవాళ్ళు ఏమనుకుంటారు? పంథొమ్మిదిమంది పిల్లలు ఈ యింట్లో వయసుకి వచ్చి వున్నారు. పెళ్ళిళ్ళు, తర్వాతి తతంగాలు, వరసపెట్టి జరుగుతున్నాయి. ఎవరికోసం మరొకరి జీవితంలో జరిగేవి ఆగవు. అందుకు వుదాహరణగా మాధురి, మానసలే వున్నారు. ఒక తల్లి పిల్లలే ఐనా ఎవరికి జరిగేవి వాళ్లకి జరిగాయి. నీలిమకోసం ఆగలేదు. ఇంకాకూడా జరుగుతాయి. గీతకి నెలతప్పినప్పట్నుంచీ నీలిమలో చాలా మార్పొచ్చింది. దాచుకున్నా దాగకుండా అసూయ కనిపిస్తోంది. మధ్యలో గీతేం చేసింది? ఇంచుమించు అవే ఆలోచనలు కలిగి కూతురికేసి సాలోచనగా చూసి తలూపింది విజ్జెమ్మ.
“నా కుటుంబం మొత్తానికీ తప్పబుట్టింది వాడొక్కడే. పోనీలేమ్మా! మేమంతా వున్నాం. వాడికి గట్టిగా చెప్తాం, ఇలా వుండకూడదని. చక్కటి పిల్లల్ని కన్నావు. ఆరోగ్యం బాగా చూసుకో, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకో. మీ అత్తమామలుకూడా పిల్లల్ని చూసారంటే మారతారు” అంటూ యమున పక్కని కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడింది. పిల్లల్ని ఒకరి తర్వాత ఒకర్ని ఎత్తుకుని ముద్దు చేసింది. పెద్దావిడ దగ్గర కూర్చుని అంత ప్రేమగా మాట్లాడుతుంటే తలదించుకుని కూర్చుంది యమున. అది బెరుకా? గౌరవమా? అర్థమవలేదు ఎవరికీ.
ఆ అమ్మాయి ఇదివరకు బట్టల షోరూమ్‍లో పనిచేసేది. అక్కడ చేస్తున్నప్పుడే రాణాతో పరిచయం. పెళ్లయ్యాక ఆ పని మానేసి, అతనితో కొన్నాళ్ళు కలిసి వుంది. తండ్రి తీసుకెళ్ళిపోయాక ఖాళీగా వుండిపోయింది. పైసాకూడా తెచ్చుకోకుండా తండ్రిమీద ఆధారపడి తినడం బాధనిపించినా ఆరోగ్యం సహకరించక వూరుకుంది. రాణా ఎంతోకొంత ఇస్తున్నాడు. అది ఓమూలకి రావట్లేదు. ఇప్పుడిక మళ్ళీ పని వెతుక్కుంది. కుట్టుసెంటర్లో దొరికింది. ఒకసారి పనిలో చేరాక మళ్ళీ తీరిక చిక్కదని ఇటొచ్చింది. విజ్జెమ్మతో యమున ఇవన్నీ చెప్తుంటే వింటూ కూర్చుంది గీత. ఆమె చూసిన జీవితాలకి కిందిమెట్లమీది జీవితం ఇది.
“భోజనాలు చేద్దురు. ఎప్పుడనగా బయల్దేరారో ఏమిటో! ” అంటూ ఏర్పాట్లు చూడటానికి లేచింది లక్ష్మి.
యమున మొహమాటపడింది. “పర్వాలేదండీ! వెళ్తూ దార్లో తినేస్తాం” అంది.
“ఈ యిద్దరు పిల్లల్నీ పెట్టుకుని వెళ్తూ దార్లో తింటారా? అందులోనూ బాలింతరాలివి, బైట తిండి తింటావా? భలేదానివే” లక్ష్మి నిండుగా నవ్వింది. గీత అప్పటికే లోపలికి వెళ్ళి, ఏర్పాట్లు చూస్తోంది. మాధవ్‍, వాసూ ఇంకా తినలేదుగాబట్టి అన్నీ వున్నాయి వీళ్ళిద్దరూ తింటుంటే వాళ్ళకి వండచ్చనుకుంది. పిల్లల్ని తను చూసుకుంటానని తండ్రీకూతుళ్ళని పంపింది విజ్జెమ్మ. యమున తండ్రి ఆకలి చంపుకోవడానికి అలవాటుపడ్డాడు. బాగా ఆకలనిపించినప్పుడు ఇంత టీ తాగి తిండి మరోగంట వాయిదావేసుకోవడం నేర్చుకున్నాడు. కానీ యమున చిన్నది. అమడపిల్లలు. పుట్టి నెల. ఎన్నోరోజుల ఆకలి తీర్చుకుంటున్నట్టు, ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబ తింటుంటే తెల్లబోయి చూసింది గీత. ఎందుకు? ఎందుకిలా? అప్పుడు తనకీ హరిచందనకీ తేడా. ఇప్పుడు యమునకీ తనకీ… చిన్నగా మొదలైన బాధ అణువణువూ నిండిపోతున్నట్టై, నిలబడలేకపోయింది. గోడకి ఆనుకుంది.
“అలా వున్నావేమే? ఏమైంది? వెళ్ళి కూర్చో” అంది లక్ష్మి కంగారుగా.
“ఏం లేదత్తా!” అంటూ ఆమె వెళ్ళి హాల్లో కూర్చుంటే నీలిమని కేకేసి, మిగతాపని అప్పజెప్పింది లక్ష్మి.
భోజనాలయ్యి వాళ్ళు బయల్దేరుతుంటే సంచీలో ఐదుకేజీల బియ్యం పోసిచ్చి, ఆయనకి పంచెలచాపు, యమునకి రెండుచీరలు పెట్టి, పిల్లలిద్దరికీ చెరో వందా ఇచ్చింది లక్ష్మి. యమున మాటిమాటికీ వీధికేసి చూస్తోంది. ఆమె కళ్ళలో నిస్పృహ. ఇక్కడికి వస్తున్నట్టు రాణాకి ఫోన్ చేసింది. అతను వస్తాడని ఆ ఎదురుచూపు. ఆఖరినిముషంలో వచ్చాడతను. ఆమె ముఖం విప్పారింది.
గీత విషయంలో రవి చేతుల్లో తన్నులు తిన్న ఎన్నోయేళ్ళతర్వాత అతను ఆయింట్లో అడుగుపెట్టడం. సంకోచంగా వచ్చాడు. అందుకే ఆ ఆలస్యం. అతన్ని చూడగానే గీత లేచి లోపలికి వెళ్ళిపోయింది. విజ్జెమ్మకి జరిగిన సంగతులేవి తెలీవుకాబట్టి ఆమె వెళ్తుంటే ఆశ్చర్యంగా చూసింది.
“లోపలికెళ్ళి మాట్లాడుకోండిరా, ఇద్దరూను” అంది లక్ష్మి.
“నీ కోడలు తన్నినా తంతుంది. ఇక్కడిదాకా రానిచ్చింది. అదే సంతోషం” అన్నాడు రాణా. యమునకి జరిగింది తెలిసే అవకాశం లేదుగాబట్టి, తమ విషయంలో అతని ప్రవర్తనపట్ల గీతకి ఆ కోపం అనుకుంది.
“మనింటికి వెళ్దాం” అన్నాడు భార్యతో.
“వద్దండీ! ఇద్దరు పిల్లల్తో చేసుకోలేను. నేను మా నాన్నతో వెళ్ళిపోతాను” అంది యమున.
“పోనీలే, మీ నాన్ననికూడా రమ్మను”
“అమ్మకి ఇబ్బంది. మరోమనిషి లేకపోతే ఆవిడకి గడవదు. నేను అక్కడే వుంటాను. తీరినప్పుడు మీరే అక్కడికి వస్తుండండి”
“సరేనైతే” అన్నాడు. తలాతోకా లేని ఆ సంభాషణ పూర్తైంది. పిల్లల్ని దగ్గిరకి తీసుకోవడంగానీ, ఎత్తుకోవడంగానీ చెయ్యలేదతను. వాళ్ళని బస్సెక్కించి మళ్ళీ వస్తానని వెళ్ళాడు.
“మనమేమీ జమీందార్లం కాదుకదా, అత్తయ్యగారూ! ఆ అమ్మాయి వైద్యానికి తలోయింతా వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడివన్నీ ఇవ్వడం దేనికి? వాళ్లవాళ్ళు చూసుకోరా?” అంది నీలిమ దుగ్ధగా.
“ఇంట్లో సంపాదించేవాళ్ళు నలుగురుండగా నా కూతురు జమీందారు కాకపోవడమేమిటి?” అంది విజ్జెమ్మ. నీలిమ ముఖం ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది.
“ఏమిటే, వీడు? ఆ కాపురమేమిటి? దాంతో ఆ అతకని పొతకని మాటలేంటి? పిల్లల్ని కన్నెత్తేనా చూసాడూ?” అంది విజ్జెమ్మ.
“సంధ్య కాపురమే అలా తగలబడింది. వీడిలా వుండటంలో వింతేముంది? మళ్ళీ వస్తాడేమో, దార్లో పడేలా నాలుగు మంచిమాటలు చెప్పు” అంది లక్ష్మి. అనుకున్నట్టుగానే రాణా వాళ్ళని బస్సెక్కించి మళ్ళీ వచ్చాడు.
“అన్నం తిన్నావురా?” అడిగింది విజ్జెమ్మ మనవడిని. తిన్నానన్నట్టు తలూపాడు.
“ఇద్దరు పిల్లల తండ్రివయ్యావు. ఇంకా ఇలాగే వుంటే ఎలారా? తల్లికే సరైన పోషణ లేదు, ఇంక పిల్లలకేం తాపుతుంది? పాలు కొని పోసే స్తోమతుందా వాళ్ళకి? ఏదో ఒక వుద్యోగం వెతుక్కుని నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవద్దూ? ఆడపిల్లని జాలిపడి అంతా తలోయింతా వేసుకుని వైద్యమంటే చేయించారుగానీ, ఇంకేం పెడతారు? అది నెల బాలింతరాలు. అప్పుడే పనికి పోతానని చెప్తోంది. దాని ఆరోగ్యం ఏం కాను?” అంది విజ్జెమ్మ.
“సరైన వుద్యోగం దొరకట్లేదు అమ్మమ్మా!” అన్నాడు రాణా.
“కోరుకున్న వుద్యోగం దొరకడానికి అంతగొప్ప చదువు నువ్వేం చదివావురా, వచ్చిందేదో చెయ్యాలిగానీ” అంది లక్ష్మి.
“ఏదేనా వ్యాపారం మొదలుపెడదామనుకుంటున్నాను ఆమ్మా!” అన్నాడు.
సరిగ్గా అప్పుడే వచ్చాడు మాధవ్. ఆమాటలు విన్నాడు. అతను ఇక్కడికెందుకు వచ్చాడన్న ఆశ్చర్యాన్ని పక్కనబెట్టి-
“అరేయ్, ఏదో ఒక వ్యాపారమంటూ వుండదు. ఏ వ్యాపారం చెయ్యబోతున్నావో స్పష్టంగా అనుకుని, దాని ప్రొడక్షను, సప్లై చెయిన్, మార్కెట్ అన్నిటినీ స్టడీ చేసి ప్రాజెక్టు తయారు చేసుకోవాలి. ఏ ఎత్తుని మొదలుపెడుతున్నావో ఖర్చులేమి వుంటాయో, పెట్టుబడి ఎంత కావాలో ఎస్టిమేట్ వేసుకుని అప్పుడు ఎవరేనా వ్యాపారంలోకి దిగేది” అని మాట్లాడుతునే లోపలికి వెళ్ళిపోయాడు.
“వాడిని ఎంటర్టేన్ చెయ్యకు మాధవ్. మళ్ళీ వచ్చివెళ్ళటాలు మొదలెడతాడు” అంది గీత లోపల.
“అదేంటి, ఆవిడకి నచ్చకపోతే ఇంకెవరూ మాట్లాడకూడదా?” అంది నీలిమ అతను గదిలోకి రాగానే.
“ఆవిడకేకాదు, మాకూ ఎవరికీ యిష్టం వుండదు. అవన్నీ నీకు తెలీవు. మన పెళ్లవకముందు జరిగినవి” అన్నాడతను. భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. చిన్నప్పుడు రాణా, మాధవ్ చాలా క్లోజుగా వుండేవారు. రాణా దారితప్పుతున్నాడని గ్రహించగానే వాసు మాధవ్‍మీద పట్టు బిగించి, ఇద్దరికీ మధ్య ఎడాన్ని పెంచాడు. ఇద్దరికీ పోలికలుకూడా కలుస్తాయి. ఆ సారూప్యతే నీలిమకి రాణాపట్ల సానుకూలత దృక్పథాన్ని ఏర్పరిచింది.
“మాధవ్ చాలా మారిపోయాడు ఆమ్మా! నాతో ఇలా వుంటాడనుకోలేదు. పక్కన కూర్చుని రెండునిముషాలు మాట్లాడే తీరికకూడా లేనంత బిజీయా?” అన్నాడు రాణా చిన్నబుచ్చుకుని, తనూ వెళ్ళడానికి లేస్తూ.
“ఉద్యోగస్తులకి కూర్చుని కబుర్లు చెప్పేంత తీరిక ఎక్కడుంటుందిరా? ఐనా, నువ్వు చేసినదానికి ఆపాటి మాట్లాడాడు. సంతోషించు” అంది లక్ష్మి. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాడని నిర్ధారించుకున్నాక వచ్చి విజ్జెమ్మదగ్గిర కూర్చుంది గీత. ఆమె మనసులో తలెత్తిన ప్రశ్నలు ప్రకంపనాలు పుట్టిస్తున్నాయి.
“మామ్మా! నా చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డామని అంటుంటారుకదా, తినడానికికూడా లేకుండా ఎప్పుడేనా వున్నామా?” అడిగింది.
“లేదమ్మా! అలా ఎప్పుడూ జరగలేదు. నాది పెద్దసంసారమని మా అమ్మ ఒకటో రెండో బియ్యంసంచులు పంపించేది. మా తమ్ముళ్ళతో గొడవొచ్చినదాకా అది సాగింది. పెరట్లో బీర, ఆనప పాదులు వేసి ఇల్లెక్కించేదాన్ని. మామిడిచెట్తుండేది, ఎప్పుడూ ఒకటో రెండో కాయలు ఏ కాలంలోనూ దొరికేవి. తాతయ్య వున్నన్నాళ్ళూ వైద్యం చేయించుకున్నవాళ్ళు ఏవో ఒకటి పంపేవారు. రాజావారి తోటనించీకూడా వచ్చేవి. డబ్బులంటే వుండేవికాదుగానీ, తిండికి లోపం జరగలేదు. ఆరోజుల్లో ఎవరి దగ్గిరా డబ్బులాడేవి కాదులే గీతా! ప్రాణావసరం వస్తే నా నానుతాడు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుని తరవాతెప్పుడో విడిపించుకునేవాళ్ళం” అందావిడ.
“రాజావారికి అన్ని ఆస్తులుండి మనం సాధారణంగా ఎందుకుండాలి? అందరికీ ఒక్కలాగే ఎందుకుండదు?”
“ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఒకలా వుండరు. తరాలనాడు ఓ తల్లిపిల్లలే కొందరు ఆస్తులు నిలబెట్టుకుని ప్రయోజకులయ్యీ, ఇంకొందరు ఆస్తులు పోగొట్టుకుని అప్రయోజకులయ్యీ వుంటారు. ఎంత వున్నా మూడుతరాలు మించి నిలవదంటారు. మొదటితరంలో కష్టపడి సంపాదిస్తారు. రెండోతరంలో కూర్చుని తింటారు. తరవాతితరంలో వ్యసనాలు మొదలౌతాయి. మనవరకూ మనం పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యాన్నిబట్టి ఆ యిళ్ళని వెతికి పట్టుకుని వాటిల్లో పడేస్తాడు దేవుడు. మన చేతుల్లో ఏదీ వుండదు” అందావిడ.