ఝరి – 86 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

“వద్దనే అన్నాడు వాడు. కానీ ఇంతఖర్చులో వున్నాడు, ఇబ్బందిపడతాడని ఇచ్చాను. మిగిలితే బారసాల అవగానే ఇచ్చేస్తాడు. లేకపోతే కొంచెం టైము తీసుకుంటాడు” అన్నాడు మాధవ్. అనాల్సి వచ్చింది. నిజానికి వాసు తిరిగి ఇవ్వకపోయినా అతనికి పెద్దగా పట్టింపు వుండేదికాదు. అన్నదమ్ములు అంతంత లెక్కలు ఎప్పుడూ పెట్టుకోలేదు. వాసు అతనిచేత ఖర్చులు పెట్టించడు.
“పొలం కొనుక్కున్నారు. చేతిలో డబ్బు లేకుండానైతే అంతపెద్ద వ్యవహారానికి వెళ్లరు. ఇంకేం ఖర్చులుంటాయి? మిగిలిందంతా మీ అమ్మగారేకదా పెట్టుకునేది?” ఆరాగా అడిగింది.
“ఏమనుకుంటున్నావు? ఎవర్నిగురించి మాట్లాడుతున్నావు? ఇద్దరూ చాలా ఇండిపెండెంట్. మయూ పుట్టినప్పుడే వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకున్నారు. మామయ్యని పెట్టనివ్వలేదు”
“ఏమో!” అంది నీలిమ. ఆమెకైతే నమ్మకం కలగలేదు. సంఘటనలన్నీ నమ్మకం అపనమ్మకం అనే రెండిటిమధ్య వుండే బరికి అటూయిటూ చేరినప్పుడు అనుబంధాలలో లోతు తగ్గుతుంది. ఆమె ఆ లోతుతక్కువతనంలో కొట్టుకులాడుతోంది. వాసూ గీతలతో అతనికిగల అనుబంధాన్ని ఆ విభజనరేఖమీద నిలబెట్టానని అనుకుంటోందిగానీ, ఆ నిలబడ్డది తామిద్దరి బంధంకూడా అని గ్రహించలేకపోయింది.
మాధవ్ ఇచ్చాడని తీసుకున్నాడుగానీ, ఆ డబ్బు వాడే వుద్దేశ్యం ఎంతమాత్రం లేదు వాసుకి. చిన్నకొడుకు పుట్టుక అప్పుతో మొదలవ్వడం ఇష్టంలేదు. అది పొలం కొన్న సంతోషాన్ని చంపేస్తుందని నమ్మకం. గీతకికూడా యిష్టంలేదు. అందులోనూ వున్నదంతా ఖర్చుపెట్టేస్తున్నారు, డబ్బు చాలక అప్పుచేస్తున్నామన్న భావనతో బెంబేలెత్తిపోయింది. మాధవ్‍ని రమ్మంది. అతని వెనక నీలిమకూడా వచ్చింది.
“ఇలా డబ్బులు ఎవరిదగ్గిరా ఎప్పుడూ తీసుకోలేదురా! అప్పుకదా? తప్పు చేసినట్టుంది. నాన్నకి తెలిస్తే కోప్పడతారు. పొలం కొంటున్నామంటేనే అంత డబ్బెక్కడిదని నిలదీసారు. మేము ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటున్నామని అనుకున్నారు. బావ షేర్లలో పెడతాడని చెప్పాను.
షేర్ల బిజినెసంటే జూదంకదమ్మా? పోతే, పోయిందని ఆడతారు. వస్తే, ఇంకా సంపాదించాలని ఆడతారు. అదొక వ్యసనం. ఎలా అలవాటైంది? ఎప్పట్నుంచీ మొదలుపెట్టాడు? ఎప్పుడూ నాకెందుకు చెప్పలేదు- అని నిలదీసారు. తనిప్పుడు అల్లుడుకదూ? అందుకని తనవంతు చివాట్లుకూడా నాకే పడ్డాయి” అంది బేలగా. కళ్ళమ్మట నీళ్ళొక్కటే తరువాయి. ఏం మాట్లాడాలో మాధవ్‍కి వెంటనే తోచలేదు.
“ఇంత అమాయకంగా వుంటే ఎలా బతుకుతారే? నువ్వు భయపడి వాడినీ బెదరగొడుతున్నావు. పెద్దౌతున్నాంకదు గీతూ? ఇంకా స్కూలుపిల్లలా మాట్లాడితే ఎలా? నలుగుర్లోకీ వెళ్తున్నావు. లోకజ్ఞానం నేర్చుకోవాలి. మామయ్య విషయం వేరు. అప్పు తెచ్చినా తనకి తీర్చగలిగే పరిస్థితి వుండేది కాదు. అన్నదమ్ములమధ్య అవసరాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయి. ఆయనకి అదీ జరగలేదు. అలాగని మనమధ్యనికూడా వుండకూడదంటే ఎలా? రేపు నేను ఇల్లేనా స్థలమేనా కొంటే మిమ్మల్ని అడగనా? మిమ్మల్నేకాదు, మిగిలినవాళ్ళనీ అడుగుతాను. నేనూ యిస్తాను. లేకపోతే ఇన్నేళ్ళ మన స్నేహానికి విలువేంటి? బేంకులోన్లకీ, కోపరేటివ్ సొసైటీ లోన్లకీ వెళ్ళేకన్నా, ముందు ఇంట్లో యింట్లో సర్దుకుంటే మంచిదికదా? షేర్లనేవి ఇల్లీగల్ బిజినెస్ కాదు. అందులో డబ్బుపెట్టి లాభం తియ్యాలంటే చాలా తెలివి కావాలి. ఈ విషయంలో వాసుకి వున్న నాలెడ్జి నాకు లేదు. నేనూ పెడతాను. వాడికే డబ్బిస్తాను, ఇన్వెస్ట్ చెయ్యమని. అది తప్పైతే కమలాకర్‍గారు ఎందుకు చెప్తారు వాడికి? వాడెందుకు చేస్తాడు? రోజులు మారాయి. సంపాదనలు పెరిగాయి. ఎవరూ ఇద్దర్నీ ముగ్గుర్నీ మించి కనట్లేదు. మరీ హేండ్‍ టు మౌత్ జీవితాలుకాదు. బేంకుల్లోనూ, పోస్టాఫీసుల్లోనేకాదు, ఇంకా అనేకచోట్ల దాస్తున్నారు. మామయ్యకి నేనూ వాసూ చెప్తాంలే” అన్నాడు. ఆమె తలూపింది.
“ఆఫీసులో నీమీద వత్తిడి ఏమైనా వస్తోందా? కొన్ని బ్ర్రాంచిల్లో డబ్బివ్వనిదే పనులు జరగవు. ఈ సిస్టమ్‍ని నువ్వూ నేనూ మార్చలేం. అలాంటి సమస్య వస్తే అంతగా ప్రాధాన్యత లేని బ్రాంచికి అడిగి వేయించుకో. భయపడకూడదు, లొంగకూడదు. మన తెలివితేటలు ఆఫీసువర్కులోనే చూపించక్కర్లేదు. ఇంట్లోకూడా చూపించుకోవచ్చు. పిల్లల పెంపకంలో చూపించచ్చు…” అన్నాడు.
“నువ్వు లంచం తీసుకుంటావా?” కొద్దిగా సంకోచించి అడిగింది గీత.
“తీసుకోను” స్థిరమైన జవాబు వచ్చింది అతన్నుంచీ. “ఆ కారణాన్న నేనూ చాలా ఇబ్బందులు పడాల్సొస్తోంది. తప్పదు. బ్రిటిషువాళ్ళు తగలబెట్టిపోయారు దేశాన్ని. దొంగలు దోచినట్టు దోచారు. దొంగలైతే దోచుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు మన సంస్కారానికి నిప్పంటించి వెళ్ళారు. ప్రతివాడికీ వాడిది కాని డబ్బుమీద ఆశే. వాళ్ళు నేర్పించారు. వాళ్ళని చూసి నేర్చుకున్నారు. ఇచ్చే జీతాలు చాలవు. పైన ఐదు పదీకోసం ఆరాటపడిపోతూ వుంటారు. మనింట్లో డబ్బులకోసం కక్కుర్తిపడాల్సిన పరిస్థితిలేదు” అన్నాడు. పిల్లాడు ఆకలికి లేచాడు. మాధవ్ లేచి ఇవతలికి వచ్చాడు. నీలిమ రెండునిముషాలు అక్కడే వుండి, గీతకేమైనా కావాలేమో అడిగి, తనూ వెళ్ళింది.
“అదేమిటి, చదువుకుని వుద్యోగం చేస్తూ వాళ్ళ నాన్నకి అలా భయపడుతుంది? ఆయన సరదాగానే వుంటారుగా?” అక్కడినుంచీ వచ్చేసాక నీలిమ అడిగిన మొదటి ప్రశ్నలు.
“పెద్దౌతే అమ్మానాన్నలకి భయపడక్కర్లేదంటావా?” అడిగాడతను. “మరైతే నేను? నీకా?” నవ్వులాటగా మార్చేసాడు.


బారసాల మొదట వేసుకున్న లెక్కలప్రకారమే ఘనంగా జరిగింది. అటూయిటూ తేడాలో ఇంట్లో పెద్దతరం అంతా రిటైరయ్యారు. ఏదేనా వేడుక వస్తే తీరుబడిగా బయల్దేరుతున్నారు. తిరిగి వెళ్ళిపోవాలన్న హడావిడి లేదు. రాణా, యమున తప్ప అందరూ వచ్చారు. మహతిని చూస్తే సంతోషం వేసింది గీతకి. ఆమెకి చెరోవైపూ కూర్చుని తమమధ్య మాటలు కలవకుందా జాగ్రత్తపడుతూ చాలాసేపు మాట్లాడారు గీత, సుమతి.
ఎంతోకాలం తర్వాత గురుమూర్తి సంతోషంగా వున్నాడు. ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవడు అందరూ కాస్త అటూయిటూగా నాలుగు బైకులమీద వచ్చారు. ఆయన అలా సంతోషంగా వుంటే ఇల్లే వెలిగిపోతున్నట్టుంది. వాసు పొలంకొన్నాడన్నది అందరికీ ఒక సంచలనవార్త. అద్దెయిళ్ళలో గడిపి, చిన్నదేనా ఒక గూడు వుండాలని కలలు కని, నానాపాట్లూ పడి ఒకింటివాళ్ళమయ్యాం అనిపించుకున్న తరం అది. గురుమూర్తి ఇల్లు కట్టుకున్నా పిల్లలు పెద్దవాళ్లయాక అమ్మేసాడు. సుధీర్ మళ్ళీ కొని, లోన్ ఇస్‍స్టాల్‍మెంట్స్ కడుతున్నాడు. ఇల్లూ, స్థలం, ఇప్పుడీ పొలం… ఇంత చిన్నవయసులో అన్నీ అమరిన గీతనీ వాసునీ చూస్తుంటే అందరికీ ఇన్స్పిరేషన్‍లా అనిపిస్తోంది. ముగ్గురక్కచెల్లెళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. కుటుంబరావు వెళ్ళి పద్మా, రాజశేఖరాల పక్కని కూర్చుంటే ఆయన భార్యమాత్రం లక్ష్మి దగ్గర కాసేపు కూర్చుని, అరుణదగ్గిర స్థిరపడింది.
వాసు దగిర్నుంచి విహంగ్‍ని తీసుకుని సుమతి ముద్దుచేసింది. పురిటివళ్ళు తీసేసి బాగా బక్కగా అనిపిస్తున్నాడు వాడు.
“అరేయ్, మీ నాన్న ఇంతెత్తుని వుంటాడు. నువ్వేమో బల్లిలాగా నల్లిలాగా కంటికి ఆనకుండా వున్నావు. వాడు ఎత్తుకుంటే నువ్వస్సలు కనిపించట్లేదు తెలుసా?” అంటోంది మురిపెంగా. విజ్జెమ్మ వింది ఆ మాటలని.
“నల్లీ, బల్లీ అంటావేంటే వాడిని? ఇలాంటి వూసులతోనే పెంచుతున్నావా నీ కొడుగ్గాణ్ణి? బంగారుకొండా, బాచాలతండ్రీ, వజ్రాలమూటా కాసులపేరూ అని ముద్దుచేస్తారు పిల్లల్ని. రాముడంటారు, బాలకృష్ణుడంటారు…” అంది.
“ఊ< నల్లీ బల్లీ అంటే కనీసం మాకు అంటుకునేనా వుంటాడు. బంగారుకొండా… వజ్రాలమూటా అను నువ్వు, కౌబాయ్‍లా గుర్రం ఎక్కి వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు” అంది గీత. ఆ సంభాషణ మానసకి సరదాగా అనిపించింది. “మీ వదిన ఇలానే మాట్లాడుతుందా ఎప్పుడూ?” అడిగింది పక్కనే వున్న వసంత్‍ని. అతనూ నవ్వాడు.
“వాడినిలా ఇవ్వవే” అడిగాడు గురుమూర్తి. సుమతి అందించింది.
“నాలుగెకరాల భూస్వామి నాన్నా!” అంది మురిపెంగా. ఆయనకి పిల్లలంటే చాలా యిష్టం. మొదట్లో కొంచెం బెట్టు చూపించినా, వరసపెట్టి ఈ సైన్యాన్నంతటినీ ఎత్తుకు తిప్పినవాళ్ళలో ఆయనా వున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పరుగులు తీస్తూ కాళ్లకి అడ్డాలు పడుతున్నవాళ్ళూ, వళ్ళో వుండకుండా జారిపోతున్నవాళ్ళూ, పొత్తిళ్లలోనూ, అమ్మల బొజ్జల్లోనూ వున్నవాళ్ళూ కొత్తటీమ్‍గా తయారౌతూ వుంటే తమాషాగా వుంది. యూయస్ వెళ్ళే ఆలోచన వుందిగాబట్టి అక్కడికెళ్ళాక కనచ్చనే ఆలోచనలో వున్నారు సుధీర్, రమ. లత విషయం ఇంకా తెలిదు.
“ఏమే గీతా! వీడెక్కడా కామందులా లేడుగానీ సైకిలుషాపుకి పంపించి పంపుకొట్టించమ్మా!” అన్నాడు పెళ్ళున నవ్వుతూ.
“వాడినిటివ్వు మామయ్యా! ఇందాకట్నుంచీ ఒక్కలా వాడి తాళం పట్టిస్తున్నారు” చురచుర చూస్తూ ఆయనదగ్గిరకి వెళ్ళింది ఆమె.
“బర్త్ వెయిటూ అదీ బానే వున్నాడట. హెల్త్ ఇష్యూస్ కూడా ఏవీ లేవు. మళ్ళీ వళ్ళుచేస్తాడు మామయ్యగారూ!” అంది రమ గీత కోపం చూసి నవ్వుతూ. సుధీర్ తలూపాడు.
“పొలం ఎక్కడ కొన్నారే?” చెయ్యిపట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుంటూ అడిగింది ప్రమీల. గీత చెప్పింది.
“డబ్బెక్కడిదే?” అడిగాడు గురుమూర్తి ఆరాగా.
“సేవింగ్సన్నీ తీసేసాం మామయ్యా! అత్తా! జీపీఎఫ్‍లోంచీ లోను తీసుకోడానికి ఆరోగ్యకారణాలని అబద్ధం రాయాల్సి వచ్చింది. నాకేదోగా వుంది” అంది చిన్నబుచ్చుకుని. ప్రమీల నవ్వింది.
“ఎప్పుడో మాంధాతలనాడు రాసిపెట్టుకున్న రూల్స్. ప్రతీదీ ముక్కుసూటిగా వెళ్ళాలనుకుంటే కుదరదే. లౌక్యంగా పని నడిపించుకోవాలి. మంచిపనే చేస్తున్నారు. పిల్లలు పెద్దౌతే మళ్ళీ ఏవి కొనాలన్నా కుదరదు. బోల్డంత ఖర్చుంటుంది” వోదార్పుగా అంది. తలూపి, ఇంకెవరో పిలిస్తే వెళ్ళింది గీత.
“ఆవగింజ మోకాల్న విరుస్తుందట. ప్రహ్లాద్‍గాడి భార్య అందామధ్యనోసారి” అన్నాడు గురుమూర్తి.
“మీరు ఆడాళ్ల కబుర్లుకూడా వింటున్నారేంటి రిటైరయ్యాక?” అడిగింది ప్రమీల.
“మేం వినాలనే, వినేలా మాట్లాడుకుంటారుకదా?” అన్నాడాయన.
“రాములాగే పొదుపరి. అవసరంలేనిదే గిజామన్నా ఒక్కపైసకూడా ఖర్చుపెట్టదు. అంతే. బారసాల బానే చేస్తున్నారుగా?” అంది ప్రమీల. అని, “వీళ్ళింట్లోకూడా గొడవలు మొదలౌతున్నాయి. మాధవ్‍కి ఇల్లొదిలేసి, మీరెళ్ళి గీత స్థలంలో కట్టుకోండని అన్నాడట పద్మ భర్త. లక్ష్మి పద్మని దులిపేసిందట”
“అదేమిటే? ఉన్నది ఇద్దరు కొడుకులు. అందులో ఒకడు… అందునా పెద్దకొడుకు వేరే వెళ్ళడమేమిటి? ఎక్కడా వినం”
“చాలా మతలబులు వున్నాయి. ఇది పచ్చగా విరగబుసిన చెట్టులా వుంది. అంతా స్వంతవాళ్ళమేకాబట్టి బడబడ మాట్లాడుతుంది. మనకీ అదంటే ఇష్టం. నీలిమ దీన్ని ఓర్చడం లేదు. వాళ్ళు ముగ్గురక్కచెల్లెళ్లదీ వేరే తీరు. అదికాక అసలు కారణం ఇంకోటి వుంది. పద్మభర్తకి రియల్ ఎస్టేట్లోకి దిగాలని వుంది. ఫ్రెండ్సున్నారు. నాలుగైదువందలగజాల పాతయిల్లు కళ్ళముందు కనిపిస్తుంటే చేతులు దురదలెత్తిపోతున్నాయి. అదలాగే వుంటే ఏ వ్యాపారం జరగదు. ఎవరికీ లాభాలుండవు. నెమ్మదిగా వాసుని దూరం జరిపి, మాధవ్‍ని మచ్చికచేసుకుంటే ఇంటిని డెవలప్‍మెంటుదాకా తీసుకెళ్ళచ్చని ఆలోచనేదో వున్నట్టుంది. వాడు భోళాశంకరుడు. మెతకమనిషి. ఇందులో వాడికి జరిగే నష్టం ఏమీ వుండదుగానీ, కొంత వ్యాపారం జరుగుతుంది. బైటివాళ్ళో నలుగురు లాభపడతారు” లోగొంతుకతో అంది.
“వాసు ఏమంటున్నాడు?”
“వెళ్ళనని కచ్చితంగా చెప్పేసాడట”
“బాగా చెప్పాడు. తప్పుకదే, వాళ్ళలా అనడం? ఐనా దిట్టంగా వున్న ఇల్లు పడగొట్టుకుని అపార్టుమెంటు కట్టుకోవడమేమిటి? కుదిర్తే ఇది ఇలాగే వుంచుకుని వేరే కొనుక్కోవాలి. అదిసరే, అంత వీళ్ళ బాగుకోరేవాడైతే ఆ చెప్పేదేదో వాసుకే జెప్పచ్చుకదా అతను, ఇల్లొదిలేసి వెళ్లమనే బదులు?” అన్నాడాయన.
“వీడికి సలహాలిచ్చేవాళ్ళు వేరే వున్నారు. రాము, త్రిమూర్తులు, గీత పాత ఆఫీసరు”