ఝరి – 89 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

ఝరి – 89 by S Sridevi
లక్ష్మి కుటుంబం సినిమాహాలుకి వెళ్ళేసరికి దాదాపుగా అందరూ వచ్చేసి వున్నారు. హాలు ఆవరణంతా స్టూడెంట్స్‌తో నిండి వుంది. వీళ్ళు రెండు బాక్సులూ బుక్‍చేసుకోగానే రాజావారి కాలేజి విద్యార్థులకీ పూర్వవిద్యార్థులకీ అని బోర్డు పెట్టేసి లోకల్‍గా వున్న స్నేహితులకి ఫోన్లుకూడా చేసి మిగిలిన టికెట్లు అమ్మేసుకున్నాడు హాలు ఓనరు. ఎంతో డబ్బా టాకీసులో, వారంక్రితం రిలీజైన సినిమాకూడా హౌస్‍ఫుల్లైపోయింది. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుండటం అవంతీపురంలో అలవాటే. ముందుగా అనుకున్నట్టే చెరోబాక్సులోకీ వెళ్ళడానికి ఆడా మగా విడిపోయారు.
“గీత లేకుండా ఇంతమందిమి ఇలా బైటకి రావడం ఇదే మొదటిసారికదూ!” అంది మహతి నాలుగడుగులు వేసాక.
“అదొస్తే ఇంత సైలెంటుగా వుండేదికాదు. అందర్నీ హోరెత్తించేది” అంది రవళి.
“మమ్మల్ని వదిలేసి మీరంతా చక్కా వెళ్ళిపోయేవారు. అప్పుడెప్పుడూ మీకు అనిపించలేదేం?” దెప్పింది ప్రవల్లిక.
వెళ్ళి సీట్లలో సర్దుకుని కూర్చున్నారు. ముగ్గురక్కచెల్లెళ్ళూ పక్కపక్కని కూర్చున్నారు. ఎవరి కంఫర్ట్ జోన్, స్నేహబృందం వాళ్ళదన్న ఆలోచనతో ఎప్పుడూ వాళ్లకి అలాగే సీట్లు వదిలేస్తారు అందరూ. కళ్లసౌంజ్ఞలతోటే వాళ్ళమధ్య మాటలు నడిచిపోతున్నాయి. గీత లేకపోవడం నీలిమకీ మాధురికీ థ్రిల్‍గా అనిపించింది. ఆ విషయం ఇంకా ఇద్దరికీ అర్థం కాలేదుగానీ వాళ్ల ప్రపంచంకూడా ఆమెచుట్టే తిరుగుతోంది. మానస అంతగా పట్టించుకోలేదు. ఇందరితో కలిసి రావడం, ఎటు తలతిప్పినా అంతా తెలిసినవాళ్ళే వుండటం గమ్మత్తనిపిస్తోంది ఆమెకి. ముఖ్యంగా పెళ్ళికి ముందు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా భయంగా వుండేది. మగపిల్లలు ఏడిపించేవారు. ఏదో ఒకటి అనేవారు. తండ్రికి చెప్పుకోవడానికి వుండేది కాదు. చెప్పినా,
“వాళ్ళు నిన్నే అన్నారని నీకెలా తెలుసు? నువ్వు అటుకేసి చూడకపోతే వాళ్ళు నిన్ను చూస్తున్నారని నీకెలా తెలుస్తుంది? కాలేజి లేనప్పుడు బుద్ధిగా ఇంట్లో కూర్చోక సినిమాలకీ షాపులకీ ఎందుకు? ఆ శింగార్ కుంకం పెట్టుకోకపోతే కాలేజికి రానివ్వరా? రబ్బర్‍బేండ్లు లేకపోతే జడేసుకోవడం రాదా? లాగితే తెగిపోయే రబ్బర్‍బేండ్లమీద డబ్బెందుకు తగలేస్తారు? రిబ్బన్లు పెట్టుకోవచ్చుకదా?” అని నానా ప్రశ్నలూ వేసేవాడు. నిజానికి చుట్టూ వున్నవాళ్లతో గొడవపెట్టుకోవాలని ఏ మగవాళ్లకీ వుండదు. అంత ధైర్యం వీళ్ళకి లేక భార్యల్నీ, చెల్లెళ్ళనీ, కూతుళ్లనీ అదుపుచెయ్యాలని చూస్తారు. ఆడవారిని అణిచిపెట్టేది ఇంట్లోని మగవాళ్లనుకుంటారుగానీ కాదు, బైటిమగవారివలన వుండే భయం వారిచేత అలా చేయిస్తుంది. బయటివారికి సంస్కారం వుండి, తన ఇంటి స్త్రీని గౌరవిస్తే ఈ అణచివేత చాలావరకూ తగ్గుతుంది. ఒకరో ఇద్దరో మిగిలిపోతే వారిని సంస్కరించడం తేలిక. స్త్రీవాదులుకూడా ఈ మూలకారణం వదిలేసి, ఇంట్లోవాళ్ళని తప్పుబడతారు.
పెళ్ళికిముందులాకాక ఎక్కడికేనా ధైర్యంగా వెళ్లగలుగుతోంది మానస. నువ్వేం తప్పు చేసావన్న యక్షప్రశ్నలు ఆగాయి. ఏదేనా వుంటే వసంత్‍కి చెప్తుంది. అతను తనుగా పరిష్కరిస్తాడు, లేదంటే ఎలా ఎదుర్కోవాలో చెప్తాడు.
మగవాళ్లవైపు బాక్స్ వచ్చేవాళ్ళూ వెళ్ళేవాళ్లతో హడావిడిగా వుంది. ఎవరెవరో వచ్చి వీళ్లని పలకరిస్తున్నారు. వీళ్ళు బైటికెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. వసంత్‍ని ఫ్రెండ్సొచ్చి తీసుకెళ్ళారు. సుమంత్ నాలుగుసార్లు బైటికి వెళ్ళి వచ్చాడు. ఎవరూ అక్కడ డాక్టర్లలా, ఇంజనీర్లలా, వుద్యోగస్తుల్లా వుండట్లేదు. ఓ పదేళ్ళో ఐదేళ్ళో కాలంలో వెనక్కి ప్రయాణం చేసినట్టున్నారు.
“తమాషా చూడండి” అంది కుసుమ వున్నట్టుండి. ఏమిటోననుకున్నారు అందరూ. వాసు లేచి నిలబడ్డాడు. “అదుగో, హీరోగారు లేచారు. ఇంటికెళ్ళి గీతని పట్టుకొస్తారు” అంది నవ్వుతూ. ఆమెకూడా మాధవ్‍లా గలగల నవ్వుతూ మాట్లాడే మనిషి.
“నిజంగానే?” అంది పద్మ ఆశ్చర్యంగా.
“గీత రాకపోతే ఎవరికీ తోచదు. వీళ్ళందరి బుర్రల ఫ్యూజులూ దానిదగ్గిర వుంటాయి” అంది కుసుమ.
“నిజమేనండీ” అంది పక్కనున్న లత చిన్నగా. సుమతి తన పక్కని లేకపోవడంతో. ఆమె పెదాలమీద చిరునవ్వు. ” సుమంత్‍కన్నా నేను కాస్త పెద్దకదా, అందుకు వాళ్ళవాళ్ళు వప్పుకుంటారో లేదోననే భయం వుండేది. అదీకాక వాళ్ళన్నయ్యగారికి ఇంకా పెళ్ళవలేదు. పెళ్ళే చేసుకోనన్నారట. ఎటూ తోచని పరిస్థితి. మా పెళ్ళికి రికమెండేషన్ చేస్తుందని సుమంత్ నన్ను వెంటేసుకుని గీత చుట్టూ తిరిగేవాడు. ఈ అమ్మాయేం చేస్తుంది, అనుకునేదాన్ని నేను. వెళ్ళి బావగారితో మాట్లాడేసి పెళ్ళికి వప్పించిందట. ముందసలు మాకు లైన్ క్లియరైంది”
“మా సుమంత్‍లో ఏం నచ్చింది నీకు?” కుసుమ ప్రశ్నలో కనీకనిపించని అల్లరి. లత సిగ్గుపడింది.
“బావుంటారు, సరదాగా మాట్లాడతారు…”
“నువ్వు మీరంటున్నావేంటి? వాడుకదా, అనాల్సింది?” కుసుమ మనసులోని అల్లరి పెదాలమీదికి వచ్చి చేరినట్తు చిరునవ్వు.
“పీటలమీంచీ లేచాక ఎవరు ఎవరి కాళ్ళకి దణ్ణం పెట్టాలో తెలీక ఇప్పటికే ఇద్దరూ తికమకపడుతున్నారు. మళ్ళీ ఇదోటా?” అంది రమ.
“అక్కా! నువ్వుకూడానా?” అలిగింది లత. రమ నవ్వింది. ఈ ఇద్దరూ సమవుజ్జీలు. గీత, నీలిమల్లా కాదు.
కుసుమ అన్నట్టుగానే వాసు హాల్లోంచీ ఇవతలికి వెళ్ళాడు. ఇంటికెళ్ళి, గీతని కాసేపు తనతో తీసికెళ్తానంటే విజ్జెమ్మ సరేనంది. పిల్లలు అడిగింది ఆవిడ ఎప్పుడూ కాదనలేదు. ఎలాగో ఒకలా సర్దుబాటు చేసేది. ఇప్పుడూ అంతే. గీతని వదిలేసి వెళ్తున్నామని మాధవ్ అననే అన్నాడు. అందరూ వెళ్ళి తనొక్కర్తీ వుండిపోయిందని గీతకీ అనిపించిందేమో! చిన్నబుచ్చుకుందేమో! ఒకమాటు వెళ్ళొచ్చేస్తే పోయేదేమీ లేదనిపించింది.
“పోన్లే , వెళ్తే వెళ్ళుగానీ, తలనొప్పొస్తుందేమో, బొమ్మ చూడకు. ఇంటర్వెల్‍దాకా కూడా వద్దు. కాసేపు కూర్చుని వచ్చెయ్. హాలు రవి ఫ్రెండుదేగా? గేటు తియ్యమంటే తీస్తారు. వీణ్ణి మేం చూసుకుంటాం. మరేం పర్వాలేదు. నడికట్టు ఇప్పేస్తే నడవగలవా? కళ్ళు తిరుగుతాయేమోరా! జాగ్రత్త. బండిమీదొద్దు. వాసూ! ఆటోలో తీసుకెళ్ళు” ఇన్ని జాగ్రత్తలు చెప్పి పంపింది విజ్జెమ్మ.
“ఈ అమ్మాయీ మీకు బంధువులమ్మాయేనా?” పక్కనున్న లక్ష్మిని అడిగింది నీలిమ తల్లి. కుసుమ ఆవిడకి రవి భార్యగా మాత్రమే గుర్తు.
“మా పెద్దమేనమామ కూతురు. చిన్నతమ్ముడికి చేసుకున్నాం” చెప్పింది లక్ష్మి.
“మీ మేనమామలెవరూ బారసాలకి వచ్చినట్టు లేరు?”
“రాలేదు” పొడిగా జవాబిచ్చింది లక్ష్మి. రెండోవైపుకి తలతిప్పితే పక్కనున్న ప్రమీల ఇంకేదో అడిగింది. ఎవరో ఒకరు మాట్లాడుతునే వున్నారు. ఐదునిముషాలైంది. హాలు తలుపులు వేసేసారు. స్లైడ్లు పడుతున్నాయి. అందరూ తెరమీద దృష్టిపెట్టారు. మాటలు ఆగాయి. ఒకవిధమైన నిశ్శబ్దం పరుచుకుంది. కొద్దిసేపే. ఇటువైపు హాలు తలుపు తెరుచుకుంది. గీత, వాసు వస్తున్నారు.
“హీరోయినొచ్చింది. వెయ్యండే ఈలలూ…” అంది కుసుమ పెద్దగా. అట్నుంచీ సుమంత్ నవ్వు గట్టిగా వినిపించింది.
వెంటనే కంయిమని పల్లవి ఈల వూదింది. ఆ తర్వాత వరసపెట్టి ఇట్నించీ ఈలలు, అట్నించీ నవ్వుల్తో హాలు దద్దిరిల్లిపోయింది. కిందని బాల్కనీలోంచీకూడా ఈలలు మొదలవ్వడంతో భయపడిపోయింది నీలిమ. వీళ్ళు ఎందుకేస్తున్నారో తెలీక కొందరూ, వీళ్ళు వేస్తున్నారని మరికొందరూ వెయ్యసాగారు. నెమ్మదిగా సద్దుమణిగింది.
“భయపడకు. రాము బావతో మొదలెట్టి, వీణదాకా అందరూ రాజావారి స్కూల్లోనూ కాలేజిలోనూ చదువుకున్నవాళ్ళే. సినిమాహాలు ఓనరు రవి క్లాస్‍మేటు. అన్ని టికెట్లు మనం కొనగానే మిగిలినవి ఫ్రెండ్సందరికీ ఫోన్లు చేసి మరీ అమ్మేసాట్ట. ఈ హాల్లో ఇలాంటివి మామూలే. పెళ్ళిళ్ళసీజన్లోనైతే ఇంకా జరుగుతాయి. అదో సరదా. అంతా చిన్నప్పట్నుంచీ ఒకళ్ళకొకళ్ళు తెలిసినవాళ్ళు. ఇక్కడే పుట్టి పెరిగినవాళ్ళు” నీలిమకి ధైర్యం చెప్పింది పక్కనే వున్న కుసుమ. మాధురికిమాత్రం వళ్ళు భగ్గుమనిపోయింది. తాము ముగ్గురూ చాలా అందంగా వుంటారని పేరు. అది చూసేకదా, వీళ్ళు కట్నాలు లేకుండా చేసుకున్నది? చేసుకున్నంతదాకానే ఆ మురిపెం. తర్వాత తమకి ఒక్క ప్రశంసా లేదు. మట్టగిడసలా వుండే ఈ గీత హీరోయినా? ఈమెకోసమా, యీలలూ హడావిడీను? ముందే అనుకున్నారా, ఈమెనిలా తీసుకొచ్చి హడావిడి చెయ్యాలని? ఒక్కళ్ళుకూడా బైటపడలేదు. ప్రహ్లాద్, మాధవ్, వసంత్‍కూడా వున్నారా, ఈ కుట్రలో? ఆమె రాదనుకుని సంతోషపడ్డారు తాము ముగ్గురూ. ఇదేంటి, ఇక్కడికికూడా తయారైపోయింది? పెద్దవాళ్ళుకూడా ఎవరూ ఏమీ అనరా, అప్పుడే సినిమాకి బయల్దేరినందుకు? చిరచిరలాడిపోయింది ఆమెకి. పక్కకి తిరిగి చూసింది. నీలిమ పరిస్థితికూడా అలానే వుంది.
గీత వచ్చి చివరి సీట్లో కూర్చుంది. పలకరింపులు, నవ్వులు, పరిహాసాలు, మాటలు…కలగాపులగంగా. సినిమా ఎవరూ చూడట్లేదు. దాని దారిన అది నడుస్తోంది. పదినుముషాలుకూడా వుండలేకపోయింది గీత. ఆ కాసేపటికే ఆమెకి దిగులుగా అనిపించింది. అంత చిన్న పిల్లాడిని వదిలేసి రావడం తప్పేమో! వాడికి ఆకలేస్తోందేమో! ఏడుస్తున్నాడేమో! బెదిరిపోయింది. ముందురోజటి పద్మ మాటలు, వాటిని ఇంకా వాసుకి చెప్పని వైనంకూడా తోడై మనసుని కలబారుస్తున్నాయి.
“నేనింక వెళ్ళిపోతాను. వాసు వచ్చి పంపమంటే మామ్మ సరేనంది. అందర్నీ పలకరించి వెంటనే వచ్చెయ్యమంది”అని చప్పుని లేచి నిలబడింది. అక్కడ వాసుకూడా ఇవతలికి వచ్చి నిలబడ్డాడు.
“వాణ్ణొదిలిపెట్టి వచ్చినందుకు భయపడిపోయింది. భయం దేనికి? అమ్మమ్మ వుందిగా?” అంది మహతి. ఆమెకి వింతగా అనిపించింది. గీత కొత్తకోణంలోంచీ కనిపించింది.
“రేప్పొద్దున్న నువ్వూ అంతేలేవే!” అంది అరుణ. మహతికి ఇబ్బందిగా అనిపించింది.
“నువ్వు రాకుండా వెళ్ళడం మాకెవరికీ నచ్చలేదు. మహీ మొదలెట్టింది. అందరూ అందుకున్నారు. అందుకే వచ్చాను” అన్నాడు వాసు దార్లో.
“ఏమో బావా! వాడేడుస్తున్నాడనిపించింది. ఉండలేకపోయాను” అంది. అంటుంటేనే కళ్ళలోంచి నీళ్ళు జారిపడ్డాయి. మహతిలాగే వాసుకికూడా వింతగానే అనిపించింది. మయూఖ్ పుట్టినప్పటికన్నా గీతలో కనిపిస్తున్న పరిణతి అతన్ని చకితుణ్ణి చేసాయి. చిన్ననాటి తన నేస్తం పెరిగి పెద్దైపోతోందన్న వూహ తమాషాగా అనిపించింది. ఎంత పెద్దైపోతుంది? తనకన్నానా? తనలో తనకి ఏ మార్పూ తెలీడంలేదు. కానీ గీతమాత్రం పెళ్ళిచేసుకుని, ఇద్దరు పిల్లలనిచ్చి, తన జీవితమంతా విస్తరిస్తోంది. ఆ ఆలోచనతోటే ఆమెపట్ల ప్రేమ, మమకారం, అలాంటి ఇంకెన్నో భావాలు చెలరేగాయి అతన్లో.
“అంత వెంటనే ఏడవడు. వాడికి యింకా ఏం తెలీదు. ఐనా వెళ్ళిపోతున్నాంకదా?” అన్నాడు ఓదార్పుగా. మరో ఐదునిముషాలకల్లా ఇల్లు చేరుకున్నారు. గీత గబగబ లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళేదాకా ఆగి, అతను వెళ్ళిపోయాడు.
“ఏడ్చాడా?” ఆరాటంగా అడిగింది.
“ఎందుకేడుస్తాడే? బొజ్జనిండా పాలు తాగి నిద్రలు పోతున్నాడు. రాత్రికికదా, నిన్ను నిద్రపోనివ్వకుండా వాడి అల్లరి? ఇంకాసేపు వుండకపోయావా?” అడిగింది విజ్జెమ్మ.
“ఏమో! మామ్మా! వుండాలనిపించలేదు” అంది గీత. ఆవిడ భుజంమీద తలపెట్టుకుని ఏడ్చేసింది. ఆవిడ కంగారుపడింది.
“ఏమైంది గీతా? ఏం జరిగింది? ఎవరేనా ఏమైనా అన్నారా? అలా అనేవాళ్లెవరు మనింట్లో? ముందా ఏడుపు ఆపి చెప్పు. ఏడిస్తే తలనెప్పెడుతుంది” అంది. వాసు మేనత్తకూడా వచ్చి దగ్గర కూర్చుంది.
“ఏమైందే? చెప్పకుండా ఏడిస్తే మాకు కంగారుపుడుతోంది. నిన్న బారసాల బాగానే చేసుకున్నారుకదా? పొద్దునదాకా బానే వుంటివి?” అడిగింది.
“నన్ను అంతా వేరేగా చూస్తున్నారు. పద్మత్త మమ్మల్ని యింట్లోంచీ వెళ్ళిపొమ్మంటోంది. అదేంటంటే మేము ఆస్తులమీద ఆస్తులు పోగేస్తున్నామట. మాధవ్‍కి ఏమీ లేదట. ఇక్కడ్నుంచీ మేము వెళ్ళి నాన్న యిచ్చినచోట్లో యిల్లుకట్టుకుని వుండాలట” అంది. విజ్జెమ్మకి నోట మాట రాలేదు చాలాసేపు. ఇక్కడి పరిస్థితి చూస్తోంది. నీలిమ ఏవో పుల్లలు పెడుతోందనుకుందిగానీ, ఆ పెడుతున్నది పద్మ అనుకోలేదు ఆవిడ. వాసు మేనత్త పరిస్థితీ అలానే వుంది. కానీ విజ్జెమ్మ ఎదురుగా ఆవిడ కూతుర్ని ఏమనగలదు? ముందుగా తేరుకున్నది విజ్జెమ్మే.
“మీరెందుకు వెళ్తారు గీతా? దాని మతిలేని మాటలు పట్టుకుని నువ్వేడుస్తున్నావా? లక్ష్మి ఏమీ అనలేదూ?” అడిగింది.
“అత్త బాగానే కోప్పడింది”