ఝరి – 82 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

“మీ నాన్న పెద్ద చదువులు చదువుకోవాలనుకున్నారు. కుదర్లేదు. ఎమ్మెస్సీలో సీటొస్తే డబ్బులు కట్టలేక చదివించనన్నారట మీ తాతయ్య. మీరు తెలివైనవాళ్ళు. సీట్లు తెచ్చుకున్నారు. మా శక్తికి మించినదే ఐనా చదివించాం. మీరూ బానే చదివారు. పైకొస్తారు, సంతోషం. గవర్నమెంటు ఫీజులు తక్కువే వుండచ్చుగానీ కోచింగు దగ్గిర్నుంచీ మొదలుపెట్టి ఎంత ఖర్చుపెట్టి వుంటామో, మేమిప్పుడు లెక్కలు చెప్పబోవటం లేదు. మిమ్మల్ని పైకి తీసుకురావడానికి మేము చాలా జీవితాన్ని నష్టపోయాం. నాది చిన్న ప్రైవేటు వుద్యోగం. వేణ్ణీళ్ళకి చన్నీళ్ళలాంటిది. పెన్షనుండదు. మీ నాన్న ఒక్కరి పెన్షనుమీదా మేమిద్దరం బతకాలి. పెళ్లయ్యాక మీ జీతాలమీద పెత్తనం ఆ వచ్చే ఆడపిల్లలు చేస్తారు. వాళ్ళ దయాధర్మంమీద మేం ఆధారపడి వుండటం బావోదు. కనుక, మీ యిద్దరూ ఈ అప్పులవీ తీర్చుకుని, మమ్మల్ని వడ్డున పడేసి పెళ్ళిళ్ళు చేసుకోండి. అదీకాక, కట్నాలూ కానుకలూ వద్దనుకుంటే దండలపెళ్ళి చేసుకుని బంధువులకి సమాధానం చెప్పుకుని, బోసి వొళ్ళతో తిరుగుతూ, పప్పుకీ వుప్పుకీ తడుముకుంటూ మాలాగే మీరూ బతకండి ” అంది.
ఈ సమాజం మిగతావాటికన్నా భిన్నమైనది. తల్లిదండ్రులు పిల్లలకోసం త్యాగం చేస్తారు. అలా త్యాగం చెయ్యగలిగితేనే పిల్లలు ఎదుగుతారు. బదులుగా వాళ్ళనుంచీ భవిష్యత్తులో పోషణా, వృద్ధాప్యంలో ఆదరణా కోరుకుంటారు. అది పిల్లల కనీసబాధ్యత. నన్నెందుకు కన్నావు, ఈపాటి చెయ్యలేకపోతే అనే ప్రశ్నకి అవకాశం వుండదు- తమ కడుపున పుట్టమని వీళ్ళేం బతిమాలి వుండరుకాబట్టి. కట్నం వద్దంటే చేసుకోవడానికి సంతోషంగా ముందుకొచ్చే ఆడపిల్ల కోరికలు అదుపులో వుంచుకొమ్మంటే వింటుందా? మారాల్సింది వ్యవస్థ. మనుషులు కాదు.
కట్నం తీసుకోవాలా వద్దా అన్న చర్చ ఇంట్లో నడుస్తుండగానే సుమతితో పెళ్ళిప్రసక్తి వచ్చింది. బేరాలేమీ జరగలేదు. వాళ్ళు ఇస్తామన్నదానికి తాము వప్పుకున్నారు. అందులో సగం సుమతికి బంగారానికీ, ఇంకొంత పట్టుచీరలకీ ఇచ్చి, పెళ్ళిఖర్చులుకూడా వాళ్ళిచ్చినదాంట్లోనే సరిపెట్టి, పెళ్ళితతంగంలోంచీ బైటపడ్డారు.
పెళ్ళి వేడుగ్గానే జరిగింది. సుమతి తన జీవితంలోకి వచ్చింది. పెద్దగా కోరికలేవీ లేని సంతుష్టజీవి. బావా బావా అంటూ ప్రేమగా వెంట తిరిగే ఏడుగురు బావమరుదుల బలగం. అందరూ సుమతికి ప్రాణం పెడతారు. కట్నం తీసుకున్నాడని ఎవరూ తనని తక్కువగా చూడలేదు. కానీ మేనమామకోసం కట్నం తీసుకోవద్దనుకున్న ఈ ఏడుగురినీ చూస్తుంటే తన భుజాలు తనకే తడిమి చూసుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి.
“నో రిగ్రెట్స్ జో! ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అది అమ్మావాళ్ళకి తెలుసు. నాకు ఏదైతే ఇచ్చారో అది సంతోషంగానే ఇచ్చారు. చిన్నప్పట్నుంచీ నాకేం కావాలో చూసుకుని, నేనేం చెయ్యాలో, ఎలా వుండాలో చెప్తూ పెంచారు నాన్న. ఆయన అలా చెప్పడాన్ని లీడర్‍షిప్ క్వాలిటీస్ అనుకుంటాను నేను. పెన్సిలుని చెక్కి చెక్కి ముల్లు కోసుగా చేసినట్టు పెద్దవాళ్ళు మనని పదునుతీస్తారు. లేకపోతే మనం పనికిరాని పనిముట్లమే. అందుకు బదులుగా వాళ్ళ గౌరవం దెబ్బతినకుండా చూసుకోవడం మన కనీసబాధ్యత” అంది సుమతి. ఆమె మొదటే నచ్చింది అతనికి. ఇప్పుడు మరీమరీ నచ్చింది. స్వంత చెల్లెళ్ళులేని అతను గీతతో పెరిగే అనుబంధాన్ని తగ్గించుకుని దూరం జరిగాడు.
ఆ సంవత్సరం మహతితో కలిపి ముగ్గురి పెళ్ళిళ్ళు జరిగాయి. ఇటు రవళికీ, అటు ప్రవల్లికకీ సంబంధాలు చూస్తున్నారు. లక్ష్మి యింట్లో గీత అధ్వర్యంలో మొదలైన పెళ్ళిపెట్టి ఇంకా వేడుకలకోసం తెరుచుకునే వుంది.


గీతకి తొమ్మిదోనెల నడుస్తోంది. మెటర్నిటీలీవు పెట్టింది. లీవులో రిలీవౌతుంటే కొత్తగా వచ్చిన ఒక క్లర్కు అన్నాడు-
“లేడీస్‍కేంటీ మేడం! చక్కగా మూడేసినెలల మెటర్నిటీ లీవు. ఇప్పుడది నాలుగునెలలు చేస్తారట. ఇంట్లో కూర్చుని జీతం తీసుకోవచ్చు” అని.
“మాకుగాబట్టి మూడునెలలూ నాలుగు నెలలతో సరిపెడుతున్నారు. అదే మగవాళ్ళు కనాల్సి వస్తే అసలు వుద్యోగాలే చెయ్యం అంటారు” బదులిచ్చేసి వచ్చింది.
ఇప్పుడందరూ ఇద్దరికి మించి కనట్లేదుకాబట్టి మొదటి కాన్పు పుట్టింట్లోనూ, రెండో కాన్పు అత్తవారింట్లోనూ జరపడం ఆనవాయితీగా మారింది. గీతని తనే వుంచుకుంది లక్ష్మి. విజ్జెమ్మ మనవరాలిని చూసుకోవడానికి నెలముందే వచ్చేసి వుంది. గీత అమ్మమ్మ, వాసు నాయనమ్మ ఇప్పుడు లేరు. తల్లికిబదులు మరదలికి తోడుగా తనొచ్చింది వాసు పెద్దమేనత్త. ఎప్పుడూ వుండే మనుషులకి అదనంగా మరో యిద్దరు చేరేసరికి ఇల్లంతా మనుషులే తిరుగుతున్నట్టు అనిపించింది నీలిమకి. యశోద వచ్చి వెళ్తోంది. ఒకరోజో రెండురోజులో వుంటుంది. ఆవిడ వున్నప్పుడు రామారావు భోజనానికి ఇక్కడికే వస్తాడు. ఒక్క డెలివరీకి ఇంతమంది ఏం చేస్తారని వింతగా అనిపించింది నీలిమకి.
మాధురికి పాప పుట్టినప్పుడు తమ కుటుంబమేఅన్నీ చూసుకున్నారు. పెదనాన్నలున్నా, అది తమింటి వ్యవహారం అన్నట్టు వదిలేసారు. తల్లీ తండ్రీ హాస్పిటల్‍కి తీసికెళ్తే తను ఇంట్లో వుండి చూసుకుంది. మానస ఇంటికీ, హాస్పిటల్‍కీ తిరిగింది. పాప పుట్టిన వార్త తెలిసాకే అందరూ ఒకొక్కరుగా వచ్చారు. ప్రహ్లాద్‍కీ, అతని తల్లికీ తమది పరాయిల్లు. పైగా ముందుగా రమ్మని ఎలాంటి ఆహ్వానం లేదు. వాళ్ళూ వార్త తెలిసాకే వచ్చారు.
గీత తల్లిదండ్రులని ఇంత దగ్గిరగా చూడటం ఇదే మొదలు నీలిమకి. ఎవరో ఒకానొక రామారావు చిన్నప్పుడే తండ్రి పోతే ఇంటి బాధతలు ఎత్తుకుని, కుటుంబాన్ని నిలబెట్టాడని చెప్తే అది పక్కింటివాళ్ళకీ, ఎదురింటివాళ్ళకీ పెద్ద విశేషమేమీ కాదు. మామూలుగా విని తలూపుతారు. ఎప్పుడో తను పుట్టనిక్రితం జరిగిన, తనకి సంబంధంలేని సంఘటనల్లోని గొప్పతనం నీలిమకి అర్థం కాదు. తన తల్లిదండ్రుల్లానే వాళ్ళూ అనిపిస్తారు.
మాధవ్ యశోదని ఆటపట్టిస్తాడు.
“మా అత్త పెళ్ళయ్యాక షోగ్గా కాలేజీకి వెళ్ళి చదువుకుంది తెలుసా?” అంటాడు నీలిమతో. ఆవిడ మొహమాటపడుతుంది.
“అరేయ్, పెళ్లైనా నీ అల్లరి ఇంకా పోలేదురా!” అంటుంది.
ఆ కుటుంబంలో ప్రతిమనిషీ ఒక పుస్తకం. చిన్నప్పటి జ్ఞాపకాలు, సంఘటనలు గుర్తుచేసుకుంటూ తింటూ తిరుగుతూ రోజులు దొర్లించెయ్యగలరు. రామారావు వచ్చినప్పుడు ఆయన చుట్టూ కూర్చుని అందరూ కబుర్లు చెప్తారు. గీత ఆయన చెయ్యి వదిలిపెట్టదు. ఎప్పటెప్పటి విషయాలో చెప్తాడాయన. వీళ్ళంతా కుతూహలంగా వింటారు. అందరూ నీలిమతో ప్రేమగానే వుంటారు. ఐనా తనకీ గీతకీ మధ్యగల తేడా స్పష్టంగా తెలుస్తుంది. తనకి ఈ మనుషులెవరూ ఏదీ కారు. మాధవ్‍కి వాళ్ళందరితో వుండే అనుబంధమే ఆమెకి ఇబ్బందిగానూ అసహజంగానూ అనిపిస్తుంది. అతనొక్కడే తన లంకె. ఆ లంకెని తన వైపు లాక్కోగలిగేంత బలం తనకి వుందా? అలాంటప్పుడు నీలిమకి ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది.
ఆ యిల్లు తనది. రామారావు స్థానంలో తన తండ్రి కూర్చుని వుంటాడు. ఆయన చెప్పే విషయాలకి తాము ముగ్గురు అక్కచెల్లెళ్ళు, తమ భర్తలు శ్రోతలు. అనిపిస్తుంటుంది-
నాన్నకూడా ఈయనలాగే చాలా కష్టపడ్డాడు. చాలాకాలందాకా సరైన వుద్యోగం రాక, అన్నదమ్ములెవరి సహకారం లేక, కన్నది ముగ్గురూ ఆడపిల్లలవటంతో పెళ్ళిళ్ళు చేసి పంపడానికి సంపాదించినదంతా ధారపోసి, ఈరోజుకీ స్వంతిల్లు లేకుండా అద్దెంట్లో కాలం గడుపుతున్నాడు. గీతా వాసూ ఇక్కడినుంచీ వెళ్ళిపోతే వాళ్ళ వెనక అత్తగారుకూడా వెళ్ళిపోతుంది. మామగారిని వెంట తీసుకెళ్తుందా, ఆయన వెళ్తాడా అనేది వేరే విషయం. ఆయన ఎందులోనూ తలదూర్చడు. ఇంట్లోకే రాడు. ఆయన్ని చూసుకోవడం పెద్ద సమస్య కాదు. తండ్రినీ తల్లినీ ఇక్కడొచ్చి వుండమనచ్చు- అని.
కోరిక చాలా విచిత్రమైనది. ఔచిత్యపు పరిధిని దాటనంతవరకూ దాన్ని అందరూ గౌరవిస్తారు. ఆ పరిధిని వదిలేసి పరుగులుపెడితే ఎదురయ్యే ప్రతిఘటన తీవ్రంగా వుంటుంది. మొదట నీలిమ సమస్య గీతతో కలిసి వుండలేకపోవటం ఒక్కటే. ఇప్పుడు దానికి ఒక పిలక పుట్టుకొచ్చింది.


యమున గీతకి తన పిల్లలని చూపించడానికి తండ్రితో కలిసి లక్ష్మి ఇంటికి వచ్చింది. అప్పటికి ఆమెకి ప్రసవమై నెల. ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల. హర్ష, హర్షిత వాళ్ళ పేర్లు. బారసాలకి ఎవర్నీ పిలవలేదు. పిలవందే ఎలా వెళ్ళాలని ఎవరూ వెళ్లలేదు. వెళ్ళినవాళ్ళకి పూట భోజనంకూడా పెట్టగలిగే పరిస్థితి కాదు వాళ్లది. ఇబ్బంది పెట్టడం దేనికని అవసరమైనంతవరకే వెళ్ళి పలకరించి వచ్చారు.
యమున, తండ్రి వచ్చేసరికి అందరివీ భోజనాలయ్యాయి. హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు అత్తాకోడళ్ళు. లోపలెక్కడో పడుక్కుని వుంది విజ్జెమ్మ. వాసు మేనత్త –
“నీ దేవుడేమంటున్నాడో నాకూ చెప్పు- అంటూ తమ్ముడి గదికి వెళ్ళి కూర్చుంది. కుటుంబాన్ని గాలికి వదిలేసి, వేదాంతంలోనూ, వైరాగ్యంలోనూ పడ్డ ఆయన్ని చూస్తే ఆవిడకి వళ్ళుమంట. మగవాడు, ఇంటికి పెద్దవాడు, బాదధ్యతలు పట్టించుకోకపోతే లక్ష్మి ఒక్కర్తీ ఎంతకని చూసుకోగలదు? అక్కడికి రామారావు నిస్వార్థజీవికాబట్టి వీళ్ళు వడ్దుని పడ్డారు.
వీధితలుపులు ఎప్పుడూ తీసే వుంటాయి. యమునా, ఆమె తండ్రీ ముందు సంకోచంగా లోపలికి అడుగుపెట్టి, గీతని చూసి, అదో అసంకల్పితచర్యలా పిల్లల్ని ఆమె పాదాలకి చెరోవైపునా పొత్తిళ్లతో నేలమీదే పెట్టాక, తండ్రి కాస్త దూరంగా జరిగి నిలబెడితే యమున వంగి గీత పాదాలకి నుదురు ఆనించింది. ఇదంతా తృటిలో జరిగిపోయింది. గీత బిత్తరబోయింది. ముందుగా తేరుకున్నది లక్ష్మి.
“ఏంటమ్మాయ్, ఇది? లే పైకి. ముందు పిల్లల్ని నేలమీంచీ తియ్యి” అని కోప్పడింది. బక్కపలచటి పిల్ల. కళ్లలో ప్రాణాలు పెట్టుకున్నట్టే వుంది. అమాయకత్వం, బేలతనం మొహంలో పోటీపడుతున్నాయి. ఇలాంటిపిల్లని అలా ఎలా చేసావురా అనుకుంది రాణాగురించి బాధగా. క్షణమాత్రపు ప్రలోభంతో ఎంత బరువు నెత్తిమీదికి తెచ్చిపెట్టుకుంది-
అని పెళ్లవకుండా తొందరపడ్డందుకు యమునమీదా కోపం వచ్చింది.
“మిమ్మల్ని అక్కా అని పిలవచ్చో లేదో! నా కళ్లకైతే మీరు ఆ అమ్మవారిలాగే అనిపిస్తున్నారు. ఈ యిల్లొక దేవాలయంలా వుంది. మా మూడు ప్రాణాలూ మీరు పెట్టిన భిక్ష. మీరు చెప్పకపోతే నన్నూ నా పిల్లల్నీ ఎవరూ పట్టించుకునేవారు కాదు. అనాథల్లా దిక్కులేని చావు చచ్చిపోయేవాళ్ళం. మీకు పిల్లల్ని చూపించి దీవెనలు తీసుకుని వెళ్ళాలని వచ్చాం. మిమ్మల్ని మాయింటికి పిలిచి మర్యాదలు చేసే స్తోమత లేదు మాకు” అంది ఆ పిల్ల లేచి నిలబడి కళ్ళు తుడుచుకుంటూ. ఐతే తను అలా అనుకోవడం ఇంకొకళ్లకి ఆక్షేపణగా వుంటుందని అనుకోలేదు. నీలిమ లోపల్నుంచీ తన్నుకొస్తున్న విసురుని అణచుకుంటూ అక్కడినుంచీ వెళ్ళిపోయింది.
రాణా పిల్లలంటే గీతకి వాళ్ళని ముట్టుకోవాలనికూడా అనిపించలేదు. బావోదని ఒకమాటు దగ్గిరకి తీసుకుని ఇచ్చేసింది. ఆ కాస్తకే వొళ్ళంతా కంపరం పుట్టేసింది. పాలు చాలక ఎండునక్కిరికాయల్లా వున్నారు ఇద్దరూను. అల్పంగా అరచేతిలో పట్టేంత వున్నారు. కీచుకీచుమని ఒకళ్ళు విడిస్తే ఒకళ్ళు ఏడుస్తున్నారు.
అతన్ని తలుచుకుంటేనే అసహ్యం వేసింది. ఎలాంటి మగవాడు? తమతో చిన్నప్పుడు కలిసి తిరిగి, ఆడింది వాడేనా? చిన్నప్పట్నుంచే వాడి బుద్ధి వేరేగా వుండేది. మిగిలిన ఆరుగురూ ఇచ్చిన కంపర్ట్ తనకి ఎప్పుడూ ఇవ్వలేదు. తర్వాతకూడా తనని చాలా బాధపెట్టాడు. ప్రేమించానని పిచ్చిమాటలన్నీ చెప్పి, చివరికి ఏంకావాలో బైటపెట్టాడు. పెళ్ళయాకకూడా వదిలిపెట్టలేదు. తర్వాత ఆ అవసరాన్ని యమునతో తీర్చుకున్నాడు. అది మెడకి చుట్టుకునేసరికి తప్పనిసరై తాళికట్టాడు. వాడు అలాంటివాడుసరే, సంధ్యత్తావాళ్ళూ పట్టించుకోకపోవడమేంటి? వాళ్ళ మనవలేకదా? ఆ మామయ్య అలా ఎందుకు చేస్తున్నారు? ఎన్నో సందేహాలు.