ఝరి – 81 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

“కనీసం నా యిల్లు నాకుంటే ఓమూల కూర్చుని ఏడవటానికేనా వుంటుంది. నాకు ఆమెతో కలిసి వుండటం నచ్చట్లేదు మాధురీ! అమ్మకి చెప్పాను. అర్థం చేసుకోదు. సర్దుకుపొమ్మంటుంది… అంతా ఆమెని చిన్నపిల్లని ముద్దుచేసినట్టు చేస్తారు. పనిమనిషి తలంటుతుంది. అత్తయ్యగారు జుట్టుచిక్కులు తీస్తుంది. ఆమె మేనమామలొస్తారు. వాళ్ళకి ఆమె నెత్తిమీది దేవత. ఇంక వీళ్ళ అమ్మమ్మైతే… అందర్లోకీ చిన్నది… పల్లవి… దాన్నికూడా అంత ముద్దు చెయ్యదు. మా ఆడబడుచు, ఆమె అత్తగారు, మావారి మేనత్తలు వీళ్ళుకూడా భజనబృందంలోనే వుంటారు. మాధవ్‍కి ఇప్పుడు తగ్గింది, లేకపోతే వదినగారిని తలుచుకుని పరవశించిపోతాడు… వీళ్ళాయన… వసంత్… అంత ప్రత్యేకం వచ్చి సారీ చెప్పడం దేనికి? తెల్లారి లేస్తే ఇలాగే వుంటుంది. ఆవిడకి అంగలార్చుకుపోతారు. పనివాళ్ళు, కూరలవాళ్ళు, పాలవాళ్ళు… ఇరుగుపొరుగు… అందరూను. ఆ మయూఖ్‍గాడైతే వూరిమీదే వుంటాడు. తెల్లారిందంటే చాలు, ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు…
లీవ్ అప్లికేషన్ రాయాలి… గీత. డియ్యే ఎప్పుడొస్తుంది… గీత. ఈ లెక్క రావట్లేదు… గీత… పానవిడకి అడ్వాన్సు కావాలి … గీత
కరెంటు బిల్లు కట్టాలి… వాసు. గేస్ బుక్ చెయ్యాలి… వాసు. ఇంగ్లీష్ గ్రామరు… వాసు.
మా అత్తగారి అత్తగారితో కాపురానికి వచ్చినవాళ్ళు, మా అత్తగారితో కాపురానికి వచ్చినవాళ్ళు, ఈవిడతో కాపురానికి వచ్చినవాళ్ళు… ఇంటిల్లిపాదీ ఈమెకి ఫాన్స్… వాసు, వాసు భార్య కావాలి వాళ్లకి. మరి మాధవ్? ఎవరికీ పట్టదు. ఎదురుపడితే గుర్తొస్తాడంతే. నేనసలు లెక్కలోకే వుండను” అంది నీలిమ.
“చిన్నప్పట్నుంచీ తెలిసిన మనుషులుకదే?” సర్దిచెప్పబోయింది మానస.
“చాల్లే, వూరుకోవే. ఎందరిళ్ళలో ఇలా వుంటుంది? ఎంత గర్వం లేకపోతే సుధీర్ బావగార్ని అలా అంటుంది? వాళ్ళకి కోపాలు రావా? అందుకే సుమతి మాట్లాడ్డం మానేసినట్టుంది ఈవిడతో” అంది మాధురి.
“నా సమస్య నేనే పరిష్కరించుకోవాలి. వసంత్ వాళ్ళమ్మ దగ్గిర నేనే అన్నాను, స్థలం వుందికదా, అందులో వీళ్ళు ఇల్లు కట్టుకుని వెళ్ళిపోతారేమోనని… తెలీనట్టుగా అన్నాను. సూచనప్రాయంగా అన్నాను. ఆవిడ కాస్త పద్ధతైన మనిషి. వీళ్ళ వెనకాల డోలువాయిస్తూ తిరగదు. అందుకని ఆవిడతో అన్నాను… ఆ స్థలం మాకే వుంటే మేమే ఏదో ఒకలా కట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అది గీతది. మాకిమ్మని అడగడానికి వుండదు… ” అంది నీలిమ.
గది బయట అలికిడైంది. వీళ్ళు మాటలాపేసారు. వచ్చింది ప్రహ్లాద్.
“అయ్యాయా, మీ కబుర్లు? వెళ్దామా?” అడిగాడు. మాధురి లేచింది. ఆమె కూతురు మయూఖ్ పక్కని నిద్రపోతోంది. మానస కూతుర్ని లక్ష్మి ఆడిస్తోంది.
“చంటిపిల్లల్ని పెట్టుకుని ఇంత రాత్రేం వెళ్తారు? ఉండిపోయి, రేప్పొద్దున వెళ్ళండి” అంది లక్ష్మి.
“నాన్నొక్కరే వున్నారుకదా, వెళ్ళాలి” అన్నాడు ప్రహ్లాద్. వసంత్ తను మర్నాడు పొద్దున్నే వెళ్ళి జాయినవాలని చెప్పాడు. వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం అంటూ ఆడవాళ్ళు ఆఖరి ముచ్చట్లు మాట్లాడుకుంటుంటే ప్రహ్లాద్, వసంత్ బైట వెయిట్ చేస్తూ నిలబడ్డారు. మాధవ్ వాళ్ళతో వెళ్ళాడు. వాసు లోపలే వుండిపోయాడు.
“మిగతా ఆడపిల్లల విషయం పెద్దవాళ్ళు చూసుకుంటారుగానీ, ఈ నలుగురూమాత్రం మన బాధ్యతరా! చిన్నప్పట్నుంచీ మనతో కలిసి తిరిగారు, ఆడారు, అల్లరి చేసారు. సుమతీ, మహీ పెళ్ళిళ్ళై బైటికి వెళ్ళిపోయారు. రేపటిరోజుని రవళికూడా వెళ్ళిపోతుంది. మనమధ్యని మిగిలేది గీత ఒక్కర్తే. ఎలాంటి పరిస్థితుల్లోనూ దాన్ని బాధపెట్టకూడదు. వీళ్ళు ముగ్గురు అక్కచెల్లెళ్ళూ మంచివాళ్ళే. కానీ గీత వాళ్ళకి ఏమీ కాదు. మనకి తనతో వున్నంత దగ్గరితనం వాళ్ళకి వుండదు. మనం తనకోసం వాళ్ళతో గొడవపడలేం. ఇందులోకూడా ఈ విషయానికి సంబంధించి మేమిద్దరం బయటివాళ్ళం. నీలిమకి ఈ ఆలోచన ఎక్కకుండా జాగ్రత్తపడాల్సింది నువ్వేరా! ఉన్నది ఇద్దరు అన్నదమ్ములు మీరు. వేర్లూ అవీ వద్దు. వాసూ గీతా గొడవపెట్టుకునే మనుషులు కాదు. వాడి చాలా కేరింగ్‍గా వుంటాడు. వేర్లు పడితే ఆమ్మ చాలా బాధపడుతుంది. ఇప్పటికే ఆవిడ మీ నాన్నవల్ల పడుతున్నది చాలు” అన్నాడు ప్రహ్లాద్ మాధవ్‍తో.
మాధవ్ తలూపాడు.
“వీడేంట్రా, రాలేదు?” అడిగాడు వసంత్ వాసుగురించి.
“చాలా హర్టయ్యాడ్రా! మనం ముగ్గురం వేరనుకుంటున్నాడేమో!” అన్నాడు మాధవ్ బాధపడుతూ.
“వాసూ! లోపలేం చేస్తున్నావురా? ” అని కేకేసాడు ప్రహ్లాద్. వాసు ఇక తప్పదన్నట్టు వచ్చాడు. తండ్రి ఇల్లొదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు తన చెయ్యిపట్టుకుని తోడుగా నిలబడ్డవాడు, తమ్ముడెందుకో మొదటిసారి పరాయిగా అనిపించాడు. తమదారులు చీలబోతున్నాయా? ప్రేమలుకూడానా? చిన్నప్పటి ప్రాణస్నేహితులుకూడా చీలిపోయారా? పెళ్ళి బంధాలని చీల్చేంత బలమైనదా? గుండె చిక్కబట్టినట్టైంది.
పిల్లల్ని తీసుకుని మాధురీ, మానసా వచ్చారు. వెనకే నీలిమా, గీతాకూడా.


ఆ తర్వాత ఇంకొన్ని సంఘటనలు త్వరితంగా జరిగాయి. గీత, సుధీర్ని కలిసి మాట్లాడింది. అతను పెళ్ళికి వప్పుకున్నాడు. గీత స్వయంగా వచ్చి చెప్పిందని వప్పుకున్నాడు. తమ్ముడి దార్లో తను అడ్డుగా వున్నాడని ఆమె చెప్పబట్టి వప్పుకున్నాడు. కానీ అతని మనసులో తీవ్రమైన సంఘర్షణ.
“పెళ్ళిచేసుకోను, నాదారిని నేను బతుకుతానంటే వినకుండా కాళ్ళూ చేతులూ కట్టిపడేసినట్టు చేస్తున్నారు. వచ్చే అమ్మాయికి నేను న్యాయం చెయ్యలేను సుమతీ! గీతని మర్చిపోలేనే” అన్నాడు. పెళ్ళిళ్ళయ్యాక చెల్లెళ్ళు అక్కలూ, అమ్మలూ ఔతారు. సుమతి అలాగే ప్రవర్తించింది.
“పెళ్ళిచేసుకోకుండా ఏం చేస్తావురా? ఎందుకు చేసుకోలేదంటే ఏం చెప్తావు? నీ కళ్ళముందు అదేమో చీకూచింతా లేకుండా తిరుగుతోంది. మరి నువ్వెవరికోసం త్యాగం చేస్తావు? ఏం సాధించాలని? యమునకి సాయం చేద్దామని అది అనేసరికి అందరికన్నా ముందు నువ్వెందుకు తలూపావు? ఇలాగే వదిలేస్తే వాసుగాడి కొంపకూల్చేలా వున్నావు. ఐనా రమకేం తక్కువ? నీతో సమానంగా చదువుకుంది. ఇద్దరూ కలిసి ప్రాక్టీసు పెట్టండి. మనింట్లోనే ఇందరు డాక్టర్లు. మా మరిదినికూడా కలుపుకుని మనమే ఒక పాలీక్లినిక్ పెట్టుకోవచ్చు. లేదా అబ్రాడ్ వెళ్లండి ఇద్దరూను. ఒక అమ్మాయిగురించి జీవితం పాడుచేసుకోవటమేమిట్రా? దేవదాసుల్ని ఆరాధించే తరం దాటిపోయిందిరా, నాన్నా! మాకు ప్రపోజల్స్ పెట్టడమూ, మేం కాదనేసరికి మొహాలు వేలాడేసుకోవడమూ చాలా చూసాం. వాళ్ళంతాకూడా పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా వున్నారు. నా పెళ్ళికి వచ్చి గ్రీటింగ్స్‌ చెప్పారు. ఇలాంటివి మాకెంత నవ్వులాటగా వుంటాయో తెలుసా? గీత కళ్ళముందు కనిపిస్తూ వుంటేనూ, మరో ధ్యాసలేకపోవటంతోనూ ఈ ఆలోచనలు. ఎంత కష్టపడితే నీకు మెడిసిన్లో సీటొచ్చింది? నిద్రలేకుండా ఎన్ని రాత్రులు చదివావు? మనని చదివించడానికి అమ్మానాన్నా ఎన్నిసార్లు నిద్రమానుకుని తోడుగా కూర్చున్నారు? ఎన్ని లక్ష్లమందితో పోటీపడి సీటు తెచ్చుకున్నావు? ఎన్నికోట్ల జనాభాలో నువ్వొక్కడివీ డాక్టరువి? ఇవన్నీ గుర్తుచేసుకుంటే నీకు జీవితం విలువెంతో తెలుస్తుంది ” అంది సుమతి. ఒప్పుకున్న పెళ్ళినుంచీ జారుకోకుండా బిగించి పట్టుకోవడానికి చెయ్యగలిగినన్ని ప్రయత్నాలూ చేసింది.
అతని పెళ్ళి జరిగిపోయింది. అప్పుడే, ప్రమీల వియ్యపురాలు సరళ డాక్టరుకళ్లకి గీత ఆరోగ్యం, చురుకూ కనిపించి ముచ్చటపడింది.
పెళ్ళయ్యాక కొన్నాళ్ళకి రమ అడగనే అడిగింది, “మీ అన్నయ్య ఇలా డల్‍గా ఎందులోనూ ఆసక్తి లేకుండా ఎందుకుంటారు?” అని.
“వదినా! ఆంధ్రాలో మెడిసినంటే చాలా పోటీ వుంటుంది. మహరాష్ట్రలోలా కాదు. పుట్టినప్పట్నుంచీ పిల్లలకి ఆ గోల్ సెట్ చేసి పెడతారు అమ్మానాన్నలు. చదువుతప్ప వేరే ప్రపంచం వుండదు. వాళ్ళిద్దరూ అలాగే చదివారు. అందులోనూ సుధీర్ బాగా డెడికేటెడ్. ఇప్పుడింక మారతాడులే. కొత్తగా అమ్మాయి, కొత్తసరదాలు… మారకేం చేస్తాడు? ” సుమతి తొణక్కుండా జవాబు చెప్పింది.
లత సుమంత్‍కన్నా రెండునెలలు పెద్దది. వరహీనం అని ప్రమీల తటపటాయించింది.
“పెళ్ళిళ్ళు చేసుకునేది మేము. కలిసి వుండాల్సింది మేము. మీ ఆలోచనలు మేం ముందుకి సాగేందుకు ప్రోత్సహించేలా వుండాలిగానీ, ఉన్నచోట ఆగిపోయి కొత్తదారులు వెతుక్కునే అయోమయంలో పడెయ్యకూడదు. వాళ్ళు నాలుగేళ్ళనుంచీ కలిసి తిరుగుతున్నారు. ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ తెలుసు. వాళ్ళింట్లో వప్పుకున్నారు. ఇప్పుడు మనం కాదంటే బావుండదు” అన్నాడు సుధీర్.
ఒక కొడుకు చేతిలో గట్టిదెబ్బ తింది ప్రమీల. ఇప్పుడు ఇంకో కొడుకు చేతిలో దెబ్బతినడానికి భయపడింది. గురుమూర్తికూడా ఏమీ అనలేకపోయాడు. సుధీర్‍ది మామూలు సంబంధమే. లత తండ్రి బాగా ఆస్తిపరుడు. ఒకపొదలో వున్నంతవరకే గులాబీలు ఒకలాంటి పువ్వులు పూస్తాయి. అంటుకట్టి విడదీసాక లక్షణాలు మార్చుకుంటాయి. పెళ్ళిళ్ళయాక ఆడపిల్లలకేనా, మగపిల్లలకేనా అంతే.
జో తమ్ముడి క్లాస్‍మేట్ సుధీర్. జో తమ్ముడి పెళ్ళైపోయింది. సుధీర్ కుటుంబంలోకూడా అందరి పెళ్ళిళ్ళూ ఔతున్నాయి. ఇతనెందుకు చేసుకోవట్లేదనే విషయంమీద జోకి సందిగ్ధం వుండేది. ప్రేమలూ, వైఫల్యాలూ యువతలో మామూలేకాబట్టి అలాంటిదే ఏదో వుండి వుంటుందని వూహించాడు. తమ్ముణ్ణడిగితే కాలేజిలో అలాంటిదేమీ లేదన్నాడు. మరి? జోక్యం చేసుకునే సందర్భంకోసం చూస్తున్నాడు.
“మమ్మల్ని ఈ స్థితికి తీసుకురావడానికి మా అమ్మానాన్నలు చాలా కష్టపడ్డారు. అంటే మిగిలిన యిళ్ళలో తల్లిదండ్రులు కష్టపడలేదని కాదు. ఇది ప్రతిమధ్యతరగతి కుటుంబంలోనూ వుండే కథే. నాకు ఇద్దరు తాతయ్యలూ లేరు. అటు తాతయ్య నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ బియ్యే చదువుతున్నప్పుడు ఈ తాతయ్య పోయారు. మామయ్య అమ్మకన్నా ఏడాది పెద్ద. ఆ వయసుకి ఆయన ఇంటిబాధ్యతలు ఎత్తుకుని, పెళ్ళిచేసి పంపించడమే చాలా గొప్పవిషయం. అమ్మ తర్వాత ఇంకా ఐదుగురు పిన్నులు, ఇద్దరు మామయ్యలు. మా మామ్మ అస్సలేమీ తెలీనిది. అమ్మని చాలా బాధలు పెట్టిందట. అమ్మకి వెంటనే పిల్లలు పుట్టలేదని నోములు, వ్రతాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు ఒకటేంటి సమస్తం చేయించేదట. ఇద్దరి జీతాలూ చాలక, అప్పులుకూడా అయ్యేవట. జీతం చాలట్లేదని నాన్న ఎప్పుడేనా అంటే, నీ భార్య తన పుట్టింటివాళ్ళకి దోచిపెడుతోందని యాగీ చేసేదట. జీతం వచ్చినరోజైతే ప్రతీనెలా గొడవేనట. పర్సు లాక్కుని, లెక్కబెట్టుకుని-
ఇంకా పదిరూపాయలు రావాలి. దార్లో మీ అమ్మకి ఇచ్చి వచ్చావు- అనేదట.
గవర్నమెంటు వుద్యోగస్తులంటే జీతం ఎప్పుడూ ఒకటే అంకె రాదుకదా? ఏదేనా నెల్లో ఎరియర్సో, ఇంక్రిమెంటో వస్తే పక్కనెలలో ఎందుకివ్వలేదని దెబ్బలాడేదట. ఎందుకేనా రికవరీ వచ్చి తగ్గితే ఇంక ఆ జరిగే గొడవ భరించడానికి దుస్సహంగా వుండేదట. నాన్న గట్టిగా చెప్పడంతో ఆగిందిగానీ లేకపోతే అమ్మమ్మావాళ్ళింటికి వెళ్ళి దెబ్బలాటలు పెట్టుకునే మనిషే ఆవిడ. దాదాపు పదిహేడేళ్ళు భరించింది అమ్మ ఇదంతా. ఆమె అంత ఓర్చుకుంటే ఈరోజుని మేం ముగ్గురం ఇలా వున్నాం. అలాంటి అమ్మని తప్పుపట్టాడు సుధీర్.
గీతని వాడు అంతగా ఇష్టపడుతున్నాడని మాకెవరికీ తెలీదు. మా చిన్నప్పుడు అన్ని కుటుంబాలవాళ్ళం అవంతీపురంలోనే వుండేవాళ్ళం. అందరం కలిసి తిరిగాం, కలిసి పెరిగాం. రాజావారి బళ్ళోనూ, కాలేజిలోనూ చదువుకున్నాం. గీత మా అందర్లోకీ చిన్న. అది పుట్టాక మరో ఐదారేళ్ళు మా యిళ్ళలో పిల్లలు పుట్టలేదు. అందుకని, అదీ, దానిపై ఇద్దరూ అంటే రవళీ, వసంత్ మాతోటే వుండేవారు. దాన్ని వీళ్ళలో ఎవరికేనా ఇస్తారా అనే ప్రస్తావన ఎప్పుడూ బయటికి రాలేదు. దాని మనసులో ఏముందోకూడా ఎవరికీ తెలీదు. డిగ్రీతో చదువాపేసి వుద్యోగంలో చేరింది. ఎందుకే అంటే-
మా నాన్న చదివించలేరు- అంది.
మేమేమీ కట్నం అడగలేదు. సుధీర్ని ఎమ్మెస్ చదివించి పిల్లనిచ్చుకొమ్మంది అమ్మ. అన్నకి సాయం చేస్తున్నాననే అనుకుంది ఆవిడ. పాతికేళ్ళు తను పెంచి పెద్దచేసి, ప్రయోజకుడిని చేసిన కొడుకుని ఆయన చేతిలో పెడుతున్నాననుకుంది. ఆలోచించుకోవలసింది ఆయనకదా? కానీ జవాబు గీత దగ్గిర్నుంచీ వచ్చింది. మా అందర్లోకీ అది చిన్నపిల్లకదా? మా అమ్మానాన్నల వొళ్ళో తనూ ఎక్కి తొక్కిందేకదా? ఆ జవాబే మామయ్య చెప్పి వుంటే పెద్దవాళ్ళందరి గౌరవాలూ నిలబడేవి. జో! కట్నం తీసుకోకూడదు నిజమే. అది పెద్ద నేరం. మరి ఈ పెద్ద చదువులన్నీ ప్రభుత్వం వుచితంగా చెప్పిస్తోందా? పిల్లలకి పెద్ద చదువులు చెప్పించిన తల్లిదండ్రులు దివాలా తియ్యాలా? లేక పైకి ఎదగాలన్న కోరికలని మధ్యతరగతివాళ్ళు తుంచేసుకోవాలా? ఇందులో విన్‍విన్ వుండదా?” అంది సుమతి అతనికి ఆ విషయం చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు.
తల్లికూడా ఇలాంటి మాటలే అనడం గుర్తొచ్చింది జోగేశ్వర్రావుకి.