అప్పయ్య బావి by Myna Vishvakarma

ఊరికి దూరంగా ఉన్న నిర్జన ప్రదేశంలో శిథిలావస్థలో ఉన్న ఓ బావి దానికి కాస్తంత దూరంలో ఒక సమాధిని బస్సులో వస్తుండగా గమనించాడతను. కాసేపటి తర్వాత బస్సు ఊళ్లోకి ప్రవేశించినట్టుగా “పామూరు.. పామూరు..” అంటూ గట్టిగా అరిచాడు కండక్టర్.
అదోమోస్తరు గ్రామం.
చుట్టుపక్కల పది పదిహేను పల్లెలకి అదొక హెడ్‍క్వార్టర్స్‌లాంటిది. ఊరంతా ఉప్పు నీళ్లే. ఏ చేతిపంపు పట్టుకున్నా సరే, ఉప్పునీళ్లే వస్తాయి. పండే భూమి తక్కువ. ఏవైనా పంటలు వేసినా నీళ్లు అంతగా అవసరం లేని పంటలే వేస్తారు. ఇంచుమించుగా వర్షాధారమనే చెప్పాలి.
అలాంటి ఊరికి వచ్చి పడ్డాడతడు.
పంచాయతీ ఆఫీసులో గుమస్తా ఉద్యోగం మరి ఎక్కడికి ట్రాన్స్ఫర్ ఐతే అక్కడికి పోల్సిందేకదా!
ఆఫీసుకు దగ్గర్లో చిన్నరేకులగది అద్దెకు తీసుకొని బస ఏర్పాటు చేసుకున్నాడు.
ఊళ్లో కుళాయిలు వేసే పనులు జరుగుతున్నాయి. ప్రతిఒక్కళ్ళు ఆ పనుల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక ఆడవాళ్ళ ఆనందానికి హద్దే లేదు.
డబ్బున్నవాళ్ళు ఈమధ్య వాటర్‍క్యాన్లు కొనుక్కొని తాగుతున్నారు. మరి డబ్బులేనివాళ్ళ పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు వీళ్లంతా నీళ్లెలా తాగేవారు? ఇలాంటి ఆలోచనలు అప్పుడప్పుడు అతనికి కలిగేవికానీ పని ఒత్తిడిలో పడి ఎప్పటికప్పుడు మర్చిపోయాడు.
ఒక సుముహూర్తాన మంత్రిగారు విచ్చేసి ప్రతిసందుచివర్న ఉన్న కుళాయిలను ప్రారంభోత్సవం చేసేశారు. బోలెడంత మంది పత్రికలవాళ్ళు ఫోటోలు తీసుకుని వెళ్లారు. మంత్రిగారిని పెద్ద గజమాలతో సత్కరించారు. ఓ మహా ప్రహసనం ముగిసిపోయినట్టు తేలిగ్గా ఊపిరితీసుకున్నాడు అతడు. తర్వాతరోజు ఆదివారం కావడంతో పొద్దెక్కెదాకా లేవకూడదని నిశ్చయించుకొని నిద్రపోయాడు. కానీ అదేంటో కోడికూయక ముందే మెలకువ వచ్చేసింది. కళ్ళు నులుముకొని కిటికీలోంచి చూశాడు. అంతా చిమ్మచీకటిగా ఉంది. గోడగడియారంవంక చూస్తే నాలుగు దాటుతోంది. చొక్కా తొడుక్కుని బయటకు వచ్చాడు.
వీధి చివరనున్న కొళాయి దగ్గర అప్పటికే బిందెలు వరుసగా పెట్టేసి ఉన్నాయి కానీ మనుషులు మాత్రం ఎవరూ లేరు. టీ కొట్టు మనిషి కిరోసిన్ స్టవ్ వెలిగించి గాలి కొడుతున్నాడు. వాడి వంకోసారి చూసి పక్కనే ఉన్న వేపచెట్టు అరుగుమీద కూర్చున్నాడు.
కాసేపటికి అదే అరుగుమీద గొంగళి కప్పుకొని మునగదీసి పడుకున్న ఓ వృద్ధుడు లేచి కూర్చున్నాడు. డిసెంబర్ నెలేమో చలి వణికించేస్తుంది.
టీ గ్లాస్ అందించినతనితో, “పెద్దాయనక్కూడా ఒక టీ నా ఖాతాలో” అన్నాడు.
గ్లాస్ అద్దుకుంటూ కృతజ్ఞతగా చూసాడు ఆ వృద్ధుడు.
“పెద్దాయనా! ఇప్పుడంటే కొళాయిలొచ్చాయ్. మరి అంతకుముందంతా ఏం తాగేవాళ్ళు?” నెమ్మదిగా మనసులో ఉన్న అనుమానాన్ని బయటపెట్టాడు.
“మనిషికి అన్ని ఎక్కువే బాబు. ప్రేమ, పగ, మరుపు…అన్నీ ఎక్కువే” వేదాంతిలా అన్నాడు ఆ వృద్ధుడు.
“నేను అడిగిన ప్రశ్నకి ఈ ముసలాడేం సమాధానం చెబుతున్నాడు?” అన్నట్టుగా చూశాడతను.
చిన్నగా నవ్వాడు ఆ వృద్ధుడు. దాదాపు ఎనభై సంవత్సరాల పై వయసు ఉంటుందేమో! మొఖంమీద చర్మం అంతా ముడతలు పడిపోయింది అతడు నవ్విన చిన్న నవ్వుకే.
“సరే చెబుతాను విను. నువ్వు ఊర్లోకి వచ్చేటప్పుడు చూసే ఉంటావు పాడుబడిన బావి, దాని పక్కనే ఒక సమాధి” కళ్ళు మూసుకొని చెప్పుకుంటూ పోతున్నాడు ఆ వృద్ధుడు.
“వందేళ్లక్రితం పామూరుకు ఆనుకొని ఒక వాగు ప్రవహిస్తూ ఉండేది. అందరూ ఆ నీటిని తాగడానికి, ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకునేవాళ్ళు. అయితే వాగు ఊరికి కాస్తంత దూరంగా ఉండేది. ఊళ్లో ప్రజల అవసరాలకోసం ఎన్నో బావులు తవ్వించారు కానీ ఒక్కదాంట్లోకూడా తాగడానికి పనికొచ్చే నీళ్లు పడలేదు. ఇక ప్రజలకు వేరే మార్గం లేదు. ఆ వాగే వాళ్లు జీవనాధారం. ఆ వాగే వాళ్ళకు ప్రాణాధారం. మైళ్ళకు మైళ్ళు నడుచుకుంటూ వచ్చి ఆ వాగులోంచి ఆడవాళ్ళు నీళ్లు మోసుకుని పోయేవాళ్ళు. ఎద్దులబళ్ళు ఉన్నవాళ్లు కుండల్లో బళ్ళమీద ఎక్కించుకుని తీసుకెళ్లేవాళ్ళు. ఎంత గలగలపారే ఏరైనా ఎండాకాలం అదికూడా ఒట్టిపోయేది. వాగు పోయిన జాడల్లో చెలమలు తవ్వి దాహం తీర్చుకునేవాళ్ళు.
అలాంటి ఈవూళ్లో పుట్టినోడే అప్పయ్య. వాడినందరూ ‘వెర్రిబాగులప్పయ్య’ అని పిలిచేవాళ్ళు. వాడి అమ్మానాన్న మట్టిపని చేసుకుని బతికేవాళ్ళు. వాళ్లకున్న ఏకైక ఆస్తి ఒక పలుగు, పార మాత్రమే. ఉన్నంతలో కూలిపనులు చేసుకుంటూ హాయిగా బతికేవాళ్ళు. పసిగుడ్డుగా ఉన్న అప్పయ్యని చెట్టుకి కట్టిన ఉయ్యాలలో పడుకోబెట్టి పని చేసుకునేవాళ్లు.
ఒకరోజు బట్టీకోసం మట్టి తవ్వుతుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీదపడి ఇద్దరూ చచ్చిపోయారు. అప్పటికి అప్పయ్య వయసు పద్దెనిమిది నెలలు. నా అన్నవాళ్ళు లేరు, ఉన్న తల్లి, తండ్రి చచ్చిపోయారు అప్పటినుంచి అప్పయ్యని ఊరే పెంచింది. బట్టలుతికే నూకాలు వాడికి చనుబాలు పట్టింది. కుండలు చేసే మల్లయ్య వాడికి తన గుడిసెలో చోటిచ్చాడు. సవరాలు చేసే ఏడుకొండలు.. నాగళ్ళు చెక్కే బత్తులు గారు, మగ్గం నేసే మూర్తి బాబు. ఇలా ఒకరని కాదు, ఊరంతా వాడిని బిడ్డలాగే సాకింది.
ఆడు పెరిగి పెద్దయ్యే కొద్దీ తెలిసింది ఒట్టి అమాయకుడని. అయితే మాత్రమేం!
ఊళ్లో అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. వాడికి మోసం, అబద్ధం అంటే తెలీదు. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేవాడు.
ఏ ఇంటి ముందు నిలబడి ఉండగా ఆకలైతే ఆ ఇంటి అరుగుమీద కూర్చుని అన్నం పెట్టమని అడిగేవాడు. ఏ ఇల్లాలూ వాడి ఆకలిని కాదనలేదు. చూస్తుండగానే పాతికేళ్ళు గిర్రున తిరిగి పోయాయి.
ఒకనాడు…
“జోగులు, తర్వాత యవ్వారం ఏంటో సూడండ్రా! ఆ పిల్ల ఎంతసేపట్టా ఏడిత్తేమాత్రం పోయిన ముసల్ది తిరిగొచ్చిద్దా? చీకటిపడేదాకా పీనుగను ఊర్లో ఉండడం మంచిది కాదు. ఇంద,ఈ పైకం తీసుకుపోయి దాన్ని మట్టిచేయండి” రొంటిన ఉన్న నాలుగు కాగితాలు అక్కడున్న మనిషికి ఇచ్చాడు కామందు.
అప్పటివరకు ఆ మసల్దానిమీద పడి బోరున ఏడుస్తున్న పిల్లని నలుగురు ఆడాళ్ళు పక్కకు లాక్కుపోయారు.
ఆ పిల్ల పేరే శ్యామల. పేరుకు తగ్గట్టే ఆ కిట్టయ్య రంగులోనే ఉండేది. కానీ ముఖం ఎంత కళో… అచ్చం లచ్చిందేవిలాగే ఉండేదంట. పాపం అప్పుడా పిల్ల అనాధయిపోయింది.
బాధనుంచి కాస్త తేరుకున్నాక ఊళ్లో పెద్దకుటుంబాలకు నీళ్లుమోసి కడుపు నింపుకునేది.
ఓరోజు గాబులో నీళ్ళు నింపుతున్న శ్యామలవంక తన భర్త ఆబగా చూడడం గమనించింది పెదకామందు భార్య. ఆ సాయంత్రమే పూజారిగారిని పిలిచి అప్పయ్యతో శ్యామలకి పెళ్లిచేయడానికి ముహూర్తం పెట్టించింది. వారంరోజులు తిరిగేసరికి అప్పయ్య, శ్యామల మొగుడు పెళ్ళాలయిపోయారు. దగ్గరుండి సొంతతల్లిలాగా ఇంట్లోకి కావాల్సిన సరుకులిచ్చి వాళ్ళకు ఒక గుడిసె ఏర్పాటు చేయించింది ఆ మహాతల్లి.
ఎంత అమాయకుడైనా శ్యామల తన పెళ్ళాం కాగానే అప్పయ్య దాన్ని విపరీతంగా ప్రేమించడం మొదలు పెట్టాడు. ఎట్లాంటి కల్మషం లేని వాడి ప్రేమను చూసి శ్యామలకూడా వాడి చేతుల్లో కరిగిపోయేది. వాడు దాన్ని ముద్దుగా ‘బుజ్జమ్మ’ అని పిలిచేవాడు. ఆడికి సమయానికి తిండి పెట్టడం, వాడి అవసరాలను చూసుకోవడం శ్యామలకు ఎంతో ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చేది. స్వర్గంలో ఉన్నట్టు తోచేది వాళ్ళకి.
ఊళ్లో ఎవరెవరికి ఏమేం పనులు కావాలో చేసిపెట్టి తిండిసమయానికి ఇంటికి చేరుకునేవాడు అప్పయ్య. ఊళ్ళోవాళ్ళు ఇచ్చే బియ్యం, కూరగాయలు, పావలా అర్థా డబ్బులతో వాళ్ళ జీవితం మహాసంతోషంగా గడిచిపోయేది. వర్షం పడే రాత్రుల్లో చింకిచాపమీద చిరుగుల బొంత కప్పుకొని వెచ్చగా నిద్రపోయేవాళ్ళు.
“బుజ్జమ్మా, మనకాడ పదిరూపాయలున్నాయి కదా! నీకేం కావాలో జెప్పు” ఓ చలికాలం రాత్రి పెళ్ళాన్ని తనవైపుకు తిప్పుకుంటా అడిగాడు అప్పయ్య.
“ఓయబ్బో, పది రూపాయలు! ఆటిని అట్టాగే ఉండనీ మంత్రసానికి ఇవ్వొద్దూ?” అంది బుజ్జమ్మ బొంతని ముఖంమీదికి లాక్కుంటూ.
“మన డబ్బు దానికెందుకు ఇస్తా..?? అది మనది నేనివ్వను” అప్పయ్య చిన్నపిల్లాడిలా అన్నాడు.
“ఇవ్వవా? ఎందుకివ్వవ్? నీ పెళ్ళానికి పురుడు పోసిన మంత్రసాన్ని ఉత్తచేతులతో పంపిత్తావా” బొంత ముసుగేసుకొనే అంది.
“నువ్వేం మాటాడతన్నావో నాకర్థం కాడం లేదు” బుర్రగోక్కుంటూ లేచి కూర్చున్నాడు అప్పయ్య.
“ఒరేయ్, మొద్దు సచ్చినోడా నువ్వు అయ్యవి కాబోతున్నావ్” గబుక్కున లేచి నెత్తిమీద ఒకటి మొట్టింది బుజ్జమ్మ.
“అయితే పుట్టినోడు నన్ను అయ్యాని పిలుస్తాడా..??”
“అవును..” సమాధానం ఇచ్చింది..
“నిన్ను అమ్మా అంటాడా?”
“అంటాడు”
“ఏది ఎక్కడున్నాడు వాడు?”
“ఇదిగో ఇక్కడున్నాడు. ఇంకో తొమ్మిదినెలలు ఆగితే బయటకి వస్తాడు” పొత్తికడుపుమీద అప్పయ్యచేతిని ఉంచుతూ అంది శ్యామల.
“రానీ..రానీ.. నేను మా అమ్మా అయ్యని చూడలా.. అమ్మా అయ్యా అని పిలవలా.. మరి ఈ పుట్టినోడు నన్ను అలా పిలుస్తాడా?” అమాయకంగా అడిగాడు అప్పయ్య.
“పిలుస్తాడయ్యా.. తప్పకుండా పిలుస్తాడు” అప్పయ్యని గుండెలకు హత్తుకుంది శ్యామల.
ఇప్పుడు వాళ్ల జీవితం మరింత అందంగా మారింది. శ్యామల కడుపు కొద్దికొద్దిగా పెరుగుతుండడం చూసి మొదట భయపడిపోయాడు అప్పయ్య. బుజ్జమ్మ వాడికి అర్థమయ్యేలా చెప్పగా చెప్పగా నెమ్మదిగా సమాధానపడ్డాడు.
బుజ్జమ్మకి నెలలు నిండుతున్నాయి. భారంగా అడుగులు వేసేది.
“కాన్పయ్యాక నరవాడ ఎంగమాంబ గుడికి పోదాం మామ” అనేది బుజ్జమ్మ.


మంచి ఎండాకాలం. రోళ్ళు బద్దలయ్యేంత ఎండ. శ్యామల గుడిసెలోనే కాలం గడుపుతుంది. అప్పయ్యకు క్షణంకూడా తీరిక ఉండడం లేదు. వాగులో చెలమలు తవ్వడం ఊర్లోకి నీళ్లుమోయడం ఇదే వాడి పని.
ఓ మిట్టమధ్యాహ్నం వేళ…
నెమ్మదిగా పక్కమీంచి లేచి కుండమీద మూత తీసింది బుజ్జమ్మ. అందులో ఒక్కచుక్క నీళ్లు లేవు. గొంతు ఎండిపోయి నాలుక పిడచకట్టుకుపోతోంది. నెమ్మదిగా బయటకు వచ్చి చూసింది.
వడగాలి హోరున చెవులకు తాకుతుంది. అరిచెయ్యి నొసట అడ్డం పెట్టుకొని వాగువైపు చూసింది. ఎక్కడా అప్పయ్య జాడలేదు. ఒక్కక్షణం ఆగితే ప్రాణం పోయేలా ఉంది. పెదాలు ఎండిపోతున్నాయి. గుటకపడటం లేదు. ముక్కులోంచి లోపలికి వెళ్ళిన గాలి గొంతుని మరింత పొడిగా మార్చేస్తోంది.
“నీళ్లు.. నీళ్లు కావాలి…” నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాగువైపు నడక మొదలుపెట్టింది.
కొంచెం దూరం నడిచిందో లేదో నొప్పులు మొదలయ్యాయి. పైన ఎర్రటి ఎండ. కింద అగ్గిలా మండిపోతున్న భూమి. దూరంగా నీళ్ళల్లా కనిపిస్తున్న ఎండమావులు.
భరించలేని నొప్పులు… కడుపు పట్టుకొని “అప్పయ్యా” అంటూ కీచుగా అరిచింది. వడదెబ్బకి మతితప్పి అక్కడే పడిపోయింది. కొంతసేపటికి ఎవరో చూశారు. మరికాసేపటికి మంత్రసానొచ్చింది శ్యామలని గుడిసెలోకి చేర్చారు.
“అయ్యో నా బిడ్డా.. ఎంత కష్టం వచ్చిందే నీకు” ఎవరో ఇద్దరు స్త్రీలు బయట శోకండాలు పెడుతున్నారు.
“నీళ్లు.. నీళ్లు పట్టకరండి” అరుస్తోంది మంత్రసాని.
నీళ్ల కోసం ఊర్లోకి పరిగెత్తారు కొందరు.ఈలోపే స్పృహలోకి వచ్చింది శ్యామల. నొప్పులు తీసింది.
“చూడవే నీ కొడుకుని” మంత్రసాని బిడ్డని శ్యామల గుండెలకు తాకించింది. శ్యామల కళ్ళల్లో చిన్ననవ్వు కనపడింది క్షణంలో తల పక్కకు వాలిపోయింది. ఊపిరి ఆ వేడిగాలిలో కలిసిపోయింది. తెరుచుకున్న కళ్ళతోపాటు చిరునవ్వు మాత్రం అలాగే ఉండిపోయింది. చుట్టూ ఉన్న ఆడవాళ్లు ఏడుపులు ఊళ్లోకి వినిపించాయి.
రొప్పుకుంటూ గుడిసెలోకి అడుగుపెట్టాడు అప్పయ్య.
“బుజ్జమ్మ.. బుజ్జమ్మా..లెయ్ బుజ్జమ్మా..నర్రవాడ పోదాం..బిడ్డ పుడితే నర్రవాడ పోదామంటివే..లెయ్” శ్యామల తలని ఒళ్ళోపెట్టుకొని గుండెలకు ఆన్చుకున్నాడు. అది వాడి ప్రాణం. ఊహ తెలిసినప్పటినుంచి తల్లి, తండ్రి ప్రేమ లేని వాడికి దేవుడిచ్చిన వరం. వాడి కన్నీళ్లు ధారలుగా శ్యామల ముఖాన్ని తడుపుతున్నాయి.
“అప్పయ్యా.. నీ పెళ్ళాం సచ్చిపోయింది రా” ఏడుస్తూ తలబాదుకుంది మంత్రసాని.
“బుజ్జమ్మ చావలా.. నా బుజ్జమ్మ చావలా. బిడ్డను కని అలిసిపోయింది.. నిద్రపోయింది నా బిడ్డ అమ్మాని పిలుస్తాడు అప్పుడు నిద్ర లేస్తది. మీరంతా ఇళ్లకు పొండి” కళ్ళు తుడుచుకున్నాడు వాడు.
కాసేపాగితే వాడే సర్దుకుంటాడని అందరూ లేచి నిలబడ్డారు.
“నువ్వాగు.. మంత్రసానికి డబ్బు లియ్యాలంటగా? బుజ్జమ్మ చెప్పింది.. ఇదిగో తీసుకో” ఉట్టి కుండల్లోంచి ఒక నోటు తీసి ఆమె చేతిలో పెట్టాడు.
“వద్దయ్యా” గుడ్లనీరు కుక్కుకుంది మంత్రసాని.
“బుజ్జమ్మ మాటంటే మాటే. తీసుకెళ్ళు బుజ్జమ్మకి నీళ్లు తాగించాలి” అంటూనే మూలనున్న పలుగు అందుకున్నాడు.
డబ్బులు పట్టుకొని అయోమయంగా బిడ్డతోసహా బయటికి నడిచింది మంత్రసాని
“ఒరేయ్ ఎర్రిబాగుల నాకొడకా, నీ పెళ్ళాం సచ్చిందిరా దాన్ని తీసుకెళ్లి ముందు తగలబెట్టు” అప్పుడే వచ్చిన కామందు గట్టిగా అరిచాడు.
“ఇంకోమాట మాటాడితే ఈ పలుగు నీ ప్రాణాలు తీసేస్తది మర్యాదగా ఫో” వెర్రెక్కినవాడిలా అరిచాడు అప్పయ్య.
బుజ్జమ్మ శవాన్ని ముందు పెట్టుకొని గుడిసె పక్కనే బావి తవ్వడం మొదలుపెట్టాడు. ఏడురోజులు ఆకలిదప్పులు మర్చిపోయి రాత్రీ పగలూ బావిని తవ్వుతూనే ఉన్నాడు. ఎవ్వరినీ దగ్గరకు రానివ్వలేదు. ఊరివాళ్లంతా వాడికి పిచ్చెక్కిపోయిందనుకున్నారు.
ఏడోరోజు బావిలో జల పడింది. దోసెడు నీళ్ళు నోట్లోపోసుకున్నాడు అప్పయ్య.
“కొబ్బరినీళ్ళలా ఎంత తియ్యగా ఉన్నాయో!” గట్టిగా అరిచి సంబరంగా నవ్వుకున్నాడు. ముంతతో నీళ్లు తీసుకొచ్చి బుజ్జమ్మ నోట్లో పోశాడు.
“బుజ్జమ్మా, తాగు బుజ్జమ్మా! నీళ్లడిగావుగా, తీసుకొచ్చా. ఊరు మొత్తానికి నీళ్లు మోసిన్నేను నీ పాణం పోయేటప్పుడు గుక్కెడునీళ్లు పొయ్యలేకపోయాను బుజ్జమ్మా! అందుకే.. అందుకే మన గుడిసె పక్కనే బావి తవ్వాను. ఇంక నీళ్లకోసం మనం యాడికీ పోయేబళ్ళేదు… నువ్వు హాయిగా మన బావిలో నీళ్ళే తోడుకోవచ్చు… ఊరందరికీ పొయ్యచ్చు… తాగు బుజ్జమ్మ… తా…” డొక్కలెగిరేలా ఏడుస్తూనే ఉన్నాడు అప్పయ్య.
ఊరి జనమంతా వింతగా వచ్చి చూశారు. శ్యామల శరీరం కొంచెంకూడా పాడవలేదు. కొంతమంది బావిలోకి దిగి నీళ్లు తాగిచూశారు. ఊరు మొత్తం ఎక్కడ బావి తవ్వినాసరే, ఉప్పునీరు తప్ప మరేది వాళ్ళ నోటికి తగల్లేదు. అలాంటిది ఈ నీళ్ళు ‘తియ్యగా… దేవుడికి కొట్టిన కొబ్బరినీళ్ల’లా ఉన్నాయి.
తన చుట్టూ నిలబడ్డ ఊరి జనానికి చేతులు జోడించాడు అప్పయ్య.
“అయ్యా.. అమ్మా.. ఇప్పటివరకు నన్ను బిడ్డలా సాకారు. ఒకే ఒక్క కోరిక తీర్చండి. నన్ను, నా బుజ్జమ్మని వేరుసెయ్యకండి. మా ఇద్దరినీ కలిపి ఒకేచోట మట్టిచేయండి” మాటలు పూర్తయిన మరుక్షణమే అప్పయ్య శరీరం బుజ్జమ్మ ఒళ్ళో వాలిపోయింది.
కాలాలతో సంబంధం లేకుండా బుజ్జమ్మ తనతోనే ఉండాలని కోరుకున్నాడు అప్పయ్య.
వాళ్లు ఏ లోకానికి పోయినాసరే అక్కడో చాప, చిరుగులబొంత, తోడుగా బుజ్జమ్మ ఉంటే చాలు.
వాళ్ల ప్రేమానురాగాల తీయదనం ఆ నేలలోకి ఇంకి పోయిందేమో కల్మషంలేని వాళ్ళిద్దరి స్వచ్ఛమైన ప్రేమ ఊరికి స్వచ్ఛమైన నీటి నిచ్చింది.
ఆ బావి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ ఊరివాళ్లకు మంచినీటి అవసరాలను తీర్చింది. ఒక్క ఎండాకాలంకూడా తడి ఆరిపోకుండా… అచ్చం వాళ్ళ ప్రేమలాగే.


అప్పటికే బాగా పొద్దెక్కింది. ఆ వృద్ధుడు ఇంకా కళ్ళుమూసుకునే ఉన్నాడు. మూసిన అతని కళ్ళ చివరనుంచి ఎప్పటినుండో కారుతున్న కన్నీళ్ళు చారికలు కట్టేసాయి. ఎప్పుడొచ్చారు తెలీదు కొంతమంది యువకులు వాళ్ళ చుట్టూ మూగి ఆ కథంతా విన్నారు.
“తాతా ఈ కథంతా నీకెలా తెలుసు?” అడిగాడతడు.
“మా అమ్మా, అయ్యల కత నాకు తెలీదా బాబు” లేచి ఆ బావి వైపు అడుగులు వేశాడా వృద్ధుడు.

1 thought on “అప్పయ్య బావి by Myna Vishvakarma”

Comments are closed.