ఆదర్శం by Manas Krishna Kant

  1. ఆదర్శం by Manas Krishna Kant
  2. ఇది కథ కాదు by Manas Krishna Kant
  3. కడలి by Manas Krishna Kant
  4. A.ILU by Manas Krishna Kant
  5. తీరిన కోరిక by Manas Krishna Kant
  6. ఆకాశగంగ by Manas Krishna Kant
  7. కాలభ్రమణం by Manas Krishna Kant
  8. పాతబంగళా by Manas Krishna Kant
  9. రెక్కలగుర్రం by Manas Krishna Kant
  10. పరిశోధన by Manas Krishna Kant
  11. సింహావలోకనం by Manas Krishna Kant
  12. పరిష్కారం by Manas Krishna Kant
  13. దివ్యశక్తి by Manas Krishna Kant

పెళ్ళికి ఇంకా పది రోజులుంది. ఈ రోజే శుభలేఖలు ఫ్రెష్‍గా అచ్చయి ప్రింట్‍నుంచి వచ్చాయి. నా ముందున్న టేబుల్‍మీదనుంచి పైనున్న కార్డు తీసుకొని పరిశీలించసాగాను. అన్ని శుభలేఖల్లా వివాహ ఆహ్వాన పత్రిక అని కాకుండా, ‘‘ఆదర్శ వివాహ ఆహ్వాన పత్రిక’ అని ఫ్రింట్ చేసి ఉంది. మనసు జ్ఞాపకాల గతుకులను దాటుకుంటూ ఇరవైసంవత్సరాలు వెనక్కి వెళ్ళింది.
గ్రామ పంచాయితీ పెద్దలందరూ రచ్చబండ దగ్గరకి చేరారు. వారితోపాటే చిన్నా పెద్దా అందరు గ్రామస్థులూనూ. కొందరి ముఖాలు వివర్ణం అయ్యాయి, గ్రామపెద్దల ముఖాలు మాత్రం అరుణాన్ని అలముకున్నాయి. చిన్నదాన్నయినా నేను రచ్చబండ మా ఇంటికి దగ్గరవడంవలన, మా అమ్మ ఇల్లు దాటి బయటకు వెళ్ళకపోవడంవలన ఆమె చంకనెక్కి ఆమెతోపాటూ వింతగా చూస్తున్నాను. అక్కడ ఏమవుతుందో అని. మా అమ్మ ముఖంలో కాస్త విచారమేమో కళ్ళు తడిచి ఉన్నాయి. ఇంతలో అందరి మధ్యలోంచి ఒక పెద్దాయన మా నాన్నకి చుట్టమే, రెండో వీధిలో ఉండే వాళ్ళనుకుంటా ఒక అమ్మాయిని ముందుకు నడిపించుకొని వచ్చాడు. ఆ అమ్మాయి పేరు తెలీదు నాకు. కానీ మా ఇంటికి తరచూ వస్తుండేది, మా అమ్మకు సాయానికి. మా అమ్మ తనని ‘పాప’ అని పిలిచేది. ఆమె ముఖం ఎప్పుడూ సరదాగా ఉండేది, నన్ను ఎప్పుడూ ఎత్తుకుని ఆడిస్తుండేది. ఇప్పుడేమో చెదిరిన జుట్టూ, ఏడ్చిన కళ్ళతో, ఏడవడం వల్లనో ఎవరో చేయిజేసుకోవడం వల్లనో ఉబ్బిన ముఖంతో దుఃఖ దేవతలా ఉంది. అంతలోనే ఒక ముగ్గురు యువకులు ఒకడ్ని తాళ్ళతో కట్టి గుంపులోంచి తీసుకుని వచ్చారు. పంచాయితీ ముందు నిల్చున్న ఆ యువకుడి ముఖంపై గాయాలే తప్ప చూపులో భయం లేదు. తీక్షణంగా ఉంది అతడి చూపు. ఆ యువకుడ్ని నేనెప్పుడూ చూడలేదు మా ఊర్లో. మా అమ్మ కూడా చూసినట్టులేదు, ఎందుకంటే ఆమె ముఖంలో ఆసక్తి గమనించా.
నాన్న ఆ యువకుడ్ని ఉద్దేశిస్తూ, ‘‘పొలం కూలీ పనులు చేసుకోవడానికి వచ్చినోడివి వచ్చినట్టుండక ఏంట్రా ఈ పనులు? ధైర్యం ఎక్కడ్నుంచొచ్చింది నీకు, కులం తక్కువ నా కొడకా?’’ అని గాండ్రించారు. ఆ గాండ్రింపుకి ఊర్లో అందరూ బిక్క చచ్చిపోయారు, మా అమ్మతో సహా. నాకు భయంతో ఏడుపొచ్చింది కానీ ఏడవాలన్నా భయం వేసింది. కానీ, ఆ యువకుడి కళ్ళలో భయం స్థానే, ఆశ్చర్యం. తను ఏం తప్పు చేశాడు అనో ఏమో.
అంతలో ‘పాప’వైపు నుంచి వచ్చింది సమాధానం. ‘‘నేను అతన్ని ఇష్టపడుతున్నాను’’, ‘‘నేను అతనితోనే ఉంటా, అతన్నే పెళ్ళి చేసుకుంటా’’ అని. ఆమె చెంప మీద చెళ్ళున ఒక దెబ్బ పడింది. పాప వాళ్ళ నాన్న చేయి విదిలించి ఆ యువకుడి వైపు అడుగేసింది. అందరి ముందూ ఒకటే చెప్పింది ‘‘వీడు నా మొగుడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. పెళ్ళి లేదు, తాళీ వద్దు. వీడ్ని నేను ఇష్టపడ్డాను, వీడ్ని నేను నమ్ముతున్నా’’ అని. అలా అని వాడిని తీసుకొని వెళ్ళిపోయింది అక్కడినుంచి.
గ్రామపెద్దలందరి ముఖాల్లోనూ నెత్తుటి చుక్క లేదు. పెద్దరికం అందరి ముందూ మంటకలసిపోయింది. రచ్చబండ రెండు నిమిషాల్లో ఖాళీ అయిపోయింది. ఒకే ఒక తీర్పుతో ‘వెలి’. వెలి వేశారు ఆ ఇద్దరినీ ఊరి నుంచి, మా అమ్మ ఊపిరి పీల్చుకుంది ఎంతో ప్రమాదం తప్పినట్టు. నాకైతే అప్పుడు అర్థం కాలేదు ఎందుకో. పెద్దల్ని ఎదిరించడం, ప్రేమించి పెళ్ళి చేసుకోవడం ఈ రెండిట్లో దేనికి శిక్ష పడిందో ఇప్పటికీ అర్థం కాలేదు. ఒక అమ్మాయి అందరి ముందూ తన ప్రేమని ఒప్పుకొని తను కోరుకున్నవాడు, తనని ప్రేమించిన వాడితో ఉంటానని చెప్పడం తప్పా?? ఇలా ఆలోచనలు సాగి సాగి ‘కాఫీ’ అని అమ్మ పిలిచిన పిలుపుకి ఆగాయి.
కాఫీ టేబుల్ దగ్గర నాన్న ఉన్నారు, నాన్నతోపాటు నాకు కాబోయే భర్త కూడా. నాన్న నవ్వుతూ మాట్లాడుతున్నారు. కాలం మారిందా? మనుషులు మారారా? కాలం అన్నిటినీ కలిపేసుకుపోయే గొప్ప అనంతవాహినా? కాలం మనిషి అహాన్ని అణచివేస్తుందా? ఇరవై సంవత్సరాలు సమూలమైన మార్పులైతే తేలేదు కానీ, సెన్సిబుల్ మార్పులనైతే తెచ్చిందా? రచ్చబండలూ, చచ్చుతీర్పులూ అటకెక్కాయా? లేదంటే మనిషి నిజంగానే హిపోక్రైటా? ఇలా సాగాయి నాలో బరువైన ఆలోచనలు. సడన్‍గా ఒక ముగింపుతో ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ముఖంపై విచారకమైన చిరునవ్వు. ‘‘మనం చేస్తే ఆదర్శం, మరొకరు చేస్తే అపరాధం’’.