పరిశోధన by Manas Krishna Kant

  1. ఆదర్శం by Manas Krishna Kant
  2. ఇది కథ కాదు by Manas Krishna Kant
  3. కడలి by Manas Krishna Kant
  4. A.ILU by Manas Krishna Kant
  5. తీరిన కోరిక by Manas Krishna Kant
  6. ఆకాశగంగ by Manas Krishna Kant
  7. కాలభ్రమణం by Manas Krishna Kant
  8. పాతబంగళా by Manas Krishna Kant
  9. రెక్కలగుర్రం by Manas Krishna Kant
  10. పరిశోధన by Manas Krishna Kant
  11. సింహావలోకనం by Manas Krishna Kant
  12. పరిష్కారం by Manas Krishna Kant

నేను కొత్తగా తెలుగు లిటరేచర్‍లో పీహెచ్‍డీ చేయడానికి జాయిన్ అయ్యాను ఈ యూనివర్సిటీలో. చిన్నప్పటినుంచీ తెలుగు భాషంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టం ఇంగ్లీషు రాకపోవడంవల్ల మాత్రంకాదు, ఎందుకంటే ఇంగ్లీష్ లిటరేచర్‍లో ఎమ్.ఎ ఇప్పటికే చేసేశా. తెలుగు లిటరేచర్లో ఇంకొక ఎమ్.ఎ అంటే డబుల్ ఎమ్.ఎ అన్నమాట. అయినా ఇప్పటికాలంలో ఎమ్.ఎలు రెండున్నా, మూడున్నా ఉపయోగంలేదనుకుంటా. ఐనా ఎందుకో అదొక తృప్తి నాకు- భాషంటే, భాషతోపాటు ప్రయాణం అంటే. అందుకే ఎమ్.ఎతో తీరదు నా దాహం అని చెప్పి పీహెచ్‍డీకి అప్లయ్ చేసుకున్నాను. అనుకున్నట్టుగానే ఈ యూనివర్సిటీలోనే వచ్చింది.
నేను పరిశోధన చేద్దామనుకున్నది సమకాలీనరచనలమీద, రచయితలమీద. చాలా సాహిత్యం వస్తోంది, తెలుగుగంగలో. మురికినీటిలా కలుస్తూనే ఉంది. రాసే ప్రతీదీ సాహిత్యం కాదన్నది నా భావన. సమకాలీన సాహిత్యం పేరుతో భాషని భ్రష్టు పట్టిస్తున్నారు. సంకరమైన భాషా, భావాలూ తెలుగు సాహిత్యాన్ని అగౌరపరచడమేకానీ, ముందుకు తీసుకెళ్ళలేవు. ఇలాంటి ఛాందస భావాలు… ఇలానే అంటున్నారు ఇప్పుడీ భావాల్ని… వున్న నేను ఈ టాపిక్ తీసుకోవడమే తప్పేమోనన్నంతగా చేశారు నా గైడ్. ఐనా ఎందుకో ఇదే టాపిక్‍మీద చేద్దామని వెదకడం ప్రారంభించా.
సరియైన, నాకు సరిపడే రచనల్ని, రచయితల్ని వెతుకుతూ గ్రంథాలయాలన్నీ తిరిగా, పుస్తకాల దుమ్ము దులిపా, కానీ నాకు కావాల్సింది దొరకలేదు. సమకాలీన రచనలకు వార్తాపత్రికలే కరెక్టనిపించింది. ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న మెయినె‌స్ట్రీమ్ పత్రికల్నుంచి మొదలుపెట్టా, అంతా కమర్షియల్ రాతలూ, లైఫ్ కోచింగ్ ఇచ్చే కథలూనూ. ఇలా కాదని సర్క్యులేషన్ తక్కువగా ఉన్నవీ, ఆఫ్‍బీట్ పేపర్లని వెదకసాగాను. రెండుమూడు సంవత్సరాలక్రితంవికూడా వెదికాను. లోపం నాలో ఉందేమో, సాహిత్యం విలువ నాకు తెలీదేమో, ఇంత మంది ఇన్ని రాస్తున్నా ఇంతమందికి నచ్చుతున్నా నాకుమాత్రం ఎందుకు నచ్చడం లేదు? నాకు నేను ఎక్కువగా ఊహించుకుంటున్నానా? దిగ్గజాలని, బెస్ట్‌సెల్లర్స్‌నుకూడా నేను ఒప్పుకోలేకపోతున్నానా? అహంకారమా? ఏమో!! ఇలా నా మానసికస్థితినీ, అస్థిత్వాన్నీ ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. లేదంటే పరిశోధన చేసేవారికి సహజంగా ఏర్పడే మానసిక వ్యధేనా ఇది? అయినా పరుగు ఆపలేదు
అప్పుడు తగిలింది కాలికొక చిన్నరాయిముక్క. మూడు సంవత్సరాలక్రితం పత్రికలో. ఆ పత్రిక ఉందనికూడా నాకు తెలీదు. దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం ప్రారంభించా. నేను చూసిన పత్రికే చివరి సంచిక. అప్పటితో ఆ పత్రికా ముద్రణ ఆగిపోయింది. కానీ, దానిలో ఒక కథ, ఒకేఒక్కటి కానీ తురుపుముక్క. నా యీ ప్రయత్నానికి ఫలితం ఉన్నదనిపించినంతలా ఉంది అది. ముందు సంచికల్లో వెదకసాగాను. ప్రతివారం ఒక కథ, ఒక్కటే కథ కానీ ప్రతిదీ అద్భుతం. ఎందుకు ఆ రచయిత ఈ పత్రికలోనే ఇచ్చేవాడు? అదే ప్రశ్నను పట్టుకుని పత్రికను ఆసాంతం చదవడం మొదలుపెట్టాను. దానిలో సంపాదకీయాలు సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర ఆలోచన చేసి రాసినట్టున్నాయి. పాపులర్ పాలసీలనీ, రాజకీయలబ్ధికి తీసుకునే విధాన నిర్ణయాలనీ ఎండగట్టాయి. అసలు మనిషిని, అతని జీవనఅస్థిత్వాన్ని, ప్రయోజనాన్ని విపులంగా వివరిస్తూ, ఒక్క ప్రకటనకూడా లేకుండా మానవపరిణామక్రమానికి దిక్సూచిలా ఉంది. ఒక్కొక్క సంచిక ఒక్కొక్క క్రొత్త ఆలోచనని, క్రొత్త దృక్కోణాన్ని ఆవిష్కరించేదిగా ఉంది. అప్పుడనిపించింది నేను ఎంచుకోబోయే రచనలు, ఈ రచయితవేనని. దానికోసం ఎంతవరకైనా వెళ్తానని.
ఆ పత్రిక రాజకీయకారణాలవల్లా, ఆర్థికనష్టాలవల్లా ఆగిపోయింది. ఆ ఎడిటర్‍ని కలసి ఆ రచయితగురించి తెలుసుకుందామనుకున్నా. అతను నాకు ఆ వివరాలవీ తెలియజేయలేదు. ఏమనుకున్నాడో మరి నన్ను చూసి. అప్పుడు పబ్లిషర్ దగ్గరకి వెళ్ళా. నా గురించీ, నా పరిశోధనగురించీ క్లుప్తంగాగాక, సుదీర్ఘంగా వివరించి, నా వివరాలను పూర్తిగా చెప్పి, నా ప్రయత్నాన్ని, దాని ప్రయోజనాన్ని విశదీకరించి, ఆ రచయిత వివరాలు చెప్పమని ప్రాధేయపడ్డాను. అలానే అతని ఇతర రచనలనూ, కథలనూ ఇవ్వమని అడిగాను. అవి తమవద్ద లేవనీ, ఏదైనా లైబ్రరీలో దొరకవచ్చని, నాకు తెలిసిన సమాధానమే చెప్పి, రచయిత వివరాలు ఇచ్చాడు.
నేను మొదట గ్రంథాలయాలలో అతని రచనలు తీసుకుని, ఫోటోస్టాట్ చేయించుకుని రచయిత దగ్గరకు ప్రయాణమవుదామనుకున్నా. అతను ఆ దిన పత్రిక మూసేసే ఆరు నెలల ముందునుంచిమాత్రమే కథలు పంపుతున్నట్టుంది. అంతకంటే ముందు ఆ పేరుతో కథలూ, కవితలూలాంటివి దానిలో ఏమీ లేవు. నా పరిశోధనకు ఆ కొంచెం సాహిత్యం సరిపోదు. పరిశోధన సమగ్రంగా, సమున్నతంగా పూర్తిచేయాలన్నది నా ఆశయం. అందుకు, ఇంక ఆ రచయితని కలసి తీరాల్సిందేనన్న నిర్ణయానికొచ్చాను.
అతని ఊరుకి బయలుదేరా. మామూలుగానే మానవనాగరికతకు దూరంగా విసిరేసినట్టుండే కొండప్రాంతం అది. అక్కడి పచ్చనికొండలమధ్య చిన్నలోయలాంటి ప్రదేశం. అక్కడే ఆయన ఉండేది. ప్రశాంతంగా ఒక చిన్న పెంకుటింట్లో. ప్రకృతి మధ్యలో, దాని ప్రశాంతతను, అందాన్నీ చెడకొట్టకుండా, ఆధునికతను అంటనివ్వకుండా ప్రేమతో కట్టినట్టుంది ఆ కుటీరం. అలా అనిపించింది నాకు. సామాను కొద్దిపాటిమాత్రమే, ఒక మనిషి తనంతట తాను జీవించడానికి సరిపోయినంత. అవికాక…
ఎటు చూసినా గుట్టలకొద్దీ పుస్తకాలు, మ్యాగజైన్స్, పత్రికలు ఉన్నాయి. నా రాకగురించి చెప్పా. నమ్మశక్యంకానట్టు చూసి, నవ్వి లోపలికి రమ్మన్నాడు. ముసలివాడుకాదు సరిగ్గా ముప్పయ్యైదైనా నిండిఉండవేమో అన్నట్టున్నాడు. మౌనంవల్ల ప్రశాంతతో, ప్రశాంతతవల్ల వచ్చిన మౌనమో తెలీదుగానీ, అది ముఖంలో దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆ అలౌకికానుభూతి, సడన్‍గా నాగరికతని చెప్పుకొనే గజిబిజి జీవితాన్నుంచి కాలుష్యం తెలియని పచ్చదనాన్ని చూశా? పిచ్చిగాలిని వదిలేసి పచ్చికపైరులనుంచి వీచే గాలి పరవశానివల్లా అర్థంకాలేదు. నేను చేయబోయే పరిశోధనమాత్రం చరిత్రలో నిలిచిపోతుందనిపించింది. ఇక్కడకూడా అహం.. నాకోసమే ఆలోచించుకుంటున్నా. ఆశ్చర్యకరంగా అతనిదగ్గర ఒక అధునాతనమైన కంప్యూటర్, ఇంటర్‍నెట్ కనెక్షన్‍తోసహా ఉంది. ఇంత సుదూరప్రాంతంలో నమ్మశక్యం కాకుండా ఉంది. కానీ, మనిషి తలచుకుంటే సాధ్యంకానిది ఏదీ ఉండదు, మనసుపెడితే మనిషి గంగనే భూమికి తీసుకురాగలడనిపించింది. గంగావతరణం కళ్ళ ముందు సాక్షాత్కారించింది.
ఇక ఆలస్యం చేయకూడదనిపించి, అతని మౌనాన్ని భగ్నం చేయడానికి ప్రశ్న సంధించా -ఎందుకు రాయడం ఆపేశారని.
రెండడుగులు వేసి ఎదురుగా మూసి ఉన్న గది తలుపుని లోపలికి చిన్నగా తోశాడు. గదంతా కాగితాలు, దస్తాలుగా కుట్టి ఉన్నాయి. బైండ్ చేసుకున్న పుస్తకాలు. అన్నిటి మీదా రచయితగా అతని పేరు. ఒక మనిషి జీవితకాలంలోకాదుకదా, పది జన్మలెత్తినా రాయలేనన్ని పుస్తకాలు దొంతరలుగా పేర్చి ఉన్నాయి ఆ గదిలో.
నావైపు చూస్తూ అన్నాడు “నేనెప్పుడూ రాయడం ఆపలేదు” అని. చదివే భాగ్యం మీకే లేదనే భావం ధ్వనించింది ఆ జవాబులో.