సింహావలోకనం by Manas Krishna Kant

  1. ఆదర్శం by Manas Krishna Kant
  2. ఇది కథ కాదు by Manas Krishna Kant
  3. కడలి by Manas Krishna Kant
  4. A.ILU by Manas Krishna Kant
  5. తీరిన కోరిక by Manas Krishna Kant
  6. ఆకాశగంగ by Manas Krishna Kant
  7. కాలభ్రమణం by Manas Krishna Kant
  8. పాతబంగళా by Manas Krishna Kant
  9. రెక్కలగుర్రం by Manas Krishna Kant
  10. పరిశోధన by Manas Krishna Kant
  11. సింహావలోకనం by Manas Krishna Kant
  12. పరిష్కారం by Manas Krishna Kant

దుమ్ము లేస్తోంది రోడ్డుమీద. చలికాలం ఉదయమే అయినా ఎండ తొందరగానే వచ్చేసింది. ఎండతోపాటు సైకిళ్ళూ, ఆటోలూ, బైకులమీద జనాలూ. ఆరోడ్డు వీధిలోంచి పోతోంది, అందువల్ల తారు వేయలేదు. వార్డుమెంబరు సిమెంటురోడ్డు అని బోర్డు రాయించి పెట్టాడు. సిమెంటు బోర్డులోనేగానీ, రోడ్డు మీద లేదు. రోడ్డుతోనూ, బోర్డుతోనూ సంబంధం లేనట్టు ఆ లేలేత ఎండలో, ఆ దుమ్ములోనే, చలికాలం ఉదయపు బద్ధకాన్ని సుఖంగా అనుభవిస్తోంది ఒక కుక్క. జీవితాన్నంతా అనుభవించేసి, ఎత్తుపల్లాలన్నిటినీ చూసేసినట్టు అర్థనిమీలిత నేత్రాలతో తన గతఘనవైభవాన్ని ఊహించుకుంటూ సేదతీరుతోంది. ముఖంమీద చిరునవ్వో, దాని ముఖంతీరే అంతోకానీ, చిద్విలాసంగా ఉంది. అది తన జీవితంలో జరిగిన సంఘటనలన్నిటినీ జ్ఞప్తికి తెచ్చుకుంటోంది.
దాని పుట్టుకే ఒక మురికికూపంలో. ఆ మురికి దాని తోబుట్టువులందరికీ అంటినా, దానికిమాత్రం అంటకుండా తల్లి జాగ్రత్తపడిందేమో పుట్టినప్పుడే. అలానే ఇప్పటివరకూ జీవితమంతా చెత్త అంటకుండా బ్రతికింది. తండ్రెవరో ఆ తల్లికే తెలియదేమో? లేదంటే తల్లులూ, తండ్రులూ, బాధ్యతలూ, బాంధవ్యాలూ పంచుకోవాల్సిన, తెలుసుకోవాల్సినంత బరువైన బతుకులు కావేమో వాటివి. అదంతా దానికి అనవసరం.
ఎనిమిదిమంది మొత్తం వాళ్ళు. తల్లి పాలిస్తూనే ఉంది మూడువారాలవరకూ. ఒకరోజు హఠాత్తుగా కారుకింద పడి చచ్చిపోయింది. బాధపడాలని తెలిసే వయసుకాదుగానీ, ఆకలికిమాత్రం అరవాలని తెలిసిన వయసు. ఆకలి అన్ని అపచారాలకూ మూలం అని అప్పుడే అర్థమయింది దానికి. దాని అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ, తోటివాళ్ళూ ఆకలిని తీర్చుకోవడానికి అనేక మార్గాలు చూసుకున్నారు. చెత్తకుప్పలు వారి మొదటి ఎంపిక. చాలా సులభంగా దొరుకుతుంది తిండి, కానీ ఆ దుర్వాసన, మురికి ఎందుకో దానికి నచ్చేదికాదు. అదిమాత్రం రోజూ ఒక మాంసం దుకాణం దగ్గర ఎదురుచూసేది రెండుసార్లు. ఆ కొట్టువాడు దాని జాలికళ్ళు, ఎండినడొక్క చూసి రెండుదుమ్ములు విసిరేవాడు. గిరాకీలేని రోజుల్లోమాత్రం కొన్ని మాంసంతో ఉన్న ఎముకలు వేసేవాడు. అలా అని అదేం చొంగకార్చుకుంటూ కూర్చునేది కాదు. రెండుమూడు నిమిషాలు దీక్షగా కూర్చునేది. తర్వాత ఇంక అక్కడ ఒక్కక్షణం ఉండేది కాదు. అలా అని చెత్తకుప్పలవైపు, చెప్పుముక్కలవైపు మనసుని మళ్ళనిచ్చేది కాదు.
కుక్కలలోకూడా నియమాలు పాటించేవాళ్ళుంటాయా అనిపించేది ఆ కొట్టువాడికి. వాడు దాని గుణం నచ్చి పెంచుకోచూశాడు. సుఖానికన్నా, స్వాతంత్య్రమే ముఖ్యమనుకున్నదో ఏమో వాడి దగ్గర ఉండలేకపోయింది. అలా అని పారిపోలేదు, వాడిని కరవలేదు. తిండి మానేసింది. దాని పంతం చూసి వాడే విడిచిపెట్టేశాడు. దానిలాగే ఉన్న దాని తమ్ముణ్ణి తెచ్చి కట్టేశాడు వాడింట్లో. అది చక్కగా తిని, మొరుగుతూ, ఇంటికొచ్చే వాళ్ళని బెదిరిస్తూ, దాని జులుం అది ప్రదర్శించేది. సాధారణంగా జులుం ప్రదర్శించేవే అన్ని కుక్కలూనూ, నడుస్తూ వెళ్తున్నవారి పైకి వెళ్తూనో, స్పీడుగా వెళ్తున్న స్కూటరు వెనక పరిగెత్తుతూనో, చిన్నపిల్లల్నో ముసలివాళ్ళనో జడిపిస్తూనో. కానీ, ఇది ఇహపరాలకూ అతీతంగా ప్రవర్తించేది. స్టోయిక్ ఫిలాసఫీని చదివినదా అన్నట్టుండేది దాని ప్రవర్తన. అన్నీ మన మంచికే, దేని వెనకా వెళ్ళకూడదు, అన్ని దుఃఖాలకూ కారణం కోరికలే అని బుద్ధుడు దీనికే మొదట చెప్పాడేమో అన్నట్టుగా జీవిస్తుంది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండేది.
దాని వయస్సులో ఉండేవన్నీ ఆకతాయిగా తిరుగుతూ, ఆడకుక్కల వెంటపడుతూ, వీధికుక్కల సంతతిని వృద్ధిపరుస్తూ, ఆకలికి చెత్తకుప్పలపైన పడుతూ, ఒళ్ళు తెలియకుండా బ్రతుకంటే భయం లేకుండా ఉండేవి. దాని తోటివెన్నో ఇలానే, వాటి ఆయుష్షు తీరకుండానే రోడ్లు దాటుతూనో, కార్లవెంట పడుతూనో చనిపోయేవి. లేదంటే కోలుకోలేనంత అవిటివి అయ్యేవి. ఇవన్నీ చూసేనా మిగతా కుక్కలు వాటిని అనుసరించకుండా ఉన్నాయా అంటే? లేదు…
ఈ కుక్కలో ఆలోచన. ఎందుకు? ఒక పని హానికరమైనదన్నా ఎందుకు చేస్తారు? అందరూ చేసేది ఎప్పుడూ కరెక్ట్ కాదనే విషయం తెలిసినా, పీర్ ప్రెజర్ వల్లా?? షేర్డ్ ప్రెజర్‌వల్లా?? ఎందుకు చేస్తారు, చస్తారు?? ఎందుకు అందరూ తనలాగ ఉండలేకపోతున్నారు? తను ఏమైనా కోల్పోయిందా ఇన్నిసంవత్సరాల జీవితంలో? కోల్పోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయా? కోల్పోయినదాని వెనకే పరుగెట్టవూ, ఆలోచనలన్నీ? మరెందుకు తనింత ఆనందంగా ఉంది? అన్నీ ఉన్నా అందరూ ఇంకా ఏదో కావాలని ఎందుకు ఆరాటపడుతున్నారు?? ఆ ఇంట్లో కట్టేసిన కుక్క తనకేం కావాలో తెలియక అక్కడుందా? అన్నీ తెలిసే అక్కడ చిక్కుకుందా?? ఆ పింక్‍కలర్ ఇంట్లో ఉన్న బొచ్చుకుక్క ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు చూస్తుంది బయటికి వచ్చినప్పుడు తనవైపు. అన్నీ తినేస్తూ రాజభోగాలూ అనుభవించే ఆ చివరింటి నల్లకుక్క లావైపోయి నడవలేకపోతూ రొప్పుతూ ముందుకుపోతుంది ఎప్పుడు వీధిలోకి తెచ్చినా. ఆ కుప్పమీద ఉన్న మచ్చలకుక్క కాలిరిగిపోయినా కార్ల వెనుక పరుగు మానదు. కాన్పుకి ఏడెనిమిది పిల్లల్ని కనే ఆ ఎర్రకుక్క చిక్కిశల్యమవుతున్నా కనడం ఆపదు. ఎందుకిదంతా? అసలు తనెందుకు ఇదంతా ఆలోచిస్తోంది? అసలు తనేం సాధించింది తన యీ జీవితంలో అనుకుంటూ సగం మూసి ఉన్న కళ్ళని పూర్తిగా మూసేసింది ప్రశాంతంగా, తన నవ్వు ముఖాన్ని పక్కకి ఒరిగిస్తూ.
అలా అక్కడ కళ్ళు మూసిన కుక్క మెదడు పొరల్లో నిద్రాణమై ఉన్న ప్రశ్నలని లేవనెత్తి, విశాలమైన విల్లాలో, స్విమ్మింగ్‍పూల్ పక్కన విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి జారుకున్న, నా కళ్ళు తెరుచుకునేలా చేసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *