ఇది కథ కాదు by Manas Krishna Kant

  1. ఆదర్శం by Manas Krishna Kant
  2. ఇది కథ కాదు by Manas Krishna Kant
  3. కడలి by Manas Krishna Kant
  4. A.ILU by Manas Krishna Kant
  5. తీరిన కోరిక by Manas Krishna Kant
  6. ఆకాశగంగ by Manas Krishna Kant
  7. కాలభ్రమణం by Manas Krishna Kant
  8. పాతబంగళా by Manas Krishna Kant
  9. రెక్కలగుర్రం by Manas Krishna Kant
  10. పరిశోధన by Manas Krishna Kant
  11. సింహావలోకనం by Manas Krishna Kant
  12. పరిష్కారం by Manas Krishna Kant
  13. దివ్యశక్తి by Manas Krishna Kant

ఎందుకో ఇన్నేళ్ళ తర్వాత తరచుగా గుర్తొస్తుంది తను. గుర్తొస్తోంది అంటే మరచిపోలేదనా? లేదంటే మరచిపోలేకపోయాననా? ఇన్నేళ్ళ తర్వాత అంటే ఆ టైమ్‍లో ఎందుకు గుర్తుకు రాలేదు? అసలు ఇన్నేళ్ళు ఎలా తన ఆలోచన రాకుండా గడపగలిగాను? సున్నితత్వాన్ని కోల్పోలేదని నేను గీసిన కళాఖండాలే చెబుతున్నాయి. మరెలా గడిపాను ఈ జీవితాన్ని తన ఆలోచనలు రాకుండా? లేదంటే తన ఆలోచనలతోనే ఈ కళాఖండాల సృష్టి జరిగిందా? తన ఆలోచనలనెప్పటికీ విడిచి వెళ్ళలేక ఇలా నా గీతల రూపంలో, రంగులద్దుతోందన్న మాట నా జీవితానికి. అయినా సరే ఇప్పుడు గుర్తొస్తున్నది నాకు సబ్‍కాన్షియస్‍గా కలల రూపంలోనో, కళల రూపంలోనో కాదు, కాన్షియస్‍గా. బహుశా నేను తన సాన్నిహిత్యాన్ని, సహచర్యాన్ని, సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నా బలంగా. ఇలా అనుకోగానే మనసు పదిహేనేళ్ళ వెనక్కు దూకింది నన్నూ, నా ఆలోచనల్నీ తనతోపాటు తీసుకొని మరీ. ఆరోజు మా స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. నేను ఐదో తరగతనుకుంటా, ఇంకా నిక్కర్లే అప్పుడు. మూడో వరసలో మా అమ్మ, నాన్న పక్కన కూర్చున్నా. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. వ్యాస రచన, వకృత్త్వం, పెయింటింగ్, సింగింగ్, క్విజ్ ఇలా అనేక బహుమతులిస్తున్నారు. అన్నిట్లోనూ ఒకే పేరు మాత్రం తప్పనిసరిగా వినిపిస్తుంది. వినిపించిన ప్రతీసారీ ఆ అమ్మాయి ముఖం కనిపిస్తుంది స్టేజీపై అందంగా. అన్ని లైట్ల వెలుగులో నాకు ఏదో సినిమా స్టార్ ని చూసినట్టనిపించింది ఫోటోగ్రాఫర్ ఫ్లాష్‍లైట్ల వెలుగులోలాగా.
ఆ చిరునవ్వు నన్ను బంధించేసింది. ఒక ఆరాధనా భావం మొలకెత్తింది ఆమెపై. నేను ఆ సంవత్సరమే స్కూల్లో జాయిన్ అయ్యా, ఆ అమ్మాయి మా క్లాస్ కాదని తెలుసు తప్ప, ఏడో తరగతని క్లాస్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినప్పుడు మాత్రమే తెలిసింది. తనను అభిమానించడం మొదలుపెట్టా. తనకి నేను తెలియకుండానే, ఆరాధించడం అలవాటు చేసుకున్నా. తన ముఖంలో ఎప్పుడూ ఏదో కాంతి, ఆత్మవిశ్వాసం అంటే ఇలానే ఉంటుందేమో. అదే ఆ అమ్మాయిని ఇంకా అందంగా కనబడేట్టుచేస్తుందేమో. ఆమెను చూస్తుంటే ఏదో తెలియని వింత భావన, ఆ బావన ఎంత బలమైనదంటే, నేను నా క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేటంత. ఏమో ఆ భావనని నేను అలానే అర్థం చేసుకున్నా. ఆమెలానే అవ్వాలని always want to emulate her అదో రకమైన దైవీయమైన భావన అది. ఆ పరిస్థితుల్లో ఉంటేనే తప్ప అనుభవించలేనిది. తను యథావిధిగా టెన్త్ క్లాస్ స్కూల్ ఫస్ట్, జిల్లా కూడా అదే ఫస్ట్ మార్క్ అనుకుంటా. ఇంటర్‍కి వేరే కాలేజీకి వెళ్ళిపోయింది. కానీ, తనని నేను మర్చిపోలేదు. తన అడుగుజాడల్లోనే నేను కూడా టెన్త్ స్కూల్ ఫస్ట్ వచ్చా. కానీ, ఆమెలా మిగతా కార్యక్రమాల్లో అంటే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‍లో అంతగా నన్ను నేను నిరూపించుకోలేకపోయా. ఒక్క డ్రాయింగ్, పెయింటింగ్ తప్ప. కానీ, నాకు బాధ ఎప్పుడూ కలగలేదు, ఆమెమీద నాకున్నది అసూయ కాదు, ఆరాధన. తను మా కాలనీలో ఉండేది, మా స్కూలు మా వీధి చివరే ఉండేది. నడిచే వెళ్ళేవాళ్ళం దగ్గర కాబట్టి, తను నడుచుకుంటూ ముందు వెళ్తుంటే తన అడుగుజాడల్లోనే, తన నీడలోనే నడవాలనిపించేది, మనసెప్పుడూ మృదువుగా మ్రోగేది తన నవ్వులు విన్నప్పుడు.
తన ఇంటర్‍కూడా పూర్తయింది. అక్కడా మంచి ర్యాంక్, కానీ వాళ్ళ నాన్న తనని మా సిటీలోనే పెద్ద పేరున్న కాలేజీలో చేర్పించారు. ఇంటినుంచే వెళ్ళిరావచ్చనీ, తమకీ ఒకే కూతురు కావడంవల్ల తనని విడిచిపెట్టి ఉండలేమనీనూ. ఇంజినీరింగ్‍లోనూ తనకి ఇష్టమైన బ్రాంచ్ తీసుకుంది. కాలేజీలో కూడా సెమినార్లూ, వర్క్ షాపులూ, ప్రాజెక్ట్ వర్కుల్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి దీటుగా పాల్గొనేది. బహుశా తనని చూసే నేనుకూడా ఇంటర్ లో ఎంపిసి తీసుకుని వుంటా. తర్వాత ఇంజినీరింగ్‍లో మంచి ర్యాక్ వచ్చినా, తన కాలేజీలోనే చేరా. కానీ, ఇంజినీరింగ్‍లో చేరాక ఇబ్బంది పడ్డా. నేను కేవలం తన కోసమే ఎంచుకున్నాననిపించింది, కానీ నా మనసెందుకో ఇందులో ఇమడడానికి ఇష్టపడడం లేదు. తనని ఆరాధిస్తా కానీ, నన్నునేను హింసించుకోలేనేమో అనిపించింది. అదే ఇంట్లో చెప్పా, రెండు సంవత్సరాల ఇంజినీరింగ్ తర్వాత ఇలా అనిపించడం కరెక్ట్ కాదని, పూర్తి చేసిన తర్వాత ఏదన్నా చేసుకోమనీ సలహా ఇచ్చారు ఇంట్లో. నా సెకండియర్ అయిపోతుంది. తనకి కేంపస్ సెలక్షన్ లో చాలా మంచి కంపెనీలో, మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందని తెలిసింది. ఎలాగైనా తనతో ఒకసారి మాట్లాడాలనుకున్నా. వెళ్ళి కలిశాను కంగ్రాట్యులేషన్స్ చెప్పడానికి. కంగ్రాట్స్‌‍తో పాటు తను నాకు చిన్నప్పటినుంచీ ఏ విధంగా స్ఫూర్తినిచ్చిందో కూడా చెప్పా. విస్మయంతో చూసింది, తన కళ్ళలో ఒక మంచి మెరుపు. ఆ మెరుపుని నేనెప్పటికీ మరచిపోలేను. తర్వాత నా నిర్ణయాన్ని గురించి చెప్పా, ఇంజినీరింగ్ డిస్‍కంటిన్యూ చేసేస్తా అని, ఫైన్ ఆర్ట్స్ చేద్దామనుకుంటున్నాననీ. అదే నేను ఇన్నేళ్ళలో తనతో మొదటిసారి మాట్లాడటం. కానీ, ఎప్పటినుంచో పరిచయం ఉన్న వ్యక్తుల్లా మాట్లాడుతూనే ఉన్నాం ఇద్దరమూ. కొత్తగా అనిపించలేదు. చివరగా తనని అడిగా ఒక్కసారి మా ఇంటికి వచ్చిన మా నాన్నని ఒప్పించమని. నేను ఫైన్ ఆర్ట్స్‌లో చేరేలాగా. ఎందుకంటే చిన్నప్పటినుంచీ ఒకే వీధి కావడం మూలన, ఆమె ఒక చిన్న సెలబ్రిటీ మా వీధిలో. ఆమె నుంచి సలహాలూ, సూచనలూ తీసుకునేవారు పిల్లలూ, వాళ్ళ తల్లితండ్రులూనూ. ఆమె చెప్తే వింటారన్న ఆశతో అడిగా తనని. ఆమె సరేనంది. ఆమె మాటవిని మావాళ్ళూ సరేనన్నారు. కలగా మిగిలిపోతుందేమో అనుకున్నది, కలలా జరిగిపోయింది. ఆర్ట్స్ కోర్స్ చేయడానికి మూడేళ్ళు ముంబయి వెళ్ళాను. ఇష్టమైన పని చేస్తే కాలంతో పాటూ, మనల్ని మనమే మరచిపోతాం అనడానికి ఇదే నిదర్శనం. మూడేళ్ళూ ఎన్నో నేర్చుకున్నా, కొత్త పద్ధతులూ, విధానాలు లాంటివి చిత్రలేఖనంలో, మోడర్నసమ్, క్లాసికల్, ఎబ్స్ ట్రాక్ట్, ఇంకా అనేక రకాలైనవి. ఆ నేర్చుకోవడంలో నిమగ్నమైపోయి నేనే ఒక కళగా మారిపోయా. చూసేదీ, చేసేదీ కళాత్మకంగా మారిపోయింది. కళను నానుంచీ, నన్ను కళనుంచీ వేరు చేయలేనంతగా పెనవేసుకుపోయాయి. ద్వైతం లేదు, అంతా అద్వైతమే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను, గత కొద్దికాలంగా తన జ్ఞాపకాలతో సతమతమవుతున్నా. అందుకని, ఇంక లాభం లేదనుకుని తనని కలవడానికి బయలుదేరా. మూడేళ్ళ కోర్సూ, మరో మూడేళ్ళ స్టూడియో స్థాపన తర్వాత జరిగిన ఈ పరిణామం కొత్తగా అనిపించింది. ఆరేళ్ళ తర్వాత ఆమెను కలుస్తున్నాననే భావన, చిన్నప్పుడు ఏన్యువల్ డేలో కలిగిన భావనలా అనిపించింది. మనస్సులో ఒక మలయసమీరం కదులుతున్నట్టు. మంద్రమైన వీణాగానం చేస్తున్నట్టు ఉంది. ఫ్లైట్ లాండయ్యింది. బుక్ చేసుకున్న కారుని కలక్ట్ చేసుకొని డ్రైవ్ చేసుకొని వెళ్ళాను మా ఇంటికి మొదట. నా నిర్ణయాన్ని తప్పుబట్టిన నాన్న అప్పటిలా లేరు, బహుశా నా పేరు తరచూ పత్రికల్లోనూ, న్యూస్ లోనూ కనిపిస్తుండటం వల్లనేమో. అమ్మ ఎప్పుడూ అలానే ఉంది నా గురించి గొప్పగా ఫీలవుతూ. నాన్నే మొదలుపెట్టారు.
“ఆ రోజు ఆ అమ్మాయి చెప్పబట్టి గానీ, లేదంటే నువ్వు కూడా ఏదో ఒక ఐటి కంపెనీలో నిక్కుతూ, నీలుగుతూ ఉండేవాడివేమోరా, ఐదు రోజులూ ఎద్దుల్లా కష్టపడుతున్నారు, చివరి రెండు రోజులూ వీకెండ్స్ అంటూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. జీవితమంటే ఏంటో మాత్రం మరిచిపోయినట్టున్నారు. ఏదో చిన్న గుమాస్తాగా గవర్నమెంటు ఆఫీసులో పనిచేసినా, నాకు ఎప్పుడూ లోటు అనిపించలేదు. ఎక్కువ కావాలనిపించలేదు. ఏమో నేను అంత యాంబిషస్ కాదేమోలే. అయినా నీవు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తోందిరా? ఆ అమ్మాయికి రుణపడి ఉన్నావు నువ్వు. కానీ, ఆ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తోంది. కేంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి, జాబ్‍లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ నాన్న పెద్ద సంబంధం అని చెప్పి, ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్‍కే ఇచ్చి చేశారు. ఎప్పుడూ తుళ్ళుతూ, చెరగని నవ్వుతో ఉండే ఆమె ముఖం పెళ్ళయిన మూడేళ్ళకే కళ కోల్పోయింది. వాళ్ళింటికొచ్చినప్పుడు చూశాను, పలకరింపుగా నవ్విన నవ్వులోకూడా జీవం కనిపించలేదు. తర్వాత రెండేళ్ళకి పాప పుట్టింది. పాప పుట్టిందన్న ఆనందం ఆమె ముఖంలో కనిపించింది. తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ పుట్టింటికెప్పుడూ రాలేదు. ఎలా ఉందో తెలియదు. కానీ తనని చూసిన చివరిసారి మాత్రం, ఇక ముందు జీవితం ఎలా ఉండబోతోందో అర్థమయింది, అలా ఉండకుండా ఉంటే బాగుండునని కూడా అనిపించింది. తర్వాత ఇంక మరచిపోతే మంచిదనిపించింది. ఇప్పుడు నువ్వు వచ్చాక మళ్ళీ గుర్తుకొచ్చింది తను” అన్నారు.
నాన్న ఇంత చెప్పాక, తనని ఎలాగైనా కలవాలనిపించింది, కలిసి నేను ఎలా ఉన్నదీ చెప్పి, ఇలా ఉండడానికి కారణం తనే అని చెప్పాలనిపించింది. బయలుదేరా, తను పని చేసే కంపెనీ తెలుసుకొని, అక్కడికి వెళ్ళా. తన గురించి అడిగా రిసెప్షన్‍లో, రూమ్ నెంబర్ చెప్పి వెళ్ళమంది. డోర్ నాక్ చేసి, తన “కమిన్”’’ కోసం ఎదురుచూస్తున్నా. రెండు నిమిషాల తర్వాత వినిపించింది, నేను ఊహించినట్టుగా లేదు తన ముఖం. నేననుకున్నట్టు ఒంటరిగా కూడా లేదు. ఒకతను ఒక పాపని ఎత్తుకుని ఉన్నాడు. ముఖం అప్పుడే కోపం నుంచి తేరుకుని ఉంది కానీ, క్రోధాన్ని కప్పిపుచ్చలేక బుసలు కొడుతున్నట్టుంది అతని ఊపిరి. పిల్లని సుతారంగా ఎత్తుకోవలసిందిపోయి, గట్టిగా పట్టుకొని నలిపేస్తున్నట్టుంది, ఆ పిల్ల ముఖంలో అసౌకర్యం. తలుపు తోసిన నన్ను తేరిపార చూసి, తనని ఒకసారి చూసి పాపని ఎత్తుకొని వేగంగా నడిచాడు తలుపువైపు. అతను వెళ్ళడానికి తోవ ఇచ్చి తలుపు అతని వెనక వేసేసి నెమ్మదిగా వచ్చి కూర్చున్నాను తనకెదురుగా ఉన్న కుర్చీలోకి. గడ్డంతో ఉన్నాను, కళ్ళద్దాలు కూడా వచ్చాయి, గుర్తుపట్టలేదనుకుంటా నన్ను. తను కూడా పెద్దరికం వచ్చేసినట్టయిపోయింది. ముఖం వాడిపోయి ఉంది కానీ, ఎలిగెంట్ గానే ఉంది. కానీ, కళ్ళలో చిన్న ఎర్రజీర, అది ముఖంమీదకూడా పాకి జీరలా కాకుండా బాధగా మారినట్టుంది. చిత్రకారుడిని అయిన నాకు ఇదెంతో విషాదభరిత చిత్రంగా అనిపించింది. కానీ, దాన్ని దాచేసి, కృత్రిమ చిరునవ్వుని ముఖానికద్దేసి నా పేరు అడిగింది. చెప్పగానే ఆశ్చర్యం ఇంతకుముందున్న బాధ స్థానంలో కొంత ఆనందం చేరినట్టయింది. ఆ ఆనందం కళ్ళలోకి చేరి, ఆ ఎర్రజీర కొంచెం తెల్లబడింది. నేను నా గురించి చెప్పి, ఇదంతా తన వల్లనే అనీ, మా నాన్నకూడా అదే ఇప్పటికీ చెబుతున్నాడనీ చెప్పి కృతజ్ఞత తెలిపాను, తెచ్చిన పూల బొకే అందిస్తూ. అలాంటి సానుకూల మాటల్ని ఇప్పటివరకూ మరచిపోయినదానివల్లే, చాలారోజుల తర్వాత ఇదే మొదటిసారి విన్నదానిలా ఆనందించింది. కోల్పోయిన తన సానుకూల దృక్పథాన్ని తలచుకొనా, లేక ఇప్పుడు విన్న కృతజ్ఞత వల్లనో తెలీదు కానీ, ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. లేచింది సీట్లోనుంచి, కళ్ళు తుడుచుకుని కాఫీ తాగడానికి వెళ్దామననట్టు సైగ చేస్తూ. లేచా, తను ముందు నడుస్తుంది, వెనుక చిన్నప్పటిలాగే, అడుగులో అడుగువేస్తూ నేనూ నడిచా. క్యాంటీన్ చాలా బాగున్నట్టు అనిపించింది, ఏమో తను ఉండడంవలన అయి ఉంటుంది. కాఫీ కూడా బావుంది. ఏం మాట్లాడడం లేదు తను. కాఫీ కప్పులోకి చూస్తుంది ఏదో అగాథంలోకి తొంగి చూస్తున్నట్టు. ఎన్నో చెప్పాలనుకుంటున్నట్టు అనిపించిందేమో తనకి, కానీ చెప్పకుండా ఉండాలని అనుకుంటున్నట్టుంది ఆమె శరీరం. నేనూ ఏం మాట్లాడలేదు. ఆమె కప్పులోకి చూస్తోంటే నేను ఆమె వైపే చూస్తున్నా. కాఫీ అయిపోయింది. తను లేచింది నావైపు చూసింది. నేనూ లేచా. ఆమె వెనకే నడుచుకుంటూ వెళ్ళా. ఆమె తన కేబిన్ వైపుకి తిరిగింది. వెనక్కి తిరుగుతుందేమో అనుకున్నా కనీసం వీడ్కోలు చెప్పడానికి. కేబిన్ డోర్ తెరుచుకుంది. ఇక నాకు అర్థమైంది. నేను వెనక్కి తిరిగాను ఎగ్జిట్‍వైపు, అడుగులు త్వరగా పడ్డాయి కారు డోర్ వైపుకి. కానీ నేను గమనించకపోలేదు మూసుకొంటున్న కేబిన్ తలుపు సందులోంచి నావైపు తను చూసిన చూపును. తెరిచిన కారు డోరు మూసుకుంది. నా అడుగు మళ్ళీ కేబిన్ వైపుకి పడింది.