హాస్యసభ by S Sridevi

మిట్టమధ్యాహ్నం వంటిగంటకి బైక్‍మీద తీసుకొచ్చి అన్విని పుట్టింట్లో దింపేసి వచ్చినవాడు వచ్చినట్టే బైక్ రివర్స్ తీసుకుని వెళ్లిపోయాడు సాకేత్, “మీ అమ్మాయికి కాస్త సభ్యతా, సంస్కారం నేర్పండి” అంటూ. లోపలికి రమ్మన్న లీల మాటకూడా వినిపించుకోలేదు.
“ఏమైందే?” అని ఆమె అడుగుతునే వుంది, చెప్పులు చెరోమూలకీ తన్నేసి, దబదబ నడుస్తూ తనగదిలోకి వెళ్ళి తలుపేసుకుంది అన్వి. మరో రెండునిముషాలకి భర్త సంతోష్ దగ్గర్నుంచీ ఫోను, లీలకి.
“అన్వి వచ్చిందటకదా? దాన్ని యిప్పుడేం అడక్కు. నేనొచ్చి కనుక్కుంటాను” అన్నాడు.
“అసలు అడగడానికేమైనా సందిచ్చిందా? రాగానే గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది” అంది లీల.
“సర్లె…” అతను ఫోను పెట్టేసాడు.
కాలింగ్‍బెల్ మోగింది. వెళ్ళబోతుంటే ఆమెని దాటుకుని వెళ్ళి తలుపుతీసి, జొమాటో డెలివరీ తీసుకుంది అన్వి. “అన్నం తినచ్చుకదే?” అంది లీల. అసలామాటే వినిపించనట్టు మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. ఏమిటో, యీ పిల్ల… అక్కడేం గొడవ పెట్టుకుని వచ్చిందో! లీల చిన్నగా నిట్టూర్చింది. ఇంకోగంటకి సంతోష్ వచ్చాడు. ఫ్లాట్‍ముందు నిలబడి ఫోన్‍చేసి చెప్పినట్టున్నాడు, సరిగ్గా బెల్ మోగే సమయానికి గది తలుపులు తెరిచింది అన్వి. తలుపులన్నీ మూసేసి వున్న ఏసీ గదిలో ఆ తెప్పించుకున్న తిండేదో తినడంతో గుప్పుమని మసాలావాసన కొట్టింది.
“ఇదో, కిటికీ తెరిచి, కాస్త రూం ఫ్రెషెనర్ కొట్టు” అన్నాడు సంతోష్. నిశబ్దంగా వెళ్ళి ఆ రెండుపనులూ చేసి వచ్చింది లీల. తండ్రీకూతుళ్ళు వెళ్ళి మరో బెడ్‍రూమ్‍లోకి వెళ్ళి కూర్చున్నారు. “నువ్వూ రా! మళ్ళీ నీకు తెలీకుండా ఏవో చెప్పేసుకున్నామని ఏడ్చుకుంటావ్” అన్నాడు. కిసుక్కుమని నవ్వింది అన్వి. వాళ్లకి అవి హాస్యాలు. తను ఎంజాయ్ చెయ్యదని మళ్ళీ ఆక్షేపణ. వెళ్ళి కూర్చుంది.
“ఏమైంది తల్లీ?” అడిగాడు సంతోష్ కూతుర్ని లాలనగా.
“మా పంప్‍కిన్ పుట్టినరోజు నాన్నా, ఈవేళ…” అంది అన్వి. పంప్‍కిన్ అంటే ఆ అమ్మాయి ఆడబడుచు. పేరు అర్చన. అనారోగ్యకారణాన్న బాగా లావెక్కింది పిల్ల. అలాగే లావుగా వుండే అబ్బాయిని వెతికి పట్టుకుని అతికష్టమ్మీద పెళ్ళిచేసారు. వాళ్ళిద్దర్నీ చూస్తే ఈ తండ్రీకూతుళ్ళకి హేళన. జోక్సేసుకుని నవ్వుకుంటారు. లీలకి అలాంటివి నచ్చవు. అరటిపండు తొక్కమీద కాలేసి జారిపడ్డాన్నీ, కమీడియన్ని వంగోబెట్టి వెనకని తన్నడాన్నీ హాస్యంగా చలామణీ చేసినప్పుడే హాస్యానికీ అపహాస్యానికీ మధ్యనుండే గీత చెరిగిపోయింది. చాలామంది విషయంలో. లీలకి కాదు. దాన్ని కూతురికి చూపించడంలోనే విఫలమైంది.
“రెండు గుమ్మడికాయల్నీ నిన్నే దొర్లించుకుని వచ్చేసారు నాన్నా! కార్లోంచీ వాళ్ళు దిగుతుంటే చూడాలీ….” అని పకపక నవ్వుతోంది అన్వి. సంతోష్‍కూడా శృతికలిపాడు.
“తప్పుకదు అన్వీ! వాళ్లకేవో ఆరోగ్యసమస్యలున్నాయి. నవ్వడం దేనికి?” ఆగలేక, అసహనాన్ని అణచుకుంటూ అంది లీల.
“మీ అమ్మకి మొహం మాడ్చుకోవడం తప్ప, నవ్వడం రాదులేవే… చెప్పు… తర్వాతి తమాషా ఏంటో” అన్నాడు సంతోష్ వుత్కంఠగా.
“మా అత్తగారు కూతురికోసం నాలుగువేలు పెట్టి డ్రెస్ కొంది నాన్నా! అది ఆమెకి ఎక్కలేదు. బలవంతంగా ఎక్కించేసరికి…” అంటూ ఆపి, మళ్ళీ నవ్వసాగింది. ముళ్ళమీద కూర్చున్నట్టనిపించింది లీలకి.
“… అది ఫర్రుమంది… వాళ్ల ముఖాలు చూడాలి… నాకు నవ్వాగలేదు. నవ్వానని సాకేత్‍కి కోపం వచ్చింది” అంది నవ్వాపకుండా అన్వి. అప్పటికి జరిగిన విషయం బయటపడింది. వాళ్ళకి కోపాలొచ్చాయి. నిజమే. తమని అపహాస్యం చేస్తే ఎవరికేనా అంతే. అది చెప్పినా సంతోష్‍కి అర్థం కాదు. తామిద్దరూ సమాంతరరేఖల్లాంటివారు. పెళ్ళి అనే దృగ్దోషంవలన కలిసినట్టు కనిపిస్తున్నారుతప్ప నిజంగా తామిద్దరి అభిప్రాయాలూ కలిసింది లేదు. తన కూతురే ఐనా అతని చేతి పెంపకపు పిల్ల అన్వి. ఇంక ఆమెకేం చెప్తుంది?
“దగ్గొస్తే దగ్గుతాం, తుమ్మొస్తే తుమ్ముతాం. నవ్వొస్తే నవ్వుతాం. వాళ్ళిద్దర్నీ చూస్తే ఎవరికేనా నవ్వొస్తుంది. కోపం దేనికి? హాస్యం తెలీని మనుషులు” అన్నాడతను.
“నేనింక అక్కడికి వెళ్లను నాన్నా! సాకేత్‍కి అంత కోపం దేనికి? వాళ్ళకి ఫన్నీగా అనిపించినప్పుడు వాళ్ళుమాత్రం నవ్వరా? నాకు అనిపించి నేను నవ్వితే తప్పా? అతనికి నాకన్నా వాళ్ళెక్కువా?” అంది అన్వి కోపంగా. తన నిర్ణయం చెప్పేసింది.
“ఉండిపో. వాళ్ళే కాళ్లబేరానికి రావాలి” బలపరిచాడు తండ్రి. లీల లేచి నిలబడింది.
“ఎక్కడికి?” అడిగాడు.
“పకోడీలు వేసి తీసుకొస్తాను. సెలబ్రేట్ చేసుకుందాం” అంది.
అతను కోపంగా చూసాడు. “నేనూ జోక్ చేసాను” వెళ్ళిపోయింది అక్కడినుంచీ. వెనుకనుంచీ ఇద్దరి నవ్వులు వినిపించాయి. ఏదో కామెంట్ చేసుకున్నట్టున్నారు. తనమీదో వాళ్లమీదో.


అన్వి వచ్చి అప్పుడే నెలౌతోంది. అట్నుంచీ మాటా పలుకూ లేదు. లీలకి లోలోపల కంగారుగా వుంది. అల్లుడితోటో వియ్యపురాలితోటో మాట్లాడాలని వుంది, మాట్లాడాగలదుకానీ, సంతోష్‍కి తెలిస్తే వప్పుకోడు. తెలీకుండా చేస్తే బయటపడ్డాక వ్యవహారాన్ని మరింత జటిలం చేస్తాడు. అందుకు ఆగిపోయింది.
“చట్టాలు మారిపోయాయి. అన్నీ ఆడపిల్లలవైపే వున్నాయి. ఏమనుకుంటున్నాడో!” అని మండిపడుతున్నాడు అతను. లాయర్ని కలిసివచ్చాడు.
“కొంచెం ఆలోచించండి. పిల్లవాడు నచ్చాడనేకదా, చేసాం? పెళ్ళిచూపులప్పుడు అర్చనకూడా వచ్చింది. ఈ వెక్కిరించేదేదో అప్పుడే వెక్కిరించేసి వుంటే వాళ్ళే మన సంబంధం వద్దనేసేవారు. కానీ అలా చెయ్యలేదు. అది హాస్యంకాదు, మొహంమీద నవ్వడం తప్పని మీకూ, దానికీ తెలుసును. అతని వొడ్డూపొడుగూ, వుద్యోగం, ఆస్తీ అన్నీ చూసి సంబంధం ఎక్కడ తప్పిపోతుందోనని ఆరాటపడిపోయారు. నాలుకని అదుపులో వుంచుకున్నారు. అదే అదుపు ఇప్పుడు అక్కర్లేదా? వాళ్ల పిల్లని హేళనచేస్తే ఎందుకు వూరుకుంటారు?” అంది నచ్చజెప్తున్నట్టు.
“చూడు, ఇష్టమో, కష్టమో చేసుకున్నానుకాబట్టి ఎంత ముఖం ముడుచుకుని వున్నా నిన్నంటే నేను భరిస్తున్నాను. నవ్వొక వరం. రుబ్బుడుపొత్రాల్లా దొర్లుతూ నడిచేవాళ్ళని చూసి నవ్వకుండా ఎవరూ వుండరు. అతని చెల్లెలుకాబట్టి నవ్వకుండా బిగుసుకుని కూర్చుంటాడు. దానికేం ఖర్మే, నవ్వూ సరసం తెలీని మనిషితో కలిసి బతకడానికి? సరే, నువ్వన్నట్టు అది హాస్యంకాదు, వాళ్లకి కోపం తెప్పించింది. ఐతే? కనీసం ముందుగా చెప్పనేనా చెప్పకుండా తీసుకొచ్చి వదిలేస్తాడా? ఎలా వుందో ఏమిటోనని ఒక్కసారేనా అడిగాడా? దీనిది అవమానం కాదా? తప్పని దీనికి చెప్తున్నావు, అతనిది తప్పుకాదా?” అరిచాడు.
“పాతికలక్షలు ఖర్చుచేసి పెళ్ళిచేసాం. తెగతెంపులకోసమా?”
“యాభైలక్షలు కక్కిస్తాను”
“ఆ తర్వాత?”
అతను కొద్దిగా తడబడ్డాడు. “మళ్ళీ పెళ్ళిచేస్తాను. ఎందరు చేసుకోవట్లేదు?”
“అక్కడ మరో విషయం దొరుకుతుంది నవ్వడానికి. మీరిద్దరూ హాస్యచతురులుకదా? అప్పుడు?” అడిగేసి వెళ్ళిపోయింది లీల. చాచిపెట్టి చెంపమీద కొట్టినట్టైందతనికి.
అన్వి అక్కడే వుంది. తల్లిదండ్రులమధ్య జరిగిన సంభాషణ వింది. తనని వదిలిపెట్టి వెళ్ళాక ఇప్పటిదాకా సాకేత్ ఒక్కసారికూడా ఫోన్ చెయ్యలేదు. మొదట్లో వున్న కోపం తగ్గి, తనే చెయ్యబోయింది. రెండుసార్లు చేస్తే కట్ చేసేసాడు. వాట్సప్ మెసేజి పెట్టింది. బ్లాక్ చేసాడు. అతను నవ్వుతూ తిరిగే మనిషే. అతనికి ఎప్పుడూ ఇంతకోపం రాలేదు. అర్చనంటే అంత యిష్టమా? అత్తగారు వెనకనుంచీ ఎగేస్తోందా? దానివలన ఆవిడకి లాభమేమిటి? కొడుకు జీవితం పాడౌతుందికదా? అర్చన బావుంటే చాలా, వాళ్ళకి? ఇప్పుడింక చెయ్యాల్సినదేమిటి? తండ్రి అన్నట్టు విడాకులు తీసుకోవడమేనా? పెళ్లై ఏడాది కాకుండానే? కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి. తలొంచుకుని వొళ్ళో చేతులు పెట్టుకుని కూర్చుంది. ఆమెనలా చూడగానే సంతోష్ మనసు ద్రవించిపోయింది. భార్యమీద కోపంకూడా వచ్చింది.
“అమ్మ మాటలు పట్టించుకోకు అన్వీ! ఒకసారి జరిగిందని రెండోసారికూడా అలానే జరుగుతుందా? అన్నీ నేను చూసుకుంటాను” అనేసి వెళ్ళిపోయాడు. ఆమె లేచి తల్లిదగ్గిరకి వెళ్ళింది. బాల్కనీలో కూర్చుని పేపరు చదువుకుంటోంది లీల.
“అమ్మా!”అంది నెమ్మదిగా.
“ఏమిటి?” కటువుగా అడిగింది లీల. తల్లిని అలా ఎప్పుడూ చూడలేదేమో, తీవ్రంగా గాయపడింది అన్వి.
“పెళ్ళిచేసుకున్నందుకు ఒకళ్ళో ఇద్దరో పిల్లలని కంటాం. అన్ని కోరికలూ, సరదాలూ పక్కన పెట్టి పెంచి పెద్దచేస్తాం. పైసపైస పోగుచేసి, చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేస్తాం. ఇంక బాధ్యత తీరింది, మా బతుకులు మేం బతకవచ్చనుకుంటే చచ్చేదాకా మీ వెంటపడే వుంటామంటే ఏం చెప్పగలను? ఎదుటిమనిషికి గౌరవం యివ్వరు. చేసిన పెళ్ళి నిలబెట్టుకోరు. తెల్లారి లేచినదగ్గర్నుంచీ ఏం కొంపమునుగుతుందోననే భయం. ముంచావుకదా? ఇంకా అమ్మెందుకు? చదువు సంస్కారాన్ని నేర్పించాలి. ఎదుటివాళ్ళ కష్టాన్ని బోధపరచాలి. నీకు ఇంట్లో కళ్ళెదురుగా జరుగుతున్నవే అర్థం కావు, ఇంక బైటివాళ్లగురించి ఏం ఆలోచించగలవు?” అంది.
“అమ్మా!” అన్వి గొంతు రుద్ధమైంది. “నన్నంటున్నావా?!! ఇంత చిన్నవిషయానికి సాకేత్‍కి ఎందుకంత కోపం వచ్చిందో తెలీడంలేదు. ఆ నిముషంలో నవ్వెందుకో ఆగలేదు. దానికి ఇంత పనిష్మెంటా?” దు:ఖాన్ని ఆపుకుంటూ రోషంగా అడిగింది.
“అతనివైపునించీకూడా నువ్వే జడ్జిచేస్తున్నావా? అతని చెల్లెల్ని చూసి నవ్వడం నీకు చిన్నవిషయం. అతను కోపం తెచ్చుకోవడం పెద్ద విషయం. మరి ఇదెలాంటి విషయమో చెప్పు”
“ఏమిటి?”
“ఇద్దరన్నదమ్ములమీద అపురూపంగా పెరిగాను. ఒకళ్లనొకళ్ళు కించపరుచుకోవడం మాయింట్లో లేదు. ఎంతో పద్ధతిగా పెరిగాం.
మా పెళ్లైన కొత్తలో. పనావిడ రాకపోతే ఇంట్లో చీపురుకట్ట ఎవరు పట్టుకుంటారు? ఆడవాళ్ళేకదా? మగవాళ్ళకి పట్టదుకదా? నేనూ అలాగే చీపురు తీసుకుని తుడుస్తున్నాను. మీ నాన్న చూసారు. కొత్త పనిమనిషి… కొత్త పనిమనిషి అని నాలుగుసార్లు అన్నారు. ఉక్రోషం వచ్చింది. తనకి తను నవ్వేసుకుంటున్నారు. అదో పెద్దజోక్‍లా. జోకైతే నాకూ రావాలికదా, నవ్వు? కోపం, వుక్రోషం, కళ్లలో నీళ్ళూ ఎందుకొస్తాయి? ఒకళ్లకి నవ్వు తెప్పించినది ఇంకొకళ్లకి బాధ ఎందుకు కలిగించింది?
సరదాకి అంటే అంత వుడుక్కోవడం దేనికి? జోక్స్ ఎంజాయ్ చెయ్యడం రాదా- అన్నారు.
పనిమనిషితనం తప్పేమీ కాదు. అన్నిళ్ళలోనూ పనుంటుంది. అందరం చేసుకుంటాం. మీ నాన్న కారు డ్రైవ్ చేస్తారు. రైల్వేస్టేషనుకి వెళ్తే సూట్‍కేసులు మోస్తారు. అంతమాత్రాన తనని డ్రైవరనీ, పోర్టరనీ పిలవనుకదా? పనావిడకి డబ్బిచ్చి గృహిణి కొనుక్కునేది సమయం. నిపుణమైన సేవ కాదు. సమాజంలో ఒక ఆర్డరుంటుంది. డాక్టరు చదివినవాడు తన కొడుకుని కాంపౌండర్ని చేస్తానని కలలుగనడు. ఇంజనీరు తన కూతురు మెకానికైతే బావుణ్ణనుకోడు. యాంత్రికమైన పనులనుంచీ ఎక్కువ మేథోనైపుణ్యంవైపుకి వెళ్ళాలనుకుంటాడు. ఇది ప్రొగ్రెసివ్ గ్రాఫ్. ఎమ్మే చదివిన నేను టీచర్నో లెక్చరర్నో అవాలనుకుంటాను, వాళ్ళతో పోల్చుకుంటాను.
మీ నాన్న తన పరిహాసాన్ని అక్కడితో ఆపలేదు. అనుకోకుండా ఆవేళే మా చిన్నన్నయ్య నన్ను చూడ్డానికి వచ్చాడు. భోజనానికి వుండమన్నాం. ఉన్నాడు. భోజనాలకి కూర్చున్నారు ఇద్దరూను.
మా కొత్తపనిమనిషిని చూడూ, మా కొత్తపనిమనిషిని చూడు- అని వాడితో నాలుగుసార్లనేసరికి వాడికి చిర్రెత్తుకొచ్చింది.
మా చెల్లెల్ని అల్లారుముద్దుగా పెంచి, చదివించి, ఘనంగా పెళ్ళిచేసి, కట్నకానుకలతో అత్తారింటికి పంపించాం. ఇక్కడికొచ్చాక దాన్ని పనిమనిషిని చేసినట్టున్నారు మీరు- అని తింటున్న అన్నంలో చెయ్యి కడిగేసుకుని లేచాడు.
పదమ్మాయ్, నాతో తీసుకెళ్ళిపోతాను. చేసిన కాపురం చాలు, ఇంత సంస్కారంలేని మనిషి మనకక్కర్లేదు- అన్నాడు. దానిమీద పెద్ద గొడవైంది. అప్పట్లో ఇలా తుమ్మితేనూ, దగ్గితేనూ విడాకులు ఇచ్చేవాళ్ళు కాదు. అసలు అలాంటి ఆలోచనలే వచ్చేవి కాదు ఎవరికీ. సాయంత్రానికల్లా మా నాన్నని రప్పించారు.
భార్యాభర్తలన్నాక ఏవో హాస్యాలుంటాయి. ఒకొక్కళ్లది ఒక్కో పద్ధతి. విని వూరుకోవాలి. అంతేగానీ పిల్లనిచ్చుకున్నచోట తిరగబడతావా- అని అన్నయ్యని బాగా తిట్టారు. మీ నాన్న కాళ్ళుపట్టుకుని క్షమార్పణ చెప్పారు. నా కాపురం నిలబెట్టానన్న తృప్తితో వెళ్ళారు. కానీ ఆరోజుని నేను అన్నయ్యతో వెళ్ళిపోయి వుంటే నువ్వనేదానివి వుండేదానివి కాదు. సరే, నువ్వప్పటికే కడుపులో వున్నావనుకో, నీకు అమ్మో, నాన్నో ఒకరే వుండేవారు. అదేనా తెలియాలికదా? అప్పట్నించీ ఎన్ని పరాచికాలు నామీద? ఎన్ని హేళనలు? అన్నీ నీ యెదురుగుండానేకదా? నీ తల్లిని పనిమనిషంటే నీకు కోపం రాదా? రాక్కర్లేదా? మీనాన్న నామీద జోక్స్ వేస్తున్నాననుకుని అనే హేళనల్ని ఎంజాయ్ చేస్తున్నాననుకున్నావా? లేక నాకు చీమూ నెత్తురూ లేవనా? అర్చనని చూసి నవ్వితే సాకేత్‍కి కోపం రాకూడదా? ఒకవేళ అతను కోపం తెచ్చుకోకపోతే ఆ పిల్ల బతికున్నంతకాలం ఆమె ప్రాణానికి నువ్విలా వెక్కిరిస్తూ, హేళనచేస్తూ వుంటావా?” తీవ్రంగా అడిగింది.
“నాన్న నిన్ను పనిమనిషన్నారా?” దిగ్భ్రాంతిగా అడిగింది అన్వి. ఇప్పటికీ తండ్రి ఆవిడ్ని ఏవేవో అంటుంటాడు. అంటూ ఆయన నవ్వుతాడు. తనకీ నవ్వొస్తుంది. నవ్వుతుంది. కానీ అమ్మని అలా…? ఆవిడ ఎప్పుడూ స్పష్టతతోనే వుంది, ఒకళ్లని బాధపెట్టేదికాదు, అందరూ కలిసి నవ్వుకోగలిగేదిమాత్రమే హాస్యమని. ఎన్నోసార్లు తనకి చెప్పే ప్రయత్నం చేసింది. ఆ చేసినప్పుడల్లా ఆవిడ కళ్లలో కనీకనిపించని కన్నీటిపొర. తను తప్పక వినాలనే బలమైన కోరిక. తను పట్టించుకోలేదు.
“నువ్వింకా ఆ విషయం మర్చిపోలేదా?” సంతోష్ గొంతు వినిపించింది కాస్త దూరాన్నించీ. వీళ్ళ మాటలు విన్నాడు.
“ఎలా మర్చిపోతాను? దాన్ని తప్పని గుర్తించుకుని మిమ్మల్ని మీరెప్పుడూ మార్చుకునే ప్రయత్నం చెయ్యలేదుకదా? దేన్ని మర్చిపోను? నా గౌరవాన్ని నిలబెట్టాలనుకుని అకారణంగా తిట్లుతిని, చిన్నబోయిన మా అన్నయ్య ముఖాన్నా, పిల్లనిచ్చుకున్న పాపానికి అరవయ్యేళ్ళ వయసులో తన వయసులో సగంకూడా లేని అల్లుడి కాళ్లని పట్టుకున్న మా నాన్న రూపాన్నా?” అడిగింది లీల పదునుగా.
అన్వి తండ్రికేసి కొత్తగా పరిచయమైన వ్యక్తిని చూసినట్టు చూసింది. తల్లికోణంలోంచీ కనిపించాడు ఇప్పుడు.
“నువ్వు నాకు రోల్‍మోడల్‍వని అనుకున్నాను నాన్నా! కానీ కాదు. నువ్వుగా నాకు తప్పొప్పులు చెప్పలేదు. అంతేకాదు, అమ్మ చెప్పినవి అర్థమవకుండాకూడా అడ్డంపడ్డావు. అమ్మ పడ్డ నొప్పి నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకాముందే తను ఈ సంఘటన చెప్పినా నాకప్పుడు అర్థమయ్యేది కాదు. బహుశ ఇప్పట్లాగే పగలబడి నవ్వేదానేమో! సరైన టైములో చెప్పింది. తాతయ్యే నీ కాళ్ళుపట్టుకుని క్షమార్పణ చెప్పినప్పుడు నేను సాకేత్‍కీ, అర్చనకీ సారీచెప్పి, సంబంధాన్ని నిలబెట్టుకోవడంలో తప్పేంలేదు. నేను చేసింది తప్పే. అమ్మలో అర్చన కనిపిస్తోంది నాకిప్పుడు. వెరీ సారీ అమ్మా!” అంది.
లీల తేలిగ్గా నిశ్వసించింది. సంతోష్? కొంచెం అయోమయంలో పడ్డాడు. కొత్తగాబట్టి.