“ఆమె ఒక మత్తులో వుంది. అందులోంచి బైటికి తీసుకురావాలి. అప్పుడు నా గుండె చప్పుళ్లు వినిపిస్తాయి” అన్నాడు.
నిజమే! ప్రతిమనిషి చుట్టూ తనవైన ఆలోచనలు పొగమంచులా చుట్టుకుని వుంటాయి. ఆ మంచుగూటిలో వుండేదే నిజమనే మత్తుని ఎక్కిస్తాయి. అలాంటి మత్తులో సుమిత్ర వున్నది. తనని మర్చిపోయిన… ఇన్నాళ్ళలో ఒక్కసారేనా పలకరించని, పలకని వ్యక్తిని ఇంకా నమ్మటం ఆ మత్తు.
సుమిత్ర ఇంటికి మరోసారి వచ్చాడు సూర్య.
“మీ చెల్లెలి పెళ్లి కుదిరిందని నీలిమద్వారా తెలిసింది. పెళ్లంటే మెగా ఈవెంటు. మీరు ఒక్కరూ అన్నీ చూసుకోవటం సాధ్యపడదు. ఏ సహాయం కావాలన్నా నిర్మొహమాటంగా అడగండి. మా బంధువుల షాప్స్ చాలా వున్నాయి. అప్పటికప్పుడు అన్నిటికీ డబ్బు చెల్లించి కొనాలంటే ఇబ్బందిగా వుంటుంది. క్రెడిట్ కావాలంటే చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. మీ వీలునిబట్టి తీర్చుకోవచ్చు. ఇంకా వేరే ఏరకమైన హెల్ప్ కావలసినా నాకో, నీలిమకో చెప్పండి” అన్నాడు.
సుమిత్ర తలూపింది. థాంక్స్ కూడా చెప్పింది. అతను నవ్వాడు. కాఫీ ఇచ్చింది. తాగాడు.
“నాగదిమీద కామెంట్స్ ఏమైనా వున్నాయా?” అంతకుముందు అతనన్నది గుర్తు తెచ్చుకుని అడిగింది.
“కొత్తగా ఏమీ లేవు. పాతవే హోల్డ్ చేస్తున్నాను” అన్నాడు.
ఆమె కోపంగా చూసింది. అతను నవ్వేశాడు. వెళ్తానని చెప్పి లేచాడు.
సూర్య ఎక్కడా హద్దులు దాటడు. ఒక్కసారి ఇంటికి వచ్చి అలా తిక్కగా మాట్లాడి వెళ్లాడు. మళ్లీ ఇదే రావటం, తేజా తన స్నేహితుడంటున్నాడు. మళ్లీ ఈ విరోధమేమిటో తెలీదు. అతని గురించి విషయం చెప్పడు. అతనికిగల పరిచయాలతో తేజా గురించి తెలుసుకోవటం చాలా చిన్నవిషయం. ఐనా తెలుసుకోడు. తెలుసేమో! చెప్పడు. అక్కడే సుమిత్రకి అతనంటే కోపం.
ఆ కోపాన్ని కూడా నియంత్రించుకుంటోంది. తేజతో తన ప్రేమనీ, ఇతనితో స్నేహాన్నీ విడగొట్టి చూడటం అలవాటు చేసుకుంది. అలా చూడటం మొదలుపెట్టాక ఆమె సూర్య స్నేహంలోని సరదానికూడా ఆస్వాదించగలుతోంది. అదీ ఈమధ్యే.
“మనింట్లో పెళ్లికి అతను చేసేదేముంటుంది? బంధువా ఏమన్నానా?” అంది రాధ అతను వెళ్ళగానే.
“వచ్చినవాళ్లతో ముఖంమీదే వద్దని చెప్పలేం కదమ్మా? ఐనా ఏ బంధువులు వచ్చి నిలబడుతున్నారు మనకి? మామయ్య చూస్తే అలాగ. మిగిలినవాళ్ళంతా ఎక్కడ ముట్టుకుంటే ఎక్కడ అంటుకుంటుందోనని భయపడేవాళ్ళే. ఆ భయంలేనివాళ్ళేమో అంతా ఆడవాళ్లమని నెత్తెక్కి తొక్కుదామని చూస్తున్నారు… ఐనా నలుగుర్లోకి వెళ్ళి వుద్యోగం చేస్తున్నప్పుడు పరిచయాలు లేకుండా ఎలా వుంటుంది? అతను నీలిమ కజిన్. అందుకని ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటున్నాడు” అంది సుమిత్ర కొంచెం విసుగ్గా. ఎందుకో, తల్లి ధోరణి ఈమధ్య విసుగనిపిస్తోంది. నలుగుర్నీ కలుపుకుని వెళ్లటం రాదు. స్వంతంగా ఏదీ చెయ్యలేదు. ప్రతీదానికీ తనమీద ఆధారపడిపోతుంది. అలాగని తను చేసేది చెయ్యనివ్వదు. ఎంతకాలం ఇలా?
అనుకున్న పెళ్లి వారంలోకి వచ్చింది. ఆఫీసుకి సెలవు పెట్టి ఇంట్లోనే వుంది సుమిత్ర ఇంటాబైటా పనులతో సతమతమైపోతోంది. సునీత పెళ్ళప్పటిలా పెత్తనమంతా తల్లి చేతిలో పెట్టలేదు. అప్పుడు కాస్త డబ్బుంది. పైసపైసకీ లెక్కచూస్తూ ఖర్చుపెట్టుకోవలసిన పరిస్థితి. అందుకని పనులు కూడా పెరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలూ తనే ప్లాన్ చేస్తోంది. శుభలేఖలు చాలా ముఖ్యమైన వాళ్లకే పంపించింది. సూర్యకి పంపడం మర్చిపోలేదు. ఫోన్ చేసి కూడా చెప్పింది.
తేజాకి పోస్టులో వేసింది. ఫోన్ చేసింది. కలవలేదు. మెయిల్ పెట్టింది. బౌన్సయింది. ఏడ్చింది. తనని తను వోదార్చుకుంది.
ఇంటిమీద అప్పు తీసుకొచ్చింది. ప్రకాశరావే మధ్యవర్తిగా వుండి ఇప్పించాడు. పర్సనల్ లోన్‍కీ, ప్రావిడెంటు ఫండు లోనుకీ అప్లై చేసింది. నీలిమ కొంత సర్దింది. చిన్నచిన్న సేవింగ్సుంటే అవన్నీ తీసేసింది. ఆమె ఉన్నంత ధైర్యంగా రాధ లేదు. ఇంటి అప్పు కాగితాలమీద సంతకాలు పెడుతూ ఏడ్చేసింది, నిలువనీడకూడా లేకుండా పోతుందేమోనని.
“నాన్న వున్నా ఇంతే చేసేవారు కదమ్మా!” తల్లిని తనే ఓదార్చింది.
పెళ్లికి మూడురోజుల ముందుగా సెలవుపెట్టి సునీతని తీసుకుని వచ్చాడు మురళి. అతని తల్లిదండ్రులు పెళ్ళిరోజుకి వస్తామన్నారు. ఇంకా ముందు సునీతని పంపవచ్చుగానీ ఆమె అక్కడే గొడవలు సృష్టిస్తుందోనని పంపలేదు. అతను వచ్చాక సుమిత్రమీద బైటిపనుల రద్దీ తగ్గింది.
సుమిత్ర అతనికేసి సూటిగా చూడలేకపోతోంది. తమమధ్య జరిగింది వదిలిపెట్టి అతనే ముందుపడుతున్నాడు.
ఇంటిమీద అప్పు తెచ్చారని తెలిసి సునీత గిజగిజలాడిపోయింది. అదేదో అమ్మేసి పెళ్లి ఖర్చులు పోగా మిగిలినది ఎవరిది వాళ్లకిచ్చేస్తే పోయేది కదా? అనుకుంది. ఆ తర్వాత అనే ప్రశ్నకి ఆమె చెప్పుకునే జవాబు సుమిత్ర. ఆమాట పైకనలేక, “తెచ్చేదేదో ఇంకో లక్ష తెచ్చి మాకిస్తే మాపాట్లు మేం పడేవాళ్ళం. బైకుకేమో అంత గోల చేశారు. ఫ్రిజ్‍కి డబ్బడిగితే ఐదువందలిచ్చి వూరుకున్నావు…” అని తల్లితో దెబ్బలాడింది.
రాధ తెల్లబోయింది. ఐదు నిముషాలదాకా తేరుకోలేకపోయింది. ఆ తర్వాత తీక్షణంగా కూతుర్ని చూస్తూ, “ఈ బుద్ది నీకు పుట్టిందా సునీతా, లేక మీ ఆయన అడిగించాడా? అతనే అడిగితే చెప్పు, పెళ్లికి మీ అత్తవారూ వాళ్లూ వస్తారు. మనవైపునా అంతా వస్తారు. అందరి ఎదుటా నిలదీసి అడుగుతాను. మన ఇంటి పరిస్థితేమిటో తెలిసే అతను నిన్ను చేసుకున్నాడు. ఇప్పుడీ కళలేమిటి?” కోపంగా అడిగింది.
సునీత ముఖం ముడుచుకుని మరేం మాట్లాడకుండా వెళ్లిపోయింది. ఆమెకి చాలా ఉక్రోషంగా వుంది. తనకన్నా చిన్నది. స్వరూపకి వడ్డించిన విస్తరిలాంటి జీవితం అమిరింది. సుమిత్రకి తండ్రి ఉద్యోగం వుంది. తనకి మాత్రం ఏవీ లేవు. పుల్లపుల్లా ఏరి కూర్చుకుని పిచ్చుకగూడు కట్టుకున్నట్టు అన్నీ సమకూర్చుకోవాలి. ఎదుగూబొదుగూ లేని భర్త జీతంతో ఏం కొనగలదు? తల్లి దగ్గర గొడవ చేసి కొన్నయినా సాధించుకోగలదు. అందుకు భర్త సహకరించడు. ఏం మనిషో! అసంతృప్తిగా అనుకుంది.
సుమిత్రకి ఈ గొడవ తెలిసింది. చిన్నగా నిట్టూర్చింది. ఈ యిల్లు, చేస్తున్న వుద్యోగం ఏవీ తనవి కాదు. బాధ్యతలు మాత్రమే తనవి… ఇవన్నీ ప్రేమలూ అనుబంధాల చక్కెరపూతతో వున్నప్పుడు బాధ కలిగించవు. ఆ పూత కరిగిపోతున్నప్పుడు నెమ్మదినెమ్మదిగా చేదు తెలుస్తుంది. సుమిత్రకి బతుకు చేదు రుచి తాకడం మొదలైంది.
రాత్రి ముహూర్తం. నీలిమ ముందురోజే వచ్చేసింది. సుమిత్ర, నీలిమ పెళ్లిళ్లవకుండా అలా వుండగా తను పెళ్లి చేసుకో వటం చాలా ఇబ్బందిగా అనిపించింది స్వరూపకి.
“ఇప్పుడింత తొందరగా పెళ్లేమిటంటే సుమిత్ర వినలేదు. తననలా వదిలేసి నేను చేసుకోవటం ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. మీరు చేసుకోలేదంటే సరే మీకో ఆదర్శం వుంది” అంది నీలిమతో తనని అలంకరిస్తున్నప్పుడు.
“సూర్యని చూశావా?” అడిగింది నీలిమ. స్వరూప తలూపింది. అతని ప్రసక్తి ఇప్పుడెందుకో అర్ధమమవలేదు.
“సుమిత్ర కరుణాకటాక్షాల కోసం తపించిపోతున్నాడు. నువ్వేం బెంగ పెట్టుకోకు. ఎప్పటికో ఒకప్పటికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు” అంది నీలిమ అభయం ఇస్తున్నట్టు. స్వరూప ఏదో చెప్పబోతుంటే, అదేంటో తెలుసన్నట్టు నవ్వింది.
పెళ్లికి ముందు వచ్చాడు సూర్య. ఎలాగా నీలిమ వుంది, ఏదేనా అవసరం వుంటే సుమిత్ర మొహమాటపడినా నీలిమ ఫోన్ చేస్తుందని వుండిపోయాడు. వచ్చాక అప్రమేయంగానే పనుల్లో కూరుకుపోయాడు. ఈవెంట్ మానేజర్లు దగ్గరుండి అన్నీ అమర్చిపెట్టిన పెళ్ళి కాదు.పెద్ద బలగం వుండీ అందరూ తలో చెయ్యీ వేసి అందుకుని చేసే పెళ్ళీ కాదు. దిగువ మధ్యతరగతి పెళ్ళి. పనులేవీ ప్రత్యేకించి ఒకళ్లని చెయ్యమని అడిగి చేయించుకునేవి కాదు. గాల్లో తేలే పురమాయింంపులు. పదిమంది పదివైపుల్నించీ పిలుస్తారు. పదిరకాల వస్తువులు అడుగుతారు. అవి చూసేలోపు ఇంకో పదిపనులు తయారౌతాయి. అంతా గందరగోళం. సుమిత్ర వెంటవెంటే తిరుగుతూ అన్నీ చూసుకుంటున్నాడు. అతనొచ్చి ఇలా బాధ్యత పంచుకుంటుంటే తెలీని రిలీఫ్ కలిగింది ఆమెకి. అంతలోనే గుండెల్లోంచీ బాధ ఎగజిమ్మింది.
ఏమైపోయాడు తేజా? తన పక్కన నిలబడి అన్నీ చూసుకోవలసినవాడు… అతని స్థానంలోకి మరొకరు వచ్చేదాకా ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? ఆమె కళ్లు కన్నీటి చెలమలయ్యాయి. ఏదో పనున్నట్టు అక్కడినుంచి వెళ్లిపోయింది. చాలాసేపటికి మళ్లీ కనిపించింది సూర్యకి. కానీ ఆమె కళ్లు ఎర్రగా వున్నాయి. చిన్నగా నిట్టూర్చాడు.
పెళ్లైపోయింది. సూర్య ఆర్ట్ పీస్ బహుమతిగా ఇచ్చాడు. బైటినుంచి వచ్చినవాళ్లంతా బఫేకి వెళ్లారు. మగపెళ్లివాళ్లని భోజనాలకి ఆహ్వానించడం, వాళ్లకి మర్యాదలు చెయ్యడం, అంతా హడావిడిగా వుంది. వాళ్ల భోజనాలయేసరికి ఆడపెళ్లివాళ్లంతా భోజనానికి కూర్చున్నారు. ఈ హడావిడంతా అయేదాకా సుమిత్ర అతనికి కనిపించలేదు. నీలిమ కూడా ఆమెతోనే వుంది. అతన్ని తిన్నావా అని అడిగినవాళ్లు లేరు. అంతదాకా అన్నీ తనవే అనుకుని చేసినవాడు స్వతంత్రంగా తనూ భోజనానికి వెళ్లలేకపోయాడు. రాధ అతన్ని చూసిందిగానీ చూడనట్టు వూరుకుంది. అతని దృష్టిని దాటిపోలేదు. తను వెళ్లిపోవాలా? ఇంకా సుమిత్రకి తన అవసరమేదైనా వుంటుందా? సూర్యకి అర్థమవలేదు. సందిగ్ధంగా మేరేజిహాల్లోంచి బైటికి వస్తుంటే ఆమె ఎదురుపడింది.
“మీకోసమే వెతుకుతున్నాను. భోజనం చేశారా?” అడిగింది. “”చేసినట్టు లేరు. ఆడపెళ్లివాళ్లని ఎవరూ తినమని అడగరు. అన్నీ మీరే అనుకుని చేసి ఈ విషయంలో సిగ్గుపడితే ఎలా? పదండి. నేను పెడతాను” అంది చనువుగా అతని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ.
అప్పటికే అందరి భోజనాలూ ఐపోయాయి. వంటవాళ్ళు గిన్నెలన్నీ సర్దేసుకుని రాత్రి వంటకి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. తనే అతన్ని ఒక దగ్గిర కూర్చోబెట్టి ప్లేట్లో అన్నీ వేసి తీసుకొచ్చింది.
“నువ్వు?” తినబోతూ అడిగాడు. నీలిమని అన్నట్టే నువ్వనేశాడు. ఆమె పట్టించుకోలేదు.
“ఇంకా ఎక్కడ? అమ్మకూడా వుండిపోయింది. మేమిద్దరం తింటాం. మీరు తినెయ్యండి. పెళ్లివాళ్ళు వెళ్ళిపోతారట. సారే అవీ సర్దుతూ వుండిపోయాం. హఠాత్తుగా గుర్తొచ్చింది, మీరు భోజనాల దగ్గిరెక్కడా కనిపించలేదని. ఆ పని వదిలేసి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను” అంది. అతను తింటుంటే అక్కడే కూర్చుంది ఏం కావాలో చూస్తూ.
ఆమె అంతగా మాట్లాడటం వింతనిపించింది సూర్యకి. బాధ అణుచుకునే ప్రయత్నంలోనే అలా మాట్లాడుతోందని గ్రహించాడు. ఏదో అనేలోపు ఆమెకోసం ఎవరో వచ్చారు. వస్తున్నానని చెప్పి పంపించింది. ఈమాటు మురళి వచ్చాడు. వాళ్లిద్దర్నీ చూసి తిరిగి వెళ్లిపోయాడు. అతన్ని సూర్య చూశాడు. సుమిత్ర గమనించలేదు.
“నువ్వెళ్లు సుమిత్రా, నేను తినేస్తాలే” అన్నాడు ఇబ్బందిగా.
“పర్వాలేదు” అతను తినేదాకా అక్కడే వుంది.
“నాకు మీతో విరోధం ఏమీ లేదు. మీరంటే అయిష్టం కూడా లేదు. నీలిమ కజిన్‍గా, అడగ్గానే స్నేహహస్తాన్ని అందించే వ్యక్తిగా చాలా గౌరవం వుంది. కానీ నా కళ్లలోకి సూటిగా చూడకండి. నా మనసుని తాకకండి. నా అంతరంగపు లోతులని వెతక్కండి. చెప్పాను కదా, నేనొక నీడని. నా వ్యక్తిత్వం, నాలోని జీవం అన్నీ తేజ దగ్గిరున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మీరిచ్చిన సహకారానికి థాంక్స్” తిన్నాక అతను చెయ్యి కడుక్కోవడానికి మగ్‍తో నీళ్లు తీసిస్తూ నెమ్మదిగా అంది. అతను నిరుత్తరుడయ్యాడు.
అత్తవారింటికి వెళ్లేముందు అడిగింది రూప మురళిని. “ఆరోజు నేను చెప్పిన విషయం ఏం చేశావు బావా?”
“ఒక సందిగ్ధంలో పడ్డాను రూపా! సుమిత్ర ఇష్టపడుతున్న తేజ… సుమిత్రని ఇష్టపడుతున్నా సూర్య… ఈ ఇద్దరిమధ్యా తేల్చుకోలేకపోతున్నాను. తేజ ఎలాగా మౌనం వహించాడు. అతన్నిప్పుడు కదపడం దేనికనిపిస్తోంది” అన్నాడు.
“తేజా ఉన్నప్పటి సుమిత్ర నాకు గుర్తు బావా! అతని కోసం తను కృంగిపోతోంది. అతను కాదంటే అలాగే వుండిపోతుందిగానీ సూర్యని అది చేసుకోదు”” అంది స్వరూప.
“చేసుకుంటుంది” అన్నాడు మురళి.
లేతవయసులో సుమిత్ర మనసుమీద ఒక ముద్ర పడింది. దాన్ని చెరిపే ప్రయత్నం ఇప్పటిదాకా జరగలేదు. ఇప్పుడు జరుగుతోంది. సూర్య చేస్తున్నాడు. అదీ కాక సుమిత్ర ఇప్పుడు పెద్దదైంది. వయసులోనూ మానసికంగానూ ఎదిగింది. చిన్నప్పటి ప్రేమని పట్టుకుని వుండిపోతుందని అనిపించటం లేదు. ఐతే తామిద్దరిమధ్యా జరిగిన వప్పందాన్ని దాటడం అనైతికంగా అనిపిస్తుండవచ్చు. అందుకు తటపటాయిస్తోందేమో. దాన్నించి బైట పడటానికి కొంత టైం కావాలి. కౌంట్ డౌన్ మొదలయ్యే వుంటుంది.
“ఇంకొంచెం టైము తీసుకుంటాను రూపా! సూర్య, సుమిత్రల పరిచయం ఏ మలుపు తీసుకుంటుందో చూడకుండా తొందరపడవద్దు” అన్నాడు.
“ఈ విషయంలో సుమిత్ర బాధ్యత నీదే బావా!” అంది స్వరూప.
రూపా వాళ్లతో వెళ్లి అటునించి అటు వెళ్లిపోయారు మురళీ, సునీత.
వ్రతం అయాక స్వరూపని తీసుకురావటానికి రాధ మమతతో వెళ్తే-
“మిగిలిన వేడుకలన్నీ మా ఇంట్లోనే చేసుకుందాం. మీ ఇంట్లోనంటే అన్నీ సుమిత్రే చెయ్యాలి. తనని ఇబ్బందిపెట్టడం మాకు బాగాలేదు” అంది దేవకి. వాళ్లకి అంత సంస్కారం వున్నందుకు చాలా సంతోషపడింది స్వరూప.
హడావిడంతా అయ్యి ఎక్కడి వాళ్లక్కడికి సర్దుకునేసరికి ఇల్లంతా చిన్నబోయినట్టనిపించింది రాధకి.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.
The next time I read a blog, Hopefully it does not fail me just as much as this particular one. I mean, Yes, it was my choice to read through, but I truly believed youd have something helpful to talk about. All I hear is a bunch of moaning about something you could possibly fix if you werent too busy seeking attention.
May I simply say what a relief to uncover somebody that really understands what theyre discussing over the internet. You certainly know how to bring a problem to light and make it important. More and more people really need to check this out and understand this side of the story. I was surprised that youre not more popular because you certainly have the gift.