సుమిత్ర తన గదిలో వుంది. మమత ఏదో చదువుకుంటోంది. అంత ఇంట్లోనూ ఒక్కర్తే వున్నట్టనిపించి ఉక్కిరిబిక్కిరైంది రాధ. ఏదో భయంలాంటిది చోటుచేసుకుంది. ఆవిడకి ఆ ఒంటరితనం దుర్భరంగా అనిపించింది. మనసునిండా ఆలోచనలు. సూర్య కళ్లముందు కదుల్తున్నాడు. సుమిత్ర వెంటవెంటే తిరుగుతున్నాడు. సుమిత్రంటే ఇష్టమేనేమో! అడిగితే చేసుకుంటాడేమో! తేజకి సుమిత్రని అనుకున్నారు. వాళ్లు ముఖం చాటేశారు. అతనికోసం ఎదురు చూస్తున్నట్టు బతుకుతోంది సుమిత్ర. గట్టిగా మందలిస్తే సూర్యని చేసుకుంటుందేమో! ఇంటిమీది అప్పు తీర్చేసి కొంత జీతం తమకి ఇవ్వాలని ఒప్పందం చెయ్యచ్చు. కానీ మిగిలిన బాధ్యతలు… తన ముందు జీవితం. తనది వచ్చే వయసేకానీ పోయేది కాదు. ముసలితనం… అనారోగ్యాలు… ఎవరు చేస్తారు? అత్తగారి మాటలు నిజమనిపించాయి. ఒక్క మగపిల్లవాడు వుండి వుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు… ఒంటరితనం… స్వార్థం ఆవిడ మనసుని చీకటిలా కప్పేసింది. అందులో సుమిత్ర భవిష్యత్తు లుప్తమైపోయింది.
కొద్దిసేపటికి ఎవరో వచ్చినట్టనిపించి హాల్లోకి వచ్చింది. సూర్య పెళ్లి లెక్కలు సుమిత్రకి చెప్పి వెళ్లటానికి వచ్చాడు.
“సుమిత్ర లేదా?” అని అడుగుతున్నాడు మమతని.
“లోపలుంది. పిలుస్తాను, కూర్చోండి” అంటోంది మమత. ఇతనెందుకు వచ్చాడు? సుమిత్రని వదలడా? అప్రసన్నంగా అనిపించింది ఆవిడకి.
“తన గదిలో వుందా? నేనే వెళ్తాను” అంటూ సుమిత్ర దగ్గిరకి వెళ్లాడు.
మంచంమీద పడుకుని వుంది సుమిత్ర. అతన్ని చూసి చప్పున లేచి కూర్చుంది.
“ఏడుస్తున్నావా?” అతని గొంతు దయగా వుంది.
“చచ్చిపోవాలనిపిస్తోంది సూర్యా!” చేతుల్లో ముఖం దాచుకుంది.
“ఎందుకు?”
“నీకెలా చెప్పను? ఎలా చెప్తే అర్ధమౌతుంది? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి వీడ్కోలేనా తీసుకోకుండా వున్నట్టుండి జీవితంలోంచి వెళ్లిపోతే తట్టుకోవటం ఎంత కష్టమో తెలుసా? నాకు ప్రతిక్షణం అతనే గుర్తొస్తున్నాడు” అంది. తనని గుడికి రమ్మన్నాడు. వెళ్ళింది. మాట్లాడుకున్నారు. అతని చదువైపోయాక పెళ్ళిచేసుకుందాం అంటూనే అమ్మవారిముందు నిలబడి వుండగా రెండు ప్రమాణాలు చేసి, తమ పెళ్ళైపోయిందన్నాడు. చివర్లో చెప్పిన ఆ ఒక్కమాటా ఎంత బలమైనది! వాగ్బంధమై తనని కట్టిపడేసింది. అంతమాత్రాన ఎవరికీ చెప్పలేదు. ఎవరికి చెప్పినా ఆధారాలు అడుగుతారు. ఎవరిదాకానో ఎందుకు, సూర్య చాలు వెక్కిరించడానికి.
సూర్య బలంగా శ్వాస పీల్చి వదిలాడు. “నిన్ను బాధపెడుతున్నది ఒంటరితనం సుమిత్రా! తేజా, వాడి జ్ఞాపకాలూ కావు. మీది బాల్యస్నేహం. తెలిసీ తెలీకుండా ఏవేనా అనుకున్నారేమో, వాటిచుట్టూ కొన్ని వూహల్ని అల్లుకుని నిన్ను నువ్వు కట్టేసుకున్నావు. అది ప్రేమ కాదని అర్థమైతే అతన్ని నువ్వే మర్చిపోతావు, కొన్ని సంవత్సరాలుగా పలకని వ్యక్తిమీద ప్రేమేమిటి? నాకు నువ్వంటే చాలా యిష్టం. పెళ్లి చేసుకుందాం. సంతోషంగా వుంటావు” నచ్చజెప్తున్నట్టు అన్నాడు.
ఆమె తలదించుకుంది.
అతను తన వేలెట్‍లోంచీ ఆమె ఫొటో తీసాడు.
“ఇది నీ దగ్గరకెలా వచ్చింది?” ఆశ్చర్యంగా అడిగింది. అతను ఆ సంఘటన చెప్పాడు.
“నిజం తెలుసుకో సుమిత్రా! ఈ ఫోటోకి వాళ్ళు ఇచ్చిన చోటు పాతపేపర్లమధ్య. తర్వాత వాటిని తీసేసేప్పుడు చెత్త అమ్ముకునేవాడి దగ్గరికి వెళ్ళిపోయేది. నాకెందుకో అది నచ్చలేదు. నాతో తీసుకొచ్చాను. ఆరోజుని అలా వాళ్ళమ్మ నీ ఫోటో తీసి పడేస్తుంటే తేజా ఏమీ మాట్లాడలేదు. చూస్తూ వూరుకున్నాడు…” అంటూ ఒక్కసారి ఆగిపోయాడు. సుమిత్ర ముఖం ఎర్రబడింది. అతను చెప్తున్నదాన్ని నమ్మలేకపోయింది. ఫోటో వుంది సాక్ష్యంగా. నమ్మక తప్పదు. జీర్ణించుకోలేకపోతోంది. తేజా అలా ఎలా చెయ్యగలిగాడు? దు:ఖం సుళ్ళు తిరిగింది లోలోపల.
చెప్తున్న సూర్యలో వున్నట్టుండి మార్పు. ఎన్నో యేళ్ళుగా అర్థంకాక బాధపెడుతూ వున్న విషయం ఒక్కసారి మంచువిడ్డట్టు విడిపోయిన భావన. ఔను… తేజా ఆరోజుని చూస్తూ వూరుకున్నాడు… ఆ చూపుల్లో నిస్తేజం… అసహజంగా అనిపించింది. ఇంకా గుర్తుంది. దేవుడా! అప్పుడు అర్థం కాలేదుగానీ ఇప్పుడు చూచాయగా తెలుస్తోంది… ఆ తర్వాత అతడు తనకి దూరం జరిగాడు… కొంతకాలానికి పూర్తిగా పలకకుండా వెళ్ళిపోయాడు. ఒక్కచేతి చప్పట్లుండవు. అతనికి లేనిది తనకి దేనికని తనూ దూరంగానే వుండిపోయాడు. కానీ ఆ చూపుల్లోని తేడా… అప్పుడు తనది చిన్నవయసు. అపరిపక్వత. కానీ ఇప్పుడు? తన అనుమానం నిజమేనా?
హఠాత్తుగా అతనిలో మార్పు ఎందుకొచ్చిందో అర్థం కాలేదు సుమిత్రకి.
“ఏమైంది?” అడిగింది.
అతను సర్దుకున్నాడు.
“నీ ఫోటో నేను తెచ్చుకుని జాగ్రత్తగా దాచాను. మీ విషయం పెళ్ళిదాకా వచ్చి ఆగిందని తేజా అమ్మ మాటల్లో తెలిసింది. మనుష్యుల అంతర్ముఖమేదో తెలిసిపోయినట్టు అనుభవరహితమైన ఆ వయసులోనే ఒక భావన. నీపట్ల నాకేదో బాధ్యత వుందనిపించేది. ఈ అవమానం గురించి నీకు చెప్పాలనుకునేవాడిని. కానీ నాకు నువ్వవరో తెలీదు. ఎక్కడుంటావో, ఏం చేస్తుంటావో, నిన్నెలా కలుసుకోవాలో ఏదీ తెలీదు”
“…”
“నీలిమ నా కజిన్. మా కుటుంబాలమధ్య ఆస్థి తగాదాలున్నాయి. అందుచేత మాకు రాకపోకల్లేవు. ఐతే మేమిద్దరం మంచి స్నేహితులం. తనకోసం మీ ఆఫీసుకి వచ్చినప్పుడు నిన్ను చూసాను. అప్పుడు నాకు కలిగినదాన్ని షాక్ అంటే చాలా చిన్న పదం. నువ్వెవరో తెలీకుండా నీ ఫోటో నా దగ్గిరుండటం, ఆ తర్వాత నువ్వే కనిపించటం… ఒక తమాషాలా ఆటలా అనిపించింది. నీలిమద్వారా నీగురించి తెలుసుకున్నాను. నువ్వెవరికో తరుచు వుత్తరాలు రాస్తుంటావని చెప్పింది. ఆ యెవరో నేను వూహించగలిగాను”
“…”
“నా దగ్గరున్న నెంబరుకి ఫోన్ చేసాను. కలవలేదు. మెయిల్ చేసాను. బౌన్సైంది. వెళ్ళి కలవాలని చూసాను. వాళ్ళు ఆ యింట్లో లేరు”
“ఎందుకు?”
“కొన్నిటికి జవాబులుండవు”
చాలాసేపు మాట్లాడలేదు సుమిత్ర. ఫోటోని చూస్తూ వుండిపోయింది.
“నేను తేజాని చూసిగానీ ఏ విషయం మాట్లాడను” నెమ్మదిగా అంది.
అతనికి బాగా కోపం వచ్చింది. తనని నమ్మట్లేదా? పర్వాలేదు. తను ఆమెకి ఏమీ కాడు. తనద్వారా తెలిసిన విషయాన్ని నమ్మాల్సిన అవసరంకూడా లేదు. కానీ ఆమె దు:ఖాన్ని చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు. సమస్య ఒకటి వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే దారి చూసుకోకుండా ఆ సమస్యనే పట్టుకుని వేలాడటం అతనికి నచ్చదు. ఇంతకాలం సుమిత్ర తల్లి ఈ విషయంలో ఎందుకు మౌనంగా వుంది? ఆవిడకి తెలుసా, ఈ పెళ్ళి జరగదన్న విషయం? తెలిసి మౌనంగా వూరుకుందా? ఎన్నో ప్రశ్నలు.
మమత ఇద్దరికీ కాఫీ తీసుకుని వచ్చింది. సుమిత్రకన్నా దాదాపు పదేళ్లు చిన్నది. ఇద్దరికీ వయోబేధం బాగా తెలుస్తోంది.
“రెండు కప్పులూ మీ అక్కనే తాగమను. ఏడవటానికి బాగా బలం వస్తుంది” కోపంగా అని వెళ్లిపోయాడు.
అతను వెళ్లగానే రాధ వచ్చింది.
“ఎందుకే, అతనొచ్చాడు? సరాసరి నీ గదిలోకి రావటమేమిటి? ఈ చుట్టరికాలేమిటి?” కొంచెం కోపంగా అడిగింది.
మమత తల్లి చెయ్యి పట్టుకుని బలవంతంగా అక్కడినుంచి తీసుకుని వెళ్ళిపోయింది.
సూర్య సుమిత్రని ప్రేమిస్తున్నానని ప్రకటించాడు. ఇప్పుడొక భయంకరమైన నిజాన్ని ముందుంచాడు. ఇప్పటిదాకా ఆమెకి సొంత జీవితం లేదు. తల్లీ చెల్లెళ్లూ తప్ప ఇంకొకరి గురించి ఆలోచించగలిగే అవకాశమే లేదు. బాధ్యతలు చాలావరకూ తీరాయి. ఇప్పుడిక ఆలోచించవచ్చనుకుంటే ఆ ఆలోచనలన్నీ తేజా చుట్టూనే. అతను ఇలా ఎందుకు చేసాడు? చేసిన ప్రమాణాలేమయ్యాయి? నిలదీసి అడగాలనే బలమైన కోరిక. ఎలా కలుస్తాడు? సూర్య అన్నట్టు తమది కేవలం చిన్నప్పట్నుంచీ వున్న స్నేహమేనా? అందుకే అంత తేలిగ్గా తుంచెయ్యగలిగాడా? తనెందుకు గ్రహించలేకపోయింది? అవమానం, దు:ఖం నిలువునా కుదిపేస్తుంటే నిస్సహాయంగా వుండిపోయింది. ఆ క్రమంలో కొన్ని కొత్త ఆలోచనలు. అలజడిగా వున్న మనసుని మరింత కల్లోలం చేస్తూ.
స్వరూప అన్న ఘనీభూతశిల బద్దలైంది. సుమిత్ర ఇంట్లోనే. ఆమె గదిలోనే. అతన్ని చూసి రాధ బాహాటంగానే తన అప్రసన్నతని ముఖంలో ప్రకటించింది. సూర్య తీక్షణమైన చూపుల్ని ఎదురుకోలేక పక్కకి తప్పుకుంది.
తేజా గురించి తెలిసిన నిజాలు సూర్యాని దిగ్భ్రాంతికి గురిచేసాయి. ఆరోజటి అతని తేడా చూపుల వెనుక చాలా వుంది. యువత భవిష్యత్తు నాశనం చేసేదీ, దేశ ఆర్థికవ్యవస్థని అస్తవ్యస్తం చేసేదీ వుంది. అతను డ్రగ్ అడిక్ట్… అప్పటికే. అమ్మకం చేస్తూ జైల్లో వున్నాడు ఇప్పుడు. అందుకే ఎవరికీ దొరక్కుండా, పలక్కుండా వుండిపోయాడు. మంచివాడే! సుమిత్రతో బంధం తెంచుకున్నాడుగానీ ఆమెని అందులోకి లాగలేదు. తేలిగ్గా అందులో ఇరుక్కునేది. ఆ నలుగురు ఆడపిల్లల జీవితాలూ అస్తవ్యస్తమయేవి. అందమైన పొదరింటిలాంటి ఆ యింటిగురించి అలా అనుకోవటానికే కష్టం అనిపించింది.
ఇవన్నీ క్లుప్తంగా చెప్పాడు ఆమెకి. నమ్మలేనట్టు చూసింది.
“డ్రగ్సా? తేజానా? అలా ఎలా?” పదేపదే అడిగింది. వినటమేగానీ ఆమెకి ఆ విషయంగురించి ఏమీ తెలీదు. అదెంత పెద్ద నేరమో ఆమె వూహకి అందని విషయం. హత్య అనేది అన్నిటికన్నా పెద్ద నేరంగా మనుషుల మెదళ్లలో ముద్రపడిపోయి వుంటుంది. నిజానికి మిగతావాటితో పోలిస్తే దానియొక్క ఇంపాక్ట్ తక్కువ. అక్కడ పోయేది ఒకటో, కొన్నో ప్రాణాలు. కానీ ఇక్కడ విలువలు, నైతికత, ఆరోగ్యం అన్నీ పోయి, కొన్ని లక్షలమంది పిల్లలు నిర్వీర్యమౌతున్నారు. ఆ పిల్లల కుటుంబాలు ధ్వంసమౌతున్నాయి.
“సుమిత్రా! జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు తేజాని మర్చిపో. నీ బాధకీ ప్రేమకీ అతను అర్హుడు కాడు” నచ్చజెప్తున్నట్టు అన్నాడు సూర్య.
అంతేనా? ఇక్కడితో సరా? తండ్రిపోయి, కలలన్నీ చెదిరిపోయి, దు:ఖంలో కూరుకుపోయి వున్నరోజుని అతను తనకి యిచ్చిన ఓదార్పు, ధైర్యం తనెలా మర్చిపోగలదు? అతనికికూడా అలాంటి ఓదార్పు, సాయం కావాలేమో! ఏదీ అడగకుండా ఏదీ అందివ్వకుండా పక్కకి తప్పుకోవడం ఎలా సాధ్యం?
“నేనతన్ని చూడాలి సూర్యా! “
“ఎందుకు?”
“…”
“తెలివి వుందా, నీకసలు? వాడు చేసింది చిన్న నేరం కాదు” అన్నాడు ఆవేశాన్ని అణుచుకుని.
“మీ పోలీసు డిపార్టుమెంటుకి ప్రతి చిన్న తప్పూ నేరమే”
“వాడు ఇరుక్కున్నది చిన్నదాంట్లో కాదు”
“ఐతే? వదిలేస్తామా?”
“జైలు బైట వాడికి సేఫ్టీ లేదు. చంపేస్తారు”
“ఎవరు?”
“నువ్వు ముందు ఆవేశాన్ని కంట్రోలు చేసుకో. నిదానంగా మాట్లాడుకుందాం. అలా కూర్చో. ప్లీజ్!”
“నన్ను ఏమార్చాలని చూడకు. నీకు అన్నీ తెలుసు. నీకు తెలిసి కూడా నువ్వెలా ఊరుకున్నావు? పైగా నా దగ్గర దాచావు. అతనక్కడ జైల్లో ఉంటే నువ్వు నాతో ప్రేమకబుర్లు చెప్తున్నావు. తప్పనిపించట్లేదా? అతను నీకూ స్నేహితుడే సూర్యా! ఆ విషయం మర్చిపోకు. స్నేహితుడిని మోసం చెయ్యాలనుకుంటున్నావా? ” ఆమె అభియోగం చేస్తుంటే సూర్య ముఖం ఎర్రబడింది.
“అదొక పెద్ద రాకెట్. దాన్ని కదిపే సాహసం నాలాంటి చిన్న ఎస్సై చెయ్యలేడు””
“అలా అనుకుని వదిలిపెట్టేశావా? ఒక ఫ్రెండుగా కూడా ఏమీ చెయ్యలేవా? సరే, నీ యిష్టం. నేనతన్ని కలవాలనుకుంటున్నాను. ఎక్కడున్నాడో చెప్తే సంతోషిస్తాను. చెప్పకపోతే ఇక నేనే తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడతాను”
అంతా వివరంగా చెప్పాక కూడా ఆమె అన్న మాటలకి నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు అతనికి. చాలా కోపం వచ్చింది. ఏమిటీ
సుమిత్ర మొండితనం? తను ఆపినా ఆమె ఆగేలా లేదు. ఇదంతా ఒక ప్రమాదకరమైన ఆట. అందులోకి ఆమె వంటరిగా అడుగుపెట్టడాన్ని తను చూస్తూ ఊరుకోలేడు. ఆమె తేజాని ఎలా ప్రేమిస్తోందో తనూ ఆమెని అలాగే ప్రేమిస్తున్నాడు. ఆమె ప్రేమ ఆమెకి గొప్పదైతే తన ప్రేమ తనకీ గొప్పదే.
“సరే, నేనే నిన్ను తీసుకెళ్తాను. ఐతే ఒక షరతు. ముందు వాడి తల్లిదండ్రులని కలుద్దాం. వాళ్లేమంటారో విను. అప్పటికీ నీ మనసు
మారకపోతే వాడినీ చూపిస్తాను. ఇంకోమాట. అక్కడ వాడితో ఏం మాట్లాడకూడదు. చూసి వచ్చెయ్యాలి. అంతే!” అన్నాడు.
“అంటే వివరాలన్నీ నీకు తెలుసా సూర్యా?” అడిగింది. అందులోని వ్యంగ్యం అతన్ని తాకింది.
సుమిత్ర అతనికేసి చూసింది. అతని కళ్లల్లో వ్యక్తమవుతున్న బాధ ఆమె గుండెల్ని తాకింది. చాలా అవమానపరుస్తోంది ఇతన్ని. చాలా బాధపెడుతోంది. ఐనా తనని విడిచిపెట్టడం లేదు. తన క్షేమం మర్చిపోవటం లేదు. తను తేజా గురించి ఎంత ఆరాటపడుతోందో అంతకన్నా ఎక్కువగా ఇతను తన గురించి ఆరాటపడుతున్నాడు. కానీ… అతనిది స్వార్థం… అతనికోసం తను క్షేమంగా ఉండాలనుకుంటున్నాడు. ప్రేమకోసం త్యాగం చెయ్యాలనుకోవటం లేదు. తేజా దగ్గరకి తీసుకెళ్తానన్న ఒక్కమాట అనిపించడంకోసం ఇన్ని అనేదాకా తీసుకొచ్చాడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.
The next time I read a blog, Hopefully it does not fail me just as much as this particular one. I mean, Yes, it was my choice to read through, but I truly believed youd have something helpful to talk about. All I hear is a bunch of moaning about something you could possibly fix if you werent too busy seeking attention.