తను తేజాని కలవబోతోందన్న ఆలోచన సుమిత్రకి వొంటినిండా అమృతం నింపినట్టనిపించింది. తనుగా వెళ్ళలేక, వెళ్ళి తెలుసుకునేవారెవరూ లేక ఎంత బాధననుభవించిందో ఆమెకే తెలుసు.
మమతని పిలిచి అడిగాడు, “నీకు తేజా తెలుసా?” అని. ఆమె తలూపింది. “అతన్ని కలవటానికి వెళ్తున్నాం” అన్నాడు. అక్కవైపు ఆశ్చర్యంగా చూసింది. సుమిత్ర ఔనన్నట్టు తలూపింది.
“ఎందుకు? వాళ్ళు వద్దనేసాక?” అడిగింది రాధ… అప్పుడు ఆ విషయం బయటపెట్టింది. అంతేకాదు, సూర్యతో వంటరిగా కూతుర్ని పంపటంకూడా ఇష్టంలేదు.
“నీకు వాళ్ళు చెప్పారా? మరి నా దగ్గర ఎందుకు దాచావు?” సుమిత్ర తల్లిని నిలదీసింది.
“నీ మనసు పాడుచెయ్యటం దేనికని చెప్పలేదు. నీకే అర్థమౌతుందనుకున్నాను” రాధ చెప్పడానికి ఇబ్బందిపడింది. అది నిజం కాదు. ఆ విషయం ముందు స్వరూప గ్రహించింది. దాని వెనుకున్న ఆవిడ అంతరంగాన్ని మురళికి చెప్పటంలో ఆ పిల్ల కొంచెంకూడా పొరబడలేదు.
ఆవిడ అభ్యంతరం సుమిత్రని ఆపలేదు.
అనుకున్నట్టే ముందు తేజా తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లారు. తేజా తండ్రి రాజశేఖరం. ఆయన భార్య యశోద. వాళ్ళు ఇదివరకు సూర్య వెళ్ళినప్పటి యింట్లో లేరు. ఊరు చివర పెద్దగా జనసమ్మర్దం లేనిచోట ఫ్లాట్ కొనుక్కుని వుంటున్నారు. ఇద్దరూ బాగా వృద్ధాప్యం మీద పడ్డట్టుగా వున్నారు. దిగులు చాలా కృంగదీసింది. వీళ్ల రాకని భార్యాభర్తలిద్దరూ ఎంతమాత్రం ఊహించలేదు. ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తేజా గుర్తొచ్చి వాళ్ల ముఖాలమీద విషాదం పరుచుకుంది. ఇద్దర్నీ అలా పక్కపక్కని చూస్తుంటే అసూయ కలిగింది యశోదకి.
ఇద్దరికీ ఎలా పరిచయమైంది? పెళ్ళి చేసుకున్నారా? ఇక్కడికి దేనికి వచ్చినట్టు? మీరు వద్దనుకున్నా నేను సుఖంగానే వున్నానని చెప్పడానికి వచ్చిందా? చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసిందా? అంత చిన్న జీతంతో ఎలా చెయ్యగలిగింది? ఎన్నో ప్రశ్నలు.
నిస్సహాయంగా వుండగా తాము వదిలేసి వచ్చినప్పటి సుమిత్ర గుర్తొచ్చి ఇబ్బందిగా అనిపించింది.
ఎదురుగా ఆమెని చూస్తుంటే ఇంకొన్ని జ్ఞాపకాలు. సుమిత్రతో పెళ్ళి కుదరదని కచ్చితంగా చెప్పేసాకకూడా తేజా ఆమెని మర్చిపోలేదు. ఫోటో టేబుల్‍మీద పెట్టుకునేవాడు. ఎవరని సూర్యా అడగడం తన చెవిన పడింది. అతననే కాదు, అలా ఫోటో పెట్టుకుంటే ఎవరేనా అడుగుతారు. కోపంవచ్చింది. సంయమనం పోయింది. ఫోటో తీసి పాతపేపర్ల మధ్య పడేసింది. తర్వాత చూస్తే అది అక్కడ లేదు. కొడుకు మళ్ళీ తీసి దాచుకున్నాడనుకుంది. కానీ అతనే తమనించీ దాగిపోయాడు. అప్పటికే డ్రగ్స్ వాడుతున్నాడని తెలీలేదు. మనసుని ముల్లుతో కెలుకుతున్నట్టు బాధ. తప్పు జరుగుతున్నప్పుడు తెలీని బాధ… వాస్తవం తెలుసుకోనివ్వని బాధ… ఇప్పుడేమిటి యిలా లుంగలు చుట్టుకుపోతోంది? నిగ్రహించుకోవటానికి చాలా కష్టపడింది.
“ఏమ్మా, బావున్నావా? అమ్మా, చెల్లెళ్ళూ బావున్నారా?” పొడిగా అడిగింది. అందులో ఆర్తి లేదు. పరాయిపిల్లని పలకరించినట్టుందంతే.
“అత్తా! తేజా…” అంది సుమిత్ర. ఆమె గొంతు రుద్ధమైంది. కళ్లల్లో నీళ్లు నిండాయి. ఎలా ఆ విషయాన్ని మాట్లాడాలో అర్థం కాలేదు.
కొడుకు ప్రసక్తి రాగానే రాజశేఖరం భృకుటి ముడిపడింది. చూపులు తీక్ష ణంగా మారాయి. “వాడి ప్రసక్తి తేవద్దు సుమిత్రా! మా చెయ్యి దాటిపోయాడు. వాడు మా కొడుకని చెప్పుకుంటే చుట్టూ వున్నవాళ్ళందరి బతుకూ పాడవుతుంది. వాడిని వదిలి పెట్టేశాము. మీ అమ్మకి కూడా స్పష్టంగా చెప్పేశాను. వాడిమీద ఆశలు పెట్టుకోవద్దని. తను వేరేలా అర్థం చేసుకుంది. చేసుకుంటే చేసుకుంది, ఇలాగని చెప్పుకోలేం కదా?”” అన్నాడు.
“అమ్మ నాకు చెప్పలేదు” సుమిత్ర అడిగింది.
” మీకూ మాకూ కలవదు. వేరే సంబంధం చూసుకొమ్మని మీ అమ్మకి చాలా స్పష్టంగా నేనూ చెప్పాను. తను నీకెందుకు చెప్పలేదో మరి!” అంది యశోద. ఆమె గొంతులో ఉన్న కాఠిన్యం సుమిత్రని తీవ్రంగా గాయపరిచింది.
“మీరొదిలి పెట్టేసినా తేజాని సుమిత్ర మర్చిపోలేదు. ఇప్పుడు తను వచ్చింది కూడా వాడిని చూడటానికే” సూర్య కలుగజేసుకున్నాడు.
భార్యాభర్తలిద్దరూ తెల్లబోయారు. ముందుగా తేరుకున్నది రాజశేఖరమే. “అయితే ఇక్కడినుంచి వెంటనే వెళ్లిపొండి” అన్నాడు.
“లేదంకుల్! తేజాకి తనేదో చెయ్యగలననే భ్రమలో ఉంది సుమిత్ర. అది తొలగిపోతే తప్పించి తను మన ప్రపంచంలోకి రాదు.”
“వద్దమ్మా, సుమిత్రా! కన్నవాళ్లం మేమే వాడిని వదిలేసుకున్నాం. తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ తెల్లవారిందా, బతికున్నామా అని తృప్తిపడే మధ్యతరగతివాళ్ళం. పిల్లలు సరిగా చదవకపోతేనో, దొంగతనం చేస్తేనో, సిగరెట్టు తాగితేనే తిట్టో కొట్టో దార్లో పెట్టచ్చు. ఇదసలు మన పరిధిలోకి రాని నేరం. మనకి ఏమాత్రం తెలీని, పరిచయం లేని ప్రపంచంలో జరుగుతుంది. నేరస్తుడు మన లోకంలో వుండడు. వాడి చూపులూ, మనసూతో సహా ఎక్కడో తిరుగుతుంటాడు. వాడి చేత నేరం చేయించేవాడు మనకి కనిపించడు. ప్రభావం మాత్రం మనమీద వుంటుంది”
“…”
“వ్యవస్థ మంచిదే. దానంతట అది నడవలేదు. ఎవరో నడిపించాలి. ఆ నడిపించే మనుషుల్లో అనేక రకాలు. భిన్న నేపథ్యాలు, మనస్తత్వాలు, ప్రాథమ్యాలు … ఇవే సమాజం రూపేణా, రాజ్యం రూపేణా మనని శాసిస్తాయి. ఎవరికో అపారమైన డబ్బు కావాలి. ఇంకెవరికో ఆ డబ్బనేది ఎలా వచ్చినా పర్వాలేదు. మరొకరు ఆ డబ్బుకోసం ఎలాంటి నేరమేనా చేస్తారు. చేయిస్తారు… వాడు పట్టుబడ్డాక ఇంటిమీదికి ఎవరెవరో వచ్చేవారు. మా అనుమతేనా అడక్కుండా ఇల్లంతా వెతికి వెతికి వెళ్లేవారు. వాడేమైనా చెప్పాడా అని మమ్మల్ని హింసించేవారు. వాళ్లవంతు పూర్తయితే పోలీసుల వంతు మొదలయ్యేది. ఎన్నిసార్లు పోలీసుస్టేషను చుట్టూ తిరిగామో లెక్క తెలీదు. తోటిపిల్లల్లో అవమానం భరించలేక చిన్నాడు ఉరేసుకుని చచ్చిపోయాడు…”
ఆయన చెప్తున్నదాన్ని శ్రద్ధగా వింటున్న సుమిత్ర ఒక్కసారి వులిక్కిపడింది.
“ధరణీ చచ్చిపోయాడా?” గట్టిగా అడిగింది. ఇప్పుడుంటే మమత వయసుంటాడు.
“ఔను వాడిని కూడా పోలీస్ స్టేషన్‍కి పిలిచేవారు. ఇంకెవరో వచ్చి రెండేసిరోజులు తీసుకెళ్ళిపోయేవారు. అంతా అగమ్యగోచరంగా వుండేది. తట్టుకోలేకపోయాడు” గొంతు విషాదంగా వుంది. చేతుల్తో ముఖం రుద్దుకున్నాడు. యశోద భరించలేక అక్కడినుంచీ వెళ్ళిపోయింది.
“సుమిత్రా! నేరం మనింటికి వచ్చేదాకా మనకేమీ తెలీదు. వాడు చేసినది చాలా పెద్ద నేరం. పంథొమ్మిది వందల ఎనభయ్యైదులో చాలా గట్టి చట్టం చేసారు. దానికింద శిక్ష ఇరవయ్యేళ్ళదాకా వుండచ్చు. అండర్ ట్రయల్‍గా ఎన్నేళ్ళు ఉంచుతారో తెలీదు. నా కొడుకు ఒక్కడూ చెడిపోతేనే నాకింత క్షోభగా ఉంది. అలాంటి ఎందరో పిల్లల్ని పెడదోవ పట్టించే దారి వాడు ఎన్నుకున్నాడు. ఒక పోలీసు ఆఫీసర్ అదే అడిగాడు-
మీ కొడుకు చెడిపోతే మీరింత బాధపడుతున్నారు. ఇంకో తల్లిదండ్రులు కన్నపిల్లలు చెడిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? మేం ఎంతో కష్టపడుతున్నాం, త్యాగాలు చేస్తున్నాం లా అండ్ ఆర్డర్ నిలబెట్టడానికి. వీళ్లు తృటిలో దాన్ని ధ్వంసం చేస్తున్నారు- అన్నాడు.
మానుంచీ వాళ్లకేం కావాలో నాకు తెలీదు. మేము వాడికి సహకరించలేదని ఎన్నో విధాల చెప్పాను. ఇలాంటివాటిలో చాలామంది ప్రమేయం ఉంటుందట. అలాంటి వివరాలేమైనా తెలుసా అని వీళ్ల ప్రశ్న. తేజా కొంతమందికి డ్రగ్స్ అమ్ముతాడు. వాళ్ల వివరాలు మాకేమైనా చెప్పాడా అనేది వాళ్ల వెతుకులాట. మేం ఏవైనా బైటపడతామేమోనని వాళ్ళూ వీళ్ళూ గట్టి ప్రయత్నం చేసేవారు. మాకేమీ తెలీదనీ, వాడితో మాకెలాంటి సంబంధం లేదని ఎంత చెప్పినా వినేవారు కాదు. ఆఖరికి ఒక దయగల ఆఫీసరు వచ్చాడు. అతను అర్థం చేసుకున్నాడు. మేం ఈరోజుకి ఇలా ఉన్నాం” అన్నాడాయన.
పెళ్ళిళ్ళవకముందునించీ సుమిత్ర తండ్రికీ అతనికీ స్నేహం. ఒకే ఆఫీసులో చేసేవారు. పక్కపక్క ఇళ్ళు. మమతని చిన్నప్పుడు ఆయన గాల్లోకి ఎగరేసి పట్టుకుని కితకితలు పెట్టి ముద్దుచెయ్యడం సుమిత్రకి గుర్తు. తననీ అలాగే ఆడించేవాడేమో తెలీదు. ఈ అనుబంధాలని ఏ అక్కరలతో రద్దు చేయగలరు?
సూర్య బాధపడ్డాడు. ఆ బాధ రెండు విధాలు. రాజశేఖరంతో అతనికి పెద్దగా చనువు లేదు. తేజాకోసం వచ్చినప్పుడు చూడటమే. చెయ్యెత్తు మనిషి. నవ్వుతూ పలకరించేవాడు. అలాంటివ్యక్తిని ఇలా చూడటం మొదటిదైతే, దాని వెనుకగల కారణం మరొకటి.
మాదకద్రవ్యాల వ్యాపారం చాపకింద నీరులా నిశ్శబంగా జరిగిపోతోంది. ఎంతో మంది పెద్దపెద్దవాళ్లున్నారు అందులో. వాళ్లని వాళ్లు కాపాడుకునే ప్రయత్నంలో అన్నిదారులూ మూసేసి క్లోజ్డ్ సర్క్యూ ట్లా తమ వ్యాపారాన్ని నడుపుతారు. ఎక్కడినుంచీ ఎలాంటి చిన్నలింకు కూడా ఇంటరాగేట్ చేసే వాళ్లకి దొరకదు. అందుకని ఇంటరాగేషన్ చాలా తీవ్రతరంగా ఉంటుంది. వెనకా ముందూ ఎవరూ లేని తేజా తల్లిదండ్రుల మీద ఏ స్థాయిలో జరిగి ఉంటుందో తను ఊహించగలడు.
సుమిత్ర యశోదని వెతుకుతూ లోపలికి వెళ్ళింది. ఆవిడ మంచంమీద కూర్చుని వుంది. వెళ్ళి పక్కని కూర్చుంది.
“అత్తా!” నెమ్మదిగా పలకరింది. ఏడుపు తన్నుకొస్తుంటే ఆమె భుజంమీద తల ఆనించి నిశబ్దంగా ఏడవసాగింది.
“నువ్వెందుకే ఏడుస్తావు? ఇద్దరు కొడుకుల్తో సహా అన్నీ పోగొట్టుకున్నదాన్ని నేను” అంది ఆవిడ. అది నిస్సహాయతలోంచీ పుట్టుకొచ్చిన కోపం.
“మీ యిద్దరికీ ఎలా పరిచయం? పెళ్ళెప్పుడైంది?” అడిగింది సూర్యగురించి.
“పెళ్ళెప్పుడు చేసుకున్నాను? చేసుకున్నానని చెప్పానా?” సుమిత్ర అడిగింది.”
“చేసుకుంటారా?”
“అదీ చెప్పలేదుగా?”
ఆవిడకి మనసు రగిలిపోతోంది. తేజా మెడిసిన్లో చేరిన కొత్తలో సూర్యని తీసుకొచ్చి పరిచయంచేశాడు. తేజా మెడిసిన్ చదువుతుంటే సూర్యాది ఇంజనీరింగు… ప్రైవేటు కాలేజిలో డొనేషన్ కట్టి చేరాడు. స్పోర్ట్స్‌మీద శ్రద్ధతో చదువులో కాస్త వెనుకబడి ఉండేవాడు. అది ఆవిడకి చాలా గర్వంగా ఉండేది. తన కొడుకు చదువులో ఫస్టని తోతిపిల్లలతో పోల్చుకుని సంతోషపడేది. ఇంట్లోకంటే బాగుంటుందని హాస్టల్లో చేరాడు. మొదటంతా బాగానే వుండేది. జారుడుమెట్ల మీద ప్రయాణం మొదలుపెట్టాడు. తెలీదు అలా ఎలా జరిగిందో, ఏ పరిచయాలు అతన్ని అటు చేర్చాయో! ఇంటికి రావటానికి ఇష్టపడేవాడు కాదు. వచ్చినా ఒకపూటో రెండు పూటలో అతికష్టంమీద వుండేవాడు.
“మీరెందుకు గుర్తించలేకపోయారు?” అడిగాడు సూర్య, అవతల రాజశేఖరాన్ని.
“ఇలాంటివి ఒకటి వుంటాయి, మనింటిదాకా వస్తాయనుకుంటే కదా?” అన్నాడాయన.
“అమ్ముతూ పట్టుబడేదాకా మీరెందుకు తెలుసుకోలేకపోయారని?”
“వాడు హాస్టల్లోకి మారాడు సూర్యా! చదువుకుంటున్నాడుకదా అనుకున్నాం. డబ్బు బాగా అడిగేవాడు. పెద్ద చదువు చదువుతున్నాడుకదా, బాగా ఖర్చులుంటాయని అనుకుని అడిగినంతా వాడి అకౌంట్లో వేసేవాడిని. ఇదే వూళ్ళో కాబట్టి వెళ్ళి వాడిని కలిసే అవసరంకూడా లేకపోయింది. వెళ్ళినా, కలిసినా వాడి జాగ్రత్తలో వాడుండడూ? పిల్లలు తండ్రిని మించి ఎదిగితే, వాళ్ళ ప్రపంచం పెద్దవాళ్ళ ప్రపంచానికన్నా భిన్నంగా వుంటే ఇవే సమస్యలు. నిలదీసి ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగే ధైర్యం కూడా ఉండదు ఒక్కొక్కప్పుడు. ఇంటికి వచ్చి వెళ్ళాక ఒకసారి యశోద గొలుసు కనిపించలేదు. మాకు సహజంగానే పనామెమీదికి పోయింది. పోలీసు కంప్లెయింటిచ్చాం. తీగలాగితే డొంకంతా కదిలినట్టు వాడసలు హాస్టల్లోనే వుండట్లేదని తెలిసింది. ఆ తర్వాతివన్నీ త్వరత్వరగా జరిగాయి”
సూర్య నిట్టూర్చాడు. తల్లిదండ్రులు పిల్లల్నించీ కష్టాలు వస్తాయని అనుకోరు. పిల్లలు చెడ్డవాళ్లనీ అనుకోరు. బయటి ప్రభావాల్లో పడి చెడుదారుల్లోకి వెళ్తే ఆఖరిగా తెలిసేది వీళ్ళకే.
“సైకిలు తొక్కుతూ ఆఫీసుకి వెళ్ళి హాయిగా పనిచేసుకుని ఇంటికొచ్చి నిశ్చింతగా బతికిన రోజులు మళ్ళీ రావు. అతి చిన్న పరిధిలో చాలా భరోసాగా గడిపేసాం. ఇప్పుడు ప్రపంచం కుగ్రామమైంది. ఏవైపునించీ ఏ ప్రమాదం వస్తుందోనని సాధారణంగా బతకడానికి కూడా భయపడిపోతున్నాం. ఇదేనా, మనం సాగించిన ప్రగతి?” అన్నాడు రాజశేఖరం.
యశోద సుమిత్రని చూస్తోంది.
తండ్రి చిన్నవయసులోనే చనిపోయి ఇంటెడు బాధ్యతలూ మీద పడ్డా, సుమిత్ర బాగానే ఉంది. చిన్నఉద్యోగంలో చేరినా, బాధ్యతలు తీర్చుకుంది. సూర్యా బాగానే ఉన్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారేమో, తన కొడుకుకన్నా సుఖంగానే ఉంటారు. పిల్లల్ని కంటారు. వాళ్లని పెంచుతూ, పెద్ద చేస్తూ ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకుంటారు. ఆవిడ కళ్లల్లో నీరు నిలిచింది.
కానీ… ఈ సుమిత్ర ఎవరు? తన చేతుల్లో పెరిగిన పిల్ల. అత్తా అంటూ తన చుట్టూ తిరిగినది. తేజాతో ఆడిపాడినది. సరదాకీ వేడుక్కీ అనుకున్నా తేజాకి భార్యగా తమ ఊహల్లో కాసేపు నిలిచినది. అప్పటిదాకా అణిచి ఉంచిన ప్రేమ మళ్లీ మొలకెత్తింది.
“జరిగిందేదో జరిగిపోయింది. ఎందుకమ్మా, వాడిని చూడటం?” అంది అయిష్టంగా. సరిగ్గా అప్పుడు వచ్చాడు సూర్యా అక్కడకి.
“సుమిత్రా, వెళ్లామా?” అడిగాడు.
ఆమె లేచి నిలబడింది.
మరోసారి చెప్పి చూశాడు రాజశేఖరం. ఆమె వినలేదు. అంతటి ప్రేమకి దూరంగా వెళ్లిపోయిన కొడుకుని తలుచుకుని జాలిపడ్డాడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.