ప్రియమైన జీవితం – 13 by S Sridevi

  1. ప్రియమైన జీవితం – 1 by S Sridevi
  2. ప్రియమైన జీవితం – 2 by S Sridevi
  3. ప్రియమైన జీవితం – 3 by S Sridevi
  4. ప్రియమైన జీవితం – 4 by S Sridevi
  5. ప్రియమైన జీవితం – 5 by S Sridevi
  6. ప్రియమైన జీవితం – 6 by S Sridevi
  7. ప్రియమైన జీవితం – 7 by S Sridevi
  8. ప్రియమైన జీవితం – 8 by S Sridevi
  9. ప్రియమైన జీవితం – 9 by S Sridevi
  10. ప్రియమైన జీవితం – 10 by S Sridevi
  11. ప్రియమైన జీవితం – 11 by S Sridevi
  12. ప్రియమైన జీవితం – 12 by S Sridevi
  13. ప్రియమైన జీవితం – 13 by S Sridevi
  14. ప్రియమైన జీవితం – 14 by S Sridevi
  15. ప్రియమైన జీవితం – 15 by S Sridevi
  16. ప్రియమైన జీవితం – 16 by S Sridevi
  17. ప్రియమైన జీవితం – 17 by S Sridevi
  18. ప్రియమైన జీవితం – 18 by S Sridevi
  19. ప్రియమైన జీవితం – 19 by S Sridevi

తేజాని కలవడంకోసం తన పరిచయాలని ఉపయోగించాడు సూర్య. లక్ష యక్ష ప్రశ్నలడిగి, అతికష్టమ్మీద అతన్ని దూరంనుంచీ మాత్రమే చూడటానికి అనుమతించారు. అవసరంలేని చోట అతిగా అధికారం చలాయించడం, అవసరం వున్నచోట ఉపేక్షో, అస్మదీయభావనో… ఏనుగుని కదిలించలేరు కాబట్టి వదిలేస్తారు. కుందేలుని వురికిస్తారు. ఇవన్నీ మనిషిలోంచీ వ్యవస్థలోకి ప్రవేశించిన జాడ్యాలు. అతిపెద్దదైన ఈ దేశపు రక్షణావ్యవస్థలో అతనొక చిన్న ఉపకరణం మాత్రమే. అప్పుడే కొత్తగా ఉద్యోగంలోకి ప్రవేశించాడు. ఇంకా ఆ మనస్తత్వాన్ని వంట పట్టించుకోలేదు. బతుకు రాజకీయాలు తెలీవు. అందులో ఉండే నేరప్రపంచానికీ, వాళ్లని హేండిల్ చెయ్యటానికి కావల్సిన కాఠిన్యానికీ అలవాటుపడలేదు. అతని పరిధిలో వున్నవి రకరకాల దొంగతనాలు, చిన్నచితకా కొట్లాటలు, కొట్టుకోవటాలు, వాటికి సంబంధించిన ప్రాథమిక విచారణలు… అంతే. స్పోర్ట్స్ కోటాలో వచ్చిందని చేరాడుగానీ ఈ ఉద్యోగం అతనికి ఎలాంటి సంతోషాన్నీ సంతృప్తినీ ఇవ్వలేదు. ఆ చట్రంలో ఇమడలేకపోతున్నాడు. ఎలాంటి బాదరబందీ వుండని ప్రైవేటు వుద్యోగమే మంచిదనిపిస్తోంది. వదిలేద్దామనే ఆలోచిస్తున్నాడు.
అన్న యూయస్‍లో వున్నాడు. రమ్మంటున్నాడు. వీసాకూడా వుంది. మలేసియాలో మేనమామలు వున్నారు. వాళ్ళకి ఇండస్ట్రీస్ వున్నాయి వర్క్ పర్మిట్‍కీ, వీసాకీ ఇటుకూడా మార్గం వుంది. సుమిత్ర పరిచయం అతన్ని ఆపింది. తేజాని కలవటానికి వెళ్తున్న ఈ ప్రయాణంలో అతను కొన్ని నిర్ణయాన్ని తీసుకున్నాడు.
వాళ్ల కారు బయల్దేరింది. తేజాని ఉంచిన జైలు చేరుకోవటానికి దాదాపు రెండు గంటలు పట్టింది. రాజశేఖరం చెప్పినచోట లేడు. నాలుగైదుచోట్ల తిరిగితేగానీ ఆచూకీ తెలీలేదు.
సెంట్రీ వెంట రాగా తేజాని ఉంచిన సెల్ దగ్గరకి వెళ్లారు. వయొలెంటుగా ప్రవర్తిస్తున్నాడట. అందుకని ఐసొలేట్ చేసి ఉంచారు. అలాంటిచోట్ల మానవమర్యాదలేమీ వుండవు. కటకటాల వెనుక అతన్ని చూసి సుమిత్ర భయపడిపోయి సూర్యని గట్టిగా పట్టుకుంది. అతనామెకి ధైర్యం చెప్తున్నట్టు భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకి తీసుకున్నాడు.
మనిషిగా బైటికి కనిపిస్తున్నా తేజా కళ్లలోని క్రౌర్యపు చూపు, అలవాటైనదానికోసం తహతహ… సుమిత్రకి దిగ్భ్రాంతిగా ఉంది. దుఃఖం ఉప్పెనలా చుట్టేసింది. తను చూసిన తేజా… సుమిత్రా, నా చదువయ్యాక మనం పెళ్లిచేసుకుందాం … అన్న తేజా… కుటుంబబాధ్యతలు చూసి తను భయపడుతుంటే ధైర్యం చెప్పిన తేజా… ఎలాంటివాడు ఎలా మారిపోయాడు!
సుమిత్ర రాక తేజాలో పెద్ద కుదుపు. ఆమె సూర్యాతో కలిసి రావటం అతని మనసులో ఒక ప్రళయమే సృష్టించింది. అతని నరనరాల్లో బాధ…
ఒక చిన్న సరదా… జస్ట్ సరదా అంతే… తన జీవితాన్ని ఎంతగా మార్చేసిందో! తండ్రి ట్రాన్స్ఫర్ చేయించుకుని వైజాగ్ వచ్చేశాక కూడా చదువు బాగా సాగుతుందని తను హాస్టల్లోనే ఉండేవాడు. రూమ్మేట్‍కి అలవాటుండేది. తనని బలవంత పెడితే రెండుమూడుసార్లు తీసుకున్నాడు. ఎప్పటికప్పుడు అదే ఆఖరుసారి అనుకుంటూ ఇంకో రెండుసార్లు తీసుకున్నాక ఇంక తీసుకోకపోతే ఉండలేననిపించే పరిస్థితి వచ్చింది. సరిగ్గా అప్పట్నుంచే తన పతనం మొదలైందేమో!
“ఇదంతా ఒక క్లబ్ లాంటిది. నేను నిన్ను చేర్చాను. నువ్వు మరొకర్ని చేర్చాలి. లేదంటే కొనుక్కోవాలి. కొనుక్కోవాలంటే అమ్మాలి. అమ్మితే కమిషన్ వస్తుంది”” అన్నాడు। రూమ్మేటు ఇవ్వటం ఆపేసి. ఈ వలయం యొక్క పూర్తి రూపం చూపెట్టి. అక్కడ పూర్తయింది తన పతనం. జారుడుమెట్లమీంచీ దొర్లుకుంటూ వెళ్లి ఊబిలో పడ్డాడు. ఎంతో పెద్ద నెట్‍వర్కుతో నడుస్తున్న ఈ విషపువలలో ఎక్కడో చిన్న కుదుపు… తను ట్రాపయ్యాడు. అమ్ముతూ దొరికిపోయాడు. పరిణామాలు ఇలా వుంటాయని తనని ఎవరూ హెచ్చరించలేదు. తనుగా తెలుసుకునే స్థితి దాటిపోయింది. అకశేరుకాలు, సకశేరుకాలు, శైవలాలు, శిలీంధ్రాలు… ఇవేకదా తనకి తెలిసినది… అనాటమీ, జెనెటిక్స్… ఇవేకదా, తను నేర్చుకున్నవి? ఎన్‍డీపీయస్ యాక్ట్ గురించీ భారతీయ శిక్షాస్మృతి గురించీ తనకేం తెలుసు? చివరి రెండూ తనకి తెలీనందుకు తమ్ముడు ప్రాణం తీసుకున్నాడు. అమ్మ, నాన్న కష్టాలుపడ్డారు.
డీయెడిక్షన్ థెరపీ ఇస్తున్నారు. కానీ తనకి ఇందులోంచీ బయటపడాలని లేదు. ప్రపంచాన్ని చూడాలని లేదు. భవిష్యత్తేంటో తెలీదు. బయటికి వెళ్తే అలా తప్ప బతుకు లేదు. ఇప్పటికీ తనమీద బయటినుంచీ చాలా వత్తిడులున్నాయి. తననుంచీ ఆశింపులున్నాయి. ఎందుకంటే అప్పట్లో తను చాలా చురుగ్గా వ్యాపారం చేసేవాడు. అలాంటివాడిని వాళ్ళు వదులుకోవటానికి సిద్ధంగా లేరు.
ఎందుకొచ్చింది సుమిత్ర? తనని చూడటానికా? ఇంకా మర్చిపోలేదా? చాలాకాలమైంది తను ఆమెకి ఉత్తరాలూ ఫోన్లూ ఆపేసి. ఐనా తన గురించి తెలిశాక కూడా ఎలా రాగలిగింది? సూర్య… సూర్య సుమిత్రకెలా తెలుసు? సూర్య కళ్లు ఎంత తీక్షణంగా ఉన్నాయి? తనని శోధిస్తున్నట్టు? ఒకప్పుడు తన చూపులూ ఇలాగే ఉండేవి. చురుగ్గా… సూటిగా చూడగలిగేవాడు. ఇప్పుడు? సుమిత్రని చూడగలడా? పోనీ సూర్యని? అతను తల బలంగా విదిల్చాడు.
ఇలా ఎందుకొచ్చారు? ఎంత ప్రమాదాన్ని ఆహ్వానించారో తెలీదా? సుమిత్రకి కాకపోతే సూర్యాకి? ప్రేమా స్నేహం అంటే ఇవేనా? అతని గుండె లోతుల్లో ఎక్కడో మానవత్వపు స్పర్శ. నిద్రాణంగా ఉన్న భావాలేవో జాగృతమయ్యాయి. తదేకంగా వాళ్లిద్దర్నీ చూస్తూ ఉండిపోయాడు.
“సార్, టైమైంది” సెంట్రీ హెచ్చరించాడు.
ఇద్దరూ వెనక్కి తిరిగారు.
బైటికొచ్చి కార్లో కూర్చున్నారు. సూర్య స్టార్ట్ చేశాడు. సుమిత్ర చాలా బెదిరిపోయింది. తేజాని చూడాలనుకోవటం వేరు. వాస్తవంగా చూడటం వేరు. ఈ అనుభవం ఆమెని భయపెడుతోంది. వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇలా ఎలా మారిపోయాడు! అదే ఆలోచన ఆమెలో. కన్నతల్లిదండ్రులకీ, స్నేహితులకీ, బంధువులకీ సమాజానికీ దూరంగా ఎవరికీ ఏమీ కానట్టు… ఎందుకిలాంటి జీవితాన్ని ఆహ్వానించాడు? తాగాలనీ, తినాలనీ, తిరగాలనీ, చూడాలనీ, చెయ్యకూడనివన్నీ చెయ్యాలనీ మనిషిలో కోరికలు ఎందుకు పుడతాయి? అతనిలో అంతర్హితంగా వుండే చీకటికోణంలో ఆ కోరికలు నిక్షిప్తమై వుంటాయా? ఆ చీకట్లోకి సంస్కారమనే వెలుతురు చొరబడలేదా? సహజంగా వుండే తెలివి, ఆ తెలివితో చదివిన చదువు మనిషిని నడిపించలేవా? ఎందుకు ఇతను చేజేతులారా నాశనాన్ని కొనితెచ్చుకున్నాడు? ఇతన్ని ఈ ఊబిలోంచీ బైటికి లాగటం తనవల్ల సాధ్యపడుతుందా? ఒక మహావిధ్వంసాన్ని చూసిన విషాదం. చేతుల్లో ముఖం దాచుకుంది.
సూర్యకి జాలేసింది ఆమెని చూస్తుంటే. ఏదో వుంది, వుందని కాలాన్ని కొవ్వొత్తి చేసి వెలిగించి వెతుకులాడితే ఏమీ లేదని తెలిసినప్పుడు… నీటిచెలమ అనుకుని వెళ్తే ఎండమావి ఎదురైనప్పుడు ఎంత నిస్పృహ ఎలా ఉంటుందో అంచనా వెయ్యగలిగాడు.
“సుమిత్రా! బాధపడకు” అన్నాడు ఓదార్పుగా.
“అతనింక అంతేనా?” బేలగా అడిగింది.
అతను చిన్నగా నిట్టూర్చాడు. “చదువులోనో కెరీర్‍లోనో సలహా ఇవ్వచ్చు. కానీ వాడు ఎంచుకున్నది మనకెవరికీ పరిచయం లేని దారి. అందులోకి ఎలా వెళ్లాడో అలాగే బైటికి రావాలి. అది వాడికొక్కడికే వస్తుంది. మనం ఏమీ చెయ్యలేం” అన్నాడు. సుమిత్ర దర్శించిన జీవనవిధ్వంసాన్ని అతనూ చూసాడు. అంతేకాదు, తేజాని చూసి వచ్చినదాని పరిణామం ఎలా ఉంటుందో అతని ఊహకి అందడం లేదు.
సరిగ్గా అదే క్షణాన గుర్తించాడతను. ఎవరో తమని ఫాలో అవుతున్నారు. తేజాని వాళ్లు వదిలి పెట్టలేదు. కదలికలు మళ్లీ మొదలయ్యాయి. అతని ఆలోచనలు చురుగ్గా కదిలాయి.
“సుమిత్రా!” పిలిచాడు.
ఏమిటన్నట్టు చూసింది. “కార్లోంచీ దూకాలి”
చూశాడు. రోడ్డు బాగా ఎత్తుగా ఉంది. కొద్దిదూరంలో ఒక మలుపు ఉంది. ఒక్క క్షణం. కళ్లు మూసుకుని గట్టిగా గాలి పీల్చుకున్నాడు.
ఆమె అర్థం కానట్టు చూసింది. “బలంగా గాలి పీల్చుకుని కళ్ళు మూసుకుని ఒక జంప్… అంతే”
ఆమెకి అర్థమవలేదు.
“పడేటప్పుడు తల నేలకి తగలకుండా జాగ్రత్త పడాలి. కాళ్ళూ, చేతులూ విరిగినా అతికించుకోవచ్చు. తలకి దెబ్బ తగిలితే కష్టం”
సుమిత్రకి అర్థం చేసుకోవటానికిగానీ ఆలోచించుకోవటానికిగానీ టైమివ్వలేదు. టర్న్ రాగానే కారు న్యూట్రల్లో పెట్టి గాలి బలంగా పీల్చుకున్నాడు. అతనికి బంగీ జంప్‍లాంటి ఆటల అనుభవం వుంది. ఆమెకి అలాంటివేవీ లేవు. ఐనా జాగ్రత్తగానే దూకింది. ప్రాణభయం. ఆ ఇంపాక్ట్‌కి కారు కిందకి దొర్లింది. దొర్లుతూనే ఉంది. వెంటనే బండచాటుకి దొర్లారు ఇద్దరూ. పైని రోడ్డుమీద మోటార్ సైకిళ్లు ఆగిన శబ్దం. ఇంతలో ఎవరిదో సెల్ మోగింది. ఆగకుండా మోగుతూనే ఉంది. తర్వాత ఆగింది. క్లుప్తమైన సంభాషణ.
“వప్పుకున్నాడు” ఎవరిదో గొంతు.
“ఫ్రెండ్సట. ఏం చెయ్యొద్దన్నాడు” వివరణ.
అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. మళ్లీ మోటారుసైకిళ్లు స్టారైన చప్పుళ్లు. సుమిత్రకి దాదాపుగా స్పృహ పోయింది. చిగురాకులా వణుకుతోంది. తేజాతో సహవాసం ఇకమీదట ఇలా వుండబోతుందా? సినిమాల్లో చూసే దృశ్యాలు, మాఫియాగురించి పేపర్లో చదివిన వార్తలు జ్ఞాపకాలపొరలు చీల్చుకుని బయటికి వచ్చాయి. వాస్తవం అదేననుకుంది. కానీ కాదు. ఆ గొడవలదీ అల్లర్లదీ పతాకస్థాయి. నిజజీవితం జేమ్స్‌బాండ్ మూవీలా వుండదు. సైకిల్ చెయిన్లూ కత్తులూ తుపాకులూ పట్టుకుని ఎవరూ ఇక్కడ పట్టపగలు రోడ్లమీద తిరగరు. తేజాలాంటి చిన్నస్థాయి వ్యక్తులు అసలే తిరగరు. చక్కటి పౌరుల్లా మనుషుల్లో కలిసి తిరుగుతూ వాళ్ళ పనులు, వ్యాపారాలూ చక్కబెట్టుకుంటారు. రద్దీలో పొరపాట్న కిందపడిపోయిన పర్సు తీసిచ్చి ధన్యవాదాలు చెప్పించుకున్నవాళ్ళలోనూ, పరిగెత్తుతూ వచ్చి కదుల్తున్న రైలు అందుకుని సీటిస్తే ధన్యవాదాలు చెప్పిన సహప్రయాణీకుడిలోనూ వుండచ్చు. క్రిమినల్ నిరంతరం భౌతికమైన క్రైమ్ చేస్తూ వుండడు.
“ఏమిటిదంతా?” వణుకుతున్న గొంతుతో అడిగింది.
“పార్ట్ ఆఫ్ ద గేమ్” నవ్వాడతను. ఆమెని దగ్గిరగా తీసుకున్నాడు. “ఆర్యూ ఓకే?” అడిగాడు. “పద వెళ్తాం” లేచాడు.
“వాళ్ళు.. వాళ్ళు?”
“తేజా కొత్తస్నేహితులు” అదే నవ్వుతో అన్నాడు. “వాళ్లమధ్య కమ్యూనికేషన్ గేప్ ఉంది. వాడెందుకో మౌనం వహించాడు. ఇప్పుడా మౌనం వదిలాడు. ఇప్పుడు వాళ్లతో ఒక అవగాహనకి వచ్చినట్టున్నాడు”
“మన కోసమేనా?” అడిగింది సుమిత్ర.
“కావచ్చు””
“అతడా జీవితాన్నుంచీ బైటపడాలనుకున్నాడేమో! అడిగి అడిగి కొంతకాలానికి వాళ్లే ఊరుకుంటారని మౌనం వహించాడేమో! సూర్యా! మనం వచ్చి అతడి నిర్ణయాన్ని మార్చామేమో!” అంది. ఔనేమో, సూర్యా ఏమీ మాట్లాడలేదు. తేజాకన్నా సుమిత్ర ఎక్కువ. ఒక క్రిమినల్‍కన్నా సివిలియన్, పోలీస్ వుద్యోగీ ఎక్కువ. అదే అతని సమీకరణం.
ఇద్దరూ నెమ్మదిగా రోడ్డుమీదకి వచ్చారు. సుమిత్ర నడవలేకపోతోంది. ఆమె బరువుని అతనే మోసాడు. కొద్దిదూరం వెళ్లాక వెనక నుంచి మరో వెహికిల్ వస్తున్న చప్పుడు. సుమిత్ర బెదిరిపోయింది. అది క్రమంగా దగ్గరవసాగింది. శబ్దాన్ని బట్టి సూర్య గుర్తించాడు, పోలీసు జీపు. అతనికి రిలీఫ్ అనిపించింది.
“ఎందుకిలా?” తడారిపోయిన గొంతుతో అడిగింది.
అతనింకా జవాబు చెప్పలేదు.
జీపు వీళ్ళ దగ్గర ఆగింది. డ్రైవరు ఏమీ మాట్లాడలేదు. చిన్న స్లిప్ అందించాడు.
“భయంలేదు. నాలుగైదుచోట్ల వెహికిల్సు మారుతూ వెళ్ళండి. కారు మెకానిక్ షాపునించీ వారం తర్వాత తీసుకోండి ” అని వుంది అందులో. ఎవరో తెలీదు. జైలు సూపర్నెంటు కావచ్చు. డిపార్టుమెంటు మనిషని ఆపాటి సాయం చేసి వుండచ్చు. తేజాకూడా కావచ్చు. స్లిప్‍మీద సంతకం లేదు. దాన్ని జేబులో వేసుకున్నాడు. ముందు సుమిత్రని ఎక్కించి తను ఎక్కాడు. జీపు కదిలింది. సిటీలో బాగా రద్దీగా వుండేచోట దిగి ఆటో ఎక్కి ట్రావెలింగ్ ఏజెన్సీకి వెళ్ళారు.
ఇల్లు చేరేసరికి సుమిత్ర పూర్తిగా అలిసిపోయింది. మానసికంగానూ శారీరకంగానూ కూడా. జరిగిందంతా కలలోలా వుంది. రాధ ఇద్దర్నీ ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది వీళ్ళకి? ఎక్కడికి వెళ్ళారు? ఎలా వస్తున్నారు? ఎన్నో ప్రశ్నలు.
“మమతా! వేడిగా కాఫీ కావాలి” అన్నాడు సూర్య.
ఆవిడ ఏదో అనబోతుంటే ఆపి, స్వరూప వెళ్ళి రెండు కప్పుల్తో తీసుకొచ్చింది. తల్లిని చూడటానికి వచ్చింది స్వరూప. ఆవిడద్వారానే తెలిసింది, తేజాని కలవటానికి ఇద్దరూ వెళ్ళారని.
దార్లో కొన్న కంపోజ్ మాత్ర సుమిత్రకి వేసాడు సూర్య. అది వేసుకున్నాక ఆమె తన గదిలోకి వెళ్ళి మంచం మీద వెంటనే నిద్రలోకి జారిపోయింది.
“వేడినీళ్లూ, దూదీ కావాలి” సూర్య ఈమాటు రూపకే చెప్పాడు. రూప లోపలికి వెళ్ళి ఐదు నిముషాల్లో అతను అడిగినవి తీసుకొచ్చింది.
కార్లోంచీ దూకినప్పుడు సుమిత్ర కాళ్ళూ చేతులూ చెక్కుకుపోయాయి. చెప్పులెక్కడో జారిపోయాయి. తిరిగి పైకొస్తున్నప్పుడు చెప్పుల్లేక కాళ్ళలో తుప్పలు గీరుకుపోయాయి. పాదాలు రక్తపుముద్దల్లా వున్నాయి. రూప కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
“ఏం జరిగింది?” రాధ అడిగింది.
“తేజాని చూడటానికి వెళ్ళాం. తిరిగి వస్తుంటే యాక్సిడెంటైంది” తలెత్తకుండా చెప్పాడు సూర్య. రాధ ముఖం పాలిపోయింది.
“మీరు అక్కని వాళ్ళింటికి తీసుకెళ్ళారా? అతనేమన్నాడు?”” స్వరూప విస్మయంగా అడిగింది. అతనికి సుమిత్రంటే ఎంత యిష్టమో గ్రహించలేనంత చిన్నపిల్ల కాదు. అతనే స్వయంగా వెంటపెట్టుకుని తీసుకెళ్ళాడంటే… అతని సంస్కారానికి గౌరవం కలిగింది.
“వాడు నా ఫ్రెండు. ఇద్దరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి చూద్దామని వెళ్ళాం” ఆమె ఆలోచనని తుంచేస్తూ అన్నాడు సూర్య.
అతను కాటన్‍తో సుమిత్ర పాదాలు క్లీన్ చేస్తుంటే అడిగింది “డాక్టరుకి ఫోన్ చెయ్యనా?”
“వద్దు. అవసరం లేదు. ఈ విషయం ఎవరి దగ్గరా అనద్దు” హెచ్చరించాడు.
సూర్య తన పని పూర్తి చేసాడు. “”తనని లేపద్దు. ఇలాగే పడుకోనివ్వండి” రాధతో అని, “”రూపా! నువ్వీవేళ ఇక్కడే వుండు. అక్కని ఒంటరిగా వదలకు” అన్నాడు.
అతను వెళ్తుంటే రాధ అక్కడే వుండిపోయింది. స్వరూప వెనక వెళ్ళింది.
“అసలేం జరిగింది?”
సూర్య క్లుప్తంగా చెప్పాడు. “”అతనొక నార్కొటిక్. క్రిమినల్. సుమిత్ర అతన్ని గురించి ఏవేవో వూహించుకుని అతని వూహల్లోనే బతుకుతోంది. తనకి వాస్తవం చూపించాలని తీసుకెళ్ళాను. చిన్న షాక్ ఇచ్చాను. నిజానికి కార్లోంచీ దూకడం, ఇదంతా చెయ్యక్కర్లేదు. సుమిత్రకి భయం పుట్టాలని చేసాను. మేం చెయ్యి పెట్టినది పాముల పుట్టలో, కాబట్టి చాలా జాగ్రత్తగా వుండాలి. ఏమీ కాకపోవచ్చు కూడా. జాగ్రత్తగా వుండటంలో నష్టం లేదు. నేను మళ్ళీ వస్తాను. ఈలోగా ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చెయ్యి” అన్నాడు.
“ఎందుకిదంతా చేసారు?” ఆర్తిగా అడిగింది స్వరూప.
అతనామె ముఖంలోకి చూసి చిన్నగా నవ్వాడు. “నేపాళ మాంత్రికులూ, అమాయక ప్రేమికులూ వుండే రోజులు కావివి. ఐనా ప్రేమ పరీక్షలున్నాయి. ఇదొక రకం”” ఆ మాటలనేసి అతను గబగబ వెళ్ళిపోయాడు.
ఆరోజు తేజాని కలవటానికి వచ్చిందెవరో చెప్పమని డిపార్టుమెంటుమీద వత్తిడి వచ్చిందని రహస్యంగా ఎవరో సూర్యాకి చేరవేసారు. అతనికి చికాగ్గా అనిపించింది. స్టేట్స్‌లో వుండే తన అన్నకి ఫోన్ చేసాడు. తన దగ్గరకి వచ్చెయ్యమని చెప్పాడతను. అదే మంచిదనిపించింది సూర్యాకి.

3 thoughts on “ప్రియమైన జీవితం – 13 by S Sridevi”

  1. I was extremely pleased to discover this page. I want to to thank you for ones time due to this wonderful read!! I definitely appreciated every part of it and I have you bookmarked to look at new information on your web site.

  2. The next time I read a blog, Hopefully it does not fail me just as much as this particular one. I mean, Yes, it was my choice to read through, but I truly believed youd have something helpful to talk about. All I hear is a bunch of moaning about something you could possibly fix if you werent too busy seeking attention.

Comments are closed.