ఇల్లు చేరేసరికి సుమిత్ర పూర్తిగా అలిసిపోయింది. మానసికంగానూ శారీరకంగానూ కూడా. జరిగిందంతా కలలోలా వుంది. రాధ ఇద్దర్నీ ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది వీళ్ళకి? తేజాని చూడ్డానికి వెళ్తున్నామన్నారు. అక్కడికే వెళ్ళారా? ఏం జరిగింది? వాళ్ళేమన్నారు? సుమిత్రని చేసుకోవటం కుదరదని అప్పుడే చెప్పేసారు. కొత్తగా ఏం జరిగింది? ఎన్నో ప్రశ్నలు.
“మమతా! వేడిగా కాఫీ కావాలి” అన్నాడు సూర్య.
రాధ ఇంకా ఏదో అనబోతుంటే స్వరూప వెళ్ళి రెండు కప్పుల్తో తీసుకొచ్చింది. తల్లిని చూడటానికి వచ్చింది స్వరూప. ఆవిడద్వారానే తెలిసింది, తేజాని కలవటానికి ఇద్దరూ వెళ్ళారని. దార్లో కొన్న కంపోజ్ మాత్ర సుమిత్రకి వేసాడు సూర్య. అది వేసుకున్నాక ఆమె తన గదిలోకి వెళ్ళి మంచం మీద వెంటనే నిద్రలోకి జారిపోయింది.
“వేడినీళ్లూ, దూదీ కావాలి” సూర్య ఈమాటు రూపకే చెప్పాడు. రూప లోపలికి వెళ్ళి ఐదు నిముషాల్లో అతను అడిగినవి తీసుకొచ్చింది.
కార్లోంచీ దూకినప్పుడు సుమిత్ర కాళ్ళూ చేతులూ చెక్కుకుపోయాయి. చెప్పులెక్కడో జారిపోయాయి. తిరిగి పైకొస్తున్నప్పుడు చెప్పుల్లేక కాళ్ళలో తుప్పలు గీరుకుపోయాయి. పాదాలు రక్తపుముద్దల్లా వున్నాయి. రూప కళ్ళలో నీళ్ళు తిరిగాయి అక్కని అలా చూస్తుంటే.
“ఏం జరిగింది?” రాధ అడిగింది.
“తేజాని చూడటానికి వెళ్ళాం. తిరిగి వస్తుంటే యాక్సిడెంటైంది” తలెత్తకుండా చెప్పాడు సూర్య. రాధ ముఖం పాలిపోయింది.
“మీరు అక్కని వాళ్ళింటికి తీసుకెళ్ళారా? అతనేమన్నాడు?”” స్వరూప విస్మయంగా అడిగింది. అతనికి సుమిత్రంటే ఎంత యిష్టమో గ్రహించలేనంత చిన్నపిల్ల కాదు. అతనే స్వయంగా వెంటపెట్టుకుని తీసుకెళ్ళాడంటే… అతని సంస్కారానికి గౌరవం కలిగింది.
“వాడు నా ఫ్రెండు. ఇద్దరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి చూద్దామని వెళ్ళాం” ఆమె ఆలోచనని తుంచేస్తూ అన్నాడు సూర్య.
అతను కాటన్‍తో సుమిత్ర పాదాలు క్లీన్ చేస్తుంటే అడిగింది “డాక్టరుకి ఫోన్ చెయ్యనా?”
“వద్దు. అవసరం లేదు. ఈ విషయం ఎవరి దగ్గరా అనద్దు” హెచ్చరించాడు.
సూర్య తన పని పూర్తి చేసాడు. “”తనని లేపద్దు. ఇలాగే పడుకోనివ్వండి” రాధతో అని, “”రూపా! నువ్వీవేళ ఇక్కడే వుండు. అక్కని ఒంటరిగా వదలకు” అన్నాడు.
అతను వెళ్తుంటే రాధ అక్కడే వుండిపోయింది. స్వరూప వెనక వెళ్ళింది.
“అసలేం జరిగింది?” అడిగింది.
సూర్య క్లుప్తంగా చెప్పాడు. “”అతనొక నార్కొటిక్. క్రిమినల్. సుమిత్ర అతన్ని గురించి ఏవేవో వూహించుకుని అతని వూహల్లోనే బతుకుతోంది. తనకి వాస్తవం చూపించాలని తీసుకెళ్ళాను. చిన్న షాక్ ఇచ్చాను. నిజానికి కార్లోంచీ దూకడం, ఇదంతా చెయ్యక్కర్లేదు. సుమిత్రకి భయం పుట్టాలని చేసాను. మేం చెయ్యి పెట్టినది పాముల పుట్టలో, కాబట్టి చాలా జాగ్రత్తగా వుండాలి. ఏమీ కాకపోవచ్చు కూడా. జాగ్రత్తగా వుండటంలో నష్టం లేదు. నేను మళ్ళీ వస్తాను. ఈలోగా ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చెయ్యి” అన్నాడు.
“ఎందుకిదంతా చేసారు?” ఆర్తిగా అడిగింది స్వరూప.
అతనామె ముఖంలోకి చూసి చిన్నగా నవ్వాడు. “నేపాళ మాంత్రికులూ, అమాయక ప్రేమికులూ వుండే రోజులు కావివి. ఐనా ప్రేమ పరీక్షలున్నాయి. ఇదొక రకం”” ఆ మాటలనేసి అతను గబగబ వెళ్ళిపోయాడు.
ఆరోజు తేజాని కలవటానికి వచ్చిందెవరో చెప్పమని డిపార్టుమెంటుమీద వత్తిడి వచ్చిందని రహస్యంగా ఎవరో సూర్యాకి చేరవేసారు. ప్రభుత్వ విభాగాల్లో అన్నో లుకలుకలు. వ్యవస్థ మంచిదే. దాన్ని నడిపించే వ్యక్తుల ప్రాథమ్యాలు దాన్ని నడిపిస్తాయి. వాళ్ళ వ్యక్తిత్వాలు ఆ నడతలో ప్రతిబింబిస్తాయి. దేశాన్ని లంచగొండితనం, అవినీతి ఇండెక్సుల్లో పెద్దపెద్ద స్థానాల్లో నిలబెట్టేది అలాంటి వ్యక్తుల సమిష్టి కృషే. దానిముందు నిజాయితీపరుల నిజాయితీ తుఫానులో గడ్డిపరకలా కొట్టుకుపోతుంది.
జరుగుతున్నదంతా సూర్యాకి చికాగ్గా అనిపించింది. స్టేట్స్‌లో వుండే అన్నకి ఫోన్ చేసాడు. తన దగ్గరకి వచ్చెయ్యమని చెప్పాడతను. అదే మంచిదనిపించింది సూర్యాకి.
పన్నెండుగంటలు నిర్విరామంగా నిద్ర పోయింది సుమిత్ర. కళ్ళు తెరిచిచూసేసరికి జరిగినదంతా ఒక పీడకలలా గుర్తొచ్చి చిగురాకులా వణికిపోయింది. తేజా చూపులు ఆమెని వెంటాడాయి. మంచం దిగబోయింది. కానీ కాలు కింద పెట్టలేకపోయింది. నిస్సయంగా దిండులో తలదాచుకుంది. ఉప్పెన అలల్లా విరుచుకుపడ్డాయి దు:ఖపుకెరటాలు.
తేజా… సమ్మోహనపరిచిన ఆ చూపులు.. అందమైన నవ్వులు ఏమైపోయాయి? ఎందుకు జరిగిందిలా? ఎక్కడ పొరపాటు జరిగింది? హాస్టల్లో వుండి ఎందరు చదువుకోవటం లేదు? ఎందరు పెద్దపెద్ద డాక్టర్లవలేదు? ఒక్క ఇతని విషయంలోనే ఎందుకిలా జరిగింది? అంత తేలిగ్గా ఎలా అలవాటుపడ్డాడు? అతనిలోని బలహీనతని అతని రూమ్మేట్ ఎలా పట్టుకోలిగాడు? అతని తల్లిదండ్రులు ముందుగా ఎందుకు తెల్సుకోలేకపోయారు? ధరణీ ఎందుకు చచ్చిపోయాడు? చనిపోయినప్పటికి పదిహేనేళ్ళో పదహారేళ్ళో అంతే. తనకి కొంత వూహ తెలిసాకే అతడూ, మమతా పుట్టారు. అంత చిన్నపిల్లాడికి చావు అనే దారి ఎలా తెలిసింది? తేజా అతనికీ డ్రగ్స్ ఇచ్చాడా? డ్రగ్స్ దొరక్క చచ్చిపోయాడా? అవమానంతో చచ్చిపోయాడా? అల్లకల్లోలంగా వున్నాయి ఆమె ఆలోచనలు. చాలాసేపు ఏడ్చింది.
దుఃఖపు తీవ్రత తగ్గాక ఆమెలో వివేచన మేల్కొంది. తను తనింకా తేజాని ప్రేమిస్తోందా? అతనితో తన భావాలనీ ఆ తర్వాత ఎప్పుడేనా జీవితాన్ని పంచుకోగలదా? అతనితో మామూలుగా మాట్లాడగలదా? పోనీ అతనికోసం ఎదురుచూస్తూ వంటరిగా వుండగలదా? ఆమెలో ఎక్కడో తిరుగుబాటు కూడా మొదలైంది.
అతనేం భగత్‍సింగో మరో మహాత్ముడో కాదు, అతనికోసం ఎదురుచూస్తూ మిగిలిపోవటానికి. కేవలం దురలవాట్లకి అలవాటుపడితే అది బలహీనత అనుకుని క్షమించి అతన్లో మార్పుకోసం ప్రయత్నించవచ్చు. ఎన్నో జీవితాలు నాశనమవటానికి కారణమైనదాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఎందరి బతుకులో చిందరవందర చేసి వాళ్ళని ప్రేమించినవాళ్లకి గుండెకోతని మిగిల్చినవాడు. స్వంత తమ్ముడు, తల్లిదండ్రులుకూడా తప్పించుకోలేకపోయారు. అతన్ని చేసుకోలేదు, కాంటాక్ట్‌లో లేదుగాబట్టి తను తప్పించుకుంది. లేకపోతే ఆ బరిలో తనూ వుండేది. తనతోపాటే చెల్లెళ్ళుకూడా ఆ విషవలయంలోకి వెళ్ళిపోయేవారు.
“సరదాగా తీసుకో సుమిత్రా, తప్పేం లేదు” అనేవాడేమో తనతో కూడా. ఆమెకి ఒక్కసారి వొళ్ళు జలదరించింది. అలా జరగలేదన్న సంతోషంకన్నా, జరిగితే ఎలా వుండేదన్న భయం ఆమెని వణికించింది. అలాంటివాడికోసం తను త్యాగం చెయ్యాలా? ఎట్టకేలకి, చిట్టచివరికి, కడాఖరికి నిలిచిన ప్రశ్న.
అలాగని తేజాని అలా వదిలిపెట్టెయ్యటమేనా? పెళ్ళిచేసుకోకపోయినా అతన్ని మార్చే ప్రయత్నం చెయ్యకపోతే చిన్నప్పటి స్నేహానికి అర్ధమేమిటి? తనకి ఆరోజున గుళ్ళో ఎంత వోదార్పునిచ్చాడు? అలాంటివాడికి ఏమీ చెయ్యకుండా ఎలా? ఆమె ఆలోచనలు సూర్యవైపుకి మళ్ళాయి. సూర్య తనకోసం ఎంత కష్టపడ్డాడు? తేజా దారితప్పుతున్నాడని తెలిసినప్పట్నుంచి తన వెంటవెంటే వున్నాడు. తనెవరో తెలీకపోయినా ఫోటో తీసి దాచాడు. గౌరవించాడు. సూర్య తనకోసం చేసింది తక్కువేం కాదు. ఇంకా మాట్లాడితే అసలు ఇద్దరికీ పోలికే లేదు. అతన్ని తనే గౌరవించడం లేదు. బాధపెడుతోంది. అతన్ని అనవసరపు రిస్కులోకి లాగింది. ఆమె ఆలోచనలు దారీ తెన్నూ లేకుండా సాగిపోతున్నాయి. కన్నీళ్ళు కారుతున్నదికూడా తెలీలేదు.
“ఏడవకు అక్కా! కొంతమంది గురించి ఏడ్చి మన కన్నీళ్ళు వృధా చేసుకోకూడదు” అంది స్వరూప. “సూర్య మళ్ళీ వస్తానని ఫోన్ చేసి చెప్పాడు. నువ్విలా ఏడిస్తే అతను బాధపడతాడు. తేజాకోసం ఏడవటం అర్థం లేనిది” అంది.
సూర్య ప్రస్తావన రాగానే రాధ ముఖం అప్రసన్నమైంది. ఏదో పనున్నట్టు అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తనలో తేడాని స్వరూప స్పష్టంగా గుర్తించింది. సుమిత్ర ఇదేదీ పట్టించుకునే స్థితిలో లేదు. దిండుమీద తల పెట్టుకుని ముడుచుకుని పడుకుంది.
సాయంత్రం స్వరూపని తీసుకెళ్ళడానికి భార్గవ వచ్చాడు. సుమిత్ర పరిస్థితి చూసి, ఆమెకి వంట్లో బాలేదనుకున్నాడు.
“ఈరోజుకి వుండి, రేపు వస్తాను” అంది స్వరూప.
“నువ్వెందుకే? నేను చూసుకుంటానుకదా?” అంది రాధ. తీసుకెళ్తానని వచ్చిన అల్లుడిని వెళ్ళిపొమ్మంటే కోపం వస్తుందేమోనని భయపడింది. కానీ మనుషుల్లో చాలా మార్పొచ్చింది. తమకి కావలిసినది స్పష్టంగా చెప్పటం ఆడపిల్లలు, భార్య మాటలకీ, అవసరాలకీ విలువు ఇవ్వటం మగపిల్లలు నేర్చుకుంటున్నారు.
సుమిత్రని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొమ్మని అతను వెళ్ళిపోయాడు.
తన జీవితం తనొక్కదానిదే కాదని సుమిత్రకి మరోసారి అనుభవంలోకి వచ్చింది.
“సునీతకి తొమ్మిదోనెల వస్తోంది. సూడిదలు ఇచ్చి పురిటికి తీసుకురావాలి” అంది రాధ. సుమిత్ర ఔననీ కాదనీ అనలేదు. తలూపి ఆఫీసుకి వెళ్ళిపోయింది.
డబ్బు… డబ్బు…
తోడి తీసుకోవటానికి పెరట్లో తవ్వుకున్న బావో, ముద్రించి తెచ్చుకోవటానికి కంప్యూటర్ కాగితమో కాదు. మనిషియొక్క శ్రమశక్తి. దాన్ని సమాజచోదక ఇంధనంగా సృష్టిస్తే అది ఎన్నో చేతులు మారి ఎందరి అవసరాలో తీర్చి, తిరిగి మన దగ్గరికి వచ్చేసరికి అపారంగా విలువ మార్చుకుంటుంది. సాయంత్రం ఇంటికి వచ్చాక తల్లి చేతిలో రెండు కవర్లు పెట్టింది. ఒకదాంట్లో డబ్బుంది. రెండోదాంట్లో చిన్న ప్లాస్టిక్ డబ్బాలో వుల్లిపొరకాగితంలో చుట్టిన పొట్లం… అందులో చిన్న గొలుసు, వుంగరం వున్నాయి. ఆవిడ ప్రశ్నార్ధకంగా చూస్తూ అదే కవర్లో వున్న ఇంకో పేకెటు తీస్తే ఒక గాజు వుంది. అది సుమిత్రది. అప్పుడు చూసింది రాధ, ఆమె చేతికి వున్న మట్టిగాజులని. మనసు చివుక్కుమనిపించినా సర్దుకుంది. కుటుంబం అన్నాక ఇవన్నీ తప్పవు. బాధ్యతలన్నీ తీరాక జీతం సుమిత్రకి మిగులే. అప్పుడు మళ్ళీ చేయించుకుంటుంది.
“నువ్వొస్తావా?” అడిగింది.
“మమతని తీసుకెళ్ళు”
“ఇంటికి పెద్దదానివి. నువ్వు రాకపోతే వాళ్ళేమైనా ఆక్షేపిస్తారేమో!”
“పెద్దదానివి నువ్వు. నేను కాదు” ముస్తసరిగా అంది సుమిత్ర. మంచిది చూసుకుని సునీతకి చీరా, ఐదురకాల పిండివంటలు, చలిమిడి, ఐదురకాల పళ్ళు అన్నీ కొని సర్దుకుని, మమతని వెంటపెట్టుకుని బయల్దేరింది రాధ.
“ఇవన్నీ వాళ్ళిద్దరే తింటారామ్మా?” అడిగింది మమత.
“వాళ్ళే తినరు. చుట్టుపక్కల అందరికీ పంచుకుంటారు. వేడుకంటే ఎవరికీ తెలీకుండా మనం ఒక్కళ్ళమే తిని, చడీ చప్పుడూ కాకుండా మూతి తుడుచుకోవటం కాదు” అంది రాధ.
అప్పటికి మురళి తల్లి కోడలికి సాయంగా వచ్చి వుంది. మొదట్నుంచీ మురళి తండ్రిది అదో తరహా. తను, తన చెల్లెళ్ళు… అంతే. ఇంకేవీ పట్టవు. కోడలివైపునించీ కూడా తన చెల్లెళ్ళకి మర్యాదలు జరిగితే ఇంకేదీ అక్కర్లేదు. కానీ సునీత పుట్టింటివారికి తన చెల్లెళ్ళేమౌతారనేది ఆయన ఆలోచనకి అందని విషయం.
“శ్రీమంతం మాయింట్లో చేసుకుంటాం” అంది రాధ.
“మాకు శ్రీమంతం సాంప్రదాయం లేదు. ఏకంగా పురిటికి తీసుకెళ్ళడమే” మురళి తల్లి. ఈ చర్చ సునీతకి ఏడోనెల వస్తుందన్నప్పట్నుంచీ జరుగుతోంది. డెలివరీకి పంపననేసాడు మురళి.
“అదేమిటి? మొదటి పురుడు పుట్టింట్లో జరగాలి. అది ఆనవాయితీ” అంది ఆవిడే.
“ఏ అర్ధరాత్రేనా డాక్టరు అవసరం పడితే ఎవరు వెళ్తారు?” అడిగాడు. నిజమే. అది సమస్యే. అత్తగారినే వుండిపొమ్మన్నాడు మురళి. సునీతకి పుట్టింటికి వెళ్ళాలని వుంది. “అంత అర్ధరాత్రైతే అంబులెన్స్ బుక్ చేస్తే రాదా?” అంది. మురళి ఆమెకేసి కోపంగా చూసాడు. “సమస్యలని ఎవరూ కోరి సృష్టించుకోరు. కొంచెం బుర్ర వాడు” అన్నాడు.
“అతను చెప్పింది నిజమే సునీతా! నేనే వెళ్ళి బట్టలూ అవీ తెచ్చుకుని వస్తాను. పురుడయాక ఇద్దర్నీ తీసుకెళ్తాను” అంది రాధ. రెండురోజులుండి తిరుగు ప్రయాణమయారు మమత, రాధ.
చేతినిండా డబ్బిచ్చి పంపించింది సుమిత్ర. కానీ మురళి ఒక్కపైసా కూడా ఖర్చుపెట్టనివ్వలేదు. అది పట్టుదలో, స్వాభిమానమో అర్థమవ్వలేదు సుమిత్రకి. ఏదైనా అతను ముందులా మాత్రం లేడు. సునీతకి కొడుకు పుట్టాడు. మగపిల్లవాడు కావటంతో చాలా అపురూపంగా అనిపించాడు రాధకి.
“నాకు రీఇంబర్స్‌మెంటు వుంది” అని డెలివరీ ఖర్చులుకూడా తనే పెట్టుకున్నాడు. పెటర్నిటీ లీవు పెట్టుకుని తిరగాల్సినదంతా తనే తిరిగాడు. విశాలంగా ఆలోచిస్తే చాలా విషయాలు సులువుగా ఆచరించయోగ్యంగా వుంటాయి. ప్రభుత్వం కూడా వుద్యోగస్తులకి ఎన్నో చేస్తోంది. వాటిని వాడుకోవటంలో వుంటుంది. మురళి సహోద్యోగి ఒకతని భార్యకి కేన్సరు. వైద్యం ఖర్చులన్నీ మామగారివి. పుస్తీపూసా అమ్ముకుని వైద్యం చేయిస్తున్నాడు. ఇతనుమాత్రం బిల్లులు పెట్టి రీయింబర్స్‌మెంటు తీసుకుని తన ఖాతాలో వేసుకుంటాడు. అలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మురళికి, సమాజం మారాల్సినది చాలా వుందని. అది జరగని పనికాబట్టి కనీసం తనేనా మారాలని. సుమిత్ర చుట్టూ కూడా ఇలాంటి సంఘటనలూ, మనుషులే వుంటారని అర్థమయ్యాక ఆలోచనల్లో ఆమెకీ సునీతకీ వుండగలిగిన తేడా మరింత ప్రస్ఫుటమైంది.
రోజుల పిల్లవాడిని తిప్పడం ఇష్టం లేక మూడోనెలలో బారసాలకి పెట్టుకున్నారు. అప్పుడు పుట్టిల్లు మళ్ళీ చూసింది సునీత. పిల్లవాడికి భర్త పేరు కలిసేలా పెట్టుకోవాలని రాధ ఆశపడితే సుమిత్ర కోప్పడింది.
“తులం బంగారం కూడా పెట్టలేనివాళ్ళం, నువ్వీ గొంతెమ్మకోరికలేవీ కోరకు” అంది. రాధకి అసంతృప్తిగా అనిపించింది. సునీత అక్కడికీ అననే అంది, “మా కుటుంబంలో మొదటి మగపిల్లాడు. నాన్న పేరు పెట్టుకోవాలని వుంది”
“మీ నాన్నేమైనా జమీందారేమిటమ్మా, పేరు పెట్టుకోవటానికీ, ఆయన పేరు నిలబెట్టాలనుకోవటానికీను? మొదటి పిల్లవాడు, ఇంటి ఇలవేల్పు శ్రీరామచంద్రమూర్తి. ఆ పేరు కలిసి వచ్చేలా పెట్టండి” అనేసాడు మురళి తండ్రి. మొదటిసారి సునీతకి అర్థమైంది, ఎవరి జీవితంమీద వారికి హక్కు లేకపోవటం అంటే ఏమిటో! భార్యని చిన్నబుచ్చడం ఇష్టం లేక తండ్రి చెప్పిన పేరు పెట్టి, మామగారి పేరుకూడా కలిపాడు మురళి.
సుమిత్ర బాబుని ఎంత ముద్దు చేసినా అది పైపై ప్రేమగానే అనిపించింది సునీతకి. బారసాలనాడు బాబుకి చిన్న వుంగరం, గొలుసూ చేయించింది సుమిత్ర. సునీత మొహం విడలేదు. మురళిమాత్రం అవేవీ వద్దన్నాడు . ఎదిగిన చెల్లెలికి మానేసి, తను పెళ్ళి చేసుకుని విందులూ, వేడుకలూ చేసుకుంటున్న అన్నగారి పరిస్థితి ఎలా వుంటుందో అలా వుంది అతనికి.
“మీరు ఏం పెట్టినా రెట్టింపు తిరిగి ఇచ్చేస్తాను” అని బెదిరించాడు కూడా. చిన్నపిల్లవాడి అలకలా అనిపించింది సుమిత్రకి. అతన్ని సూటిగా చూసింది.
“ఐతే అదేదో మా చెల్లిమీద ప్రేమ రూపంలోచూపించండి. తప్పు చేసింది నేను. అది కాదు. నేను అతిగా స్పందించాను. ప్లీజ్! మీరిద్దరూ ఇదివరకట్లా వుంటే అందరికీ సంతోషంగా వుంటుంది. లేకపోతే మీ యిద్దరి మధ్యా కలతలు సృష్టించిన బాధ నన్ను ఎప్పటికి వదలదు. మీ అక్కో చెల్లెలో తొందరపడి తప్పు చేస్తే మన్నించలేరా? ” అంది సుమిత్ర.
“మీ అక్కచెల్లెళ్ళతో నేను నెగ్గలేనండీ!” మురళి నవ్వేసాడు. భార్యతో వున్న స్పర్ధ ఆమె మారితే తప్ప తీరదు. ఆ స్పర్ధతో కలిపి ఆమెని స్వీకరించి, దాన్ని బతుకులో ఒక భాగం అనుకోవాలి.
మురళి ముగ్గురు మేనత్తలూ వచ్చారు. పడీపడీ వాళ్ళకి మర్యాదలు చేసారు రాధ, సుమిత్ర. స్వరూప, దేవకీ కుటుంబం వచ్చారు. పిల్లవాడికి బట్టలు, డయపర్లు, క్రీములు, లోషన్లు, వుపయోగపడేవన్నీ తీసుకొచ్చింది స్వరూప. ఎదురుగా ఆమెని, తెల్లగా దూదేకులా వున్న పసివాడిని, చూసి తెల్లవంటి మనవల కలలన్నీ కన్నది దేవకి. వేడుకంతా సరదాగానే గడిచినా చినచిన్న అపశృతులు దొర్లక మానలేదు. మురళి కుటుంబానికీ, స్వరూప అత్తవారింటికీ వున్న తేడా ప్రస్ఫుటమైంది. యద్భావం తద్భవతి అంటే ఇదేనా?!
సుమిత్ర మళ్ళీ బాధ్యతల్లో మునిగిపోవటాన్ని చూసాడు సూర్య. తేజా విషయంలో అతను భయపడ్డట్టు ఇంకేమీ జరగలేదు.
“ఎప్పుడొస్తున్నావురా?” ఫోన్ చేసి అడిగాడు అన్న. జవాబేం చెప్పాలో తెలీలేదు.
“అలా ఎలా వచ్చేస్తానురా? ఇక్కడి బోల్డన్ని వ్యవహారాలు” అన్నాడు తిక్కగా. ముందు వస్తానని చెప్పటమేమిటో, ఇప్పుడీ జవాబేమిటో అర్థమవలేదు అన్నకి. చిన్నప్పట్నుంచీ వున్నదే. చదువు కాకుండా ఇంకా ఎన్నో వ్యాపకాలుండేవి సూర్యకి. బీటెక్ అవగానే జీఆర్‍యీ టోఫెల్ రాసి ఏదో ఒక యూనివర్సిటీలో సీటు తెచ్చుకుంటే తను స్పాన్సర్ చేస్తానన్నాడు. అది కాదని జాబ్ వీసాకి అప్లై చేసాడు. హెచ్ వన్‍వీసా తెచ్చుకున్నాడు. దాన్ని పక్కని పడేసి ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో ఇంట్రెస్టు లేదంటున్నాడు. వీడితో ఎప్పటికీ సమస్యే అనుకున్నాడు, ఐఐటీలో చదివి, మరో ఐఐటియన్ని పెళ్ళి చేసుకున్న అతను. అతనికింకా పూర్తి విషయాలు తెలీదు. తేజాగురించీ, సుమిత్రగురించీ. సూర్య చెప్పలేదు. అతనికి చెప్తే ముందు తల్లికి వుప్పందిపోతుంది.
ఉన్నపళంగా తనంటే వీసా వుంది, వెళ్ళగలడుగానీ, సుమిత్రని తీసుకెళ్ళలేడు. ఇంట్లో చెప్పి, అమ్మానాన్నల్ని వప్పించి పెళ్ళి చేసుకుని అప్పుడు ప్రాసెస్ మొదలుపెట్టాలంటే చాలా టైమ్ పడుతుంది. అంతకాలం ఆమెని వదిలి పెట్టడమంటే ఆలోచించుకునే అవకాశం ఇవ్వటమే…
అవకాశం వుంటే-
తన తల్లికి ఈ సంబంధం వద్దనిపించవచ్చు…
ఏడ్చో బాధపడో సుమిత్రని పెళ్ళి చేసుకోకుండా రాధ వప్పించవచ్చు…
తేజా మనసు మార్చుకోవచ్చు…
సుమిత్ర మనసు కరగచ్చు…
ఇలాంటివి ఎన్నో వున్నాయి. అందుకని ఎవరికీ ఎలాంటి అవకాశం ఇవ్వద్దనుకున్నాడు. సూర్యాకి ఇప్పుడు తన ప్రేమకూడా ముఖ్యంకాదు. ఆ అమ్మాయి తేజా వలలో పడకూడదు. అతను మర్చిపోయాడేమో! తాము పనిగట్టుకుని వెళ్ళి గుర్తుచేసి వచ్చారు. అసలు అతను అండదండలు లేని ఈ నలుగురు ఆడపిల్లల్ని, ముఖ్యంగా సుమిత్రని వదిలిపెట్టడమే వింత. ఇప్పుడింక చేయవలసినది ఒకటే. వెంటనే పెళ్ళి చేసుకోవటం. రిజిస్టర్ మేరేజి చేసుకోవాలన్నా వాళ్ళు నోటీసుబోర్డులో పెట్టి అభ్యంతరాలకోసం నెలరోజులపాటు చూస్తారు. ఏదేనా గుడిలో పెళ్ళి చేసుకుని, పెళ్ళిని రిజిస్టరు చేసుకోవటం.
సుమిత్ర ఆఫీసుకి వెళ్ళాడు సూర్య. ఆఫీసైపోయింది. నీలిమ అప్పటికే వెళ్ళిపోయింది. అతనితో కలిసి ఇవతలికి వచ్చింది. హోటల్‍కి వెళ్ళటానికి ఇష్టపడదు ఆమె. అందుకని గుడికి తీసుకెళ్ళాడు. దేవుడి దర్శనం చేసుకుని ఇవతలికి వచ్చి కోనేటి వడ్డుని కూర్చున్నారు.
“నీకు ఆఫీసు వుండదా?” అడిగింది.
“డ్యూటీ నీదగ్గర వేయించుకున్నాను” అన్నాడు.
“మాటలు ఎక్కువయ్యాయి”
“జాబ్ వదిలేద్దామనుకుంటున్నాను. రెజిగ్నేషన్ ఇచ్చాను” అన్నాడు నెమ్మదిగా. సుమిత్రకి వుద్యోగం ఇనపచొక్కాలాంటిది. తనింక ఎప్పటికీ దాన్ని వదలలేననుకుంటోంది. అలాంటిది అతను అలా అనటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
“అన్న యూయస్‍లో వుంటాదు. అక్కడికి వెళ్ళిపోవాలని ఆలోచన”
“ఏమిటి, నువ్వనేది? జాబ్ వదిలేసి అమెరికా వెళ్ళిపోతావా?” తెల్లబోతూ అడిగింది సుమిత్ర.
“మరేం చెయ్యను? ఇక్కడే వుండి నీతోపాటు బాధపడుతూ కూర్చోనా?”” కోపంగా అడిగాడు.
“తేజానలా వదిలిపెట్టి…?”
ఆమె ఇంకా అతన్నిగురించి ఆలోచించడం నచ్చలేదు సూర్యాకి. రెండుచేతులూ ఎత్తి దణ్ణం పెట్టేసాడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.