ప్రియమైన జీవితం – 15 by S Sridevi

  1. ప్రియమైన జీవితం – 1 by S Sridevi
  2. ప్రియమైన జీవితం – 2 by S Sridevi
  3. ప్రియమైన జీవితం – 3 by S Sridevi
  4. ప్రియమైన జీవితం – 4 by S Sridevi
  5. ప్రియమైన జీవితం – 5 by S Sridevi
  6. ప్రియమైన జీవితం – 6 by S Sridevi
  7. ప్రియమైన జీవితం – 7 by S Sridevi
  8. ప్రియమైన జీవితం – 8 by S Sridevi
  9. ప్రియమైన జీవితం – 9 by S Sridevi
  10. ప్రియమైన జీవితం – 10 by S Sridevi
  11. ప్రియమైన జీవితం – 11 by S Sridevi
  12. ప్రియమైన జీవితం – 12 by S Sridevi
  13. ప్రియమైన జీవితం – 13 by S Sridevi
  14. ప్రియమైన జీవితం – 14 by S Sridevi
  15. ప్రియమైన జీవితం – 15 by S Sridevi
  16. ప్రియమైన జీవితం – 16 by S Sridevi
  17. ప్రియమైన జీవితం – 17 by S Sridevi
  18. ప్రియమైన జీవితం – 18 by S Sridevi
  19. ప్రియమైన జీవితం – 19 by S Sridevi

“వాడికోసం నేనేమీ చెయ్యను. చెయ్యలేను కూడా. నేను చాలా సామాన్యుడిని సుమిత్రా! నా వుద్యోగం కూడా చిన్నది. నాకు రాజకీయాలూ, ఈ వైకుంఠపాళీ ఆటలూ తెలీవు. ఈ వుద్యోగం నాకు సరిపడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఎవరో తెలివితక్కువగా వాళ్ల జీవితాన్ని పాడుచేసుకుంటే దాన్ని సరిదిద్దడం నా చేతుల్లో లేనిది. నేను చిక్కుల్లో పడి నా తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగించలేను” అన్నాడు.
“ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గనిపించడం లేదూ? నువ్వూ నీ తల్లిదండ్రులూ, నువ్వు ప్రేమించిన నేనూ ఇదేనా జీవితం?”
“కాక? ముందు మనం బాగుంటే మన చుట్టూ బాగు చెయ్యచ్చు. నీకాళ్ళ కింది నేలే స్థిరంగా లేనప్పుడు నువ్వెరికి చేయూతనివ్వగలవు?”
“అందుకు దేశం వదిలిపెట్టి పారిపోవాలా?”
“ఏముందని ఈ దేశాన్ని పట్టుకుని వేలాడాలి?”
“అందరూ నీలాగే ఆలోచిస్తే?”
“ఆలోచిస్తే కాదు, ఆలోచించాలి. ఒక్కరికీ నీతీ నిబద్ధతా లేదు. ఆ రోజేం జరిగిందో నువ్వు మర్చిపోయావా? మనం ఎంతో రహస్యంగా వెళ్ళిన సంగతి అప్పుడే అందరికీ తెలిసి పోయింది. మా డిపార్టుమెంటులో వంద ప్రశ్నలు. నేనెందుకు రిస్కు తీసుకోవాలి?”
“గాంధీ, నెహ్రూ నీలాగే ఆలోచించి వుంటే ఈరోజుని మనం ఇలా వుండేవాళ్ళం కాదేమో!”
‘‘ఈరోజుని… ఆరోజుల్లోకన్నా ఏమంత గొప్పగా వున్నాం? అప్పుడు వాళ్లు త్యాగాలు చేసారు, స్వాతంత్య్రం వచ్చింది. యాభైతొమ్మిదేళ్ళైంది, స్వాతంత్య్రం వచ్చి. ఏం సాధించామని? ఇంకా దేశం త్యాగాలు కోరుతూనే వుంది. బోర్డరులోనూ నగరాల నడిబొడ్డున కూడా రక్తతర్పణాలు జరుగుతునే వున్నాయి. పేదరికం, అవిద్యా, పెరిగాయి. సంస్కారం, మానవత్వం తగ్గాయి. ఈ దేశ నిర్మాణంలో మన పాత్ర ఏమిటని ప్రశ్నించుకుంటే నాకలాంటిదేం కనిపించడం లేదు. ఆరోజుని వాళ్లు అందమైన భవిష్యత్తుకోసం త్యాగాలు చేసారు. అలాగే స్వతంత్రం వచ్చింది. మనం ఏం సాధించాలని త్యాగాలు? “
“ఈ దేశం నాకేమిచ్చిందని ప్రశ్నించుకుంటే ఎలా?”
“అలాగే ప్రశ్నించుకోవాలి. అదే కనస్ట్రక్టివ్ థాట్. మనం పడే శ్రమ, చేసే త్యాగం మనకి ఎక్కడో ఒకచోట ప్రతిఫలాన్నివ్వాలి. అదిలేన్నప్పుడు అంతా బూడిదలో పోసిన పన్నీరే కదా?””
ఆమె అతన్ని సునిశితంగా చూసింది. మనిషి బతికే బతుకు, దొరికే అవకాశాలు, అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఇవన్నీ మనిషియొక్కఆలోచనావ్యవస్థని నిర్మిస్తాయి. ఆ కారణంచేతనే భిన్న ధృకథాలు ఏర్పడతాయి. ఒకే సమస్యని, ఒకే విషయాన్ని ఇద్దరు చూసే చూపుల్లో తేడా వుంటుంది.
“నేను పలాయనవాదినిగానీ దేశద్రోహినిగానీ కాను సుమిత్రా! బేసికల్లీ నాకీ వుద్యోగం నచ్చలేదు. ఒక విత్తనం నాటితే అది మొక్క మొలిచి చెట్టుగా ఎదిగి పుష్పించి ఫలించాలని కోరుకునే ఆశావాదిని. అలాంటి కృషి ఎంతైనా చేస్తాను. కానీ నేను పడే శ్రమ వృధా కావటాన్ని భరించలేను. నేను పాటించే సూత్రం ఒక్కటే. నాకు నేను నిజాయితీగానూ ఇతరులపట్ల మంచిగానూ వుంటాను. దేవుడు నాకు ఒకటే జీవితాన్నిచ్చాడు. ఎవరో చేసిన తప్పులకి దాన్ని బలిచెయ్య లేను. నీ దృష్టిలో నేను స్వార్ధపరుడినే కావచ్చు. నువ్వలా అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. నీ విషయంలో నా నిర్ణయం మారదు” అన్నాడు.
చాలాసేపు మౌనంగా వుంది సుమిత్ర.
“తేజాకి శిక్షపడుతుందా?! అడిగింది సుమిత్ర చివరికి.
“పడాలి అనేది నా కోరిక. ఒక దోషి తప్పించుకుంటే వాడొక వందమంది దోషుల్ని తయారుచేస్తాడు. అదే వాడొక్కడినీ శిక్షిస్తే ఆ వొక్కడూ కూడా మారే అవకాశం. వుంటుంది” అన్నాడు. అతని ఆలోచనలు చాలా కటువుగా వున్నాయి. కానీ తప్పుగా లేవు. ఇనుముని వంచాలంటే సుత్తే వుండాలి. వజ్రాన్ని కోయాలంటే ఇంకో వజ్రమే కావాలి
“ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో స్టేట్స్ వెళ్ళటం అనేది ఒక ఆప్షన్. మా యింట్లో ఎవరికీ ఈ గొడవలేవీ తెలీవు. నాకెలాగా వీసా వుంది. వస్తానని అన్నయ్యకి చెప్పాను. వాడు వచ్చెయ్యమన్నాడు. కొన్నాళ్లు అక్కడుండి వస్తే ఈ గొడవలు చల్లారిపోతాయి. నిన్ను వంటరిగా వదలలేను. మనం వీలైనంత త్వరగా పెళ్లిచేసుకోవాలి. ఇద్దరం విడిగా వెళ్ళడంకంటే ఇలా వెళ్ళడం తేలికౌతుంది. నువ్వు ప్రిపేరైతే రేపు గుళ్లో చేసేసుకుందాం. తర్వాత మిగతావి ఆలోచిద్దాం” అన్నాడు.
సుమిత్ర నిశ్చేష్టురాలై కూర్చుంది. అతన్నించీ పెళ్ళి ప్రతిపాదన మళ్ళీ వస్తుందని తెలుసు. ఇప్పటికే చాలాసార్లు అడిగాడు. ఇప్పుడు ఇంత త్వరగా, ఇంత ఇంపాక్ట్‌తో అనుకోలేదు. తేజా విషయంలో ఏదీ చెయ్యడట. అతన్నలా వదిలెయ్యటమేనట. అంతేనా? అదొక ఆలోచన.
ఆమెకి ఆలోచనకి వ్యవధి ఇవ్వాలనుకోలేదు సూర్య. తేజాని ఆమె మనసులోంచీ తరిమెయ్యాలి. ఆమె చుట్టూ ఒక బలమైన కోటలా తను ఆవరించుకోవాలి.
“ఇంక వెళ్దాం” చుట్టూ చూస్తూ అంది సుమిత్ర. అతనికి జవాబేం చెప్పాలో అర్థమవలేదు. ఆమెని ఇంటిదగ్గర దింపాడు. ఈ విషయంలో సుమిత్రకి కాస్తంత బ్రెయిన్‍వాష్ చేసి నచ్చజెప్పేవాళ్ళెవరుంటారా అని ఆలోచిస్తే స్వరూప గుర్తొచ్చింది. ఆమెతో అంతా వివరంగా మాట్లాడాడు. మర్నాడు తల్లిని చూడటానికి వచ్చినట్టు వచ్చేసింది స్వరూప.
“ఇప్పటికప్పుడు పెళ్లంటే ఎలా కుదుర్తుందే? ఇతను కాకపోతే ఇంకొకరు. లోకంలో ఇంక మనుషులే లేరా?” అంది రాధ చప్పుని ఆమె చెప్పిన మాటలు విని.
“అమ్మా!” స్వరూప తెల్లబోయింది. ఆవిడ అలా అంటుందనుకోలేదు.
“ఔనే! అది పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే ఇల్లెలా గడుస్తుంది? నాన్న వుద్యోగం దానికిచ్చారు. బాధ్యతలు తీర్చుకోకుండా పెళ్ళంటే ఎలా కుదుర్తుంది?” అనేసింది.
కొన్ని మాటలు అందరికీ తెలిసినవే అయినా, మనసులో లోలోపల వుంటేనే బావుంటాయి. పైకనేస్తే ఇబ్బందిని కలిగిస్తాయి. తను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే ఇల్లు గడవదు అనే మాట ఆవిడ బైటికనేసరికి అందులోని స్వార్ధం బైటపడి అది సుమిత్రని మరో షాక్కి గురిచేసింది.
“ఇప్పుడు సుమిత్రకి అంత బాధ్యతలేం వున్నాయమ్మా? మా ఇద్దరి పెళ్ళిళ్ళూ అవనే అయ్యాయి. మమత చదువైతే మాలా కాకుండా కొన్నాళ్ళు వుద్యోగం చేస్తుంది. ఏ ప్రైవేటు కాలేజీలో చెప్పినా పదివేలు వస్తాయి. దాని పెళ్ళి బాధ్యత మా అందరిదీ. సరేనా?” అంది స్వరూప.
“ఎవరిదారిని వాళ్లు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోండి. పెద్దతనాన్న నన్ను వదిలేసి ఎవరి సుఖం వాళ్లు చూసుకోండి” అనేసి అక్కడినుంచి లేచి వంటింట్లోకి వెళ్ళి ధడేలున తలుపేసుకుంది. సుమిత్ర పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవటమన్నది ఇప్పట్లో ఆవిడ అనుకున్నది కాదు. అందుకే ఏం మాట్లాడుతోందో కూడా తెలీకుండా అనేసింది. తన మాటలు సుమిత్రని బాధపెడతాయని కూడా అనుకోలేదు. స్వరూప అక్కని జాలిగా చూసింది. తేజా… తన తల్లి… ఇద్దరూ ఎంత నరకాన్ని చూపిస్తున్నారు దీనికి?
బాధ్యతలు తీసుకోవటమంటే జీవితం తాకట్టు పెట్టడమా? కారుణ్య నియామకంలో వచ్చిన వుద్యోగం చెయ్యటమంటే ఇంటివాళ్ళకి వూడిగం చెయ్యటమా? తేజా వున్నాడు, ఎప్పటికేనా చేసుకుని ఒకదారి చూపిస్తాడనుకుంటే అతడలా చేసాడు. కోరీ, వేడీ వచ్చిన సూర్యాని కాదంటే ఇంక తన జీవితంలో మిగిలి వుండేదేమిటి? ఇంకొన్ని బాధ్యతలు మిగిలితే మిగిలి వుండచ్చు. అవి తాము పంచుకోలేరా? ముసలితనంలో తనని వదిలేసి ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారనేది తల్లి అభియోగం. ఎవరి దారి వాళ్ళది కాకపోతే ఒకరికొకరు ఎలా మిగులుతారు? పెళ్ళి చేసుకోకపోతే సుమిత్రకిమాత్రం రేపటిరోజుని ఆ పరిస్థితి రాదా? ఆవిడ ఒంటరిగా మిగులుతుందని సుమిత్ర పెళ్ళి మానుకుని తను వంటరిగా వుండలేదు కదా? నెమ్మదిగా లేచి సుమిత్ర వెనకాల నిలబడి రెండు చేతులూ భుజాల మీద వేసి ఆనుకుని నిలబడింది. ఆ స్పర్శకి సుమిత్రలో స్పందన వచ్చింది.
“అమ్మెలా అందో చూడవే!” అని ఏడ్చేసింది.
“పెళ్ళికి వప్పుకో సుమిత్రా! అమ్మకి నేను నచ్చచెప్తాను. ఆవిడ అర్ధం చేసుకుంటుంది. చేసుకోకపోయినా ఫర్వాలేదు. నువ్వు సుఖంగా వుంటే చాలు. సమస్యలని పరిష్కరించుకోవాలిగానీ జటిలం చేసుకోకూడదు”” అంది. సుమిత్ర చెల్లెలి చేతులు భుజాలమీంచీ లాక్కుని వాటిల్లో ముఖం దాచుకుంది. వెచ్చటి కన్నీళ్లు స్రవించడం తెలుస్తోంది స్వరూపకి.
“అమ్మ అన్నదికూడా నిజమేకదా? ఇంటిమీది అప్పు, మమత చదువు, పెళ్ళి… నేను పెళ్ళి చేసుకుని వెళిపోతే ఎలా?”
“పెళ్ళి చేసుకునిమాత్రం సాయం చెయ్యకూడదా అక్కా? సూర్యా అలా అడ్డు చెప్పేవాడు కాదు! అన్నీ నేనుకూడ ఆలోచించాను. నువ్విలా పెళ్ళికాకుండా వుండటం మా అత్తగారికి నచ్చలేదు. మన యింటి పరిస్థితులు అడిగి తెలుసుకుంది. ఎలాంటి దాపరికం లేకుండా చెప్పానక్కా! సాయం కాకపోయినా సలహా ఇస్తారని. వాళ్ళు మనకన్నా వేరేగా ఆలోచిస్తారు. అందుకే అంతంత ఆస్తులు పోగుపడ్డాయనుకుంటాను. మనం పెద్ద సమస్య అనుకున్నదాన్ని ఆవిడ చాలా తేలిగ్గా తేల్చేసింది. ఉద్యోగం అనేది నీకు ప్లస్ పాయింటు. ఎవరేనా కళ్లకద్దుకుని చేసుకుంటారు. ఇల్లు బేరం పెడితే పదిహేను లక్షల పైనే వస్తాయి. అప్పు తీర్చి, నీ పెళ్ళి చేసేసి, మిగిలింది బేంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది. అమ్మ పెన్షన్‍తో కలిపితే నడిచిపోతుంది. తప్పదు. అమ్మ నడిపించాలి. “
“ఇల్లమ్మితే ఎక్కడ వుంటారే?” అర్థం కాక అడిగింది సుమిత్ర.
“మాకు మమత కాలేజివైపు ఫ్లాటుంది. దానికి పెద్దగా అద్దెలు రావు. ఇల్లు పాడైపోతోందని బాధపడతారు ఆవిడ. అందులో వీళ్ళిద్దరూ వుండచ్చు. మమత పెళ్ళి టైముకి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం”
తండ్రి కట్టిన ఇంటిని అమ్మటం, అలవాటుపడిన పరిసరాలని వదిలి ఎక్కడో వుండటం, వీటికి తల్లి వప్పుకుంటుందా? అవసరమా తనిప్పుడు పెళ్ళి చేసుకుని ఈ మార్పులన్నీ తీసుకురావటం? దీనివల్ల సంతోషాన్ని పొందేదెవరు? సునీతకి ఇంకా చాలా ఆశలున్నాయి. తల్లి అయిష్టాన్ని మొహంమీదే చెప్పింది. ఇంక దేనికోసం? సూర్యాని సంతోషంగా వుంచగలదా? ఎన్నో ప్రశ్నలు సుమిత్ర మనసులో.
“అమ్మ వంటరితనానికి నువ్వు పెళ్ళి మానుకోవటం పరిష్కారమవదు. ఎంత ప్రేమించుకున్నా కూడా ఏ ఇద్దరు వ్యక్తులుకూడా ఒక్కసారి వెళ్ళిపోరు. భార్యాభర్తలు ఒక్కసారి పుట్టరు. ఒకేసారి పోరు. అమ్మ వంటరితనానికి భయపడుతోంది. దాన్ని వదిలించుకోవటం ఆవిడ చేతిలోనే వుంది. ఈ నాలుగ్గోడలే ప్రపంచం అనుకోకుండా ప్రతీదీ తనకి నువ్వు చేసి పెట్టాలని అనుకోకుండా వుంటే ఆవిడకీ కొంత ప్రపంచం వుంటుంది. సుమిత్రక్కా! మన కుటుంబంకోసం, మాకోసం నువ్వు చెయ్యగలిగినంత చేసావు” అంది. సుమిత్ర ఆ ఓదార్పుతో కాస్త తేరుకుంది.
సూర్య వచ్చాడు. బైటికి వెళ్ళాలన్నాడు.
“వెళ్ళు” అంది స్వరూప. స్వరూప ఇచ్చిన చీరకట్టుకుని తయారై వచ్చింది.
“అమ్మా! సూర్య వచ్చాడు”” తల్లికి చెప్పింది స్వరూప. ఆవిడనుంచీ సమాధానం రాలేదు.
ఇద్దరూ ముందురోజు వెళ్ళిన గుడికే వెళ్ళారు. కోనేటిగట్టుని అలాగే కూర్చున్నారు. సంఘటనా, సంభాషణా ముందురోజుకి కొనసాగింపులా వున్నాయి. గుళ్ళో పెళ్ళి చేసుకుందామన్నాడు సూర్య మరోసారి. ఉపోద్ఘాతమేదీ లేకుండా సూటిగా చెప్పేసాడు. ముందురోజు అతను మాట్లాడినవి సగం ఆమె బుర్రలోకి ఎక్కాయి, కొన్ని ఎక్కలేదు. అందులో ఇదొకటి. పెళ్ళికోసం తొందరపడుతున్నాడనుకుందిగానీ ఇలా చేసుకోవడాన్ని ప్రతిపాదిస్తాడనుకోలేదు.
“ఇదేమిటి?” అంది సుమిత్ర తెల్లబోయి.
“కొన్ని పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతాయి”
“అమ్మకి ఇష్టం లేదు” అంది సుమిత్ర.
“మా అమ్మకి కూడా ఇష్టం వుండకపోవచ్చు”
“మరి?”
“అందుకే మన పెళ్ళి ఇలాగే జరగాలి”
“గొడవలౌతాయేమో! అందరికీ చెప్పి వప్పించి చేసుకుంటే మంచిదేమో!”
ఆమె పెళ్ళి వద్దనటం లేదు. తనతో దెబ్బలాడుతుందనుకున్నాడు. అదేం లేదు. అతను తేలిగ్గా నిశ్వసించాడు.
“ఎందుకు వప్పుకుంటారు సుమిత్రా? నువ్వు చేస్తున్న వుద్యోగాన్ని వుమ్మడి ఆస్తి అనుకుంటున్నారు మీవాళ్ళు. చదువు మానేసి, రోజుకి ఎనిమిదిగంటలు అక్కడ వెళ్ళి కూర్చుని చేస్తేనే కదా, జీతం వచ్చేది? అంత చిన్న విషయం మీ అమ్మకి కాదుకదా, అంతో ఇంతో చదువున్న సునీతకి కూడా అర్థమవటంలేదు. ఇంక మా యింట్లో విషయానికి వస్తే …” ఆగాడతను. ఆమె చెప్పమన్నట్టు చూసింది.
“మేం ఇద్దరు మగపిల్లలం. అన్నయ్య, వదిన బాగా చదువుకుని స్టేట్స్‌లో వున్నారు. నేను చదువులో అంత చురుకైనవాడిని కాను. ఐనా నన్నుకూడా అన్నయ్య స్టేచర్లోనే వుంచాలనుకుంటుంది అమ్మ. మంచి ఆస్తిపరులైన అమ్మాయిని చూసి చెయ్యాలనేది ఆమె కోరిక. నాకు మాత్రం నువ్వంటే ఇష్టం సుమిత్రా! ” స్పష్టంగానే చెప్పినా కొంచెం ఇబ్బందిపడ్డాడు. సుమిత్రకి అర్థమైంది. వాళ్ళు డబ్బున్నవాళ్ళు. దానికి తగ్గట్టే వాళ్ళ ఆశింపులు వుంటాయి. వాళ్ళకి తను తగదు. ఈ విషయంలో సూర్యాకి స్పష్టత వుంది. కానీ…
“నాకు ఇంకా బాధ్యతలు వున్నాయి” అంది తలదించుకుని. అప్పుడు తేజా. ఇప్పుడు సూర్యా. ఎవరి చెయ్యీ తను అందుకోలేదు.
“నువ్వు నాన్న రోల్లో వున్నావు. నాన్నల బాధ్యతలు తీరినట్టు నేనెక్కడా చూడలేదు. ఐ ప్రామిస్. నీ బాధ్యతలకి అడ్డు రాను. నీ జీతం నీది. నువ్వు ఎలాగేనా ఖర్చుపెట్టుకోవచ్చు. అమ్మవైపునించీ కొంచెం ఇబ్బంది వుంటుంది. అదికూడా కొద్దికాలం. అమ్మదీ నాదీ ఒకేలాంటి మనస్తత్వం. అమ్మ నిన్ను నచ్చుకునేరోజుకూడా తొందర్లోనే వస్తుంది”
అతని ప్రేమని తట్టుకోలేకపోయింది సుమిత్ర. నిస్సహాయంగా నవ్వింది. ఆమెనలా చూసి తట్టుకోలేకపోయాడతను.
“కుటుంబం అంటే నేనూ అమ్మా మాత్రమే కాదుకద సూర్యా! నేనిలా ఎవరికీ చెప్పకుండా పెళ్ళి చేసేసుకుంటే దాని ప్రభావం చాలా వుంటుంది. పెళ్ళిళ్ళైన ఇద్దరు చెల్లెళ్ళున్నారు. అత్తగారిళ్ళలో వాళ్ళ విలువ తగ్గుతుంది. ఇంకా పెళ్ళవాల్సిన చిన్నచెల్లి నన్ను చూసి ఏం నేర్చుకుంటుంది? ఇదంతా జరిగే పని కాదు” అంది. ఆమె ఒక ముళ్ళగులాబీ అంది నీలిమ. నిజమే అనిపించింది.
“ఎదురుచూడనా?” అడిగాడు.
“ఎంతకాలం? అదికూడా చెప్పలేను. అంతా అనిశ్చితి”
అతను ఆమె చేతిని తనచేతిలోకి తీసుకున్నాడు. చాలాసేపు అలానే కూర్చున్నారు.
“ఇంక వెళ్దాం” అతనే అన్నాడు. ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. ఇంటిముందు దేవకీవాళ్ళ కారు ఆగి వుంది. స్వరూపని తీసుకెళ్ళడానికి భార్గవ వచ్చాడేమోననుకుంది సుమిత్ర. ఆమె లోపలికి వెళ్ళింది. వచ్చింది భార్గవ కాదు, దేవకి. వాతావరణం అసహజంగా వుంది. ఏం జరిగింది? చాలాసేపు ఏడ్చినట్టు రాధ ముఖం చెప్తోంది. సుమిత్రకి వంట్లో శక్తంతా చేత్తో తీసేసినట్టు నిస్పృహ ఆవహించింది.
“రా సుమిత్రా!” అంది దేవకి, అలికిడికి తల తిప్పి చూసి. సుమిత్ర వెళ్ళి పక్కని కూర్చుంది.
“నువ్వున్నప్పుడే అమ్మ వంటింట్లోకెళ్ళి తలుపేసుకుంది కదే? నువ్వెళ్ళాక నేనెంత కొట్టినా తియ్యలేదు. గేస్ ఇప్పేసి నిలబడింది. పెరటివైపునించీ వెళ్ళి గట్టిగా తోస్తే గొళ్ళెం వూడిపోయింది. కేకలేసి తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టాను. మా అత్తగారికీ నీకూ ఫోన్ చేస్తే నువ్వు ఎత్తలేదు. ఆవిడ వెంటనే బయల్దేరి వచ్చారు” స్వరూప చెప్పింది. సుమిత్ర దిగ్భ్రాంతితో చూసింది. అమ్మ ఆత్మహత్య చేసుకోవాలనుందా? ఎందుకు? తను పెళ్ళి చేసుకుంటుందనే? వెళ్ళిపోతుందనే? గుళ్ళోకి వెళ్తున్నప్పుడు ఫోను సైలెంటులో పెట్టింది. తర్వాత మాటల్లో పడి మర్చిపోయింది. ఇప్పుడు తీసి చూస్తే స్వరూపనుంచీ చాలా కాల్స్ వున్నాయి.
“నేనూ ఇప్పుడే వచ్చాను” అంది దేవకి. అని, రాధవైపు తిరిగి, “మీ సమస్యేమిటి వదినగారు?” అని రాధని అడిగింది.
దార్లోనే అన్నీ కోడలిని అడిగి తెలుసుకుంది. ఆవిడ ధాటీయైన మనిషేకాదు, కోడల్నికూడా తనకి అనువుగా మలుచుకుంటోంది.
పెళ్ళై మొదటిసారి అత్తవారింట్లో అడుగుపెట్టినప్పుడు స్వరూప వుక్కిరిబిక్కిరైంది. రాధ, సునీత, మురళి వచ్చారు తోడుగా. పెద్ద డూప్లెక్స్ ఇల్లు. కిందని రెండు బెడ్‍రూమ్స్, ఆఫీసురూమ్, గెస్ట్‌రూమ్, పైన పిల్లలకి నాలుగు బెడ్‍రూమ్స్, కింద విశాలమైన హాల్, పైన పెద్ద లాబీ… ఇంటినిండా ఖరీదైన వస్తువులు… వంటకి మనిషి, పనివాళ్ళు, డబ్బున్నవాళ్ళంటే కావచ్చుననుకున్నారుగానీ ఇంత వునవాళ్ళని అనుకోలేదు ఎవరూ. రాధైతే కూతుర్ని ఎలా చూస్తారోనని చాలా భయపడింది.
“ఇంత పెద్ద సంబంధానికి వెళ్ళకూడదు. అదక్కడ ఎలా ఇముడుతుందో!” స్వరూపని దింపివచ్చే దారంతా అంటునే వుంది.
“మీరేం కంగారుపడకండి. స్వరూప తెలివైనది. చక్కగా సర్దుకుపోతుంది” అని మురళి సర్ది చెప్పాడు.
అతను అన్నది నిజం. స్వరూపని కోరి చేసుకున్నారు. చేసుకున్నందుకు ఎక్కడా తక్కువ చెయ్యలేదు. తన పిల్లల్లో కలుపుకుంది దేవకి. ఆవిడని చూస్తుంటే ఆమెకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అంత చురుకు, వుత్సాహం, చుట్టూ వున్నవాళ్ళని కలుపుకుంటూ ముందుకి వెళ్ళటం… అవన్నీ చూసి తను నేర్చుకోవలసినవి చాలా వున్నాయనుకుంది. ఆవిడ తను సంతోషంగా వుండటమే కాదు, చుట్టూ అంతా కూడా అలాగే వుండాలనుకుంటుంది. ఎవరి స్థాయికి తగ్గ సమస్యలు వాళ్ళకి వుంటాయనే స్పష్టమైన అవగాహన వుంది. కొడుక్కి పెళ్ళిచెయ్యటమంటే ఆ యింటి చెట్టుకి కాసిన కాయని కోసి తెచ్చుకుని తమింట్లో చాకిరీలోనూ ఆధిపత్యంకిందా పెట్టి ఆరగించడం కాదని తెలిసినది. ఆడపిల్లలకి పుట్టింటి మమకారాలు చాలా వుంటాయి. అందులో ఇలాంటి కుటుంబాలలో. ఏదో చెయ్యాలనే అరాటం వుంటుంది. అది క్రమంగా తగ్గాలే తప్ప తీగ తుంచినట్టు తుంచడం వీలవదన్న స్పష్టమైన అవగాహన వుంది.
తన చుట్టూ వుండే మనుషుల్ని అనేక వలయాలుగా విభజించుకుంది. మొదటి వలయం- తను, భర్త, పిల్లలు, అల్లుళ్ళు, మనవలు. స్వరూప అందులో చేరింది. తరువాతిది తన తల్లిదండ్రులు- తోబుట్టువులు, అత్తమామలు, భర్త తోబుట్టువులు. ఆ తర్వాత వియ్యాలవారి నాలుగు కుటుంబాలు. ఇకపైని స్నేహితులు, కజిన్స్… తన స్నేహితులతో ఎలా వుంటుందో, పిల్లల స్నేహితులతోటీ అలాగే కలిసిపోతుంది. వాళ్ళు చెప్పేవన్నీ వింటుంది. సమస్యలుంటే తోచిన పరిష్కారాలు చెప్తుంది. తన పనులు వాళ్ళకి చెప్తుంది.
మూడో వలయంలో వున్న సుమిత్ర ఆవిడ మనసులో చేరిపోయింది. స్వరూపని అడిగి వివరాలన్నీ రాబట్టుకుంది. సుమిత్ర పెళ్ళికి గల ఆటంకాలేమిటో వాటినెలా పరిష్కరించాలో కూడా ఒక ఆలోచనకి వచ్చింది.
“సుమిత్ర పెళ్ళి చేసుకుంటే మీకొచ్చిన ఇబ్బందేమిటి?” సూటిగా అడిగింది. రాధ దగ్గర భయమే తప్ప జవాబు లేదు. భయం… దానికి ఒక స్పష్టమైన రూపం లేదు. సుమిత్ర వెళ్ళిపోతే ఇల్లెలా అని తప్ప మరో మార్గం వెతికే ఆలోచనా లేదు.

2 thoughts on “ప్రియమైన జీవితం – 15 by S Sridevi”

  1. I was pretty pleased to discover this great site. I need to to thank you for your time for this particularly fantastic read!! I definitely appreciated every part of it and I have you book marked to see new stuff on your blog

Comments are closed.