వాళ్ళు వెళ్ళాక సూర్య అడిగాడు, ” ఇప్పుడు సంతోషమేనా? మా అమ్మ కూడా వప్పుకుంది”
“తప్పనిసరై వప్పుకున్నారు సూర్యా!” అంది సుమిత్ర.
“పెళ్ళి చేసుకునేది మనిద్దరం ఐనప్పుడు ఎవరు మాత్రం ఎందుకు వప్పుకోకపోవాలి సుమిత్రా? మనిద్దరిలో ఏ చెడ్డ లక్షణాలున్నాయని?” అతని ప్రశ్నకి జవాబు లేదు సుమిత్ర దగ్గర. ఇద్దరు స్త్రీపురుషులు పరస్పరం ఆకర్షితులై పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళమధ్య పుట్టిన ప్రేమకన్నా వాళ్ళ చుట్టూ వున్నవారి యిష్టానిష్టాలు ప్రాధాన్యత తీసుకోవటం నిజానికి సృష్టికి విరుద్ధమైనది. సమాజం సృష్టించుకున్న ఆర్థికత సహజమైన భావాలనీ అక్కరలనీ అణిచేసి కృత్రిమ బంధాలని ఏర్పరుచుతోంది. ఎంత తిరుగుబాటు చేసినా, గెలుస్తోంది.
“ఇందులో మరో ఆలోచనకి ఆస్కారం లేదు. మనం మంచివాళ్ళమని వీళ్ళకి నమ్మకం కలగట్లేదు. అంచేత అవకాశం తీసుకుని మనని మనమే నిరూపించుకుందాం” అన్నాడు. అతని మాటలు నిజమే. తను వదిలిపెట్టేసి వెళ్ళిపోతుందని తల్లి భయం. ఆ భయం తీరాలంటే దానికి దోహదపడే సంఘటన జరగాలి. అలాగే సూర్య తల్లికి. చాలా డబ్బున్న వాళ్ళకి, కోడలు తెచ్చే మరో యింత డబ్బు అవసరం కాదు. తను సూర్యతోపాటు వాళ్ళకీ సంతోషాన్నీ, అతనిచ్చేలాంటి భరోసానీ ఇస్తుందని నమ్మకం కలిగించాలి. పెళ్ళి చేసుకుని వాళ్ళమధ్యకి వెళ్తే కదా, తనగురించి అర్థమయ్యేది!
“అంత ఆలోచించకు. అసలే ఆవగింజంత బుర్ర. అలిసిపోవటమో అరిగిపోవటమో జరిగిందంటే చాలా కష్టం” అన్నాడు. సుమిత్ర కోపంగా చూసింది. మిగతావాళ్ళు వింటారని భయపడింది. ముఖ్యంగా మురళి. సూర్య నవ్వాడు.
“ఇంక నేను వెళ్తాను” అని అతనంటే గేటుదాకా వెళ్ళింది. అక్కడ మళ్ళీ మాట్లాడుకున్నారు. గోడకి ఆనుకుని ఒక కాలు వెనక్కి మడిచి నిలబడి మాట్లాడటం సుమిత్రకి అలవాటు. ఇప్పుడూ అలాగే చేసింది. సూర్య ఎదురుగా వున్న మెట్లమీద కూర్చుని, దేవకీవాళ్ళు వచ్చినప్పటినుంచి జరిగింది చెప్పాడు. కిటికీలోంచీ రాధ చూసింది ఆ దృశ్యాన్ని. తండ్రీకూతుళ్ళు అలాగే మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత తేజాతో. అతను ఆ మెట్లమీద కూర్చునీ, ఆమె గోడకి ఆనుకుని నిలబడీ కాలాన్ని దొర్లించేవాళ్ళు. ఇప్పుడు సూర్య… ఔను… ఏదీ మారలేదు. ఆ దృశ్యంలోని మనుషులు మారారు. సుమిత్ర అలాగే వుంది. ఆ అమాయకపు పిల్లలో కాలం తెచ్చిన మార్పులు తప్ప మనస్తత్వంలో ఎలాంటి మార్పూలేదు… స్వరూప చెప్పిన మాటలు అర్థమయ్యాయి.
ఓ కుర్చీ బెంచీ, ఓ మనిషీ చెట్టూ పుట్టా… కనిపించే కోణం మారుతూ వుంటాయి. మన మనసులోనూ… దాని తత్వంలోనూ మార్పు వుండదు.
సూర్య వెళ్ళిపోయాడు. సుమిత్ర లోపలికి వచ్చింది. అప్పటికి అంతా పడుక్కుని వున్నారు. రాధ తను జరిగి, సుమిత్రకి చోటిచ్చింది. తల్లి పక్కని ముడుచుకుని పడుకుంది సుమిత్ర. తల్లి స్పర్శ ఎంతో వోదార్పునిచ్చింది. అప్రయత్నంగా రెండు ప్రశ్నలు అడిగింది. జవాబుకోసం కాదు. తనని తను సమాధానపరుచుకుందుకు.
“నాన్న వుంటే బావుండేది కదమ్మా?” అంది. ఆమె గొంతు వణికింది.
“తేజా అలా ఎలా చెయ్యగలిగాడు? తన జీవితం ఇంక అంతేనా?” ఈ మాటలు అని దిండులో ముఖం దాచుకుంది. “వాళ్ళకి మన సంబంధం తగదని అనిపించిన రోజులు అలాగే వుండిపోయినా బావుండేది. నాలాగే తనూ సంతోషంగా బతికేవాడు” అంది.
“చిన్నప్పటి స్నేహాలు పెళ్ళిదాకా వెళ్లడం చాలా అరుదు సుమిత్రా! పెద్దవాళ్ళయేలోపు ఎన్నో అవాంతరాలు వస్తాయి. నిజానికి వాళ్ళు మంచివాళ్ళే. అన్ని విషయాలూ దాచిపెట్టి నీ జీవితం నాశనం చెయ్యలేదు. ఆ మంచితనమే వాళ్ళని కాపాడుతుంది. అది అతను కోరుకున్న జీవితం. ఇది నీ జీవితం. నీకు నచ్చినట్టు వొడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా వుండాలి. రేపు వాళ్ళు చూసుకోవడానికి వస్తామన్నారు. తొందరగా పడుక్కో. ఇలా ఏడిస్తే మొహం కళ్ళూ వుబ్బిపోయి ఏం బావుంటుంది?” అంది. సుమిత్ర సర్దుకుంది.
అవతలి గదిలో సునీత మురళిని అడిగింది.
“స్వరూపలో చాలా మార్పు వచ్చిందికదండీ? మాటలు నేర్చింది. వ్యవహారాలు చక్కబెడుతోంది” అంది. ఆమెకి కొన్ని విషయాలు అర్థమయేలా చెప్పే అవకాశం వచ్చిందని అర్థమైంది మురళికి.
“తనేమీ మారలేదు సునీ! ఎప్పట్లాగే వుంది. మీ యిద్దరికీ ఆలోచనల్లో చాలా తేడా వుంది. ఇక్కడేం వుందో మీ యిద్దరికీ తెలుసు. తర్వాతేం చెయ్యాలో నీకు తెలీటం లేదు. తనకి తెలుసు. అదీ ఆ తేడా. ఇప్పుడు సందర్భం వచ్చిందికాబట్టి బయటపడుతోంది. నువ్వు గమనిస్తున్నావు” అన్నాడు. ఆలోచన నిప్పురవ్వలాంటిది. ఒకసారి పుడితే అదింక ఆగదు. అలాంటి ఆలోచన సునీతలో మొదలైంది.
“మనకి డబ్బు లేక కాదు. నాకు వుద్యోగం వుంది, నాన్న ఇంకా చేస్తున్నారు. స్వంత యిల్లుంది. సమస్యల్లా మా ముగ్గురు అత్తలు. వాళ్ళంటే నాన్నకి ఇష్టం. అది యిష్టం అని ఆయన అనుకుంటారు. ఇక్కడినుంచీ అన్నీ తరలించడానికి అవకాశమని వాళ్ళు అనుకుంటారు. మాయింట్లో ఒక్క వస్తువు ఏదైనా కొన్నామంటే వాళ్ళదగ్గర్నుంచీ ఇండెంట్లు వచ్చేస్తాయి. ఇంటికి హంగులు చేయచ్చు. వెంటనే వాళ్ళకి అవసరాలు పుట్టుకొచ్చేస్తాయి. అందుకే క్లుప్తంగా వుండటం అలవాటు చేసుకున్నాం. నువ్వు మా అత్తల్లా పుట్టింటి సొమ్ముకి ఆశపడకు. అది మీ అక్కచెల్లెళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది ” అని వివరంగా చెప్పాడు. ఆమె తనుగా అర్థంకూడ చేసుకోవటం మొదలైంది. ఈ రెండూ ఒక మేలు కలయిక.
సూర్య ఇంటికి వెళ్ళేసరికి రుక్మిణి పెద్దకొడుకుతో మాట్లాడుతోంది. “వాడు ఎవరు చెప్పినా వినేట్టు లేదురా! సరిగ్గా చదువుకోక ఒకలా పాడుచేసుకున్నాడు. ఇప్పుడేమో ఈ పెళ్ళి. పిల్ల పెద్ద చదువుకున్నది కాదు. మామూలు వుద్యోగం చేస్తోంది. తండ్రి లేడు. ఆడపిల్లమీద ఆధారపడి బతుకుతున్న కుటుంబం…” అంది అసంతృప్తిగా.
“ఇక్కడికి వస్తానని వాడంతట వాడు అడిగాడమ్మా! దార్లో పడుతున్నాడని సంతోషపడ్డాను” అతని జవాబు. అతనిదీ ప్రేమ పెళ్ళే. చదువుకుంటూనే ప్రేమలో పడ్డారు. చదువయ్యి ఉద్యోగాలు రాగానే ప్రేమని ఇంట్లో చెప్పారు. పెళ్ళికి ఇరుపక్షాలవారికీ ఎలాంటి ఆక్షేపణా లేకఫొయింది. లక్షలు ఖర్చుపెట్టి పెళ్ళి చేసారు. పెళ్లవగానే ఇద్దరూ యూయస్‍లో పడ్డారు. ఇప్పటికి ఎనిమిదేళ్ళు. ఆరేసినెలలు వాళ్ళు వీళ్ళూ అటూయిటూ తిరిగి అలిసిపోయారు.
సూర్య తల్లి దగ్గర్నుంచీ ఫోన్ తీసుకున్నాడు.
“నీకు వదిన ఎందుకు నచ్చిందిరా?” అడిగాడు అన్నని.
“ఏం నచ్చిందంటే ఏం చెప్తాం? చదువు, తెలివి, కల్చర్ అన్నీ” అతను తడబడకుండా చెప్పాడు.
“నువ్వు ఐఐటీలో చదవలేదు. గల్లీ కాలేజిలో చదివావు. వదిన నీకు అలాంటి గల్లీ కాలేజిలోనే పరిచయం. అప్పుడుకూడా నీకు తనంటే ప్రేమ పుడుతుంది. ఐఐటీలో చదవలేదనో, ఐఐటీలో చదివినవాళ్ళకి వున్నంత తెలివి లేదనో, అంత చదువుకున్న కుటుంబాల్లో వుండే కల్చర్ తనకి లేదనో లెక్కలేసుకుని వదిలెయ్యవుకదా?”
“ఇద్దరం ఒకచోటే చదివినప్పుడు ఆ ప్రశ్నే రాదు”
“నా స్టేచర్‍కి సుమిత్ర కరెక్ట్. ఐఐటీ పిల్లల్తో మాకు పోలికల్లేవ్. అదన్నమాట విషయం. అమ్మకి అర్థమవకపోతే నువ్వు చెప్పు… గంతకి తగ్గ బొంత అని” అని తల్లికి ఫొన్ తిరిగి ఇచ్చేసాడు. ఆవిడ అతన్ని కోపంగా చూసింది.
“వాడు చెప్పింది నిజమేకదమ్మా? వాడికి నచ్చిన పిల్లనే చేసుకోనీ” అన్నాడు పెద్దకొడుకు తలతిరిగి చేతికొచ్చి.
మరుసటిరోజుని వచ్చే పెళ్ళివారిని ఆహ్వానించడానికి దేవకీ, శంకర్ వచ్చారు. వాళ్ల వెంటే భార్గవ, స్వరూప. నీలిమకూడా సెలవు పెట్టుకుని వచ్చేసింది. వస్తూనే సుమిత్ర కూర్చున్న గదిలోకి వెళ్ళింది.
“నువ్విలా చేస్తావనుకోలేదు” అంది నీలిమ దగ్గర కూర్చుని.
“ఏమైంది? నేనేం చేసాను?” అడిగింది సుమిత్ర ఆశ్చర్యంగా.
“కాదా? బోల్డు కట్నం ఇచ్చి, లాంఛనాలిచ్చి కాళ్లు కడిగి కన్యాదానం చేయించుకునేవాళ్ళని వెతుక్కుని మరీ పెళ్ళి చేసుకుంటావనుకున్నాను” అంది. నవ్వింది సుమిత్ర. కానీ ఆమె ముఖంలో ఇంకా కొద్దిగా దిగులు. తిరస్కారం… అనేక దారుల్లోంచీ ఎదురైంది సుమిత్రకి. తేజా… సునీత… తల్లి… కాబోయే అత్తగారు. తను తప్పు చేస్తోందేమో! ముడుచుకుపోతున్న మనసుని అతికష్టమ్మీద నిలబెడుతోంది.
“మీ అమ్మగురించి, చెల్లిగురించి బాధపడుతున్నావా? సూర్య అలాంటివాడు కాదు. నీకు తోడుగా వుంటాడు. మా పెద్దమ్మకూడా మంచిదే. సూర్య స్వతంత్రించాడని కొంచెం కోపం అంతే. ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు పెళ్ళి చేసుకోవటానికి ఇది చాలా అనువైన సమయం ” అంది. సుమిత్రని వెంటబెట్టుకుని తనే అందరూ వున్న దగ్గరికి వచ్చింది. సుమిత్ర సూర్య తల్లిదండ్రులకి నమస్కారం చేసి కూర్చుంది. అందరికీ పరిచయాలయ్యాయి.
వాసుదేవ్ సరదాగానే వున్నా, రుక్మిణి ముభావంగా వుంది. ఆవిడనికూడా ఆయనే కవర్ చేస్తున్నాడు. ఇల్లు ఇరుగ్గా, మనుషులు తక్కువగా అనిపించారు ఆవిడకి. సుమిత్ర అందంగా అనిపించలేదు. దేవకీ శంకర్‍లతో తప్ప ఇంకెవరితోనూ పెద్దగా మాట్లాడింది లేదు. నీలిమ వెళ్ళి వాళ్ళదగ్గర కూర్చుంది.
“నువ్వేమిటే, ఇక్కడున్నావు? ఈ పెళ్ళికి అనుసంధానకర్తవి నువ్వేనటగా?” అడిగింది రుక్మిణి నీలిమని.
“ఒకళ్ళు ఎంప్రెస్, ఇంకొకళ్ళు ప్రిన్స్… నేనెవర్ని పెద్దమ్మా, వీళ్ళ పెళ్ళి చెయ్యడానికి?” అంది నీలిమ అమాయకంగా. అని,
“అసలు మీరిద్దరూ ఇంత ప్రేమలో ఎప్పుడుపడ్డారు? ఇంత సడెన్‍గా పెళ్ళి చేసుకునేంతటి ప్లాన్లు ఎప్పుడేసుకున్నారు?” అడిగింది సూర్యాని ఆశ్చర్యంగా. “అసలు నీపేరు చెప్తేనే మండిపడేది సుమిత్ర?” ఆమాట చురుక్కుమనిపించింది రుక్మిణికి. నీలిమ నాలిక్కరుచుకుంది.
“అన్న చేసే పనులకి మొదట ఎవరికేనా అలాగే వుంటుందిలే పెద్దమ్మా! ఇప్పుడు నీకు కోపం రాలేదా, అలాగన్నమాట” అని సర్దుకుంది.
“పాడుకోవడానికి డ్యూయెట్లు రాసిచ్చేవాళ్లు ఎవరూ దొరకలేదు. లేకపోతే పాడుకుంటూ వూరంతా తిరిగేవాళ్ళం. అందుకే నీకు తెలీలేదు” అన్నాడు సూర్య.
“నువ్వు కూడా పెళ్ళిచేసుకుంటే సంతోషిస్తాం” అంది రుక్మిణి.
“నీ కొడుకులాంటివాడు దొరకనీ పెద్దమ్మా! ” అంది నీలిమ.
“అంత తెలివితక్కువవాడు నీకెందుకే?” రుక్మిణి చురక వేసింది.
“సుమిత్ర నచ్చలేదా పెద్దమ్మా, నీకు? నేనూ, సూర్యా, సుమిత్రలాంటి ఎంతో మంచివాళ్ళమే నచ్చకపోతే ఇంక నీకు నచ్చడానికి మంచివాళ్ళంటూ లోకంలో ఎవరుంటారు?” అంది అల్లరిగా. గొడవలూ తగాదాలూ పెద్దవాళ్లమధ్యనే.
“అన్నాచెల్లెళ్ళిద్దరూ బాగా మాటలు నేర్చారు. ఆ పిల్ల కూడా ఇంతేనా?”
“అలాంటి భయం వద్దు. సుమిత్ర పలుకే బంగారం, నవ్వే నవరత్నం… నువ్వింక ముత్యాలదండలూ, రత్నాలహారాలూ చేయించుకోవచ్చు అప్పుడప్పుడూ రాలిపడేవాటితో”
“పోవే. ఇద్దరూ ఇద్దరే! చూస్తాను. ఏపాటి సుఖపెడుతుందో, మమ్మల్ని. పెళ్ళాన్ని చూసుకున్న మురిపెంలో వీడేనా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే చాలు” ఆ మాటలు కొంచెం గట్టిగానే అందరూ వినాలనే అంది. అప్పటిదాకా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నట్టు వినీవినిపించనట్టున్న మాటలు ఇప్పుడు స్పష్టమయ్యాయి… ఆవిడ మనసు బయటపడింది. ఆవిడ మాటల్లో చాలా అసంతృప్తి వుంది. అందులో ఒక లాజిక్ తప్పిపోయింది. కొడుకు వెతుక్కున్న అమ్మాయి తమకి అనుకూలంగా వుంటుందో లేదోనని ఆవిడ భయపడుతోంది. అలాగే తల్లిదండ్రులు వాళ్ల చూపుతో వెతికి తెచ్చిన పిల్ల తనకి అనుకూలంగా వుంటుందో లేదోనని మగపిల్లలూ ఆలోచిస్తారు.
కాఫీ ఫలహారాలయ్యాయి. రుక్మిణి ఏవీ తినలేదు. ఒక స్వీటుముక్క కొరికి వదిలేసింది. కాఫీమాత్రం తాగింది.
“ఎలాగా అనుకున్న పెళ్ళే కాబట్టి ఇంకా నిశ్చితార్థం అవీ వేరేగా ఎందుకు?’ నేరుగా ముహూర్తాలు పెట్టేసుకుందాం” అంది ముక్తసరిగా.
“అదేమిటి అప్పుడే పెళ్ళిచూపులైపోయాయా? నువ్వింకా పాటపాడమని అడుగుతావేమో, శంకరాభరణం శంకరశాస్త్రిగారిలా సుమిత్రా అని అరవడానికి గొంతు సవరించుకుని కూర్చున్నాను” అంది నీలిమ. వాతావరణం తేలికపరచటానికి చెయ్యగలిగిన ప్రయత్నమంతా చేస్తోంది. చిన్నగా నవ్వులు విరిసాయి అక్కడ. రుక్మిణికూడా అప్రయత్నంగా నవ్వింది.
పళ్ళెం తీసుకురమ్మని చెప్పి, తనతో తెచ్చిన చీర, పళ్ళూ, స్వీట్స్ సుమిత్రకి బొట్టు పెట్టి ఇచ్చింది. ఉంగరాలుకూడా మార్చుకున్నారు. వండేంత వ్యవధి లేకపోవటంతో భోజనాలకి హోటల్‍కి ఆర్డరిచ్చింది స్వరూప. మురళి సునీతని తీసుకుని బయటికి వెళ్ళాడు. వచ్చిన ముగ్గురికీ, నీలిమకీ బట్టలు తీసుకుని వచ్చారు. ఇవన్నీ మరోరోజు జరిగితే ముందుగా ఏర్పాట్లు చేసుకునేవారు. ఇప్పుడంతా హడావిడి అయింది.
నలుగురు అక్కచెల్లెళ్ళూ కలివిడిగా తిరుగుతున్న దృశ్యం రుక్మిణి మనసులో చెరగని ముద్ర వేసింది. పెద్దగా వయోబేధం లేదేమో, పైముగ్గురూ ఒక్కవయసువాళ్లలా వున్నారు. నీలిమ వాళ్ళకి తోడైంది. మమత కొంచెం చిన్నదనిపిస్తోంది. ముందురోజు మొదలైన మార్పు సునీతలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
భోజనాలు చేసి బయల్దేరారు రుక్మిణి, వాసుదేవ్, సూర్య, నీలిమ. దేవకి, శంకర్ వాళ్ళు బయల్దేరుతుంటే రాధ వచ్చి దేవకి చేతులు పట్టుకుంది. “పెద్దగా చదువుకున్నదాన్ని కాను. నలుగుర్లోకి వెళ్ళి వ్యవహారం చేసినదాన్నీ కాను. ఇంతదాకా లాక్కొచ్చారు, ఇకపై ఈ పెళ్ళి జరిపించి మమ్మల్ని గట్టెక్కించాల్సింది మీరే వదినా!” అంది కన్నీళ్ళతో.
“అన్నీ సవ్యంగా జరుగుతాయి. మీరేం కంగారుపడకండి” ధైర్యం చెప్పింది దేవకి.
మురళి సునీతాకూడా బయల్దేరారు. వెళ్ళేముందు సునీతతో చెప్పించాడు మురళి.
“డబ్బేమైనా కావాలంటే మేము సర్దుతాం. లెక్కలవీ తర్వాత చూసుకోవచ్చు” అంది సునీత. ముందురోజు అతను చెప్పిన విషయాలు మనసులో ఇంకా కదుల్తునే వున్నాయి.
“అక్కర్లేదు సునీతా! నేను చూసుకుంటాను. అంతగా కావలిస్తే అడుగుతాను” అంది సుమిత్ర. స్వరూప అన్న విషాదమేమిటో మురళికి అర్థమైంది. సుమిత్ర తన పెళ్ళికి తనే డబ్బు సమకూర్చుకోవాలి.
ఇంటిబేరం వెంటనే కుదిరిపోయింది. పక్కవాటా కొనుక్కున్నవాళ్ళే వాస్తుకి అనుకూలంగా వుండటంతో ఇదీ కొనుక్కుంటామన్నారు. దేవకి, శంకర్ దగ్గరుండి బేరం, అమ్మకం చూసుకున్నారు. సుమిత్ర పెళ్ళయేదాకా వుండి ఖాళీ చెయ్యటానికి వాళ్ళు వప్పుకున్నారు. ఇరుగుపొరుగువాళ్ళు, రాజశేఖరం, యశోదావాళ్ళతో వున్నంత కాకపోయినా స్నేహం వుంది.
“సుమిత్ర మాయింట్లో పిల్లలాంటిది. పెళ్ళీ, అంపకాలే కాదు, మేం పడగొట్టి మళ్ళీ కట్టించుకునేదాకా నిరభ్యంతరంగా వుండచ్చు” అని, అద్దె మాట్లాడుకున్నారు.
“నావల్లేకదూ, ఇదంతా” అని చాలా బాధపడింది సుమిత్ర ఇల్లు అమ్మకమౌతుంటే. స్వరుప మందలించింది.
ముహూర్తాలు పెట్టుకున్నారు. తొందరలోనే కుదిరింది.
పెళ్ళికి రాధ అన్న, వదిన వచ్చారు. భర్త పోయి నిస్సహాయస్థితిలో పడ్డ చెల్లెలు ఇంతగా నిలదొక్కుకోవటం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులో అసూయకూడా వుండచ్చు. మానవనైజం అది. తను ఎంత పైకేనా వెళ్ళచ్చు, తోటివాడు వెళ్తేమాత్రం తనకి జరిగిన ద్రోహంలా అనిపిస్తుంది చాలామందికి. అలాంటివాళ్లలో ఆయనా ఒకడు. ఇల్లు అమ్మారని తెలిసి మండిపడ్డాడు.
“ఆడపెత్తనం, బోడిపెత్తనం అని ఇందుకే అంటారు. ఆరోజుని బావ పోయినప్పుడు చెప్పాను, వచ్చిన డబ్బేదో నా చేతికి ఇవ్వండి, మీ అవసరాలు చూసుకుంటానని. విన్నారు కాదు. ఇంతంత పెద్ద సంబంధాలకి ఎందుకు వెళ్ళాలి? ఈరోజుని ఇల్లమ్ముకుని నడిరోడ్డుమీద నిలబడ్డావు. అసలు సుమిత్రకి అంత గొప్ప సంబంధం దేనికి? రేపు పెళ్ళయాక అది నిన్ను చూస్తుందా? వాళ్ళు నీ చెప్పుచేతల్లో వుంటారా? ఇప్పుడేనా నన్ను నమ్ముకుంటే నిన్ను వొడ్డు చేరుస్తాను. ఇంకా పెళ్ళికి ఒక ఆడపిల్ల వుంది. నీ ముందు జీవితం వెళ్ళాలి” అని కడిగి పారేసాడు. ఒక్క క్షణం రాధ మనసుకూడా అటు తూగింది.
“ఇప్పుడు అమ్మకి వచ్చిన కష్టమేమిటి మామయ్యా? నెల తిరిగేసరికి పెన్షను చేతికి వస్తుంది. నేను బతికుండగా ఆవిడకి ఏలోటూ జరగదు. మమత పెళ్ళి నా బాధ్యత అని అందరికీ చెప్పాను. ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పాలి?” సుమిత్ర తిరగబడింది.
“అలాక్కాదే! నీకిలా బాధ్యతలున్నాయనీ ఓ కాగితంముక్కేదైనా రాసుకున్నారా?”
“ఏమని రాసుకోవాలి మామయ్యా? నీకూ కొడుకూ కూతురూ వున్నారు, నువ్వు ఏవైనా కాగితాలు రాసుకున్నావా?’ఉంటే చూపించు, నేనూ రాసిస్తాను… ఏమ్మా? నీకుకూడా బాధగానే వుందా? చెప్పు. ఇంకా మించిపోయింది లేదు. పెళ్ళి కేన్సిల్ చేద్దామని సూర్యాకి చెప్పేస్తాను… లేదంటే ఎంతకి కావాలో చెప్పు, అంతకి ప్రామిసరీ నోటు రాస్తాను. నేను తీర్చలేకపోతే కేసులు వేద్దువుగాని. అసలు మనకి వచ్చిన కష్టాలేమిటి? ఒకళ్ళా ఇద్దరా, ముగ్గురాడపిల్లలకి నెత్తిమీద పెట్టుకుని చూసుకునే సంబంధాలు వచ్చాయి. ఎంతమందికి అలాంటి అదృష్టం పడుతుంది?” అనేసి ఏడుస్తూ వెళ్ళిపోయింది.
తర్వాత వచ్చిన స్వరూపకి విషయం తెలిసి తల్లిని కోప్పడింది.
“సుమిత్ర మా అక్క మామయ్యా! దాని నోటి దగ్గరిది లాక్కుని తినే అలవాటు చిన్నప్పట్నుంచీ అమ్మావాళ్ళూ మాకు నేర్పలేదు. అమ్మ ఒక్కర్తీ ఈ బాధ్యతలు తీర్చుకోలేదని ఇన్నాళ్ళూ ఆగింది అది. ఇప్పుడు బాధ్యతలు తీరాయిగాబట్టి చేసుకుంటోంది. మమతని హాస్టల్లో వేస్తాం. అంతగా కావాలంటే అమ్మని నువ్వు తీసుకెళ్ళచ్చు. ఇంక మమత పెళ్ళీ, ఆవిడ మంచీచెడూ నువ్వు చూసుకుంటానంటే మాకూ సంతోషమే” అంది మేనమామతో. రాధకి తన తప్పు తెలిసింది. ఇల్లు అమ్మినందుకే నిలువనీడ లేకుండా చేసిందని సుమిత్రమీద కోపం తెచ్చుకుంది. ఇప్పుడు అసలు తనదనే వునికి లేకుండా వెళ్ళి అన్నగారి పంచన వుండాలా?
“ఇప్పుడు నాకొచ్చిన కష్టమేమీ లేదన్నయ్యా! ఇద్దరల్లుళ్ళూ, ఇప్పుడీ రాబోయే పెద్దల్లుడూ ముగ్గురూ నాకు కొడుకుల్లాంటివాళ్ళు. బావ పోవటం ఒక్కటీ తప్పించి ఇప్పటిదాకా నేను ఏ కష్టాలూ పడలేదు. సుమిత్ర తెలివీ, మిగిలిన పిల్లల అదృష్టం జతపడి, వెతుక్కుని వచ్చాయి సంబంధాలు. ఇల్లు అమ్ముకున్నది ఆస్తిని మరోరూపంలోకి మార్చుకోవటానికి తప్ప, జరుగుబాటవక కాదు. కొద్దిరోజుల్లో గృహప్రవేశానికి వద్దువులే” అంది రాధ.
ఆ గొడవ అంతటితో ఆగింది.
పెళ్ళి హడావిడంతా మురళిదీ భార్గవదే. భార్గవకి మొదట్నుంచీ స్నేహితులు చాలా తక్కువ. మురళితో కలిసి తిరగడం సరదాగా వుంది. తమ యిళ్ళలో జరిగే ఈవెంటుమేనేజిమెంటు పెళ్ళిళ్ళకీ ఇక్కడ అత్తవారింట్లో జరిగే పెళ్ళిళ్ళకీ వున్న తేడాని అతను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. బరువంతా భుజానికి వేసుకున్నట్టు తిరగడం సరదాగా వుంది. ఐదూపదీ ఖర్చు చేసే దగ్గరా అతనికి పెద్దగా పట్టింపు లేదు. మురళికి అతనిలా కాదు. అతవారింట్లో మగదక్షత లేదుగాబట్టి బాధ్యతగా అనిపిస్తోంది.
ఎలాంటి ఆర్భాటానికీ సుమిత్ర ఒప్పుకోలేదు. చెల్లెళ్ళూ మరుదులముందు పెళ్ళికూతుర్లా అలంకరించుకుని కూర్చోవటం సిగ్గుగా అనిపిస్తోంది. అన్నిపనులూ తనే ముందుండి చకచక చెయ్యటం అలవాటు. అలాంటిది కూర్చుని చేయించుకోవటం మరో ఇబ్బంది. మేనమామ వచ్చి చేసిన రగడ, దాంతో మొదలైన అపరాథభావన మరోవైపు, స్వరూప వచ్చి దెబ్బలాడితేనో, నచ్చజెప్తేనో తప్ప తల్లిని తనతో సరిగా వుండకపోవటం మరోవైపు ఆమెని చాలా బాధపెడుతోంది. సుమిత్ర తన పంతం నెగ్గించుకుందని రాధకి మనసులో లోలోపలి కోపం పోలేదు. అది చూచాయగా ఆవిడ ప్రవర్తనలో ప్రతిబింబిస్తోంది. సరిగ్గా రుక్మిణిదీ అలాంటి కోపమే. వియ్యపురాళ్ల సందడిలేని పెళ్ళి అది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.