ప్రియమైన జీవితం – 19 by S Sridevi

  1. ప్రియమైన జీవితం – 1 by S Sridevi
  2. ప్రియమైన జీవితం – 2 by S Sridevi
  3. ప్రియమైన జీవితం – 3 by S Sridevi
  4. ప్రియమైన జీవితం – 4 by S Sridevi
  5. ప్రియమైన జీవితం – 5 by S Sridevi
  6. ప్రియమైన జీవితం – 6 by S Sridevi
  7. ప్రియమైన జీవితం – 7 by S Sridevi
  8. ప్రియమైన జీవితం – 8 by S Sridevi
  9. ప్రియమైన జీవితం – 9 by S Sridevi
  10. ప్రియమైన జీవితం – 10 by S Sridevi
  11. ప్రియమైన జీవితం – 11 by S Sridevi
  12. ప్రియమైన జీవితం – 12 by S Sridevi
  13. ప్రియమైన జీవితం – 13 by S Sridevi
  14. ప్రియమైన జీవితం – 14 by S Sridevi
  15. ప్రియమైన జీవితం – 15 by S Sridevi
  16. ప్రియమైన జీవితం – 16 by S Sridevi
  17. ప్రియమైన జీవితం – 17 by S Sridevi
  18. ప్రియమైన జీవితం – 18 by S Sridevi
  19. ప్రియమైన జీవితం – 19 by S Sridevi

“అన్నీ వద్దు, వద్దంటున్నావు, వట్టి కొబ్బరిబోండం చేతిలో పెట్టి పంపిస్తామనుకున్నావా?” అని స్వరూప కోప్పడింది.
“మాట్లాడకుండా అన్నీ చెయ్యనివ్వవే. స్వీట్ మెమరీస్ ఇవన్నీ. మళ్ళీ అరవయ్యేళ్ళొచ్చాక గుర్తు చేసుకోవడానికి ఏవీ లేవని సూర్య గుర్తుపెట్టుకుని అప్పుడు మా తాళం పట్టిస్తాడు” అంది సునీత.


చాలాకాలం తర్వాత వాళ్ళు ఇల్లు దాటారు. రాజశేఖరం, యశోదా ఆ యింటికి వచ్చారు. వాళ్ళు ఆయిల్లు వదిలిపెట్టి వెళ్ళాక అదే రావటం. సుమిత్రావాళ్ళ పక్కవాటాలో వీళ్ళు వుండేవారు. నలుగురు స్నేహితులూ ఆరుగురు పిల్లలూ అన్నట్టు వుండేవి రెండిళ్ళూ. పెద్ద చదువుకని తేజా, ప్రమోషన్‍మీద తనూ ఈ పొదరింటిని వదిలి ఇవతలికి వచ్చారు. స్నేహితుడు చనిపోతే ఆ కుటుంబాన్ని గురించి తమకేదీ పట్టనట్టు దూరం వచ్చేసారు. పిల్లలు పెంచుకున్న బంధాన్నికూడా తుంచేసారు. తమ తరంలో అలా ఎందరో చేసారు. కానీ ఎవరికీ జరగనిది తమకి జరిగింది. ఇక్కడే వుండి వుంటే సుమిత్ర ప్రేమ వాడిని కట్టేసేదా? ఈ కుదురు తమని పట్టి వుంచేదా? ఆయనకి కళ్లనీళ్ళు తిరిగాయి. సుమిత్ర పెళ్ళని వాళ్లకి తెలీదు. తెలిసాక తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. మనసుల్లో సుళ్ళు తిరుగుతున్న దు:ఖాన్ని వంపేందుకు అది సరైన సమయంగానీ, చోటుగానీ కాదని.
“ఒక్కసారి సుమిత్రని చూసి వెళ్ళిపోదాం” అంది యశోద. ఆయన కాదనలేకపోయాడు.
పెళ్ళింట్లోకి అడుగుపెట్టిన వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఏదో భయంకరమైన పక్షి రెక్కలు చప్పుడు చేసుకుంటూ వచ్చినట్టు అనిపింది అక్కడ తేజాగురించి తెలిసిన అందరికీ. వీళ్ళని ఎవరు పిలిచారు? స్వరూప భృకుటి ముడివడింది. సుమిత్రవైపు చూసింది. తను కాదన్నట్టు తలూపింది సుమిత్ర.
సునీత పెళ్ళిమంటపం దగ్గర వుంది అక్కడి ఏర్పాట్లు చూస్తున్న భర్తకి సాయంగా. రాధకూడా వంటల పర్యవేక్షణ చూస్తూ అక్కడే వుంది.
సుమిత్ర కూర్చున్న గది చిన్నదవటంతో కొత్తగా వచ్చినవాళ్ళకి చోటివ్వడంకోసం అక్కడున్నవాళ్ళు లేచి వెళ్ళారు. స్వరూపమాత్రం అక్క కుర్చీకి ఆనుకుని నిలబడింది వాళ్ళ సంభాషణ వింటూ.
“మీరు వాడి దగ్గరకెళ్ళాక మళ్లీ వస్తారేమోనని ఎదురుచూసాం సుమిత్రా! రాకపోయేసరికి ఏం జరిగిందోనని చాలా భయపడ్డాం. నిన్ను చూడాలనిపించింది. ఒక్కసారి చూసి వెళ్ళాలని వచ్చాం ! పెళ్ళని తెలీదు” అన్నాడు రాజశేఖరం.
“పోన్లే క్షేమంగానే తిరిగొచ్చారు. అది చాలు” అంది యశోద. కొద్దిసేపట్లోనే ఆమె గాంభీర్యం తొలగిపోయింది.
“వాడెలా వున్నాడు సుమిత్రా? బైటికొచ్చే ఆశ వుందా? అమ్మా, నాన్నా గుర్తున్నారా వాడికి?” అని తేజాని తలుచుకుని కళ్లనీళ్ళు పెట్టుకుంది. వాటికి జవాబులు సుమిత్ర దగ్గర లేవు. భార్యని ఓదార్చే శక్తి రాజశేఖరానికి లేదు.
“పెళ్ళింట్లో కన్నీళ్ళెందుకు పెట్టుకుంటావత్తా? సుమిత్ర ఇన్నేళ్ళు బాధపడింది చాలదా? మీరుగానీ అమ్మగానీ ఒక్కలా ఏడిపించారు దాన్ని. చిన్నప్పట్నుంచీ పెంచుకున్న బంధం తుంచాలనుకున్నారు మీరు. సంబంధం వద్దనుకున్నారన్న విషయం దాచిపెట్టింది ఆవిడ. ఇది పిచ్చిదానిలా తేజాకోసం ఏళ్ళకి ఏళ్ళు ఎదురుచూసింది. అదంతా జరిగిపోయిన విషయం. ఇది అక్కకి కొత్తజీవితం. దయచేసి దాని బతుకు దాన్ని బతకనివ్వండి. అతను మీ కొడుకు. అతని విషయాలకి అక్క జవాబుదారీ కాదు. దాన్ని ఇలాంటి ప్రశ్నలు వేసి ఇరుకున పెట్టకండి. పెళ్ళి చూసుకుని అక్షంతలు వేసి వెళ్లండి. అంతే” కటువుగా అంది స్వరూప.
అనుబంధాలకి కొన్ని స్థాయులుంటాయి. సుమిత్ర స్వరూపలా వుండలేకపోయింది. ఎప్పటేప్పటివో జ్ఞాపకాలు పొర్లుకొచ్చి ఆమె మనసుని కలవరపెట్టయి.
“అత్తా! ధరణీ నిష్కారణంగా చచ్చిపోయాడు. అలాంటి ఎందరో పిల్లల జీవితాలు నాశనమవటానికి కారణం నీ పెద్దకొడుకు. ధరణీకోసం మానేసి తేజాకోసం ఏడుస్తావేంటి? మాకు రెట్టింపు వయసు, అనుభవం వున్న మామయ్య తేజాకోసం ఏమీ చెయ్యలేకపోయారు. తేజాని మేము కలిసి వచ్చాక జరిగిన పరిణామాలకి విసుగు పడి సూర్య వుద్యోగం మానేసాడు. ఇంక నేనెంతటిదాన్ని? నావి చాలా చిన్న కోరికలు. నా చెల్లెళ్ళు, అమ్మ… ఇంతే నా ప్రపంచం. ఈ చిన్నిప్రపంచాన్ని పదిలంగా నిలబెట్టుకుందుకు సూర్య నాకు అండ. నా బలం, ధైర్యం, సంతోషం అన్నీ అతనే. నీ దు:ఖం నేను తీర్చలేను. నాకు ఆ శక్తి లేదు” చేతులు జోడించింది సుమిత్ర.
ఆశీర్వదించమని వంగి కాళ్ళకి నమస్కరించింది. రాజశేఖరం ఆమె తలమీద చెయ్యి వుంచి దీవించాడు. యశోద మెళ్ళోంచీ గొలుసు తీసి సుమిత్ర మెడలో వెయ్యబోయింది.
“వద్దత్తా! మనం ఒకరికొకరం ఏమీ కానట్టే వుందాం. మీ ఆశీర్వాదం చాలు” అని దూరం జరిగింది. వాళ్ళు పెళ్ళికి వుండలేదు. ఉండమని ఎవరూ గట్టిగా అనలేదు. వచ్చిన వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళ దు:ఖం ఎవరూ తీర్చలేనిది. పంచుకోలేనిది.
“ఎవరు? ఏమౌతారు? పెళ్ళికి వుండకుండా ఎందుకు వెళ్ళిపోయారు?” అని అడిగినవాళ్ళకి జవాబు స్వరూపే చెప్పింది.
“మా నాన్న స్నేహితుడు ఆయన. పెళ్ళని తెలిసి అక్కని చూసి వెళ్ళారు. వాళ్ళకి ఇంకేవో ముఖ్యమైన పనులున్నాయట” అని. తర్వాత ఆ విషయం తెలిసినప్పుడు వాళ్లకి ఎదురుపడే అవసరం తప్పినందుకు రాధ సంతోషించింది. మనుషుల్లో మంచీ చెడుల కలయిక వుంటుంది. ఒక్కో సందర్భానికి ఒక్కోలా ప్రవర్తించే తత్వంకూడా వుంటుంది కొందరిలో. భవిష్యత్తు స్పష్టంగా లేనప్పుడు, తనేం చెయ్యాలనేది తనచేతిలో లేనప్పుడు బయటపడే ప్రవర్తనాలోపం అది. దాన్ని పూర్తిగా చెడు అని అనలేం. భర్త అలా అర్థాంతరంగా చనిపోకపోతే ఆవిడకి పెద్దకూతురితో వుండే అనుబంధం వేరుగా వుండేది. ఆయనపోయాక అభద్రతతో నిండిపోయి చెడ్డతనంలాంటిది అనేక విధాలుగా బయటపడీ, సర్దుకుంటూనూ వుంది.


ఎండావానా కలిసి వడగళ్లవాన పడ్డట్టు, ఇష్టాలూ, అయిష్టాలూ కలిసిన వడగళ్లవానలాంటి పెళ్ళి పూర్తై సుమిత్ర అత్తవారింటికి వచ్చింది. పెళ్ళి చాలా క్లుప్తంగా జరిగింది. ఎక్కడా ఒక్క అనవసరపు ఆర్భాటంకూడా చెయ్యనివ్వలేదు సూర్యా.
“పెళ్ళి వాళ్ళది. వాళ్లకి తగ్గట్టు చేస్తారు. రిసెప్షను మనది. అది గ్రాండుగా చేసుకుందాం” అన్నాడు.
పుట్టిన పిల్లలు పుట్టినట్టే వుండిపోరు. పెరుగుతారు, పెద్దౌతారు. వాళ్ళకిగాను కొన్ని అభిప్రాయాలూ, అవసరాలు వుంటాయి. వాటిని అర్ధం చేసుకోవటంలోనే తమ పెద్దరికం వుంటుంది. రుక్మిణి ఇంకేం తర్కించలేదు. అంతా సూర్యా యిష్టం ప్రకారమే జరిగింది. ఇంత తక్కువ వ్యవధి కాబట్టి బయటివాళ్ళెవరూ రాలేదు. రావల్సినంత గొప్ప పెళ్ళికాదు కాబట్టి వీలు కుదరలేదు సూర్య అన్నావదినలకి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అలా చెప్పి పెట్టారు. వాళ్ళు పెళ్ళంతా లైవ్‍లో చూసారు. తమ్ముడి పెళ్ళి కాబట్టి సూర్యా అన్నకి సరదాగానే అనిపించినా, సుమిత్ర తన తోటికోడలనీ, తనతో సమానస్థాయిలో ఆ యింట్లో అడుగుపెడుతోందనీ అనుకుంటే వదినకిమాత్రం అంత యిష్టంగా అనిపించలేదు. ఆమె తల్లిదండ్రులు ఆ భావాలని స్పష్టంగా చూపించారు.
సత్యనారాయణ వ్రతం, రిసెప్షను, దంపతి తాంబూలాలివ్వటం అన్నీ అయ్యాయి.
“ఇంత లేని సంబంధం చేసుకున్నారేంటి?” అనే ప్రశ్న రుక్మిణిని బంధువులు స్నేహితులు అందరు అడగటమే. అది ఆవిడకి చాలా బాధనిపిస్తోంది. ఆ ప్రశ్న ఆవిడకీ సుమిత్రకీ మధ్యని తెరలా నిలిచిపోయింది. భర్తంత తేలిగ్గా ఆవిడ సుమిత్రని స్వీకరించలేకపోయింది. కొడుకుని వేరే కాపురం పంపించేద్దామన్న ఆలోచనకూడా వచ్చింది. ఇంత విముఖత మధ్యని ఆ యింట్లో అడుగుపెట్టింది సుమిత్ర.
“నీకు నువ్వుగా ఆ పని చెయ్యకు. కొన్నాళ్ళు గడవనీ. ఆ అమ్మాయి ప్రవర్తన గమనించు” అని వారించాడు వాసుదేవ్.
“నువ్వు ఆస్తి అంతస్తులని చూస్తున్నావు. పెద్దకోడలు అంత చదువుకుంది. అమెరికాలో వుంది. ఎన్నాళ్లైంది వాళ్లని చూసి? వాళ్ళిక్కడికి వచ్చినా ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది మనవాడు అటూయిటూ తిరుగుతాడు. అంటీముట్టనట్టేకదా, వాళ్ళ ప్రేమలు? ఇప్పటి పిల్లలంతా ఏదో ఒకలా ఏదో ఒకచోట బీటెక్ చదివామనిపించుకుని పదికీ ఇరవైకీ చేస్తూ సాఫ్ట్‌వేర్ వుద్యోగాలని గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతా తెలిసీ తెలీనితనాలు, అహంభావాలు. చదువుకున్న మన పెద్దకోడలిలాంటి పిల్లలు తప్పించుకు తిరిగితే ఈ మిడిమేలపువాళ్లంతా అత్త వద్దు, మామ వద్దు అని మనం కష్టపడి కనిపెంచిన మగపిల్లల్ని ఎగరేసుకుపోతున్నారు. పెద్దవాళ్ళక్కర్లేదు, వాళ్ళ ఆస్తులుమాత్రం కావాలి… ఇలా వుంటున్నాయి వాళ్ళ ఆలోచనలు. ఈ అమ్మాయి నిండుకుండలా వుంది. అలాంటి పిల్లలు ఎక్కడ దొరుకుతారు? ” అన్నాడు.
నిజమే! పెళ్ళంటే సంగీత్‍లు, మెహందీలు కాదు, మనసులు కలవటం అని అందరికీ సర్ది చెప్పుకోవాలి.
“సూర్యా యిష్టపడ్డాడని చేసాం” అని చెప్పుకుంది అందరికీ. తనూ ఇష్టపడిందని అందరికీ చెప్పుకుందుకు సుమిత్రకి ఖరీదైన చీరలు, నగలు కొని రిసెప్షన్లో ప్రదర్శించుకుంది.
స్వరూపని దింపినట్టే రాధ సునీతనీ, మురళినీ వెంటపెట్టుకుని వెళ్ళి సుమిత్రని దింపింది. అటు అక్క, ఇటు చెల్లెలు… వాళ్ళముందు తేలిపోతున్న సునీతని చూస్తుంటే ఆవిడకి కొంచెం బాధ కలిగింది. సుమిత్రకి కూడా బాధే అనిపించింది.
“సునీ! నీకు తక్కువేం జరగదు. నాకు కొంచెం సమయం ఇవ్వు” అంది చెల్లెలితో.
“అదంతా చిన్నతనంలేవే! నువ్వే ఏవీ మనసులో పెట్టుకోకు”అని అత్తింటి విషయాలు చెప్పింది. మురళి ముగ్గురు అత్తలూ తమ కుటుంబాన్ని ఎలా పీడిస్తున్నారో చెప్పి, “నేనూ ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. నా జీతంతో కొనుక్కున్నానని చెప్పి అన్నీ కొనిపించుకుంటాను” అంది. దేవకిలా రుక్మిణి వాళ్ళకి పెద్దగా మర్యాదలేం చెయ్యలేదు. ఒక బాధ్యతగా అనుకున్నాడుగాబట్టి మురళి పెద్దగా పట్టించుకోలేదు.
“మీకు ఏ అవసరం వచ్చినా నాకో సునీతకో ఫోన్ చెయ్యండి. మొహమాటపడద్దు. డబ్బుకేనా సరే! అన్నదమ్ముడినన్నారు, అలాగే వుండాలి మరి” అని సుమిత్రకి చెప్పాడు.
ఎక్కడివాళ్ళు అక్కడికి సర్దుకున్నారు.
ఇంట్లో ఒక ఆడపిల్ల తిరుగుతూ ఆ పనీ ఈ పనీ చక్కబెడుతూ వుండటంలోని సరదా రుక్మిణికి నెమ్మదినెమ్మదిగా అనుభవంలోకి వచ్చింది. మువ్వ మోగినట్టో, ఓ చిన్న వానచినుకు ఆకుమీద రాలిపడ్డట్టో వుండే సుమిత్ర మృదువైన ప్రవర్తన ఆవిడ మనసు మార్చడానికి ఎంతోకాలం పట్టలేదు.
పెద్ద యిళ్ళలోనే మెట్టినా, సుమిత్రకీ స్వరూపకీ చాలా తేడా వుంది. దేవకి కోడలిని అభిమానిస్తుంది. అన్నీ దగ్గరుండి నేర్పిస్తుంది. తెలీనివి చెప్తుంది. డబ్బు దగ్గర ఎక్కడ బిగబట్టాలో ఎక్కడ ఖర్చుపెట్టాలో ఆమె నొచ్చుకోకుండా సున్నితంగా చెప్తుంది. తనవెంట అన్నిచోట్లకీ తిప్పుతుంది. శంకర్, భార్గవ ఆఫీసులకి వెళ్ళిపోయాక అత్తాకోడళ్ళిద్దరే ఒకరికి ఒకరు కాలక్షేపం. మధ్యలో ఆవిడ కూతుళ్ళో, అల్లుళ్ళో వస్తారు. దేవకినిబట్టే వాళ్ళూను. స్వరూపపట్ల ఎలాంటి బేధభావం చూపించరు.
రుక్మిణి అలా కాదు. సుమిత్రని పట్టించుకోదు. వంటకీ, పనికీ, తోటపనికీ మనుషులున్నారు. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయాక ఆవిడలో చాలా విషయాల్లో ఆసక్తి తగ్గింది. మొదట్లో పనివాళ్ళని పట్టించుకునేది. ఇప్పుడు అదికూడా పెద్దగా లేదు. రోజంతా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూనో, సెల్ చూసుకుంటునో కాలం గడుపుతుంది తప్ప ఎక్కడికీ వెళ్లదు. జీవితమంతా ఖాళీ ఐపోయిన భావన. పెద్దకొడుకు దగ్గరికి వెళ్ళినా అక్కడా తోచదు. నిరాసక్తంగా రోజులు దొర్లించేస్తోంది.
ఇంటాబయటా అనేక మార్పులు. అవి పిల్లలకీ పెద్దవాళ్ళకీ మధ్య అనివార్యమైన దూరాన్ని పెంచుతున్నాయి. ఎనభయ్యో దశకందాకా చాలావరకూ గవర్నమెంటు వుద్యోగాలే వుండేవి. అవి నిలకడైన ఆర్థికబలాన్ని ఇచ్చేవి. కాస్త తెలివి, అవకాశం వున్నవాళ్ళు స్వంతయిళ్ళు అమర్చుకునేవారు. కుటుంబంలోనివాళ్ళంతా ఒకరికొకరు అమ్దుబాటులో వుండేవారు. ఒకళ్ళో ఇద్దరో పిల్లలతో సరిపెట్టుకుని వాళ్ళని పైకి తేవటమే ధ్యేయంగా బతికారు. వాళ్ళని పెంచటం అనే ప్రక్రియ పూర్తౌతూ వుంటే ప్రభంజనమ్లా వచ్చిమ్ది ఐటీ అనే మార్పు. అది తల్లిదండ్రులనీ పిల్లలనీ తలోవైపుకీ విసిరేసింది. పిల్లలు గడ్డిపరకల్లా, పూరెక్కల్లా కొట్తుకుపోయారు. పెద్దవాళ్ళ జీవితాలు ఎలాంటి భావోద్వేగాలూ మిగలని శూన్యపు గూళ్ళుగా మారిపోయాయి. డబ్బుకి ఎలాంటి ఇబ్బందీ వుండదు. చెయ్యటానికి ఏ పనీ వుండదు. రుక్మిణిలాగ ఎందరో!
మూడుగదుల చిన్న యింట్లో పెరిగి, మామూలు వుద్యోగం చేస్తున్న సుమిత్రకి ఇంతపెద్ద యిల్లు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. వాసుదేవ్ తండ్రి కట్టించిన ఇల్లు అది. గజం యాభైరూపాయలకి వచ్చినరోజుల్లో వెయ్యిగజాలు కొని రెండస్తుల మేడ కట్టించాడు. ఇంటిచుట్టూ రకరకాల చెట్లు, మొక్కలు… లోపల్నుంచీ బయటినుంచీకూడా మెట్లున్నాయి. కొన్నాళ్ళు మొక్కలు పెంచడం అవీ రుక్మిణికి సరదాగా అనిపించినా అది స్వతహాగా వున్న ఆసక్తి కాకపోవటంతో ఆ సరదా నిలబడలేదు. పైగా అదంతా భారంగా అనిపిస్తోంది. అమ్మేయ్యటమో, డెవలప్‍మెంటుకి ఇవ్వటమో చేద్దామని చాలాసార్లు అన్నా, సూర్య వప్పుకోలేదు. కొన్ని మార్పులవీ చేసి, టెలీ సీరియల్స్ షూటింగులకి అద్దెకి ఇవ్వచ్చని అతని ఆలోచన.
రుక్మిణికిలాగే చెయ్యటానికీ ఏ పనీ కనిపించట్లేదు సుమిత్రకి. పొద్దున్న ఆరింటికి లేస్తుంది. సూర్యా బయటికి వెళ్ళేదాకా అతనితో కాలక్షేపం. అతనీమధ్య కొత్తగా ప్రాంభించిన షాపుతో కాస్త బిజీగా వున్నాడు. అతను వెళ్ళాక తను ఆఫీసుకి వెళ్ళేదాకా ఖాళీయే. వంటమనిషి పొద్దున్నే వచ్చి కాఫీ టిఫెన్ల దగ్గర్నుంచీ అన్నీ చూసుకుంటుంది. మొక్కుబడి వంటలే. పనామె వస్తుంది. ఇల్లంతా శుభ్రం చేస్తుంది. ఎక్కడి దుమ్ము అక్కడే. మాలి వస్తాడు. మొక్కలకి ఏం చేస్తాడో తెలీదు. ఎక్కడో ఒకదగ్గర ఇంటిపనుల్లో చొరబడాలని అర్థమైంది ఆమెకి.
పదింటికి ఆఫీసు. వెళ్ళేప్పుడు రుక్మిణికి కనిపించి వెళ్తున్నానని చెప్తుంది. ఆవిడ తలూపుతుంది. సాయంత్రం వచ్చి ఆమెకి మళ్ళీ కనిపించి ఒక బలహీనమైన నవ్వు నవ్వుతుంది. అక్కడితో ఇద్దరిమధ్యా సరి. ఈ పరిస్థితిని గమనించాడు వాసుదేవ్.
వాసుదేవ్‍కి పిల్లల జీతం తీసుకునే అలవాటు మొదట్నుంచీ లేదు. అవసరం కూడా లేదు. పిల్లలకి స్వతంత్రంగా ఖర్చుపెట్టుకోవటం, దాచుకోవటం రావాలనేది ఆయన సిద్ధాంతం. చిన్నవయసునుంచే మొదలుపెడితే అడుగులు తడబడి, ఎక్కడేనా నష్టపోయినా పాఠం నేర్చుకుంటారని, అదే పెద్దయ్యాక దెబ్బతింటే జీవితాలు తలకిందులౌతాయని అంటాడు.
సుమిత్రకి తల్లితో వచ్చిన అంతరం అలాగే వుంది. ఆఫీసునించీ అటు వెళ్ళాలని ఒక్కసారికూడా అనిపించకపోవటానికి బలమైన కారణం అదే. ఐనా తన బాధ్యతల విషయంలో ఏమాత్రం తడబడలేదు. జీతం తల్లికి తీసుకెళ్ళి ఇచ్చింది. అదొక్కటే తామిద్దరిమధ్యా వున్న బంధం అన్న భావన మనసులో.
“పెళ్లైన పిల్లవి. ఇంక ఇలా తీసుకొచ్చి ఇవ్వకు. బావుండదు” అంది రాధ. సుమిత్ర చెల్లెల్ని తనతో తీసుకెళ్ళి బేంకులో అకౌంటు తెరిచి అందులో కొంత వేసి వచ్చింది.


“ఏమంటోంది నీ కోడలు?” అడిగాడు వాసుదేవ్ భార్యని, పరిహాసంగా.
“ఏమిటో! ఉలుకూ పలుకూ వుండదు ఆ పిల్లలో. చీమలా ఇల్లంతా తిరుగుతూ చక్కబెట్టుకుంటోంది. ఏం చక్కబెడుతోందో తెలీదు. లోపలికీ బైటికీ, కిందకీ మీదికీ తిరుగుతూ వుంటుంది. నన్ను చూసిమాత్రం పక్కకి తప్పుకుంటుంది” అంది రుక్మిణి.
“వంటలకి రుచులొచ్చాయి. ఇల్లంతా పూలవాసనలు నిండాయి. మాలి వొళ్ళొంచి పనిచేస్తున్నాడు. ఇవన్నీ నీ బెదురుచీమ చేస్తున్న పనులు” అన్నాడాయన పెద్దగా నవ్వేసి. తర్వాత నెమ్మదిగా అన్నాడు.
“రుక్కూ! మన పెళ్ళప్పుడు నువ్వెలా వుండేదానివో, మొక్కలూ చెట్లూ చూస్తూ సంతోషపడేదానివో అలాగే వుంది ఆ అమ్మాయికూడా. నీకు కొనసాగింపులా వుంది. సూర్యకి తనంటే ఎంత యిష్టమో గమనించావా? ఇంకా కోపం దేనికి? ఇంకోమాట. పెద్దకోడలు షోకేసులోని బొమ్మ. అందరూ చూసి ఆనందిస్తారు. మనని పొగుడుతారు. చిన్నకోడలు మనం ఆడుకుని ఆనందపడే బొమ్మ. ఆ తేడా నువ్వు గుర్తుంచుకో”


ఉపసంహారం:
సరిగ్గా ఐదేళ్ళు గడిచాయి.
సునీతకి మరోకొడుకు పుట్టాడు. ఇంకొన్నాళ్ళకి రిటైరౌతాడనగా మురళి తండ్రి పోయాడు. అతని తల్లి ఆయన చెల్లెళ్ళని గడప అవతలే నిలబెట్టింది. కొన్నికొన్ని ప్రవర్తనలకి పర్యవసానాలు అలాగే వుంటాయి. సుమిత్రకీ, స్వరూపకీ కూతుళ్ళు. నీలిమ పెళ్ళి బాధ్యత దేవకి తీసుకుంది. ఆమె ఆలోచనలకి తగ్గసంబంధమే ఆవిడ్ బహిర్వలయంలోంచీ దొరికింది. మమత బీటెక్ అయ్యి కాంపస్‍ సెలెక్షన్స్‌లో వచ్చిన వుద్యోగంలో చేరింది. ప్రాజెక్టుమీద యూయస్ వెళ్ళింది. తనెళ్ళి విజిటింగ్ వీసామీద రాధనికూడా రప్పించుకుంది. మొండితనాలూ పంతాలూ కాకుండా విషయాలన్నీ సహజంగా జరుగుతుంటే వాటికి చక్కటి ఫలితాలు దొరుకుతాయని ఆవిడకి అర్థమైంది.
సూర్య అన్నావదినల దగ్గిరకి వెళ్ళి మమతని కలిసి తిరిగి వచ్చారు సూర్య, సుమిత్ర. విమానాశ్రయంలోంచీ అప్పుడే బయటికి వచ్చారు.
“సూర్యా!” కేబ్ ఎక్కబోతుంటే వినిపించింది. చిరపరిచితమైన గొంతు. సూర్యతోపాటు సుమిత్రకూడా తల తిప్పి చూసింది. ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి స్థాణువైంది.
“తేజా!” అస్పష్టంగా వుచ్చరించాయి ఆమె పెదవులు.
అభివాదం చేస్తున్నట్టుగా చేతిని నుదుటకి తాకించుకుని చిరునవ్వు నవ్వాడు తేజా. అందులో ప్రేమతో కూడిన పరిహాసం వుంది. సూర్యాని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.
“ఇది… ఇదెలా సాధ్యం?” సుమిత్ర ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు. సుమిత్ర చేతిలో వున్న పాపని చూసి అతని కళ్ళు మెరిసాయి. తీసుకోబోయాడు. ఆమె యివ్వలేదు. ఒక్క అడుగు వెనక్కి వేసింది. అతను నవ్వేసాడు.
“ఇంకా భయమే?” అని, “సాయంత్రం ఫ్రీయేనా? తీరిగ్గా కల్సుకుని మాట్లాడుకుందాం” అన్నాడు. ఇంటి అడ్రెస్ చెప్పి మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోయాడు.
అనుకుంటున్నట్టుగానే సాయంత్రం బయల్దేరారు. పాప ప్రయాణానికి అలిసిపోయి నిద్రపోతోంది. రుక్మిణి తను చూసుకుంటానంది. ఆవిడకి మనవరాలంటే ప్రాణం. వీడియో కాల్స్‌లో మాత్రమే కనిపించే వర్చువల్ కొడుకూ కోడలూ మనవలకీ ఇక్కడున్న వీళ్ళకీ మధ్య గల తేడా ఆవిడకి అర్థమౌతోంది. పక్కని కూర్చుని సుమిత్ర చెప్పే కబుర్లు, ఆ మాటల్లో ఒలికే అభిమానం, మధ్యమధ్యలో తాకీతాకనట్టుండే ఆమె స్పర్శ, మృదువైన పూరెక్కలా పుట్టి, ఇప్పుడు వొళ్ళోకెక్కి కూర్చునే మనవరాలు… ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
వెళ్ళేసరికి తేజా వీళ్ళకోసం ఎదురుచూస్తున్నాడు. చాలా పెద్ద ఇల్లది. హాలే చెప్తోంది. ఇంటి విలువన్నీ వైశాల్యాన్నీ.
“ఇద్దరే వచ్చారా?” అడిగాడు కొంచెం నిరాశగా. అతనికి సుమిత్ర పాపని ఎత్తుకుని ముద్దాడాలని కోరిక.
“నేనొక ప్రశ్నకి సమాధానం కోసం వచ్చాను” అంది సుమిత్ర సూటిగా. తేజ తలదించుకున్నాడు. అతనికి తెలుసు, ఏమడుగుతుందో!
“ఇప్పుడెందుకు అవన్నీ?” అయిష్టంగా అడిగాడు.
“ఇప్పుడే కాదు. ఎప్పటికీ నన్నా ప్రశ్న వెంటాడుతూనే వుంటుంది. ఆరోజు నిన్ను జైల్లో చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు తేజా! నీలో మార్పు వస్తుందని ఎదురుచూడకుండా నీకు ద్రోహం చేసానా?” స్పష్టంగా వుంది ఆమె గొంతు.
చెప్పక తప్పదు. సుమిత్రకోసం… ఆమె సూర్యతో సంతోషంగా వుండాలంటే….
“ఇందులో దాచడానికేమీ లేదు సుమిత్రా! వ్యక్తిగా ఎవరూ బతకలేరు. ఏదో ఒక వ్యవస్థలో కలిసిపోవాలి. అది సభ్యసమాజమైనా నేరవ్యవస్థైనా సరే. నేనూ అదే చేసాను. చెయ్యకపోతే చచ్చిపోవాలి. నాకు బతకాలనిపించింది”
అతనంత సాదాగా చెప్తుంటే కోపం వచ్చింది సుమిత్రకి. చాలాసేపు మౌనంగా కూర్చుంది. మనసంతా చేదు తిన్నట్టైంది. అసలే మసగా వున్న అతని జ్ఞాపకాలమీద చీకటి తెరలేవో పడి పూర్తిగా కప్పేసాయి. సన్నగా చువ్వలా కదులూ తనని నవ్వించిన తేజా మరుగున పడిపోయాడు. ఒక అపరిచితుణ్ని… ఒక అప్రియమైన వ్యక్తిని చూస్తున్న భావన కలిగింది.
లేచి నిలబడి రెండు చేతులూ జోడించి అంది “మనం మళ్లీ కలుసుకునే సందర్భం రాకూడదని ఆశిస్తున్నాను. నాకు తెలిసిన అందమైన జీవితంగల తేజా చనిపోయాడు. ఈ వికృతమైన మనిషి వునికి కూడా నేను సహించలేను. తేజా! దేన్ని నువ్వు వ్యాపారమని అంటున్నావో అది సమాజాన్ని ఒక జాఢ్యంగా మారి పట్టి పీడిస్తోంది. చిన్నచిన్న పిల్లల్ని కూడా వదలటం లేదు మీరు. స్కూలుపిల్లల్లో కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలా ఎందుకేనా జరిగి వుండచ్చు. ఎందుకు జరిగిందో చెప్పాలనే తపన నీలోనూ, తెలుసుకోవాలనే ఆసక్తి నాలోనూ వుండి మనం కలుసుకోవాలనే ఒక బలమైన కోరికని సృష్టిస్తాయి. అదింక చచ్చిపోయిందనే అనుకుంటున్నాను. నీ జీవితేచ్ఛ నిన్నింకా పతనానికి జార్చినందుకు బాధగా వుంది. సెలవ్”
సూర్య కూడా లేచాడు. “అతనింక బయటికి రాడనుకున్నాను” అంది సుమిత్ర దారిలో.
“అలా శిక్ష పడాలన్నది నా ఆకాంక్ష. పడదని తెలుసు. అందుకే నా వుద్యోగం వదిలేసాను”
“భయపడ్డావా?”
“కాదు. ఆ వుద్యోగం పట్ల నాకున్న గౌరవంతో వదిలేసాను”
(ఐపోయింది)