ప్రియమైన జీవితం – 2 by S Sridevi

  1. ప్రియమైన జీవితం – 1 by S Sridevi
  2. ప్రియమైన జీవితం – 2 by S Sridevi
  3. ప్రియమైన జీవితం – 3 by S Sridevi
  4. ప్రియమైన జీవితం – 4 by S Sridevi
  5. ప్రియమైన జీవితం – 5 by S Sridevi
  6. ప్రియమైన జీవితం – 6 by S Sridevi
  7. ప్రియమైన జీవితం – 7 by S Sridevi
  8. ప్రియమైన జీవితం – 8 by S Sridevi
  9. ప్రియమైన జీవితం – 9 by S Sridevi
  10. ప్రియమైన జీవితం – 10 by S Sridevi
  11. ప్రియమైన జీవితం – 11 by S Sridevi
  12. ప్రియమైన జీవితం – 12 by S Sridevi
  13. ప్రియమైన జీవితం – 13 by S Sridevi
  14. ప్రియమైన జీవితం – 14 by S Sridevi
  15. ప్రియమైన జీవితం – 15 by S Sridevi
  16. ప్రియమైన జీవితం – 16 by S Sridevi
  17. ప్రియమైన జీవితం – 17 by S Sridevi
  18. ప్రియమైన జీవితం – 18 by S Sridevi
  19. ప్రియమైన జీవితం – 19 by S Sridevi

తండ్రి హఠాత్తుగా చనిపోయాడు. బాధ్యతలకి భయపడి ఎవరూ తమ విషయాల్లో కలగజేసుకోలేదు. కర్మవగానే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మేనమామ కొంత సాయపడింది నిజమే. కానీ తండ్రి గ్రాట్యుటీలోంచీ కొంత అప్పడిగాడు. ఆయన్ని కూడా దూరంగా వుంచాల్సిన పరిస్థితి.
“అసలు ఇప్పుడంత డబ్బేం చేసుకుంటారు? మీకేం తెలుసని? మీ దగ్గరుంటే ఖర్చైపోతుంది. కావలిసినప్పుడు తీసుకోవచ్చు. నా దగ్గరుంచండి” అప్పడగటం దగ్గర్నుంచీ ఇక్కడిదాకా సాగింది గొడవ.
అంతా తండ్రి ఆఫీసువాళ్లే చూసారు. రావల్సిన డబ్బు, పెన్షను తల్లి పేరుమీద సేంక్షనయ్యాయి. హౌసింగ్‍లోనూ, ఇతరలోన్లూ పోను గ్రాట్యుటీ తక్కువే వచ్చింది. పెద్దమొత్తంగా వచ్చిన డబ్బు ఫిక్స్ చేసుకొమ్మని అక్కడి అకౌంటెంటు చెప్పింది. ఆమె తండ్రి పోస్టల్ డిపార్టుమెంటులో చేసేవాడట. ఆయనకూడా ఇలాగే సర్విసులో వుండగానే చనిపోతే, డబ్బంతా చేతికి ఇవ్వకుండా కొంత ఫిక్స్ చేయించిందట అక్కడి అకౌంటెంటు.
“బెనిఫిట్స్ తీసుకోవటానికి ఆడవారు కొడుకులనో అన్నదమ్ములనో వెంటబెట్టుకుని వస్తారు సుమిత్రా! వాళ్ళు డబ్బు అకౌంట్లో పడగానే విత్‍డ్రా చేయించేస్తారు. ఆ తర్వాత అది చేతులు మారుతుంది. సమీకరణాలు మారిపోతాయి. మీరు నలుగురు ఆడపిల్లలు, అమ్మ చదువుకోలేదు కాబట్టి జాగ్రత్తగా వుండాలి” అంది. అవి శిరోధార్యమైన మాటలు.
కంపాసినేట్ గ్రౌండ్స్‌లో వుద్యోగం తనకిచ్చారు. పెన్షనవీ తేలిగ్గానే వచ్చాయిగానీ వుద్యోగం రావటానికి చాలా కష్టమైంది. కొంత డబ్బూ ఖర్చైంది. వుద్యోగం వచ్చేదాకా ఇంటి ఖర్చులకి తండ్రి డబ్బులో కొంత పోయింది.
తండ్రి పోయిన ఆరునెలలకి అంటే తనకి పంథొమ్మిది నిండిన నాలుగు నెలలకి వుద్యోగంలో చేరింది సుమిత్ర. జీతం తండ్రి వున్నప్పటిలాగే తీసుకెళ్ళి తల్లికిచ్చేది. ఆయన లేడన్న ఒక విషయం తప్పిస్తే అన్నీ మామూలుగానే జరగసాగాయి. అలాగే జరిపింది రాధ. అన్నీ అమ్మకి తెలుసుననుకుంది సుమిత్ర. తల్లి చేతికే జీతం ఇచ్చినా అన్నీ తండ్రే చూసుకునేవాడన్న విషయం ఆమెకి తెలీదు. అన్నీ తల్లికే వదిలేసింది.
సునీత పెళ్లికి అప్పుచెయ్యాల్సిన అవసరం వచ్చాక ఆమెలో ఆలోచన మొదలైంది.
తన జీతం, ఆమె పెన్షను, తండ్రి బెనిఫిట్సు… అన్నీ ఏమయ్యాయి? అప్పుడర్ధమైంది. కొందరికి కొన్ని రావని. సంపాదించటంతో తన బాధ్యత తీరిపోలేదన్న విషయం గ్రహింపుకొచ్చింది. మిగిలిన డబ్బుతో సునీతకి పెళ్ళి చేసి పంపేసరికి తలప్రాణం తోకకి రావటమంటారే, అలా జరిగింది. కొత్తగా అప్పులుకూడా అయ్యాయి. ఇప్పుడు యీ వుత్తరం.
ఏదో అశాంతి… ఎందుకు తన జీవితంలో ఈ అపశృతులు? అందర్లా నిరంధిగా గడపలేని పరిస్థితి ఎందుకొస్తోంది? తండ్రి చనిపోవటం సమస్య కాదు, తమకి ఆస్తిలేకపోవటం సమస్య కాదు. తనతో కలిపి నలుగురు ఆడపిల్లలున్న కుటుంబానికి సారథ్యం చెయ్యటంకూడా సమస్య కాదు. ఒక ప్రణాళిక ప్రకారం జరక్కపోవటం పెద్ద సమస్య. అదీ తనని బాధపెడుతోంది. ఆమె ఆలోచనలు ఎంతకీ అక్కడే వచ్చి ఆగుతున్నాయి. ఏం చెయ్యాలో అంతుపట్టడం లేదు.
“అమ్మా! పెద్దసార్ రమ్మంటున్నారు”” అటెండరు వచ్చి చెప్పాడు. అప్పటికి ఆలోచనల్ని వాయిదా వేసి లేచింది. అర్జెంటుగా కొంత డాటా ఫీడ్ చేసి ప్రింటౌట్ తీసి ఇమ్మని ఫైలు ఇచ్చాడాయన. ఇంకా ఆ ఫైలు తన దగ్గిరే వుంది. అది చెప్పటానికే పిలిచాడేమో! తప్పదు. తన సమస్యలు తనవి. అవి ఆఫీసు వర్కుని ఆపకూడదు. ఇప్పుడు జవాబు చెప్పుకోవాలి. పదినిముషాల్లో చేసిస్తానని సంజాయిషీ ఇచ్చుకుని వెంటనే చేసి ఇవ్వాలి.
ప్రకాశరావుగారు తన తండ్రికి ప్రాణస్నేహితుడు. ఆయన బ్రతికున్నరోజుల్లో ఇద్దరిదీ ఒకటే కేడరు. కానీ ఇప్పుడాయన తనకి బాస్. కొంచెం కోపిష్టికూడా. వయసుతో వచ్చిన బీపీ, హోదాతో వచ్చిన దర్పం వున్నాయి. తను ఖాళీగా ఆలోచిస్తూనూ వుత్తరం చదువుతూనూ కూర్చుని వుండటం చూసాడేమో! ఒక ఆలోచనని అణచి వుంచే ప్రక్రియలో అనవసరమైన ఇంకెన్నో ఆలోచనలు…
ప్రకాశరావు గదిముందు నిలబడి డోర్ తట్టింది. “రామ్మా!” పిలిచాడు.
చిటపటలాడుతూ వుంటాడనుకుంది, ప్రసన్నంగానే వున్నాడు. మనసులో బరువుకొద్దిగా తగ్గినట్టనిపించింది.
“పొద్దుటినుంచీ అదోలా కనిపిస్తున్నావు. సుమిత్రా! ఏదైనా సమస్యా?” అభిమానంగా అడిగాడు. ఊహించని ఆ సానుభూతికి చలించిపోయింది సుమిత్ర. కళ్ళలో పల్చటి కన్నీటిపొర కదిలీ కదలనట్టు కదిలింది.
“కూర్చో!” అన్నాడు ఆమె ఇంకా నిలబడి వుండటం చూసి. కూర్చుంది.
“అమ్మావాళ్ళూ బావున్నారా? చెల్లెళ్ళేం చదువుతున్నారు? ఈ మధ్యనే ఒక చెల్లెలి పెళ్ళి చేసావు. ఆ అమ్మాయెలా వుంది?” అడిగాడు.
సుమిత్రని ఒక కోణంలోంచీ చూస్తుంటే ఆమె తండ్రి ఆనందరావు గుర్తొస్తున్నాడు ఆయనకి. ఆనందరావు పోయాక సీనియారిటీలో మార్పులొచ్చి తనకి వెంటవెంటనే ప్రమోషనొచ్చి ఈ స్థాయిలో వున్నాడు. లేకపోతే ఈ సీట్లో ఆనందరావే వుండేవాడు. తండ్రి పోయిన కొత్తలో సుమిత్ర ఆఫీసుకి వచ్చి ఆయన్ని కలిసింది. అదే మొదటిసారి ఆమెని చూడటం.
“నేను బియ్యెస్సీ చదువుతున్నానండీ! చదువుకోలేదని అమ్మకైతే స్వీపరు పోస్టు ఇస్తామన్నారట. అలాగైతే మమ్మల్ని బంధువుల్లో చిన్నచూపు చూస్తారని తను భయపడుతోంది. ఇంక రెండు నెలల్లో నా డిగ్రీ ఐపోతుంది. నాకు క్లర్కు పోస్టు ఇవ్వగలిగితే మాకు చాలా సాయంగా వుంటుంది” అంది.
ఆయనకి అదే వయసు కూతురుంది. కూతుర్ని అరచేతుల్లో నడిపించుకుని పెంచుకుంటున్నాడు. అది గుర్తొచ్చి చాలా ఇబ్బందిగా అనిపించింది. అదీకాక ఆనందరావుకి ఈ కూతురంటే చాలా ఇష్టంగా వుండేది. తరచుగా మాటల్లో సుమిత్ర గురించి చెప్పేవాడు. మొదటి కూతురు కావటాన్న కావచ్చు. అతనలా చెప్పగా వినివిని తనకీ ఆమెంటే ఒక అభిమానం ఏర్పడిపోయింది. దగ్గిర కూర్చోబెట్టుకుని మంచీచెడూ అన్నీ విచారించి సుమిత్రకి వుద్యోగం రావటానికి ఇదే వూళ్లో పోస్టింగు ఇప్పించడానికి తనకున్న పరిచయాలన్నీ వాడుకున్నాడు.
తల్లి చదువుకోనిది. బంధువులెవరూ పట్టించుకోరు. మంచీచెడూ సలహా ఇచ్చేవారెవరూ లేరని గ్రహించి తనే అందీఅందనట్టు సలహాలు కూడా
ఇస్తున్నాడు. సుమిత్ర కూడా ఆయన గార్డియన్‍షిప్‍ని తిరస్కరించలేదు. ఇంతచేసినా ఆయన అధికారి, తను ఆయన కింది వుద్యోగి అనే హద్దుని ఇద్దరూ ఎప్పుడూ దాటలేదు. ఆ దూరం, ఆ బెరుకూ అలానే వున్నాయి.
ఇప్పుడూ ఒక సమస్య. దానికి పరిష్కారం కావాలి. క్లుప్తంగా చెప్పింది.
“నువ్వెళ్ళి నీ పని చూసుకో. ఏం చెయ్యాలో ఆలోచించి చెప్తాను” అన్నాడాయన. సుమిత్ర తలూపి తన సీటుకి వచ్చేసింది. పనిమీద మనసు నిమగ్నం కాకపోయినా యాంత్రికంగా చేస్తూ కూర్చుంది. తప్పులు దొర్లుతున్నాయి. సరి చేస్తోంది. మళ్ళీ మళ్లీ తప్పులు. మళ్ళీ మళ్ళీ దిద్దుబాట్లు.
సునీత పెళ్లయ్యాక తనమీద ఖర్చులదాడి మరింత పెరగటం సుమిత్రని చాలా దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పండుగలు, భార్యాభర్తలు రావటం, వాళ్ళకి పెట్టుపోతలు, మర్యాదలు… ఇవికాక సునీత అవసరాలు.. సునీత పెళ్ళవటంతోటే మరో చెల్లెలి పెళ్ళికి దాచడం మొదలుపెట్టాలనుకున్న ఆలోచనకి చెక్ చెప్పినట్లైంది. ఎలా? ఇప్పుడేం చెయ్యటం? ఇంక ఈ పరంపరకి ముగింపు కనిపించేలా లేదు.
“లంచికి రావా? ఆలోచనలు భోంచేస్తావా? పొద్దుటినుంచీ చూస్తున్నాను. ఏంటంత రంధి?” పక్కసీట్లో వుండే నీలిమ పిలుపుతో ఆలోచనల్లోంచీ ఇవతలికొచ్చింది. ఇద్దరూ లంచిరూంకి దారితీసారు.
నలభైముగ్గురు స్టాప్ వుండే ఆ ఆఫీసులో పదిమందివరకూ లేడీస్టాఫ్ వుంటారు. వాళ్లు ఫ్లోర్‍కి ఇద్దరూ ముగ్గురూ చొప్పున మూడు ఫ్లోర్లుండే ఆ ఆఫీసులో పనిచేస్తుంటారు. పక్క పక్క సీట్లు కాబట్టి నీలిమకీ, సుమిత్రకీ స్నేహం కలిసింది. ప్రాణస్నేహం కాదు. కానీ ఒకరి విషయాలు ఇంకొకరికి తెలుసు. ఒకరి అవసరాల్లో ఇంకొకరు సహాయం చేసుకుంటారు.
నీలిమకి ఇంకా పెళ్లవలేదు. కట్నం తీసుకునేవాడిని చేసుకో నంటుంది. అలా కట్నం తీసుకోనివాడు ఇంకా తటస్థపడలేదు.
“మీవాళ్లు ఇవ్వగలిగినప్పుడు ఇస్తే సమస్యేమిటి?” అంటుంది సుమిత్ర,
“నాకలా ఇష్టం లేదు. అమ్మావాళ్లూ ఇప్పుడు కాకపోతే తర్వాతేనా ఇవ్వక మానరు. వాళ్లకున్నది మాకు కాక ఇంకెవరికి? ఆ విషయం అర్థం చేసుకోవాలి వచ్చేవాడు” అంటుంది నీలిమ.
“అలా ఎవరొస్తారు నీలిమా? కట్నం అనుకుంటే కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుందిగానీ నిజానికి డబ్బు అవసరం ఉండేది పెళ్లయిన కొత్తలోనే. ఆ టైములో సరిపడేంత డబ్బుంటే నీ జీవితానికే కాదు, నీ పిల్లల జీవితానికి కూడా మంచి పునాది పడుతుంది. చేతిలో సరిపడేంత డబ్బుంటే పైకి రావటానికి ఎన్నోదార్లు కనిపిస్తాయి. డబ్బు లేకపోతే మిగిలిన దారులన్నీ మూసుకుపోయి డబ్బు సంపాదించుకోవటం అనే ఒక్కదారి మాత్రమే కనిపిస్తుంది”
“నువ్వు కట్నాన్ని సమర్ధిస్తావా?”.
“కట్నం అనే పేరుతో మగవాడు దోచుకోవటాన్ని మాత్రం సమర్ధించను. అదే సమయంలో ఆడపిల్లలు తమకి గల అవకాశాలని వదులుకుని కొత్తకష్టాలు కొని తెచ్చుకోవటాన్ని కూడా””
ఇద్దరూ ఈ విషయంమీద ఎన్నోసార్లు వాదించుకున్నారు.
“ఏమిటి? పొద్దుట నీకేదో ఉత్తరం వచ్చింది. అదీ ఇన్లాండు కవరు. ఈరోజుల్లో ఉత్తరాలు రావటమేమిటబ్బా అనుకున్నాను. అది చదివి నువ్వు దీర్ఘాలోచనలో పడ్డావు. ఏముందందులో?” కుతూహలంగా అడిగింది నీలిమ.
సుమిత్ర బేగ్‍లోంచీ ఉత్తరం తీసిచ్చింది. “చదువు” క్లుప్తంగా అంది.
“నేనా?! నీ ఉత్తరం?”
“రహస్యాలేం లేవు. చదవచ్చు”
సందిగ్ధంగానే అందుకుని చదివింది నీలిమ. “ఇప్పుడేం చెయ్యబోతున్నావు?” అడిగింది. “
“అదే అర్థంకావట్లేదు”
“పెళ్లయిన కొత్తలోనే కదా, డబ్బు అవసరం ఉంటుందని నువ్వు చెప్పావు. ఇదుగో, ఇలాంటివే ఆ అవసరాలు. ఇంకేం? పంపించు” కోపంగా
అంది నీలిమ.
“నీ విషయం వేరు. ఇది వేరు. మీ నాన్నగారున్నారు, ఇవ్వటానికి. మీకు డబ్బుకూడా ఉంది. కానీ ఇక్కడ సంపాదిస్తున్నది నేను. నానుంచీ అతను ఎలా ఆశించగలుగుతున్నాడో నాకర్థమవటంలేదు””
“నాకందుకే ఈ మగాళ్లంటే అసహ్యం. కట్నం ఇచ్చి ఒకసారి లొంగామనుకో, ఇంక మనమీద ఎక్కి స్వారీ చేస్తారు”
“ఇప్పుడేం చెయ్యను? అతని విషయం మర్చిపో, సునీత అతని చేతుల్లో ఉంది. దాని క్షేమం గురించి ఆలోచించాలి””
“తీసుకొచ్చెయ్ తనని. అలాంటివాడితో కాపురంకన్నా హాయిగా నీ దగ్గరుండి చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకుంటుంది”
సుమిత్ర నవ్వింది. “ఇంకో మాట చెప్పు. రెండున్నర లక్షల వెంచరది” అంది.
“ముందు తినడం మొదలుపెడదాం. ఆలోచించడానికి ఓపిక వస్తుంది” అంటూ బాక్స్ తెరిచింది నీలిమ. సుమిత్ర మరోమాటు నవ్వి తను కూడా మొదలుపెట్టింది.
“చాలా అందంగా ఉంటావు సుమిత్రా, నువ్వు. నిన్ను చూసినప్పుడల్లా నాకలా అనిపిస్తుంది. నీకోసం ఎవరో అదృష్టవంతుడు ఎదురుచూస్తూ ఉంటాడు. మాంత్రికుడి గుహలో బంధింపబడిన రాకుమారిలా కుటుంబబంధాలలో బంధింపబడి ఉన్నావు . వీటి నుంచీ నీకు విముక్తి ఎప్పుడో!” ఉన్నట్టుండి అంది నీలిమ. ఆ మాటలు సుమిత్రలో కొద్దిపాటి సంచలనాన్ని రేపాయి. ఏదో ఆలోచన మనసులో మెదిలింది. పెదాలమీద చిన్న చిరునవ్వు. ఆ వెంటనే కళ్లమీద నీలినీడలు. అవన్నీ నీలిమ గుర్తించనంత తక్కువ కాలంలో జరిగిపోయాయి. మళ్లీ మామూలుగా అయిపోయింది.
“సునీత విషయం ఏం చెయ్యాలో చెప్పమంటే నాగురించీ మాట్లాడతావేమిటి?”
“నేనిచ్చే సలహా పాటించగలిగినంత ధైర్యం నీకుందని నాకు నమ్మకం కలిగాక చెప్తాను” అంది నీలిమ.
“అదెప్పుడు కలుగుతుంది? అప్పటిదాకా సునీతకేం జరుగుతుందోనని నేను హడలిపోతూ ఉండనా? ముందు దానికి జవాబు చెప్పాలి. వీలైతే ఈవేళే ఫోన్ చేసి “
“సాయంత్రం చెప్తాను. మా కజిన్‍తో ఒకసారి మాట్లాడాలి”
“మీ కజనంటే? ఆ పోలీసతను… అప్పుడోసారి నీకోసం మన ఆఫీసుకి వచ్చాడు. అతనేనా?”
నీలిమ తలూపింది. సుమిత్రకి చూచాయగా అర్థమైంది నీలిమ చెప్పబోయేదేంటో. పూర్తిగా ఊహించడానికి మనసు అంగీకరించలేదు.
ఇద్దరూ సీట్లలో వెళ్లి కూర్చున్నారు. సుమిత్ర ప్రకాశరావు అడిగిన రిపోర్టు ప్రింటు తీసి పంపింది. దానికన్నా ముందే ఆయన దగ్గర్నుంచీ రమ్మని మరోసారి పిలుపు వచ్చింది. పనైపోతుండటంతో కొద్దిసేపు ఆగి, అది ముగించుకుని వెళ్ళింది.
“నాకు తెలిసిన బేంకు మేనేజరు ఉన్నాడమ్మా! అతన్తో మాట్లాడితే వెహికల్ లోన్ వెంటనే ఇప్పిస్తానన్నాడు. ష్యూరిటీ బాండ్స్‌మీద నేను సంతకం పెడతాను. ఇంక ఆందోళన పడకు. నీ సమస్య తీరినట్టేనా?” అడిగాడు.

1 thought on “ప్రియమైన జీవితం – 2 by S Sridevi”

  1. This is the right website for anybody who wants to find out about this topic. You understand a whole lot its almost tough to argue with you (not that I personally would want toÖHaHa). You definitely put a new spin on a topic which has been written about for years. Excellent stuff, just excellent!

Comments are closed.