ప్రియమైన జీవితం – 3 by S Sridevi

  1. ప్రియమైన జీవితం – 1 by S Sridevi
  2. ప్రియమైన జీవితం – 2 by S Sridevi
  3. ప్రియమైన జీవితం – 3 by S Sridevi
  4. ప్రియమైన జీవితం – 4 by S Sridevi
  5. ప్రియమైన జీవితం – 5 by S Sridevi
  6. ప్రియమైన జీవితం – 6 by S Sridevi
  7. ప్రియమైన జీవితం – 7 by S Sridevi
  8. ప్రియమైన జీవితం – 8 by S Sridevi
  9. ప్రియమైన జీవితం – 9 by S Sridevi
  10. ప్రియమైన జీవితం – 10 by S Sridevi
  11. ప్రియమైన జీవితం – 11 by S Sridevi
  12. ప్రియమైన జీవితం – 12 by S Sridevi
  13. ప్రియమైన జీవితం – 13 by S Sridevi
  14. ప్రియమైన జీవితం – 14 by S Sridevi
  15. ప్రియమైన జీవితం – 15 by S Sridevi
  16. ప్రియమైన జీవితం – 16 by S Sridevi
  17. ప్రియమైన జీవితం – 17 by S Sridevi
  18. ప్రియమైన జీవితం – 18 by S Sridevi
  19. ప్రియమైన జీవితం – 19 by S Sridevi

ఆమెకి ఏం మాట్లాడాలో తోచలేదు. ఆయన ఏదో సలహా ఇస్తాడనుకుందిగానీ ఇలా లోన్ ఏర్పాటు చేస్తాడనుకోలేదు. లోనంటే…? నెలకి రెండు వేలో మూడు వేలో… ముప్పయ్యారు నెలలపాటు… తన జీతంమీద అదనపు భారం. చెల్లెలి భర్తకి ఇంకేదో కావాలనిపిస్తుంది. ఈ లోన్ తీరేదాకా ఆగుతాడా? ఈలోగానే కావాలనిపిస్తుందేమో! ఎన్ని లేవు, మార్కెట్‍నిండా ప్రలోభపరచటానికి? కుప్పలు కుప్పలుగా సృష్టించి వదిలిపెడుతున్నారు. డిమాండ్‍కోసం అవసరాన్ని సృష్టిస్తున్నారు. వాళ్ల గారడీలో ఈ మురళిలాంటివాళ్లు తేలిగ్గా పడుతున్నారు. తలూపి ఇవతలికి వచ్చేసింది.
ఇప్పుడిక నీలిమ ఏం చెప్తుందో చూడాలి…
ఏదైతే ఊహించడానికే సుమిత్ర భయపడిందో అదే చెప్పింది నీలిమ. ఆఫీసయాక ఇంటికి వెళ్ళేముందు ఆమె దగ్గర వచ్చి కూర్చుంది.
“సూర్యతో మాట్లాడాను సుమిత్రా!” అంది నీలిమ. సూర్యంటే ఆమె కజిన్. పిన్ని కొడుకు. ఎస్సైగా చేస్తున్నాడు. సునీత ఊర్లోనే.
“అలా చేస్తే వాళ్లు దాన్ని బతకనిస్తారా?” సుమిత్ర చాలా భయపడిపోయింది. “వద్దు నీలిమా! ఇలాంటివి కథల్లోనూ, పుస్తకాల్లోనూ చదువుకోవటానికి బావుంటాయి. నీ నిజజీవితంలో అంతగా నప్పవు. పనిచెయ్యవు” అంది.
“అంత కంగారు పడిపోకు. నిదానంగా ఆలోచించు. ఆడపిల్లకి పెళ్ళైన ఏడేళ్లలోపు ఏదేనా జరిగితే అది పోలీసు కేసవుతుంది. ఆమె భర్తకీ అత్తమామలకీ శిక్ష పడుతుంది. ఒకసారి కేసైందంటే అందులోంచీ బైటపడటం కష్టం. మీడియా పుణ్యమాని ఆ విషయాలు అందరికీ తెలుసు. మగదక్షత లేని కుటుంబమని ఏదో నాటకం ఆడబోతున్నారు. గట్టిగా బెదిరిస్తే దార్లోకొస్తారు. సునీత ఒక్కర్తే కాదు, ఇంకో ఇద్దరు చెల్లెళ్లున్నారు నీకు. ఇతనికిలా భయపడుతూ అడిగినంతా ఇస్తూ కూర్చుంటే వాళ్లనేం చేస్తావు?” అంది నీలిమ.
“ఆ కోపంతో వాళ్లు సునీతనేమైనా చేస్తే?””
“ఏం చేస్తారు? ఏమీ చెయ్యరు. మీ మరిది గవర్నమెంటు ఉద్యోగి. ఎక్కడ ఎక్కువతక్కువలొచ్చినా ఉద్యోగం ఊడుతుందని వళ్ళు దగ్గరపెట్టుకునే ఉంటాడు. ఎటు తిరిగీ గృహహింస చట్టం ఉండనే ఉంది. సునీత ఉత్తరం జిరాక్సు కాపీ తీయించి ఇవ్వు. సూర్య వెళ్లి మాట్లాడతాడు”
నిజంగా మురళికి అలానే బుద్ధి చెప్పించాలని ఉంది సుమిత్రకి. కానీ ఒకటే భయం. దాని ప్రభావం సునీతమీదా, తన కుటుంబంమీదా ఎలా ఉంటుందని. ఆ భయమే ఆమెని వెనక్కి లాగుతోంది.
“వద్దులే నీలిమా! అంకుల్ వెహికల్ లోన్ ఇప్పిస్తానన్నారు. తీసుకుని వాళ్లకి ఇచ్చేస్తాను” అంది.
“ఆ తర్వాత ఇంకోటి అడగడనేమిటి నమ్మకం?” సూటిగా అడిగింది నీలిమ.
” ఇలాంటి కోరికలు ఇంకోసారి కోరవద్దని పెద్దవాళ్లు ఎవరిచేతేనా గట్టిగా చెప్పిస్తాను”
“అప్పుడు మీ సంబంధాలు దెబ్బతినవా? అప్పుడు మాత్రం అతను సునీతని ఏమీ అనకుండా వూరుకుంటాడా?”
“ఈ ప్రశ్నలకి నా దగ్గర జవాబుల్లేవు నీలిమా! నా భయమల్లా సునీత గురించే” “
“బైక్ కొనిచ్చి చెప్పించినా, ఇవ్వకుండా చెప్పించినా ఒక్కటే. అతని స్వభావం అలాంటిదైనప్పుడు మీచెల్లికి అతన్తో ఎప్పుడూ ప్రమాదమే. ఆలోచించుకుని చెప్పు”
ఆఫీసయి ఇంటికొచ్చాక కూడా సుమిత్రకి అదే ఆలోచన. రెండుదారులు తన ముందున్నాయి. ఏది ఎంచుకోవాలో తెలీడం లేదు. తల్లిని అడగనా అనుకుంది. ఆవిడేనా ఏం చెప్తుంది. ఏదో ఒకలా డబ్బు ఏర్పాటు చేసి ఇమ్మంటుంది. తన తండ్రి ఉన్నా అలాగే చేసేవాడు. నీలిమ చెప్పినట్టు ఎవరూ చెయ్యరు. కానీ ఈ సమస్యకి నిజమైన పరిష్కారం అదే. ఒక పోలీసు డిపార్టుమెంటు వ్యక్తిగా కాకుండా తన స్నేహితుడిగా అతన్ని తీసుకెళ్లి పరిచయంచేస్తే? స్నేహితుడంటే తప్పుపడతారేమో! బంధువనాలి. బంధువంటే ఎవరీ బంధువని ఆరాలు తీస్తే?
ఆలోచించి ఆలోచించి రాత్రంతా నిద్ర లేకుండా గడిపి మరుసటిరోజు ఉదయం ఆఫీసుకి రాగానే నీలిమతో చెప్పింది.
“ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాను. అంకుల్‍వాళ్లదీ మనకన్నా ముందుతరం. వాళ్ళు సామరస్యంగానూ ఇంకా కావాలంటే కొంత పోగొట్టుకునేనా రాజీమార్గంలోనూ ప్రయత్నిస్తారు. మనం ఒక తరం తర్వాత ఉండికూడా వాళ్లలాగే ఆలోచిస్తున్నామేమిటనిపిస్తోంది. ఏం చెయ్యను?”
నీలిమ ఆమె ఎదురుగానే సూర్యకి ఫోన్ చేసి చెప్పింది, సుమిత్ర స్నేహితుడినని చెప్పి మురళి ఇంటికి వెళ్లమని.
“వెళ్లి ఆ అమ్మాయి ఎలా ఉందో చూడరా! జస్ట్… సుమిత్ర వెనుక నువ్వున్నావని వాళ్లకి తెలిస్తే చాలు. ఇంకా అతను గొడవ చేస్తే అప్పుడు ఆలోచిద్దాం” అంది.


సూర్య సుమిత్రని ఒక్కసారే చూశాడు. చామనచాయలో నున్నగా మెరుస్తూండే ఆమె ముఖలావణ్యం, లేత నీలిరంగు కాటన్‍చీరలో పొడవైన జడతో పొందిగ్గా ఉన్న దేహాకృతి ఆమెని మర్చిపోనివ్వలేదు. దానికితోడు నెమ్మదితనం. ఈరోజుల్లో అలాంటి అమ్మాయిలు వుండరు. అంత మృదువుగా నెమలీకతో తాకినంత సుతారంగా కదిలే అమ్మాయిలు చాలా అరుదు. అంతా ఫాస్ట్… యాక్టివ్.
సుమిత్ర అతనికి వేరేలా కూడా తెలుసు. ఆమె ఫోటో అతని దగ్గరుంది. మూర్ఖుడైన ఒక స్నేహితుడి దగ్గర్నుంచీ అతనికి తెలీకుండా తెచ్చుకుని చాలా జాగ్రత్తగా వేలెట్ లోపలెక్కడో దాచుకున్నాడు. అందరికీ భిన్నంగా ఉందనా, సుమిత్ర తనకి నచ్చింది? లేక సహజంగానే ఆమెపట్ల ప్రేమ పుట్టిందా? ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు.
ఇంకో సందిగ్ధం కూడా ఉంది. అది….
అతనీ రెండు సందిగ్ధాలలో ఉన్నప్పుడే నీలిమ ఫోనొచ్చింది.


నీలిమ చెప్పినదానికి వప్పుకుని సీట్లో కూర్చుందిగానీ మనసు మనసులో లేదు సుమిత్రకి. తను తప్పుచేస్తోందా? అనే భయం నిలవనివ్వడం లేదు. భయం భయమే. అది లేకుండా ఉండాలంటే చెల్లించాల్సిన మూల్యం ఇంకా పెద్ద భయాన్ని సృష్టిస్తోంది. ఈ రెండు భయాల మధ్యా నలిగాక తెగింపు వచ్చింది.
సూర్య వెళ్లే సమయానికి తనూ అక్కడుంటే? తను అక్కడికొచ్చినట్టు, అతను తనని చూడటానికి వచ్చినట్టూ సునీతని చూసినట్టూ ఉంటుంది. ఏమైనా తేడా వస్తే పరిస్థితి చెయ్యి జారకుండా కూడా చూసుకోవచ్చు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా లీవులెటరు రాసి ప్రకాశరావు దగ్గరకి వెళ్లింది.
“ఏం ఆలోచించుకున్నావమ్మా? అమ్మనోమాటు అడిగి అప్లికేషన్ పెట్టు” అన్నాడాయన ఆమెని చూడగానే లోన్ గురించి.
“నాకు లీవు కావాలండీ! అక్కడికి వెళ్లి వచ్చాక మీకే విషయం చెప్తాను. కనీసం అరవైవేలైనా లేనిదే వెహికల్ రాదు. అంత లోను ఇవ్వరు. మిగతాది వెయ్యటం నా శక్తికి మించినది. అదీకాక వెహికిల్ నా పేర్న వుంటుంది. బేంకుకి తణఖా అయి వుంటుంది. అది అతను వాడటం తప్పౌతుంది. వెళ్లి వాళ్లతో మాట్లాడి పరిస్థితి చూసి అప్పుడు ఆలోచిస్తాను” అంది సుమిత్ర.
ఆయన ఆ అమ్మాయికేసి చూశాడు. ప్రతీదానికీ భయపడుతూ తన సలహాకోసం ఎదురుచూసే సుమిత్ర కాదని కొద్దిగా అర్థమైంది. స్వంతంగా పనులు చేసుకోగలిగే వయసు వచ్చిందని గ్రహించాడు. స్నేహితుడి కూతురిపట్ల తన బాధ్యత తీరిందనికూడా అనిపించింది.
“మంచిదమ్మా, వెళ్లిరా! వాళ్లొకమాటన్నా నువ్వు తొందరపడకు” అని హెచ్చరించి లీవు శాంక్షన్ చేసి పంపాడు. ఇంటికి వచ్చింది సుమిత్ర. చాలా అశాంతిగా అనిపిస్తోంది.
“ఏమిటే?” అడిగింది రాధమ్మ. సునీత ఉత్తరాన్ని గురించి తల్లికి చెప్పాలో వద్దో అర్థమవ్వలేదు. చెప్తే ఆవిడా ప్రకాశరావుగారిలాగే ఆలోచిస్తుంది. పిల్లనిచ్చుకున్నవాళ్లం కాబట్టి తగ్గి ఉండాలని చెప్తుంది. అప్పోసప్పో చేసి ఇవ్వమని చెప్తుంది. అంతే తప్ప తను వెళ్లబోతున్న మార్గాన్ని సమర్ధించదు. చెప్పవద్దనే నిర్ణయించుకుంది.
“సునీతని ఒకసారి చూసి వద్దామనుకుంటున్నానమ్మా! వాళ్లాయనకి టైఫాయిడ్ వచ్చి తగ్గాక ఎవరం పరామర్శకి రాలేదని వాళ్లకి కోపం వచ్చిందట. వెళ్లి వస్తాను”” అంది అంతవరకే విషయాన్ని చెప్పి.
“నువ్వెందుకు? నేను వెళ్తాను” అందావిడ సుమిత్ర వెళ్లడంపట్ల అయిష్టాన్ని చూపిస్తూ. ఇంట్లో పరిస్థితులనిబట్టి పెద్దదైన సుమిత్రకి ఆపి, తర్వాతిది సునీతకి చేసింది. అదెలాగా చిన్నతనమే నలుగుర్లో. ముఖ్యంగా సునీత అత్తవారింట్లో. అలాంటిచోటికి సుమిత్ర ఎందుకు వెళ్లటమనుకుంది.
“నువ్వొక్కదానివీ వెళ్లలేవు. నీకు మరొకరు తోడు కావాలి. మళ్లీ మీ ఇద్దర్నీ ఎవరో ఒకరు స్టేషనుకొచ్చి ఇంటికి తీసుకెళ్ళాలి. ఈసారికి కాదు, మళ్లీసారి వెళ్తువుగానీ” బయల్దేరింది. తనొస్తున్నట్టు సునీతకి ఫోన్ చేసి చెప్పింది.
“నువ్వు బాగానే ఉన్నావు కదా? గొడవలేం లేవుకదా?” అని ఆతృతగా అడిగింది.
“అదేం లేదు లేవే. నేను రాసిన విషయం ఏం చేశావు? అమ్మకి చెప్పావా?” ఆతృతగా అడిగింది సునీత.
“వచ్చాక మాట్లాడుకుందాం” అని పెట్టేసింది సుమిత్ర.
సునీతకివ్వటానికి అప్పటికప్పుడు రవ్వలడ్దూ చేసింది రాధ. సుమిత్ర బయల్దేరింది. ఆరుగంటల ప్రయణం. ఐదింటికి రైలెక్కితే పదకొండైంది చేరేసరికి. స్టేషనుకి మురళి వచ్చాడు. ఆఫీసులో పర్మిషన్ తీసుకున్నాడు. బయల్దేరే ముందు అతనికి చెప్పింది సునీత.
“మీరు కొంచెం బెట్టుసరిగా ఉండండి. తర్వాత అంతా నేను చెప్తాను” అంది.
అతనికేం అర్థమవ్వలేదు. భోళామనిషి. నలుగుర్లో సరదాగా కలిసిపోయే మనస్తత్వం కలవాడు. మధ్యతరగతి కుటుంబం. ఎవరేనా ప్రేమగా పలకరిస్తే ప్రాణం పెట్టేస్తాడు. అందుకే గేటు దాటగానే భార్య చెప్పిన విషయాలు గాల్లోకి వదిలేసాడు.
అతను చేరేసరికి రైలింకా రాలేదు. రావటానికి పదినిముషాల టైముంది. ప్లాట్‍ఫాం టికెట్ తీసుకుని పేపరు కొనుక్కుని చదువుకుంటూ అక్కడే బెంచీమీద కూర్చున్నాడు. అతనొచ్చీ రాగానే రైలు రాబోతోందన్న అనౌన్సుమెంటు వచ్చింది. ఆ తర్వాత రైలొచ్చి ఆగింది.
ఆకుపచ్చమీద తెలుపూ నలుపూ ప్రింటున్న కాటన్ చీర, బ్లౌజు… కొద్దిగా రేగిన జుత్తు… అలసటనీ ఆందోళననీ వ్యక్తపరుస్తున్న చూపులూ… రైల్లోంచీ దిగుతున్న… తనకన్నా రెండేళ్లు చిన్నదైన సుమిత్రని చూస్తుంటే చాలా ఆత్మీయంగా అనిపించింది. తన ఇంట్లోని వ్యక్తిని… తన స్వంత తోబుట్టువుని చూస్తున్న భావన కలిగింది. చెయ్యి చాపి ఆమె చేతిలోని జర్నీబేగు అందుకున్నాడు.
క్షణంసేపు తటపటాయించి “బావున్నారా? అని తనే ముందు పలకరించాడు.
“మా సుమిత్రకేనుండీ? చక్కగా నాన్న జాబ్ కొట్టేసింది. ఎన్నో క్వాలిఫికేషన్సుండి తలక్రిందులుగా తపస్సు చేసినా రాని ఉద్యోగం దానికిచ్చారు. నెలకి పదిహేనువేల జీతం, అమ్మకి పెన్షనొస్తుంది. అదీ తనే తీసేసుకుంటుంది. ఇక డెత్ బెనిఫిట్స్‌కి లెక్కే చెప్పదు. నాలుగు లక్షలొచ్చిందట. నా పెళ్లికి అప్పుచేశానంటోంది. ఏమిచ్చింది నాకు? తిప్పితిప్పి కొడితే రెండున్నర ఖర్చవ్వలేదు. సూత్రాల గొలుసు తప్ప నాకు ఇంకేమీ పెట్టలేదు” సునీత మాటలు చెవుల్లో మార్మోగాయి అతనికి. ఆమె అమాయకత్వానికి నవ్వొచ్చింది. పదిహేనువేల జీతనున్నమాటేగానీ కట్స్ పోను ఎంత చేతికొస్తుంది? అందులో ఇంటి ఖర్చులు పోను మిగిలేదెంత? తమ పెళ్లి ఉన్నవాటితో చేసినట్టున్నారు. ఇంకా ఇద్దరాడపిల్లలున్నారు. వాళ్ల చదువులు.. పెళ్లిళ్లు.. ఎంత సర్కస్ చేస్తే ఈ బాధ్యతలు తీరుతాయి? తీరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు.
అతను స్టేషనుకి వస్తాడనిగానీ అంతలా పలకరిస్తాడనిగానీ సుమిత్ర ఊహించలేదు.
“నాకిల్లు తెలుసు కద? మీరెందుకు శ్రమ తీసుకున్నారు? ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? మందులింకా వాడుతున్నారా? నేనో అమ్మో వద్దామనుకున్నాంగానీ ఎక్కడా వీలవ్వలేదు. ఆమె ఒక్కరూ రాలేదు. నాకు శలవు దొరకలేదు” అంది.
అతను గలగల నవ్వాడు. “మామూలు జ్వరానికంత కంగారేం ఉంది? సునీత అన్నిటికీ తను భయపడి అందర్నీ భయపెడుతుంది” అన్నాడు నవ్వుతునే.
“మీ ఉద్యోగం ఎలా ఉంది? ప్రమోషన్సేవైనా ఉంటాయా? ఐనా ఈరోజుల్లో గవర్నమెంటు జాబ్స్ వేస్టులెండి. చాలీచాలని జీతాలిచ్చి, గవర్నమెంటు ఖజానా అంతా మనకే రాసిచ్చేసినట్టు ప్రకటనలిచ్చుకుంటారు””అనీ తనే అన్నాడు.
సుమిత్రకి అతని మాటలూ ప్రవర్తనా వింతగా అనిపిస్తున్నాయి. ఉత్తరంలో ఉన్నదానికీ ఇతని ధోరణికీ ఎక్కడా పొంతన కనిపించడం లేదు. రెండునాలుకల మనుషులుంటారని వినడమేగానీ చూడటం ఇదే మొదటిసారి. లేకపోతే తను డబ్బో చెక్కో తీసుకుని వస్తోందని ఊహించి ఇలా ఉల్లాసంగా ఉన్నాడేమో! జరగబోయేది తెలిస్తే ఎలా ఉంటాడో? ఆమెలో భయం మళ్లీ మొదలైంది. వెనక్కి వెళ్లిపోవాలన్న తీవ్రమైన కోరిక కలిగింది.

1 thought on “ప్రియమైన జీవితం – 3 by S Sridevi”

  1. May I just say what a comfort to uncover somebody who truly knows what theyre talking about on the internet. You actually know how to bring a problem to light and make it important. More and more people should look at this and understand this side of the story. Its surprising you arent more popular because you certainly have the gift.

Comments are closed.