ప్రియమైన జీవితం – 4 by S Sridevi

  1. ప్రియమైన జీవితం – 1 by S Sridevi
  2. ప్రియమైన జీవితం – 2 by S Sridevi
  3. ప్రియమైన జీవితం – 3 by S Sridevi
  4. ప్రియమైన జీవితం – 4 by S Sridevi
  5. ప్రియమైన జీవితం – 5 by S Sridevi
  6. ప్రియమైన జీవితం – 6 by S Sridevi
  7. ప్రియమైన జీవితం – 7 by S Sridevi
  8. ప్రియమైన జీవితం – 8 by S Sridevi
  9. ప్రియమైన జీవితం – 9 by S Sridevi
  10. ప్రియమైన జీవితం – 10 by S Sridevi
  11. ప్రియమైన జీవితం – 11 by S Sridevi
  12. ప్రియమైన జీవితం – 12 by S Sridevi
  13. ప్రియమైన జీవితం – 13 by S Sridevi
  14. ప్రియమైన జీవితం – 14 by S Sridevi
  15. ప్రియమైన జీవితం – 15 by S Sridevi
  16. ప్రియమైన జీవితం – 16 by S Sridevi
  17. ప్రియమైన జీవితం – 17 by S Sridevi
  18. ప్రియమైన జీవితం – 18 by S Sridevi
  19. ప్రియమైన జీవితం – 19 by S Sridevi

చాలామంది చేసేది అదే. సమస్యని పరిష్కరించలేక… లేదా పరిష్కరించాక ఎదురయ్యే పరిణామాలు తట్టుకోలేక దాన్నుంచీ పారిపోతుంటారు. సుమిత్రకి పారిపోవటానికి ఎలాంటి దారీ లేదు. కాసేపటికి ఇల్లు చేరారు. ఆటో ఫేర్ తనే ఇచ్చాడు మురళి, ఇస్తాననే అవకాశం కూడా సుమిత్రకి యివ్వలేదు.
ఆటో ఆగిన శబ్దానికి ఇంట్లోంచీ ఇవతలికి వచ్చింది సునీత. మాట్లాకుంటూ ఇంట్లోకి వస్తున్న వాళ్లిద్దర్నీ చూస్తుంటే ఆమె భృకుటి ముడిపడింది. తను చెప్పిందేమిటి? అతను చేస్తున్నదేమిటి? భర్తమీద కోపం ముంచుకొచ్చింది. అతికష్టంమీద దాన్ని దాచుకుని పెదాలికి చిరునవ్వు అతికించుకుని వాళ్లకి ఎదురెళ్లింది.
“బావున్నావా సుమిత్రా?” అడిగింది.
“నా సంగతికేంగానీ నువ్వెలా ఉన్నావు? ఆమధ్యని ఏదో అనారోగ్యమని అమ్మకి చెప్పావట? ఇద్దరికీ ఈ అనారోగ్యాలేమిటి? వంటా అదీ చాతకావటం లేదా? లేకపోతే కొద్ది రోజులు మనింటికి వచ్చి ఉండి వెళ్లండి” అంది సుమిత్ర. సునీత చిరునవ్వులు నవ్వింది. సిగ్గుపడింది.
“అమ్మ నీకేం చెప్పలేదా?” అడిగింది. ఆమెకి మూడోనెల. రాధ సుమిత్రతో ఇంకా ఆ విషయం ఇంకా చెప్పలేదు.
“ఏం చెప్పాలి?” సుమిత్ర అయోమయంగా అడిగింది.
“నీకే తెలుస్తుందిలే. పద లోపలికి” అంటూ తీసుకెళ్లింది.
ఇల్లు చిన్నదైనా పొందిగ్గా వుంది. మురళి తండ్రి కట్టించినది. ఆయనకి వేరే వూరు ట్రాన్సఫరైంది. అందుకని వీళ్లిద్దరే వుంటున్నారు. అందరూ వుంటే ఇరుగ్గా వుండేదేమో, ఇప్పుడు సరిపోతోంది. ఇంట్లో అన్నీ వున్నాయి. మిక్సీ, సోఫాసెట్టూ, గదికో ఫేనూ… కొన్ని మురళి కొన్నవి, కొన్ని అతని తల్లిదండ్రులు వదలిపెట్టి వెళ్లినవి, కొన్ని తాము కొనిచ్చినవి. వార్డ్‌రోబ్ నిండా రకరకాల చీరలు అద్దాల తలుపులు వెనుకనుంచీ తొంగిచూస్తున్నాయి. బైటికెళ్లే తనకే లేవు అన్ని చీరలు. ఐనా సుమిత్రకి చెల్లెలి కాపురం చూస్తే తృప్తే అనిపించింది తప్ప అసూయ కలగలేదు. రాధమ్మ పంపిన తినుబండారాలు తీసిచ్చింది.
“సుఖం లేదనుకో, నువ్వంటే పదయ్యేసరికి ఇంట్లోంచీ బైటపడతావు. హాయిగా ఏసీ ముందు కూర్చుంటావు. కానీ ఇంట్లో ఉండేవాళ్లకలా కాదుగా? పనిమనిషి సరిగ్గా రాదు. సరైన చాకలి దొరకడం లేదు. బట్టలుతుక్కోలేక చేతులు పడిపోతున్నాయి. వాషింగ్ మిషనూ, ఫ్రిజ్జీ లేకపోతే ఈరోజుల్లో చాలా కష్టం” అంది సునీత అక్కకి కాఫీ ఇస్తూ.
చక్కగా పెళ్లి చేసి పంపిస్తే భర్తకి వండి పెట్టి ఇల్లు సర్దుకోవటం కూడా దీనికి కష్టమే? అనిపించింది సుమిత్రకి.
“సునీతా! నాకు టైమైంది. అన్నం పెడతావా?” అవతల్నుంచీ మురళి పిలుపు. సునీత లేచి వెళ్లింది.
“రెండురోజులు ఉండమను తనని. ఊరు చూసి వెళ్తుంది” అతను అనటం వినిపించింది. అతను ఆఫీసుకెళ్లేదాకా పేపరు చూస్తూ ముందు గదిలోనే కూర్చుంది. అతను వెళ్లాక స్నానం చేసింది.
అక్కచెల్లెళ్లిద్దరూ భోజనానికి కూర్చున్నారు. వచ్చీ రానట్టుంది వంట. పెళ్లికాక ముందునుంచీ సునీత అంతే. ఏ పనీ చేసేది కాదు. చీరలకి ఫాల్సు కుట్టుకుంటూనో, వాటి మీద ఎంబ్రాయిడరీ, పెయింటింగూ చేస్తూనో ఇంటిపని తనకి పట్టనట్టు కూర్చునేది.
” ఏం వంటే ఇది? పాపం అతన్నిలాగే చంపుతున్నావా రోజూ?” మొదటి ముద్దని గ్లాసుడు నీళ్లతో తోసి, కూరలో ఉప్పు కలుపుకుంటూ అడిగింది.
“ఏమో అక్కా! నాకు విసుగు, ఎలక్ట్రిక్ కుక్కరూ, మైక్రోఓవెనూ కొనుక్కుంటే బావుంటుంది. వెరైటీస్ చేసుకోవచ్చు. తొందరగా ఐపోతాయి”” అంది సునీత.
వింతగా చూసింది ఆమెకేసి సుమిత్ర.
“పని మీద నీకు శ్రద్ధ లేకపోతే ఏవి ఎన్నున్నా వేస్టే. ఇంకా మనింట్లో ఉన్నట్టుంటే ఎలాగే? కొద్దిగా మారాలి. మనసు పెట్టి చేస్తే అంతా కలిపి ఎంత పని?” అంది సుమిత్ర నచ్చచెప్తున్నట్టు, సునీత ముఖం చిట్లించింది. ఆ తర్వాత వాళ్ల సంభాషణ సాగలేదు.
ఇద్దరూ మౌనంగా తింటున్నారు. ఎవరి ఆలోచనలు వాళ్లవి. అక్క డబ్బు తీసుకొచ్చిందా? తెచ్చే ఉంటుంది. లేకపోతే తనెందుకొస్తుంది? అమ్మతో రాయబారం పంపేది. ఏ విషయం ఇంకా చెప్పదేం? అనుకుంటూ ముద్దలు లెక్కపెడుతున్నట్టు తింటోంది సునీత.
సుమిత్రకి అంతా అయోమయంగా ఉంది. ఉత్తరం అందగానే చెల్లెలి గురించి ఎంత ఆతృత పడిందని? అలాంటిదేమీ ఇక్కడ కనిపించడం లేదు. సూర్యుని రమ్మనాలా, వద్దనాలా? ఎటూ తోచడం లేదు.
భోజనాలయ్యాయి.
“తేజా నీకింకా ఉత్తరాలు రాస్తున్నాడా?” ఉన్నట్టుండి అడిగింది సునీత.
ఆ ప్రశ్న సుమిత్ర గుండెల్లో బాకులా దిగింది. ముఖం కళ తప్పింది. దాదాపుగా తండ్రి పోయిన ఈ ఇన్నేళ్లలో అతని ప్రస్తావన ఎవరూ తీసుకురాలేదు. మర్చిపోయినట్టే ఊరుకున్నారు. అందరూసరే, అతనూనా?!!
పూర్తి కావస్తున్న మజ్జిగన్నంలో చెయ్యి కడిగేసుకుని లేచింది
“తలనొప్పిగా ఉంది సునీతా! కొద్దిసేపు పడుకుంటాను. అలవాటులేని ప్రయాణం కదా?” అంది వెంటనే లేచి నిలబడుతూ.
సునీత పక్కకి ఏర్పాటు చేసింది. చేస్తూ అంది, “వాళ్లకింకా మనం గుర్తుంటామని నేననుకోను. అతనికి మెడిసిన్లో సీటు రావటంతోనే వాళ్ల ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. ఈపాటికి చదువైపోయి ఉంటుంది. ఇంకో డాక్టర్ని చేసుకుంటాడేమో! నువ్వుకూడా మర్చిపోవటం మంచిది”
“ఆ విషయాలు ఇప్పుడు దేనికి? నేనతన్ని ఎప్పుడో మర్చిపోయాను” క్లుప్తంగా అంది సుమిత్ర, ఇంక ఆ ప్రస్తావన ఇష్టం లేనట్టు తుంచేస్తూ. ఆమెని పడుకోమని తనూ పక్క ఎక్కేసింది సునీత. మరో గంటన్నరకి తన నిద్ర అయ్యి సుమిత్రని లేపటానికి వచ్చింది. అప్పటికి ఆమె ఇంకా తనవైన ఏవో జ్ఞాపకాలలో కొట్టుకుపోతోంది.
“తలనొప్పి తగ్గిందా, లేకపోతే ఇంకాసేపు పడుకుంటావా?” అడిగింది సునీత.
సుమిత్ర లేచి కూర్చుంది. “”పగటినిద్ర అలవాటు లేక ఇంకా ఎక్కువయ్యేలా అనిపిస్తే టేబ్లెటు వేసుకున్నాను. తగ్గింది””అంది.
ఇద్దరూ చాలా సేపు ఏవేవో మాట్లాడుకున్నారు. మరోమాటు కాఫీ చేసుకొచ్చింది సునీత. తల్లి పంపినవి రెండు ప్లేట్లలో సర్ది తీసుకొచ్చింది. నవ్వుతూ తిరుగుతున్న చెల్లెల్ని ఎలా అడుగుతుంది- నీకిక్కడ బాగుందా? మురళి నిన్ను బాగా చూసుకుంటున్నాడా? తిడుతున్నాడా? కొడుతున్నాడా? నువ్వు రాసిన ఉత్తరానికి అర్థం ఏమిటి? ఇక్కడ బాగుందా? నాతో వచ్చేస్తావా? – అని. ”
భార్యాభర్తలమధ్య తేడాలేం లేవు. ఇద్దరూ కలిసే నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. చాలా బాధనిపించింది సుమిత్రకి. పైకి కనిపించకుండా అణచుకుంది. టిఫిన్ తింటుంటే మురళి వచ్చాడు. సుమిత్ర లేచి లోపలికి వెళ్లబోయింది.
“కూర్చోండి. అలా మొహమాటపడతారేంటి?” అన్నాడతను వారిస్తూ. లోపలికెళ్లి ముఖం కాళ్లూ చేతులూ కడుక్కుని వచ్చాడు. సునీత అతనికీ టిఫెనూ కాఫీ ఇచ్చింది.
“మా పెళ్లికి ముందు మీరిక్కడికి రాలేదేమో!” సుమిత్రకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. ఆమె లేదన్నట్టు తలూపింది.
“ఏ పనిమీద వచ్చారు? ఆఫీసు పనిమీదా? ఎక్కడికి వెళ్లాలన్నా నిస్సంకోచంగా చెప్పండి. తీసుకెళ్తాను. మీకీ దారులవీ కొత్త. ఒక్కరూ వెళ్లలేరు” అన్నాడు. ఆ రోజు ప్రోగ్రాంకూడా అతను నిర్ణయించుకునే వచ్చాడు. ఇంకా చెప్పబోతున్నాడు. ఇంటి ముందు పల్సర్ ఆగింది. సూర్య.
“మురళీధర్రావుగారిల్లు ఇదేనా?” అని అడుగుతూ లోపలికి వచ్చేశాడతను.
“నేనే సార్! రండి” అని లేచి ఆహ్వానించాడు మురళి. సగం తిన్న అతని ప్లేటుమీదకి న్యూస్‍పేపరు లాగింది సునీత. సుమిత్రకి అతను పరిచయమే. కానీ మాట్లాడలేకపోతోంది. కనీసం కుర్చీలోంచీ కూడా లేవలేకపోయింది. ఆమె మనస్థితిని అంచనా వెయ్యగలిగాడు సూర్య.
“హలో! మీరిక్కడికి వస్తున్నారని నీలిమ ఫోన్ చేసి చెప్పింది. కలిసి వెళ్లామని వచ్చాను” నవ్వుతూ అన్నాడతను ముందుగా అనుకున్నట్టుగానే. “ఓహ్! సుమిత్ర గురించి వచ్చారా?” అభిమానంగా అడిగాడు మురళి. “కూర్చోండి” మర్యాద చేశాడు.
“నా పేరు సూర్య. ఈ ఏరియా ఎస్సైని” తనని తను పరిచయం చేసుకున్నాడతను. తనే చొరవ తీసుకుని కొద్దిసేపు ఆ విషయాలూ ఈ విషయాలూ మాట్లాడాడు. అతనికి టీ చేసుకొచ్చింది సునీత.
“మీరేనా, సునీత?”” టీ కప్పు తీసుకుంటూ ఉన్నట్టుండి అడిగాడు. “ఈ ఉత్తరం మీరు రాసిందేనా?” జేబులోంచీ ఉత్తరం కాపీ తీసి చూపిస్తూ అడిగాడు. దాన్ని చూడగానే ఆమె పైప్రాణం పైనే పోయింది. జరిగిందేమిటో కొద్దికొద్దిగా అర్థమైంది. ఈ సుమిత్ర… ఎంత పని చేసింది. ఆగ్రహంతో భగ్గుమంది.
“మీ ఇంట్లో ఎవరెవరుంటారు?”
“నేను, మా వారు” ఆమె గొంతు తడారిపోతోంది.
“ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటారా?”
“ఊ<“
“కొట్టడం, తిట్టడం అలాంటివి చేస్తారా?”
వింటున్న మురళి ముఖం ఎర్రబడింది. అతనిది కేజువల్ విజిట్ కాదని అర్థమైంది.
“ఏమిటా ఉత్తరం?” కలుగజేసుకోబోయాడు. సూర్య అతన్ని చేత్తోనే వారించాడు.
“మరి ఈ ఆఖరి వాక్యానికి అర్థమేమిటి?’ అతని ప్రశ్నకి సునీత తడబడిపోయింది.
“అదీ… అదీ… నేనే సరదాకి రాశాను. అక్కని ఫూల్‍ని చెయ్యాలని…” సునీత గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.
“కాదు. భయపడిపోయి మీరు కోరినది ఇచ్చేస్తారని… ఇదే మొదటిసారా, ఇలా బెదిరించడం?” కటువుగా అడిగాడు.
ఆమె జవాబుకోసం చూడకుండా మురళి వైపు తిరిగి ఉత్తరం అతని చేతికిచ్చాడు. ఇస్తూ అన్నాడు “చూడండి మురళీ! కట్నం తీసుకోవటం తప్పు. ఆ తప్పు మీరు చేసే ఉంటారు. గొడవలు రానంతకాలం ఎన్ని తప్పులేనా సాఫీగా సాగిపోతాయి. కానీ మనం చదవుకున్నవాళ్లం. పదేపదే తప్పులు చేస్తూ మరొకరిచేత చెప్పించుకోవడం బాగుండదు. మీ అత్తవారి కుటుంబంగురించి తెలిసికూడా మీరిలాంటి విలువైన కానుకలు అడగటం బావుండదు. ఇవ్వాల్సిన అవసరం వాళ్లకీ లేదు. ఎంత నిస్సహాయ పరిస్థితిలో సుమిత్ర ఆ ఉత్తరాన్ని నాకిచ్చిందో ఆలోచించండి. ఒకవైపు తన తాహతుకి మించిన కోరిక. ఇంకో వైపు సునీత క్షేమం. కంప్లెయింటు ఇవ్వలేదు. సంతోషించండి. అప్పుడైతే అఫీషియల్‍గా డీల్ చెయ్యవలసి వచ్చేది. ఆమె కూడా మీలాంటి ఉద్యోగస్తురాలు. మీ సరదాలు మీకుండవచ్చు. మీరూ జాబ్ చేస్తున్నారు. కావల్సినవి మీరే కొనుక్కోండి. ఇంకోసారి ఇలాంటివి మా దృష్టికి రావద్దు. అంతేకాదు, సునీత విష యంలో ఏ చిన్న పొరపాటు చేసినా మా అనుమానం మొదట మీమీదే ఉంటుందని మర్చిపోవద్దు” అన్నాడు.
మురళి ఉత్తరాన్ని చదివాడు. అతన్లో దిగ్భ్రాంతి.
ఆ వుత్తరం గురించీ, అందులోని విషయాల గురించీ మురళికి ఏమీ తెలీదు. కొన్నితరాలుగా కొన్నికోట్లమంది స్త్రీల మనసులకైన గాయాలు రగిలిరగిలి ఒక తిరుగుబాటుగానో వుద్యమంగానో ఆక్రోశించాక ఇంకా కొన్ని పదుల సంవత్సరాలు అవి చట్టసభల్లో చర్చల్లో నలిగినలిగి ఆఖరికి ఒక రూపం దాల్చుకుని పరిష్కారం దిశగా ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన చిన్న పరిహాసమది. గృహహింసా చట్టానికి!
సునీతని పుట్టింటి నుంచి బైకు తీసుకురమ్మని అతను అడగలేదు. అలాంటి ఆలోచనకూడా అతనికెప్పుడూ లేదు.
“ఇంతకాలం అవసరం లేక తీసుకోలేదు. ఇద్దరం కలిసి ఎటేనా వెళ్లాలంటే బైక్ ఉంటే బావుంటుంది. లోన్‍కి అప్లై చేశాను”” అని సునీతతో చాలా మామూలుగా అన్న మాట ఇలాంటి రూపం దిద్దుకుంటుందని అతను పొరపాట్న కూడా ఊహించలేదేమో చాలా షాకయ్యాడు.
“ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేద్దాం. బై ద బై, మీరిచ్చిన టీ చాలా బావుంది సునీతా! … సుమిత్రా! వెళ్తాను. బహుశః నీలిమ మీతో మాట్లాడుతుందేమో! జరిగింది చెప్పండి” సూర్య వెళ్లిపోయాడు.
వెళ్తూవెళ్తూ సుమిత్రని మరోసారి చూడకుండా ఉండలేకపోయాడు. ఆమె బొమ్మలా కుర్చీకి అతుక్కుపోయి ఉంది. చాలా భయపడిపోయినట్టుంది. నిజమే! ఈ పద్ధతిలో సమస్యల్ని ఎవరూ పరిష్కరించుకోరు. సంబంధాలు బాగా దెబ్బతింటాయి. మరో మార్గం లేనప్పుడే ఇలా చెయ్యాలి. సుమిత్రకి మరో మార్గం లేదనే అంది నీలిమ. డబ్బు మనిషికి మొదటి శత్రువు. డబ్బు లేకపోవటం ఒక సమస్య. డబ్బుని మించిన అవసరాలు, కోరికలు ఉండటం మరో సమస్య. తను వెళ్లిపోయాక మరోసారి వీళ్లు గొడవపడతారు. ఎలా సర్దుబాటు చేస్తుందో సుమిత్ర ఆ పరిస్థితిని? తను ఇంకా ఇక్కడే ఉండటమూ సరికాదు.
మరోసారి కలవాలి సుమిత్రని… ఇలా కాదు… ఆహ్లాదంగా.