ప్రియమైన జీవితం – 5 by S Sridevi

  1. ప్రియమైన జీవితం – 1 by S Sridevi
  2. ప్రియమైన జీవితం – 2 by S Sridevi
  3. ప్రియమైన జీవితం – 3 by S Sridevi
  4. ప్రియమైన జీవితం – 4 by S Sridevi
  5. ప్రియమైన జీవితం – 5 by S Sridevi
  6. ప్రియమైన జీవితం – 6 by S Sridevi
  7. ప్రియమైన జీవితం – 7 by S Sridevi
  8. ప్రియమైన జీవితం – 8 by S Sridevi
  9. ప్రియమైన జీవితం – 9 by S Sridevi
  10. ప్రియమైన జీవితం – 10 by S Sridevi
  11. ప్రియమైన జీవితం – 11 by S Sridevi
  12. ప్రియమైన జీవితం – 12 by S Sridevi
  13. ప్రియమైన జీవితం – 13 by S Sridevi
  14. ప్రియమైన జీవితం – 14 by S Sridevi
  15. ప్రియమైన జీవితం – 15 by S Sridevi
  16. ప్రియమైన జీవితం – 16 by S Sridevi
  17. ప్రియమైన జీవితం – 17 by S Sridevi
  18. ప్రియమైన జీవితం – 18 by S Sridevi
  19. ప్రియమైన జీవితం – 19 by S Sridevi

సూర్య వెళ్లగానే మురళి, సునీతమీద మండిపడ్డాడు. రెండు భుజాలూ గుచ్చిపట్టుకుని కోపంగా అడిగాడు.
“ఎందుకు రాశావు అలాంటి ఉత్తరం?” ఆ తర్వాత ఆమె రెండు చెంపలూ పేలిపోయాయి. అతని కోపం చూసి అక్కాచెల్లెళ్లిద్దరూ వణికిపోయారు.
“నేను రాయమన్నానా?”
“…”
“నీ పుట్టింటినుంచీ బైకు తెమ్మని నీతో ఎప్పుడేనా అన్నానా?”
“…”
“నువ్వెంత? నీ బతుకెంత? గుమస్తాగాడి భార్యవి, ఇలా అనుకోగానే అలా బైకు వచ్చేస్తుందని కలగన్నావా? బైకున్నా నాకొచ్చే బోడిజీతంతో పెట్రోలు పోసి దాన్ని మెయింటెయిన్ చెయ్యగలననే అనుకున్నావా? “బైకులమీదా కార్లలోనూ తిరగాలనుకుని కలలు కనేదానివి ఏ ఇంజనీరునో చేసుకోవలసింది. నన్నెందుకు చేసుకున్నావు? ఎందుకు నన్నింత ఫూల్ని చేశావు? చెప్పు… మాట్లాడవేం?” గద్దించాడు.
సునీత కళ్లలోంచీ టపటప కన్నీళ్లు రాలిపడ్డాయి. వాటిని చూడగానే అతను సగం చల్లారిపోయాడు. విసురుగా ఆమెని నెట్టేసి వెళ్లిపోయాడు. అతనూ అలా వెళ్లగానే ఇలా అక్కమీద విరుచుకుపడింది సునీత.
“ఉద్యోగం చేస్తున్నానని ఎంత గర్వమే నీకు? ఇంటల్లుడిమీద పోలీసు కంప్లైంటిస్తావా? మేం కొనుక్కోలేకనా? మాకు లేకనా? ముష్టి బైకుకి డబ్బులు నీ దగ్గర లేకపోయాయా? ఆరేళ్లనుంచి ఉద్యోగం చేస్తున్నావు, ఆపాటి నువ్వు మిగుల్చుకోలేదంటే నేను నమ్మాలేం? నాన్న ఉద్యోగం నీకిచ్చారు. న్యాయానికి అందులో నాలుగోవంతు జీతం నాకు రావాలి. అమ్మ పెన్షను ప్రతీనెలా నువ్వే తీసుకుంటున్నావు. నాన్న గ్రాట్యుటీ ఏం చేశావో తెలీదు. రెండు లక్షలిచ్చి నన్ను వదిలించుకున్నావు. బోడి రెండులక్షలు… అటెండరుకి ఇస్తున్నారు. ఆయన మెతకదనం చూసి ఈ ఆటలన్నీను. అసలు… నీకు కుళ్ళు… నాకు పెళ్లయింది, నీకు కాలేదని. దేనికేనా రాత ఉండాలి. ఆ రాతే నీ మొహాన్న ఉంటే నాన్న పోయేవారే కాదు. తేజాతో నీ పెళ్లి ఆగేదీ కాదు. మాకీ పాట్లూ ఉండేవి కాదు” అంది.
ఆమె అన్న అన్నిమాటలకన్నా ఆఖరి మాటలకి సుమిత్ర తీవ్రంగా గాయపడింది. తనతో చెమ్మచెక్కలాడి, చింతపిక్కల్లో ఓడిపోతే ఏడ్చి, ఒక కంచంలో అమ్మ కలిపి పెడితే తిన్న సునీతేనా ఇది? అపనమ్మకంగా చూసింది. ఇప్పటిదాకా ఆ ఉత్తరం సునీత తెలివి, ప్రతాపం అన్న ఊహే కలగలేదు. మురళి ప్రమేయం లేదనీ అనుకోలేదు. తన యింటి పిల్లకి అలాంటి తెలివితేటలు వున్నాయనుకోలేదు. పిల్లలు తప్పు చేయగానే బయటివాళ్ళెవరి ప్రోద్బలమో వుందని నమ్మే ఒక అమ్మలా తనూ నమ్మింది. సునీత ఏ ప్రమాదంలో వుందోనని భయపడిపోయింది. అంతా దానికి భిన్నంగా జరిగింది. ఎంత తప్పు జరిగిపోయింది! అతన్ని ఎంత బాధపెట్టి అవమానించింది! చేసిన తప్పుకి క్షమార్పణగా మురళితో రెండు మాటలు చెప్పి వెళ్లామని ఆగింది.
రాత్రికి వంటచెయ్యలేదు సునీత. నోటికి వచ్చినట్టు సుమిత్రని తిడుతునే ఉంది. తిట్టీ తిట్టీ అలిసిపోయి పక్కెక్కి నిద్రపోయింది. ఉన్నవి మూడు గదులు. ఒకటి వంటిల్లు, ఇంకొకటి వాళ్ల పడగ్గదీ, మూడోది గ్రిల్‍తో మూసేసిన ముందుగది. తర్వాతెప్పుడో పెంచుకోవచ్చని కట్టుకున్నచిన్న ఇల్లు. రాత్రవుతున్న కొద్దీ గ్రిల్‍లోంచీ చలి వస్తూ వణికిస్తోంది. అక్కడే సోఫాలో కొంగు కప్పుకుని ముడుచుకుని పడుకుంది. ఊరిబైటేమో చలి ఎక్కువగానే ఉంది. బైటి చలికన్నా లోపలి దుఃఖం ఇంకా వణికిస్తోంది. అవమానభారం మరీ కుదిపేస్తోంది. అప్పటిదాకా రెప్పలమాటున దాగిన కన్నీళ్లు నిశ్శబ్దంగా జారిపడ్డాయి.
తనింత స్వతంత్రించకుండా ఉండాల్సింది. ఆ ఉత్తరం తల్లి చేతికిచ్చి, కొనివ్వలేనని చెప్పేసి ఏదో ఒకటి చేసేదేమో! ఉహు< తన మాట వినేది కాదు. ఏదో ఒకలా డబ్బు పుట్టించమని ప్రాణాలు తోడేసేది. ఆ తర్వాత సునీతకి ఇంకా తీరవలసిన కలలు చాలా ఉన్నాయి. అవి తీరుస్తూ వెళ్తే తన జీవితమే కాదు, తన తరువాత ఇద్దరి జీవితాలూ కూడా సరిపోవు…. సునీత తర్వాతిది రూపకప్పుడే ఇరవై. ఆఖరుది మమతకి పదిహేడు. ఎలా వీళ్ల చదువులూ పెళ్లిళ్లూ చెయ్యడం? తండ్రి వుద్యోగం, జీతంతోపాటు ఆయన వదిలి వెళ్ళిన కుటుంబబాధ్యతలుకూడా తనవేనన్న విషయం దీనికెలా అర్థమౌతుంది?
సునీత ఇలా ఎందుకు చేసింది? మనిషన్నాక ఎన్నో కోరికలుంటాయి. అవన్నీ తీర్చుకోవడం సాధ్యమేనా? భర్తకి తెలీకుండా అలాంటి ఉత్తరం ఎందుకు రాయాలి? ఎంత భయపడింది. తను? సునీత ఎలా ఉందోనని ఎంత తల్లడిల్లిపోయింది! ఇరవైరెండేళ్లు పుట్టి పెరిగిన ఇంట్లో ఏం సిరిసంపదలున్నాయో తెలీనంత అమాయకురాలు కాదు సునీత. అతను ఏదేనా అడిగితే వారించాలిగానీ అతనిలో లేని ఆలోచనలు తనే ఎందుకు రేకెత్తించాలి?
తేజా… తేజా ఏమైపోయాడు? ఈ బాధ్యతలకి భయపడిపోయాడా? ఇవన్నీ ఇలాగే జరుగుతాయని తనకన్నా ముందే తెలుసుకున్నాడా? మన పెళ్ళైపోయిందన్నవాడు…జీవితాంతం తోడుగా నిలుస్తానన్నవాడు… మధ్యలోనే ఎటు వెళ్లిపోయాడు? మొదట్లో ఉత్తరాలు రాసేవాడు. తర్వాత ఉన్నట్టుండి మానేశాడు. ఇప్పుడు తను రాసినా జవాబివ్వటం లేదు. ఫోన్‍కూడా చేసేవాడు. ఇప్పుడు తనుగా చేసినా ఆ నెంబరు కలవటంలేదు. అలాంటి నెంబరుతో ఫోనే లేదని బీయస్‍ఎన్నెల్ కంపెనీవాళ్ల మెసేజి వస్తోంది.
ఏం జరిగింది? సునీత అన్నట్టు ఇంకో అమ్మాయిని చేసుకున్నాడా? ఎవరూ తనకి ఈ విషయంలో దారి చూపించరు. అతను లేకుండా తను బతకడం ఎలా? తేజా ప్రస్తావన రావటం తల్లికి ఇష్టం ఉండదు. ఎక్కడ తను పెళ్లి చేసుకుని అతనితో వెళ్లిపోతుందోనని భయం. కానీ అతనే తన చెయ్యి వదిలేసాక ఇంక తనకీ తాపత్రయాలెందుకు? బాధ్యతలన్నీ త్వరగా ముగించుకోవాలన్న తొందరెందుకు? కన్నీళ్లతో చీరచెరుగంతా తడిసిపోయింది.
ఆలోచనల్తో ఎప్పటికో నిద్రపట్టింది. ఎక్కడెక్కడో తిరిగి అర్థరాత్రి దాటాక మురళి ఇంటికి వచ్చాడు. వీధి తలుపు తీసే ఉంది. తోసుకుని లోపల అడుగుపెట్టాడు. అతని దృష్టి సోఫాలో పడుకుని ఉన్న సుమిత్రమీద పడింది. చలికి సన్నగా వణుకుతోంది. చెంపలమీద కన్నీటి మరకలు.
అతనికి ఆమెమీద కోపం రాలేదు. జాలి వేసింది. అందరూ సహకరిస్తేనే ఏ కుటుంబమేనా సరిగా సాగుతుంది. నలుగురూ నాలుగు వైపులకీ లాగుతుంటే బయల్దేరినచోటే వుంటుంది.
వయసులో చిన్నదే అయినా చాలా పెద్దభారం నెత్తిన పడింది. స్వంతసుఖాలని త్యాగం చేసి కుటుంబంకోసం శ్రమపడు తోంది. అనవసరపు బాధ్యతలు మీద పడకుండా చూసుకునే ప్రయత్నంలో తొందరపాటు పనులు చేస్తోంది. ఈ విషయం తనకి చెప్పి సామరస్యంగా పరిష్కరించుకుని ఉంటే బావుండేది. పోలీసులదాకా ఎందుకు తీసుకెళ్లింది?
మనిషి మనసు చాలా చిత్రమైనది. లెక్కలేనన్ని కళాకళలున్నాయి. ద్వేషించాల్సిన మనిషిమీద ప్రేమ పుడుతుంది. జీవితాంతం కలిసి ఉండాల్సిన స్త్రీమీద చిన్న చిన్న తెలివితక్కువతనాలకి కూడా మనసు బీటలువారేంత కోపం వస్తుంది. పెట్టుపోతలూ, ఆశింపులూ ప్రతివ్యక్తి జీవితంలోనూ ఉంటాయి. ధనిక కుటుంబాల్లో వాటి రూపుతీరులు వేరేగా ఉంటే మధ్యతరగతి ఇళ్లలో అవి కొంత హుందాతనం లోపించినట్టు వుంటాయి. కొడుక్కి కట్నం పైసపైస లెక్కపెట్టి తీసుకున్న ఒక తండ్రి ఆ డబ్బుతో తన కూతురి పెళ్ళి జరిపించి బాధ్యత తీర్చుకుంటాడు. కోడలికి పెళ్ళిలో బంగారం పెట్టినట్టే పెట్టి, పెళ్ళైన వెంటనే తీసేసుకుని తమ యింటి ఆడపిల్లల బాకీలు తీర్చేస్తారు ఇంకో యింట్లో. అన్నీ ముతక లెక్కలు.
మురళికి తన చిన్నతనంలోని సంఘటనలు గుర్తొచ్చాయి. మనిషి స్వీయానుభవాల్లోంచే పాఠంగా నేర్చుకుంటాడు, మంచినైనా చెడునైనా.
మురళికి ముగ్గురు మేనత్తలు, వాళ్లకి ఏవో కోరికలు, అవసరాలు. మురళి తండ్రి ఇంటికి పెద్దకొడుకు. తాత, నాయనమ్మ అంతా కలిసే వుండేవారు. ఆ యింటి కుదురుని విడిచి వెళ్ళిన ఆడపిల్లలకి అది పుట్టిల్లు. డబ్బుకోసం మురళి తండ్రిని పీడించేవారు. అవికాక పెట్టుపోతలు, దారిఖర్చులు… పుస్తీపూసా అమ్మైనా వాళ్లని సంతృప్తిపరిచే బలహీనత ఆయనది. కోడలు గట్టిగా వూపిరి పీల్చుకుంటే తన పిల్లలకి గాలి తక్కువౌతుందేమోన్నంత కంగారు మురళి నాయనకి. ఒకరు వెళ్లారని అనుకునేసరికి ఇంకొందరు దిగడం. అలా బాగా చితికిపోయింది వాళ్ల కుటుంబం.
తిండికీ బట్టకీ కూడా తడుములాటే మురళీవాళ్లకి చిన్నతనంలో. చదువు గవర్నమెంటు స్కూల్లో. అదే ఎక్కువన్నట్టు నామమాత్రపు ఫీజులు కట్టడానికే భార్యనీ పిల్లల్నీ తిట్టేవాడు మురళి తండ్రి. తల్లి మెడలో పసుపుతాడు దానికి కనీకనిపించనంత చిన్న సూత్రాలు… కుత్తిగంటుకు కట్టే సూత్రాలంత చిన్నవి వుండేవి. సూత్రాలకి పుట్టింటి, అత్తింటి తూకాలు పెళ్ళితోనే చెల్లు. ఎప్పుడూ ఆవిడ సూత్రాల గొలుసు తాకట్టులోనే ఉండేది. విడిపించడం మళ్లీ తాకట్టు పెట్టుకోవడం…
ఒకసారి ఇలాగే… ఇప్పుడీ వచ్చిన ఆడబడుచుకీ వాళ్లకీ బట్టలు పెట్టే విషయంలో మురళి తల్లిదండ్రులు బాగా పోట్లాడుకున్నారు.
“ఎంత ఆడపిల్లలైనా ఏడాదికోసారి వస్తే బట్టలు పెట్టగలంగానీ ఎప్పుడూ వచ్చేవాళ్లకేం పెడతాం?” అంది తల్లి.
“నీ పెట్టుపోతలకి మొహంవాచి అది రాలేదు. నామీద ప్రేమతో వచ్చింది”” తండ్రి అరిచాడు.
“మీమీద అభిమానంతో వచ్చారు. చూశారు. వెళ్తారు. మీరెందుకింత హైరానాపడటం?” అంది తల్లి.
ఆదాయానికి తగ్గట్టు ప్రాథమ్యాలనీ అవసరాలనీ ఏర్పరుచుకోవటం రాని మగవారంతా అలాగే ప్రవర్తిస్తారు. ఆదాయం పెరిగే మార్గాలు వుండవు. సరిపోయేంత డబ్బు లేకపోవటం వైఫల్యంలా కనిపిస్తుంది. నిజానికి వైఫల్యం మొదటిది. మొత్తమ్మీద గొడవంతా మురళికి గుర్తులేదుగానీ బాగానే దెబ్బలాడుకున్నారు.
“మీరంత ఏడుస్తూ మాకు మర్యాదలు చెయ్యక్కర్లేదు. మాకేం లేక రాలేదు” అని వచ్చినవాళ్లు వెళ్లిపోతామనటం, వాళ్ల ఎదుటే తండ్రి తల్లిని కొట్టడం… ఇప్పటికీ చెరగని ముద్ర అతని మనసుమీద. తండ్రికంటే వాళ్ళు స్వంతవాళ్ళు. రక్తసంబంధం. తల్లి, వాళ్లకోసం ఇదంతా ఎందుకు భరించడం అని అప్పట్లో ప్రశ్నించుకునేవాడు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న తన ముందు నిలబడి ఉంది.
ఈ సుమిత్ర ప్రాథమ్యాలలో తామెక్కడ ఉన్నారని ఆమె పెళ్లి మానుకుని ఇవన్నీ చేస్తోంది? ఆమెకీ సునీతావాళ్లలాగ అడిగి చేయించుకునే హక్కుంది. ఆ హక్కుని వదులుకుంది. చెల్లెళ్లకోసం త్యాగం చేసింది. ఇంకాకూడా తన మేనత్తల్లాగే సునీత ఏవేవో కావాలని పీడిస్తోంది. తను చూస్తూ ఊరుకుంటున్నాడు. అంటే… తనలోకూడా ప్రలోభం ఉందా? కాదు, బాధ్యతారాహిత్యం, ఉదాశీనత. మొదటే వీటిని తుంచేసి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదు. అతను తల బలంగా విదిల్చాడు. తనేమీ సత్యవంతుడూ, ధర్మరాజూ కాదు. తల్లి పడిన బాధలు కళ్లారా చూసి భార్యని అలా బాధపెట్టకూడదనుకున్నాడు. అత్తవారిని దేనికీ పీడించకూడదనుకు న్నాడు. కానీ తన ప్రమేయం లేకుండానే పెళ్లప్పుడు కట్ననిర్ణయాలు జరిగిపోయాయి. మరదళ్ల పెళ్లిళ్లకి ఎంతో కొంత సాయం చేసి ఆ ఎకౌంటు సెటిల్ చేసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత
పండగలకి వాళ్లు పిలవడం, తాము వెళ్లి మర్యాదలు అందుకోవడం. ఎక్కడో ఒకచోట దీనికి ముగింపు చెప్పాలనుకున్నాడు. ఇంతలోనే ఇలా జరిగింది.
ఐనా సునీత అలా ఎలా రాసింది? ప్రతిపండక్కీ పిలవమనీ, ఖరీదైన బట్టలూ, కానుకలూ ఇమ్మనీ తనే అడిగి వుంటుంది. కొత్తల్లుడు ఒకసారి వెళ్తే ముద్దు. నాలుగుసార్లు వెళ్తే లోకువ. ఇంక దీనికి అంతు వుండదనుకుందేమో. ధైర్యంగా పోలీసు కంప్లెయింటిచ్చింది సుమిత్ర. ఆమె చేసిన పనిపట్ల అతనికెంత కోపం వున్నా లోలోపలెక్కడో ఆ తెగువ విస్మయాన్ని కలిగించింది. తలుపు బోల్టు వేసి లోపలికి వెళ్ళాడు. సునీత మంచినిద్రలో వుంది. అవతలో వ్యక్తి చలికి వణుకుతూ వుంటే తను పరుపుమీద రగ్గు కప్పుకుని వెచ్చగా ఎలా పడుక్కోగలిగిందో అతనికి అర్థమవలేదు.
“ఏయ్, లే! అవతల ఆమె చలికి వణుకుతోంది. బ్లాంకెట్ ఇచ్చి రా!” అన్నాడు తట్టి లేపుతూ. అతని గొంతులో కాఠిన్యం వుంది. కోపం వుంది. ఇంకా ఎన్నో అలాంటి భావాలు న్నాయి.
సునీత కళ్ళిప్పి బద్దకంగా చూసింది. “తను వెళ్ళిపోలేదా?” అడిగింది ఆశ్చర్యంగా.
“నేను చెప్పింది వినిపించలేదా?” కరుగ్గా వుంది అతని గొంతు.
అయిష్టంగా లేచి వెళ్ళి దుప్పటీ తీసుకెళ్ళి సుమిత్ర కాళ్ళమీదికి విసిరేసి వచ్చింది. ఆమె వచ్చేసరికి సిగరెట్టు తాగుతున్నాడు మురళి. తన అసహ్యాన్నంతటినీ వెళ్ళగక్కుతున్నట్టు వుఫ్‍మని ఇంత పొగ ఆమె మొహంమీదకి వదిలాడు.