“ఏమిటిదీ?” అంది సునీత ఆ పొగని చేత్తో తప్పించుకుంటూ.
“ఈవేళ్టినుంచీ నీకు నేనిచ్చే విలువ ఇదే” సగం కాల్చిన సిగరెట్టుని నేలమీద వేసి చెప్పుతో నలుపుతూ అన్నాడు కసిగా. ఇంకా ఎన్నో అనాలనుంది. కానీ అవతల సుమిత్ర వుందని కొంతా, సంస్కారంచేత ఇంకొంతా కంట్రోల్ చేసుకున్నాడు. సునీతకీ కోపం వచ్చింది.
“ఆ సుమిత్ర చేసిదానికి నన్నంటారేమిటి? మీరేదో కష్టపడుతున్నారనీ, ఇప్పట్లో కొనుక్కొనే వీలులేదని అన్నారనీ మావాళ్ళనడిగాను. ఏం? తప్పా? ఆడపిల్లకి ఆపాటి పుట్టింటి ఆశ వుండకూడదా? మా నాన్న జీతంమీద నాకంత హక్కులేదా? ఐనా ఇస్తే ఇస్తారు. లేకపోతే లేదనుకున్నాను. దానికిదింత గొడవ చేస్తుందనుకోలేదు” అంది కోపంగా. అంటూనే చాపా దిండూ తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమె తెలివిగలది. స్వాభిమానంకన్నా, తెలివితేటలూ, వాటికన్నా బతకనేర్చినతనం వున్నదిగాబట్టి తేలిగ్గా సుఖపడగలదు.
రాత్రంతా మురళికి నిద్రపట్టలేదు. జరిగిన పరాభవం గుర్తొచ్చి నిప్పులా చురుక్కుమనిపిస్తోంది. సుమిత్ర చేసిన అవమానంకన్నా సునీత చేసిన ద్రోహం ఎక్కువ మండిస్తోంది. ఎప్పుడు తెల్ల వారుతుందా అని ఎదురుచూస్తున్నట్టు పడుకుని నాలుగవగానే లేచేసాడు. అప్పటికే సుమిత్ర నిద్రలేచింది. బెడ్రూంలో కాకుండా సునీత వంటింట్లో పడుకుని వుండటం చూసి భార్యాభర్తలు రాత్రి మళ్లీ గొడవపడి వుంటారని గ్రహించింది. తనువెళ్ళిపోతే సర్దుకుంటారేమో! లేకపోతే తల్లిని పంపాలి. ఒక సమస్య తీర్చబోతే ఇంకొకటి వచ్చి కూర్చుంది అనుకుంటూ బ్రష్ చేసుకుని పెరట్లోంచీ వస్తూ అతనికెదురుపడింది. ప్రాణం చచ్చిపోయినట్లైంది అతన్ని చూస్తుంటే. తల దించుకుని రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టింది.
“జరిగినదానికి నన్ను క్షమించండి. సునీత తెలిసీ తెలీక ఏదో రాసింది. ఎటూ డబ్బు పుట్టే మార్గం కనిపించక దాన్ని గురించిన ఆందోళనలో నేనూ తొందరపడ్డాను” అంది.
“ఈ విషయం గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది” అతను మాట తుంచేసాడు. ఆమె ఇంకేం తర్కించకుండా లోపలికి వెళ్లిపోయింది. బేగు సర్దుకుని చెప్పులేసుకుంది.
“సునీతా! నేను వెళ్ళొస్తాను” అంటూ లోపలికి వినిపించేలా చెప్పింది. వినిపించినా ఇవతలికి రాలేదామె.
“ఉండండి. నేనూ వస్తాను” అన్నాడు.
“నేను వెళ్ళగలను. మీకెందుకు శ్రమ?” కంగారుగా అంది సుమిత్ర.
“వద్దులెండి. నా జాగ్రత్తలో నేనుండటం మంచిది. రైలెక్కేలోగా మీకేదైనా జరిగితే నేనేదో చేసాననుకుంటాడు మీ ఎస్పై ఫ్రెండు” వ్యంగ్యంగా అన్నాడు.
సుమిత్ర ముఖం ఎర్రబడింది. అతను ఆటో తీసుకొచ్చాడు. స్టేషను చేరేదాకా ఇద్దరూ ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదు. నిన్నటి సరదా ఇద్దరిలో మచ్చుకేనా లేదు. అతనే వెళ్ళి టిక్కెట్టు తీసుకొచ్చాడు. రైలు రాబోయే సమయానికి సూర్య వచ్చాడు. అతను రావటం చూసి మురళి వెళ్ళిపోయాడు.
“మీకెలా తెలుసు, నేనిందులో వెళ్తానని?” అడిగింది.
“రాత్రంతా మా మనిషిని అక్కడ కాపలాకి వుంచాను. నేను వచ్చేసాక బాగా గొడవలౌతాయని వూహించాను. ఏదైనా జరిగితే నా సెల్‍కి చెయ్యమని చెప్పాను. అతనే చెప్పాడు, మీరిద్దరూ బయల్దేరారని” అన్నాడు.
“నేను చాలా తప్పు చేసాను, ఇలా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి. అతను బాగా హర్టయాడు. దీని పర్యవసానం ఏదిగా వుంటుందో తెలీడం లేదు”
“అతనెలాంటివాడు?”” అడిగాడు సూర్య.
“చాలా సున్నితమైన మనస్సనిపిస్తోంది””
“ఐతే భయపడక్కర్లేదు. మీ చెల్లెలికేం ప్రమాదం వుండదు. పోతే వాళ్ళ మధ్య వుండే గౌరవాభిమానాలు బాగా దెబ్బ తినవచ్చు. ఆమె అతని నమ్మకాన్నీ గౌరవాన్నీ పోగొట్టుకుంటుంది. అతను మంచివాడినేనని మీ దగ్గర నిరూపించుకునే ప్రయత్నాల్లో పడతాడు, ఇకమీదట. మీకూ ఏ సమస్యా వుండదు. ఆ అమ్మాయిని అతనే అదుపులో వుంచగలుగుతాడు”
సుమిత్ర నిట్టూర్చింది. జరిగిపోయిన కాలాన్ని తను తిరిగి తీసుకురాలేదు. ఏం జరగబోతోందో చూడటం తప్ప ఇంకేదీ తన చేతిలో లేదు. కొన్ని బంధాలు పగిలాయి గాజుపలకల్లా.
“నీలిమ ఇచ్చిందా, మీకిలాంటి సలహా?” చిరునవ్వుతో అడిగాడు సూర్య.
“తనని తప్పుపట్టను. నేనున్న పరిస్థితి చూసి తనకి తోచిన సలహా ఇచ్చింది. పాటించాలో వద్దో ఆలోచించుకోవల్సింది నేను” కచ్చితంగా చెప్పింది.
మళ్ళీ నవ్వాడు సూర్య. “ఏమీ అవదు. మీరేం భయపడు కండి. భార్యాభర్తల మధ్య ఇంకా పెద్దపెద్ద గొడవలే వస్తుంటాయి. విడాకులదాకా వెళ్ళినవాళ్లే మళ్ళీ కలుసుకుంటున్నారు” అని, “రాత్రినుంచీ ఏమీ తిని వుండరు మీరు. ఉండండి, తినడానికి ఏదైనా తెస్తాను” అంటూ వెళ్లి ఇడ్లీ, మంచినీళ్ళూ తీసుకొచ్చాడు. ఆమె పక్కన పెడుతుంటే, వూరుకోలేదు. సుమిత్ర తినేదాకా వుండి, ఆమె తిన్నాక ఇద్దరికీ కాఫీ తీసుకొచ్చాడు.
“ఎందుకు?” మొహమాటప డింది.
రైలు కదలడానికింకా టైముంది. అతను వాచీ చూసుకున్నాడు. వెళ్ళటానికి చూసుకుంటున్నాడేమో ననుకుంది సుమిత్ర, “పనుంటే మీరు వెళ్ళిపొండి” అంది.
“పనేం లేకపోతే వుండచ్చా?” అతని పెదాల మీద నవ్వు. సుమిత్రకి ఇబ్బందిగా అని పించింది. ఎలాంటి చొరవనీ భరించలేదామె.
“ఎలా పోయారు మీ నాన్నగారు?” అడిగాడు కొద్దిసేపటి తర్వాత.
“హార్టెటాక్ వచ్చింది. వున్నట్టుండి చనిపోయారు” సుమిత్ర గొంతు వణికింది.
“మీరు సునీతేనా? అన్నదమ్ములు లేరా?””
ఆమె చెప్పింది. ముగ్గురు చెల్లెళ్ళ బాధ్యతగురించి. అతను సుమిత్రని బాధగా చూసాడు. ఏవో కొన్ని సంఘటనలు అప్రమేయంగా జరిగిపోతుంటాయి. అవి కొందరి జీవితాలని నిర్దాక్షిణ్యంగా నలిపేస్తుంటాయి. పెద్దచదువులు చదువుకుని వుద్యోగం చెయ్యటం వేరు. ఆర్ధికస్వాతంత్ర్యంకోసం, జీవితంలో బాగా పైకి రావాలనుకోవటంకోసం వుద్యోగం చెయ్యటం ఆరోగ్యకరమైన విషయం. పెద్దకూతురిగానో కొడుగ్గానో పుట్టినందుకు బాధ్యతలకోసం వుద్యోగం చెయ్యటం వేరు. నీలిమకీ సుమిత్రకీ వున్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని సరదాలు, ఇంకెన్ని కోరికలు ఈ సుమిత్ర కోల్పోవాలో! చిన్నగా నిట్టూర్చాడు.
“సునీతని చదివించి ఆమెకి జాబ్ వచ్చాక పెళ్లి చెయ్యాల్సింది. కష్టం సుఖం తెలిసేది” అన్నాడు.
“తనకి చిన్నప్పట్నుంచీ చదువుమీద శ్రద్ధ తక్కువ. ఎవరం కోప్పడ్డా వినేది కాదు. అంత కెరీర్ యాంబిషస్‍గా పెరగలేదు మేం” సుమిత్ర చెప్పింది.
“మరీ మన జెనరేషన్ ఆడపిల్లలు అపరిపక్వంగా ఆలోచిస్తున్నారు. మగపిల్లలూ అంతేననుకోండి. పెళ్ళయ్యేనాటికి అన్నీ అమరిపోవాలని వాళ్ళనుకున్నట్టే తమకి ఏ కష్టమూ కలగకుండా అత్తవారు అన్నీ అమర్చిపెట్టాలని వీళ్ళు చూస్తున్నారు. కానీ ఇద్దరూ ఒక విషయం మర్చిపోతున్నారు. ఒకసారి అన్నీ అమరిపోయాక ఇంక జీవితంలో చెయ్యడానికేదీ వుండదని. ఆ వేక్యూంని భరించడం చాలా కష్టం. మన జీవితపు పరిధులు చాలా చిన్నవి. వాటిని క్రమంగా నింపుకుంటూ వెళ్ళాలి”
రైలు కొద్దిసేపట్లో కదలబోతోందన్న ప్రకటన వచ్చింది. ఇద్దరి మధ్యా మళ్ళీ మౌనం చోటుచేసుకుంది.
“తేజా మీకెలా పరిచయం?” వున్నట్టుండి అడిగాడు.
ఆమె వులిక్కిపడింది. చుట్టూ వున్న శబ్దాలన్నీ ఆగిపోయి, ప్రపంచమంతా అచేతనమై ఆ ఒక్క ప్రశ్నే శబ్దంగానూ అది సృష్టించిన ప్రకంపనాలే చైతన్యంగానూ అనిపించింది.
“మీకు తేజా తెలుసా?” వణుకుతున్న గొంతుతో అడిగింది.
“మీ ఫోటో వాడి దగ్గర చూసాను” అది యిప్పుడు తనదగ్గర వున్నట్టు అతను చెప్పలేదు.
ఆ చెప్పటంలోనే వాళ్ళిద్దరిమధ్యా వున్న అనుబంధం అర్ధమైంది సుమిత్రకి. ఎలా వున్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే ప్రశ్నలేవీ అడగలేదు. ఒక స్తబ్దత ఆవహించినట్టు మౌనంగా వుండిపోయింది. రైలు కదుల్తుంటే నెమ్మదిగా అంది, “అతని కోసం ఎదురుచూస్తూ సుమిత్ర ఒక్కొక్క క్షణం కొద్దికొద్దిగా చచ్చిపోతోందని ఈసారి కలిసినప్పుడు చెప్పండి”
నిర్విణుడై చూసాడు సూర్య. తేజా మెడిసిన్ రెండోయేడు చదువుతున్నప్పుడు ఒక క్రికెట్‍మేచిలో పరిచయం. ఇంటర్‍కాలేజీ క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు అతను స్నేహితులతో కలిసి చూడటానికి వచ్చాడు. తనకి పరిచయమయ్యాడు. అది స్నేహంగా మారింది. తరుచు అతని ఇంటికికూడా వెళ్ళేవాడు.
తేజా దగ్గిర సుమిత్ర ఫోటో వుండేది. ఆ ఫోటో అతని టేబుల్‍మీద చిన్న ఫ్రేంలో వుండేది. తనని చాలా ఆకర్షించింది. ఇద్దరూ ప్రేమించుకున్నారేమోననుకున్నాడు. ఆ వయసులో ఆలోచనలంటే అలాగే వుండేవి.
“ఎవరు ఆ అమ్మాయి?” కుతూహలంగా అడిగాడు.
సరిగ్గా అప్పుడే వాళ్ళమ్మ అటుగా వెళ్తూ ఆ మాటలు వింది. చప్పుని గదిలోకి వచ్చింది.
“ఇంకా ఎందుకురా, ఆ ఫోటో అందరూ చూసేట్టు టేబుల్‍మీద? మనం చేసుకుంటామన్నా చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. జరగని పెళ్ళికి మోగని బాజాలని…” తేజా ఏదో చెప్పబోయేంతలో ఫోటో తీసుకుని వెళ్ళిపోయింది. అతను తల్లిని నిస్తేజంగా చూసి వూరుకున్నాడు. ఏదో తేడా అనిపించింది. కబుర్లయ్యి తను వచ్చేస్తున్నప్పుడు చూస్తే అది వాళ్ళింట్లో పాతపేపర్లు పెట్టే గూట్లో వుంది. వాళ్ళింట్లోకి వెళ్ళాలన్నా, ఇంట్లోంచీ రావాలన్నా ఆ పక్కనించే వెళ్ళాలి. న్యూస్‍పేపర్తో కలిపి దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తన వెనకే కొద్ది అడుగుల దూరంలో వస్తున్న తేజా అది గమనించాడో లేదో తెలీదు.
తర్వాత క్రమంగా అతని సర్కిల్ వేరైపోయింది. తల్లి ఫోటో తీసేస్తున్నప్పుడు అతను చూసిన నిస్తేజపు చూపులు చాలారోజులు తను మర్చిపోలేదు. వాటివెనుక ఏదో మిస్టరీ వుందనిపించేది. మొదటిసారి అతన్ని కలిసినప్పుడు అలా లేడు!
ఐనా అదెప్పటి మాట? తేజా తనని కలిసి చాలా కాలమైంది. వున్నట్టుండి కాంటాక్టులోంచీ తప్పుకున్నాడు. ఆ ఫోటోలో అమ్మాయిని తను మర్చిపోలేదు. వెంటాడుతునే వుంటుంది. ఆమెని నీలిమ ఆఫీసులో చూసేసరికి ఆశ్చర్యం కలిగింది. ఆకర్షణలో పడిపోయాడు. ఇప్పుడు సుమిత్ర ఇలా అనటం ఇదొక కొత్త కోణం.
రైలు కూత కూసి కదిలింది. సుమిత్ర కళ్ళలోని కన్నీటిమీద ఒక దీపపు కిరణం పడి తళుక్కుమని మెరవటం అతని మనస్సుని హత్తుకుపోయింది. తెలతెలవారుతున్న వెలుతుర్లో సుమిత్ర రూపం కూడా.
సుమిత్ర ఇల్లు చేరేసరికి రాధకి ఫోన్ చేసి సునీత అంతా చెప్పేసింది. ఇంట్లో అడుగుపెట్టగానే ఆమె విరుచుకుపడింది.
“ఎంతపని చేసావు సుమిత్రా! అన్నీ అమర్చుకోవాలనే ఆతృతకొద్దీ అది రాసిందే అనుకో, మనం నెమ్మదిగా నచ్చచెప్పుకుంటాం. ఒకవేళ అతనే రాయించాడనుకో, వెళ్లి కాళ్ళూ గెడ్డం పట్టుకుని బతిమాలుకుంటాం. అక్కడికీ వినకపోతే ఏ అప్పో చేసి ఇస్తాం. ఆడపిల్లని ఇచ్చుకున్నాక ఇవన్నీ తప్పవు. పెళ్ళి చేసేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదు. నాతో ఒక్కమాటేనా చెప్పకుండా ఇంతపని చేస్తావా? నేను చచ్చానుకున్నావా? వుద్యోగం చేస్తున్నానని రెండు కొమ్ములు మొలిచాయా? ఎవరే, నీకీ సలహా ఇచ్చినది?” అని సునీత అనగా మిగిలిన మాటలన్నీ తను అని వెంటనే సునీతని చూడటానికి బయల్దేరింది.
ఆవిడ వెళ్ళి ఒకమాటు పరిస్థితి సరిదిద్ది వస్తే బావుంటుందనిపించింది సుమిత్రకి కూడా. కానీ ఆవిడ బైకుకి వప్పుకుని వస్తే? అదే అంది. “మంచికో చెడుకో ఇంతదాకా వచ్చింది. మళ్ళీ మొదటికి తీసుకురాకు. అంతంత కానుకలిచ్చే తాహతు మనకి లేదు”
రాధ ఆమెకేసి ఆశ్చర్యంగా చూసింది. “మనమే అంత కచ్చితంగా చెప్పేస్తే ఏం బావుంటుంది? అతను వూరుకుంటాడా? ఆ కోపం మనసులో పెట్టుకుని దీన్నేమైనా చేస్తే?” అడిగింది.
“అతన్నొదిలేసి వచ్చేస్తుంది. ఏదో ఒక వుద్యోగం చేసుకుంటూ బతుకుతుంది. అమ్మా! ఇదంతా దాని ఆలోచన. ఇక్కడేదో వుంది, అదంతా తరలించేద్దామనే అభిప్రాయంలో వుందది. తనకి హక్కుకూడా వుందని అనుకుంటోంది. అతనితో సవ్యంగా కాపురం చేస్తూ అక్కడే వుండడం లేదా ఇలా గొడవలు చేసుకుని కాపురం వదులుకుని రావటం అనేది దాని చేతిలోనే వుంది. అంతేగానీ కాసులు కుమ్మరించి దాని కాపురం నిలబెట్టలేం” కచ్చితంగా చెప్పింది సుమిత్ర.
రాధ ఆ మాటలు జీర్ణించుకోలేకపోయింది. తనమీద ఆధారపడి బతుకుతున్నామనేకదా, ఇంత లోకువ సుమిత్రకి? సునీత పైదా? అదీ ఇంటిదేకదా? తండ్రి వుంటే ఇలా జరిగేదా? తల తాకట్టు పెట్టేనా ఆ డబ్బేదో ఇచ్చి వాళ్ల మేలు కోరేవాడు. తలుచుకుంటేనే ఆవిడకి చాలా బాధనిపించింది.
కష్టం సుఖం తెలిసి రావాలని ఈసారి తల్లిని ఒక్కదాన్నే పంపించింది సుమిత్ర. ఇల్లు చేరుకోవటానికి చాలా అవస్థపడింది. ఆవిడ వస్తుందని మురళీ సునీత ఎవరికి వాళ్ళే అనుకున్నారు. అత్తగారిని వీధిలోనే నిలబెట్టి కడిగేసాడు మురళి. సుమిత్రని అనలేకపోయినవన్నీ ఆవిడ్ని అనేసి తన దుగ్ధ తీర్చుకున్నాడు.
“మీ కూతుళ్లకి బుద్ధి చెప్పుకోండి ముందు. నేనేమిటో తెలిసే సునీత నన్ను చేసుకుంది. తాహతుకి తగ్గ కోరికలుండాలి ఎవరికేనా. మీరు బైకు కొనిచ్చినా పెట్రోలు పోసి దాన్ని నడిపేంత స్తోమత నాకు లేదు. ఏదో మనసుపడి నేనడిగానే అనుకోండి, ఏం, ఆపాటి అడిగే హక్కు నాకు లేదా? మీరు ఇవ్వలేకపోతే ఆ సంగతే చెప్పచ్చుకదా? పెళ్లినాటినుంచి ఇప్పటిదాకా నేనేవేనా ఖండించి అడిగానా? ఇప్పుడు మాత్రం అడగబోయానా? మీ ముక్కుపిండి వసూలు చెయ్యబోయానా? పోలీసు కంప్లయింటిస్తుందా సుమిత్ర? ఆ ఎస్సై వచ్చి నాకు నీతులు బోధించడమా?” అన్నాడు మండిపడుతూ.
“బాబూ! దీనిది చిన్నతనం. దానిది తెలిసీతెలీనితనం. తండ్రి మిగిల్చిపోయినదంటూ ఏమీలేదు. ఒక్కర్తి రెక్కల కష్టంమీద లాక్కొస్తోంది. ఇంకా ఇద్దరాడపిల్లలు వున్నారు. ఆ ఆదుర్దాతో ఏదో చేసింది. అదేం మనసులో పెట్టుకోకండి. మా వీలువెంబడి బైకు కొనిస్తాం” అని బ్రతిమాలింది. రాధమ్మ.
“మహాప్రభో! నాకు మీ బైకూ వద్దు, మీ పెట్టుపోతలూ వద్దు. నేనుకూడా జన్మలో బైకు కొనుక్కోను. నన్ను బైకు మీద చూసాడంటే ఆ ఎస్సై తీసుకెళ్లి లాకప్పులో వేస్తాడు” అని రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టేసాడు మురళి. తల్లితో సరిగా మాట్లాడలేదు సునీత. ముభావంగా వుండిపో యింది. ఆవిడకి చాలా బాధ కలిగింది. అందులోనూ సునీతకి నెల తప్పింది కూడా.
“నీ పెన్షన్ డబ్బులు నాకో పదినెలలు ఇవ్వమ్మా. ఫ్రిజ్ కొనుక్కుంటాము. బైకుకెలాగూ తూగలేమంటున్నారు కదా?” అంది ఆఖరికి, మురళికి తెలీకుండా. “తనదాకా ఈ విషయం వెళ్లనివ్వద్దు. బైటికి వద్దన్నా నన్ను సతాయించేస్తారు” అని కూడా అంది. రాధ కాదనలేకపోయింది.
వారంరోజులపాటు ఆమెని తనతో పంపమని అల్లుణ్ణడిగింది.
“మీకు రావాలనిపిస్తే వచ్చి చూసుకుని వెళ్లండి. సునీత అక్కడికి రాదు. ఉత్తరాలు కూడా రాయదు. ఫోన్ చెయ్యదు” నిర్మొహమాటంగా చెప్పాడతను. అతనికింకా కోపం పోలేదని గ్రహించింది రాధ. ఇంటల్లుడి అంతటి ఆగ్రహానికి కారణమైన సుమిత్రమీద పట్టరాని కోపమొచ్చింది.
రెండు రోజులుండి తిరుగు ప్రయాణమైంది. “నీ ఆరోగ్యం జాగ్రత్త, వేళకి తిను” అని ఎన్నో జాగ్రత్తలు చెప్పింది.
“నా బాగు ఎవరికి కావాలిలేవే?” సన్నాయినొక్కులు నొక్కింది సునీత.
తిరిగొచ్చాక సుమిత్రతో వారంరోజులదాకా మాట్లాడలేదు రాధ. ఈ అనుభవంతో సుమిత్ర చాలా ఎదిగింది. చాలా నేర్చుకుంది. తన స్వవిషయాల్లో ఎవరినీ సలహా అడగడం మానేసింది. కొలీగ్స్‌తో కలివిడిగా వుంటూ వాళ్ల జీవితానుభవాల్లోంచీ తను పాఠాలు నేర్చుకోవడం అలవాటు చేసుకుంది.
ఇదివరకులా జీతం తెచ్చి తల్లి చేతికిచ్చి చేతులు దులుపుకోవడం లేదు. ఖర్చులన్నీ తనే చూస్తోంది. మిగిలింది బేంకులో వేస్తోంది. తల్లికి పెన్షనొస్తుందిగాబట్టి కొన్ని ఖర్చులు ఆవిడమీద వదిలేసింది. ఇదివరకులా తోచినంతా సునీతకి పెట్టడానికి వీల్లేకుండా అయింది రాధకి. ఇప్పటిదాకా చీరలకనీ, స్టీలుసామాన్లకనీ చాలా యిచ్చింది. ఆమెకి ఇస్తానని ఒప్పుకున్న ఫ్రిజ్ మాట సుమిత్ర దగ్గర ఎత్తాలంటేనే హడలుగా వుంది.
ఈమధ్య సూర్య తరుచుగా తనని కలవటానికి రావటం గమనించింది నీలిమ. తరుచుగా కలుసుకునేంత స్నేహం తమ మధ్య లేదు. అన్నదమ్ముల భార్యలు కావటంతో తన తల్లికీ అతని తల్లికీ కొన్ని గొడవలు కూడా వున్నాయి. ఈ నేపథ్యంలో అతని రాక ఆశ్చర్యంగానే అనిపించింది.
“సుమిత్రంటే ఇష్టం కలుగుతోంది నీలిమా! అది ప్రేమేమో నాకు తెలీదు. తనని చూడాలనీ కలవాలనీ పదేపదే అనిపిస్తోంది” అడక్కుండా అతనే అనేసాడు.
ఆశ్చర్యంగా చూసింది. “అదెలా సాధ్యం? తన గురించి నీకేం తెలుసు?” అడిగింది.
“ఏం తెలియాలో చెప్పు?”
“చాలా వున్నాయి. పైకి కనిపించే తన రూపం, ప్రవర్తనా ఒక్కటే నువ్వు చూస్తున్నావు. కానీ తనొక ముళ్లగులాబీ. తనకి అనవసరంగా ఆశలు కల్పించకు”
“అంటే ప్రేమించానని చెప్పి మోసం చేసేవాడిలా కనిపిస్తున్నానా నేను?” చిరుకోపంతో అడిగాడు.
“అలాగని కాదు. తనకి కుటుంబబాధ్యతలు చాలా వున్నాయి. తండ్రి సర్వీసులో వుండగా పోతే కంపాషనేట్ గ్రౌండ్స్లో ఇచ్చిన ఉద్యోగం చేస్తోంది. ఇంకా ఇద్దరు చెల్లెళ్లు పెళ్లికి వున్నారు. పెళ్లయిన చెల్లెలిది చూస్తే ఆ వరుస. వీళ్ల బాధ్యతలు తీరేసరికి తల్లి పెద్దదౌతుంది. ఆవిడని చూసుకోవాలి. ఇవన్నీ నువ్వు ఆలోచించుకోవాలి” అంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.