“అంతేకాదు, ఆ అమ్మాయి తేజా అనే అతన్ని ప్రేమిస్తోంది. ఆ తేజా నాకు తెలుసు. వాడిప్పుడు ఏమైపోయాడో తెలుసుకుని లైన్ క్లియర్ చేసుకోవాలి” “
“సూర్యా!” విస్మయంగా చూసింది నీలిమ. “దీన్నే ప్రేమంటారేమో! ఎవర్నేనా అడిగి తెలుసుకుంటాను” అతను నవ్వాడు.
ఆ తర్వాత మొదలయ్యాయి. అతని పరిభ్రమణాలు, సుమిత్ర చుట్టూ. రెండు నెలలు గడిచాయి. వీళ్ళు ఫోన్ చెయ్యటమే తప్ప సునీత దగ్గర్నుంచీ ఫోనన్నది లేదు. అల్లుడి పట్టుదలేమిటో రాధకి తెలిసొచ్చింది. ఎలా వుందో! అతనేం కష్టపెడుతున్నాడో! కూతురిది మామూలు పరిస్థితీ కాదు.
“ఓసారి దాన్ని వెళ్ళి చూసి వస్తానే” అంది సుమిత్రతో. “
“అస్తమాను వెళ్ళిరావడమంటే మాటలా అమ్మా? రానూపోనూ ఛార్జీలే ఔతాయి” విసుక్కుంది సుమిత్ర.
“మీ పంతాలమధ్యన అది నలిగిపోతోంది. దానికన్నా నీకు డబ్బులే ఎక్కువ య్యాయా?” రాధ కోపంగా అడిగింది.
“నీకూ దానికీ మధ్యని నలిగిపోతున్నది. నేనమ్మా! నాకూ కొన్ని కోరికలున్నాయి. అందులో ఒక్కటి…ఒక్కటంటే ఒక్కటి తీర్చగ లవా? నాన్నని తీసుకురాగలవా? ఈ వుద్యోగం, ఈ బాధ్యతలూ నాకొద్దు. నాన్న వీపుమీద పడి అల్లరిచేసిన నా బాల్యాన్ని నాకు తెచ్చివ్వగలవామ్మా? నన్ను నువ్వు ఆప్యాయంగా పలకరించి ఎన్నాళ్ళైంది, చెప్పమ్మా? సునీతకి నేనేం తక్కువ చేసాను? ఉన్నంతలో యిచ్చి పెళ్ళి చేసాను. చెప్పీచెప్పకా దానికి నువ్వెంత పెట్టినా నేను మాట్లాడలేదు. నాన్న వుంటే మాత్రం అంతకన్నా గొప్ప సంబంధం తేగలరా? అతనెంతో మంచివాడు. దీనికే అతనంటే గౌరవం లేదు. లేకపోతే అతనికి తెలీకుండా అలాంటి వుత్తరం రాస్తుందా? నన్ను.. నన్నెన్ని మాటలందని? నాన్న వుద్యోగంలో చేరి డబ్బంతా మిగుల్చుకుంటున్నానట!” సునీత అన్న మాటలని తల్లితో చెప్పి చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఇన్నాళ్ళుగా రగుల్తున్న అగ్నిపర్వతం భళ్ళుమని బ్రద్దలైంది. రాధ హృదయం ఆర్ద్రమైంది.
“సుమిత్రా! ఏమిటిది? అదొట్టి తెలివితక్కు వది. దాని గురించి నీకు తెలీదా? చిన్నప్పట్నుంచీ వున్నదే కదా? కొత్తగా వచ్చినదేమీ లేదు. దాని మాటలు మనసులో పెట్టుకోకు. నాకు నువ్వొకటీ అదొకటీ కాదు. పెళ్ళైన పిల్ల. కాపురంలో నిలదొక్కుకునేదాకా ఆదుర్దాగానే వుంటుంది. చూడు, నీకన్నా పెద్దదాన్ని. లోకానుభవం వున్నదాన్ని. ఒక్కమాట ఆలోచించు అంత డబ్బు ఖర్చుపెట్టి దాని పెళ్ళిచేసావు. అదక్కడ స్థిరపడితేనే అందం. తిరిగొస్తుందనుకో ఆ భారం ఎవరిమీద పడుతుంది? నీ మీదే కదూ?”
సుమిత్ర సర్దుకుంది. “నీ యిష్టం. వెళ్తే వెళ్ళమ్మా. కానీ సునీత అతనికి కూడా విలువ ఇవ్వదు. అతను చాలా మంచివాడనిపిస్తోంది నాకు” అంది.
కాబట్టే జరిగిన విషయానికి రాద్ధాంతం చెయ్యకుండా వూరుకున్నాడు. మరొకరైతే ఎంత గొడవయ్యేదో! ఎఅవరిదాకానో ఎందుకు, అతని తల్లిదండ్రులకి తెలిస్నా రచ్చే. ఈ మాటలు రాధ పైకనలేదు. వెంటనే బయల్దేరి సునీత దగ్గరికి వెళ్ళింది.
మురళి కోపం యింకా చల్లారలేదు. భార్యతో పెద్దగా మాట్లాడడు. అదొక్కటీ తప్పిస్తే అన్నీ మామూలుగానే జరిగిపోతున్నాయి. ఇదివరకూ వాళ్ళ సంసారంలో నవ్వులూ, కేరింతలూ, అంతులేని కబుర్లూ పొంగిపొర్లేవి. అతని మనసిప్పుడు విరిగిపోయింది. భార్య చేసిన పని అతన్ని గుండెలోతుల్లో ఎక్కడో దెబ్బతీసింది. ఆమె ఆ వుత్తరం రాయడంకన్నా ఎక్కువగా అతన్ని బాధించినది, దాదాపు యిరవయ్యేళ్ళు ఒక దగ్గర పెరిగిన అక్కమీద ఆమెకి రవంత కూడా ఆపేక్ష లేకపోవడం. అలాంటి స్త్రీకి భర్తమీద మాత్రం ప్రేమ ఎందుకుంటుంది? అతన్లో ఒక రకమైన నిరసన చోటుచేసుకుంది. పెళ్ళి చేసుకున్నాడు. నలుగుర్లో గౌరవం నిలవాలిగాబట్టి ఆమెతో కాపురం చేస్తున్నాడు. అక్కడికి వచ్చి ఆగింది వాళ్ల అనుబంధం.
తల్లిని చూసి తప్పదన్నట్టు ఎదురెళ్ళింది సునీత. మురళి యింట్లో లేడు.
“అదేమిటే, యింత చిక్కిపోయావు?” రాధ కంటతడి పెట్టుకుంది.
“ఈపాటేనా మిగిలాను. సంతోషించు” ముక్తసరిగా అంది.
“అతని కోపం ఇంకా పోలేదటే?” అడిగింది రాధ.
“ఎలా పోతుంది సుమిత్ర చేసిన నిర్వాకానికి?” విసురుగా అంది సునీత. రాధేం మాట్లాడలేకపోయింది. అది చూసి కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతుండగా అంది సునీత.
“ఆయన పూర్తిగా మారిపోయారమ్మా! నాతో ఒక్క మాట మాట్లాడరు. నేనేం తప్పుచేసానో చెప్పు? తను ఇబ్బందిపడుతుంటే చూడలేక మీకు రాసాను. లోకంలో ఎందరల్లుళ్ళు అత్తల దగ్గర్నుంచీ డబ్బు గుంజడం లేదు? నాకుగా రాసానని ఆయన కోపం. సుమిత్ర నామీద కక్షగట్టినట్టు అలా ఎందుకు చెయ్యాలి? నీకు తెలీదే! నాకు పెళ్ళైంది దానికి కాలేదు. ఆ తేజా మళ్లీ దాని మొహం చూడ్డం లేదు. అదే కుళ్ళు దానికి” ఆమె ధోరణి ఆమెదే. అది మాత్రం మారదు. తల్లేం తెచ్చిందో చూసుకుంది. ఆవిడకి కాఫీ తెచ్చి ఇచ్చింది. తనూ తాగుతూ పక్కని కూర్చుంది.
రాధకి చివుక్కుమంది. సునీతేమిటో కొత్తగా అర్ధమైనట్టు విస్తుబోయి చూసింది.
“నువ్వెళ్ళగానే డబ్బు పంపిస్తానన్నావు. పంపలేదేమే?” అడిగింది సునీత తనే మళ్ళీ.
“నా పెన్షను డబ్బని ఎక్కడ మిగులుతోంది? నీ పెళ్ళికైన అప్పులే యింకా తీరలేదు. అప్పుడే రూప ఎదిగి కూర్చుంది. సుమిత్రమాత్రం ఎక్కడినుంచీ తెస్తుంది. ఇదిగో ఈ ఐదొందలూ మిగిల్చాను. అప్పుడో యింతా యిప్పుడో యింతా యిస్తాను. దాచుకుని కొనుక్కో” తప్పదన్నట్లు పెట్లోంచీ డబ్బు తీసి ఇచ్చింది రాధ.
“అంత లేకుండా పోయాయా అమ్మా? ఆయన నన్ను కొట్టరు, తిట్టరు. కాబట్టి పైకి చెప్పుకోలేకపోతున్నాను” విసురుగా అంది సునీత.
రాధ ఏదో చెప్పేలోగా కాలింగ్ బెల్ మోగింది. తల్లి చేతిలోని డబ్బు తీసుకుని పరుపు కిందకి తోసేస్తూ వెళ్ళింది తలుపుతియ్యడానికి. ఎదురుగా మురళి!
అతనికి లోపలికి రావడానికి దారిస్తూ నెమ్మ దిగా అంది సునీత. “మా అమ్మ వచ్చింది”
“ఊ”
“ఓ మాటు పలకరించండి”
” ఏమని?”
ఏం జవాబివ్వాలో ఆమెకి తోచలేదు. ఇల్లేమీ యింద్రభవనం కాదు. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు రాధ విననేవింది. తనని పలకరించడానికి అతడు బెట్టు చేస్తున్నాడని గ్రహించింది. పిల్లనిచ్చుకున్నాక తనకి తప్పేదేముంది? లేచి తనే వాళ్ళ దగ్గరకెళ్ళింది. “కులాసాగా వున్నారా బాబూ?” అభిమానంగా అడిగింది.
“ఆ…” పొడిగా అన్నాడు మురళి.
“నాలుగురోజులు సునీతని పంపుతారేమో అడుగుదామని వచ్చాను. బాగా చిక్కింది. అసలే తొలిచూలు” నెమ్మదిగా అడిగింది.
“ఇక్కడ ఆమెకొచ్చిన కష్టమేమిటట? ముప్పొద్దులా తిని మంచం ఎక్కడమేగా?” చురుగ్గా అడిగాడు.
అతనంత మోటుగా అడుగుతాడని ఆవిడ వూహించలేదు. మనసు చిన్నబుచ్చుకున్నా నిగ్రహించుకుంటూ సౌమ్యంగానే అడిగింది.
“దాని చేత్తో అది వండుకు తింటే యిలాంటప్పుడు సహించదు. కొద్దిరోజులు తీసుకెళ్దామని. అంతేగానీ ఇక్కడేదో తక్కువైందని కాదు” ఆవిడ ఆలోచన వేరు. కాస్త ఎడబాటు కలిగితేనేనా భార్యాభర్తల మధ్యని అభిమానం పుడుతుందని.
“చేసుకున్న వారికి చేసుకున్నంత. సునీత ఎక్కడికీ రాదు. డెలివరీ కూడా యిక్కడే జరుగుతుంది. ఈ విషయమై మీరు పదేపదే రావద్దు. అడగవద్దు. కాదూ కూడదంటారా, తీసికెళ్ళండి. మళ్ళీ పంపించే ఆలోచన మర్చిపోండి” అనేసి మళ్ళీ బైటికెళ్ళిపోయాడు మురళి.
“ఇదెక్కడి మూర్ఖుడే?” తలపట్టుకుంది రాధ.
“నేనక్కడికొచ్చి ఏం బావుకోవాల్లేమ్మా? నా తిండి ఖర్చొకటి మీకు” ఉక్రోషంగా అంది సునీత.
“అవేం మాటలు సునీతా? మాటామాటా అనుకున్నంత మాత్రాన మీరిద్దరూ అక్కాచెల్లెళ్లు కాకపోయారా? నా పిల్లలు కారా?” రాధ నొచ్చుకుంది.
రెండురోజులుండి తిరుగు ప్రయాణమైంది. వెళ్తూ సునీతకి ఎన్నోవిధాల నచ్చజెప్పింది.
“పెళ్ళయ్యీ అవ్వగానే అన్నీ అమిరిపోవు సునీతా! జీతంలో పొదుపు చేసుకుని ఒకొక్కటీ కొనుక్కోవాలి. మన పరిస్థితేమిటో నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పాలి. నాన్నేమీ మిగల్చలేదు. ఇంకా నీ తర్వాత ఇద్దరున్నారు. మిగిలినదేదో ఇక్కడే దులిపితే వాళ్ళ సంగతేమిటి? ” అంది. మురళి మనసు నొప్పించవద్దని పదేపదే చెప్పింది.
“నాకే అన్నీ చెప్పు నువ్వు…” అంది సునీత పెడసరంగా.
తల్లి తిరిగి రాగానే సుమిత్ర ఆతృతగా అక్కడి విషయాలడిగింది. ఎంత కాదనుకున్నా స్వంత చెల్లెలు. ఆరాటంగానే వుందామెకి.
“ఎలా సుఖంగా వుంటుందే అదక్కడ? నీ ప్రాణానికి పడి ఏడుస్తోంది. అతనో మూర్ఖుడు. ఉలకడు, పలకడు. పైగా నేనేమైనా మీ అమ్మాయిని కొడుతున్నానా తిడుతున్నానా అని వితండవాదం. కొడితేనూ తిడితేనేనా ఆడపిల్ల ఏడ్చేది? ముద్దూముచ్చటా తీర్చకపోయాక?” అని విరుచుకుపడింది.
వాళ్ళిద్దరి మధ్యా కొత్తగా నెలకొన్న అనుబంధం మళ్ళీ తెగిపోయింది. సుమిత్ర చివాల్న లేచి అక్కణ్ణుంచీ వెళ్ళిపోయింది. అనవసరంగా దాని మనసు నొప్పించాను, నెమ్మదిగా నచ్చజెప్తే వినేదేననుకుంది రాధ. ఆవిడ నమ్మకం, వుత్తరం సునీత చేత అల్లుడే రాయించి పైకి ఉత్తముడిలా నటిస్తున్నాడని. కానీ ఎంచెంచి వేసుకున్న అంచనాలు ఒక్కొక్కసారి తప్పుతాయి.
సుమిత్రకి మురళిపట్ల గౌరవభావం వుంది. జరిగిన గొడవంతటికీ కారణం చెల్లెలేనని గ్రహించింది. అందుకే ఈ విషయంలో ఆమె నిబ్బరంగా వుంటోంది. ప్రమాదమనేది అతనివైపునుంచీ వుంటే తను సునీత గురించి భయపడాలి లేకపోతే ఎందుకు?
రాధ ఆరోజు రాత్రి సుమిత్రతో అంది.
“పైకనడం లేదుగానీ అతనికా బైకుమీద మోజుగా వున్నట్టుంది సుమిత్రా! అదొక్కటీ కొనిచ్చేస్తే యింక మన జోలికి రావద్దని నలుగురు పెద్దమనుషులెదుట గట్టిగా చెప్తాను” కూతురేమంటుందోనని ఆశగా ఆమెకేసి చూసింది. ఏదో చదువుకుంటున్న సుమిత్ర దిగ్గున తలెత్తింది.
“ఆరేళ్ళనుంచీ వుద్యోగం చేస్తున్నావు. ప్రావిడెంటుఫండూ అవీ వుంటాయి. వాటిల్లోంచీ తీసుకుంటే… మీ నాన్నకూడా అవసరాలకి అలాగే చేసేవారు”
“నా గొలుసూ గాజులూ అమ్మేయ్. ఈవేళ బైకు కొనిస్తావు. రేపు ఫ్రిజ్ కావాలంటుంది. అప్పుడు నన్ను తాకట్టు పెట్టు” విసురుగా మెళ్ళో గొలుసూ చేతిగాజులు తీసి తల్లి వళ్ళోపడేసింది.
ఆ గొలుసూ గాజులూ తండ్రి బ్రతికున్నప్పుడు సుమిత్రకి చేయించినవి. పెళ్ళి కావల్సిన ఆడపిల్ల, నలుగుర్లోకి వెళ్తే నిండుగా వుండాలని చేయించాడు. కరిగిపోయిన బాల్యానికి చిహ్నంగా సుమిత్ర వంటిమీద మిగిలాయని ఆమె శరీరంలో ఓ భాగంగా వుండిపోయాయి. సునీత పెళ్ళికి కూడా తియ్యలేదు.
“బావుందమ్మా! బావుంది. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం, ఆడపిల్లనిచ్చుకున్నాక అప్పోసప్పో చేసైనా వాళ్ళ కోరికలు తీర్చాలి” అంది రాధ.
“నేనూ ఆడపిల్లనే. అప్పుకోసం ఎవరి దగ్గరకి పోను? ఆ అప్పేదో నువ్వే చెయ్యి. ఓ పూట మాడైనా తీర్చుకుందాం. ఇంకో ఇద్దరున్నారు. వాళ్ళనేం చేద్దామో కూడా నువ్వే ఆలోచించుకో” సుమిత్ర అక్కణ్ణుంచీ లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది.
నలుగురు ఆడపిల్లలు… రాధకి మనసంతా వికలమైపోయింది. సుమిత్ర పుట్టినప్పుడు అత్తగారి ముఖం కొంచెం కళతప్పినా, మొదటి సంతానం కాబట్టి పెద్దగా ఏమీ అనలేదు. సునీత పుట్టాక మళ్ళీ ఆడసంతేనా అంది చులకనగా. ఆడో మగో, ఇద్దరు పిల్లలు. వాళ్ళని పెంచి పెద్ద చేసి సాగనంపడం పెద్దఖర్చుతో కూడినది. అక్కడితో ఆపెయ్యాలనుకున్నాడు భర్త. ఆవిడ పడనివ్వలేదు. స్వరూప పుట్టింది. ఆవిడ చేసిన గొడవ అంతాయింతా కాదు. ఈ గొడవల్లో పొరపాటు జరిగిపోయింది. మమత కడుపున పడింది. భర్త ఇంక ఎవరికీ చెప్పకుండా తనే వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చాడు. సైకిలుమీద వెళ్ళిన మనిషి ఆటోలో వచ్చాడు. సైకిలు ఆఫీసులో మనిషి తీసుకొచ్చాడు. మంచం దిగకుండా వుంటేనూ, బాధపడుతూ ఇబ్బందిపడుతూ వుంటేనూ తనకి అర్థమవలేదు. అతనుగా చెప్పలేదు. కొన్నాళ్ళు సైకిలు తొక్కకుండా జాగ్రత్తపడ్డాడు. చూచాయగా అర్థమై వూపిరి తీసుకుంది. అత్తగారికి మరి తెలుసో తెలీదో!
పిల్లలని చాలా చీదరించుకునేది. ముద్దు చేస్తే ఓర్చుకునేది కాదు. వాళ్లకోసం ఏదేనా ఖర్చు చెయ్యబోతే పెద్ద రగడ చేసేది. మగపిల్లాడిని కన్న ఆవిడ చాలా గొప్పది, ఆడపిల్లల్ని కన్న తను చాలా తక్కువదన్నట్టు వుండేది ఆవిడ ప్రవర్తన. అలా గొడవపడుతూ కొడుకు ఎలా వొడ్డున పడతాడోనని దిగలుపడుతూ పిల్లల చిన్నప్పుడే పోయింది. బాధ్యతలేవీ తీరకుండా భర్త పోయాడు. అన్నీ కలిపి సుమిత్రకి చుట్టుకున్నాయి.
సునీతని ఎలాగో పంపించింది కానీ ఆమె వెళ్తున్న దారి ఇరుకు చేసుకుంటోంది. సుమిత్ర అన్నట్టు సునీతే ఇదంతా చేస్తోందని అనుకున్నా, అతనికీ ఎక్కుతుందికదా? అతనిముందు బయటపడ్డాక నోరు తెరిచి అడిగినా కూతురి సరదా తీర్చరా అనుకోడా? వాళ్ల కోరికలు ఎలా తీర్చడం? తీర్చుతూ ఎంతకాలం? సమస్య తల్లీకూతుళ్ళమధ్య నలుగుతోంది తప్ప ఓదారి దొరకడం లేదు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.