వారంరోజులుగా యింట్లో మౌనం తాండవిస్తోంది. స్వరూప, మమత ఇద్దర్లో ఒకరు మాట్లాడాలి తప్పితే సుమిత్ర గొంతు మూగవోయింది. ఇహ రాధకి మనసంతా సునీతమీదే ఉంది. ఏదో వండిపెడుతోందిగానీ ధ్యాసంతా అక్కడే. సరిగ్గా అలాంటి సమయంలోనే ప్రకాశరావు ఒక సంబంధం గురించి చెప్పాడు. సునీత విషయంలో గొడవ జరిగాక సుమిత్ర ఆయన్ని ఎక్కువగా సంప్రదించడం, సలహాలడగడం మానేసింది. ఆయన లోన్ గురించి మళ్లీ అడిగితే కూడా అవసరం లేదని చెప్పేసింది. విషయం వాయిదాపడిందని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం యిదే ప్రథమం. సుమిత్ర కోసమే ఎదురుచూస్తున్నట్టు ఆమె ఆఫీసుకి రాగానే పిలిచి చెప్పాడు. “
“చూడు, సుమిత్రా! ముగ్గురు ఆడపిల్లలమీద ఒక్కడే మగపిల్లాడు. ఎంసియ్యే చదివి సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేస్తున్నాడు. భార్య వుద్యోగం చెయ్యక్కర్లేదట అతనికి. నాకే యాభైవేలొస్తుంది, ఇంకా సంపాదనకోసం పరుగులు దేనికన్నాడు. కట్నంకూడా అక్కర్లేదంటున్నారు. ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. బాగా ఆస్తిపరులు. ఐతే…” ఆయన శ్వాసతీసుకోవడంకోసం ఆగాడు. ఆమె శ్వాస బిగబట్టి వింది.
“వాళ్ళందరూ నలుపు, తెల్లటి అమ్మాయికోసం చూస్తున్నారు”” సుమిత్ర మొహంలోకి సందిగ్ధంగా చూస్తూ చెప్పాడు.
సుమిత్ర ఆలోచనలో పడింది. స్వరూపకి ఆ సంబంధం ప్రయత్నించవచ్చు. అబ్బాయి రంగు విషయం పక్కని పెడితే ప్రయత్నమైతే చెయ్యొచ్చు. అతను మరీ వికారంగా వున్నా, స్వరూప ఇష్టపడకపోయినా అది వేరే విషయం. కానీ తన దగ్గర డబ్బేది? కట్నం అక్కర్లేదని వాళ్ళన్నా ఖర్చు వుండాలి. వాళ్ళకేం కోరికలున్నాయో! ఆలోచించుకుని చెప్తానని యివతలపడింది.
“ఇప్పుడు స్వరూపకి పెళ్ళికి తొందరేమిటి?” నీలిమతో అంటే ఆమె అడిగింది.
“ఎప్పటికేనా చెయ్యాలి కద?” అంది సుమిత్ర.
“ముందు చదువుకుని ఓ వుద్యోగం తెచ్చుకోనీ”
“అవేమైనా తేలిగ్గా దొరుకుతున్నాయా? తేలిగ్గా వుద్యోగాలు వచ్చే చదువు చదివిస్తున్నానా? ఖాళీగా వుంచడం దేనికని డిగ్రీలో చేర్పించాను. ఇంజనీరింగైతే నువ్వనట్టు కచ్చితంగా కేంపస్ ప్లేస్‍మెంట్స్‌లో వుద్యోగం వచ్చేది. మమతకూడా వుందికదా, ఇద్దర్నీ చదివించడం సాధ్యపడదని వూరుకున్నాను”
నీలిమ చిన్నగా నిట్టూర్చింది. పిల్లలు పుట్టకముందునించీ కూడా ప్లానింగ్ చేసుకోవలసిన రోజులు. సుమిత్ర తండ్రి ఏమీ దాచలేదట. ఇంక ఈ చదువులు ఎలా సాగుతాయి? ఆమె జీతానికి పెద్దగా లోన్లు పుట్టవు. పుట్టినా చదివించి వుద్యోగం వచ్చాకా, అప్పుడేనా పెళ్ళిచెయ్యాలి. వచ్చినవాడు ఆ లోన్లతో మాకు సంబంధం లేదనేస్తే? పెళ్ళి ఖర్చు ఎలాగా తప్పదు. ఇవన్నీ రాసుకోని వప్పందాలు.
“నలుగురం అమ్మాయిలం కావటంతో ఎంతసేపటికీ పెళ్ళిళ్ళు చేసి పంపెయ్యాలన్న ఆలోచనతోటే వుండేవారు అమ్మా, నాన్నా! అందుకు భిన్నంగా ఆలోచించేవారు కాదు. డిగ్రీ అయ్యి, చిన్నచిన్న వుద్యోగాలు చేస్తూ పెళ్ళెప్పుడౌతుందా అని ఎదురుచూసే స్థితిలో స్వరూపని వూహించలేను నీలిమా!” ఆమె ఆలోచనలోపడటం చూసి నెమ్మదిగా అంది సుమిత్ర. నీలిమ ఆమె చేతిని మృదువుగా నొక్కి వదిలేసింది.
ప్రతివారి దగ్గరా అవసరాలకి సరిపడ డబ్బుండదు. ముందర ఎక్కడో పుట్టించుకుని తర్వాత నెమ్మదిగా తీర్చుకోవడం సామాన్య వుద్యోగస్తులకి పరిపాటే. సుమిత్ర కూడా అదే దారి పట్టింది.
“రూపని చూసుకోవడానికి పెళ్ళివారొస్తున్నారు” చెప్పింది. బాంబు పేల్చినట్టు అనిపించింది రాధకి. ముందు తెల్లబోయింది. తర్వాత విసుగ్గా అంది.
“అవతల సునీత కాపురం అలా తగలడుతుంటే ఇప్పుడు దీని పెళ్ళికి తొందరేం వచ్చింది? నిన్నమొన్ననేగా డబ్బులేదని నా మీద ఎగిరావు??!!”
“ఇప్పుడుకూడా నా దగ్గర లేదు. పీఎఫ్ లోన్ తీసుకుంటున్నాను. చాలకపోతే ఇంటిమీద తీసుకొద్దాం” సుమిత్ర చెప్పింది. ఆమె అన్నీ నిర్ణయించుకునే తనకి చెప్పిందని గ్రహించిన రాధ.
“రూపకింకా తొందరలేదు. ఎలాగా డబ్బు పుట్టేందుకు ఒక దారంటూ దొరికింది కాబట్టి ముందు సునీత సంగతి చూడు” అని బ్రతిమాలింది. సుమిత్రకి విసుగేసింది.
“దానికి ఇప్పుడొచ్చిన కష్టమేం లేదు. ఎంతసేపూ మనం త్యాగాలు చెయ్యాలని చెప్తావుగానీ మనింట్లో పుట్టి పెరిగిన పిల్ల, దానికి చెప్పవేం? అతను కొట్టడు, తిట్టడు. కావాల్సినవన్నీ యిస్తాడు. ఇంక యిబ్బందేమిటి? సర్దుకుపొమ్మని దానికే చెప్పమ్మా!” వ్యంగ్యంగా అంది. ఎదురుచెప్పడానికి రాధ మొదటిసారిగా భయపడింది.
“నాకిప్పుడే పెళ్ళేంటి? నా ఫ్రెండ్సంతా చదువుకుంటున్నారు. నేనూ చదువుకుంటాను” అని గొడవచేసింది స్వరూప.
“పెళ్ళిచూపులకే పెళ్ళైపోయినట్టు గొడవ చేస్తావేమే? వాళ్ళకి నచ్చద్దూ?” సర్దిచెప్పింది సుమిత్ర. తనలో వచ్చిన మార్పుకి తనకే ఆశ్చర్యంగా వుంది. సునీతతో కరుగ్గా, మురళిపట్ల గౌరవంగా, తల్లితో మొండిగా, ఇప్పుడీ స్వరూపతో లాలనగా.. యిన్ని పాత్రల్ని తనొక్కర్తీ ఎంత బాగా పోషిస్తోంది! విస్మయంగా అనుకుంది. ఒక్క క్షణంలో ఆమె గుండె కొట్టుకునే శబ్దం తీరు మారింది. లబ్‍డబ్ అని మానేసి తేజాతేజా అని కొట్టుకోసాగింది. ముఖంమీద నీలినీడలు పరుచుకున్నాయి. ఉన్నట్టుండి ఆమెలో వచ్చిన మార్పుని కనిపెట్టింది స్వరూప. అర్థంకూడా అయింది. సుమిత్రకి తమ బాధ్యతేకాకుండా తమకీ ఆమె బాధ్యత ఒకటి వుందని అర్థమైంది. అది ఒక మంచుశిలని పగలగొట్టడం.
స్వరూపని చూసుకోవడానికి పెళ్ళివారు వచ్చారు. ప్రకాశరావు మధ్యవర్తి. వరుడి పేరు భార్గవ. ఇరవయ్యారేళ్ళు. సన్నగా, పొడుగ్గా వున్నాడు. ఆ పర్సనాలిటీకి నలుపురంగవటంచేత కొంచెం మోటుగా అనిపిస్తున్నాడు. కానీ మాట తీరూ అవీ సున్నితంగా వున్నాయి. తల్లీ తండ్రీ ఒక అక్కతో కలిసి పెళ్ళి చూపులకొచ్చారు. ఆ టైముదాకా అన్నీ అమర్చి నీలిమ ఇంటికి వెళ్ళిపోయింది సుమిత్ర.
అక్కచెల్లెళ్ళకి పెద్దగా వారా లేదు. మురళిగానీ, ఇప్పుడి వచ్చిన భార్గవగానీ సుమిత్రకన్నా పెద్దవాళ్ళే. అదే ఆమెకి ఇబ్బంది.
స్వరూపని తనే తయారుచేసింది. డార్క్ గ్రీన్ మీద రిచ్చి వర్కున్న చీర యిచ్చింది కట్టుకోవడానికి. ముదురురంగు చీరలో స్వరూప వంటిఛాయ మెరిసిపోతోంది.
పెళ్ళికొడుకు తల్లి దేవకి. ఇంటా బయటా పెత్తనం ఆవిడదేనని మొదటి నాలుగు ముక్కల్లోనే అర్ధమైపోయింది. ఆవిడ కట్టిన చీర, వంటిమీది నగలూ చూసాక తాత్కాలికంగా చింతలన్నీ వదిలేసింది రాధ. సునీత విషయం, సుమిత్రమీది కోపం కూడా తాత్కాలికంగా పక్కకి జరిగాయి. ఈ సంబంధం కుదిరే తమంత అదృష్టవంతులు ఉండరనుకుంది ఆశగా. అదొక సింబయాసిస్. కొంచెం ముతగ్గా చెప్పుకోవాలంటే బార్టరు. స్వరూప దగ్గర అందం వుంది. అతనికి జీవితానికి నిశ్చింతని ఇవ్వగలికే శక్తి వుంది.
దేవకికి స్వరూపని చూడగానే నచ్చింది. ఆవిడది మేనరికం. భార్యాభర్త లిద్దరూ బాగా నలుపు. ఇంట్లోని పెద్దవాళ్ళ పోలికలు వచ్చాయనుకున్నారు. పెళ్ళి చేసుకుంటున్నప్పుడు వాళ్లకి ఏమీ అనిపించలేదుగానీ ఒక్కొక్క సంతానం కలుగుతుంటే బెంగ మొదలైంది. టీవీలూ అవీ వచ్చాక బ్యూటీకాన్షస్‍నెస్ ఎక్కువైంది. అప్పటిదాకా మనసులోని కోరికగా అప్రకటితంగా వుండిపోయిన అందం వ్యాపార వస్తువైపోయింది. అన్నిటిలాగే తెల్లటివాళ్ళు అందమైనవాళ్ళు, అదృష్టవంతులు, అసలు నల్లటి ఛాయవాళ్ళు మనుషులే కాదన్నట్టూ వాళ్లు ఎందుకూ పనికిరారన్నట్టూ, వుద్యోగాలుకూడా నల్లగా వుంటే రావన్నట్టూ చూపించడం మొదలైంది. కూతుళ్ళకి సంబంధాలు కుదిరేసరికి తలప్రాణం తోక్కొచ్చింది. లక్షలు గుమ్మరించి అలుళ్ళని వెతుక్కొచ్చారు. ఇక కొడుకు… ఆస్తి, చదువు, సంపాదనా వున్నా అతని రూపం చూసి సమానస్థాయిలో ఎవరూ ముందుకి రాలేదు. మేరేజి బ్యూరోల్లో పెడితే సరైన సంబంధం ఒక్కటికూడా రాలేదు. అందుకే దిగి వచ్చారు. బంధువులకీ తెలిసినవాళ్ళకీ చెప్పుకున్నారు. అలా ఈ సంబంధం తటస్థపడింది.
ఇప్పుడీ స్వరూప ఇష్టపడే ఈ పెళ్ళిచూపులకి కూర్చుందా అనేది భార్గవ సందేహం. దాన్ని ఎలా తీర్చుకోవాలో తెలీలేదు. పెద్దవాళ్ళు మాటల్లో పడ్డారు. స్వరూపని లోపలికి వెళ్ళమంది రాధ. తను ఆమెతో మాట్లాడతాన్నాడు భార్గవ. స్వరూప ఆగి అతన్నీ తీసుకుని వెళ్ళింది. ఆమె వుదాశీనత చూసి అతనికి ఇబ్బంది కలిగింది. పెద్దగా మాటలేం జరగలేదు.
“మీకు నచ్చితేనే వప్పుకోండి ఏ వత్తిడికీ లొంగవద్దు ” అని మాత్రం అన్నాడు. అది చెప్పడానికే తనతో లోపలికి వచ్చాడా? నవ్వొచ్చింది స్వరూపకి. ఇద్దరూ ఇవతలికి వచ్చారు. అందరికీ ఆమె నచ్చినట్లే వుంది. కానీ బైటపడలేదు. కాఫీ ఫలహారాలయ్యాక వెళ్తామని లేచారు.
వెళ్ళబోతూ అడిగింది దేవకి “మీ పెద్దమ్మాయేది? కనిపించదేం?” అని.
చాలా యిబ్బందికరమైన ప్రశ్న అది. అది గ్రహించినట్టు జవాబు కోసం రెట్టించలేదు దేవకి. వాళ్ళని సాగనంపి వచ్చాడు ప్రకాశరావు.
“ఏమైనా చెప్పారా” ఆతృతగా అడిగింది రాధ.
“ముఖతః ఏమీ అనలేదుగానీ నచ్చినట్టే వుందమ్మా! ఇంకో సంబంధం పెండింగులో పెట్టారు. రెండింటిలో ఎటు ఓటు వేస్తారో చూడాలి” అన్నాడాయన. రెండు నిముషాలు తటాపటాయించి తను చెప్పబోతున్నదానికి ఉపోద్ఘాతంగా అందావిడ ” మీ స్నేహితుడు పోయినప్పటికి మా సుమిత్రకి పెద్ద వయసే లేదు”
ప్రకాశరావు తలూపాడు.
“ఏ దేవుడో దయతలచి యిచ్చినట్టు ఆ వుద్యోగం వచ్చి మా కుటుంబానికో దారి కనిపించింది. చాలా కష్టపడుతోంది”
“నిజమే. ఆమె ఓపిక, తెలివితేటలు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తోంది. ఆనందరావు కూడా చాలాసార్లు చెప్పేవాడు సుమిత్ర గురించి. ఈకాలం పిల్లల్లో యింత మంచితనం ఎక్క డుంది? ఎంతసేపూ సినిమాలూ, టీవీ తప్ప మరొకటి తెలీదు”
“కానీ చాలా పెద్ద సమస్యే తెచ్చిపెట్టింది” అంటూ సునీత యింట్లో జరిగిన గొడవంతా చెప్పుకొచ్చింది రాధ. సుమిత్ర లోన్ వద్దంటే సర్దిచెప్పి వచ్చిందనుకున్నాడుగానీ ఏం జరిగిందో ఆయనకి వివరంగా తెలీదు. అసలు జరిగింది యిప్పుడు రాధమ్మ చెప్తుంటే తెలిసింది. ఆశ్చర్యం కలిగింది. అమాయకంగా వుండే సుమిత్రలో అంత తెగింపా?
“తెలివైన పనే చేసింది. బైకంటే మాటలా? ఐనా అతను మాత్రం ఎలా అడిగాడు, ఆడపిల్లమీద ఆధారపడిన కుటుంబమని తెలిసుండీ?” అన్నాడు.
“నేనింకా బ్రతికేవున్నానుగదండీ? అల్లుడన్నాక ఆపాటి అడగడా? పోనీ అడక్కూడనిదే అడిగాడనుకోండి, సునీత క్షేమం దృష్ట్యా తీర్చాల్సిన బాధ్యత మాకుందా లేదా?””
“డబ్బున్నచోట ముచ్చట్లు. ఇప్పటికిప్పుడు బైకంటే సుమిత్రమాత్రం ఎక్కణ్ణుంచీ తెస్తుంది? వాయిదాల్లో తెచ్చినా కట్టుకోవద్దా? అలా వాళ్ళకి ఇస్తూ వెళ్తే మిగిలిన పిల్లలు? ఆ అమ్మాయి పెళ్ళైపోయింది. ఇక వీళ్ళగురించి ఆలోచించండి. ఈ సంబంధం మంచిది. మీనుంచీ ఆశించరు. బాహ్యరూపం చూడకండి” అన్నాడు ప్రకాశరావు.
“నిజమేననుకోండి. ఆ కోపం మనసులో పెట్టుకొని అతనేమో సునీతని ఏడిపిస్తున్నాడు”
“ఎంతకాలం డబ్బిచ్చి వాళ్ళసంసారం నిలబెడ్తారు? రోజులు మారాయి. అల్లుడి జోరు మరీ ఎక్కువగా వుంటే సునీతని తీసుకొచ్చేయండి. ఏ వుద్యోగమో చూద్దాం” అని మరోమాటకి ఆస్కారం యివ్వకుండా లేచి వెళ్ళిపోయాడు.ఆయన పెద్దకూతురు భర్తతో స్పర్ధవచ్చి పుట్టింటికి వచ్చేసింది. భార్యాభర్తలకి దేంట్లోనో మాటపట్టింపు వచ్చి అల్లుడు సంయమనం కోల్పోయి ఒక దెబ్బ వేసాడట. ఈ అమ్మాయి కోపంతో పుట్టింటికి వచ్చేసింది.
“అతనెవరు నాన్నా, నన్ను కొట్టడానికి? నేనూ తిరగబడి కొడితేనో? నాకన్నా బలవంతుడు కాబట్టి కొట్టలేక పోలీసు కంప్లెయింటిస్తే ఏం చేస్తాడు?” అనడిగింది. మళ్ళీ అతని దగ్గరకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. వుద్యోగం చేసుకుంటోంది. నెలకి పాతికవేలు వస్తాయి. విడాకులు తీసుకుంటానంటోంది. పిల్లలు సర్దుకుపోవటం లేదు. కొంతవరకూ ఓపిక చూపిస్తున్నారు. ఒక హద్దు నిర్ణయించుకుంటున్నారు. ఆ తర్వాత ఆత్మరక్షణకోసం ఎదురుదాడికి దిగుతున్నారు. అది ఆయన స్వీయానుభవం. ఇంకోవైపు అదే ఆఫీసులో చేస్తున్న నీలిమనీ చూసాడు. కట్నం తీసుకునేవాడిని చేసుకోదట. భీష్మించుకుని కూర్చుంది. సుమిత్రా అంతే. తగినంత ఖర్చుపెట్టి చెల్లెలి పెళ్ళి చేసింది. వాళ్ళ తాకిడి మొదలయ్యేసరికి ఆత్మరక్షణకి దిగింది.
రాధకి నిస్పృహ కలిగింది. ఇలాంటి పరిష్కారాలు వెతుక్కోవటం ఆమెకి ఏమాత్రం నచ్చలేదు. అల్లుడు కోరికలు కోరటం, అత్తమామలు తలక్రిందులు కష్టపడైనా వాటిని తీర్చడం ఆమె చూసింది. అదొక వేడుక. అది ఆమె తరం. కన్నపిల్లలకోసం ఎంత త్యాగాన్నైనా చేసిన తల్లిదండ్రుల తరం. ఇప్పుడు చెయ్యటానికి తన చేతిలో ఏదీ లేదని బాధపడుతోంది.
స్వరూప నచ్చిందనీ, నిశ్చయతాంబూలాలకి వస్తామని కబురుపెట్టారు. వాళ్ళు పెద్దగా ఏమీ ఆశించలేదుగానీ పెళ్ళి ఖర్చులకేనా రెండో మూడో
లక్షలు కావాలి. లక్ష అనేది ఈ రోజుల్లో సర్వసామాన్యమైపోయింది. డబ్బు విలువ తగ్గడమూ తెలుస్తోంది. సంపాదనలు పెరగడమూ తెలుస్తోంది. రెండూ ఏదో ఒక క్షితిజ రేఖ దగ్గర కలుస్తూ సంపదని సృష్టిస్తున్నాయి. ఐతే ఈ పెరుగుతున్న సంపద అవసరాలని తీర్చడం లేదు. సంతృప్తినివ్వడం లేదు.
“ఏం చేద్దామే?” ఆదుర్దాగా అడిగింది రాధ.
“ఇంటిమీద అప్పు తెస్తాను. నెమ్మదిగా తీర్చేద్దాం” అంది సుమిత్ర తొణక్కుండా “నీలిమకూడా సర్దుతానంది”
కూతురు పడుతున్న తాపత్రయం చూస్తుంటే రాధకి బాధ కలిగింది. “ఇప్పుడింత యిబ్బంది పడుతూ యీ పెళ్ళికింత తొందరేమిటే? నచ్చలేదని చెప్పేద్దాం” అంది.
“పెళ్ళికొడుకుల్ని ఎంచేంత ఎత్తుని వున్నామా, అమ్మా మనం? అతను నలుపనేదొక్కటీ తప్పిస్తే మనకి అలాంటి సంబంధం దొరుకుతుందా? నాలుగేళ్ళు ఆగాకేనా రూపకి చెయ్యాల్సింది నేనే కదా? మనకేం ఆస్తుల్లేవు. ఇప్పుడు పడే యిబ్బంది అప్పుడూ పడాలి. పైగా కట్నం అక్కర్లేదనేవాళ్ళు అప్పుడు దొరకరు కదా! దాన్ని చదివిస్తామని కూడా అంటున్నారు. రూపకి నువ్వే నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పు. అది కాదంటే మాత్రం బలవంతం వద్దు” అంది సుమిత్ర.
అంతా వింది స్వరూప. ఎంత సర్దుకుపోవటమంటే మాత్రం ఇలాంటివాటిల్లోనా? అతను నల్లగా వుంటాడు. అలాంటివాడిని తను చేసుకోవాలా? ఎందుకో అయిష్టంగా అనిపించింది. సుమిత్ర దగ్గర ఏదీ అనలేక వూరుకుంది. కానీ ఆమెలో పెళ్ళంటే ఎలాంటి ఆసక్తి కనబడకపోవటం గుర్తించింది సుమిత్ర.
“అన్నీ మనమే ఏకపక్షంగా నిర్ణయించేస్తే ఎలాగమ్మా? వాళ్ళకి ఆలోచించుకునేందుకు కొంత వ్యవధి ఇద్దాం” రాధావాళ్ళింకా ఏ విషయం చెప్పలేదని దేవకి తొందరపడుతుంటే అన్నాడు భార్గవ. అతని కెందుకో అనిపిస్తోంది, స్వరూపకి తను నచ్చలేదని. పెళ్ళంటే ఆమెలో ఎలాంటి వుత్సాహం కనిపించలేదు. కట్నంలేని పెళ్ళని పెద్దవాళ్ళు బలవంతపెడితే అయిష్టంగా పెళ్ళిచూపుల్లో వచ్చి కూర్చుందేమో! ఆ ఆలోచన అతనికి ఇబ్బందిని కలిగించింది. ఒక ఆడపిల్ల మనసు గెలవలేనంత వికారంగా వుంటాడా తను? చివ్వుమని ఎగజిమ్మింది మనసులో బాధ.
అద్దంముందు నిలబడి తనని తను చూసుకున్నాడు. పట్టులాంటి జుత్తూ, రిమ్‍లెస్ కళ్ళద్దాలూ, తీరైన కనుముక్కూ, మిసమిసలాడే ఆరోగ్యం… తనకి తను అందంగానే కనిపించాడు. దాన్నే ఆత్మవిశ్వాసం అంటారు. అది లేకపోతే అతనికి స్వరూపతో పెళ్ళి జరిగినా అందులో ఆనందం వుండేది కాదు.
స్వరూపతో మాట్లాడి ఆమె మనసు తెలుసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు.
“మీ స్వరూప పెళ్ళి సంబంధం ఏమైంది?” కుతూహలంగా అడిగింది నీలిమ.
“దానికెందుకో ఈ సంబంధం నచ్చలేదనిపిస్తోంది. అతను నలుపని ఎంచుతున్నట్టుందిగానీ ఆ ఒక్క విషయంలోనూ సర్దుకోగలిగితే జీవితం ఎంత నిశ్చింతగా వుంటుందో గ్రహించలేకపోతోంది. మేం వున్న పరిస్థితుల్లో ఈ సంబంధం రావటం చాలా గొప్పవిషయం. సునీత భర్త మంచివాడు. అలా అందరూ వుండరు కదా? రూపం చూసి భార్గవని కాదనుకుంటే మురళిలాంటి వ్యక్తి దొరకడం అసంభవం” అంది సుమిత్ర చిన్నగా.
“తన ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తున్నావా?”
“చేసుకునేది తనైనప్పుడు ఆ ఇష్టాన్ని పట్టించుకోక తప్పదు. ఎవరి జీవితం వారికి ప్రియమైనది” “
“నీది నీకూనా?”
“ఏం, కాకూడదా?”
ఒక్కక్షణం ఆలోచించి అడిగింది నీలిమ. “తేజా ఎవరు సుమిత్రా?”
సుమిత్ర వులిక్కిపడింది. చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అంది “సూర్యా చెప్పాడా? ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్లు చేసి భారీగా మూల్యం చెల్లిస్తుంటాం. నేను చేసిన పొరపాటు సూర్యాతో పరిచయం”
“అలా ఎందుకనుకుంటావు? తనెందుకో నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడు” మృదువుగా అంది నీలిమ.
“ఆ ఇష్టాన్ని తనకే పరిమితం చేసుకొమ్మను…” పదునుగా వుంది జవాబు.
“నేనడిగింది తేజా ఎవరని. నువ్వింకేదో చెప్తున్నావు?” నీలిమ ఆరోపించింది.
“తేజా గురించి చెప్పిన వాళ్ళనే అడుగు”
అక్కడితో వాళ్ళ సంభాషణ ఆగిపోయిందిగానీ తేజా ఎవరో సూర్యా తర్వాతెప్పుడో చెప్పిన వాస్తవం నీలిమని వులిక్కిపడేలా చేసింది. సుమిత్రపట్ల కన్సర్న్ పెరిగింది.
తనని కలవటానికి కాలేజీకి ఎవరో వచ్చారని చెప్తే ఎవరోననుకుంటూ వచ్చింది స్వరూప. భార్గవని చూసి ఆశ్చర్యపోయింది. అడుగు ముందుకి పడలేదు.
“మీతో మాట్లాడాలని వచ్చాను. బైటికి వెళ్లామా? జస్ట్.. కాఫీ హౌస్..” అడిగాడు. సంకోచంగానే అతన్ననుసరించింది.
ఇద్దరూ బైక్‍మీద వెళ్తున్నప్పుడు అతనేదో పాటని హమ్ చెయ్యటం వింది స్వరూప. పాటేమిటో తెలీలేదుగానీ గొంతు చాలా బాగా వినిపించింది. ఐదు నిముషాల్లోనే చేరుకున్నారు. ఇంకాసేపు అతని పాట వింటే బాగుంటుందనిపించింది. కార్నర్ టేబుల్ వెతుక్కుని కూర్చున్నారు.
“కాఫీ అలవాటుందా? లేదంటే ఇంకెటేనా వెళ్దాం” తీరా వచ్చాక అడిగాడు. అలవాటేనన్నట్టు తలూపింది.
చిన్నప్పుడు కాఫీ ఇమ్మని తల్లి దగ్గర గొడవచేస్తే కాఫీ తాగితే ఇలా నల్లగా ఐపోతారని డికాక్షన్ చూపించి బెదిరించడం గుర్తొచ్చింది అతన్ని చూస్తుంటే. చిన్నగా నవ్వు కూడా వచ్చింది.
“ఎందుకు నవ్వుతున్నారు?” అడిగాడతను.
“ఏమీ లేదు” బిడియపడింది.
వెళ్ళి రెండుకప్పుల్తో తీసుకొచ్చి ఒకటి ఆమెకిచ్చి మరొకటి తను తీసుకున్నాడు.
“ఆరోజు పెళ్ళిచూపుల్లో చాలా కంజెస్టెడ్‍గా అనిపించింది. మన గురించి మనం ఏమీ మాట్లాడుకోలేదు” అన్నాడు.
స్వరూప జవాబివ్వలేదు. కానీ ఆరోజు కనిపించని ఆకర్షణేదో అతన్లో కనిపించి చకితురాలిని చేసింది. ఏమిటది? అతని బాడీ లాంగ్వేజి…. కదలికలు… అందరిమధ్యా కూర్చున్న ఆ పదినిముషాల్లో కనిపించని ఇంకో కోణాన్ని చూపెడుతున్నాయి.
మేన్లీగా వున్నాడు. మంచిచదువు, వుద్యోగం, సంస్కారం.. కేవలం అతని రంగు చూసి తను వద్దనుకుంటోందా? తాము అక్కచెల్లెళ్ళలో ముగ్గురు తెల్లగా వుంటారు. సుమిత్ర నలుపుకాదుగానీ ఒక ఛాయ తక్కువ. తండ్రి పోలిక. ఐనా సుమిత్రంటే తనకి చాలా ఇష్టం. ఇతన్నెందుకు ఇష్టపడలేకపోతోంది? ఇష్టపడటం, పడకపోవటం అనే చాయిస్ వుండటంచేతనా? అలాగైతే ఇద్దరు అక్కల మధ్యకూడా తనకి ఎంచుకునే అవకాశం వుంది. ఐనా తనకి సుమిత్రంటేనే ఇష్టం. ఆమె మృదుత్వం, చూపే ప్రేమ అన్నీ నచ్చుతాయి. సునీతతో ప్రతిదానికీ పేచి. అంటే తనకి నచ్చిందీ నచ్చనిదీ వాళ్ళ రంగూ, రూపూ కాదు. ప్రవర్తన, మనస్తత్వం. ఇక్కడ కూడా అంతేకదా?
సుమిత్ర నలుపు, తండ్రి నలుపు, నాయనమ్మ, తాతయ్య నలుపు. కుటుంబంలోకి తెలుపనేది తన తల్లివలన వచ్చింది. అది అలాగే కొనసాగి పుట్టబోయేవాళ్ళంతా తెల్లగానే పుడతారన్న హామీ లేదు.
ప్రేమించిగానీ, పెళ్ళిచూపుల్లో చూసిగానీ అన్నివిధాలా బావుండే వ్యక్తిని చేసుకోగలదా? అలాంటి అవకాశం తనకి వుందా? తనచుట్టూ వుండే పరిధే చాలా చిన్నది. అందులో అందమైనవాళ్ళూ వుంటారేమోగానీ సంస్కారవంతులు? వాళ్ళు పెళ్ళిదాకా వస్తారా? వాళ్లకి తనలో కనిపించే ప్రత్యేకాంశం ఏమిటి?
ఎన్నో ప్రశ్నలు. ఆమె వయసుకి మించిన వితరణ.
అకారణంగా చూసీ చూడగానే ఎవరిమీదా ఎవరికీ ప్రేమగానీ ఇష్టంగానీ పుట్టదు. ముందు ఆకర్షణ పుట్టాలి. అది కుతూహలాన్ని పుట్టిస్తుంది. ఆ తర్వాతే ఏ ప్రేమేనా. ఎంత ఇష్టమేనా. పెళ్ళిచూపుల్లో ఇవేవీ జరగవు. పెళ్ళి చేసుకోవాలన్న ఆబ్లిగేషన్ మాత్రం వుంటుంది. అబ్బాయివైపువారు ఆధిక్యతను చూపెడుతూ డిమాండ్లని చెప్తారు. అమ్మాయి వాటిని వింటూ తనలోకి తను కుదించుకుపోతుంది. అబ్బాయి గురించి అమ్మాయికిగానీ, అమ్మాయి గురించి అబ్బాయికిగానీ వాస్తవాలు తెలిసే అవకాశాలు తక్కువ. పెళ్ళిచూపుల కోసం తెచ్చిపెట్టుకున్న ప్రవర్తనలో కృత్రిమతే ఎక్కువగా వుంటుంది. అవన్నీ ఇప్పుడు లేవు. ఇద్దరూ స్వేచ్చగా మాట్లాడుకున్నారు. చాలాసేపు. ఒకరి ఇష్టాలూ అభిరుచులూ మరొకరు తెలుసుకున్నారు. అతన్ని కాదనదగ్గ అంశమేదీ కనిపించలేదు స్వరూపకి. రంగుతక్కువ సుమిత్రని ఇష్టపడ్డట్టే అతన్నీ ఇష్టపడచ్చనిపించింది. అతని రంగుని కొద్దిగా అలవాటుపడింది.
“మీకీ పెళ్ళి ఇష్టమేనా?” అని అతనడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఆమె దగ్గర స్పష్టమైన జవాబు వుంది. తిరిగి కాలేజీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
“ఎవరే అతను?” స్వరూపని ఫ్రెండ్సు ప్రశ్నల్తో ముంచెత్తారు. ఎవరికీ జవాబు చెప్పకుండా తప్పించుకుంది. ఇంటికి వచ్చాక ఆమెలో వచ్చిన మార్పుని స్పష్టంగా చూడగలిగింది సుమిత్ర. ఏం జరిగివుంటుందో, అంత హఠాత్తుగా ఆ మార్పెందుకు వచ్చిందో అర్ధమవలేదు.
ఐనా ఇంకా ఒక మీమాంస స్వరూపలో. భార్గవపట్ల వ్యతిరేక భావాలు తగ్గి ఇష్టం, స్నేహం ఏర్పడ్డాయి. కానీ అతను లేకపోతే జీవించలేననేంత ప్రేమ లేదు. తన పెళ్లి గురించి తల్లి పడుతున్న తర్జనభర్జన వింటుంటే పడాల్సిన పాట్లు తలుచుకుంటే బాధ కలిగింది.
“వాళ్లు కబురు చేసారుకదా, ఏం చెప్పమంటావు?” తను నేరుగా అడగలేక తల్లిచేత అడిగించింది సుమిత్ర.
“ఇప్పుడే ఏం తొందరమ్మా?” జవాబిచ్చింది.
“అమ్మతో ఏం చెప్పానే?” అడిగింది సుమిత్ర
“కాదక్కా, చేతిలో డబ్బు లేకుండా ఇప్పుడంత తొందర దేనికి? సునీత ఇప్పుడు ప్రెగ్నెంటు. ఇంకొంత ఖర్చు…”
“ఖర్చులు, ఇబ్బందులు ఎప్పుడూ వుండేవి రూపా! కానీ అవకాశాలు మాత్రం ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. వాటిని వదులుకుంటే మళ్లీ రావు. మిమ్మల్ని ముగ్గుర్నీ సెటిల్ చేస్తే నాన్న వదిలిన బాధ్యత తీర్చుకున్నానన్న తృప్తి నాకు. ఇంక అతను నలుపంటావా, దానిగురించి మాత్రం నిన్ను బలవంతపెట్టను. ఐతే ఇందులో చిన్నతనం పడటానికేమీ లేదు. నార్త్ ఇండియన్స్ కన్నా మనం నల్లగానే వుంటాం. నల్లటివాళ్ళూ తెల్లటివాళ్ళూ మనిళ్ళలో కలగలుపుగా వుంటారు. ఇదేదీ కొత్తగా వచ్చింది కాదు. నలుపు మీద చేస్తున్న ప్రచారం కొత్తది. అందం కాదు ప్రధానం, మగవాళ్ల సంస్కారమే మనని సంతోషంగా వుంచుతుంది… సునీత సమస్యకి కారణం మనకి డబ్బు లేకపోవటం కాదు, దాని అసంతృప్తి. నిజంగా మురళికే మనం ఇచ్చే కానుకలమీద దృష్టి వుంటే అదింత నిశ్చింతగా అక్కడుండగలిగేది కాదు. దాన్ని చూసి నువ్వు ఎలా వుండకూడదో నేర్చుకో” అంది సుమిత్ర.
ఆ మాటలు స్వరూప మీద చాలా ప్రభావాన్ని చూపించాయి.
సుమిత్రంటే ఆమెకి పంచప్రాణాలు. తండ్రి పోయినప్పటికి తను బాగా చిన్నది. అప్పటిదాకా అక్కకి యింట్లో ఎంత ముద్దు జరిగిందీ, అక్కకి పెళ్ళై వెళ్ళిపోతుంది,దాంతో పోట్లాడకూడదని తల్లి తమకెలా నచ్చజెప్పేదీ, అన్నీ గుర్తే! అక్క కొంగు పుచ్చుకుని తిరిగిన తేజా కూడా ఆమెకి గుర్తే. అలాంటి అక్క సరదాలన్నీ చంపుకుని యింటిని పోషిస్తుంటే నిస్సహాయంగా కొట్టుకుపోతుంది ఆమె ప్రాణం.
తను చదువుకుని వుద్యోగం చేస్తే సుమిత్ర పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుందనుకునేది ఈ సంబంధం కుదిరేదాకా. చదువుకుంటే మాత్రం వెంటనే వుద్యోగం దొరుకుతుందా? అప్పుడేనా అక్కేగా తనకో మార్గం చూపించాల్సింది? ఈ సంబంధం వప్పేసుకుంటే ఆమెకి ఒక బాధ్యత తీరిపోతుందని మనసుకి సర్ది చెప్పుకుంది.
“నిశ్చితార్ధానికి రమ్మని సునీతనీ మురళినీ పిలిచి వస్తాను” సుమిత్ర మంచిమూడ్‍లో వుండగా చూసి అంది రాధ. సుమిత్ర ఎదురు చెప్పలేదు. మంచిది చూసుకుని ఆవిడ బయల్దేరింది. సుమిత్ర స్టేషనుదాకా వెళ్ళి రైలెక్కించింది.
“స్వరూపకి సంబంధం కుదిరింది. నిశ్చితార్థానికి మీరూ, అమ్మాయీ రండి” అని కూతుర్నీ అల్లుణ్ణి ఆహ్వానించింది. అతను ఎలా స్పందిస్తాడోనని భయంగా వుంది. కానీ ఆవిడ వూహించినట్టుగా మురళి మొహంలో చిటపటల్లేవు. పైగా ప్రసన్నమైంది. వరుడి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. తన సంతృప్తిని వ్యక్తపరిచాడు.
కట్నం ఏమీ లేదనేసరికి సునీత అసంతృప్తిగా అంది “ఐతే తూతూ మంత్రం పెళ్ళేనన్నమాట”
రాధకి చివుక్కుమంది. “అదేమిటే అలా అంటావు? కట్నం లేదన్నమాటేగానీ పెళ్ళిమాత్రం వాళ్ళ అంతస్తుకి తగ్గట్టు ఘనంగా చెయ్యాలన్నారు. నీకైనంత ఖర్చు దానికీ ఔతుందనుకుంటోంది”
“అంత డబ్బైక్కడిది?” కుతూహలంగా అడిగింది సునీత. రాధ గతుక్కునుంది. ఇప్పుడిప్పుడే ఆవిడకి తన రెండోకూతురి గురించి అర్ధమౌతోంది.
“లోనేదో అప్లై చేసిందట. డబ్బింకా చేతికి రాలేదు. మొదట్లైతే స్నేహితులు సర్దుతున్నారు. అవసరమైతే ఇంటిమీద అప్పు తెస్తానంటోంది”” అంది. ఆవిడగొంతు జీరవోయింది. మనసు ద్వైదీభావంతో వూగిసలాడింది. ఓవైపు సుమిత్ర ఈ కుటుంబంకోసం కష్టపడుతోందని పరితపించిపోతోంది. మరోవైపు జరగాల్సినవన్నీ సవ్యంగా జరగడం లేదేమోనని ఆరాటం.
“అంతా నాటకం! దాని దగ్గర దాచుకున్న డబ్బే యీ రూపంగా బైటపెడుతోంది. డబ్బులేదంటే సంబంధం చెయ్యి జారిపోతుంది. ఏదో ఒకలా రూపనీ, తర్వాత మమతనీ పంపించేస్తే ఉన్నవన్నీ దానికే మిగులు. వుద్యోగం చాలదా?” అక్కసుగా అంది సునీత.
“చూస్తుండు. లోన్ డబ్బు రాలేదంటుంది. నీచేత సంతకాలు పెట్టించుకుని యిల్లు దానిపేర్న మార్చేసుకుంటుంది. నువ్వొట్టి తెలివితక్కువదానివి. అదెక్కడ పెట్టమంటే అక్కడల్లా సంతకాలు పెట్టెయ్యకు”
“ఆ యిల్లు అదేం చేసుకుంటుందమ్మా? మేం కట్టించే పాతికేళ్ళైంది. పిల్లర్ కనస్ట్రక్షన్ కాదు. ఉండి రిపేర్లు చేయించుకుంటున్నాం కాబట్టి ఆపాటైనా వుంది. పెద్దగా మార్కెట్టు విలువ లేదు. అమ్మితే ఆరులక్షలుకూడా రావట” అంది రాధ కాస్త విసుగ్గా.
పెళ్ళివారి వివరాలు తరచితరచి అడిగింది సునీత. వాళ్ళు బాగా వున్నవాళ్ళని తెలిసినప్పట్నుంచీ ఆమెకి ఒకటే అసూయగా వుంది. పెళ్ళికొడుకు నలుపని పదేపదే చెప్పించుకుంది. గంపెడు సంతోషాన్ని పంచుకోవాలని వెళ్ళి బుట్టెడు అసంతృప్తిని మిగుల్చుకుని వచ్చింది రాధ.
స్వరూపకి తాంబూలాలు పుచ్చుకున్నారు. ఆరోజుకి చేరేలా బయల్దేరారు సునీత, మురళి. పెళ్ళిచూపులనాడు తప్పించుకున్నా ఆరోజు మగపెళ్ళివారికి ఎదురుపడక తప్పలేదు. పెళ్ళికూతురి పెద్దక్కయ్య, పెళ్ళి చేసుకోలేదు, ఇంటిని పోషిస్తోందంటే ఏ ముప్పయ్యేళ్ళో నలభయ్యేళ్ళో వుంటాయనుకుంది దేవకి. సుమిత్రని చూసి ఆశ్చర్యపోయింది.
“నాకింకో కొడుకుంటే నిన్నూ వదిలిపెట్టేదాన్ని కాదు” అంది సుమిత్రని దగ్గరకి తీసుకుని ఆప్యాయంగా. ఆవిడ మాటలు ఆమెకి యిబ్బందిగా అనిపించి తలదించుకుంది బిడియంగా.
ఖరీదైన పట్టుచీర, జతగాజులు, రెండుపేటల గొలుసు కాబోయే కోడలికి పెట్టింది దేవకి. మొదటిచూపులోనే యింటి పరిస్థితి అర్ధమైంది. మధ్యతరగతి పైనుంచీ క్రిందికి జారుతున్న కుటుంబం! ఎలాగా కాబోయే కోడలు, నలుగుర్లో తమకే గొప్పగా వుంటుందని పెళ్ళిలో పెట్టాలనుకున్న నగల్లో ఓ వంతు యిప్పుడే పెట్టేసింది. దగ్గర్లో ముహూర్తాలేం కుదరలేదు. రెండునెలల వ్యవధిలో నిశ్చయించారు. సుమిత్ర తేలిగ్గా వూపిరి పీల్చుకుంది.
వేడుకంతా ముగిసేసరికి స్వరూప పరాయిదైపోయినట్టనిపించింది రాధమ్మకీ, సుమిత్రకీ దిగులేసింది. పగలంతా దేవకి, ఆవిడ కూతుళ్ళు వదల్లేదా అమ్మాయిని. వెళ్ళబోయేముందు భార్గవ కళ్ళు స్వరూపకోసం వెతికాయి. అది గమనించింది సుమిత్ర. తను వెళ్ళి స్వరూపని పంపించింది. పెళ్ళివారు పిలుస్తున్నారంటే ఆ పిలిచేది దేవకేనేమోననుకుని వచ్చింది స్వరూప. అక్కడ నిల్చున్న భార్గవని చూసి మొదటిసారి ఒక అనిర్వచనీయమైన భావన కలిగింది.
“ఫంక్షన్ మనిద్దరిదీ. పొద్దుటినుంచీ మనం ఏమీ మాట్లాడుకోలేదు” ఆరోపించాడతను.
చిన్నగా నవ్వింది. అతను ఏవేవో చెప్తున్నాడు. ఆమె వింటోందిగానీ మనసు ఎక్కడో వుంది.
“భార్గవేడి?” అవతలెవరో అడగడం వినిపించింది. ఊహించనంత హఠాత్తుగా స్వరూపని ముద్దుపెట్టుకున్నాడు. “థాంక్యూ” మరో ఫైయింగ్ కిస్ విసిరేస్తూ గబగబ వెళ్ళిపోయాడు. అతను తనని ముద్దు పెట్టుకున్నచోట చేత్తో మృదువుగా రాసుకుంటూ అలాగే నిలబడిపోయింది స్వరూప.
తొలిస్పర్శ! తొలిముద్దు! ఆ సాన్నిహిత్యం ఎంతో మత్తెక్కించింది. ఏవో లోకాలకి తీసుకు వెళ్తున్న భావన. కానీ కలగాల్సినంత ఆనందం మాత్రం కలగలేదు.
ఒక ఏకాంతం… కొంత సాన్నిహిత్యం. తనకీ భార్గవకీ మధ్యని ఇప్పుడున్నట్టే ఒకప్పుడు తేజాకీ సుమిత్రకీ మధ్యనీ కూడా వుండి వుంటుంది. ఎలా భరిస్తోంది సుమిత్ర అంత దుఃఖాన్ని? ఏమీ జరగనట్టు ఎలా తిరుగుతోంది? సుమిత్ర మళ్ళీ ఆరోజుల్లో నవ్వినట్టు గలగల నవ్వగలదా? తేజా ఆమెలో అన్ని శృతులు పలికించి ఎక్కడికి మాయమైపోయాడు? మర్చిపోయాడా? ఎందుకిలా జరిగింది? తండ్రి చనిపోవటంచేతేనా? అంత ఇరుకు మనసు కలవాడా అతను? ఆమెకి వుప్పెనలా దుఃఖం ముంచుకొచ్చింది. సుమిత్ర అందాల భవిష్యత్తుకి తామంతా ప్రతిబంధకమైపోయామనే బాధ, ఆమెని నిలువునా దహించేస్తోంది.
పెళ్ళివారు వెళ్ళిపోయారు. సాగనంపడానికి రాధ, సునీత వీధిదాకా వెళ్ళారు.
“అబ్బబ్బ! మీ పెళ్ళిళ్ళు కావుగానీ తల్లులూ, నా కాళ్ళు పీక్కుపోతున్నాయే” సోఫాలో అలసటగా కూలబడింది సుమిత్ర,
“వేడినీళ్ళు టబ్‍లో పోసివ్వనా?” మమత అడిగింది. అప్పుడే లోపలికొచ్చింది సునీత.
“ఆ.. ఆ.. అక్కని బాగా కాకా పట్టవే! ఇంకా నిన్ను సాగనంపాలి!” అంది. అందులో హాస్యంకన్నా అపహాస్యం ఎక్కువగా వుంది.
“అలాగేం? రాబోయే బుజ్జిబాబుకోసం నువ్వే ముందు కాకాపట్టు” మాటకి మాట అంటించింది మమత.
వచ్చి సుమిత్ర వళ్లో పడి ఏడవసాగింది స్వరూప. అంతా కంగారుపడిపోయారు. ముందుగదిలో కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తున్న మురళి పుస్తకం చేత్తో పట్టుకుని అలాగే వచ్చేసాడు.
“ఏయ్, ఏమైందే?” తన చీర కుచ్చెళ్ళలో దాచుకున్న స్వరూప మొహాన్ని బలవంతంగా ఎత్తుతూ అడిగింది సుమిత్ర, భార్గవ ఎదురుచూస్తుంటే పంపించింది తను. అతనేమైనా అన్నాడా? ఇంకా పెళ్ళే అవనిదే ఏమంటాడు? ఏం జరిగింది అసలు?
“నిండింట్లో ఏడుపెందుకమ్మా?” రాధ సునీత వెనకే వస్తూ కంగారుగా అడిగింది.
” నీ పెళ్ళైపోయాక నాన్న పోయుంటే బాగుండేది కదక్కా? తేజా మనని మర్చిపోయాడా?” ఎక్కెక్కిపడుతూ అడిగింది స్వరూప.
బలమైన కెరటం మీదికొచ్చినట్టు విహ్వలమైంది సుమిత్ర మనసు. ఆమె ముఖం రక్తం లేనట్టు పాలిపోయింది. ఆ యింట్లో తేజా గురించి ఆలోచించేది తనొక్కర్తే అనుకుంటోంది యిన్నాళ్ళూ! అతన్ని మర్చిపోనివాళ్ళు ఇంకా వున్నాన్నమాట!
“నాకిప్పుడేం తక్కువైంది రూపా? తేజా నన్ను మర్చిపోతేనేం? మీరంతా నాకు లేరా?” ఆప్యాయంగా స్వరూప జుత్తు సవరిస్తూ అడిగింది. చెదిరిన ఒక కల కన్నీటిబొట్టుగా మారి రాలి స్వరూప జుత్తులో పడి యింకిపోయింది. “
“చూడు, మొహం నిండా బొట్టు ఎలా అంటుకుందో! ఇప్పుడు ఫోటోలు తీసుకోమనాలి భార్గవని. ఫోన్ చేసి రమ్మననా?ఎంతో దూరం వెళ్ళి వుండరు” వేళాకోళంగా అడిగింది.
“శుభమాని పెళ్ళిచేసుకుంటూ ఆ యేడుపెందుకో?ఎవరి తలరాతలకి ఎవరు బాధ్యులు?” విసుక్కుంటూ భర్తని దాటుకుని వెళ్ళిపోయింది సునీత. మురళి పెదాలమీద అదోరకమైన నవ్వు కదలాడింది.
“అందర్నీ వదిలేసి నీతో ఏం రహస్యాలు మాట్లాడాడే భార్గవ?” స్వరూప యింకా ఏడుపు ఆపకపోవడంతో చెవిలో గుసగుసలాడింది సుమిత్ర. అంత యేడుపులోనూ సిగ్గుపడిపోయింది. భార్గవ స్పర్శ, అతను పెట్టిన ముద్దూ గుర్తొచ్చి ఝల్లుమంది గుండె. చప్పుని వెళ్ళిపోయింది అక్కణ్ణుంచీ.
రాధ సుమిత్రకేసి చూడలేకపోయింది. చిన్నది, రూపకున్నంత జ్ఞానంకూడా తనకి లేకపోయింది. సుమిత్ర బ్రతుకు చేజేతులారా నాశనం చేసి, పైగా అది సరిగా చెయ్యలేదు, ఇది సరిగా చెయ్యలేదని సాధిస్తోంది. ఆవిడ కళ్ళు నిండుకున్నాయి.
“ఏమిటమ్మా నువ్వూను?” సుమిత్ర విసుక్కుంది.
“అమ్మా! భోజనాలకన్నీ సిద్ధం చేసాను” మమత వంటింట్లోంచీ పిలిచింది.
అంతా భోజనాలకి లేచారు. మురళికూడా వాళ్ళతోపాటే తిన్నాడు. అంతా ఆడమళయాళం. మొదట్లో మొహమాటపడి ముందుగది వదిలి లోపలి కడుగుపెట్టేవాడు కాదు. క్రమంగా అలవాటుపడ్డాడు.
“సునీతా! మీ చెల్లెలు కాస్తంత రంగు తగ్గినట్టుంది కదూ? భార్గవ నలుపంటుకుంది మరి!”” మురళి నవ్వుతూ వేళాకోళం చేసాడు.
“నైనేతే రంగే తగ్గాను. సునీతైతే వళ్లు కూడా తగ్గింది” అంది స్వరూప.
“తప్పే!” వెంటనే మందలించింది రాధమ్మ.
“బాబోయ్! ఇదప్పుడే అతన్ని వెనకేసుకొస్తోంది” అంది సునీత.
పరిహాసాల మధ్య భోజనాలయ్యాయి. ఒక్క సుమిత్రే మౌనంగా వుంది. ఏదో తిన్నాననిపించి లేచింది. ఏ పనిలోనూ కలగజేసుకోకుండా వెళ్ళి పక్కమీద వాలిపోయింది.
“దానెదుట ఆ తేజా సంగతి ఎందుకెత్తావే? అతని ప్రసక్తి వచ్చిందంటే చాలు, వారంరోజులపాటు మామూలు మనిషవదు. ఇదెక్కడి చుట్టరికమో నాకు తెలీదు. చిన్నప్పుడెన్నో అనుకుంటాం. అవన్నీ జరుగుతాయా? ఐనా చేసుకోమని వాళ్ళేం అనలేదుకదా? ” అని యిటు రూపనీ అటు సుమిత్రనీ కలిపి సన్నసన్నగా కేకలేసింది రాధ.
కబుర్లు పూర్తయి మిగిలినవాళ్ళూ పడకలు చేరేసరికి పదకొండైంది.
“రేపు తెల్లారే ప్రయాణం” సునీత తల్లితో చెప్పింది.
“అదేమిటే, రెండురోజులైనా వుండకుండానే?” రాధ ఆశ్చర్యంగా అడిగింది. సునీతకీ వుండాలనే వుందిగానీ మురళి ఒప్పుకోలేదు. ఏ ప్రళయం సృష్టిస్తుందోనని అతని భయం.
స్వరూపచేత వాళ్ళకి బట్టలూ ఛార్జీలూ యిప్పించింది రాధ. బట్టలుమాత్రం తీసుకుని డబ్బు తిరిగిచ్చేసాడు మురళి ” వచ్చినప్పుడల్లా
బట్టలెందుకండీ? మళ్ళీసారి పెట్టద్దు. ఇంకా మమ్మల్ని పరాయివాళ్ళలా చూస్తే ఎలా? కొత్తల్లుడొస్తున్నాడు. నేనింక పాతబడ్డట్టే” నవ్వుతూ అన్నాడు.
“అదేంమాట! కూతురికీ అల్లుడికీ కాక యింకెవరికి పెట్టుకుంటాం? ఎందరు అల్లుళ్ళొచ్చినా ఎవరి గొప్పతనం వాళ్ళదే” అంది రాధ. అతనలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆవిడకెంతో సంతోషం కలిగింది. వరపూజప్పుడు దేవకి పెట్టిన చీరముందు తల్లి పెట్టిన చీర వెలవెలబోతూ కనిపించింది సునీతకి. భర్త పక్కనుండడంతో మాట్లాడకుండా తీసుకుంది.
“వెక్కిరించినట్టు ఛార్జీలివ్వకపోతే అవి కూడా బట్టలమీద వెయ్యచ్చుగా!” అని చాటుగా తల్లి దగ్గర గొణిగింది. రాధ ఏమీ అనలేదు.
తెల్లారి మూడున్నరకి ట్రెయిను.
రాధ, సునీత నిద్రలో పడ్డారు. సుమిత్ర కూడా నిద్రపోతోందనుకున్నాడు మురళి. సూర్య, సుమిత్రల గురించి అనుకుంటున్నాడతను.
మనవల్ల ఒక తప్పు జరుగుతుంది. దాన్ని సరిద్దిదడానికి రెండువైపులనించీ కొన్ని సూత్రాలుంటాయి. మనుషులనిబట్టీ సన్నివేశాలనిబట్టీ ఈ సూత్రాల విలువ మారుతుంది. ఆ సూత్రాల్లో మొదటిది జరిగిన నష్టాన్ని మనమీదికి బదలాయించుకోవటం, రెండోది అలా బదలాయించుకునే అవకాశం లేనప్పుడు దానికి ప్రత్యామ్నాయాన్ని చూపెట్టడం, మూడోది ఈరెండూ సాధ్యపడనప్పుడు మనస్పూర్తిగా క్షమని అర్థించడం… ఇది ఒక పక్షాన.
క్షమించడం, క్షమించకపోవటం అనేవి రెండో పక్షాన వుంటాయి. క్షమార్హత అవతలివైపు వుండాలి. అప్పుడొక బంధం ఏర్పడటానికి అవకాశం వుంటుంది. ఆ అర్హత లేనప్పుడు క్షమించడం అనేది బాధితుడి చేతకానితనంగా మిగిలిపోతుంది.
సుమిత్రతోపాటే సూర్యాకి కూడా అర్థమైంది మురళి విషయంలో తప్పు జరిగిందని. సుమిత్రని పలకరించి తన పరిచయం చెప్పుకుని వెళ్ళిపోయి వుంటే సరిపోయేదేమో! కానీ సునీతలాంటి అమ్మాయికి అది అర్థమవదు. జరిగినదానిగురించికాదు, ఇప్పుడు ఆలోచించవలసినది. ఒక మనిషిని గాయపరిచి వదిలేసాడు. అతడు సుమిత్రకి అతిముఖ్యుడు. చాలా సున్నితమైన విషయం ఇది.
వెంటనే మురళిని కలిసాడు.
“మీరు నన్ను క్షమించాలి తమ్ముడూ!” అడిగాడు. “జరిగినదాంట్లో సుమిత్ర తప్పేం లేదు. నీలిమ నా కజిన్, సుమిత్ర ఫ్రెండు. సునీతగారి వుత్తరాన్ని నీలిమకిచ్చి సలహా అడిగింది సుమిత్ర. అది ఆ వుత్తరాన్ని నాకు పంపి జస్ట్… వివరాలు కనుక్కు రమ్మంది. సుమిత్రకి సపోర్ట్‌గా వుండమంది. నేను… నేనే కొంచెం అత్యుత్సాహం చూపించాను” అన్నాడు.
“మీ డిపార్టుమెంటువాళ్లకి అన్నిట్లో అత్యుత్సాహమేకదా?” అన్నాడు చురుగ్గా.
“కాస్త ఇంప్రెషన్ సంపాదిద్దామని…”
అతను తనని తమ్ముడూ అనటం, ఆమె చెప్పగానే అతను రావటం, ఆమెని చూడగానే అతని కళ్ళలో కనిపించిన వెలుగు, ఆమెపట్ల అతనికి గల కన్సర్న్… అన్నీ చూస్తుంటే వాళ్ళిద్దరిమధ్యా ప్రేమలాంటిదేదైనా వుందేమో, ఇంటి బాధ్యతలకోసం పెళ్ళికి ఆగారేమో అనుకున్నాడు.
కొన్ని అనివార్యత్వాలుంటాయి. అవి జీవితంలో అవిభాజ్యభాగంగా వుండిపోతాయి.
ఐతే వాళ్ళిద్దరిమధ్యా సమీకరణం అలానే ఉండిపోలేదు. ఒకటిరెండు సందర్భాలలో సూర్య మురళికి సాయం చేసాడు. పోలీసు డిపార్టుమెంటులోని వ్యక్తి తన స్నేహపరిధిలో వుండటంలోని సౌలభ్యం మురళికి అనుభవమైంది. ఉద్దేశ్యపూర్వకంగానే తమమధ్య జరిగినది ఇద్దరూ మర్చిపోయారు.
ఇప్పుడీ తేజా ప్రస్తావన మురళికి ఆశ్చర్యం కలిగించింది. ఎవర్ని అడగాలి, తేజా గురించి? సునీతని కాదు… ఆలోచిస్తూ టీ.వీ. పెట్టుకుని క్రికెట్ మేచి చూస్తూ కూర్చున్నాడు. స్వరూప, మమత కూడా వచ్చి కూర్చున్నారు. కాసేపు కూర్చున్నాక నిద్రవస్తోందని వెళ్ళిపోయింది మమత.
“చాలా రాత్రైంది, నువ్వు కూడా వెళ్ళి పడుకో” అన్నాడు మురళి స్వరూపతో. కానీ ఆమె వెళ్ళలేదు. ఆమెకి కొన్ని సంశయాలున్నాయి. కొంత బాధ వుంది. వైరుధ్యాల మధ్య ఆమె మనసు కొట్టుకుంటోంది. ఈ పరిస్థితంతా తన పెళ్ళి కారణంగా వుత్పన్నమైనది. ఎవర్నేనా అడిగి తెలుసుకోవాలి? ఎవర్నడుగుతుంది? తల్లికి చదువు లేదు. సుమిత్ర తెలిసినా చెప్పదు. సునీత తెలివితేటలమీద ఆమెకి నమ్మకం లేదు. అందుకే మురళికోసం వచ్చి కూర్చుంది.
మేచి చాలా యింట్రెస్టింగా వుండడంతో మురళి క్రమంగా అందులో లీనమైపోయాడు. ఎప్పటికో తలతిప్పి చూస్తే యింకా కూర్చుని వున్న స్వరూప కనిపించింది. పైగా ఆమె ఆట కూడా చూడ్డం లేదు. ఏదో ఆలోచనలో నిమగ్నమై వుంది.
ఏముంటాయి ఆమెకంత ఆలోచనలు? పెద్దగా ఆలోచించేంత వయసూ లేదు. కమ్మని కలల్లో కరిగిపోవల్సిన రోజుని ఎందుకంత కలతగా వుంది? భార్గవతో మాట్లాడి వచ్చి ఏడుపు మొదలుపెట్టింది. తేజా పేరు తప్ప అక్కాచెల్లెళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో వినలేదు తను. తనతో ఏమైనా చెప్పాలని వచ్చి కూర్చుందా?
టీవీ సౌండు తగ్గిస్తూ “”స్వరూపా!” అని పిలిచాడు. సోఫామీద తలాన్చి పైకి చూస్తున్నదల్లా అతనికేసి చూసింది. ఆమె కళ్ళనిండా నీళ్ళు. చెంపలమీంచి కారుతున్నాయి. మురళి తెల్లబోయాడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.