“ఏం జరిగింది? నీకీ పెళ్ళిగానీ యిష్టంలేదా? అమ్మేనా అక్కేనా బలవంతం చేస్తే ఒప్పుకున్నావా?” ఆతృతగా అడిగాడు. లేదన్నట్టు తలూపింది. అతనికి బరువు దించుకున్నటైంది.
“మరి నీ సమస్యేమిటి? వాళ్లు వెళ్ళిపోయినప్పట్నుంచీ బాధపడుతున్నావు?”
“…”
“ఓహ్! వదిన గురించేనా నీ బాధ? తనకీ మంచి మేచి చూసి చేద్దాం. పీటలమీద ఎవరు కూర్చుందాం? మీరా మేమా?” అడిగాడు. చిన్నగా నవ్వింది స్వరూప.
“భలేవాడివి బావా! ఏడ్చేవాళ్ళని నవ్విస్తావు. అది విందంటే తంతుంది. మమ్మల్ని చిన్నపిల్లల్లా చూస్తుంది. తనమీది పెత్తనం ఎవరికీ ఇవ్వదు” అంది. అతనూ నవ్వాడు.
“నిజానికి నాకెందుకో యీవేళ సంతోషంగా లేదు. ఈ వేడుక, ఈ సరదా సంతోషాలన్నీ అక్కయ్యనుంచీ నేను దోచుకుంటున్నానేమో అనిపిస్తోంది. ఎందుకంటే…ఎందుకంటే…” మాటలు వెతుక్కుంది.
ఈ ఆడపిల్లల చేతిలో దారుణంగా ఓడిపోతున్నాడు మురళి. సుమిత్ర చేతిలో ఓటమి కొన్ని మాయామోహాలని తుంచివేసింది. సునీత చేతిలో వోటమి తన వైవాహిక జీవితపు ట్రాక్‍ని మార్చేసింది. ఇప్పుడీ స్వరూప ఏం చెయ్యనుందో?
“…ఎందుకంటే… వాళ్ళు అక్కయ్యని చూసుంటే తననే ప్రిఫర్ చేసేవారు. నాకన్నా అక్కయ్య బావుంటుంది. అతని ఏజికి సరిపోతుంది” స్వరూప ఆగింది. ఆమె పడుతున్న సంఘర్షణ అర్ధమైంది మురళికి.
“పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి స్వరూపా! నీ కళ్ళతో చూస్తే మీ అక్కయ్య అందంగా వుండచ్చు. భార్గవ కళ్ళకి మాత్రం నువ్వే అందంగా అనిపించి వుంటావు. చూసే మనసునీ, మనిషినీ బట్టి వుంటుంది ఎదుటివారి అందం. అతను నిన్ను చూసుకోవడానికొచ్చాడు, చూసాడు, నచ్చావు. అంతే. అదొక కమిట్‍మెంటు” అన్నాడు.
“పోనీ యిది చెప్పండి. నా పెళ్ళికోసం లోన్ తీసుకుంటుందట. ఆ డబ్బు రాకపోతే యింటిమీద అప్పుతెస్తానంటోంది. ఇంత ఖర్చుపెట్టి యిప్పుడీ పెళ్ళి అంత అవసరమంటావా?”
“నీ ప్రశ్న చిక్కుముడిలాంటిది. పెళ్ళి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సంభవించక మానదు. ఆ ఎప్పుడో యిప్పుడే ఎందుకు కాకూడదని సుమిత్ర ప్రశ్న. ఇక ఖర్చు విషయం. డబ్బనే దాన్ని సృష్టించుకున్నది మనమే కాబట్టి ఖర్చుపెట్టుకుని దాన్ని చలామణీ చెయ్యాల్సిందీ మనమే. అంటే సప్లైకోసం డిమాండుని సృష్టించడమన్నమాట”
“నువ్వేమీ అనుకోనంటే ఒక ప్రశ్న”
“ఏమిటది?”
“బాధపడకూడదు. మనసులో అసలే పెట్టుకోకూడదు” నొక్కి చెప్పింది స్వరూప.
“ప్రామిస్” మురళి నవ్వాడు.
ఐనా చెప్పడానికి ఇంకా సంకోచం. బైకు గురించి సునీత చేసిన గొడవ తెలిసి తన మనసులో అనుకుంటున్నది ఇతనితో చెప్పవచ్చునా అన్న సంకోచం అది. కానీ సుమిత్రలాగే ఆమెకీ అతని సంస్కారంమీద నమ్మకం వుందిగాబట్టి అతి ప్రయత్నంమీద ఆ సంకోచాన్ని అధిగమించింది.
“మీ పెళ్ళికేగానీ నా పెళ్ళికేగానీ మొత్తం బాధ్యత సుమిత్ర తీసుకుంది. అవసరమైనంత అప్పుడు ఖర్చుపెట్టింది. ఇప్పుడు పెట్టబోతోంది. ఇంకో రెండేళ్ళో మూడేళ్ళో పోతే అలాగే ఖర్చుచేసి మమతకీ పెళ్ళిచేసి పంపిస్తుంది. కానీ తన బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇవన్నీ అయ్యేసరికి తనకి ముఫ్ఫైలు దాటుతాయి. తన స్థానంలో ఒక మగవాడుంటే అసలిలాంటి పరిస్థితిగానీ చర్చగానీ వచ్చేది కాదు. అతని అప్పులూ బాధ్యతలతో సహా ఆడపిల్ల అతన్ని స్వీకరించేది”
“నిజమే!” వప్పుకున్నాడతను. కానీ ఆమె ఏం చెప్పబోతోందో అర్ధమవలేదు.
“మా అందరి అవసరాలూ చూసి అమ్మ గురించి ఆలోచించి తన పెళ్ళికి కూడా తనే దాచుకోవాలి. ఎంత అన్యాయమో చూడండి. అందుకే నాకనిపిస్తుంటుంది. తన పెళ్ళయ్యాక నాన్న పోయి వుంటే బావుండేదని”
“అప్పుడు సుమిత్ర స్థానంలో సునీత వుండేది…”
“కావచ్చు. కానీ సునీత సుమిత్రలా కాదు. మమ్మల్ని చూసే విధానం వేరుగా వుండేది. సునీత తనగురించి తను ఆలోచించుకునేది. మాగురించి మేం చూసుకుంటే సరిపోయేది” స్వరూప గొంతు వణికింది.
ఎవరి సుఖాలు వాళ్ళవే. ఎవరి బతుకులు వాళ్ళవే. ఆడపిల్లలు అక్కచెల్లెళ్ళుగా కలిసి ఒకింట్లో వుండేది వాళ్ళ జీవితకాలంతో పోలిస్తే చాలా తక్కువ. ఐనా అనుబంధాలూ, త్యాగాలూ… అతని మనసు ఆర్ద్రమైంది. సునీత సుమిత్ర గురించీ ఎలా ఆలోచించాలని తను ఆశిస్తాడో రూప సరిగ్గా అలాగే ఆలోచిస్తోంది. ఈ అమ్మాయి భార్గవ గురించీ అలాగే ఆలోచించగలదు. అతన్ని ప్రేమించి అతని ప్రేమనీ పొందగలదు. తను సంతోషంగా వుండి అతన్నీ వుంచగలదు.
“నీ మనసులో ఏముందో చెప్పు రూపా! సుమిత్రకి ఇప్పుడేం తక్కువని? బాధ్యతలు తీరగానే తనూ పెళ్ళి చేసుకుంటుంది. సెటిలౌతుంది. పరిస్థితులు ఇలా వున్నప్పుడు మిమ్మల్నందర్నీ వదిలేసి తన దోవని తను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోలేదు కదా? ఐనా ముప్ఫైల్లో పెళ్ళి చేసుకోవటం వుద్యోగాలు చేసే ఆడవాళ్ళలో సాధారణమే”
“అదంతా అందరి విషయం బావా! నేను చెప్పేది సుమిత్రగురించీ. తనకి మాఇంట్లో చాలా అన్యాయం జరిగింది. ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు. కనీసం గుర్తుచేసుకోవటానికి కూడా ఇష్టపడటం లేదు”
“…”
“తన జీవితంలో తేజా అనే వ్యక్తి వున్నాడు బావా! చాలా చిన్నవయసులోనే దానికి ఎన్నో ఆశలు కల్పించి ఇప్పుడు ఎవరికి వాళ్ళు మౌనం వహించి కూర్చుంటున్నారు. సుమిత్ర కూడా అతను గుర్తొస్తే గదిలో తలుపులు మూసుకుని ఏడుస్తుంది తప్పిస్తే ఎవరికీ ఆ బాధని చెప్పదు”
చకితుడయాడు మురళి. ఇందాకా స్వరూప సుమిత్ర వళ్ళో పడి ఏడ్చినప్పుడు ఆపేరు అస్పష్టంగా వినిపించింది.
“ఎవరతను? సుమిత్ర సూర్యాని చేసుకుంటుందనుకున్నాను. మళ్ళీ ఇతనెవరు?” అడిగాడు.
“సుమిత్రా?!! సూర్యానా? సాధ్యపడదేమో!”
“అతనికి తనంటే ఇష్టంట”
“?!!”
“…”
“మా పక్క ఇల్లే తేజావాళ్లది. మా నాన్నదీ వాళ్ళ నాన్నదీ ఒకే డిపార్టుమెంటు. స్నేహం కూడా వుండేది. వాళ్ళూ మేమూ ఒక ఫ్లాటు తీసుకుని చెరిసగం చేసుకుని ఇల్లు కట్టుకున్నాము. తర్వాత వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోయారు. వాళ్ళింట్లో తేజా, ఇంకో అబ్బాయి. మా ఇంట్లో మేం నలుగురం. అంతా కలిసి ఆడుకునే వాళ్ళం. చదువుకునేవాళ్ళం. అతను మా అందరికన్నా పెద్ద. సుమిత్రకన్నా బహుశః మూడు, నాలుగేళ్లు పెద్దేమో. సుమిత్రమీద ప్రత్యేకమైన ఇష్టం చూపించేవాడు. సుమిత్ర కూడా అంతే. ఇద్దర్నీ అసలు విడివిడిగా ఎప్పుడూ చూడలేదంటే అతిశయోక్తి కాదు. సుమిత్ర ఇంటరు పాసయ్యేక తేజాకి తనని చేసుకుని స్నేహాన్ని చుట్టరికంగా మార్చుకుంటే బావుంటుందన్న ప్రతిపాదన రెండువైపులనుంచీ వచ్చింది. అప్పటికి అతను డిగ్రీ చేసాడు. ఏదో ఒక వుద్యోగం వస్తుందని అందరూ అనుకున్నారు. అప్పటికే రెండుసార్లు మెడికల్ ఎంట్రెన్స్ రాసిన అతను ఆఖరి ప్రయత్నంగా మరోసారి రాసాడు. సీట్ వచ్చింది. అతని చదువయ్యేదాకా వీళ్ళ పెళ్ళి వాయిదా వేసారు. ఇంతలో నాన్న పోవటం, సుమిత్రమీద ఇంటి బాధ్యతలు పడటం జరిగాయి. అదే సమయానికి తేజావాళ్ళ నాన్న ప్రమోషన్‍మీద వేరే వూరు వెళ్ళిపోయారు” స్వరూప ఆగింది. తర్వాత ఎలా చెప్పాలో తెలీలేదు.
“…”
“వాళ్ళిద్దరి మధ్యా కూడా కొన్ని ఏకాంతాలున్నాయి. ఆ సమయాల్లో వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకున్నారో తెలీదు. వాళ్ళు వైజాగ్ వెళ్ళాక ఇద్దరూ కొన్నాళ్ళు వుత్తరాలు రాసుకునేవారు. తరువాత పోస్ట్‌మేన్ మాయింటికి రావటం ఆగిపోయింది. ఈమెయిల్, ఫోన్ దేంట్లోనూ కాంటాక్ట్‌లో లేడు. అతను ఈ ఇన్నేళ్ళలో ఒక్కసారికూడా అతను సుమిత్రని కలవలేదు. ఇవన్నీ నాకెలా తెలుసని నువ్వు అడగవచ్చు. సుమిత్ర మొహంలో చదువుతాను. అది రోజురోజుకీ దిగులుగా సర్వం కోల్పోయినట్టు తయారౌతోంది. మనసులోని వెతుకులాట కళ్లలో కనిపిస్తోంది”
“…”
“బావా! ఇలా చెప్పడానికి నాకేం సిగ్గనిపించడం లేదు. అమ్మ సుమిత్రకి పెళ్ళి చెయ్యదు. అమ్మలో ఆ ఆలోచనే లేదు. మమత పెళ్ళయేసరికి అమ్మ పెద్దదౌతుంది. ఆవిడ వంటరిగా బతకలేదు. అందుకే పెళ్ళికోసం సుమిత్రని వత్తిడి చెయ్యదు. కోప్పడదు. తేజా అనే ఆశని అలాగే నిలబెడుతోంది. కొవ్వొత్తిలా కాలి సుమిత్ర మా కుటుంబానికి వెలుగునివ్వాలనుకుంటోంది ఆవిడ. చివరిదాకా ఆవిడని చూసుకోవాలనుకుంటోంది. సుమిత్రకీ తేజాకీ మధ్యని గడ్డకట్టిన మౌనాన్ని పగలగొట్టే ప్రయత్నం ఎవరేనా చెయ్యాలి బావా! అసలేం జరిగిందో తెలిస్తే ఏం చెయ్యాలో ఆలోచించ వచ్చు” అంది చివరికి.
“అతన్ని నేను కలుస్తాను. కలిసి మాట్లాడతాను” అన్నాడు మురళి. స్వరూప ముఖం వికసించింది.
“నాన్న పోవటం మా ఇంట్లో పెద్ద దుఃఖమే. దాని పరిణామాలని సుమిత్ర ఒక్కదానిమీదా రుద్ది మాకు మేం అందులోంచీ బైటపడి సుఖంగా వుండటమనేది నా మనసు వప్పని విషయం. సునీతది పరిక్వత చెందని మనస్తత్వం. చిన్నపిల్లలా అన్నీ తనకే కావాలని ఆశపడుతుంది. చిన్నప్పట్నుంచీ అంతే. చెడ్డది కాదు. పెళ్ళైనందుకు కొత్తగా ఏదో స్టేటస్ వచ్చిపడిందనుకుంటోంది. మమత ఇంకా చిన్నది. సుమిత్ర ఇలాగే మిగిలిపోతే మమ్మల్ని మేం క్షమించుకోలేనిరోజు ఒకటి తప్పకుండా వస్తుంది” అంది.
మురళి ఆ అమ్మాయిని తదేకంగా చూసాడు. ఎంత స్పష్టంగా చెప్పింది! సునీతలో పరిక్వత లేకపోవటాన్ని గురించి అందంగా చెప్పింది. అతని
మనసు సునీత పట్ల కూడా ప్రసన్నమైంది. మనసు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటులాంటిది. ఏ తీగ మీటితే.. ఏ మీట నొక్కితే ఆ రాగాన్ని పలికిస్తుంది. సునీత రాసిన వుత్తరం చూసి సుమిత్ర హైరానాపడుతూ వచ్చింది. ఇంత జరిగాక కూడా సునీతది పసిమనస్తత్వమని సమర్థిస్తూ చెప్తోంది స్వరూప. వీళ్ళు సునీతపట్ల చూపిస్తున్న క్షమ, ఆమెకూడా తమలో ఒకరనే భావం అతని మనసుని రంజింపజేసాయి. ఇవన్నీ ఇలాగే నిలవాలంటే ఎవరికీ తిరిగి తీసుకోలేనంత డేమేజీ జరగకూడదు. సునీతని దూరంపెట్టడం కాదు, ఆమెకి ప్రపంచజ్ఞానం నేర్పాలి!
“భార్గవకి ఇవన్నీ అర్థమౌతాయని నేననుకోను. అతను కలల రాకుమారుడు. కదిపితే కలలు రాలుతూ వుంటాయి. జీతాన్ని నచ్చినట్టు ఖర్చుపెట్టుకోగలిగే స్వతంత్రం వుంది. బైకులు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, గేమ్స్… ఇవే అతని ప్రపంచం. స్నేహితులు లేరట. నేను ఆ స్థానంలోకి వెళ్తాను. తల్లిదండ్రులకీ ముగ్గురక్కలకీ అతనంటే ప్రాణం. ఆ యిష్టాన్ని నామీద కూడా చూపించగల మనుషులేగానీ, ఇక్కడి సమస్యలు వాళ్ళకి అవసరం లేనివి”
“బాధ్యతలు లేని మనిషి ఎలా వుంటాడో అలా వుంటాడు భార్గవ. అందులో వింతేం లేదు. ఇక్కడి సమస్యలకి అతని బాధ్యత లేదు. ఇక్కడి విషయాలు ఇక్కడ వదిలెయ్యటం మంచిది స్వరూపా… కనీసం కొన్నాళ్ళు”
“పెళ్ళిచూపులయ్యాక మేమిద్దరం కలుసుకుని మాట్లాడుకున్నాం బావా! కప్పు కాఫీకి అతను ఇరవైరూపాయలు ఇచ్చాడు. నాకు అప్పుడు అర్థమైంది, జీవితం పట్ల మా యిద్దరి దృక్కోణాలు వేరేగా వుంటాయని”
“సహజమేగా?” నవ్వాడు మురళి. “సంతోషంగా వుండు స్వరూపా! సుమిత్రగురించి బెంగ పెట్టుకోకు. తేజా గురించి తెలుసుకుంటాను. వాళ్ళు కాదన్నా, సూర్య వున్నాడు. అన్నీ సవ్యంగా జరుగుతాయి” అన్నాడు. అన్నాడేగానీ అతనికి స్వరూప భయాల లోతు తెలుసు. అతనికి తెలుసని ఆమెకీ తెలుసు.
“గుడ్‍నైట్ బావా!” స్వరూప వెళ్ళిపోయింది.
“ఇద్దరూ కలిసి రూప గొంతు కోస్తున్నారు” రైల్లో అంది సునీత.
“ఇప్పుడేమైంది?” ప్రసన్నంగానే అడిగాడు మురళి.
“అతనంత నలుపా? వయసులో కూడా బాగా తేడా వుంది. అతని వుద్యోగం, ఆస్తి చూపించి దాన్ని మభ్యపెట్టారు. కాకిముక్కుకి దొండపండులా వుంటుంది వాళ్ల కాంబినేషన్” అంది. చెల్లెల్నీ కాబోయే మరిదినీ తూస్తున్న తూకం ఒకసారి అటూ మరోసారి యిటూ మొగ్గుతోంది. మంచి సంబంధం, సుఖపడుతుంది… అతను బాలేడు, బాధపడుతోందేమో! ఆ ద్వైదీభావం నిలవనివ్వటంలేదు.
మనుషుల్ని ప్రేమించడం స్వరూపకి తెలిసినంతగా సునీతకి తెలియదనిపించింది మురళికి. స్వరూప ముందర సుమిత్రని ప్రేమించింది. సుమిత్రకోసమే కావచ్చు, భార్గవమీద ఇష్టాన్ని పుట్టించుకుంది. సునీత తనని తను ప్రేమించుకునే వ్యక్తి. అదే కదా, అపరిపక్వత అంటే? తనని తను ప్రేమించడానికీ జీవితాన్ని ప్రేమించడానికీ చాలా తేడా వుంది. తనని తను ప్రేమించుకోవటానికి ఒక్కోసారి చాలా కోల్పోవలసి వుంటుంది. జీవితాన్ని ప్రేమించినప్పుడు త్యాగం, సర్దుబాటూ తప్పనిసరి. వాటికి బదలాయింపుగా అందమైన అనుబంధాలుంటాయి.
“రాత్రి అంతసేపు మీతో ఏం మాట్లాడింది?” కుతూహలంగా
“తేజా ఎవరు?” ఆమె కోణంలోంచీ అతన్ని పరిచయం చేసుకోవాలని అడిగాడు.
“మాకు తెలిసినవాళ్లబ్బాయి. సుమిత్రని అతనికిద్దామని అనుకున్నారు. ఇంతలో నాన్న పోయారు. కొన్నాళ్లు ఉత్తరాలు రాసేవాడు. ఫోన్ చేసేవాడు. తర్వాత మాట్లాడకుండా వుండిపోయాడు. నాన్న పోయినప్పటికి మెడిసిన్ చదువుతుండేవాడు. ఇప్పటికే చదువైపోయి వుంటుంది. ఇప్పుడింక సుమిత్రని ఎందుకు చేసుకుంటాడు? ఇంకే డాక్టర్నో చేసుకునివుంటాడు. ఇది మాత్రం అతన్ని మర్చిపోలేకపోతోంది. ఒకవేళ అతను పెళ్లి కాకుండానే వున్నా ఇంక ఇప్పుడెలా కుదురుతుంది?” అంది.
“ఏం? ఎందుకు కుదరదు?”
“నాన్నకి వచ్చిన డబ్బంతా ఎలా తగలేసారో తగలేసారు. రూప పెళ్లికి అప్పు చేస్తుందట. అని తీరేసరికి మమత తయారౌతుంది. ఇవి కాక డెలివరీలూ, ఫంక్షన్లూ. మన దగ్గిర వేసిన వేషాలు వాళ్ల దగ్గర వేస్తే చెప్పు తీసుకుని తంతారు. అదీకాక పెళ్లి చేసుకుని తన తోవని తను వెళ్లిపోతే అమ్మనెవరు చూస్తారు? మాకింక పుట్టింటి ఆశ వుండదా?”
సునీత సుమిత్రలా కాదు, మమ్మల్ని చూసే విధానం వేరుగా వుండేది… రాత్రి స్వరూప తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి మురళికి. అలా జరిగితే ఏం చేసేదో సునీత? మీ కర్మమీదని తన దారిన తను పెళ్లి చేసుకుని వెళ్లిపోయేదేమో! అప్పుడూ తననే చేసుకునేదా? నవ్వొచ్చింది అతనికి. తనకి ఇంకొంచెం స్ట్రగుల్ వుండేది!
“రూప పెళ్లికైతే వప్పుకుంది, నిశ్చితార్థంకూడా అయిందిగానీ నాకేమిటో తప్పు చేస్తున్నట్టుగా వుంది. వాళ్ల బతుకులు వాళ్లని బతకనివ్వకుండా నా పెత్తనాన్ని రుద్దుతున్నాననిపిస్తోంది. సునీతకి చాలీచాలని సంబంధం చేశాను. చిన్నప్పట్నుంచీ దానికి ఆశలూ కోరికలూ ఎక్కువ. దీనికి ఇలా… నాన్న వీళ్లకోసం ఇంకే త్యాగాలు చేసి ఇంకెంత మంచిగా చూసేవారో నా వూహకి అందటం లేదు. ఏం చెయ్యను? ప్రతీదీ లక్షలతో ముడిపడి వుంది. చదివించాలన్నా, ఇంకా మంచి సంబంధం తేవాలన్నా…”” కళ్లలో నీళ్లు తిరుగుతుండగా అంది సుమిత్ర.
“చెల్లెళ్లంటే ఎంత ప్రేమ నీకు?” ఆప్యాయంగా అంది నీలిమ. “నాకు తెలిసి డబ్బుది జీవితంలో బలమైన పాత్రే, కాదనను. కానీ జీవితాన్ని డబ్బుతో కొలవడంకన్నా అదృష్టంతో కొలిస్తే మనశ్శాంతి వుంటుంది. మీ నాన్న వున్నా, తన కూతుళ్లు ఏ రాజమహల్లోనో పుట్టి వుంటే రాణివాసపు సుఖాలు అనుభవిస్తూ వుండేవారని బాధపడేవారు తప్ప నీకన్నా ఎక్కువగా ఏదీ చేసేవారు కాదు” అంది.
సుమిత్ర బలవంతంగా నవ్వింది. “
“రూపకి చేసేసి నువ్వూ చేసుకోకూడదూ?”” కొద్దిసేపటి తర్వాత అడిగింది నీలిమ.
“పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి నాకు లేదు. నేను చేసుకోకపోవడంవలన ఎవరికీ నష్టం కూడా లేదు. ఇలా వుండకూడదా, ప్రశాంతంగా?”
“సూర్యమీద నీ అభిప్రాయం ఏమిటి?”
“అతనిమీద నాకు అభిప్రాయం ఎందుకుంటుంది? మా ఇద్దరికీ వున్న చనువెంత?””
“డొంకతిరుగుడు సమాధానాలొద్దు. వాడికి నువ్వంటే ఇష్టమని ఇదివరకూ ఒకసారి చెప్పాను””
“నా సమాధానం ఇప్పుడూ అదే” స్థిరంగా వుంది సుమిత్ర జవాబు. ఆమె మనసు గెలుచుకోవలసిన బాధ్యత సూర్యదేనని అర్ధమైంది నీలిమకి.
“నీ ఫ్రెండు అంత డల్‍గా వుంటోందెందుకు?”” అడిగాడు సూర్య. వెయ్యికళ్లతో గమనిస్తాడు సుమిత్రని. లీవుమీద వున్నాడు. రోజుమొత్తంలో ఎక్కడో ఒకచోట ఆమెని చూస్తాడు.
“ఇంకో చెల్లెలి పెళ్లి చేస్తోంది. ఆ టెన్షన్లో వుంది. నీకింకా తనమీద ఆశ వుందా? పెళ్లే చేసుకోదట””
“ఆ అమ్మాయి తేజా జ్ఞాపకాల్లోంచి బైటికి వచ్చేదాకా అంతే.”
“తేజా ఎవరు?ఇంతకు ముందుకూడా అన్నావు” నీలిమకి జవాబు చెప్పలేదతను. చెప్పాలనిపించలేదు. చెల్లెలి పెళ్లి టెన్షన్లో సుమిత్ర డల్‍గా వుందనేది అతనికి నమ్మకం కలిగించలేదు. తేజా విషయంలో ఆమె స్టేషన్లో అన్న మాటలు మర్చిపోలేదతను. అవి అతన్ని వెంటాడుతూనే వున్నాయి. గుడ్డిగా ప్రేమిస్తోంది తేజాని. ఒక ట్రాన్స్‌లో వున్నట్టుగా వుంది. అందులోంచి బైటికి ఎలా వస్తుంది? కణతలు రుద్దుకున్నాడు.
“ఇదెక్కడి ప్రేమ సూర్యా? ఒకళ్లకేమో అసలు పెళ్ళి చేసుకోవాలన్న ఆసక్తే లేదు. ఇంకొకరేమో కణతలు నొక్కుకుంటూ మరీ ప్రేమని ప్రకటిస్తున్నారు. ఇలాంటి ప్రేమని నేనెక్కడా చూడలేదు” అని నవ్వింది నీలిమ. అతను నవ్వలేదు. కానీ ఆ క్షణాన్నే అతను గట్టి నిర్ణయం తీసుకున్నాడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.
Im excited to discover this web site. I need to to thank you for ones time for this wonderful read!! I definitely savored every bit of it and I have you bookmarked to look at new information in your web site.