ప్రియా by Thulasi Bhanu

ఆనంద్, శ్యామల తల్లీకొడుకులైనా స్నేహితులుగాకూడా ఒకరిని ఒకరు బాగా అర్ధం చేసుకోగలరు. శ్యామలావాళ్ళది ప్రేమవివాహం అనే కారణంతో బంధువులు అందరూ దూరం అయ్యారు.
పాతికేళ్ళ ముందు, నందూకి మూడేళ్ళ వయసు ఉన్నప్పుడు శ్యామలకు భర్త పోయాడు. ఐనా నందూని జాగ్రత్తగా పెంచింది. ఏనాడూ నిరాశగా కుంగిపోకుండా తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ కొడుకునికూడా ఆత్మవిశ్వాసం కలిగి ఉండేలా తయారుచేసింది.
ప్రతీ పండుగకీ, తమ ఇద్దరి పుట్టినరోజులు వచ్చినప్పుడూ మదర్‍హోంకి వెళ్ళేవారు తల్లీకొడుకులు. అక్కడ అనాధపిల్లల్ని సంతోషపెడుతూ, తామూ ఆనందం పొందేవారు. వారితోనే భోజనాలు చేసేవారు.
“మనకి బంధువులు లేరు, వారికీ ఎవ్వరూ లేరు. వారికి మనం బంధువులం, వారు మనకి బంధువులు నందూ!” అని కొడుకుకి చెప్పేది.
తనని నందూ అని ప్రేమగా శ్యామల పిలిచేదని ఆనంద్‍కూడా ఎవరికి అయినా తన పేరు నందు అనే పరిచయం చేసుకునేవాడు.
హోంలో ప్రియ అనే ఒక అమ్మాయిని ఎన్‍జివోవాళ్ళు చేర్పించారు. ఆమె మనసు కుదురుగా లేనట్టు మౌనంగా, దిగులుగా ఉండేది. ఎవ్వరితో కలిసేది కాదు. ఎవ్వరితో మాట్లాడకుండా గాలిలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉండేది.
శ్యామల, నందు హోమ్‍కి వెళ్ళినప్పుడల్లా అందరితోపాటూ ప్రియని హుషారుచెయ్యాలని చూసారు.
“నాకు ఎవరూ లేరు, నాకు ఎవరూ వద్దు” అనే మాట చెపుతూ ఉంటుంది ప్రియ. ఆమాట తప్ప వేరేమాటే మాట్లాడదామె.
గుండెపోటుతో ఉన్నట్టుండి శ్యామల దూరం అయ్యింది నందూకి. తట్టుకోలేక కుప్పకూలిపోయాడు నందూ.
ఇంట్లోనే ఒంటరిగా కూర్చునేవాడు. తిండిమీద ధ్యాస లేదు. ఉద్యోగానికికూడా సరిగ్గా వెళ్ళడు. ఒకప్పుడు మంచినేర్పుతో సంస్థకు లాభాలు వచ్చేందుకు ఎంతో కష్టపడ్డాడని ఉద్యోగంలోంచి తీసెయ్యలేదు సంస్ధవాళ్ళు.
ఆరోజు ఉదయం డోర్‍బెల్ మోగింది. పదిసార్లు బెల్ మోగాకకానీ తలుపుతియ్యలేదు నందు.
తలుపుకి ఎదురుగా ప్రసాద్ వున్నాడు. ఆయన మదర్‍హోం నడిపే ఆయన.
“నందూ! అమ్మ పుట్టినరోజుకదా ఈరోజు? అమ్మకోసం ఇవాళ హోంకి వచ్చి నీ చేత్తో అందరికీ అన్నం పెట్టు. పద పదా!” అన్నాడు ప్రసాద్.
నందూకి దిగులుగా ఉంది, ఏపనీ చెయ్యాలనికూడా లేదు. కానీ అమ్మకోసం అని తనని తాను కూడదీసుకుని హోంకి వెళ్ళాడు. ఎప్పట్లానే ప్రియ ఒకచోట గోడకి తల ఆనించి నీరసంగా కూర్చుని ఉంది. నందు ఆమె దగ్గరకి వెళ్ళి కూర్చున్నాడు.
“ప్రియా! అమ్మ లేదిప్పుడు నాకు. నన్ను వదిలేసి అమ్మ వెళ్ళిపోయింది. ఎవ్వరూ నాకు లేరు అని నువ్వు పడే బాధ ఏంటో ఇప్పుడు నాకూ తెలుస్తోంది” అన్నాడు.
అది విని ప్రియ ఒకసారి అతనివైపు చూసిందికానీ ఏమీ మాట్లాడలేదు. అన్నం తినేటప్పుడు అందరికీ శ్యామల గుర్తొచ్చి దిగులువేసింది. ప్రసాద్ పెద్దరికంగా అందరికీ ధైర్యం చెప్పాడు. ఎప్పట్లానే అన్నం సరిగ్గా తినలేదు ప్రియ. ఐస్‍క్రీమ్‍మాత్రం ఇష్టంగా తింటోంది. ఒక కప్పు తినేసి ఇంకోకప్పు తనే స్వయంగా తీసుకుని తింది. అది గమనించాడు నందు.
తర్వాత తర్వాత ప్రతీ శనిఆదివారాల్లో ఐస్‍క్రీమ్‍కప్పులు తీసుకెళ్ళి అందరికీ తలా ఒకటి పంచి ప్రియకి రెండుమూడు కప్పులు ఇచ్చేవాడు.
ప్రియకి అవసరమైనవి హోంలో ఆయాలను అడిగి కనుక్కుని అన్నీ సమకూర్చేవాడు. కనీసం ప్రియ అందరిలా మామూలుగా తిరిగితే చాలు అని బాగాప్రయత్నిస్తున్నాడు. తనకి ఇయర్‍ఫోన్స్ పెట్టి మంచిమంచి పాటలు వినిపించేవాడు. మొదట్లో వినను అని తల పక్కకు తిప్పేసేది “ఇదొక్క పాట విను ప్రియా! మా అమ్మకి ఇష్టమైన పాట” అని చెప్పేవాడు.
ఇష్టం లేనట్టే వినేది. కానీ నెమ్మదినెమ్మదిగా పాటలు అలవాటయ్యాయి. నందూతో కబుర్లు చెప్పటం నెమ్మదిగా అలవాటయింది ఆమెకి.
నందు ఒక అమ్మలా ఓపికగా ప్రియ మాటలన్నీ వినేవాడు. సంబంధంలేని మాటలు చెప్పేది. ఒక విషయం చెబుతూ వేరే విషయంలోకి మారిపోయేది. వినగావినగా ఆమె మాటలు అర్ధం అవుతున్నాయి అతనికి.
తను అమ్మానాన్నతో చిన్నప్పుడు చూసినవి, వాళ్ళతో గడిపినవి అన్నీ చెప్పేది. తన అమ్మ తనకోసం చేసేవి ఏవి ఇష్టమో ప్రియ చెప్పేది. అవి నందు ప్రియకోసం చేసేందుకు ప్రయత్నించేవాడు. పెద్ద టెడ్డీబేర్‍బొమ్మ, ఇష్టమైన గాజులు, కాళ్ళకు మువ్వలపట్టీలు అన్నీ తెచ్చి ఇచ్చేవాడు. చివరికి ప్రియ తల్లి మువ్వలపట్టీలు వేసుకుని తిరిగితే ఆ శబ్దం తనకి ఇష్టం అని ప్రియ చెబితే పట్టీలు కాళ్ళకి పెట్టుకోవాలని చూసాడు. అతని కాళ్ళకు చిన్నవి అయ్యాయి. వాటికి దారం కట్టి కాళ్ళకు చుట్టుకుని అటూ ఇటూ నడిచాడు. ఆ మువ్వల శబ్దం విని ప్రియ కళ్ళు మూసుకుంది. కాసేపు శ్రద్ధగా విని గట్టిగా ఏడ్చేసింది. అదిచూసి నందూ తల్లడిల్లిపోయాడు.
“ప్రియా ఏమైందిరా? ఎందుకు అంత బాధపడుతున్నావు? నేను చూడలేకపోతున్నా. ఏడవకమ్మా!” అని చంటిబిడ్డను తల్లి సముదాయించినట్టు ప్రియను ఊరుకోబెట్టాడు.
ఆమెలో మార్పొచ్చింది. ఇన్నాళ్లూ గుండెల్లో గూడుకట్టి రాయిగా మార్చేసిన బాధ ప్రియ కన్నీళ్ళల్లో కరిగిపోయినట్టుంది, కొంచెం మామూలు అమ్మాయిలా మాట్లాడుతోంది. హోంలో చిన్నపిల్లలని దగ్గర కూర్చోబెట్టుకుని చదువులో సాయం చేస్తోంది. చాలా పనుల్లో నేర్పు ఉంది ఆమెకి. అన్నీ ఒకటొకటిగా ఆచరణలో పెడుతోంది. హోంలో పనులు చాలావరకు తానే సమర్ధతగా చూసుకుంటోంది. నందు వస్తేమాత్రం అతనిదగ్గర చిన్నపిల్లలా అల్లరిచేస్తుంది, మొండిచేస్తుంది, నాకు అది తే ఫో, ఇది తే ఫో అని గారాలు పోతుంది. హోంలోవాళ్ళకి నందూ ఒక తల్లిలా ప్రియను చూసుకుంటున్నాడని అర్ధం అయ్యింది.
తల్లి పోయిన బాధను నందూ తన తల్లి తనకు అందించే ప్రేమలా మార్చుకుని, ఆ తల్లిప్రేమను ప్రియకు అందిస్తూ తన బాధకు పరిష్కారం వెతుక్కున్నాడు. ప్రియను మానసికసంఘర్షణనుంచీ తప్పించి, మామూలుమనిషిని చెయ్యాలనుకున్నాడు.
ఎప్పటికి అయినా బాధకు మందు ప్రేమ.
బాధకు ఉపశమనం, అర్ధంచేసుకోగల ఒక హృదయం.
కొన్నేళ్ళకు ప్రియ నందూని పెళ్ళిచేసుకుంది. ఆమె నందూని, ఇంటిని ఒకవైపు చూసుకుంటూ మరోవైపు ఎక్కువభాగం హోంకోసమే ఆలోచిస్తూవుంటే నందూ తనజీతంలో ఎక్కువభాగం హోంకోసం ఖర్చు పెడతాడు. ప్రియ హోంకి సంరక్షకురాలిగా ఎక్కువశాతం బాధ్యతలు తానే భుజాన వేసుకుని పిల్లలను మంచిగా చూసుకుంటుంది.
మానసికబాధ అనే కష్టాన్ని ఎదుర్కోవాలంటే, ఒకటే మార్గం- మరొకరి కష్టానికి ఉపశమనం ఆలోచించగలగడం. వారికష్టం తీరుస్తూ మన కష్టంకూడా తీరే దారి తెలుసుకోవచ్చు. పరిష్కారం చేసుకోవచ్చు అనేది ఇద్దరికీ బాగా అర్థమైంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *