మనుషులు వస్తుంటారు, వెళ్తుంటారు. నేను మాత్రం నిరంతర వాహినిని– అని పిల్లకాలువచేత చెప్పించాడొక ఆంగ్ల మహాకవి. ఈ పరంపరలో అశాశ్వతమైనవి ఎన్నో వున్నాయి. వాటిలోకి ప్రేయసి అందంకూడా వచ్చి చేరుతుందని శ్రీధర్ తెలుసుకునేసరికి అతని పదేళ్ళ వైవాహికజీవితం నిరర్ధకంగా గడిచిపోయింది.
షెల్లీ, కీట్స్ మొదలైన రొమాంటిక్ ఫైవున్నూ- శ్రీనాథుడాదిగా గల ప్రబంధకవులున్నూ స్వర్గంలో కలుసుకున్నప్పుడు-
వాళ్ళ వూహలకి రవివర్మ రూపం కల్పించి ఒక వూహాసుందరి చిత్రాన్ని గీస్తే-
ముచ్చటపడి బ్రహ్మ దానికి ప్రాణంపోస్తే- జన్మనెత్తిన అపరంజిబొమ్మ పూజ.
స్థూలంగానూ, సూక్ష్మంగానూ కూడా శ్రీధర్‌కి ఆమెపట్ల గల అభిప్రాయం యిది. దాన్ని ఎప్పుడూ దాచుకునే ప్రయత్నం చెయ్యలేదు. ఆ అందం ముందు భార్య కాలిగోటికి కూడా సాటిరాదనే అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించడానికి అతనెప్పుడూ వెనకాడలేదు. పూజ అందం శ్రీధర్‌కి ఎప్పుడూ ఆశ్చర్యమే.
ఆమె కళ్ళు యింద్రనీలాల్లా వుంటాయనుకునేవాడు. కానీ, మేమంత అందంగా వుంటామా అని యింద్రనీలాలే ఆశ్చర్యపోయాయి.
ఆమె మేని మెరుపులో కోటితారకల కాంతులని అనుకుంటే తారకలు చిన్నబుచ్చుకుని వెలవెలపోయాయి.
ఆమె బుగ్గల్ని గులాబీ మొగ్గలతో పోలిస్తే గులాబీ మొగ్గలే సిగ్గుతో ముడుచుకుపోయి విచ్చుకోను సాహసించలేదు.
పూజ… అతని మరదలు. ఒకప్పుడతను ఆమెని ప్రేమించాడు. ఆమె ప్రేమించలేదు. ఇప్పటికీ అతను ప్రేమిస్తూనే వున్నాడు.
“ఇదో..మా పూజ వస్తోంది రేపు. తనకి నేతి బూందీలడ్డూ చాలా యిష్టం. చేసి వుంచు. పెళ్ళికి ముందు తను అన్నీ గంజి పెట్టిన కాటన్ చీరలు కట్టుకునేది. గంధంరంగు చాలా యిష్టం మధ్యాహ్నం నువ్వే వెళ్ళి ఆ రంగులో ఖరీదైన చీర తీసుకురా” అవన్నీ ఆమె బాధ్యతలేనన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతున్న శ్రీధర్కేసి నిస్సహాయంగా చూసింది స్రవంతి. అతనంతే! ఏ బాధ్యతా తీసుకోడు. ఊహల్లో బతుకుతున్నట్టుంటాడు. కలలో మనిషిలా వాస్తవానికి దూరంగా వుంటాడు. అతను చెప్పినవిమాత్రం కచ్చితంగా జరిగిపోవాల్సిందే. ఏ కొద్దిపాటి తేడా వచ్చినా వూరుకోడు. గొడవ చేస్తాడు. పెళ్ళైనప్పట్నుంచీ ఎదురుచూసింది స్రవంతి మారతాడేమోనని, కానీ మారలేదు. అలాగే వున్నాడు..
ఆమెకి ప్రతిక్షణం అనిపిస్తుంటుంది, తనేం తప్పు చేసిందని యిలా శిక్షిస్తున్నాడు? అతన్ని నిలదీసి అడగాలని కూడా ఎన్నోసార్లు అనుకుంది. దానివలన ఎలాంటి ప్రయోజనం వుండదు. అసలే బలహీనంగా వున్న తమ బాంధవ్యం మరింత పల్చబడటం తప్ప అని కూడా అనిపించింది.
అలా అడగాల్సింది చెయ్యాల్సిందీ ఏదేనా వుంటే పెళ్ళిరోజునే చేసి వుండాల్సింది. అప్పుడు అనేక కారణాలచేత అలా చెయ్యలేకపోయింది. అప్పుడు చెయ్యలేకపోయినది యిప్పుడు చేసినా నిరుపయోగం కూడా.
అప్పుడు… ఆరోజు….
పందిరంతా సందడిగా వుంది.
“స్రవంతీ వెడ్స్ శ్రీధర్” అన్న గ్లోబోర్డు దేదీప్యమానంగా వెలుగుతోంది. రాత్రి పదింటికి ముహూర్తం.
ఆఫీసులకెళ్ళాలన్న తొందరగానీ, చీకటిపడుతోంది యింటికెళ్ళాలన్న ఆతృతగానీ ఎవర్లోనూ లేవు, ముహూర్తానికి ముందే డిన్నర్ ఏర్పాటుచేసారు. అంతా భోజనాలు చేసి, తీరిగ్గా కూర్చుని ఎక్కడెక్కడి పరిచయాలనీ చుట్టరికాలనీ తిరగేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
“పెళ్ళికొడుక్కి యీ పెళ్ళి యిష్టం లేదట… “
“ఎవర్నో ప్రేమించాడట””
“ఎవర్నో ఏం కాదు.. స్వంత మరదల్నే”
“కలిసొచ్చిన మేనరికమేగా, ఎందుకు చేసుకోలేదు?”
“ఆ పిల్ల బంగారపు బొమ్మలా వుంటుందట. ఇతన్ని నచ్చుకోలేదట”
“అందం శాశ్వతనూ?”
“కాకపోయినా, చూసిచూసి కాకిముక్కుకి దొండపండుని ముడి పెట్టలేరు కదా? అందులోనూ యీకాలంపిల్లలు. ఒకళ్ళు చెప్తే వింటారా? వాళ్ళకి తోచిందే మంచి”
అక్కడక్కడ జరుగుతున్న ఈ సంభాషణలు కొద్దికొద్దిగా స్రవంతిదాకా వచ్చాయి. అతన్నే మనసులో నిలుపుకుని కుంకుమపూజ చేస్తున్న ఆమెలో తొట్రుపాటు. అతన్తో పంచుకోబోయే అనుభూతుల తాలూకూ వూహల వుల్లాసం నీళ్ళు చల్లిన పాలపొంగులా అణిగిపోయింది.
అతని మనసు తెల్లకాగితంలా వుంటుందని ఆమె ఆశించలేదు. తనకి ముందు చూసిన పెళ్ళి చూపులూ, కట్నాల లావాదేవీలూ అతని మనసుమీద ఎన్నో కొన్ని మరకల్ని అంటించి, పిచ్చిగీతల్ని గీసే వుంటాయనుకుంది. కానీ దానిమీద మరో ఆడపిల్లయొక్క స్పష్టమైన ముద్ర వుండటం యిబ్బందిగా అనిపించింది. చాలా.
అప్పటికప్పుడు నాకీ పెళ్ళొద్దని చెప్పెయ్యాలన్నంత ఆవేశం కలిగింది. కానీ ఎలా? సామాజికమైన అనేక బాధ్యతలు, వ్యక్తిగతమైన కొన్ని నైతిక నిబంధనలు ఆమెలో విచక్షణని తట్టిలేపాయి. ఎన్నో లెక్కలు, అనుబంధ ప్రతిబంధాలు. కళ్ళముందు కదిలాయి.
కట్నం కాకుండా యిప్పటిదాకా యీ పెళ్ళికి వచ్చిన ఖర్చు నలభైవేలు దాటింది. పెళ్ళి కేన్సిలైతే వాళ్ళు మహా యిస్తే కట్నం డబ్బు తిరిగి యిచ్చేస్తారేమో! ఈ ఖర్చంతా తిరిగిరాదు. పోతే పోయిందిలెమ్మని వదిలేసే స్థాయిలో వున్నారా తాము? ముమ్మాటికీ లేరు. ఎక్కడెక్కడో తిరిగి అప్పులు చేసి, చీటీలు పాడి డబ్బు సమకూర్చాడు తన తండ్రి. తన తర్వాత యింకా చెల్లెలుంది. సమస్య మళ్ళీ మొదటికొస్తుంది. తను చెల్లికో చెల్లి తనకో ప్రతిబంధకమౌతారు. ఇద్దరాడపిల్లల పెళ్ళిళ్ళకి మాత్రమే తండ్రి ప్లాన్ చేసుకున్నాడు. మూడో పెళ్లి ఆ ప్లానింగ్‌లో యిమడదు. తలనరాలు చిట్లిపోతున్నట్టనిపించింది స్రవంతికి, చాలా జటిలమైన సమస్య. క్షణాల్లో నిర్ణయం తీసుకోవాలి. కాలం కదిలిపోతోంది.
జీలకర్ర-బెల్లం… యాంత్రికంగా తను. అతనూనా?
“మాంగల్యం తంతునానేనా… మమజీవన హేతునా…” మంత్ర ఘోష.
తలొంచడమా? తిరస్కరించడమా?
“అమ్మాయి మెళ్ళో తాళి కట్టండి” బ్రహ్మగారి మాట.
ఉవ్వెత్తుని మోగుతున్న భజంత్రీలు, తెర తొలగిపోయింది.
శ్రీధర్ మొహంలోకి ఓరగా చూసింది స్రవంతి. నిర్వికారంగా వుంది. పక్కకి చూసింది. సంతోషం వెల్లివిరుస్తూ, సంతృప్తి నిండిన ముఖాలతో తల్లీ తండ్రీ. వాళ్ళ ఆనందాన్ని పాడుచేసే హక్కు తనకి లేదనిపించింది స్రవంతికి. దూరంగా ఎవరితోనో మాట్లాడుతూ చెల్లి… ఆమె భవిష్యత్తు తన నిర్ణయంతో ముడిపడి వుంటుంది. క్షణం సేపు కళ్ళు మూసుకుంది. ఎదురుగా తనకి అత్యంత సమీపంలో ఒక వ్యక్తి. సూత్రధారణ చేయబోతూ. కళ్ళు మూసుకున్నా అతని వునికి తెలుస్తోంది.
పెళ్లయ్యాక అతను ఆమెని మర్చిపోతాడేమో! అలా జరిగితే తనకెందుకు అభ్యంతరం? పెళ్ళికి ముందు ఎన్నో అనుకుంటారు. ఎన్నో జరుగుతుంటాయి. ఎందుకంటే తనప్పుడు అతనికి తెలీదు. తెలిసాక, తనతో ముడిపడ్డాక ఎందుకలా వుంటాడు? ఆ ఆశే… అలాగే తప్ప ఇంకోలా జరగదన్న నమ్మకమే అతని ముందు తలొంచుకుని మూడుముళ్ళూ వేయించుకునేలా చేసింది. కానీ అదే పెద్ద పొరపాటైంది.
నిరాశ ఎదురవని క్షణం లేదు స్రవంతికి. పూజ ఆమెకి పరోక్షశతృవైపోయింది. ఆమె అద్భుతమైన అందగత్తె కావచ్చు, శ్రీధర్ ఆమెని ప్రేమించి వుండచ్చు, ఆమెనే పెళ్ళి చేసుకోవాలనుకుని వుండచ్చు… కానీ యిప్పుడూ అదే ఆలోచనా? ప్రతిక్షణం ఆమెని తల్చుకుంటూ, తనని ఆమెతో పోలుస్తూ..
ఆమె తమింటికి రావడం యిదే మొదటిసారి. ఆమెని తను చూడటం కూడా యిదే మొదటి సారి. ఎప్పుడేనా ఆమె పుట్టింటికి వచ్చిందంటే శ్రీధర్ రెక్కలు కట్టుకుని వెళ్ళి వాలిపోతాడు. ఈమధ్య కొంత గేప్ వచ్చింది. పూజ భర్తకి మహారాష్ట్ర ట్రాన్స్ఫరైంది. పూజ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయింది. ఇప్పటికి యీ వూరు వస్తోంది. తనకెప్పుడూ ఆమెని చూపించలేదు. తమ పెళ్ళికీ ఆమె రాలేదు. ఇప్పుడీ రావడం మంచిదే అనిపించింది స్రవంతికి
తన సమస్యకి పరిష్కారం ఆమె దగ్గరే వుంటుంది. ఎలాంటి వ్యక్తి అసలీమె? శ్రీధర్పట్ల ఆమెకి ప్రేమలేదన్నది నిర్వివాదాంశం. మరి అభిమానం వుందా? అతని ఆరాధన ఆమెకి యిబ్బంది కలిగించటంలేదా? పెళ్ళై, పిల్లల తల్లైవుండీ పరాయిమగవాడి ఆరాధనని ఎంజాయ్ చేస్తోందా? ఎన్నో ప్రశ్నలమధ్య… ఆలోచనల్తో వుక్కిరిబిక్కిరౌతూనే శ్రీధర్ చెప్పిన పనులన్నీ పూర్తి చేసింది. పూజ రాకకోసం శ్రీధర్కన్నా తనే ఎక్కువగా
ఎదురుచూసింది.
పూజని రిసీవ్ చేసుకోవడానికి శ్రీధర్ స్టేషన్‌కి వెళ్ళాడు. అక్కడ ఆమెనీ పిల్లల్ని ఆటోలో కూర్చోబెట్టి తను స్కూటర్మీద తిరిగొచ్చాడు. గేటు ముందు ఆటో ఆగిన శబ్దానికి వంటింట్లోంచి పరిగెత్తుకొచ్చింది స్రవంతి. ఆటోకన్నా కొన్ని సెకన్లముందు యిల్లు చేరుకున్న శ్రీధర్ ముఖం కళతప్పి వుండటాన్ని గమనించి ఆశ్చర్యపోయింది. అదెందుకో అర్థమవటానికి కొద్ది వ్యవధి పట్టింది.
ఆగిన ఆటోలోంచీ ముందు పిల్లలిద్దరు దిగారు. చక్కగా బొమ్మల్లా వున్నారు. తర్వాత సామాన్లు దిగాయి. ఆ తర్వాత… అవతలికొచ్చిన శాల్తీని పూజగా గుర్తించేసరికి స్రవంతికి కళ్ళు రెండూ గిర్రుమని తిరిగొచ్చి వూడిపడ్డంత పనైంది. తేరుకుని భర్తకేసి చూసేసరికి అతను తన కేసి దొంగచూపులు చూస్తూ దొరికిపోయాడు.
” ఏం బావా! మీ ఆవిణ్ణి పరిచయం వెయ్యవా?” అని పూజ అనేదాకా యిద్దరూ ఒకరినొకరు చూపుల్తో కొలుచుకుంటూనే వున్నారు.
శ్రీధర్ తేరుకుని స్రవంతిని పరిచయం చేసాడు.
“శ్రీధర్ మీ గురించి చాలా చెప్పాడు. తన ఆలోచనల్లో నిత్యం వుండే మిమ్మల్ని కలుసుకోవటం యిదే మొదటిసారైనా చిరపరిచితుల్లాగే అనిపిస్తున్నారు” అంది స్రవంతి కోరగా శ్రీధర్ని చూస్తూ.
“ఏమే పూజా! మీ ఆయన నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడేమిటి, యిలా దర్వాజాలు పట్టకుండా తయారయ్యావు?” మాటమార్చాడు శ్రీధర్, స్రవంతి మాటల్లో వ్యంగాన్ని ఆమె గ్రహించేలోపు.
“నువ్వు కూడా నన్ను వేళాకోళం చేస్తున్నావా బావా?” అని కళ్ళనీళ్ళ పర్యంతమైంది. స్రవంతి ఆమె పిల్లలిద్దర్నీ చెరోవైపూ దగ్గరకి తీసుకుని పేర్లడుగుతూ లోపలికి దారితీసింది. ఆమె వెనకే మిగిలిన యిద్దరూ నడిచారు. అందరికీ కాఫీ యిచ్చింది. పిల్లలకి ఫాలు పోసింది. ముగ్గురూ ఒకరి వెనక యింకొకరు స్నానాలు చేస్తుంటే శ్రీధర్ యింట్లోంచి బైటపడ్డాడు. ముందు పిల్లలకి అన్నం పెట్టింది. వాళ్ళు తిన్నాక తనూ, పూజా కూర్చున్నారు. పిల్లలు టీవీ దగ్గర చేరారు.
“నన్ను చేసుకోవాలని బావకి చాలా యిష్టంగా వుండేది స్రవంతీ! నల్లగా వుంటాడని చేసుకోననేసాను. ఎవరెంత చెప్పినా వినలేదు. ఏమిటో యిప్పుడాలోచిస్తే అలా చేసి వుండకూడదనిపిస్తుంది” అంది పూజ.
“అదేమిటి?” అతికష్టమ్మీద అడిగింది. స్రవంతి,
“మావారు చాలా బావుంటారు. ఇప్పటికీ అలానే వుంటారు. నా అందం చూసి నన్ను చేసుకున్నారు. మొదట్లోనేమో తనకి అనుమానం. తర్వాత… అంటే యిప్పుడు నాతో బైటికి రావాలంటేనే చిరాకుపడ్తున్నారు. బావైతే కనీసం రక్తస్పర్శకి చెందిన ప్రేమైనా మిగిలేది ఆకర్షణలన్నీ కరిగిపోయినా కూడా”
“…”
“తిండి ఎంత తగ్గించినా వళ్ళు తగ్గటం లేదు. జుత్తు కూడా నెరిసింది. డై పడటం లేదు. దగ్గర బంధువుల యిళ్ళకి వెళ్ళడం మానేసాను. ఈవూరేనా ఆఫీసు పనిమీద రాక తప్పింది కాదు. ఇక్కడిదాకా వచ్చి మీ యింటికి రాకపోతే బావ బాధపడతాడని వచ్చాను” అంది పూజ.
ఆమెని నిశితంగా చూసింది స్రవంతి, అమ్మాయి మంచిదే! పెళ్ళి విషయంలో ఆమెకిగల స్వేచ్చని వాడుకుంది. దాని పర్యవసానాలు కొన్ని వుంటే వుండచ్చు. వాటిని తనే అనుభవిస్తోందిగానీ ఎవరికీ పంచివ్వటం లేదు. కొంచెం జాలి కూడా ఆమె పట్ల కలిగింది.
“మీ పెళ్ళై పదేళ్ళవలేదూ? ఇంకా పిల్లలు.. లేకపోవడమేమిటి?” అడిగింది పూజ. తన ప్రాబ్లమ్స్ చెప్పుకున్నట్టే ఆ విషయాన్ని చాలా మామూలుగా అడిగింది.
స్రవంతి శుష్కహాసం చేసింది. అందులో ఎంతో చదివింది పూజ. “మగవాళ్ళంతా యింతేనేమో స్రవంతి! ఏవో వూహల్లో బతికేస్తూ వుంటారు. మీ యిద్దరి గురించి చూచాయగా తెలిసింది. ఇక్కడికి రావడానికి అదికూడా ఒక కారణమే. ఇప్పుడింక నన్ను చూసాడు కదా, భ్రమలన్నీ తొలగిపోయి, మామూలు మనిషితాడులే” అంది.
“లోకంతీరు వేరేగా వుంటుంది స్రవంతీ! చుట్టాలందర్లో మీ విషయం చర్చకి నడుస్తోంది. అత్తయ్య… అంటే మీ అత్తగారు… చాలా అసంతృప్తిగా వుంది. మగవాడికి సవాలక్ష మోజులుంటాయి, ఆకట్టుకుని కొంగుకి కట్టుకోవలసిన బాధ్యత భార్యదేకదా అంటుంది. వినేవాళ్ళకి వినసందూ, దెప్పేవాళ్ళకి దెప్పసందూ”
తన తల్లి, చెల్లి, శ్రీధర్, స్నేహితులు… ఇంకెవరూ కదిలించనంతగా ఆమాటలు కదిలించాయి స్రవంతిని. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. చప్పుని తుడుచుకుంది.
“పెళ్ళిపీటలమీద కూర్చుని వుండగా, ఇంకొద్దిసేపటికి జీలకర్ర, బెల్లం అనగా తెలిసింది నాకా విషయం. అప్పటికే మా నాన్న నా పెళ్ళికోసం ఎంతో ప్రయాసపడ్డారు. ఎంతో ఖర్చుచేసారు. వాళ్ళ సంతోషాన్ని హరించే హక్కు నాకు లేదనిపించింది. అందుకే… అప్పట్నుంచీ వేలుపెట్టి కొనుక్కున్న నిరర్థకమైన వస్తువుని ఎలా పారెయ్యలేమో, అలా భరిస్తున్నాను ఇతన్ని” అంది వణుకుతున్న గొంతుతో. “ప్రేమ లేదు, అభిమానం లేదు… పెళ్ళయాక మారతాడనుకున్నాను. ఏ మార్పూ లేదు. ఏదో తక్కువైనట్టు, దానికి నేను కారణమన్నట్టు బాధపడతాడు. ప్రేమ లేదు. అభిమానం లేదు. ఇలా ఎంత కాలమో తెలీదు”
“అతను నన్ను కోరుకున్నట్టే నేనూ మరో అందమైన వ్యక్తిని చేసుకోవాలనుకోవడంలో తప్పులేదుకదా, స్రవంతీ? నన్నెంతో యిష్టపడిన వ్యక్తిని చేసుకున్నాను. కానీ కాలం నాలో మార్పులు తెచ్చినట్టే అతని ప్రేమలోనూ మార్పులు తెచ్చింది. మొదట్లో బాధగా వుండేది. తర్వాత అర్థమైంది. నా అందం ఎలా శాశ్వతం కాదో దాన్ని ఆధారం చేసుకున్న ప్రేమ కూడా అంతేనని, ఇప్పుడింక ఏ బాధ లేదు. నా రూపం నాది. నా జీతం నాకుంది. పిల్లలున్నారు. చక్కగా చదువుకుంటున్నారు. ఇంకెందుకు బాధ? నన్ను జాలిగా చూసే వాళ్ళ దగ్గరకి నేను వెళ్ళను. అంతే”
భోజనాలయ్యాయి. ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. శ్రీధర్ ఎప్పుడో పొద్దుపోయాక యింటికొచ్చాడు. పూజని చూస్తుంటే అతనికి దిగ్భ్రాంతిగా వుంది. రెండుమూడేళ్ళక్రితం ఆమెకి మహారాష్ట్ర ట్రాన్స్ఫర్ అవకముందు కూడా ఆమెని చూసాడు. కొద్దిపాటి వళ్ళు చేసిందిగానీ అదామె వయసుకి నిండుగా అనిపించింది. ఇలా మారిపోయిందేమిటి పూజ? విపరీతమైన లావుతో… తలనిండా తెల్ల వెంట్రుకలతో.. వికారంగా? ఏమయ్యాయి. ఆ అందం, ఆకర్షణ? అద్భుతమైన ఒక దృశ్యకావ్యం చెదిరిపోయిన భ్రాంతి కలిగింది. చదివేసిన పుస్తకం కలిగించినంత అనాసక్తి కలిగించింది పూజ అతన్లో.
మూడురోజులుండి వెళ్ళిపోయారు పూజ, పిల్లలు. ఈ మూడురోజులూ పూజని తప్పించుకుని తిరిగాడు శ్రీధర్. అతని మనసునిండా స్రవంతే వుందిప్పుడు. స్రవంతి ఒకప్పటి పూజ కన్నా అందమైనది కాదు. కానీ యిప్పుడనిపిస్తోంది… ఆమె తనువులో నీలిమేఘమాలికలు… ఆమె కనులు యిందీవరాలు… అని..
ఆమె కాలాన్ని జయించింది. అప్పుడూ యిప్పుడూ ఒకలాగే వుంది, ఎప్పటికీ వుండబోతుంది అనుకోబోతే స్రవంతి అతని మనసు చదివినట్టు..
“ఇవేవీ శాశ్వతం కాదు. అనుబంధం ఒకటే శాశ్వతం. ఎడారిలాంటి మీ మనసులో దానికోసం కృషి చెయ్యండి” అంది. అతనికి పూజపట్లగానీ తనపట్లగానీ ఎలాంటి ప్రేమా లేదని గుర్తుచేస్తూ. అతను సిగ్గుపడ్డాడు.
(ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 7/10/2004)
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.