బడి వదిలాక by S Sridevi

  1. అక్కాచెల్లెళ్ళు by S Sridevi
  2. గుండెలోతు by S Sridevi
  3. మనుష్యరేణువులు by S Sridevi
  4. బడి వదిలాక by S Sridevi
  5. హలో మనోరమా! by S Sridevi
  6. ఇరవైమూడో యేడు by S Sridevi
  7. అతనూ, నేనూ- మధ్యని మౌనం By S Sridevi
  8. ఒకప్పటి స్నేహితులు by S Sridevi
  9. పుత్రోత్సాహం by S Sridevi
  10. వెంటాడే జ్ఞాపకాలు by S Sridevi
  11. ప్రేయసి అందం by Sridevi Somanchi
  12. ఉరి by S Sridevi
  13. మరోజన్మ by S Sridevi
  14. అంచనా తప్పింది by S Sridevi
  15. వప్పందం by S Sridevi
  16. శతాయుష్మాన్ భవతి by S Sridevi
  17. కొత్త అతిథికోసం by S Sridevi
  18. చెయ్ by S Sridevi
  19. పరారైనవాడు by S Sridevi
  20. కృతజ్ఞతలు by S Sridevi

“పద్ధెనిమిది నెలల ఆనంద్ అనే పసివాడు పౌష్టికాహారలోపంతో ఎలా ఎండుకుపోయాడో, అబ్బాస్, అక్షయ్‍కుమార్ ఎంత బాగా టయ్‍లెట్లు క్లీన్ చెయ్యగలరో అన్నంబల్లముందు కూర్చుని చూసాను. పొగాకు తింటే రేఖ అనే స్త్రీకి నోటికేన్సరు వచ్చి దవడ ఎలా తీసేసారో చూసాను. లిఫ్టులో కలిసినావిడ పళ్లలో ఎలాంటి పదార్థాలు ఇరుక్కుని వుంటాయో, మగవాడు ఒక రకం స్ప్రే కొట్టుకోగానే చుట్టుపక్కల ఫ్లాట్స్‌లో వుండే ఆడపిల్లల వొళ్ళమీది బట్టలు ఎలా ఎగిరిపోతాయో చూసాను. చాక్లెట్లు మూతికీ వేళ్ళకీ పులుముకుని నాక్కుంటూ తినటాన్నీ, అదేదో కూల్‍డ్రింకో హెల్త్‌డ్రింకో సీసామూతి మొత్తం నోట్లో పెట్టుకుని గుటగుటమని తాగటంలోని జుగుప్సనీ, భోజనాలబల్లముందు తినుబండారాలని చూసి పిల్లాపెద్దా ముసలీముతకా అంతా మొహంవాచినట్టు పరవశించిపోయి కుప్పిగెంతులు వెయ్యటాన్నీ , వేళ్ళు నాక్కోవటాన్నీ, డాన్సు చెయ్యటానికి వెళ్ళబోతున్న పిల్లముందు బతుకులో మళ్ళీ తింటుందో తినదో అన్నట్టు అదేదో రిఫండాయిల్‍తో చేసిన నలభయ్యో యాభయ్యో వంటకాలు పెట్టడాన్నీ… ఇంకా చాలా చాలా చూసేసాను” అంది హారతి.
“…” ప్రభు మౌనం.
“ఆంధ్రా, నార్తిండియను, చైనీస్, కాంటినెంటల్ ఫుడ్సన్నీ తిన్నాం, నేర్చుకుని వండుకుని రకరకాల ప్రయోగాలూ చేసాం”
“…”
“యూరప్‍ట్రిప్పులు రెండు, వరల్డ్‌టూర్ ఒకసారి, అమెరికా నాలుగుసార్లు, మలేషియా, సింగపూరు, దుబాయ్… అన్నీ చూసేసాం. ఒక్కో రాష్ట్రంలో నెలేసిరోజులచొప్పున భారతదేశం అంతా తిరిగేసాం. కోటలు, గుళ్ళు, గోపురాలు, తోటలు… తిరుగుతున్నామన్న వుత్సాహంతో తిరిగాం కానీ చరిత్రలోనో, భక్తిలోనో ఆసక్తి వుండి కాదు”
“…”
“విశ్వనాథనుంచీ, యండమూరిదాకా, షేక్స్పియర్ దగ్గర్నుంచీ సిడ్నీషెల్డన్‍దాకా చెప్పుకోదగ్గ పుస్తకాలూ చదివే. ఎమ్మెస్‍, బాలమురళీలనుండి, ఘంటసాల, బాలూల మజిలీలు దాటి ఈరోజుదాకా సంగీతప్రయాణం చేసాం. ఇవేనా, ఇంకా చెప్పుకోదగ్గవి చాలా వున్నాయి. ఫేస్‍బుక్కూ, ట్విట్టరు, ఇన్స్టా… పోస్టులు, లైకులు, షేర్లు… అందులోని కృత్రిమత… ఎవరూ ఎవరికీ ఏమీకాకపోయినా, కలబోసుకున్న భావాలు… “
“…”
“టూమచ్ ఆఫ్ ఎవెరీథింగ్. ఏదీ అందనట్టుంటేనే ఆసక్తి. అన్నీ అందాక అందులో కొన్నిటిని రుచి చూసాక విరక్తి. తీపి ఎక్కువైనప్పటిలా. ఏది తెలుసుకోవాలన్నా గూగుల్ వుంది. అందుకే ఏదీ తెలుసుకోవాలనిపించట్లేదు”
“ఐతే ఏమంటావమ్మాయ్?”
“పిల్లలు పెద్దవాళ్ళయారు. వాళ్ళ పరుగుపందేల్లో వాళ్ళున్నారు. వీడియోకాల్లో తప్ప కనిపించరు. మనం వెళ్ళాలే తప్ప వాళ్ళు ఎప్పుడోగానీ రారు”
“సో?”
“జీవితం బోరుకొడుతోంది”
“దెన్?”
“చచ్చిపోవాలనుకుంటున్నాను. ఎప్పుడో ఒకప్పుడు జరిగేది అదేకదా?”
“మరి నేనేం కావాలి?’”
“ఇద్దరం ఒక్కసారి పోము. ముందువెనుకలు తప్పవు”
“అందుకే నువ్వు…?”
“ఔను”
“ఇంకా తోచకుండా పోవటానికి నన్నొదిలేస్తానంటావు?”
“నీకేం? స్నేహితులున్నారు”
“నీకూ వున్నారుకదా అమ్మలూ?”
“కిట్టీపార్టీలు, పాట్‍లక్‍లూ ఎన్నున్నా రాత్రి ఇంటికొచ్చేసరికి ఈ చీకటి గుయ్యారమేగా? మనం స్విచి వేస్తేనే వెలుతురు”
“…”
“…”
“ఆస్తులన్నీ నీకూ పిల్లలకీ రాసేసి విల్లు రిజిస్టర్ చేయించేసాను”
“!!!!!”
“…”
“ఏం చెయ్యాలనుకున్నావు?”
“ఎటేనా వెళ్ళిపోవాలనుకున్నాను”
“ఎక్కడికి? నన్నొదిలేసి?”
“నువ్వూ అనుకున్నావుగా?”
“నేను చెప్పానుగా?”
“చెప్తే వెళ్ళనివ్వవని”
“మరైతే నాదారిన నేను వెళ్ళిపోయేదా?”
“అలా ఎలా కుదుర్తుంది? ఎక్కడికో వెళ్ళడం వేరు, నువ్వు చెప్పిన వెళ్ళటం వేరు”
“…”
“ఓ పని చేద్దాం”
“ఏంటది?”
“ఇద్దరం ఒక్కసారే వెళ్ళిపోదాం”
కొద్దిసేపు ఇద్దరిమధ్యా మౌనం.


అవంతీపురం చిట్టడవిలో కొండమీద సూసైడ్ పాయింటు దగ్గర రెయిలింగ్‍కి ఆనుకుని నిలబడ్డారు వాళ్ళిద్దరూ. అంటే హారతి, ప్రభు. అక్కడినుంచీ దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన. ఇంకేమీ చెయ్యడానికి లేక తీసుకున్న నిర్ణయమే తప్ప, చచ్చిపోయి తీరాలన్న కోరిక మరీ అంత బలంగా వుండకపోవటంచేత ఒక్క నిముషం అక్కడ ఆగి చూట్టూ చూసుకున్నారు. బతకడానికి బలమైన కారణం ఏదేనా కనిపిస్తుందేమో, నిర్ణయం మార్చుకోవచ్చని కూడా అనిపించింది ఒక్క క్షణంసేపు. క్షణం అనేది నిర్ణయాలు మార్చుకోవటానికే కాదు, వింతలూ, అద్భుతాలూ జరగటానికికూడా కాలమే.
“హేయ్! ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్నారా? అద్భుతం” కాస్త దూరంనుంచీ ఒకగొంతు వినిపించి వెనక్కి తిరిగారు. తమంత వయసే వుండచ్చు. షార్ట్స్, టీషర్టూ వేసుకున్నాడు. ముఖం సరదాగా వుంది. వీళ్ళని చూసి వేగం పెంచాడు.
“వీడియో షూట్ చేస్తాను. నాకు కొంచెం వ్యవధి ఇస్తారా, కెమేరా తెచ్చుకుంటాను?” అన్నాడు. వాళ్ళిద్దరూ తెల్లబోయారు.
“కమలీ! కెమేరా తీసుకుని తొందరగా రా! వీళ్ళెవరో సూసైడ్‍పాయింట్ దగ్గర వున్నారు. దూకి చచ్చిపోతారట” అని హడావిడి చేసాడు. కమలి అని పిలిచిన ఆమె వచ్చింది. ఆమె పంజాబీ డ్రెస్ వేసుకుంది. చేతిలో ఖరీదైన వీడియో కెమేరా వుంది. అతను కెమేరా సిద్ధం చేసుకున్నాడు.
“ఒకరి తర్వాత ఒకరు దూకుతారా? అలా కాకుండా ఇద్దరూ కలిసి చేతులు పట్టుకుని దూకితే చాలా రొమాంటిగ్గా వుంటుంది” అన్నాడు. ఆ తర్వాత కెమేరా పక్కని పెట్టి, తనే కమలి చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి, వీళ్ళని కొంచెం వెనక్కి నెట్టి, “ఇదుగో, ఇలా” అని ఆమెతో కలిసి దూకేసాడు… ఎంతో అనుభవం వున్నట్టు, అలా దూకడం అదే మొదటిసారి కాదన్నట్టు. కానీ జీవితం ఒకటేకదా, ఒకసారి దూకితే రెండోసారికి అవకాశం వుండదు!
“ఆ<!!” అంది హారతి. ప్రభు సాయంకోసం పెద్దగా కేకలు వేసాడు.
ఎక్కడినుంచీ వచ్చారో, అసలక్కడ అంతమంది వున్నట్టే అప్పటిదాకా అనిపించకపోయినా, దాదాపు ఇరవైమంది అక్కడికి వచ్చేసారు. వీళ్ళని రెయిలింగ్ దగ్గర్నుంచీ వెనక్కి నెట్టేసి, కిందికి తొంగి చూస్తూ అర్థంకాని భాషలో కలగాపులగంగా మాట్లాడుతూ వుంటే కొద్ది నిముషాలకి వెనకనుంచీ మళ్ళీ మాటలు వినిపించాయి.
“మేం వచ్చేసాం”
వాళ్ళే, వాళ్ళిద్దరే. కమలి, కమలిని పిలిచినతను. అంతా వెనక్కి తిరిగారు. హారతి, ప్రభు తప్ప మిగిలినవాళ్ళంతా పెద్దగా నవ్వులు, చప్పట్లు.
“భయపడ్డారా? జస్టె ప్రాంక్. మూడడుగుల కింద కమ్మీలుంటాయి. వాటిని పట్టుకుని కిందకి జారి అక్కడినుంచీ ఈ బ్రిడ్జికింద వున్న చిన్న టనెల్లోంచీ నడిచి మెట్లెక్కి పైకి వచ్చెయ్యచ్చు” అంటూ వచ్చి పరిచయం చేసుకున్నారు. అతని పేరు సహదేవ్‍ట. ఆమె కమలి. భార్యాభర్తలు. ఇక్కడి స్థానికులు. వాళ్ళీ ప్రాంక్ లెక్కలేనన్నిసార్లు చేసారట. మిగతావాళ్ళంతా వచ్చి పరిచయాలు చేసుకుని ఎలా వచ్చినవాళ్ళు అలా వెళ్ళిపోయారు.
“మేం చచ్చిపోవాలనుకున్నామని ఎలా గ్రహించారు?” హారతి అడిగింది.
“ఏమిటి, నిజంగా అందుకే ఇక్కడికి వచ్చారా?” ఆశ్చర్యపోయాడు సహదేవ్. “ఎందుకు? జీవితం విసుగనిపించా? బేబీబూమర్స్ ఆర్ జెనెక్స్?”
“ఇద్దరం అరవై పైబడ్డవాళ్ళమే” హారతి చెప్పింది.
“ఐతే బడి వదిలాకకూడా గేటు పట్టుకుని వేలాడుతున్నారన్నమాట!”
“అంటే?!”
“మాయిల్లు ఇక్కడే. రండి, కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకుందాం” కమలి కల్పించుకుని అంది. నలుగురూ కలిసి నడవసాగారు. అన్నట్టుగానే ఫర్లాంగుదూరంలోనే వుంది ఇల్లు. తనో నాలుగడుగులు వేగంగా ముందుకి వేసి, గేటు తీసి, “రండి” అని అతిథుల్ని ఆహ్వానించింది కమలి.
చుట్టూ చూస్తూ లోపలికి నడిచారు అతిథులు. విశాలమైన ఆవరణలో కట్టిన పాతకాలపు ఇల్లు. రెండుమెట్ల ఎత్తుని ఇంటిచుట్టూ నల్లటి నాపరాళ్ళు పరిచిన వరండాలున్నాయి. మరో రెండుమెట్లు ఎక్కితే ఇంట్లోకి వెళ్ళచ్చు. ముందు వరండామీద తుంగచాపలు పరిచి వున్నాయి. చక్కగా వాటిమీద కూర్చోవచ్చు. అలాంటి కోరికే కలిగింది హారతికి.
“కూర్చోండి” నవ్వుతూ అన్నాడు సహదేవ్ ఆమె కళ్ళలోని భావం పసిగట్టి. ముగ్గురూ కూర్చుని, సౌకర్యంగా వుండేలా సర్దుకున్నారు. కమలి టీ తీసుకురావటానికి లోపలికి వెళ్ళింది.
“ఇప్పుడు?” అన్నాడు సహదేవ్. “సరిగ్గా రెండేళ్ళక్రితం నాభార్య కూడా ఇదే పని చెయ్యబోయింది” అన్నాడు సహదేవ్. అతని ముఖంలో స్వల్పవిషాదం. ట్రేలో టీకప్పుల్తో వచ్చింది కమలి. అందరికీ తలో కప్పూ ఇచ్చి తనొకటి తీసుకుంది.
“ఔనండీ! ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. మాకు ముగ్గురు పిల్లలు. ఎక్కడెక్కడో వుద్యోగాలు. పెళ్ళిళ్ళయాయి. పిల్లలు కూడా. ఆరుగురు మనవలు మాకు. వాళ్ళ ముద్దుముచ్చటలూ అయాయి. స్కూళ్లకి వెళ్తున్నారు. పిల్లల యిళ్ళకి వెళ్తే రోజంతా అంతులేని వంటరితనం. ఎవరూ ఇంట్లో వుండరు. ఎవరి పరుగు వాళ్లది. మేము ఇమడలేకపోయాము. వాళ్ళకి మా దగ్గిరకి వచ్చి వుండటానికి ఎప్పుడోగానీ తీరదు. భార్యాభర్తలిద్దరికీ ఒకేసారి సెలవు దొరకాలి. పిల్లల చదువులు పాడవకూడదు… ఇవన్నీ మనమూ అనుభవించినవేకదా?ఇల్లు పట్టనన్ని వస్తువులు, వాటిని తుడుచుకుంటూ, సర్దుకుంటూ… వాళ్ళొస్తారని గేటుదగ్గర ఎదురుచూస్తూ, ఆ జ్ఞాపకాలకి వేలాడుతూ ఎంతకాలం వుంటాం? పెద్దాడి చిన్నప్పుడు అలా, చిన్నాడి నాలుగో ఏట ఇలా… అనుకుంటూ నిర్వ్యాపారంగా ఎలా బతగ్గలం? ఎంతకాలం బతగ్గలం?” అంది కమలి.
“మేమిప్పుడు అలాగే బతుకుతున్నాం. మా అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములందరి యిళ్ళలో కూడా ఇదే పరిస్థితి. ఎన్ని సరదాలు చేసుకున్నా రాత్రయి, ఇంటి తలుపులు తీసేసరికి భయంకరమైన వంటరితనం. ఎప్పుడేనా చచ్చిపోవలసిందే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం” అంది హారతి. ప్రభు మౌనశ్రోత.
“పుట్టుక, పెరగటం, స్కూలు, కాలేజి, పెళ్ళి, పిల్లలు, వాళ్ళ పెరుగుదల, పెళ్ళిళ్ళు, పురుళ్ళు పుణ్యాలు… ఈ తొమ్మిది పాఠాలనీ బడితలుపులు మూసేసి పాఠాలు నేర్పించే మాష్టారిలా జీవితం మనకి నేర్పిస్తుంది. పాఠాలయ్యాయి, పాసో ఫెయిలో పరీక్షలూ అయ్యాయి. ఇంకా బడిగేటుదగ్గరే వుండటం దేనికనిపించింది నాకు. ఇంటికి వెళ్ళాలికదా? ముఖ్యంగా కమలికి జీవితంమీద విరక్తి కలిగాక. బతకడంమీద కాదు, బతుకుతున్న తీరుమీద. అప్పుడు ఆ ఆలోచన వచ్చింది. వెంటనే మా వూరు తిరిగి వచ్చేసాం” అన్నాడు సహదేవ్.
అప్పుడు మౌనం వీడాడు ప్రభు. “అన్ని సౌఖ్యాలు, నగరజీవితం వదులుకుని ఇక్కడికొచ్చి సంతోషంగా వున్నారా?” అడిగాడు. ఆ అడగటం ఏదో నిర్ధారణకి అన్నట్టు.
“సౌఖ్యాలు… డబ్బు ఖర్చుపెడితే ఈరోజుల్లో దొరకనిదేమిటి చెప్పండి తమ్ముడూ? పదిమంది మనుషులు మనచుట్టూ వుండి తిండీ, బట్టా, నిద్రలకి లోటు లేకపోతే ఇంకేవీ అక్కర్లేదేమో!” అన్నాడు సహదేవ్. “ఇది మా అమ్మానాన్నలు కట్టించిన యిల్లు. అమ్మ లేదు. నాన్న వున్నారు. తొంభైయెనిమిదేళ్ళు. చిన్నప్పటి స్నేహితుడి కొడుకొకడు ఆయన్ని అంటిపెట్టుకుని వుండి అవసరాలు చూస్తుంటాడు. మేం నలుగురు అన్నదమ్ములం. నేను పెద్దవాడిని. తమ్ముళ్ళని అడిగాను వస్తారాని. చిన్నతమ్ముడు వెంటనే షిఫ్టై వచ్చేసాడు. పెద్దతమ్ముడు తనున్నచోటి ఆస్థివ్యవహారాలు వదులుకోలేకుండా వున్నాడు. వచ్చి వెళ్తుంటానన్నాడు. ఇంకోతమ్ముడు… ఇల్లంతా పడగొట్టి మళ్ళీ కట్టిద్దామన్నాడు. అవన్నీ వద్దన్నాను. మరదలికి నచ్చలేదు. వాళ్ళుకూడా వచ్చి వెళ్తామన్నారు. ఇంటిని ఓపెన్ హౌస్ చేసాం. మా స్నేహితులకీ కజిన్స్‌కీ ఆహ్వానాలు పంపాము. మొదట్లో పెద్దగా ఎవరూ రాలేదు. ఇప్పుడు అందరూ వస్తూ వెళ్తూ వున్నారు. ఇందాకా మీరు అరవగానే వచ్చినవాళ్ళంతా మావాళ్ళే”
“…”
“కొన్ని ప్రలోభాలనీ, అహాలనీ వదులుకుంటే బడి తర్వాత బావుంటుంది. మనం మన స్థానాల్లో కుదురుగా కదలకుండా వుంటే ఎలాంటి మార్పూ రాదు. మొదటి అడుగు మేమే వేసాం” అంది కమలి.
“మాకిలాంటి కుదురు లేదు. మేం ఇద్దరు అక్కచెల్లెళ్ళం. తనకి ఇద్దరు అన్నలు. ఎక్కడివాళ్ళం అక్కడ పాతుకుపోయి వున్నాం. ఎలా కదలాలో అర్థమవటంలేదు. అందరూ ఇలాగే స్ట్రగులౌతూనే సర్దుకుపోతున్నారు”
“మీరుకూడా బంధువులు, మితృలందర్నీ ఆహ్వానించండి. అందుకు సందర్భం అక్కర్లేదు. మార్పు మీకే కనిపిస్తుంది”
హారతి తలూపింది.
“మాయింటికి కూడా రావచ్చు. మితృలమేకదా?” అంది కమలి చిరునవ్వుతో. ఎలాంటి కృత్రిమత, భేషజం లేని ఆహ్వానం.
“జీవితం చాలా సంక్లిష్టంగా చేసుకున్నాం. వృద్ధాప్యం శాపంలా పరిణమిస్తోంది రోజురోజుకీ. పిల్లలు మనకి చెయ్యలేదనో, చేసేవాళ్ళు లేరనో బాధపడతాం, భయపడతాం. చిన్న వృద్ధులు పెద్దవృద్ధులని చూసుకునే సాంప్రదాయాన్ని మొదలుపెడదాం. మంచంపట్టిన మనిషికి రోజంతా చెయ్యాలంటే భారమే. దురదృష్టవశాత్తూ తల్లిదండ్రులకి చాకిరీ చేస్తేనే ప్రేమ వున్నట్టని లెక్కలువేసి చెప్తున్నాం. ఆ బాధ్యతని డైల్యూట్ చేసుకుందాం. మా మామగారికి బట్టలు తడిసిపోతుంటాయి. ఆయన స్నేహితుడి కొడుకు… వాళ్ళకేమీ లేదు… ఆయనంటే ప్రేమకూడా వుంది… మా కుటుంబంలో కలుపుకున్నాం. అలాగని కొడుకులు పెద్దాయనకి ఏమీ చెయ్యరని కాదు, వాళ్ళూ చెయ్యిపట్టుకుని నడిపిస్తారు, బట్టలు మారుస్తారు. ఒక్కరే మొత్తం బాధ్యత ఎత్తుకోవటం, లేదా పెద్దాయన్ని మూడునెలలకొకరు పంచుకోవటంకన్నా ఇది గౌరవంగా వుంది” అంది కమలి.
“ఇలాంటి ఇళ్ళు ఒక్కొక్కటిగా మొదలౌతూ ఒక నెట్‍వర్కులా ఏర్పడి ఎక్కడి పరిచయాలో ఎక్కడిదాకానో సాగితే అప్పుడింక వంటరితనం ఎవరినీ బాధించదు”
చాలాసేపు అక్కడ మౌనం ఆవహించింది.
“అందరి అనుభవాలూ ఇంచుమించుగా అంతేకదా? ” అంది కమలి.
” అంతేగా!” అంది హారతి.