మనోరంజని by Thulasi Bhanu

  1. ఈశ్వర్ by Tulasi Bhaanu
  2. తగిన శిక్ష by Thulasi Bhanu
  3. మల్లీశ్వరి by Thulasi Bhanu
  4. నీలిమ, నవీన్ by Thulasi Bhanu
  5. శోభ by Thulasi Bhanu
  6. సహన by Thulasi Bhanu
  7. బ్రతుకు దీపం by Thulasi Bhanu
  8. ఆత్మీయ హాసం by Thulasi Bhanu
  9. జ్ఞాపకం by Thulasi Bhanu
  10. కీర్తన by Thulasi Bhanu
  11. మనోరంజని by Thulasi Bhanu

రంజని, కేశవ్ భార్యాభర్తలు. ఆడ మనసు, భార్య మనసు తెలియని మగమనిషి కేశవ్. భార్య ఎంత సరదాగా ఉన్నాసరే తను ఎంతవరకూ ఉంటాడో అంతవరకే ఉంటాడు కేశవ్. సరదాలు, సర్ప్రయిజులు పట్టించుకోడు. ఎంతసేపూ సంపాదన ముఖ్యం అతనికి.
దిగువ మధ్యతరగతి బతుకులాగా అతని చిన్నతనం నడిచింది. అప్పటినుంచీ ఒకటే ధ్యేయం అతనిది. బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి.
రంజనీవాళ్ళదికూడా అలాంటి బాల్యమే అయినా ఆమెకు జీవితం అంటే కొన్ని సరదాలు, ఉల్లాసాలు. భర్త ప్రేమగా గుప్పెడుమల్లెపూలు తెచ్చిస్తే చాలు, తన పిడికెడంత మనసుకి సంబరం అనుకుంటుంది. కానీ ఏదీ నోరు తెరిచి చెప్పందే అర్ధం చేసుకోడు భర్త. సరసాలు అన్న మాటకు చాలా దూరం. అన్ని పనులూ యాంత్రికంగా చేసుకుపోతుంటాడు అంతే. అసలు అతని మొహంలో భావాలుకూడా అర్ధం అయి చావవు రంజనికి.
వాళ్ళకి ఒక కొడుకు. కొడుకుకి, భర్తకు, అత్తామామలకు, తల్లిదండ్రులుకు అనుగుణంగా నడుచుకుంటూ ఉన్నంతలో సంతోషంగానే గడపటం అలవాటుచేసుకుంది రంజని. రంజని హుషారుకి అందరూ అభిమానులే. తాము ఉండే అపార్ట్‌మెంట్సులోనే శాస్త్రీయసంగీతం కూడా నేర్చుకునేది. మంచి వ్యాపకాలతో తన సమయాన్ని నింపేసుకునేది.
భర్త ఆఫీసునుంచీ వచ్చే సమయానికి వేడిగా వండిపెట్టేది. వేడిగా భోజనం తృప్తిగా చేసి కొడుకుతో ఆడుకుని టీవీలో న్యూస్ చూసి నిద్రపోయేవాడు కేశవ్. అర్ధరాత్రి వరకూ అద్దెకు తెచ్చుకున్న సీడీలు సీడీ ప్లేయర్లో చూసుకుని నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయేది రంజని.
ఒకరోజు రంజనికి తల్లినుంచీ ఫోన్ వచ్చింది
“నీ తమ్ముడు వరుణ్ మరీ పిచ్చిపట్టినట్టు తయారవుతున్నాడమ్మా. ఎంతసేపూ జాహ్నవి ఆలోచనలే. ఆ అమ్మాయేమో నువ్వు నాకు ఎంత దూరముంటే అంత మంచిదని చెప్పేసింది. అందుకు వీడు ఉద్యోగం వదిలేసి, ఇరవైనాలుగు గంటలూ ఆ అమ్మాయి ధ్యాసే, ఆ వాక్‍మాన్ చెవులకి పెట్టుకుని ఏవో పాటలు వింటూ ఉంటాడు. తిండి సరిగా తినడు. నాన్నేమో ఇంకా నేనే సంపాదించి పోస్తున్నా కుటుంబానికి, వీడికెప్పుడూ ఇంక బాధ్యత తెలిసేది అని ఒకటే గొడవ. ఏమి చేయాలో తెలీక నాన్నకి, నాకు ఒకటే దిగులు” అని.
ఆ సాయంత్రమే తల్లి దగ్గరకు వెళ్ళింది రంజని. కొడుకుని తల్లి చేతికిచ్చి, తమ్ముడి దగ్గరకు వెళ్ళి కూర్చుంది.
“నువ్వు బాధ్యత బాగా తెలిసిన మనిషివని, నీకంటే బాగా మాకే తెలుసురా. కానీ ఇప్పుడు నువ్విలా బేలగా, దిగులుగా మారటం అంటే నాకు చాలా కొత్తగా ఉందిరా… ” అంటూ ఇంకా ఏదో చెప్పబోతోంది రంజని, వరుణ్‍కి.
ఇంతలో వరుణ్, “అక్కా!” అంటూ అక్క వడిలో తలపెట్టేసుకుని దాదాపుగా ఏడుపుగొంతుతో చెబుతున్నాడు “నాకు తను కావాలక్కా! తను నా ప్రాణం, తనతోనే నా జీవితం” అని కళవళపడుతున్నాడు.
రంజనికి అప్పుడు ఏమీ చెప్పాలనిపించలేదు, తమ్ముడి తలను ప్రేమగా నిమురుతూ ధైర్యం ఇస్తున్నట్లుగా చేస్తోంది. తల్లికి తమ్ముడి బాధను వివరించి, మర్రోజు పొద్దున్నుంచీ జాహ్నవి ఆఫీస్ నెంబర్‍కి ఫోన్ చేస్తూనే ఉంది. జాహ్నవీ సాయంత్రం వరకూ ఫోన్ తీయనేలేదు.
సాయంత్రం జాహ్నవి క్లోజ్ ఫ్రెండ్ ఫోన్ ఆన్సర్ చేసి. “మీకేమన్నా పిచ్చా అండీ, ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? వాడు ఏమైపోయినా సరే మాకు అనవసరం, మళ్ళీ ఫోన్ చేయకండి ” అంది కోపంగా.
“అవునమ్మా! మీకు వాడు అందరిలో ఒకడు, మాకేమో ఒకరికి కొడుకు, ఒకరికి తమ్ముడు. వాడి జీవితం మా జీవితాలు పెనవేసుకునే ఉంటాయి. వాడికేమైనా అయితే మేము తట్టుకోలేము ” అంది రంజని బాధగా.
ఆ మాటలకు ఆ అమ్మాయి కాస్త శాంతంగా “కాదండీ! జాహ్నవికి పెళ్ళి కుదిరిందీ” అని చావుకబురు చల్లగా చెప్పేసింది. అది విని రంజని, తల్లి షాక్ అయ్యారు వరుణ్ ఎలా తీసుకుంటాడా అని.
పదిరోజుల తరువాత, అంత వివేకం ఉన్న మనిషి వరుణ్ మనసు చెదిరి ఉరి వేసుకుని చనిపోయాడు.
ఏ పరిస్ధితులలో అయితే కొడుకుని చూడకూడదో అలా చూసిన తల్లి కుప్పకూలిపోయింది. రంజనికి ఇవన్నీ గుండెకు శతఘాతాలై తగిలాయి.
ఒకవైపు చూస్తే బక్క పొట్టను పదేపదే బాదుకుంటూ నాకీ కడుపుకోతను ఇచ్చావు దేవుడా అని కుంగిపోయిన తల్లి. మరోవైపు ఉన్నట్టుండి ఏడుస్తూ మళ్ళీ నేను మగాయన్నికదా ఏడవకూడదేమో అనుకుని తనని తాను తమాయించుకుంటూ నరకం పడుతూ తండ్రి.
రంజనికి బాధతో గుండె బరువెక్కిపొయ్యింది. సంవత్సరం దాటింది ఇలా. తల్లి తన బక్క కడుపును బాదుకుంటూ ఇంత కడుపుకోతనా నాకు, అని బాధ పడిన దృశ్యం కళ్ళ ముందునుంచీ పోదు.
ఇంటిపక్కన ఒక తల్లితండ్రీ ఉద్యోగం చేస్తున్న పెళ్ళీడుకొచ్చిన అబ్బాయి సౌరభ్ అద్దెకు దిగారు. రోజూ పక్కింటి ఆంటీ, రంజని కబుర్లు చెప్పుకునేవారు. నెల తరువాత తెలిసింది, సౌరభ్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు ఆ అమ్మాయికి ఇతనంటే ఇష్టమే కానీ అమ్మాయి నాన్నకి స్ధాయి పట్టింపులు ఎక్కువ. అందుకే ఎటూ తేలట్లేదు పెళ్ళివిషయం అని.
అబ్బాయి దిగులుగా ఉంటాడా, హుషారుగా ఉంటాడా అడిగింది రంజని, సౌరభ్ గురించి. మామూలుగా ఉంటాడు అంతే అంది తల్లి.
అప్పుడు మనోరంజని తన మనసులో ఒక ఆలోచన చేసుకుంది. తన తల్లి పడిన బాధ మళ్ళీ ఏ తల్లీ పడకూడదు. ఆడపిల్ల ప్రేమకోసం ఆశపడే అతనితో, మాట్లాడి స్నేహం పెంచుకుంటాను. ఒక కొత్త స్నేహం అనే వ్యాపకం అతనికి కలిగించి అతన్ని నిరాశకు గురవకుండా చూసుకుంటాను, అతని మనసుని రంజింపచేస్తాను అని. కానీ మనసులో ఏదో తెలియని సంకోచం, సందేహం, తను చెయ్యబోయేది సరైనదా కాదా అని.
రెండ్రోజుల తరువాత ఒక పొద్దునపూట కేశవ్ రంజని వరండాలోకి వచ్చారు. అప్పటికే అక్కడ ఆఫీసుకని తయారైన సౌరభ్ అతని తల్లితండ్రి ఉన్నారు.
కరెంట్ బిల్లుల గురించి ఇంటి ఓనర్ గురించీ మాట్లాడుకుంటున్నారు సౌరభ్, రంజని. కేశవ్ మౌనంగా ఉన్నాడు, మొహం చిరాకుగా పెట్టుకుని ఉన్నాడు. రంజనికి అతని ప్రవర్తన అర్ధం కాలేదు. ఏమయ్యింది అలా ఉన్నారు అంటే ఏం లేదని అడ్డంగా తలూపి లోపలికి వెళ్ళిపోయాడు.
అదేరోజు సాయంత్రం ఏడింటికి చీకటి పడబోతుండగా కరెంట్ పోయింది. ఇంట్లో దోమలున్నాయని, గాలి కూడా లేదని చిన్నబాబుని ఎత్తుకుని వరండాలోకి వచ్చింది రంజని. అప్పటికే పక్కింటి ముందు ఫోన్‍లో మాట్లాడుతూ సౌరభ్ ఉన్నాడు.
కేశవ్ రంజని వెనకాలేవచ్చి కాస్త విసుగ్గా ఎందుకు బయట ఇన్ని దోమలుంటే, పిల్లాణ్ణి తీసుకొచ్చావూ, లోపలికి పదా అని అంటూ.
రంజని సరే అంటూ ఇంట్లోకి అడుగు పెడుతుండగా బుర్రకి తట్టింది భర్త తనమీద అనుమానపడుతున్నాడని. ఇహ చెప్పలేని బాధ అనిపించింది. ఈ పదేళ్ళలో తనని భర్త అర్ధం చేసుకున్నది ఇదేనా అని తగలరానిచోట దెబ్బతగిలి ఆత్మాభిమానం దెబ్బతిని గట్టిగా అరిచేసింది.
“అయితే ఇదా నీ పిచ్చి ప్రవర్తనకు కారణం? నేను బయట నుంచోవటం నీకు ఇష్టం లేదు, అంతేకానీ పిల్లాడు, దోమలు అని బాధకాదు. అదొక కారణం అంతే” అని.
“ఏయ్! ఏం కాదు… ఏం మాట్లాడుతున్నావ్?” అని కేశవ్ ఎదురు మాట్లాడాడు.
ఇహ రంజనికి సౌరభ్‍తో మాట్లాడుతాను ఎవరేం చేస్తారు అనేలాంటి తెగింపుకూడా తోడయ్యింది.
మర్రోజు మధ్యాహ్నం సౌరభ్ భోజనం సమయానికి ఇంటికి వచ్చాడు.
అప్పుడు మనోరంజని ఇంటి వసారాలోనే ఉంది. పక్కింటి ఆంటీ నిద్రపోతోంది.
“సౌరభ్, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, ఏదైనా అవసరమయితే పనికొస్తుంది” అంది రంజని. ముందు ఆశ్చర్యంగా చిరునవ్వుతో చూసాడు. తరువాత నెంబర్ ఇచ్చాడు.
మెసేజులు మొదలయ్యాయి. నాలుగురోజుల తరువాత ఫోన్ చేసి అడిగింది ” అమ్మా నువ్వూ అన్నీ మాట్లాడుకుంటారటకదా సౌరభ్, ఆ అమ్మాయికి ఏంటి అభ్యంతరం నిన్ను పెళ్ళి చేసుకోవడానికి” అని అడిగింది.
“ఏముంటుంది? స్ధాయి, హోదా అని వాళ్ళ నాన్నకి పట్టింపు ఎక్కువ. ఇప్పటి అందరి అబ్బాయిల్లానే ఉంది నా జీతం, నా స్ధాయి. అయినా ఈ అమ్మాయి వాళ్ళనాన్నతో మాట్లాడదు. తనకి వాళ్ళనాన్నంటే భయం అట. నామీద ఉన్న ఇష్టం నిజమైతే ఆ అమ్మాయికి అంత భయమెందుకో” అన్నాడు నిరాశగా.
“అరే! అమ్మాయిలన్నాక ఆమాత్రం భయం ఉంటుంది తండ్రి దగ్గర. నువ్వు నిరాశ పడకు. నీ ప్రేమ సఫలం అవుతుంది” అంది స్పష్టంగా రంజని.
యాధావిధిగా పక్కింటి ఆంటీతో మాటలు సాగుతున్నాయి. కొన్నిరోజుల తరువాత తెలిసింది ప్రేమించిన అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదని, పెళ్ళికి వద్దని చెప్పిన విషయం.
రంజనికి చాలా దిగులేసింది సౌరభ్ ఏమయిపోతాడో అని. ఫోన్‍లో ధైర్యం చెప్పే మాటలు మాట్లాడింది.
“ఏమయ్యిందిప్పుడు? తనూ నేను కలుసుకోక సంవత్సరం దాటుతోంది. ఇప్పటికే తను నాపక్కన లేని వెలితికి అలవాటు పడిపోయాను. ఇప్పుడు కొత్తగా బాధ పడేదేముంది?” అని సౌరభ్ ఎదురు ధైర్యం చెప్పాడు. హమ్మయ్యా అనుకుంది రంజని.
కొన్నినెలలకు సౌరభ్‍కి పెళ్ళి కుదిరింది వేరొక అమ్మాయితో. ఇహ రంజని సౌరభ్‍కి ఫోన్ చేయటం ఆపేసింది. పెళ్ళికి రమ్మని తల్లీకొడుకూ కలిసొచ్చి శుభలేఖ ఇచ్చారు తనకి, భర్తకి. ఎందుకో వెళ్ళబుద్ధి కాక పెళ్ళికి వెళ్ళలేదు రంజనీవాళ్ళు.
ఇలానే మరొక అబ్బాయి మనసుని రంజింపచేయాలని మెసేజులు, ఫోన్లు మొదలుపెట్టింది రంజని.
మనసు గోలపెట్టేది తప్పుకదా ఇలా అని, రంజని మనసుకి చెప్పుకొనేది ఒక తల్లి కడుపుకోతకు గురికాకుండా ఉండటానికి, నేను కూసంత చరిత్రహీనను కావడం ఏం పర్వాలేదు అని.
కానీ ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. ఎవరి మనసు శాంతి కోసం తాను మాటలు కలిపిందో, అతను “మీ స్ధానం నా దృష్టిలో గొప్పది, మేలైనది. మీరు ఇలా చేసి దిగజారవద్దు” అని మెసేజ్ చేసాడు ప్రణవ్. అయినా ఆపక మెసేజులు చేసేది రంజని.
ఇహ ఒకరోజు సాయంత్రం ఫోన్ ప్రణవ్‍నుంచీ.
“మీరు చేసే పనిని నీచమైన పని అంటారు అని మీకు తెలుసా?” అని ఒకటే పెద్దమాట అన్నాడు. రంజని గట్టిగా అరిచేసింది. “ఎందుకంటారు నన్ను అలా? నేను చేసేదేమిటో నాకు తెలుసు” అని.
ఇహ మళ్ళీ సంఘోద్ధారణకు బయల్దేరలేదు మనోరంజని. రెండవ అతను చేదుగా చెప్పినా, నన్ను అయోమయంలోకి పడకుండా ఆపాడు అని అర్ధం చేసుకుంది రంజని. కానీ ఇద్దరూ సౌరభ్, ప్రణవ్ ఒకటే మాట చెప్పారు మీ స్ధానం మా దృష్టిలో గౌరవమైనది అని ఎందుకంటే మనోరంజని అసలు ఉద్దేశ్యం ఉల్లాసం కాదు, ఉద్ధరించడం అనుకుంది కాబట్టి.