విశ్వనాథ సత్యనారాయణగారి జీవితకాలం 10.9.1895 – 18.10.1976. వీరు బహుముఖప్రజ్ఞాశాలి. 57 నవలల్తోపాటుగా మొత్తం 127 పుస్తకాలు రచించారు. ఇందులో పన్నెండు నవలలు పురాణవైరగ్రంథమాలపేరిట మగథరాజుల పరంపరనీ, ఆరునవలలు కాశ్మీరరాజచరిత్రనీ, మరొక ఆరునవలలు నేపాలు రాజవంశచరిత్రనీ తెలియజేస్తాయి. వీరి రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది. వీరు పద్మభూషణ్ పురస్కార గ్రహీత. వీరి వేయిపడగలు గ్రంథాన్ని హిందీలోకి అనువదించినందుకుగాను పీవీ నరసింహారావుగారికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి పుస్తకాలన్నీ శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ సంస్థద్వారా ప్రచురించబడతాయి. ప్రస్తుతపు పుస్తకప్రతి ప్రచురణకాలం 2006. నవలలన్నిటినీ ఒక సెట్టుగా ప్రచురించినప్పుడు కొనటం జరిగింది. ఈ నవల రచనాకాలం 1966. కాశ్మీరరాజవంశ నవలల్లో ఇది మొదటిది.
భారతదేశ చరిత్ర చదివినవారికి చదివినంత, నమ్మినవారికి నమ్మినంత. భారతచరిత్రలో కాశ్మీరు, నేపాలు, మగధ రాజవంశాల చరిత్రలు ప్రామాణికమైనవి. ఐహోలు శాసనం ప్రకారం మహాభారతయుద్ధం క్రీ.పూ. 3138లో జరిగింది. యుద్ధపూర్వకాలంలో కథ మొదలౌతుంది.
మనదేశంలో రాజ్యాధికారం ప్రప్రథమంగా పురుషుడిది. ఈ ఏర్పాటుని స్త్రీపురుషులిద్దరూ ఆమోదించారు. భర్తకి రాజ్యపాలనలో సలహాసహకారాలు అందించడానికీ, తప్పనిసరైన పరిస్థితుల్లో రాజ్యపాలన చెయ్యడానికీ స్త్రీ ఎప్పుడూ సంసిద్ధంగా వుంటుంది, సమర్ధవంతంగా పాలిస్తుంది అనేందుకు యశోవతి ఒక వుదాహరణ.
విదేహరాజు కూతురు యశోవతి.
కాశ్మీరరాజు గోనందుడు. అతడి కొడుకు దామోదరుడు.
మగధ రాజు జరాసంధుడు.
మథుర రాజు కంసుడు.
గాంధార రాజు సుబలుడు.
హస్తినాపుర రాజు ధృతరాష్ట్రుడు.
యశోవతి చాలా తెలివైనది, చురుకైనది. విదేహరాజుకీ కాశ్మీరరాజు గోనందుడికీ స్నేహం వుంటుంది. గోనందుడికి జరాసంధుడు బంధువు, మితృడు. విదేహరాజుకీ జరాసంధుడికీ తటస్థం. జరాసంధుడిని చూడటానికి వెళ్ళినప్పుడల్లా గోనందుడు విదేహరాజు వద్ద బసచేస్తాడు. అలా అతడికి యశోవతి చేరికౌతుంది. ఆమెకి తన కొడుకైన దామోదరుడితో పెండ్లి జరిపించి కోడలిని చేసుకుని కాశ్మీరు తీసుకువస్తాడు. విదేహరాజ్యంలో అపారమైన గోసంపద వుంటుంది. పశుపాలకులైన గొల్లలద్వారా కృష్ణుని కథలు విని వుంటుంది యశోవతి. వాటిని పసిపిల్లగా వున్నప్పుడు గోనందుడికి వినిపిస్తూ వుండేది. అలాంటి కొన్ని కథలని భర్తకి కూడా చెప్తుంది. అతను పరిహాసం చేస్తుంటాడు. అప్పటికి శ్రీకృష్ణుడు పదకొండేళ్లవాడు.
తరువాత కొన్ని సంఘటనలు జరుగుతాయి. బలరామకృష్ణులు కంసుడిని చంపుతారు. కంసుడి భార్యలు జరాసంధుడి కూతుళ్ళు. కంసుడిపై యుద్ధానికి జరాసంధుడికి సాయంగా వెళ్ళిన గోనందుడు యుద్ధంలో చనిపోతాడు. దామోదరుడు రాజౌతాడు. తండ్రి మరణానికి కారణమైన యాదవులమీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. జరాసంధుడికి తన ఆలోచన చెప్తే జరాసంధుడు అతడిని వారిస్తాడు. ఈలోగా జరాసంధుడినే చంపిస్తాడు శ్రీకృష్ణుడు. దామోదరుడి పగ మరింత పెరుగుతుంది.
గాంధారరాజు సుబలుడు దామోదరుడికి మేనమామ. సుబలుడికి స్వయంప్రభ అనే కూతురు కలుగుతుంది. మరికొంతకాలానికి దామోదరుడికి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుక్కి తన తండ్రి పేరు పెట్టుకుంటాడు. రెండో గోనందుడు సంవత్సరంవాడై వుండగా స్వయంప్రభ స్వయంవరసందర్భంలో దామోదరుడు చనిపోతాడు. రాజు లేని రాజ్యాన్ని, వంటరిస్త్రీ ఐన యశోవతి స్వాధీనంలోకి తెచ్చుకుని కొడుక్కి యుక్తవయసు వచ్చేదాకా అతడి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించి, చివరికి అతడికి అప్పగిస్తుంది. తదుపరి పరిణామాలతో నవల ముగుస్తుంది. విశ్వనాథవారి శైలి, శిల్పం, కథలో అంత:సూత్రంగా నడిచే వాదోపవదాలు నవలకి అదనపు అలంకరణ.

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.