“నేను దేవుణ్ణి నమ్మను”
“దేన్ని నమ్మరు?”
“దేవుణ్ణి”
“కొంచెం వివరణ యిస్తారా?”
“దేనిగురించి?”
“మీరు దేన్నైతే దేవుడనుకుని నమ్మట్లేదో దాన్నిగురించి”
“దేవుడు లేడంటున్నానుకదా?”
“నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటాను.
నాకు యీత వచ్చును- అంటాను.
నేను నమ్మను- అని మీరనడంలో అర్థం వుంది. ఈతంటే ఏమిటో, రావడమంటే ఏమిటో మనిద్దరికీ తెలుసు. కానీ ఈ దేవుడేమిటో చెప్పండి”
“లేనిదానిగురించి ఎలా చెప్పను?”
“లేదని దేన్నిగురించి అనుకుంటున్నారు?”
“ఈ విగ్రహాలూ, పూజలూ అవీ “
“వాటిని చాలామంది నమ్మరు”
“దేవుడు భూమి, ఆకాశం నీరు, నిప్పు అన్నిటినీ సృష్టించాడనో, ఇవన్నీ దేవుడి రూపాలనో అంటారు”
“అదికూడా చాలామంది నమ్మరు”
“విశ్వం తయారయ్యే ప్రాసెస్‍లో ఇవన్నీ ఏర్పడ్డాయి. వాటిని దేవుడికి ఆపాదించడం నాకు నచ్చదు”
“అందరూ చెప్పేమాటే”
“దేవుడే అన్ని కష్టాలూ తీరుస్తాడని నమ్మటం, నమ్మించడం… అదో పెద్ద బిజినెస్‍గా మారిపోయింది”
“నిజమే. ఫెయిర్‍నెస్ క్రీమ్ వాడితే తెల్లబడతారా?”
“??!!! తెల్లబడరు”
“అదీ నమ్మకంమీద చేసే వ్యాపారమేకదా? దాన్నెందుకు మీరు ఖండించరు?”
“వయసులో వున్న పిల్లలకి తెల్లగా కనిపించాలన్న కోరిక వుంటుంది. మనదగ్గిర మరీ ఎక్కువ. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళవవు ఒక్కోసారి”
“తెల్లగా వుండటమే అందమనే నమ్మకాన్ని ఎందుకు ఖండించరు?”
“ప్రతీదీ ఖండించడమే మా పనా? వాళ్ళ అమ్మలూ నాన్నలూ చెప్పుకోవాలి. ఆ అమ్మల్నీ నాన్నల్నీ ఎడ్యుకేట్ చేసే పని మాది”
“డబ్బయ్యైదువేలసంవత్సరాలకిందట ఒక అగ్నిపర్వతం పేలింది. నాగరికత నాశనమైంది. నలభైరేండువేల సంవత్సరాలకిందట మరో వుత్పాతం జరిగి ఉత్తరదక్షిణధృవాలు తారుమారయ్యాయి. నాగరికత మళ్ళీ నాశనమైంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనుషులు మనచేతిలో ఏదీ లేదనుకుంటారు. ఆ నిస్సహాయతకే దైవత్వాన్ని ఆపాదిస్తారు. దాన్నికూడా మీరు వప్పుకోరా?”
“దేవుడితో ముడిపెట్టడం దేనికి? అగ్నిపర్వతాలు, భూమియొక్క అయస్కాంతక్షేత్రం ఇవన్నీ విశ్వం తయారీలో భాగం”
“అంటే ఆ ఎక్స్‌ప్రెషనే మీరొప్పుకోరు”
విజయగర్వంతో కూడిన చిన్న చిరునవ్వు.
“మీరున్నారా?”
“అదేమిటి, కళ్ళెదురుగుండా కనిపిస్తునే వున్నానుకదా?”
“మీరంటే?”
“నేనే”
“పుట్టినప్పుడు తెలుసా మీకు, మీరని?”
“ఎలా తెలుస్తుంది? పెద్దౌతున్నప్పుడు మిగతావాళ్ళు చెప్తే తెలుస్తుంది. ఓ అమ్మకి కూతుర్ననీ, ఒక అన్నకి చెల్లెల్ననీ బంధాలు ఏర్పరుచుకుంటాం. అవే మనకి మొదటి గుర్తింపు”
“మీవాళ్ళు చెప్తే అందరూ నమ్మాలి. ఒక నమ్మకం- అంతేనా, మీరంటే?”
ఎలా చెప్పినా, ఏదో ఒక ప్రతివాదం వుంటుందన్న అవగాహనతో కూడిన ఆలోచన.
“ముప్పయ్యేడున్నర ట్రిలియన్ల కణాలు… ఒకొక్క కణంలో వంద ట్రిలియన్ అణువులు… అది నేను. కొన్ని ఆలోచనలు, కొన్ని అనుభవాలు… అది నేను”
“మన శరీరంలో వుండే కణాలు నిత్యం పుడుతూ చచ్చిపోతూ వుంటాయి. మూణ్ణెల్లు గడిచేసరికి పైకి కనిపించే కణాలన్నీ మారిపోయాక మీరు మీరెలా ఔతారు?”
“రిడిక్యులస్. నా శరీరకణాలు మారినా, నా ఆలోచనలకి మూలమైనచోటికి సంబంధించిన పుర్రె కణాలు అంత తేలిగ్గా నశించడం, మళ్ళీ పుట్టడం జరగదు. సెల్యులార్ డీఎన్‍ఏ మారదు”
“డబల్ స్లిట్ ప్రయోగం ప్రకారం గమనించేవాళ్ళుంటేనే అణువు పదార్ధస్థితిలో వుంటుంది. లేకపోతే తరంగంలా సాగిపోతుంది. మీరుగా చెప్పుకుంటున్న మీరు మేం చూడ్డం ప్రకారమే ఏర్పడ్డారుకదా? ఇక్కడున్న యిన్ని వందలమందీ మా ఆస్వాదన(పెర్సెప్షన్) ప్రకారమే మిమ్మల్ని చూస్తున్నట్టుగానీ, మీరనుకున్నట్టు కాదు. మీరేనా పూర్తిగా వ్యక్తపడ్డారా అంటే అలా వ్యక్తపడటానికి చాలా పరిధులు వుంటాయి. అప్పుడు మీరు పూర్తి మీరెలా ఔతారు?”
“మీరు చెప్తున్న సిద్ధాంతం నాకు తెలీదు”
“మీరని ముద్రవేసుకున్న ట్రిలియన్ల అణువులు ప్రతినిత్యం తరంగాల్లా కదిలిపోతూ ఉంటాయని ఇంకో సిద్ధాంతం. అంటే ఇప్పుడు మీరు అని అనుకుంటున్న తరంగసమూహం క్షణంకిందట వున్నదికాదు. మరి మీరెలా ఔతారు?”
“సైన్సులో నిత్యం ఏవో పరిశోధనలు చేస్తునే వుంటారు. అవన్నీ మనకి తెలుసుకోవలసిన అవసరం వుండదు. మనం నిత్యం చనిపోయే కణాల సముదాయమైనా, ప్రవహించే అణుతరంగాలమైనా, మరేదైనాకూడా మన జీవితాల్లో వచ్చే మార్పేమీ వుండదు”
“కదా?”
“ఔను. ఈ విషయాలన్నీ తెలుసుకోవడంవలన మనకి ఎలాంటి వుపయోగం వుండదు. అనవసర విషయాలతో బుర్రనింపుకోవడం తప్ప”
“మీ అమ్మగారు?”
“చనిపోయారు”
“చనిపోయారని నమ్ముతున్నారా?”
“అదేంటి? నేను కళ్ళతో చూస్తేను?’
“మల్టీవర్స్ సిద్ధాంతం ప్రకారం ఆవిడ ఇంకేదోచోట బతికే వున్నారు”
“కావచ్చు. అప్పుడొక వివరణ ఇవ్వాల్సి వుంటుంది. ఈ విశ్వానికి సంబంధించినంతవరకూ ఆమె చనిపోయారు అని”
“అక్కడ మీరు ఆమె కూతురు కాదు”
“కాదు”
“అస్తిత్వం లేని మీకే ఇన్ని నిర్వచనాలుంటే, మీరు లేడనుకుంటున్న దేవుడికి ఒక్కటేనా వుండదా?”
“అదేదో మీరే చెప్పండి”
“కార్యాకారణకర్తృత్వాన్నీ, వాటిమధ్య సంబంధాన్నీ, కార్యాన్నీ, కారణాన్నీ, ఫలితాన్నీ- అనంతవిశ్వంతో మొదలుపెట్టి పిపీలికాది ప్రాణివరకూ జరిగేవన్నిటినీ దేవుడికి ఆపాదించి ఒక నిర్భయత్వంలో వుంటారు ఆస్తికులు. ఈ మన:స్థితిని వ్యక్తపరిచేది భక్తి. దానికి వివిధస్థాయులు. పండితుడిది ఒక స్థాయి, పామరుడిది మరొకస్థాయి. వీటన్నిటికీ వ్యతిరేకుడు లేనిదేవుడు”
“లేనిదేవుడా?”
“ఔను. ఆయనో కొత్తదేవుడు. ఇప్పుడే పుట్టాడు”
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.