ఆ యింటిగురించీ ఆవిడగురించీ కొద్దిగా చెప్పాలి.
నేను ఆ యింటిముందునించీ వెళ్ళడం మొదలుపెట్టి దాదాపు ఏడాదైంది. మా ఆఫీసుకి వెళ్ళేదార్లో వుంటుంది. ఆ ఇంటిదగ్గర కుడివైపుకి మలుపు తిరగాలి. ఎడమవైపుని చిన్నవాగూ, దానిమీద వంతెనా వుంటాయి. వాగుకి ఆ వొడ్డునీ, ఈ వొడ్డునీ వున్న నాగమల్లిచెట్ల పూలు సీజన్లో వంతెనమీద రాల్తూ వుంటాయి. వంతెనకి కాస్త దూరంలో విశాలమైన ఆవరణలో కట్టిన పెద్ద, పాతకాలం యిల్లది. ఒకటే అంతస్తు. చాలా పాతది. బయటినుంచీ చూస్తే నాలుగైదు పడగ్గదులూ, హాలూ, వసారాలూ వుంటాయని అంచనా వేయచ్చు. ఇంటిముందు ప్రహరీగోడకి బయటివైపు రెండు అరలున్న వెడల్పైన ఇనుపబీరువాలాంటిది బిగించి వుంటుంది. కింది అరకి తలుపు వుండదు. అందులో మిగిలిపోయిన ఆహారపదార్థాలతోపాటు చీరలు, దుప్పట్లు, పాత్రసామాను ఇంకా రకరకాల వస్తువులు పెడుతుంటారు. అన్నీ వాడేసినవే. చెత్త ఏరుకునేవాళ్ళూ, పాతసామాన్లవాళ్ళూ కూలీనాలీ చేసుకునేవాళ్ళూ తీసుకుంటూ వుంటారు. పై అర మాత్రం తాళంవేసి ఉంటుంది. దానిమీద రెండు పంక్తుల అక్షరాలు.
Empty the box అని ఇంగ్లీషులో పైనా, “తాళంచెవికోసం లోపలికి రాగలరు” అని తెలుగులో కిందనా వుంటాయి. వాటి పక్కని ఒక అంకె రాసి వుంటుంది. అది రోజూ మారుతూ వుంటుంది. నేను మొదటిసారి గమనించినప్పుడు అది 101 గా వుంది. ఇప్పుడది 253. వాటిని గమనిస్తూ ఇంకొంతకాలం గడిపాను. పై అరలో ఏముందోనని వూహిస్తూ వుండిపోయానే తప్ప, లోపలికి వెళ్ళి తాళం తీసుకుని చూడాలన్న ఆలోచన రావటానికి మరికొంతకాలం పట్టింది.
ఈమధ్యలో టాటా గుడ్‍ఫెల్లోస్ లోగో వున్న వాహనం ఒకటి రెండుమూడుసార్లు ఇంటిముందు చూసాను.
ఆరోజు ఆఫీసునించీ వస్తుంటే పెద్దవాన అందుకుంది. తప్పనిసరై ఆ యింటిముందు రోడ్డుకి రెండోవైపుని వున్న చెట్టుకింద బైకు ఆపుకుని దిగాను. అప్పుడు వచ్చింది ఆలోచన. ఆ యింట్లోకి వెళ్ళాలని. కొంచెం తటపటాయించి ఇంటిగేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టాను. అనుకున్నట్టే పెద్దయిల్లు. గ్రిల్ పెట్టిన వరండా ఆ చివరనుంచీ ఈ చివరదాకా వుంది. కొంచెం సంకోచించి ముందుకి అడుగేసాను. వరండాలో వాలుకుర్చీలో ఒక వృద్ధురాలు కూర్చుని వుంది. నా అడుగుల చప్పుడికి నిఠారుగా కూర్చుంది.
ఆమెని నేనూ, నన్ను ఆమే నిశితంగా చూసుకున్నాం. నాలో ఆమె ఏమి గమనించిందోగానీ, నాకు అర్థమైందిమాత్రం ఆమెకి వందకి దగ్గరగా వుంటుంది వయసు. కాలిమడమల పైకి వున్న గౌను వేసుకుంది. తెల్లటి జుట్టు బాగా పొట్టిగా కత్తిరించి వుంది. ఆ గౌనుతప్ప ఆమె వంటిమీద మరేమీ లేవు. ఆకులన్నీ రాల్చేసుకున్న చెట్టులా వుంది. నిల్చున్నచోటినుంచే ఇల్లంతా కనిపించినంతవరకూ చూసాను. దాదాపు ఖాళీగా వుంది. ఖాళీయింటికి అలంకారంలా ఆమె.
“కూర్చోండి” కళ్ళతోటే కిటికీగట్టు చూపించింది. పాతకాలం యిల్లవడంతో కిటికీగట్టు నేను కూర్చోగలిగేంత వెడల్పుగా వుంది. శుభ్రంగానూ వుంది. కూర్చున్నాను.
“తాళంచెవికోసం వచ్చారా?” అడిగింది.
తలూపాను.
“ఇప్పటిదాకా ఎవరూ రాలేదు. మనుషుల్లో ఇంతగా కుతూహలం లేకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది” అంది. నేను తలూపాను. అందుకు నేనే పెద్ద వుదాహరణ. ఏముంది అందులో, అంత జాగ్రత్తగా తాళం వేసి పెట్టడానికి? అంత విలువైనవైతే రోడ్డుమీద ఎందుకు పెడతారు? అన్న పరస్పర విరుద్ధమైన ప్రశ్నలు నాకు నేనే వేసుకుని సమాధానపడ్డాను.
“ఎంతకాలంగా మీరు ఇటొస్తున్నారు?” అడిగింది. కొంచెం ఇబ్బందిపడుతూ చెప్పాను. ఆమె నవ్వింది.
“ఇప్పుడేనా వర్షంపడుతోందిగాబట్టి వచ్చారన్నమాట!” అంది. “మరి తాళంచెవి అవసరమా? వాన తగ్గేదాకా కూర్చుని వెళ్ళిపోతారా?” అడిగింది.
“మనిషన్నాక ఆగకుండా పరుగుపెట్టాలి. పొద్దున్న పిల్లలనీ, భార్యనీ దింపి ఆఫీసుకోసం పెట్టే పరుగు. రాత్రి తిరిగివెళ్ళేసరికి ఇక ఆగకుండా చెయ్యాల్సిన పరుగు. ఈరోజు వాన అవకాశాన్ని కల్పించింది” అన్నాను.
“నిజమే. జీవితమంతా అవకాశాలని వెతుక్కుంటూనే వుంటాం. ఇంత మలివయసులోకూడా నా వెతుకులాట ఆగలేదు” అంది.
“మీరొక్కరేనా?” అడిగాను.
“కొంతవయసు వచ్చాక కాలం దూరంగా మారిపోతుంది. మనతో కలిసి నడిచినవాళ్లెవరూ చివరిదాకా రారు. అంతా మధ్యలో వచ్చి మనకన్నా ముందో, మనని దాటుకునో వెళ్ళిపోయేవాళ్ళు. నా భర్తా, పిల్లడూ అందరూ వెళ్ళిపోయారు. ఐనా ఇంకా బతికి వున్నాను. మృత్యువు వచ్చి నన్ను ఆహ్వానిస్తుందేమోననే ఆశతో వున్నాను” అంది. ఆమె గొంతు నిర్వికారంగా వుంది.
“భయం వెయ్యదూ? ఒక్కరూ వున్నారని తెలిసి ఎవరేనా ఏదేనా చేస్తే?” కుతూహలంగా అడిగాను.
ఆవిడ నవ్వింది. “మీ జీవితకాలంలో మీరు ఎన్ని మర్డర్లు చూసారు?” అడిగింది.
తల అడ్డంగా వూపాను.
“పోనీ మీ చుట్టుపక్కల ఎంతమంది ఎవరో చంపితే చచ్చిపోయారు?”
“ఎవరూ లేదు”
“అంతే మరి. లక్షకి ఒకళ్ళో ఇద్దరో హత్య చేయబడతారు. దాన్ని టీవీలో పదేపదే చూపిస్తారు. మనం మనచుట్టూ క్రైం వుందని భయపడుతూ జీవితమంతా గడుపుతాం. కానీ లక్షకి పదిమంది యాకిడెంట్లలో చనిపోతారు. మనం రోడ్డుమీదికి రావడానికిగానీ, వాహనం నడపడానికిగానీ భయపడం. కారణం మొదటిభయానికి తీరికవేళ తోడౌతుంది. రెండో భయాన్ని అణచడానికి ఒక అవసరం వుంటుంది. అంతే తేడా” అంది. ఆమె విశ్లేషణకి ఆశ్చర్యం కలిగింది. చదువుకున్నదే కావచ్చుననుకున్నాను.
ఆమె నాపట్ల కుతూహలం చూపించలేదు. నా వివరాలు అడగలేదు. కానీ ఒక సాధారణసత్యాన్ని చెప్పింది.
“ముప్పయ్యేళ్ళ వయసులో వున్న యువకుడిలో పెద్ద ప్రత్యేకతలు ఏం వుంటాయి? కష్టపడి చదవటం, ఐఐటీలోనో మరో ప్రముఖ విద్యాసంస్థలోనో సీటు తెచ్చుకోవడం, మంచి వుద్యోగం సంపాదించుకోవడం, కేరీర్ అనే నిచ్చెన పట్టుకుని వేలాడటం, మనిషిపుట్టుక పుట్టినందుకు మరో ఆడమనిషిని పెళ్ళిచేసుకుని పిల్లలని కనడం వాళ్లకోసం పరుగుపెట్టడం… అంతేకదూ? మేము అలానే చేసాము. ఒకప్పుడు నా కొడుకు, ఇప్పుడు మనవడుకూడా” అంది. అది నాగురించి అడగకపోవటానికి వివరణలా వుంది.
నాకు చిన్నకోపంలాంటిది వచ్చింది. ఏడాదికి పాతికలక్షల జీతం తెచ్చుకుంటున్న నా స్టేచర్ని అంత చులాగ్గా తీసిపారేసినందుకు.
వర్షం తగ్గింది. నాకింక అక్కడ వుండాలనిపించలేదు. తాళం చెవి అడిగాను, ఎలాగా వచ్చానని. ఆమె నా ఎదురుగా గోడకి వున్న మేకుకేసి సూచించింది.
“ఎవరేనా వస్తారని ఆశపడ్డాను. ఎవరూ రాలేదు. మొదటివ్యక్తి మీరు” అంది. అందులో ఏముందో చెప్పలేదు. పెద్దగా ఆసక్తి లేదుగాబట్టి నేనూ అడగలేదు. తాళంచెవి తీసుకుని నడిచాను. గేటు దాటుతూ ఒక్కక్షణం ఆగాను. అప్పటికే బాగా చీకటిపడింది. ఇంత చీకట్లో ఆ అర తెరవడం అవసరమా అనిపించింది. గేటు వేసేసి తాళంచెవి బేక్‍పేక్‍లో వేసుకుని వచ్చేసాను.
ఆ తర్వాత ఎన్నోరోజులు అటు వెళ్లలేదు. కావాలనే. మరోదారి తీసుకున్నాను. మానవసహజస్వభావం అనుకుంటాను. బేక్‍పేక్‍లో వేసిన తాళంచెవి బరువుగా అనిపిస్తోంది. వెళ్ళి తిరిగి ఇచ్చేస్తే? అందులో ఏం వుంటే నాకెందుకు? ఆరోజు వర్షం పడకపోయి వుంటే వెళ్ళాలనుకుంటూ వుండేవాడిని తప్ప నేను ఆ యింట్లోకి వెళ్ళేవాడిని కాదు. ఈ బరువు నాకు తగిలేది కాదు. తాళంచెవి బరువు రోజురోజుకీ పెరిగిపోతోంది.
ఆఖరికి ఒకరోజు వెళ్ళాను. ప్రహరీగోడకి బీరువా లేదు. దానిస్థానంలో “సాగరికా వృద్ధాశ్రమం” అని పెద్దబోర్డు వుంది. లోపలికి వెళ్ళడానికి ఎలాంటి సంకోచం కలగలేదు ఈసారి. ఇల్లు అలానే వుంది. మార్పల్లా వరండాలోని పెద్దామె లేదు. అక్కడ ఒక ఆఫీసు, కొన్ని బలల్లు, బల్లలమీద వృద్ధులు వున్నారు.
“పెద్దావిడ?” అడిగాను ఆశ్రమం మేనేజరుని. అనుమానంగా.
“మనవడొచ్చి తీసుకెళ్ళిపోయాడు. అమెరికాకి” జవాబిచ్చాడు. తేలిగ్గా నిశ్వసించాను.
“ఇల్లు?”
“మాకు రాసిచ్చేసారు”
“మీకామె తెలుసా?”
“తెలుసు. ఆవిడ మా ప్రొఫెసరు. మరో ప్రొఫెసర్ని చేసుకుంది. ఒక్క కొడుకు. అతను డబ్బైరెండేళ్ళ వయసులో హార్టెటాక్‍తో పోయాడు. కోడలు అంతకుముందే చనిపోయింది. వాళ్ళకి ఒక్కడే కొడుకు. అమెరికాలో వుంటాడు. మొదట్నుంచీ వీళ్ళు భార్యాభర్తలిద్దరే ఇక్కడ వుండేవారు. మూడేళ్ళక్రితం ఆయనా పోయాడు. మనవడు తన దగ్గిరకి వచ్చెయ్యమని ఎంత అడిగినా వెళ్లలేదు సాగరికగారు. మూడేళ్ళ టైమ్ తీసుకుంది. ఆలోపల తను చనిపోతాననే గట్టినమ్మకంతో వుండేది. ఏదో సిద్ధాంతం. భార్యాభర్తలు ఒకళ్ళు పోయాక రెండోవాళ్ళు మూడేళ్ళలో పోతారని. తనే కనిపెట్టింది. అసలు ప్రతిరోజూ తను చచ్చిపోయిందనే నమ్మకంతోటే నిద్రలేచేది”
“మనిషి మృత్యువుని ప్రేమించగలరా?” ఆశ్చర్యంగా అడిగాను.
“ఆ వయసులో ప్రేమించగలరేమో!”
“…”
“వెయ్యీ అరవయ్యైదురోజులపాటు ఇంట్లో వున్న వస్తువులన్నీ ఒకొక్కటీ ఇచ్చెయ్యటమే ధ్యేయంగా పెట్టుకుని అన్నీ యిచ్చేసింది. ఆవిడ వదులుకోలేకపోయిన నిధి ఒకటుంది. ఒకప్పుడు వాళ్ళదగ్గిర బీరువాలనిండా పుస్తకాలు వుండేవి. భార్యాభర్తలిద్దరూ వాటిని చదువుకుంటూ చర్చించుకుంటూ వుండేవారు. ఎవరెవరో స్నేహితులు వచ్చేవారు. ఆ చర్చల్లో పాల్గొనేవారు. క్రమంగా వచ్చేవాళ్ళ సంఖ్య తగ్గి, పూర్తిగా ఆగిపోయింది. ఆయనపోయాక ఆవిడ చదవడం మానేసింది. తోడులేనిదే ఏపనీ చెయ్యలేం కదా? చదవటానికి ఒక సొగసు వుంటుంది- చదవటం, అర్థం చేసుకోవడం, మనకి అర్థమైనదాన్ని మరొకరితో చర్చించడం, వాళ్ళకోణంలోంచీ మళ్ళీ అర్థం చేసుకోవడం… ఇదొక నిరంతర ప్రక్రియ అని ఆవిడ అభిప్రాయం. మామూలుగా మార్కెట్లో దొరికే పుస్తకాలన్నీ తీసేసింది. మిగిలినవి అరుదైన పుస్తకాలట. ఆ అరలో పెట్టి అది తెరవడంకోసం ఎవరేనా వస్తారని ఎదురుచూసేది”
“పుస్తకాలా, ఇంతాచేసి అందులో వుండేవి?” అన్నాను నిరుత్సాహంగా.
“బాల్యచాపల్యంలాగ వృద్ధచాపల్యంకూడా వుంటుందేమో! తరుచుగా ఇద్దరం కలుస్తునే వున్నా నాతోకూడా ఎప్పుడూ అనలేదు”
“మీరెప్పుడూ తాళంచెవి తీసుకోలేదా?”
“అడిగినా ఇవ్వలేదు”
“ఎందుకో?”
“అవి నాకు వుపయోగపడవని తెలుసు”
“ఈరోజుల్లో అంతా ఆన్‍లైన్లో దొరుకుతున్నప్పుడు పుస్తకాలు ఎవరు చదువుతారు?” అన్నాను.
“అసలు అంత తీరిక ఎవరికి వుంది? రిటైరయ్యాకకూడా ఏదో ఒకటి చేస్తునే వున్నారు. నేనీ ఓల్డెజిహోం పనుల్లో తలమునకలుగా వుంటాను. పేపరుకూడా చదవను. మా అబ్బాయి చేతిలో కథల పుస్తకం ఎప్పుడూ పెట్టలేదు. అంత స్ట్రిక్టుగా పెంచాను. పైకొచ్చాడు. అరకోటికి దగ్గర్లో జీతం” కొంచెం గర్వంగా అన్నాడాయన.
“నాన్నలంతా అంతేనేమో! సబ్జెక్టు పుస్తకాలు తప్ప మరోటి వుంటాయనికూడా నాకు తెలీదు” నేనూ అన్నాను.
“అందుకేకదా, మధ్యతరగతివాళ్ళం నాలుగు పైసలు కళ్లచూస్తున్నాం. లేకపోతే ఏముంది? వాడూ వీడూ రాసినవి చదివి కాలయాపన చెయ్యడమో, బుర్రకి ఎక్కించుకుని లేనిపోని సిద్ధాంతాలతో చెడిపోవడమో జరిగేది”
ఇద్దరం ఒకరి వీపు మరొకరం కాసేపు గోక్కున్నాక నెమ్మదిగా అడిగాను.
“ఇంతకీ ఆ పై అర తెరిచారా? పుస్తకాలేనా?”
“అసలు ఇన్నిరోజులు బీరువాని ఎవరూ పగలగొట్టకుండా ఎలా వదిలేరా అనుకున్నాను. చాలా దృఢంగా వుంది. కష్టపడ్డారు పగలగొట్టడానికి. తెరవగానే ఆరు తుమ్ములొచ్చాయి ఒకదానివెనుక ఒకటి వరసగా. తాళం తెరిచి పెట్టాను. మర్నాడు పొద్దున్నకల్లా ఖాళీ ఐపోయాయి” అని నవ్వాడతను.
నేనూ నవ్వేసాను. అవి ఎవరు తీసుకుని వుంటారో వుహించడానికి పెద్ద కష్టపడలేదు. వస్తూ వస్తూ తాళంచెవి వాగులోకి విసిరేసాను.
కానీ వాటిని ఎవరికో ఒకరికి ఇచ్చెయ్యక ఆవిడ అంత ప్రయాస ఎందుకు పడిందోమాత్రం అర్థమవలేదు. కొన్ని విలువైన వస్తువులకి వర్తించే వదులుకోలేక, వదిలించుకోలేక అనే సూత్రం ఇక్కడా వర్తిస్తుందని నాకు తెలీదు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.