స్వతంత్రపోరాటం- అర్థం చేసుకునే ఒక ప్రయత్నం by S Sridevi

యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వెంత బలవంతుడివనే విషయానికన్నా ఎవరితో తలపడుతున్నావన్నది ముఖ్యం. నక్కతో యుద్ధం చేసేప్పుడు నక్కలాగా, పులితో యుద్ధం చేసేప్పుడు పులిలాగా వ్యూహాలని మార్చుకోగలిగినప్పుడే మనిషి గెలవగలడు. భారతయుద్ధంలో శిఖండిని చూపించి భీష్ముడినీ, ధర్మరాజుచేత అబద్ధం చెప్పించి ద్రోణుడినీ తప్పించడంవల్లనే పాండవులు గెలిచారు. ఈ విషయాలు మర్చిపోయినందుకు భారతదేశం చాలా మూల్యం చెల్లించింది.
సాధారణశకం 636లో థానేమీద జరిగిన మొదటిదాడి తర్వాత 570 సంవత్సరాలపాటు మనదేశ వాయవ్య దిశనుంచీ నిరంతరాయంగా లెక్కలేనన్నిసార్లు దాడులు జరిగాయి. ఫలితంగా వుత్తరహిందుస్థానం బలహీనపడి, 1206లో ఢిల్లీలో విదేశీపాలన మొదలైంది. అనేకమార్లు అధికార మార్పిడి జరిగి, చివరికి దేశం మొత్తం బ్రిటిషుపాలన కిందికి వచ్చింది. 1947లో స్వతంత్రం వచ్చేవరకూ గోవా, డయ్యూ, డామన్, పాండిచ్చేరి, యానాంవంటి కొన్ని ప్రాంతాలుతప్ప మిగిలిన భారతభూభాగం అంతా బ్రిటిషువారి ప్రత్యక్ష లేదా పరోక్షపాలనలో వుండేది.
ఆతర్వాత మొదలైంది, శతాబ్దాల పరాయిపాలననుంచీ విముక్తికోసం పోరాటం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి 76 సంవత్సరాలైంది. పోరాటాలలో పాల్గొని, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పర్యవసానాలని అనుభవించిన తరాలన్నీ దాదాపుగా గతించిపోయాయి. ఇప్పటి తరాలకి ఆ వివరాలు తెలియాలంటే ఆ పోరాటంలో ప్రత్యక్షపాత్ర వున్నవారో, ఆ సంఘటనలు జరుగుతూ వున్న కాలంలో బతికి వున్నవారో రాసిన పుస్తకాలు తరగని పెన్నిధిలాంటివి.
అలాంటి ఒక పుస్తకం The Price of Partition. రచయిత రఫీక్ జకారియా. ఈ పుస్తకం భారతీయ విద్యాభవన్ ప్రచురణ. స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు గడిచిన సందర్భంగా 1998లో ప్రథమముద్రణ జరిగింది. 2002లో రెండవముద్రణ జరిగింది. రెండవముద్రణ ప్రతి వెల 150/- మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్‍గారు ఈ పుస్తకానికి ముందుమాట రాయగా, ప్రముఖరచయిత ముల్క్ రాజ్ ఆనంద్‍‍గారు ఆఖరిమాట రాసారు. The Price of Partition రచయిత ఆత్మకథ. వారి రాజకీయజీవితానికి దర్పణం పడుతుంది. స్వతంత్రపోరాటంలో రచయిత ప్రభావశీలమైన పాత్ర పోషించనప్పటికీ, స్వాతంత్ర్యోద్యమంలోని అన్ని ముఖ్యదశల్లో అతనికి ఎంతోకొంత చోటు వుంది. ఎందరో ప్రముఖులని కలిసారు. వారివల్ల ప్రభావితులయ్యారు. గాంధీ, నెహ్రూ, సరోజినీ నాయుడు మొదలైన కాంగ్రెస్ పెద్దలు తాను ముస్లింనని చెప్పగానే ఎంతో ఆప్యాయంగా పలకరించిన సందర్భాలు చెప్తారు. దేశవిభజనకి మౌంట్‍బాటెన్, జిన్నా కారకులన్నది రచయిత దృఢమైన అభిప్రాయం. అదేవిధంగా మతం విషయంలో జిన్నాయొక్క ద్వంద్వవైఖరిని విమర్శిస్తారు.
రఫీక్ జకారియా ఉన్నతచదువులు చదివి, న్యాయ, విద్యా, రాజకీయ, పాత్రికేయ, ఇస్లామిక్ స్టడీస్ సంబంధిత రంగాలలో అనేకపదవులు నిర్వహించారు. ఐక్యరాజ్యసమితికి భారతప్రతినిధిగా చేసారు. వీరు 1920లో బొంబాయికి ముప్పైమైళ్ళ దూరాన్న వున్న సొపారా అనే వూళ్ళో సాంప్రదాయ కొంకిణీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఊహ తెలిసినప్పటినుంచీ ముస్లింతెగల్లో వుండే అంత:కలహాలు, హిందూముస్లింల మధ్య జరిగే మతకలహాలు చూస్తూ పెరిగారు.
రచయిత పుట్టిన సమయానికి భారతీయులలో మొదలైన ప్రతిఘటనేచ్ఛ స్వతంత్రపోరాటంగా రూపుదిద్దుకుని వూపందుకుంది. 1885లో స్థాపించబడిన కాంగ్రెస్, 1906లో మొదలైన ముస్లిం లీగు ప్రధాన రాజకీయశక్తులు. జలియన్‍వాలా బాగ్ దౌష్ట్యానికి నిరసనగా గాంధీ సహాయనిరాకరణోద్యమాన్ని మొదలుపెట్టగా, కాబా నిర్వహణని టర్కీ సుల్తాను దగ్గర్నుంచీ తొలగిస్తున్నందుకు నిరసనగా ఖిలాఫత్ వుద్యమాన్ని మొహ్మద్ అలీ, షౌకత్ అలీసోదరులు ప్రారంభించారు. ఒకటి దేశంలో జరుగుతున్న అరాచకాలకి వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ పోరాటం. మరొకటి దేశం బయట జరిగిన సంఘటనకి మద్దతుగా జరుగుతున్న మతపోరాటం. ఒకటి యావత్తుదేశం జీవన్మరనపోరాటమైతే మరొకటి ఒక వర్గం ప్రజల నమ్మకాలకీ భావోద్వేగాలకీ సంబంధించినది. కాంగ్రెసుపక్షాన గాంధీ ఖిలాఫత్ వుద్యమానికి మద్దతు పలికారు. ముస్లింసమాజం చాలా సంతోషించింది. గాంధీని బొంబాయిలోని జామా మశీదుకి ఆహ్వానించి ఉపన్యసించమని కోరారు. రెండు వుద్యమాలూ ఒకటిగా కలిసిపోయి ముమ్మరంగా సాగుతున్న సమయాన చౌరాచౌరీవద్ద కొంత హింస జరిగిందన్న కారణాన్న వుద్యమాన్ని అర్ధాంతరంగా విరమించుకున్నారు గాంధీ. ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని ముస్లింలు మోప్లావద్ద హిందువులని వూచకోతకోసారు. వారి ఆగ్రహానికి వేరే కారణాలున్నా, దాన్ని జ్వలింపజేసిందిమాత్రం వుద్యమాన్ని ఆపడం. ఇది పుస్తకంలోని ప్రారంభ సంఘటన. ఐతే గాంధీజీని మశీదుకి ఆహ్వానించి గౌరవించినంతవరకే వివరిస్తారు రచయిత. గాంధీని హిందువుల కొత్త అవతారముర్తిగానూ, వుద్యమాన్ని ఒక హిందువు నేతృత్వంలో జరిగిన అరుదైన మతసామరస్య సంఘటనగా వర్ణిస్తారు. చదువంతా ముస్లిమ్ విద్యాసంస్థల్లో చదవడంచేత హిందూ విధ్యార్థులని కలుసుకునే సందర్భాలు తటస్థించలేదని చెప్తారు. బాలగంగాధర్ తిలక్ వినాయక చవితిని బహిరంగ వుత్సవంలా జరిపించడం హిందూముస్లింఘర్షణలకి కారణంకాదా అని ప్రశ్నిస్తారు.
గాంధీ, నెహ్రూలపట్ల వున్న ఆరాధనతో కాంగ్రెసులో చేరి, చివరిదాకా కాంగ్రెసు అనుయాయిగానే వున్నారు. భారతవిభజనకి పూర్తి వ్యతిరేకంగా వుండి, చివరిదాకా విభజన జరగకూడదని బలంగా ఆకాంక్షించారు. ముస్లింలీగుకి వ్యతిరేకంగా కాంగ్రెసులో వున్నందుకు, దేశవిభజనని వ్యతిరేకించినందుకు స్వంతముస్లిం సమాజంనుంచీ ఎన్నో వివక్షలని ఎదుర్కొన్నారు. ముస్లింలీగునేత, జిన్నా ముస్లింలకి ప్రత్యేకదేశంకోసం పోరాడుతుంటే విభజన తర్వాత హిందువులు అధికంఖ్యలో వుండే హిందుస్థాన్‍లో అల్పసంఖ్యాక ముస్లింలు సురక్షితంగా వుంటారా అని రఫీక్ జకారియా ఆందోళనపడ్డారు. కాశ్మీరు అంశం జుల్ఫీకర్ అలీ భుట్టోతో మాట్లాడినప్పుడుకూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తపరిచి, భుట్టో కోపానికికూడా గురౌతారు. వారి ఈ తపన పుస్తకంలోని ప్రతి అక్షరంలో ప్రతిబింబిస్తుంది. ఒకవైపుని జిన్నా దేశవిభజనకోసం సర్వశక్తులూ వినియోగిస్తుంటే హిందూ ముస్లిమ్ సమైక్యత అనే ఎండమావి వెనుక పరుగులు తీస్తూ, తప్పు నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెసు హిందువుల మనుగడని ప్రమాదంలో పడేసింది. శతాబ్దాలతరబడి స్వంతభూమిపైన అకారణంగా విపరీతమైన హింసనీ, మారణకాండనీ, పీడననీ ఎదుర్కొన్న హిందువులగురించి అలా ఆలోచించి, తపించిన నాయకులెవరూ కనిపించక మనసు బరువెక్కుతుంది పుస్తకం అంతా చదివాక. రచయితకూడా స్వతంత్రానికి ముందూ, దేశవిభజన సందర్భంలోనూ, ఆ తర్వాతా జరిగిన హింసాకాండలో హిందువులని సహభాగస్తులని చేసారుతప్ప వారిగురించి ఒక్క సానుభూతివాక్యంకూడా రాయకుండానే పుస్తకాన్ని ముగించారు.