చాలాకాలానికి అక్కగారిని చూడటానికొచ్చింది చెల్లెలు. ఆవిడకి డెబ్భయ్యేళ్ళుంటాయి. ఈవిడకేమో యాభై. దాదాపు ఇరవయ్యేళ్ళ వారా. ఇద్దరికీ మధ్య నలుగురు మగపిల్లలు. కొన్ని కారణాలచేత ఈ ఇద్దరికీ మధ్య పెద్ద అనుబంధమేమీ పెరగలేదు. అప్పటిదాకా అంతమంది మగపిల్లలమీద ఒక్క ఆడపిల్లనే గారాబాన్ని పొందినది, తనకి చెందాల్సినవి కొత్తగా పుట్టుకొచ్చిన ఈపిల్ల లాక్కుందని మనసు కష్టపడిపోయింది అక్కగారికి. అదొకటైతే ఇంకొన్ని వేరేవి. శుభాశుభాల్లో కలుసుకోవటం, ఆనవాయితీలు తీర్చుకోవటం అంతే. ఇప్పుడీ కలయిక వింతే.
రోడ్డుకి అటూయిటూ పెరిగిన తురాయిచెట్లమధ్య రాలిన ఎర్రటిపూలమీంచీ నడుచుకుంటూ వచ్చి, కాశీరత్నంతీగ అల్లుకున్న పాతకాలపు గేటుని తీసుకుని లోపలికి అడుగుపెట్టింది. గేటునుంచీ ఇంటిదాకా నాపరాళ్ళు పరిచిన సన్నటిబాట. ఇంటిగుమ్మానికి ఎదురుగా తులసికోట. బాటకి అటూయిటూ వున్న మందారం, గన్నేరు, నిత్యమల్లె, కనకాంబరం మొక్కలూ, ఒక జామచెట్టూ దాటాక తులసికోట పక్కనుంచీ తాకకుండా నడిచి, గుమ్మం పక్కనున్న బకెట్టులోని నీళ్ళతో కాళ్ళు కడుక్కుని ఇంటినడవలో అడుగుపెట్టింది. అపార్టుమెంట్లూ, అధునాతనమైన యిళ్ళమధ్య ఈ యిల్లేమిటో అభివృద్ధికి కాస్త దూరంలో ఆగిపోయినట్టుంది. ఒకవిధమైన విషాదంతోకూడిన అందం, మార్పు కోరుకోని మనిషికిలా.
నడవలో పడక్కుర్చీలో పడుకుని వుంది పెద్దావిడ. అక్క అత్తగారు. ఆవిడకి నలుగురు సంతతి. నలుగురూ కొడుకులు. పై యిద్దరు కొడుకులూ చనిపోగా, వున్న మూడో కొడుకింట్లో పడక, నాలుగోకోడలి దగ్గర వచ్చి వుంటోంది. కోడలు ఆవిడ్ని బాగానే చూసుకుంటుంది. ఆవిడ పరోక్షంలో మాత్రం అత్తగారనదు, “మా నోరు” అంటుంది. ఆవిడ నోరలాంటిది. కొంపల్నీ కూల్చగలదు, అనుబంధాలనీ తుంచగలదు.
అలికిడికి తలతిప్పి చూసి, “ఎవరూ?” అనడిగింది ఆవిడ.
వంగి ఆవిడ కాళ్ళకి నమస్కరించి, “నేనండీ, అత్తయ్యగారూ! భానుమతిని. అక్కని చూడాలనిపించి వచ్చాను” అంది నెమ్మదిగా.
“భానువా? అంటే మీ అక్కకి పెళ్ళయ్యాక పుట్టిన పిల్లవుకదూ? ఓ! అప్పట్లో మాయిళ్ళలో అంతా వింతగా చెప్పుకున్నార్లే, యీ విషయం” అందావిడ గుర్తు తెచ్చుకుంటున్నట్టు.
ఆవిడ మాటలకి లోపల్నుంచీ వచ్చిన అక్కగారు, చెల్లెల్ని చూసి, ఆశ్చర్యంతో బొమముడి పడగా, “నువ్వటే, భానూ! అక్కడే వుండిపోయావేం? రా! లోపలికి” అని తీసుకెళ్ళిపోయింది. అత్తగారి మాటలేం ఆమె చెవిని దాటిపోలేదు.
“కాళ్ళు కడుక్కున్నావా? మొహం కూడా కడుక్కుంటావా? అదిగో, బాత్రూం అటువైపు వుంది. మాయింటికి నువ్వొచ్చింది చాలా తక్కువ. ఏవీ గుర్తుండకపోవచ్చు” అంది.
“అవేం వద్దు. ఫ్లైట్‌లోనే వచ్చాను. అలసటేం లేదు. అమ్మ గుర్తొచ్చింది. వెంటనే నిన్ను చూడాలనిపించి వచ్చేసాను” అంది చెల్లెలు. కంటి చివర తడి మెరిసింది. ఆ తడీ, చివరి రెండు వాక్యాలు, అక్కగారి గుండెకి ఎక్కడో గాలం వేసాయి.
“కాఫీ తాగుతావా? ఏకంగా భోజనమేనా? ఒక్కదానివే వచ్చావేం? మరిదిగారితో కల్సి రావల్సింది” అంది.
“ఉన్నట్టుండి బయల్దేరాను. వెళ్తున్నట్టు తనకి తెలీదు. బయల్దేరాక దార్లో చెప్పాను” అంది. అలాకూడా వుంటుందా? తన పెద్ద కూతురు కొన్ని విషయాల్లో ఇలాగే చేస్తుంది. అల్లుడేమీ అనడు. చెల్లెల్ని కూతురితో పోల్చుకుంది. కాస్త అభిమానం పుట్టింది. వెళ్ళి చిక్కగా బ్రూ కలిపి తెచ్చింది.
“బావగారు లేరా?” అడిగింది చెల్లెలు.
“స్నేహితులతో కలిసి పుట్టపర్తి వెళ్ళారు. వారం పడుతుంది రావటానికి”
ఇద్దరూ మాటలకోసం వెతుక్కుంటున్నారు. ఇదేమీ సాంప్రదాయమో, ఆనవాయితీయో పాటించడం కాదు. నలుగురు తమ్ముళ్ళూ, మరదళ్ళూ వున్న పుట్టింటికి ఇద్దరూ చెరో రైల్లోంచీ దిగి వెళ్ళి కలుసుకుని నాలుగురోజులుండి తిరిగి రావటం కాదు. అప్పుడు చెల్లెలు అందర్లో ఒకరు. తనని పలకరించేసి, ఒక పనైపోయిందన్నట్టుగా అమె గుంపులో పడిపోయేది. ఇప్పుడిక్కడ ఎలాంటి సందడీ లేని, ఒకళ్ళకొకళ్ళు మాత్రమే వుండే ఏకాంతం.
“నాకు అన్నం పెట్టేసెయ్. మీయిద్దరికీ మాటల్తో కడుపులు నిండుతాయేమోగానీ, నాకలా కాదు” పుల్లవిరుపుగా అంది అత్తగారు బయట్నుంచే. అక్కగారు వెళ్ళి ఆవిడ్ని నడిపించుకు వచ్చి డైనింగ్టేబుల్ ముందు కూర్చోబెట్టి భోజనం వడ్డించింది. ఆవిడకి తొంభైమూడేళ్ళు. భోజనమంటూ పెద్దగా ఏదీ వుండదు. బియ్యం వేయించి కందిపప్పు, కొంచెం ఆకుకూర, కేరటు, నెయ్యీ వేసి కిచిడీలా చేస్తుంది. అది కొంతా, మెత్తగా వుడికించిన అన్నంలో కొంచెం కొంచెం పప్పు, చారు, పెరుగు కలుపుకుని మరికొంతా తింటుంది. అన్నీ తను నమలలేదని అనుకొదావిడ. కోడలు ఇంకా మెత్తగా వండలేదని సాధిస్తుంది. అలవాటైపోయింది అక్కగారికి. చెల్లెలు వచ్చిందని ఇంకాస్త ఎక్కువే సాధించింది పెద్దామె. సహనమూర్తిలా వున్న అక్కగారిని తదేకంగా చూసింది చెల్లెలు. ఇదే వయసు అమ్మకి. కాలర్‌బోన్ విరిగి అతుక్కోక అవస్థపడి చనిపోయింది. అమ్మ చాలా నిండుగా వుండేది, అక్కలాగే! ఎప్పుడూ కోడళ్ళని ఒక్కమాట అనలేదు.
“మీ అమ్మకూడా చాలా చిన్నతనం పడేది. నిన్నెప్పుడూ వెంటేసుకు తిప్పేది కాదు. ఎక్కడికీ తీసుకొచ్చేదికాదు” పెద్దావిడ వదిలిపెట్టలేదు.
“మీరు తినండి. మళ్ళీ పొలమారితే కష్టం” అంది అక్కగారు మాటమార్చి.
“అలాంటిది నాకెప్పుడూ అనిపించలేదు. మా అమ్మమ్మావాళ్ళింటికీ , నానమ్మావాళ్ళింటికీ బాగానే వెళ్ళేవాళ్ళం” అంది చెల్లెలు.
ఊరుకోమన్నట్టు కళ్ళతో సౌంజ్ఞచేసింది అక్కగారు. పెద్దావిడ భోజనం అయింది. ఆవిడని మళ్ళీ తీసుకెళ్ళి నడవలో కూర్చోబెట్టి వచ్చింది అక్కగారు.
“ఆవిడలా అంటుందేమిటి?” అడిగింది చెల్లెలు.
“అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే. ముందైతే భోజనాలు కానీ”
ఇద్దరూ ఏవేవో మాట్లాడుకుంటూ భోజనాలు చేసారు. ఈవిడకి ముగ్గురు కూతుర్లు. చెల్లెలికి ఇద్దరు మగపిల్లలు. వీళ్ళందరిగురించీ మాట్లాడుకున్నారు. తమింటి మగపిల్లలూ, వాళ్ళ కుటుంబాలగురించి మాట్లాడుకున్నారు. ఈమధ్యలో చెల్లెలి భర్త ఫోన్ చేసాడు. క్షేమంగా ఇల్లు చేరిందో లేదో తెలుసుకుని మీటింగు వుందంటూ పెట్టేసాడు. అక్కగారికి అప్పటికి మాట్లాడే అవకాశం లేకపోయింది.
“ఇల్లిలా వదిలేసారేం? మాడ్రన్‌గా కట్టించుకోకపోయారా?” అడిగింది చెల్లెలు.
“బీచిరోడ్డుని ఫ్లాటుంది. కానీ మా ఇద్దరికీ ఇక్కడ, ఇలాగే బావుంది. జ్ఞాపకాలుంటాయికదా, వాటిని కూలగొట్టెయ్యలేం. మా తర్వాత పిల్లల యిష్టం”
“ఇల్లు పడగొట్టి కట్టిస్తామని అన్నయ్యలంటే అమ్మకూడా ఇలాగే అనేది” నవ్వింది చెల్లెలు.
భోజనాలయాయి. డైనింగ్ టేబులు, వంటిల్లూ సర్దేసి ఇద్దరూ పడగ్గదిలోకి వెళ్ళిపోయారు. పక్కపక్కని పడుకున్నారు.
“ఇప్పుడు చెప్పు, మీ అత్తగారలా ఎందుకందో? అమ్మ నాగురించీ నామర్దా ఎందుకు పడుతుంది? ఇక్కడికంటే తీసుకొచ్చేదికాదుగానీ, అన్నిచోట్లకీ ఆవిడవెంట వెళ్ళేదాన్ని. వెళ్ళినచోటల్లా ముద్దే జరిగేది” నిలదీసింది చెల్లెలు.
“అమ్మకి పధ్నాలుగోఏట నేను పుట్టానట. పెళ్ళప్పటికి నాకు పదిహేడు. అంటే ఆవిడకి ముప్పయ్యొకటి. నెలసరి ఆగడానికి ఎన్నోయేళ్ళు పడుతుంది. ఇప్పటిరోజుల్లోనైతే కాస్త అటూయిటూగా ఆడపిల్లలకి పెళ్ళీడు. మా పెళ్లైన ఏడాదికి నువ్వు పుట్టావు. ఆరోజుల్లో కూతుళ్ళతోటీ, కోడళ్లతోటీ సమంగా కూడా కనేవారు ఆడవాళ్ళు. మా అత్తగారు అమ్మకన్నా పెద్దది. మామగారు పోయి అప్పటికే చాలా ఏళ్ళైంది. ఆవిడ చెల్లెలు బాల్య వితంతువు. ఇద్దరూ యీ విషయంలో అమ్మని చాలా చులకన చేసి మాట్లాడేవారు . అక్కచెల్లెళ్ళిద్దరూ కలిసి చర్చించేవారు. మగాడికి బుద్ధిలేకపోతే ఆడవాళ్ళకేనా వుండద్దా అనేవాళ్ళు”
“అందులో అమ్మ తప్పేముంది? ఆరోజుల్లో ఫామిలీ ప్లానింగ్ వుండేది కాదు. మనుషులు ఆరోగ్యంగా వుండేవారు. కలిస్తే చాలు, పిల్లలు పుట్టేసేవారు. ఐనా నేను పుట్టగానే నాన్న వెళ్ళి వేసెక్టమీ చేయించుకున్నారని విన్నాను”
“ఇంతంత వయసులొచ్చాక ఇప్పుడుకదా, మనకీ విషయాలన్నీ అర్థమయ్యాయి. ఆరోజుల్లో నాకూ అమ్మపట్ల కోపంగానే వుండేది, అత్తగారింట్లో నన్ను చిన్నచూపు చూసేందుకు కారణమైందని. నిన్నూ దగ్గరకి తీసేదాన్ని కాదు. చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. ఏ విషయానికీ ప్రాధాన్యత లేనంత వేగంగా”
“మీ పిల్లలుకూడా నాతో పెద్దగా కలిసేవాళ్ళు కాదు. నేనెప్పుడూ చిన్నన్నయ్యతోటే కలిసి తిరిగేదాన్ని. వాడికీ వాళ్ళకీ అస్సలు పడేది కాదు. అసలు మీరు వచ్చి మనింట్లో వుండిందే తక్కువ. పెద్దయ్యాక అసలు వచ్చిందే లేదు. కలిసినా అంటీముట్టనట్టే”
అక్కగారు నిట్టూర్చింది. అప్పట్లో తల్లిపట్ల తనకి కోపం, చులకనభావం ఎక్కువే వుండేవి. చెల్లెలిపట్ల ద్వేషం కూడా. తనని భుజాలమీద ఎక్కించుకుని తిప్పినట్టే దాన్నీ తిప్పుతున్నారేమో నాన్న… అనుకుంటే గుండెల్లోకి ముల్లు దిగినట్టు వుండేది. అమ్మ దానికీ గోరుముద్దలు తినిపించి, ఎత్తుకుని ముద్దులు పెడుతోందనుకుంటే ఆ కుటుంబంలోని వ్యక్తులంతా తనకి దూరమైపోయారనిపించేది. పుట్టింటికి తప్పనిసరైతే తప్ప వెళ్ళేదికాదు. అమ్మమ్మింటికో, నానమ్మింటికో వెళ్ళి అక్కడికి తమ్ముళ్ళని పిలిపించుకునేది.
“జరిగినవేవో జరిగాయి. మొదట్లో అమ్మని తప్పుగా అర్థం చేసుకున్నాను. తర్వాత ఆ వుదాశీనత అలవాటుపడిపోయాను. సినిమాల్లోలా క్షమించమనటాలు, కాళ్లమీద పడటాలు చెయ్యలేంకదా? … సర్లేగానీ నీ చిన్నతనంగురించి చెప్పు”
చాలాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసిన సందర్భాలు చాలానే వున్నా, ఒకరికొకరు ఏమీ కానట్టే వుండటం అక్కగారిని ఇప్పుడు బాధపెట్టింది.
“నువ్వు చదివిన స్కూల్లోనే నేనూ చదివేను. బెంచీమీద బ్లేడుతో నీ పేరెవరో చెక్కారు చూడు, దాన్నీ నేను చూసాను. చిన్నన్నయ్య చూపించాడు. నాకన్నా వాడు రెండేళ్ళు పెద్దవాడైనా టైఫాయిడ్ రావటంతో ఒక సంవత్సరం చదువు పోయింది. నాకేమో ఒకేడు ఎక్కువ వేసి, ఇద్దర్నీ ఒక్క క్లాసులో పడేసారు”
“అప్పుడీ ఫోన్లూ అవీ లేవు. ఇంత వివరంగా తెలుసుకోవటం వుండేదికాదు. ఉత్తరాలు రాసుకోవటం, కలుసుకున్నప్పుడు చెప్పుకోవటమే. అమ్మకి రాయటం వచ్చేదికాదు. నాన్నో, పెద్దతమ్ముడో రాసేవాళ్ళు. పురిటికి వెళ్ళినా అమ్మమ్మ, నానమ్మ ఉండేవారు. అమ్మని చిన్నపిల్లని చూసినట్టు చూసేవారు. అదికూడా నాకు నచ్చేదికాదు, ఒక విషపుమొలక మరిన్ని పిలకలు వేసినట్టు”
“నువ్వూ చిన్నదానివేకదా?”
అక్కగారు చెమర్చిన కళ్ళతో నవ్వింది. చెల్లెలు బోర్లాపడిందీ, పాకిందీ, నడిచిందీ, తప్పటడుగులు వేసిందీ ఏవీ తెలీవు తనకి. చిన్నప్పట్నుంచీ అన్నీ తెలుసుకోవాలనిపించింది. చెల్లెలు తనకి గుర్తున్నంతవరకూ ఎన్నో చెప్పింది. అక్కగారు ఇంకెన్నో అడిగింది.
“మీ పెళ్ళిఫోటోలు చూపించవా?” అని అడిగింది అక్కగారిని.
“అప్పుడిలా ఫోటోలెక్కడివి? హడావిడంతా కాస్త తగ్గాక, పెళ్ళిపిల్లనీ, పిల్లాడినీ మధ్యన నిలబెట్టి వున్నవాళ్ళందరూ కలిసి ఓ ఫోటో తీయించుకుంటే గొప్ప” అంటూ వెళ్ళి కూతుళ్ళ పెళ్ళి ఆల్బమ్స్ తీసుకొచ్చింది. అందులోనే ఆవిడ చెప్పిన గ్రూఫ్ ఫోటో వుంది. చెల్లెలు తదేకంగా చూసింది దాన్ని.
“అమ్మవి చిన్నప్పటి ఫోటోలు ఇంకేవీ లేవా?” అడిగింది. చెల్లెలికేసి వింతగా చూసింది. ఆవిడ పోయి ఇన్నేళ్ళైనా, దీనికింత వయసు వచ్చినా అమ్మ, అమ్మ అంటుందేమిటని?
“అన్నయ్యలు చూసుకుంటున్నారుకదాని అమ్మ విషయంలో నేను నిశ్చింతగా వుండేదాన్ని. కుటుంబం, పిల్లలు అనే పరుగొకటికదా? కానీ నేను దగ్గరకి తెచ్చుకుని ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకుని వుంటే ఆవిడ ఇంకొన్నేళ్ళు బతికేదికదా అనిపిస్తుంది ఒకొక్కసారి. ఆ మాట అన్నయ్యలదగ్గర అనలేను” అంది.
“అందుకని ఇప్పుడు నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నావా?” అక్కగారి మొహం నవ్వుతో విప్పారింది. తరవాత ఇద్దరూ గట్టిగా నవ్వేసుకున్నారు. “కాలంతీరి ఆవిడ పోయింది. భగవంతుడు నెపం తనమీద వుంచుకోడు. కాలర్‌బోన్ విరగటమనేది పైకి కనిపించే కారణం అంతే. అలా బాధపడకూడదు” అంది.
లేచారు. మళ్ళీ కాఫీలు తాగారు. ఇంట్లో వున్న జంతికలేవో తినడానికి పెట్టింది. పుట్టపర్తినుంచీ అక్కగారి భర్త ఫోన్చేసాడు యోగక్షేమాలు కనుక్కోవటానికి.
“భాను వచ్చింది” మాటల్లో చెప్పింది.
“ఏవిటీ?!!! భానే? మనింటికే? మీ అమ్మ దాన్ని వెయ్యి యిరుక్కుల్లో దాచిపెట్టేదిగా?” అన్నాడాయన పెళ్ళున నవ్వి. అతనికి ఆడవాళ్ళు అనుకున్న మాటలు తెలీవు. భార్య మనసులోని వైషమ్యం మాత్రం కొద్దిగా తెలుసు.
“మాట్లాడండి” అని ఫోను చెల్లెలికి యిచ్చింది.
బావామరదళ్ళు కొద్దిగా మాట్లాడుకున్నారు. తర్వాత కూతుళ్ళు ఒకరొకరుగా ఫోన్లు చేసినప్పుడు కూడా అలాగే యిచ్చి మాట్లాడించింది.
ఫోన్లూ మాట్లాడుకోవటాలమధ్య రాత్రి వంటా భోజనాలూ కూడా అయ్యాయి. అక్కచెల్లెళ్ళు మళ్ళీ పక్కపక్కనే పడుకున్నారు. కబుర్లు పూరెక్కల్లా దొర్లిపోయాయి. ఒక నిశ్చింతతో చెల్లెలు తొందరగానే నిద్రపోయింది. అక్కగారు చాలాసేపు పక్కమీద దొర్లుతునే వుంది. బెడ్లాంపు వెలుతుర్లో చెల్లెలిముఖం పసిగా అమాయకంగా అనిపించింది.
ఇంజక్షన్ సీసా బిరడాలకి సర్కులర్తోటో డివైడర్తోటో మధ్యలో చిల్లు చేసి, పుల్లలు గుచ్చి బొంగరాల్లా తిప్పేదట! నోట్బుక్లోంచీ కాగితాలు చింపి రాకెట్లు చేసి విసిరేదట! చిన్నన్న నిక్కరూ షర్టూ వేసుకుని సైకిలు కాంచి తొక్కడానికి వెళ్ళిపోయేదట! ఎప్పుడూ మోకాళ్ళు దోక్కుపోయి రక్తాలు కారుతూ వుండేవట!మగరాయుళ్ళా తిరుగుతోందని అమ్మ కోప్పడేదట! చెల్లెలు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంటూ వుంటే నవ్వు ఆగలేదు ఆవిడకి. లేచి మంచంమీద బాసింపట్టు వేసుకుని చెల్లెలి ముఖంలోకి తదేకంగా చూస్తూ కూర్చుంది. ఏదో మోహం. ఇలాంటి కలయిక ఇంతకుముందెప్పుడూ జరగలేదు. జరిగివుంటే ఈ ప్రేమ, మమమకారం ముందే పుట్టేవేమో! ఇప్పుడేనా ఎలా సాధ్యపడింది? తనకి డబ్భయ్యేళ్ళొచ్చాక చెల్లెలు వులిక్కిపడిందా? తనగురించి ఆలోచిస్తుంటుందా? లేక నిజంగానే అమ్మ గుర్తొచ్చి వచ్చేసిందా? అమ్మ గుర్తొస్తే తనదగ్గరకి పరిగెత్తుకు రావటమేమిటి? ఎన్నో ప్రశ్నలు. జవాబులకన్నాకూడా చిక్కబడిన అనుబంధం ముఖ్యమనిపించింది. మళ్ళీ పడుకుంటే నెమ్మదిగా నిద్రపట్టేసింది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.