దాదాపు పదేళ్ళ సుదీర్ఘవిరామం తర్వాత అతన్ని ఒక పెళ్ళిలో చూసాను. అప్పటిదాకా గాఢనిద్రలో వున్నట్టు అచేతనంగా వున్న నా మనసొక్కసారి చైతన్యవంతమైంది. నన్ను చూస్తాడేమోనన్న ఆశతో చాలా నిస్సంకోచంగా అతనెటు వెళ్తే అటు చూసాను. ఎవరితోటో మాట్లాడుతున్న అతని చూపులు హఠాత్తుగా నామీద పడ్డాయి. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. పెద్దపెద్ద అడుగులు వేస్తూ గబగబా నా దగ్గరకొచ్చాడు.
“నువ్వేనా? అసలు నిన్నిక్కడ చూస్తానని కల్లో కూడా అనుకోలేదు” అన్నాడు వుద్వేగంగా. తనని తను కంట్రోల్ చేసుకోవటానికన్నట్టు శ్వాస గట్టిగా పీల్చి వదిలాడు.
“అదే యింట్లో వుంటున్నావా? సాయంత్రం వస్తాను. తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. పెళ్ళికొడుకు నా ఫ్రెండు. మిగతా ఫ్రెండ్సందరం కలిసి వచ్చాము. వాళ్ళని రైలెక్కించి వస్తాను” అన్నాడు.
నేను మౌనంగా తలూపాను. అతను వెళ్లిపోయాడు. నాకింక పెళ్ళింట్లో వుండాలనిపించలేదు. ముహూర్తం అవగానే బైటపడ్డాను. అతనికోసం ఈ పదేళ్ళలో నేను ఆలోచించినదిగానీ, ఎదురుచూసినదిగానీ లేదు. కానీ అతను లేని సమయాన నా మనసు నిద్రాణమైంది. ఇంటికొచ్చి తాళం తీసి అతని గదిలోకెళ్ళి నిలబడ్డాను. ప్రత్యేకంగా గుర్తుంచుకోవలసిన సందర్భంలో అందులోకి ఒకేసారి వెళ్ళాను. నా మనసు జ్ఞాపకాలవేటలో పడింది.
ఇల్లంతా పెళ్ళి హడావిడిలో వుంది. చాలామంది బంధువులొచ్చారు. ఉదయంనుంచీ కొద్ది జ్వరం వుండటంతో అమ్మ నా గదిలోకి ఎవర్నీ రావద్దని చెప్పి నన్ను బాగా రెస్టు తీసుకొమ్మంది. తెల్లవారితే ముహూర్తం.
తలుపు తెరుచుకుని నెమ్మదిగా బైటికొచ్చి చుట్టూ చూశాను. అంతా ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. అతని గదిలో అడుగుపెట్టాను. అతని గది… మేడపైకి వెళ్ళే మెట్లున్న కారిడార్‌లో ఒకవైపు రేకులతో కప్పగా ఏర్పడినది. మంచం, చిన్న టేబులు, చెక్కబీరువా. ఇంట్లో వాడడానికి పనికిరాని వస్తువులన్నీ అతనికోసం అక్కడికి చేరుకున్నాయి.
వర్షం వస్తే మెట్లమీదినుంచీ జల్లుకొడుతుంది. మెట్లమీద ఎండకాస్తుంది. చలి వణికిస్తుంది. అంతేకాదు, పై గదుల్లోకి ఎవరు వెళ్ళాలన్నా అక్కడినుంచే వెళ్ళాలి. అతని ఏకాంతాన్ని భంగం చేస్తూనే వెళ్ళాలి. ఇంత పెద్దయింట్లో అతనికి మేమివ్వగలిగిన స్థానం యిదే.
నాన్నగారి ఫ్రెండు కొడుకట అతను. తల్లీతండ్రీ ప్రమాదంలో చనిపోతే మా యింటికి తీసుకొచ్చారని చూచాయగా తెలుసు. అమ్మకి అతను మాయింట్లో వుండటం యిష్టంలేదు. వెళ్ళిపొమ్మనటం నాన్నగారికిష్టం లేదు. ఆ విషయంమీద గొడవపడుతుంటారు.
అతను పది పాసై పాలిటెక్నిక్ చేసాడు. ఉద్యోగ ప్రయత్నంలో వున్నాడు. జాబ్ రాగానే మాయింట్లోంచి వెళ్ళిపోతాడనుకుంటా. చామనచాయలో బాగా సన్నగా పొడుగ్గా వుండే వ్యక్తి. చాలా తక్కువ మాట్లాడతాడు. మా యింటి పరిసరాల్లో ఒక భాగంగా అతన్ని చూడటానికి అలవాటుపడిపోయాను. ఇప్పుడతనితో అవసరం వచ్చింది. నేను వెళ్ళేసరికి గదిలోనే వున్నాడు.
నా రాకని సూచిస్తూ చిన్నగా చప్పుడు చేసాను. మనుషులు ఆ గదిలోంచి పైకి వెళ్ళడానికీ, వెళ్తూ ఏవో చప్పుళ్ళు చేస్తుండటానికీ అలవాటుపడి వున్నాడేమో, యథాలాపంగా తలతిప్పి, నన్నక్కడ చూసి ఆశ్చర్యపోయాడు.
“మహతీ!” అన్నాడు దిగ్భ్రమతో లేచి కూర్చుంటూ. అతని ఆశ్చర్యాన్ని నేను పట్టించుకోలేదు. చెప్పాలనుకున్నది త్వరత్వరగా చెప్పాలి. అందుకతను సహకరిస్తాడో లేదో తెలీదు.
“నాకీ పెళ్ళి యిష్టంలేదు. అమ్మానాన్నా నామాట వినడంలేదు. నేను కాశ్యప్ అనే అతన్ని ప్రేమిస్తున్నాను. అతన్ని గురించి వాళ్ళకి చెప్పి, వప్పించాలనుకున్నాను. కానీ వాళ్ళు నాకా అవకాశం ఇవ్వలేదు. ఇన్నాళ్ళూ అతను వూళ్ళోలేడు. ఈరోజే వచ్చాడని తెలిసి ఫోన్ చేస్తే రాత్రికి స్టేషన్లో వెయిట్ చేస్తానన్నాడు. నన్ను స్టేషనుకి చేర్చాలి” అన్నాను.
అతను నాకేసి ఆశ్చర్యంగా చూసాడు. క్షణంసేపే. వెంటనే సర్దుకున్నాడు. “ఏ రైలు?”
చెప్పాను.
“ఎన్నింటికి తీసుకెళ్ళాలి?”
అదీ చెప్పాను. “
“మరోసారి ఆలోచించుకున్నావా?”
తలూపాను.
“సరే! ఆ సమయానికి తయారై వుండు” అన్నాడు.
“థేంక్స్” అనేసి వచ్చేసాను. అతనింత తేలిగ్గా వప్పుకుంటాడనుకోలేదు. ఎందుకు వప్పుకున్నాడో తెలీదు. కారణం వూహించే ప్రయత్నం చెయ్యలేదు. నా పని పూర్తైందని తేలిగ్గా నిశ్వసించాను. లేకపోతే ఈ చీకట్లోనూ, వర్షంలోనూ వంటరిగానేనా వెళ్ళాలి. ఇంకొకరి సహాయమేనా అడగాలి. ఇతనంత నమ్మకస్తుడు యింకొకరు లేరని నాకు తెలుసు. అదొక సహజాతిసహజమైన నమ్మకం. మరుసటిరోజు వుదయమే పెళ్ళిగాబట్టి రాత్రికి నాకు చపాతీలు, పాలు మాత్రమే యిచ్చిందమ్మ.
“తినేసి తొందరగా నిద్రపో. ఉదయాన్నే లేవాలి”” అంది ప్రేమగా. ఆ ప్రేమ నాకు సంతోషాన్ని కలిగించలేదు. స్వేచ్ఛని యివ్వని ప్రేమ.
తను నా గది తలుపులు దగ్గరగా వేసేసి వెళ్ళిపోయింది. టైం సరిగ్గా తొమ్మిది. అతను నాకోసం పక్కవైపు గేటు దగ్గర వెయిట్ చేస్తానన్నాడు. నేను చిన్న సూట్‌కేసుతో యివతలికొచ్చాను. సందడంతా వంటింట్లో కేంద్రీకృతమై వుంది. నేను వెళ్ళేసరికి అతనక్కడ ఎదురు చూస్తున్నాడు. అతనికొక పాతకాలపు సైకిలు మాత్రం వుంది. ఆ సైకిల్‌తో అతను గేటు దగ్గర నాకోసం నిలబడి వున్నాడు. వాన చాలావరకూ తగ్గిందిగానీ చిన్న తుంపర యింకా వస్తోంది.
“ఎక్కు. జాగ్రత్తగా ఎక్కి కూర్చో, చున్నీ చక్రంలో పడకుండా రెండుకొనలూ ముడివేసుకో” అన్నాడు. అలాగే చేసాను. సూట్‌కేసు వళ్ళో పెట్టుకుని కేరేజిమీద జాగ్రత్తగా సర్దుకుని కూర్చున్నాను. అతన్ని తాకకూడదనుకున్నాను. కానీ సాధ్యపడలేదు. ఒక చేత్తో సూటికేసు పట్టుకుని రెండోచేతిని అతని నడుం చుట్టూ బిగించాను.
చాలా బక్కటి వ్యక్తి, కానీ చువ్వలా దృఢంగా వున్నాడనిపించింది. ఎదురుగాలి బలంగా వీస్తుంటే అంతకన్నా బలంగా తొక్కుతున్నాడు. కొంతదూరం వచ్చాక ఒక షాపు ముందు ఆగాడు. అలుపు తీర్చుకోవడానికేమోననుకున్నాను. కాదు.
నన్ను దిగమని, సైకిలు స్టాండు వేసి, షాపులోకి వెళ్ళాడు. అదొక చిన్న లెదరు షాపు. బేగులు, సూట్‌కేసులు వున్నాయి. నన్నక్కడే నిలబడమని, లోపల్నుంచీ నన్ను చూపిస్తూ షాపతన్తో ఏదో మాట్లాడాడు.
తర్వాత ఒక సూట్‌కేసుతో షాపులోంచీ వచ్చాడు. “ఇదెందుకు?” ఆశ్చర్యంగా అడిగాను.
“నీకు నామీద నమ్మకం వుందా?”
ఏం చెప్పను? నేనతని సహాయాన్ని అడిగినప్పుడు చేస్తాడా చెయ్యడా అని ఆలోచించానుగానీ నమ్మాలా వద్దా అనుకోలేదు. “నమ్మకం లేకపోతే నీతో ఎందుకొస్తాను?” నవ్వడానికి విఫలయత్నం చేస్తూ అడిగాను.
“ఐతే ఓ పని చేస్తావా?”
“ఏంటది?”
“ఈ సూట్‌కేసు నీ దగ్గర పెట్టుకో. నువ్వు తెచ్చినది నాకివ్వు. నీ ఫ్రెండుకి నువ్వేమేం తెచ్చావో నిస్సంకోచంగా చెప్పు. ఈ రాత్రి ఏమీ జరక్కపోతే నీ సూట్‌కేసు నీకు వుదయాన్నే తెచ్చిస్తాను. ఇదే రైల్లో నువ్వెక్కడికి వెళ్తే అక్కడిదాకా వస్తాను” అన్నాడు.
“కాశ్యప్‌ని నువ్వు అనుమానిస్తున్నావా?” రోషంగా అడిగాను.
“అనుమానిస్తే నిన్నింత జాగ్రత్తగా ఎందుకు తీసుకొస్తాను?”
“ఈ విషయం తెలిస్తే అతను బాధపడతాడు.”
“అలా జరక్కుండా చూసే బాధ్యత నాది” అని, ఒక్క క్షణం ఆగి అన్నాడు. “మహతీ! నీకు తెలుసో తెలీదో…నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పాతికవేలు పరిహారంగా ఇచ్చారు. డబ్బు తీసుకోవటానికి ఎవరేనా ముందుకి వచ్చేవారు. తీసుకుని నన్నే అనాథాశ్రమంలోనో పడేసి చేతులు దులుపుకునేవారు. కానీ మీనాన్న నాకొక ఆశ్రయం కల్పించటమనే గొప్ప బాధ్యత తీసుకున్నాడు. అలాంటి బాధ్యతనే నీ విషయంలో నేనూ తీసుకుంటున్నాను. నీకు యీ పెళ్ళి ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ వ్యాపారంలో ఇంకా పైకి రావాలనే కోరికతో నిన్ను బలవంతంగా వప్పించారు. పెళ్ళి వేరు, వ్యాపారం వేరు. విడివిడి విషయాలు. పెళ్ళికొడుకు…”
“బుష్” చప్పుని అన్నాను.
“బుష్షేమిటి?”
“అతనికి నేను పెట్టిన పేరు. కనిపించినవన్నీ కబళించాలని చూస్తాడు. అలాంటివాడితో పెళ్ళేమిటి?”
“కశ్యప్?”
“చాలా మంచివాడు”
“ఐతే తప్పక అర్థం చేసుకుంటాడు”
అతనిచ్చిన సూట్‌కేసు తీసుకుని, నాది అతనికిచ్చాను. మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. నా మనసులో అపరాథభావన. కాశ్యప్‌ని మోసం చేస్తున్నానేమోనని. స్టేషన్ చేరుకున్నాం.
అతను సైకిలు స్టాండులో పెట్టడానికి వెళ్ళాడు. ప్లాట్ఫామ్మీద అడుగు పెట్టేసరికి కాశ్యప్ నాకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. రైలు వస్తూనే వుంది.
“అబ్బ! వచ్చావా? రావేమోనని టెన్షన్‌తో చచ్చిపోయాను” అన్నాడు నన్ను చూడగానే. అతన్ని చూడగానే నాకు సంతోషం కలిగింది. గట్టిగా అతని చేతిని పట్టుకున్నాను.
“అతి కష్టమ్మీద రిజర్వేషన్ దొరికింది” అన్నాడు కాశ్యప్ నా దగ్గర్నుంచి సూట్‌కేసు తీసుకుంటూ. అతను దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవడం నా దృష్టిని దాటిపోలేదు. ఇద్దరం కంపార్టుమెంటు వెతుక్కుని ఎక్కి కూర్చున్నాము. రాత్రి కావడంతో అంతా మంచి నిద్రలో వున్నారు. మావి సైడు బెర్తులు కావడంతో మరొకరితో సంబంధం లేదు.
“ఎలా రాగలిగావు?”
“మా యింట్లో వుంటాడన్నానే, అతని సాయంతో” అని చెప్పి, “ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నాం” అడిగాను.
“ముంబై. అక్కడికెళ్ళి ఏదైనా వ్యాపారం మొదలు పెడతాను. అన్నీ నేను చెప్పినట్టే చేసావుకదూ?” తలూపాను. “మా నాన్న నాకు చేయించినవన్నీ తీసుకొచ్చాను. దాదాపు వంద తులాలు. డైమండ్ నెక్లెసే లక్షన్నరట”
నేను చెప్తుంటే అతని కళ్ళలో ఆశ్చర్యం, అపనమ్మకం పోటీపడ్డాయి. సూట్‌కేస్ తెరిచి చూస్తానంటాడేమోనని భయపడ్డాను. దాన్ని ఆప్యాయంగా పట్టుకున్నాడు, వొళ్ళో పెట్టుకున్నాడు.
“నా జీవితకాలపు ఆశయం తీరినట్టే మహతీ! ముంబైలో వ్యాపారం చేస్తాను. షేర్లు కొంటాను. లక్షలు…లక్షలు చేతిమీద తిప్పుతాను. ఆఫ్ట్రాల్, మీ నాన్నకొక బట్టలషాపు మాత్రమే వుంది. నేనైతే పెద్ద వ్యాపారసామ్రాజ్యాన్నే స్థాపిస్తాను” అంటున్న అతని కళ్ళలో మెరుపులు. నాకెందుకో భయంలాంటిది కలిగింది. మానాన్న దగ్గర్నుంచి నేను తెచ్చిన నగల్ని అమ్మి వ్యాపారం చేసి ఎదగాలనుకుంటున్న యితని ముందు మానాన్న ఆఫ్ట్రాల్ ఎలాగో అర్థమవలేదు. గడియారం వెనక్కి తిరిగి, ఆగితే బావుండునని మాత్రం అనిపించింది.
“పడుకుందామా?” మాట మార్చాను.
“టీ తాగుతావా?” అడిగాడు.
తలూపాను.
“నువ్వు పడుకో. నేను మెలకువగానే వుంటాను. ఇంత డబ్బు పెట్టుకుని రిస్కెందుకు?” అన్నాడు. దానికీ తలూపాను. తర్వాతి స్టేషన్లో దిగి టీ తీసుకొచ్చాడు. తాగగానే, “గుడ్‌నైట్. ఇది నీ దగ్గర పెట్టుకుంటావా? నేనుంచుకోనా?” అని అడిగాడు సూట్‌కేసు గురించి. అతనికి దాన్ని తనదగ్గరే వుంచుకోవాలనుంది. మార్పిడి జరగకపోతే అలాగే యిచ్చేదాన్ని. ఇప్పుడు కొద్దిగా భయపడ్డాను. నేను నిద్రపోయినప్పుడు తెరిచి చూస్తాడేమోనని. మౌనంగా తీసుకుని తలక్రింద పెట్టుకున్నాను,
“దిండు లేకపోతే నాకు నిద్రపట్టదు” చెప్పాను. అతను భుజాలు ఎగరేసాడు. తర్వాత పైబెర్తు ఎక్కబోతూ ఆగి వంగి, నా నుదుటిమీద ముద్దుపెట్టుకుంటూ అన్నాడు. “థాంక్స్ మహతీ! థాంక్యూ సోమచ్. నా కలలు నిజం చెయ్యబోతున్నందుకు”
నేను కళ్ళు మూసుకున్నాను. జ్వరం నా శరీరాన్నింకా బాధిస్తోంది. దాన్ని కాశ్యప్ గుర్తించలేదు. అతనితో జీవితాన్ని పంచుకోవాలని నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? లేక మరోలా జరగబోతోందా? కొద్ది నిముషాల్లోనే బలమైన ఒక నిద్రతెర నామీద పరుచుకుంది.
కిటికీలోంచీ సూర్యకిరణాలు సూటిగా కళ్ళమీద పడుతుంటే మళ్ళీ మెలకువ వచ్చింది. తలంతా దిమ్ముగా వుంది. కళ్ళు తెరవాలనిపించలేదు. జరిగినవన్నీ గుర్తొచ్చాయి.
అమ్మావాళ్ళు నా గురించి కంగారుపడ్తుంటారు. అతను కూడా లేకపోవటాన్ని జతకలిపి ఏం వూహిస్తారో. బుష్ మొహం యిప్పుడెలా వుందో?కొద్ది ప్రయత్నంమీద లేచి కూర్చుని, కాశ్యప్‌ని పిలవాలని బెర్తు దిగాను. అతను లేడు. నా సూట్కేస్కోసం చూసాను. అదీ లేదు. నా మెదడంతా ఒక్కసారి మొద్దుబారిపోయింది. అతను… అతనన్నట్టే జరిగింది. దిగ్భ్రాంతిగా సీట్లో కూలబడ్డాను. రైలు కదుల్తూనే వుంది. కదిలికదిలి ముంబై సెంట్రల్ స్టేషన్ చేరుకుని ఆగింది. కంపార్ట్‌మెంటంతా ఖాళీ అయింది. నేనింకా అలాగే వున్నాను.
“హలో!” అన్న గొంతు వినిపించింది. ఎక్కడో సుదూరతీరాలనుంచి వచ్చినట్టు.
“మహతీ!” మళ్ళీ పిలిచాడు. అతను…అతనే! కాశ్యప్ కాదు. నేను కళ్ళెత్తి చూసాను. నాలో యింకా అదే జడత్వం. అతను లోపలికొచ్చి, పక్కని కూర్చున్నాడు, “నేను భయపడ్డట్టే జరిగిందా?” అన్నాడు నన్ను చూసి.
“నువ్వేంటి, యిలా కూర్చున్నావు? ఇష్టంలేని పెళ్ళినీ, మోసాన్నీ రెండిటినీ తప్పించుకున్నావు. అదృష్టవంతురాలివి. అంతా దిగేసారు. పద మనం కూడా దిగుదాం” అన్నాడు నా చెయ్యి పట్టుకుని లేవదీస్తూ. నిశ్శబ్దంగా అతని వెంట నడిచాను.
“కాశ్యప్ యిలా ఎందుకు చేసాడు?” హఠాత్తుగా మాటలొచ్చినట్టు అడిగాను. ఎంత గుడ్డిగా నమ్మాను!
“కాశ్యప్ అనేకాదు. ఎవరేనా యిలాగే చేస్తారు. అమాయకుల్ని మోసం చెయ్యాలనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళతో మనకెలాంటి అనుబంధం లేనప్పుడు”
“అతను నన్ను ప్రేమించాడు”
“నిన్ను కాదు, నీ వెనకనున్న డబ్బుని” “
“నాకెప్పుడూ అలా అనిపించలేదు”
“అనిపిస్తే అతన్ని నువ్వెందుకు నమ్ముతావు?”
“నువ్వెందుకు నన్ను మోసం చెయ్యలేదు? సూట్‌కేసులో ఏముందో వూహించగలిగినవాడివి. అది తీసుకుని దిగెయ్యచ్చుగా?”
“ఇంట్లోవాళ్ళనెవరేనా మోసగించుకుంటారా?”
“అది నీ యిల్లా? అలాగైతే నేను మా నాన్నని మోసం చేసానుగా?”
హఠాత్తుగా ఏడుపు ముంచుకొచ్చింది. అతను రెండోచేత్తో నన్ను దగ్గరగా తీసుకున్నాడు. “ప్లీజ్ ఏడవకు. ఇది స్టేషను. ఎవరేనా చూస్తే బాగుండదు. ఇంకో గంటలో తిరుగు రైలుంది. వెళ్ళిపోదాం. ఏ ప్రమాదం జరగలేదని గుర్తుచేసుకో. బాధవుండదు” అన్నాడు ఓదార్పుగా.
రైల్వే వెయిటింగ్ రూమ్‌లో కూర్చున్నాము. అతనెళ్ళి బ్రష్షూ పేస్టూ తెచ్చిస్తే పళ్ళు తోముకున్నాను. బ్రెడ్, టీ తీసుకొచ్చాడు. వద్దన్నాను. బలవంతంగా తినిపించాడు.
“జ్వరం తగ్గలేదా?” చెంపలు తాకి చూస్తూ అడిగాడు.
అతనికి నా గురించి అన్నీ తెలుసునన్నది ఆ ఒక్క ప్రశ్నతోటే అర్థమైంది. టిక్కెట్లు తీసుకొచ్చాడు. రైల్లో కూర్చున్నాక అడిగాను అతన్ని. “అమ్మావాళ్ళూ మనని రానిస్తారా?”
“అలాంటి అనుమానాలేవీ వద్దు. మొదట్లో కోప్పడ్డా తర్వాత సర్దుకుంటారు. వాళ్ళకి నువ్వు తప్ప యింకెవరున్నారని?” అంటూ, నా ముఖంలోకి పరీక్షగా చూసి, “రాత్రి వాడు నీకేమైనా ఆఫర్ చేసాడా?” అనడిగాడు.
“టీ త్రాగాము”
“వాడే తీసుకొచ్చాడా?”
తలూపాను.
“తాగాక బాగా నిద్రపట్టిందా?””
“ఔను. గాఢమైన నిద్ర. కొత్తప్రదేశంలో నాకసలు నిద్ర పట్టదు”
“టీలో ఏదో కలిపి వుంటాడు”
నా తల గిర్రుమని తిరిగిపోయింది. పూర్ణకుంభంలాంటి జీవితాన్ని ఎలా చేజార్చుకున్నాను, ఒక మోసగాని నమ్మి…
మేము ఇల్లు చేరుకునేసరికి బాగా రాత్రైంది. ఇంటి పరిసరాలని సమీపిస్తుంటేనే వాతావరణంలో ఒకలాంటి మార్పు కనిపించింది. అది పైకి కనిపించేది కాదు. అంతరంగం మాత్రమే గుర్తించేది. అంతా ప్రశాంతంగా వుంది. ఐతే అది భయం గొలుపుతోంది.
అతని చేతిని గట్టిగా పట్టుకుని గేటు దాటి లోపలికి అడుగుపెట్టాను. కాంపౌండులో ఎవరెవరో వున్నారు. పెళ్ళికొచ్చిన బంధువులింకా వెళ్ళలేదు. అందరి ముఖాల్లోనూ అదోలాంటి భావం. అది విషాదమని తర్వాత తెలిసింది. అందరి చూపులూ ఒక్కసారి మామీద నిలిచాయి.
“అదిగో. ఆ పిల్లేనా?”
“అతన్తోటేనా?”
“ఏకంగా చేసుకునే వచ్చేసిందా?”
“ఈరోజుల్లో ఎవర్నీ ఏమీ అనేలా లేదు”
“కాస్త సిరీసంపదా అంటేసరికి బంధువుల్ని దూరం తరిమేసారు. ఉన్న ఒక్కపిల్లా యిదుగో…యిలా చేసింది”
వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్న మాటలు నా చెవుల్ని తాకుతున్నాయి.
అతను నా చెయ్యి పట్టుకుని గబగబా నడిచాడు. హాల్లో ఎదురుగా పీటవేసి, తువ్వాలు పరిచి వుంది. ఉత్తరంవైపు దీపం వెలుగుతోంది. ఒకమూల కూర్చుని ఏడుస్తున్న అమ్మని చూస్తుంటే చెళ్ళుమని చరిచినట్టైంది. నాన్న…
“అమ్మా!” ఒక్కంగలో వెళ్లి అమ్మని చుట్టుకుపోయాను. కానీ ఆమె విదిలించేసింది. అసలే ఏడ్చేడ్చి ఎరుపెక్కిన కళ్ళు యిప్పుడు కోపంతో యింకా ఎర్రబడ్డాయి. “ఇంకా ఏం మిగిలిందనే, వచ్చావు? అమ్మానాన్నల్నీ, పరువుమర్యాదల్నీ కాదనుకుని వెళ్ళావుగా, వాడితోటే వూరేగక మళ్ళీ ఎందుకొచ్చావు? ఉన్నామో, చచ్చామో చూడాలని వచ్చావా? ఇంకా ఏదైనా మిగిలుంటే ఊడ్చుకుపోవాలనుకున్నావా?” నాతో అని ఒక్క వుదుటున వెళ్ళి అతని షర్టు కాలరు పట్టుకుని “ఏరా, నీ బతుక్కి నా కూతురు కావాల్సి వచ్చిందా? తల్లీతండ్రి చస్తే వీధినపడి అడుక్కుతినాల్సిన వెధవ్వి. పోనీకదాని చేరతీస్తే నా కూతురిమీద కన్నేస్తావా?” అంటూ ప్రభంజనంలా వూపేసింది.
“అమ్మా! నా మాట విను. అతని తప్పేం లేదు” వెనక్కి గుంజుతూ పెనుగులాడుతూ జరిగింది క్లుప్తంగా చెప్పాను.
ఆమె కోసం మరింత పెరిగిందిగానీ తగ్గలేదు. “ఎంతకి తెగించావురా? వాడు మోసం చేస్తాడని తెలిసీ దీన్ని యింట్లోంచి తీసుకెళ్ళావంటే పెళ్ళి చెడగొట్టాలనేగా? అప్పుడింక నువ్వు తప్ప గతిలేదని నీ కాళ్ళు పట్టుకుంటామనుకున్నావు కదూ? వెళ్లిపోరా! ఇంకా ఏముంది చూడటానికి?” అని అరుస్తూనే వుంది. ఉద్రేకంతో ఆమె నుదుటి నరాలు తపతప కొట్టుకుంటున్నాయి.
నేను ఏం చెయ్యాలో తోచక చూస్తూ వుండిపోయాను. ఇదంతా ఇలా జరుగుతుందని ముందే తెలిసినట్టు నిర్వికారంగా వున్నాడు.
“మీరు ఏవేవో వూహించుకుంటున్నారు. మహతికి పెళ్ళి విషయంలో కొంత స్వేచ్ఛ యిచ్చి వుంటే యిదంతా జరిగేది కాదు. ఆమె యిష్టాయిష్టాలని పట్టించుకోకుండా మీ అవసరాలని ఆమెమీద రుద్దే ప్రయత్నం చేసారు. దాన్నుంచి తప్పించుకోవడానికి ఆమె దొంగదారి వెతుక్కోవలసి వచ్చింది. ఆమె యింట్లోంచి బైటపడటానికి వెతుక్కున్న మార్గం నేను. నేను కాదంటే మరోదారి చూసుకునేది. అలాకాక బలవంతంగా ఈ పెళ్ళి జరిపించి వుంటే తను కోల్పోయిన స్వేచ్చని తలుచుకుని అతన్తో సరిగా వుండేది కాదు. ఇంకా ఏమైనా కూడా చేసేది” అని నెమ్మదిగా నచ్చజెప్పబోయాడు. అతని మాటలు చాలా స్పష్టంగా, వాటిలోని భావం నాపట్ల అతనికిగల అవగాహనని తెలియపర్చేలా వున్నాయి.
అమ్మ తల బలంగా వూపుతూ, “నువ్వు. నువ్వెవడివిరా నా కూతురి జీవితాన్ని గురించి, మా బాధ్యతని గురించి చెప్పడానికి? నీ డబ్బు వాడుకున్నామనే కదూ? ఆ పాతికవేలేకదూ, నీకు మా బతుకుల్తో ఆడుకునే హక్కునిచ్చాయి? ఆ కక్ష మింగేనా, యింతవాడివయ్యావు? పోరా, పో. పాతిక కాదు యింకో అంత నీముఖాన్న కొడ్తాను. వెళ్ళిపో. నా కళ్ళముందునించీ”” అంటూ ఒక్క వూపులో వెళ్ళి చేతికందినన్ని వందనోట్ల కట్టలు తెచ్చి అతని ముఖం మీదకి విసిరేసింది.
డబ్బు నేలమీద అలాగే చిందరవందరగా పడుంది. అమ్మ ఫిట్టొచ్చి పడిపోయింది. నేను మా ఫేమిలీడాక్టరుకి ఫోన్ చేసాను. ఆయన వెంటనే వచ్చాడు. అమ్మని పరీక్ష చేసి, వెంటనే యింజక్షనిస్తూ నాతో అన్నారు. “మహతీ! నువ్వు చేసిన పనేమీ బావుండలేదమ్మా. దిక్కూమొక్కూ లేకుండా మీయింట్లో పడుండేవాడితో ప్రేమేమిటి? మనిషి కంటికి నదురుగా కనిపిస్తే చాలా? ప్రేమిస్తే ప్రేమించావు ముందే ఎందుకు చెప్పలేదు? ఇంకొద్దిసేపట్లో పెళ్ళనగా యింట్లోంచి పారిపోతే మిగిలినవాళ్ళ పరిస్థితెలా వుంటుందో ఆలోచించావా? మీకోసం మీరు బతకటమే కాదు, కనిపెంచిన తల్లిదండ్రులకోసం కూడా బ్రతకడం నేర్చుకోవాలి, నీ స్వార్ధం మీ నాన్నని బలితీసుకుంది. కనీసం అమ్మనేనా బ్రతికించుకో. లేకపోతే అనాధవైపోతావు. వీలైనంతవరకూ ఆమెకి ఎదురుపడకుండా వుండటమే మంచిది ప్రస్తుతానికి. పెద్దవాడినీ, మీ నాన్న స్నేహితుడినీ కాబట్టి చెప్తున్నాను. ఆపైన నీ యిష్టం”
నేను తలొంచుకుని విన్నాను. పొరపాటెక్కడ జరిగిందో అందరికీ తెలుసు. బుష్‌ని నేను చేసుకోవాలనుకోలేదు. అంతా కలిసి బలవంతంగా వప్పించారు. నేను దానికి కట్టుబడివుంటే వీళ్ళంతా సంతోషంగా వుండేవారు. నాన్న చనిపోయేవారు కాదు. “పెళ్ళి” అనే క్రతువులో నేను సమిధనైవుంటే యిదంతా సాధ్యపడేది. ప్రాణం వున్న నేను, ప్రాణం లేని కట్టెతో సారూప్యాన్ని పొంది వుంటే.
డాక్టరు వెళ్ళిపోయాక అమ్మ బాధ్యత యింట్లో ఎప్పటికీ వుండే పనిపిల్లకి అప్పగించి, నా గదిలోకి వచ్చేసాను. నేను చేసిన పనివల్ల నాన్న చనిపోయారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నా కళ్ళలోంచి నీళ్ళు ధారాపాతంగా కారాయి. మనసంతా అపరాధభావంతో నిండిపోయింది. “స్వేచ్ఛ” అనేది యింత బాధాకరంగాబట్టే మనుషులు ఎంతటి బానిసత్వానికేనా లొంగిపోతున్నారనిపించింది.
నాకతని నిస్తేజమైన చూపులు గుర్తొచ్చాయి. ఏమాశించి అతనీ పని చేసాడు? కాశ్యప్ గురించి సరిగ్గా వూహించగలిగీ ఎందుకు నన్నతన్తో పంపించాడు? అమ్మన్నట్టు నా పెళ్ళి చెడగొట్టాలనా? అందుకిదంతా చెయ్యాలా? అతనికి నన్ను చేసుకోవాలని వుందనేది అమ్మ చేసిన మరో అభియోగం. దానికిదంతా మార్గం కాదే!
ఎందుకింత చెడ్డవాడనిపించుకున్నాడు? ఏదీ చెప్పకుండానే ఎందుకు వెళ్ళిపోయాడు? చాలాసేపు నా ఆలోచనలు అతని చుట్టే పరిభ్రమించాక నాకు నేనే సమాధానాన్ని వెతుక్కున్నాను.
ఒక చర్యని మనం ఎంత నిశ్శబ్దంగానైనా చేసి వుండవొచ్చు. కానీ దాని ప్రతిచర్య అంత నిశ్శబ్దంగా వుండాలనేం లేదు. ఎంతో సైలెంట్‌గా జరిగిపోయిన ఒక పని తాలూకు పర్యవసానం కొన్ని జీవితాల పునాదుల్ని సైతం కదిలించేంత బలమైనది కావచ్చు.
నాన్న హఠాన్మరణంతో మేమెంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపారసౌధం కుప్పకూలిపోయింది. షాపు పూర్తిగా మూతపడింది. స్టాకు రొటేషన్ ఆగిపోయింది. ఆదాయం తిరోగతి పట్టింది. సప్లయర్స్నుంచీ, మిల్స్నుంచీ నోటీసులొచ్చాయి. ఐనకాడికి అన్నీ అమ్మాల్సిన పరిస్థితి. అన్నిటినీ మించి అనుభవరాహిత్యం, మగదక్షత లేకపోవడం.
ఈ వినాశనానికి స్థూలంగా చూస్తే కారణం నేను. లోతుగా ఆలోచిస్తే మాత్రం మరోకోణం కనిపిస్తుంది. ఇదంతా ఒక పేకమేడలాంటిది. ఎవరో ఒకరు కదిలే వీచే గాలికే కూలిపోయేంత బలహీనమైనది. అలా కదిలిన వ్యక్తిని నేను. అలాంటప్పుడు నా వ్యక్తిత్వాన్ని దాన్ని నిలబెట్టగలిగేలా లేదా దాన్ని నిలబెట్టడమే నా వ్యక్తిత్వం అయేలా నన్ను మలిచి వుండాల్సింది.
షాపు, ఇంట్లో సగం, యింటినానుకుని వున్న ఖాళీస్థలం అమ్మేసాం. మిగిలింది బేంకులో వేస్తే నెలకింతని వడ్డీ వస్తోంది. సరిగ్గా అప్పుడే బుష్ పెళ్ళి శుభలేఖ వచ్చింది. అమ్మ మానసిక స్థితి మరెన్నటికీ కోలుకోలేనంతగా దెబ్బతింది.
నిర్వ్యాపారమైన జీవితం. పగలు రాత్రిగానూ, రాత్రి పగలుగానూ దిశలు మార్చుకుంటూ గడిచిపోతోంది. నా గదిలో పడుకుని పుస్తకం చదువుకుంటున్నాను. అడుగుల చప్పుడు వినిపించింది. అమ్మ! ఇద్దరం ఈ ఇంట్లో వున్న మహాశూన్యానికి చెరోదరినీ నిలబడ్డంత నిర్వేదంగా వుంటున్నాము. పనిపిల్లే మామధ్య వారధి! అలాంటిది. అమ్మ రాక నాలో ఆశ్చర్యాన్ని రేపింది.
చాలాకాలానికి తనని నిశితంగా చూసాను. శుష్కించిపోయి, పిండిబొమ్మలా వుంది. వచ్చి నా పక్కని కూర్చుంది.
“నీ మనసులో ఏముందో చెప్పవే. పెళ్ళి చేసుకోకుండా యిలా ఎంతకాలం వుంటావు? నాకేదైనా ఐతే నువ్వేమౌతావు?” అని అడిగింది.
నేను తల దించుకున్నాను.
“నువ్వా సంబంధం చేసుకుంటే మాకు షాపు చూసుకోవడానికి మగపిల్లలు లేని లోటు తీరుతుందని ఆశించాము. నువ్వు వద్దంటున్నా చిన్నపిల్లవి, నీకేం తెలుస్తాయని బలవంతం చేసాము” అంది.
“అలాంటి బాధ మీకున్నప్పుడు తల్లిదండ్రుల్ని కోల్పోయి, మనింట్లో ఆశ్రయానికి వచ్చినతన్ని మీకనుగుణంగా ఎందుకు పెంచుకోలేదు? నాకొక అన్నగానో… లేక వరసైనవాడిగానో?” సూటిగా అడిగాను.
అతన్ని మేం మాలో ఒకడిగా చూడలేదనేది నేను చిన్నప్పుడే గుర్తించిన విషయం. నాకతనంటే చాలా యిష్టంగా వుండేది. అతన్తో ఆడుకోవాలనిపించేది. కానీ అమ్మ అందుకు అనుమతించేది కాదు. మా యిద్దరి ప్రపంచాలని విడగొట్టి వేర్పాటుని నిర్దేశించే నియంత్రణరేఖలా వుండేది.
ఎంతందంగా వుండేవాడతను! నవ్వుతూ వుంటే నక్షత్రాలు రాలుతున్నట్టుండేది. మనసుకేదైనా నచ్చితే. నోరంతా తెరిచి నిష్కల్మషంగా నవ్వేవాడు. క్రమంగా అతని నవ్వులూ, స్వేచ్ఛా మాయమైపోయాయి. అంటే పెద్దవాడైపోయాడన్నమాట. తన చుట్టూ వున్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేంత పెద్దరికం. అతని కళ్ళలో నిస్తేజం చోటు చేసుకుంది. ఎప్పుడు మెట్ల గదిలోకి నెట్టివెయ్యబడ్డాడోగానీ వంటరితనమనే గుడారంలో కాందిశీకుడిలా వదిగి వుండిపోయాడు. మంచుతెరల వెనుక మనిషిలా మామధ్యని వుంటూనే మాకు కనుమరుగైపోయాడు. చాలా గమ్మత్తుగా నా భావాలుకూడా గడ్డకట్టుకుపోయాయి. అతనలాగా, నేనిలాగా వుండటం మా ప్రవృత్తులన్నట్టు అందరిముందూ స్థిరడిపోయాయి. కానీ వాటి మధ్యనున్న అనుసంధానాన్ని ఎవరూ గుర్తించలేదు. ఇప్పటిదాకా నేనే గుర్తించలేదు.
“నువ్వతన్ని ప్రేమించావా?” అడిగిందమ్మ.
“నేను యింట్లోంచి వెళ్ళిపోయింది కాశ్యప్‌తో” గుర్తుచేసాను. తన ముఖం మరింత పాలిపోయింది. “ఆ విషయం నిజమా?” వెంటనే మరో ప్రశ్న.
“నువ్వతన్ని ప్రేమించలేదా?”
తన ముఖంలో ప్రస్ఫుటమైన బాధ. “కనీసం నువ్వేనా ఆ పని చేసి, నేను చేసినదాన్ని సరిచేస్తావనుకున్నాను. మహతీ! అతనిపట్ల నా ప్రవర్తన తలుచుకుంటే నాకిప్పుడు చాలా సిగ్గనిపిస్తోంది” అంది. అమ్మ ఎందుకింత బాధపడ్తోందో నాకర్థంకాలేదు. బహుశా ఈ రోజుని మేమున్న నిస్సహాయస్థితినిబట్టి అతన్ని కొంచెం వుదారంగా చూసి వుంటే మాకు అండగా వుండేవాడన్న భావన చేత కావచ్చు.
“అతన్ని నేను ద్వేషించేదాన్ని. అతన్నొక పసివాడిలా, నాకన్నా చిన్నవాడై, నానుండి ప్రేమనీ రవ్వంత వోదార్పునీ ఆశిస్తున్నవాడిలా భావించలేదు. నాకొక ప్రత్యర్ధిలా కనిపించేవాడు. ప్రత్యర్ధి… ఎవరైతే పూర్తిగా నాశనమైపోవాలని కోరుకుంటామో అలాంటి ప్రత్యర్థి” అమ్మ యింక ఆ బాధ ఆపుకోలేనట్టు కూలిపోయి ఏడ్వసాగింది. నేను చకితురాలినయాను. ఓదార్చాలని కూడా తోచలేదు. చాలాసేపు ఏడ్చిగానీ తేరుకోలేకపోయింది. ఏదో గొణుక్కుంటూ అక్కడే నిద్రలోకి జారుకుంది.
అమ్మ చాలా సంఘర్షణ పడ్తోంది. అది తీవ్రమైన అనారోగ్యం రూపంలో బైటపడింది. టైఫాయిడొచ్చింది. అందులోనే ఫిట్సొచ్చేవి. మగతలో వుండి ఏడ్చేది. డాక్టర్లు చూసి యిలాగైతే లాభంలేదని చెప్పేసారు. అతను లేడు. నాన్నపోయారు. అమ్మకూడా అదే దార్లో వుంది. నాకు ఏడుపు రాలేదు. విస్తారమైన ఎడారిలో వంటరి గడ్డిమొక్కలా అనిపించాను నాకు నేనే.
చనిపోయే ముందు అమ్మకి బాగా స్పృహ వచ్చింది. నన్ను దగ్గరకి రమ్మంది. వెళ్ళాను. “మహతీ! అతన్ని నేనెందుకు ద్వేషించానో చెప్పలేదు కదూ?” అడిగింది హీనస్వరంతో.
“ఇప్పుడెందుకమ్మా, ఆ విషయాలు? జరిగిందేదో జరిగిపోయింది. నీకు నేనున్నాను. అన్నీ మర్చిపో” అన్నాను బ్రతిమాలుతూ.
“ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను మహతీ! చేసిన తప్పు సరిదిద్దుకోలేదు. అది నన్ను తినేస్తోంది. విను. నా తెలివి, నాన్న కృషీ ఈరెంటి వెనుకున్న ఆధారం అతని డబ్బు. అంతకిముందు నేను యింట్లో వుండి చవకలో చీరలు కొని, ఐదో పదో లాభానికి
యిన్స్టాల్మెంట్స్లో అమ్మేదాన్ని, నాన్న ప్రైవేటుస్కూల్లో టీచరు. చాలీచాలని ఆదాయం. అతని తల్లిదండ్రులు ఏవో చిన్న వ్యాపారాలు చేసేవారు. ఇల్లిల్లూ తిరిగి అమ్మేవారు. వాళ్ళకెవరూ లేరు. ఈ పిల్లాడిని మాదగ్గర వదిలి వెళ్ళేవారు. అమ్మినడబ్బు మా దగ్గర దాచుకునేవారు. వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు. యాక్సిడెంటు చేసినతను వెతుక్కుంటూ వచ్చి పిల్లాడికని పాతికవేలు ఇచ్చాడు. కేసు కాకుండా చూసుకున్నాడు”
“…”
“ఈ రెండురకాల డబ్బుకీ చివర్న తెగ్గొట్టలేని చిన్న లంకెలా అతను మా దగ్గిర వుండిపోయాడు. ఆ డబ్బు పెట్టుబడిగా పెట్టి ఎదిగాం మహతీ! పోయినవాళ్ళు పోయారు, మా బతుకు మేం బతక్కుండా వీడొకడు మధ్యలో అనిపించేది. అనాథాశ్రమంలో వేసేద్దామనుకున్నాం మొదట. ఆ పని చెయ్యలేకపోయాం. తప్పనిపించింది. అలాగని అతన్ని ప్రేమించనూలేకపోయాం… నువ్వన్నావే, కొడుకులాగో, అల్లుడిలాగో. కనీసం సాటి మనిషిలా. స్వంతిల్లు కట్టుకుని వచ్చేసాక పారెయ్యలేని పనికిరాని సామానులా అతనూ మనతో వచ్చేసాడు. ఏదో హక్కున్నట్టు వచ్చేసాడనిపించేది. మమ్మల్ని చూసి హేళనగా నవ్వుకునేవాడేమో! ద్వేషంతో రగిలిపోయేవాడేమో!” అమ్మ గొంతు మరీ బలహీనపడింది. కనుకొలుకుల్లోంచీ నీళ్ళుకారాయి.
ఈ విషయాలన్నీ నాకు కొంతవరకూ తెలిసినవే. కానీ ఒక కొత్తకోణం కనిపించింది. ఉద్వేగాలూ, వ్యక్తిగత అనుభూతులూ లేని వాస్తవాల్లోంచీ బైటపడింది. ఉక్కిరిబిక్కిరయాను.
డబ్బు అనే పట్టకంలోంచీ ప్రసారింపజేస్తే మానవీయవిలువలు ఎలా వక్రీభవనం చెందుతున్నాయి! తనకి తను స్వతంత్రంగా బతికే వయసే లేని పసివాడిలో ప్రత్యర్థిని చూడగలగటం, ఇది తనిల్లనుకుని, మేం తన మనుషులమనుకుని, జరుగుతున్న అన్యాయానికి ప్రతిస్పందించడంకూడా తెలీని అతనికి ఏవేవో వుద్దేశాలు ఆపాదించి, ఇంట్లోంచీ వెళ్ళగొట్టడం వక్రీకృతవిశేషాలు. ఇప్పుడెంత పరితపించినా జరిగిన సంఘటనలు దిశ మార్చుకోవు. అతన్ని తిరిగి ఈ యింట్లోకి చేర్చవు.
మనవల్ల ఒక తప్పు జరుగుతుంది. దానివలన ఎవరో నష్టపోతారు. ఆ నష్టాన్ని మనమీదికి బదలాయించుకోవటం వుత్తమమైనది. అది సాధ్యం కానప్పుడు జరిగిన నష్టానికి ప్రత్యామ్నాయం చూపించటం మధ్యస్థమైనది. అతని తల్లిదండ్రులు చనిపోవటంలో అమ్మావాళ్ళకి ఎలాంటి ప్రమేయం లేదు. ఆ తర్వాత జరిగినవన్నీ వాళ్ళిద్దరూ చేసినవే. నేనూ అతన్నో పావులానే వాడుకున్నాను. ముప్పేటహారంలో ఒక పేటలా ఈ యింట్లో బతకాల్సినవాడు స్థానభ్రంశం చెందాడంటే అది క్షంతవ్యం కాదు. ఎక్కడున్నాడో! ఎలా వున్నాడో!
క్రమంగా అమ్మలో ఎగశ్వాస మొదలైంది. ఆ రాత్రే ఆమె చనిపోయింది. క్లుప్తంగా అంత్యక్రియలు జరిపించి, ఒక ఆర్ఫనేజీకి చందాగా పదివేలు పంపించాను.
అమ్మ చనిపోయిన వార్త తెలిసి బుష్ వచ్చాడు. “జరిగిన సంఘటనలు ఏవి ఎందుకు జరిగినా, ఎలా మలుపు తిరిగినా, నువ్వంటే నాకు యిప్పటికీ యిష్టమే మహతీ! వంటరిగా ఎలా వుంటావు? నా భార్యని వప్పిస్తాను. క్లుప్తంగా గుళ్ళో పెళ్ళి చేసుకుందాం” అన్నాడు. అతన్లో ప్రేమకన్నా కాంక్షే కనిపించింది. నాపట్ల కాంక్ష. ఇంకా నా దగ్గరున్న డబ్బుపట్ల కాంక్ష.
“నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు” అన్నాను ముక్తసరిగా. అతను కోపంగా వెళ్ళిపోయాడు.
సుదీర్ఘమైన గతాన్ని తవ్విపోసుకోవడంలో టైమెంత గడిచిందో తెలీలేదు. చుట్టూ చీకటి నిండిపోయింది. లైటు వేద్దామనుకుంటే కరెంటు లేదు. కొవ్వొత్తి వెలిగించి, టీపాయ్ మీద పెట్టబోతుంటే తలుపు చప్పుడైంది.
అతనేనా? నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. కొవ్వొత్తిని చేత్తో అలాగే పట్టుకుని తలుపు తీసాను. అతనే!
గాలికి కొవ్వొత్తి ఆరిపోయింది. లోపలికొచ్చి తలుపు దగ్గరగా వేసాడు. నేను అగ్గిపుల్ల వెలిగిస్తుంటే తను కొవ్వొత్తిని వెలిగించడానికి వీలుగా పట్టుకుని, అది వెలిగాక జాగ్రత్తగా టీపాయ్‌మీద వుంచాడు.
“అబ్బ! ఎంత వంటరితనం! ఎలా వుండగలుగుతున్నావు? భయం వెయ్యటంలా?” అడిగాడు సోఫాలో కూర్చుంటూనే.
“ఎలా వున్నావు? ఏమైపోయావు నువ్వసలు? మళ్ళీ యిటెప్పుడూ రాలేదెందుకూ? ఇది నీ యిల్లన్నావు? ఇంటిమీద అలిగితే యింక అటేనా?”
“రావాలనే అనుకున్నాను. కానీ నీముందుకి రాలేకపోయాను” అన్నాడు. అతని ముఖంలోకి చూసానుగానీ భావాలేం కనిపించలేదు ఆ మసకవెలుతుర్లో.
“మనిద్దరి మధ్యనీ యినుపతెర వుండేది కదూ? దాన్ని ఛేదించలేనని తెలిసాక రావాలనిపించలేదు”
“నువ్వు.. నన్ను ప్రేమించావా?” విస్మయంగా అడిగాను.
“ఏం? ప్రేమించకూడదా? ఓహ్. నీకు ప్రేమంటే తెలిదుకదూ? ప్రేమించే గుణాన్ని మీ అమ్మ నీ చిన్నప్పుడే కండిషన్ చేసేసింది. నువ్వు కాశ్యప్‌ని ప్రేమించాననుకున్నావు. కానీ అది ప్రేమ కాదు, అవసరం. పెళ్ళిని తప్పించుకోవలసిన అవసరం కోసం ఏర్పడ్డ తత్కాలప్రేమ అది” అన్నాడు.
“నీకు మా అమ్మంటే కోపమా?” కుతూహలంగా అడిగాను.
“మనిషి అహాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమనుకుంటాను మహతీ! నా తల్లిదండ్రులది ప్రేమవివాహం. వాళ్ళు యింట్లోంచి వచ్చేస్తే మీ అమ్మానాన్నలే నిలబడి పెళ్ళి చేసారట. లూనామీద వస్తుంటే కారొచ్చి గుద్దింది. మీ నాన్న నన్ను మీ యింటికి తీసుకొచ్చాడు. వాళ్ళకున్న దాంట్లోనే పెట్టి, పెంచేవారేమో! అలా కాకపోతే ఆర్ఫనేజిలో వేసేవారేమో! అక్కడికి నాకే అనుబంధాలూ వుండేవి కాదు. అనామకుల్లో అనామకుడిగా వుండేవాడిని. కానీ వాస్తవం మరోలా జరిగింది. ఆ కారతను కొంత కాంపన్సేషను తెచ్చి యిచ్చాడు. నా జీవితం యింకో మలుపు తీసుకుంది. మీ అమ్మానాన్నా ఆ డబ్బుతో ఎదిగారు. నన్ను మనిషిగా గుర్తించడం మానేసారు. నేను అంటే ఆ డబ్బు”
అతను హఠాత్తుగా లేచి వచ్చి నా పక్కని కూర్చున్నాడు నన్ను తాకుతూ. నేను జరగలేదు. అతని స్పర్శ నాకు చాలా హాయిని కలిగించింది. హృదయపు కవాటాలేవో తెరుచుకుని నాలోకి వెలుతురు ప్రవహిస్తున్న భావన.
“తనకంటూ కొంత డబ్బున్నా దాన్ని స్వతంత్రంగా ఖర్చుపెట్టుకోలేని, అసలు దాన్నేం చేసుకోవాలో తెలీని ఐదేళ్ళ పిల్లాడిని డబ్బుమనిషిగా గుర్తించడంకన్నా దారుణం వుందా మహతీ?” అడిగాడు. “ఆ డబ్బుకోసమే అని నేననను కానీ యిక్కడికి తీసుకొచ్చి నాకో కుటుంబాన్ని ఏర్పరిచాడు మీ నాన్న. కుటుంబంలో వుంటూ దాన్ని ప్రేమించకుండా వుండటం ఎలా సాధ్యం? నేను మీ అందర్నీ ప్రేమించేవాడిని. మీనుంచీ ప్రేమని ఆశించేవాడిని. అది దొరక్క తపించేవాడిని” అతన్లో ఘనీభవించిన మౌనం కరుగుతోంది. మనసు విప్పి మాట్లాడుతున్నాడు.
“ఇక్కడినుంచి వెళ్ళిపోయాక ఎక్కడెక్కడో తిరిగాను. ఏవేవో వుద్యోగాలు చేసాను. తెగిన గాలిపటం ఆధారంకోసం కొట్టుకులాడినట్టు నా మనసు యీ యింట్లో స్థానంకోసం ఆరాటపడిపోయింది. నువ్వు మరీ మరీ గుర్తొచ్చేదానివి”
మా యిద్దరిమధ్యా ఏదో జరగాలని ఆశించాము. అదేదీ జరగలేదు. ఆ వెల్తి యిద్దర్లోనూ నిండిపోయి వుంది.
“కాశ్యప్ అలా చేస్తాడని ఎలా వూహించగలిగావు?” కుతూహలంగా అడిగాను.
“అర్ధరాత్రి ఆడపిల్లని… అందులోనూ పెళ్ళి కుదిరిన అమ్మాయిని యింట్లోంచి వంటరిగా పారిపోయి రమ్మన్నవాడు అలాకాక యింకెలాగా చెయ్యడు మహతీ! అధికారం బుష్లనీ, అవకాశం కాశ్యప్లనీ తయారుచేస్తే నిస్సహాయత నాలాంటివాళ్ళని తయారుచేస్తుంది. నువ్వు నిద్రపోయాక వాడితో మాట్లాడాను. వట్టి డబ్బుమనిషని అర్థమైంది. నేను వూహించినట్టే నీ సూట్‌కేసు వాడి చేతిలో వుంది. తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో ఏమీ లేదన్న సూచన వదిలాను. నీ అంతు తేల్చుకుంటానన్నాడు. కొంత డబ్బిచ్చి, మళ్ళీ నీజోలికి రాకుండా వప్పందం చేసుకున్నాను. వాడు డబ్బుకోసం ఆశపడ్డాడు. కాబట్టే నీదార్లోంచి తప్పించడం అనైతికంగా అనిపించలేదు.”
నేను స్టన్నయ్యాను. తనకేమీ తెలీనట్టు రైలు దిగాక నా దగ్గర ఎంత చక్కగా నటించాడు!
“నీకంత డబ్బెక్కడిది?”
“బుష్ యిచ్చాడు”
ఇది మరీ పెద్ద షాకు. “ఎందుకు?” అతను పెద్దగా నవ్వేసాడు. “ఎవ్రీథింగ్ యీజ్ ఫెయిర్ యిన్ వార్ అండ్ లవ్ట. మీయిద్దరికీ మధ్యని నేనున్నాననీ, అందుకే నువ్వు అతనిపట్ల వుదాశీనంగా వున్నావనీ అనుమానం వచ్చింది. నీ ప్రేమని గెలుచుకోవడానికి నన్ను బేరంచేసాడు”
నా తల గిర్రుమని తిరిగింది. “నేనతన్ని యిష్టంగా చేసుకుని వుంటే?”
అతను నాకేసి సూటిగా చూసాడు. “అందర్తోపాటు నేనూ నాలుగక్షింతలు వేసి మౌనంగా వుండిపోయేవాడిని. నాకు ప్రాప్తం లేని ఎన్నో విషయాల్లాగే యిదీ అనుకునేవాడిని. నువ్వతన్తో పెళ్ళికి గొడవపడ్డాకే నీ మనసేంటో గ్రహించగలిగాను”
అమ్మ నియంత్రణ తప్పిపోవడంతో అతను మనసు విప్పి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఆజ్ఞలకి కట్టుబడి వుండాలంటే ఆ వ్యక్తితో ఎంతో బలమైన అనుబంధం వుండాలి. అతను అమ్మని ఎంతగా ప్రేమించాడో! నా గుండె మూగవోయింది.
అతని ముఖంలోని నవ్వు క్రమంగా హరించుకుపోయింది. కొద్దిసేపటి తర్వాత అన్నాడు. “చదరంగంలో ఎంతో ఆలోచించి, తర్వాత పడబోయే మూడు నాలుగు ఎత్తులని కూడా ముందే వూహించుకుని మన పావుని కదుపుతాం. కానీ ఎక్కడో చిన్న పొరపాటు జరిగి, మన ఎత్తువలన మన బలగాలనే నష్టపోతాం. అప్రమేయంగా షావైపు డ్రైవ్ చెయ్యబడతాం. నేను, బుష్ పావుల్ని కదుపుతున్నాం. మామయ్య చనిపోవడం వూహించనివిధంగా నా ఆటకి షా చెప్పేసింది. ఆయన మరణం నా నైతికబలాన్ని దెబ్బతీసింది. మహతీ! నేను ప్రేమకోసం, నీకోసం తపించిపోతుండచ్చు. కానీ ఆ ప్రయత్నంలో అత్తయ్యకేదైనా జరిగితే? అది నేను తట్టుకోలేను. నీకే కాదు, నాకు కూడా మిగి లింది ఆమే”
అతని తల్లిదండ్రులు పోయిన కొత్తలో అమ్మ అతనిపట్ల పిసరంత ప్రేమ చూపించి, రవ్వంత వోదార్పునిచ్చి వుంటుంది. దాన్ని ఎంత జాగ్రత్తగా గుండెల్లో నిలుపుకున్నాడో! నా కళ్ళు చెమర్చాయి.
“అమ్మకూడా తన చివరిరోజుల్లో నీగురించి చాలా ఆరాటపడింది. నువ్వెక్కడున్నావో ఏమయ్యావో మాకు తెలీదు. నువ్వు తిరిగొచ్చి వుంటే బ్రతికేదేమో!” అన్నాను.
“నిజమే! మీతో కాంటాక్ట్‌లో వుండాల్సింది. ఆలోచనల్లోనూ సంఘర్షణలోనూ సుదీర్ఘమైనకాలం గడిచిపోయింది. నేను గుర్తించలేదు”
అతను నా వెనుకనుంచీ చెయ్యి జాపి, దగ్గరకి తీసుకున్నాడు. మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఉన్నట్టుండి గుర్తొచ్చి, దూరంగా జరిగి, అనుమానంగా అడిగాను. “నువ్వు, బుష్ గేమ్ ఆడుకున్నారు. సరే, నేనా పావుని?”
“కాదు” అతను నిజాయితీగా జవాబిచ్చాడు. “నువ్వు చదరంగం బల్లవి. వ్యక్తిత్వం లేని అమ్మాయిలు చెస్ బోర్డులు, క్రికెట్ పిచ్‌లు, ఫుట్‌బాల్ గ్రౌండులూను” పకపకా నవ్వేసాడు. నా ముఖం రోషంతో ఎర్రబడింది. అతన్ని కొట్టాలని చెయ్యెత్తాను. అతను లేచి దొరక్కుండా తప్పించుకున్నాడు. కరెంటొచ్చింది. తెల్లటి ట్యూబ్లైటు వెలుతురు గదంతా పరుచుకుంది. నోరంతా తెరిచి పెద్దగా నవ్వుతున్న అతన్ని చూసి, అప్రతిభురాలినయ్యాను. ఎత్తైన చెయ్యి అలాగే వాలిపోయింది. మంచుతెరల్ని తొలగించుకుని స్పష్టమైన దృశ్యానికి అందేలా కనిపిస్తున్నాడు. నిస్తేజమైన ఛాయామూర్తిలా కాకుండా చైతన్యంతో తుళ్ళిపడుతున్నాడు. నాలోనూ నిర్దుష్ట మైన మార్పు. నాకే తెలుస్తోంది. ఇష్టమైన వాళ్ళ సామీప్యం, సాన్నిహిత్యం మనుషుల్లో యింత చైతన్యాన్ని నింపుతాయా? విస్మయంగా అనుకున్నాను.
(2/4/2004 ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక)
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.