ఒకప్పటి స్నేహితులు by S Sridevi

  1. అక్కాచెల్లెళ్ళు by S Sridevi
  2. గుండెలోతు by S Sridevi
  3. మనుష్యరేణువులు by S Sridevi
  4. బడి వదిలాక by S Sridevi
  5. హలో మనోరమా! by S Sridevi
  6. ఇరవైమూడో యేడు by S Sridevi
  7. అతనూ, నేనూ- మధ్యని మౌనం By S Sridevi
  8. ఒకప్పటి స్నేహితులు by S Sridevi
  9. పుత్రోత్సాహం by S Sridevi
  10. వెంటాడే జ్ఞాపకాలు by S Sridevi
  11. ప్రేయసి అందం by Sridevi Somanchi
  12. ఉరి by S Sridevi
  13. మరోజన్మ by S Sridevi
  14. అంచనా తప్పింది by S Sridevi
  15. వప్పందం by S Sridevi
  16. శతాయుష్మాన్ భవతి by S Sridevi
  17. కొత్త అతిథికోసం by S Sridevi
  18. చెయ్ by S Sridevi
  19. పరారైనవాడు by S Sridevi
  20. కృతజ్ఞతలు by S Sridevi

“చాలాకాలం తర్వాత శ్రీదేవి పిక్చరని ఎంతో వూహించుకుని వచ్చాను. ఏం బాలేదు సినిమా. ఐనా శ్రీదేవి ఏంటండీ? వెనకటి గ్లామరేలేదు” థియేటర్లోంచీ బైటికొచ్చాక అంది సుజాత.
“శ్రీదేవి గొడవ మనకెందుకుగానీ ఈ దేవి గ్లామర్‍మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది” లోగొంతులో ఆమెకి మాత్రమే వినిపించేలా చెణుకు విసిరాడు సంతోష్. పల్చటి సిగ్గుతెర ఆమె ముఖాన్ని కప్పింది. గేటు దగ్గర నిలబడమని స్కూటర్ తీసుకురావడానికి వెళ్ళాడు. అతను తిరిగిరాగానే వెనక సీట్‍లో ఎక్కి కూర్చుంటూ అంది, “దారేకదా, డాక్టరు దగ్గరకెళ్ళి రిపోర్ట్స్ తీసుకుందాం”
స్కూటరు దూసుకుపోయింది. చల్లటిగాలి వీస్తోంది.
తుఝె దేఖాతో యే జానా సనం
ప్యార్ హోతా హై దీవానా సనం
లోగొంతులో పాడసాగాడు. అతను చాలా బాగా పాడతాడు. అతను పాడుతుంటే వినడం సుజాతకి చాలా యిష్టం. దగ్గరగా జరిగి హత్తుకుని భుజంమీద గెడ్డం ఆన్చి వింటోంది.
“డాక్టర్” కోట దాటుతుంటే గుర్తుచేసింది. గుర్తుందన్నట్టు తలూపాడు. ఇంతలో క్లినిక్ వచ్చింది. స్కూటరాపాడు.
పెళ్ళై మూడేళ్ళైంది. ఇంకా పిల్లలు పుట్టలేదని టెస్టులన్నీ చేయించుకున్నారు. స్కానింగ్ చేయించుకోమంది డాక్టరు. దాని రిపోర్ట్ రావాలి. రాత్రి తొమ్మిది దాటిందిగాబట్టి పేషెంట్సు పెద్దగా లేరు. కాంపౌండరు వెంటనే లోపలికి పంపించాడు. సంతోష్ వెనకాల సుజాతకూడా వెళ్ళబోతుంటే డాక్టరంది “మీరు బైటకూర్చోండమ్మా” అని. ఆమెకీ సంతోష్‍కీ మధ్యగా స్ప్రిం‍డోర్ మూసుకుపోయింది. తనని చూడగానే డాక్టర్ కళ్ళల్లో లీలగా కనిపించిన జాలో…. సానుభూతో… అదేంటో అర్థంకాని భావం ఆమెని చిన్నగా కదిల్చింది. అప్పుడు మొదలైంది. ఆమెలో కంగారు. ఏమని వచ్చాయో రిజల్ట్స్? డాక్టరెందుకలా చూసింది? కుర్చీలో కూర్చుంటూ అస్థిమితంగా అనుకుంది.
కొద్దిసేపటికి వాడిన ముఖంతో సంతోష్ యివతలికొచ్చాడు.
“డాక్టరేమంది?” సుజాత ఆతృతగా అడిగింది. అతను జవాబివ్వకుండా బైటికి దారితీసాడు. వెంట ఆమె కూడా వెళ్ళింది. ఇంటికి చేరేలోపు నాలుగుసార్లడిగింది ఆ ప్రశ్నని. జవాబు రాబట్టుకోలేకపోయింది.
ఇల్లు చేరగానే స్కూటరు చప్పుడు విని అత్తగారు తలుపుతీసింది. అప్పుడతను ఆవిడేమీ అడక్కుండానే చెప్పాడు. “డాక్టరు దగ్గరకి వెళ్ళి వచ్చాం. సుజాతకి గర్భసంచీలో ట్యూమరు వుందట. గర్భసంచీ తీసెయ్యాలన్నాడు”
“అంటే పిల్లలు పుట్టరా?”
“పుట్టరు. ఎప్పటికీ పుట్టరు” నిరాశో నిస్పృహోగానీ గట్టిగా అన్నాడు ఆ మాటల్ని.
కాళ్ళక్రింది నేల కదుల్తున్నట్టు అనిపించింది సుజాతకి. గోడ పట్టుకుని గట్టిగా నిలదొక్కుకుంది. క్రమేపీ బాధతెలియడం మొదలైంది.
బాధ…
తనకి ట్యూమరున్నందుకు కాదు, అందువలన పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయినందుకు. తనకి పిల్లలు పుట్టరనేదాన్ని మించిన బాధ భర్త ఆ విషయాన్ని తనతో చెప్పి అతని బాధని తన బాధతో కలబోసుకోకుండా తనని వేరుచేసి తల్లితో పంచుకోవటం.
గిరుక్కుమని పడగ్గదిలోకి వెళ్ళి మంచంమీద వాలిపోయింది. కడుపులోంచీ దుఃఖం తరుముకొస్తుంటే దిండులో ముఖం దాచుకుంది.
వంటింట్లో గిన్నెల చప్పుడు.
“సుజాతా! అన్నానికి రా” అత్తగారి పిలుపు.
“నాకొద్దు” దుఃఖభారంతో పూడుకుపోయిన గొంతుతో జవాబిచ్చింది సుజాత. ఆమెనెవరూ బలవంతపెట్టలేదు. ఒక్కడే తినేసి తిన్న వెంటనే బైటికెళ్లిపోయాడు సంతోష్


“సుజాతకి పిల్లలు పుట్టరట”
అర్ధరాత్రివేళ వురమని మేఘంలా వచ్చి మంచి నిద్రలో తననిలేపి మాట్లాడాల్సిన పనుందంటూ డాబామీదికి లాక్కెళ్ళి అతనన్న ఆ ఒక్క వాక్యంతో శరత్ నిద్రమత్తంతా ఎగిరిపోయింది. విషయమంతా అడిగి తెలుసుకున్నాడు.
“మాకు పిల్లలు పుట్టరంటే ఏదోగా వుంది. తనంటే యింట్లో వుండే మనిషి. నేను బైటికెళ్ళేవాణ్ణి. పిల్లల్లేరట – అని సానుభూతిగా చూస్తారు. పిల్లలుకూడా లేరు, యీ సంపాదనంతా ఏం చేస్తాడోనని అనుకుంటారు. నేనది భరించలేను. అదీగాక అనుభవించడానికి ఎవరూ వుండరనుకుంటే యీ ఆస్తి, వుద్యోగం, తాపత్రయం యివ్వన్నీ అర్థరహితంగా అనిపిస్తున్నాయి. బతుకే వ్యర్థంగా తోస్తోంది” అన్నాడు సంతోష్. అంతదాకా అనుభవించిన టెన్షన్, బాధ అలా మాటల్లో చెప్పుకున్నాక కాస్త వూరట కలిగింది.
“అలా ఎందుకనుకోవాలి? ఎవర్నేనా పెంచుకుంటే సరి” అన్నాడు శరత్.
“పెంపా? ఎవరిస్తారు? అందరికీ ఒకళ్ళూ యిద్దరేగా?”
“ఎవర్నేనా అనాధని…”
“ఛా… ఛా… అమ్మ వప్పుకోదు” సంతోష్ మనసు అట్టడుగుపొరల్లో వున్న భావమేంటో లీలగా గ్రహించాడు శరత్.
ఇద్దరూ ప్రాణస్నేహితులు. ఆ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకున్నారు. శరత్ చెల్లెల్ని సంతోష్ చేసుకున్నాడు. ఇప్పటిదాకా అన్నీ సఖ్యంగానే సాగాయి. ఇకమీదట? అతను తన ప్రాణమిత్రుడే కావచ్చును కానీ సుజాత? తన రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు.
అందుకే సంభాషణని ముగిస్తూ “ఇదంత అర్ధరాత్రి శిఖరాగ్ర సమావేశం ఏర్పరిచి అత్యవసరంగా పరిష్కరించాల్సిన విషయం కాదనుకుంటాను. సుజాతా నువ్వూ చర్చించుకుని ఒక నిర్ణయానికి నిదానంగా రండి. దానికి నా పూర్తి మద్దతుంటుంది” అన్నాడు.
చిన్నగా నవ్వాడు సంతోష్. “డాక్టరు దగ్గిర్నుంచి వచ్చినప్పట్నుంచి ఒకటే గాభరాగా వుంది నాకు. ఎవర్తోటేనా నా బాధ పంచుకోవాలనిపించింది. నువ్వు తప్ప నాకు ఫ్రెండ్స్ ఇంకెవరున్నారు?” అన్నాడు ఆర్తిగా.
శరత్‍కి చెల్లెలు గుర్తొచ్చింది. ఏం చేస్తోందో యిప్పుడు? అతనంటే మగవాడు. బాధేస్తోందని అర్ధరాత్రి యింట్లోంచి బైటపడి తన దగ్గిరకి వచ్చేసాడు. కానీ అది? అంత దుఃఖాన్నీ నిద్రరాని రాత్రితో పంచుకుంటూ, ఒంటరితనంతో మ్రగ్గుతూ… ఓహ్! తలబలంగా విదిల్చాడు.
“ఇప్పుడింక యింటికేం వెళ్తావు? ఇక్కడే వుండిపో. తెల్లారేక యిద్దరం కలిసి వెళ్దాం” అన్నాడు.
“కాదు. నేను వెళ్ళిపోతాను. నువ్వూ అక్కయ్యా వుదయాన్నే రండి. సుజాతకి ఇంకా చెప్పలేదు. ఎలా చెప్పాలో అర్థమవటం లేదు” అంటూ లేచాడు సంతోష్.
“ఐనా అదేం డాక్టరు? ఇద్దర్నీ కూర్చోబెట్టి చెప్పేతీరుగా చెప్పాలిగానీ” అన్నాడు శరత్.
సంతోష్ వెళ్ళిపోయాడు. అతను యింటికే వెళ్తున్నాడని భావించాడు శరత్. కానీ వాళ్ళిద్దరి దారులూ చీలిపోయి చాలాసేపైందనీ అతని గమ్యం యిప్పుడు తన చెల్లెలు కాదనీ అనుకోలేదు.


“భలే మనిషమ్మా అతను. ఇప్పటిదాకా మీరిద్దరూ యీ విషయం గురించి మాట్లాడుకోనే లేదా? ఇది మీ భార్యాభర్తలిద్దరికీ సంబంధించినది. ముందుగా మీరిద్దరూ చర్చించుకుని ఓ నిర్ణయానికొచ్చాక మమ్మల్నేదైనా సలహా అడిగితే చెప్తాం. ఇలా ఇల్లుపట్టకుండా తిరుగుతూ, విషయం నలుగురిముందూ చర్చకి పడేసి, వాళ్ళందరూ తలోవిధంగానూ అన్నాక అప్పుడు నిన్ను సంప్రదించడానికొస్తాడా?” కొంచెం కోపంగా అన్నాడు శరత్. ముందురోజురాత్రి తన దగ్గరకొచ్చిన సంతోష్ యిప్పటిదాకా యిల్లు చేరలేదంటే అతనికి ఆశ్చర్యం, కోపం రెండూ కలిగాయి.
“అతని మనసులో ఏముందో సరిగ్గా చెప్పడు. ఐనా నేను గ్రహించాననుకో. అతనిపరంగా ఆలోచిస్తే అది న్యాయమేకావచ్చు, కానీ నేనెలా సమర్ధించగలను? ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా వుందే సుజా! నాకే అలా వుంటే నీ పరిస్థితి ఎలా వుంటుందో నేను అర్ధం చేసుకోగలను. అతనేం చెప్పినా తొందరపడకు. ఆవేశపడి పిచ్చిపిచ్చి పనులేం చెయ్యకు. అమ్మావాళ్ళనీ రమ్మందాం” చెల్లెలికెలా ధైర్యం చెప్పాలో అర్ధంకావటం లేదతనికి. ఏడ్చి ఏడ్చి పీక్కుపోయిన మొహంతో రాత్రంతా అనుభవించిన నిద్రలేమి కళ్ళలో ప్రతిబింబిస్తుంటే… అలాంటి స్థితిలో ఆమెనొదిలేసి వూరుమీద తిరుగుతున్న సంతోష్‍మీద క్షణక్షణానికి కోపం పెరిగిపోతోంది.
ఒక్క అతనిదేనా యీ సమస్య, సుజాతది కాదూ? అతనికింకా పరిష్కారమార్గాలున్నాయి. దీనికసలు ఆ అవకాశమే లేదు. అసలా ట్యూమర్ ఎలాంటిదో, గర్భాశయం తీసేస్తే వదిలిపోతుందో, ఏ కేన్సరుకేనా దారితిస్తుందో తెలీదు. అలాంటిది ఒక్క వోదార్పు మాటకూడా చెప్పకుండా ఆమె కర్మానికి ఆమెని వొదిలెయ్యడం వాళ్లమధ్యనున్న బంధం ఎంత పైపైదో చెప్పకనే చెప్తోంది. ఇది అతని భర్తృపార్శ్వం అని అర్థమైంది.
“సుజా! మాతో వస్తావా? రెండురోజులు వుండి కుదుటపడ్డాక వద్దువుగాని ” అంది శరత్ భార్య.
“వద్దొదినా! ఇక్కడే వుంటాను. ఇప్పుడు రాను” జవాబిచ్చింది సుజాత.
“అధైర్యపడకు. ప్రతిసమస్యకీ పరిష్కారం వుంటుంది” మరోసారి ధైర్యం చెప్పి, వెళ్తామని యిద్దరూ లేచారు. హాల్లో సుజాత అత్తగారు ఎదురైంది. వీళ్ళని చూడగానే ఆవిడ ముఖం అప్రసన్నంగా మారింది.
“బావున్నారా?” పలకరించేడు శరత్. ఆవిడ తిన్నగా జవాబివ్వలేదు. ముందు సన్నగా మూలిగింది. తర్వాత దీర్ఘం తీసింది. ఆ తర్వాత సన్నాయినొక్కులు నొక్కుతున్నట్టు అంది, “ఏం బాగులే శరత్! మా యింటావంటా యిలాంటివి లేవు”
“మా యింట్లోమాత్రం వున్నాయటండీ?” అన్నాడు శరత్. ఆవిడ మారుమాట్లాడ లేదు. వెళ్తున్నామని చెప్పేసి భార్యాభర్తలిద్దరూ బైటపడ్డారు.


“నేను చెప్పిన విషయం ఏం చేసావురా?” భోజనం కాగానే చెప్పుల్లో కాళ్ళు దూరుస్తున్న సంతోష్‍ని అడిగింది తల్లి.
వారంరోజుల్నించీ తల్లికీ భార్యకీ దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
“ఇంకా ఆలోచించుకోలేదు.” తల్లి ఇలా నిలదీసినట్టు అడగ్గానే గొణిగాడు.
“అంత ఆలోచనకేముంది? మూడేళ్ళు ఎదురుచూసారు పిల్లలకోసం. చల్లగా చావుకబురు బైటపడింది. దీనికెలాగా పిల్లలు పుట్టరు. గొడ్రాలిని కట్టుకుని నువ్వు సంతానహీనుడివని ముద్రవేయించుకుంటావా? మగాడివి. నీకేం ఖర్మరా? నువ్వు చెప్తావా సుజాతకి, నేను చెప్పనా?” కొంచెం గట్టిగానే అడిగిందావిడ.
పిల్ల బావుండాలి, కట్నకానుకలు తేవాలి. ఇది పెళ్ళి అనే నాటకంలో మొదటి అంకం. వచ్చిన పిల్ల ఇంటిని లతలా అల్లుకుపోయి సేవలు చేసి అందర్నీ మెప్పించాలి. ఇది రెండో అంకం. ఆ తర్వాతది అసలుది. జీవితాన్ని మలుపు తిప్పేది. పిల్లలున్నా లేకపోయినా ఆ మలుపేదో తిరిగేది ఆడవారి విషయంలోనే. పిల్లలు పుడితే చేస్తున్న వుద్యోగం మానెయ్యటమో, ప్రమోషన్లవీ లేకుండా నెత్తిమీద మేకు కొట్టుకోవటమో చెయ్యాలి. పిల్లల్లేకపోతే అదొక వింతరకం. వళ్ళంతా మందులతోటీ కృత్రిమహార్మోన్లతోటీ నింపేస్తారు. ఆ తర్వాత ఇన్‍విట్రో. ఒక విజయం సాధించినంత గర్వం. మగవారికి, ఆడవారికి కాదు. అప్పటికి వాళ్ళకి వున్న శక్తంతా హరించుకుపోతుంది. సుజాతకీ ఓటమిలాంటి ఆ విజయానికి కూడా అవకాశం లేదు. ఐతే ఇక్కడ వున్న వింతల్లా, ఈ విషయాలని భార్యాభర్తలుకాకుండా మూడోవ్యక్తులు నిర్ణయిస్తారు.
కొడుకు పెళ్ళైన ఏడాదికల్లా మనవడిని ఎత్తుకోవాలని కలలు కన్నది సంతోష్ తల్లి. మూడేళ్ళైనా కలగకపోయేసరికి ఆవిడ నిర్ణయం ఆవిడ తీసేసుకుంది. ఇప్పుడింక ఆచరణే మిగిలింది.
నిజానికి సంతోష్‍కి ఈ విషయంలో అభ్యంతరమేమీ లేదు. తల్లి ఆ విత్తనాన్ని అతని మెదడులో ఎప్పుడో నాటింది. ఇప్పుడు అది మొలకెత్తింది. సుజాతకి పిల్లలు పుట్టకపోతే తనేం చెయ్యగలడు? మగవాడు తను. వంశాన్ని వృద్ధి చేసుకునే వీలుని తనెందుకు వదులుకుంటాడు? ఆమె కాకపోతే మరొకరు. పిల్లల్లేకుండా ఎలా?
ఈ విషయం తనుగా ఆమెకి చెప్పడానికి చెప్పడానికి సంతోష్ తటపటాయిస్తున్నది ఆమె బాధపడుతుందనేమీ కాదు. ఎన్నో సినిమాల్లో చూసాడు. ఎన్నో నవలల్లో చదివాడు. ఇలాంటి సందర్భాల్లో స్త్రీయే ముందుపడి భర్తని మరో పెళ్ళి చేసుకొమ్మని వేడుకుంటుంది. తన భార్య అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుందనుకోలేదు. మొదటి ఎత్తు ఆమే వెయ్యాల్సి వున్నప్పుడు తనెందుకు తొందరపడాలని ఆగాడు. తల్లి ముందుకి నెట్టిందిగాబట్టి యిప్పుడింక అది తక్షణమైంది.
వేసుకున్న చెప్పులలాగే వదిలేసి పడగ్గదిలోకి వెళ్ళాడు. కుర్చీలో ముడిచిపెట్టుకుని కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటోంది సుజాత. చూపులు పుస్తకంమీదా మనసు మరోవిషయంమీదా వున్నాయి. వారంరోజుల్నించి యింట్లో జరుగుతున్న విషయాలు పరోక్షంలోనే జరుగుతున్నా ఆమెకి తెలుస్తూనే వున్నాయి.
భర్త మరోపెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడన్న విషయం విని మొదట దిగ్భ్రాంతి చెందింది. ఏడిచింది. అది తనపట్ల ద్రోహంగా అనిపించి గుండెని పుండు సలిపినట్టు సలిపింది. తనలో లోపం వుండి పిల్లలు పుట్టనంతమాత్రాన అతను రెండోపెళ్ళికి సిద్దపడిపోవాలా ? లోకంలో పిల్లల్లేని భార్యాభర్తలు ఎందరు లేరు? తమకి పిల్లలు పుట్టకపోతేనేం? కావాలనుకోవాలేగానీ తల్లిదండ్రుల్లేని పిల్లలెందరు లేరు?” అని తర్కించుకుంది.
క్రమేపీ ముందటి వుద్వేగం తగ్గింది. అతనికి పిల్లలు కావాలనుందేమో! వుండదా? కట్టుకున్న భార్యకి పిల్లలు పుట్టే అవకాశం లేనప్పుడు మరో పెళ్ళి తప్పించి మార్గాంతరం ఏముంటుంది? నెమ్మదిగా ఆమె హృదయవైశాల్యం పెరిగింది. అతనొచ్చి అడిగితే తన సుముఖతని తెలియచెయ్యాలనుకుంది. ఆ తర్వాత? ఆమె ఆలోచనలు ఆమెకి వున్నాయి. దారులు విడిపోయినవాళ్ళు విడివిడిగా ఎలా ఆలోచిస్తారో అలానే ఆలోచించింది… అతనికి భిన్నంగా. అదిగో… సరిగ్గా అప్పుడే అతనా గదిలోకి ప్రవేశించాడు. అతనికామె పరాయిదిగా అనిపించింది. ఆమెని అడగాలనుకుంటున్న విషయంచేత అలా అనిపిస్తోంది. ఆమెవలన తనకి జరిగిన నష్టానికీ, ఇప్పుడీ వుత్పన్నమైన పరిస్థితికీ అలా అనిపించింది.
“సుజా!” గొంతు సర్దుకుంటూ పిలిచాడు. ఆమె దిగ్గున కళ్ళెత్తి చూసింది. ఎంతగా మనసు రాయిచేసుకున్నా కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. తన కాల్లో ముల్లు గుచ్చుకున్నప్పుడూ, కత్తిపీటతో చెయ్యి తెగినప్పుడూ ఎంతో వూరడినిచ్చిన చేతులు… దగ్గరకి తీసుకుని గుండెలకి చేర్చుకుని వోదార్చిన చేతులు… యిప్పుడు ముందుకి రావేం? కొంచెం జ్వరం వస్తేనే అల్లల్లాడిపోయిన ఆ వ్యక్తి మొహంలో అపరాధభావనే తప్ప ఆవేదన కనిపించదేం? కన్నీళ్ళచాటునించి అతని మొహం మసగ్గా కనిపించింది. అరచేత్తో కళ్ళు తుడుచుకుని కుర్చీలో సర్దుకుని కూర్చుంది.
“అమ్మ చెప్పింది విన్నావుగా?” దూరంగా నిలబడే అడిగాడు.
“ఊఁ ” భారంగా జవాబిచ్చింది.
“నిజానికి నాకేమాత్రం యిష్టం లేదు. అమ్మ బలవంతపెడ్తోంది” మాటలు పేర్చుకుంటూ అన్నాడు. అతని మాటల్లో కొత్తగా కనిపిస్తున్న హిపోక్రసీకి సుజాత కళ్ళుపెద్దవయ్యాయి.
“ఇలా జరిగిందిగాబట్టి నేను మరోపెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను” అని సూటిగా చెప్పవచ్చు. కానీ అమ్మచాటుని నిలబడ్డాడు. మరుగుజ్జయాడు. అమాయకత్వం నటిస్తున్నాడు. అతనెంతో లౌక్యంగా అన్నమాటలకి ఏం జవాబివ్వాలి?
“పర్వాలేదు. చేసుకోండి” అనాలా?
“మీదెంత వుదారస్వభావం!” అని పొగడాలా?
“మీ అంత మంచివారు లేరు” అని సర్టిఫై చెయ్యాలా?
ఎంత దయనీయమైన పరిస్థితి తనది!। తనకింక జీవితంలో ఏమీ లేదని తెలిసిపోయాక కూడా యింకా తననుంచీ యిలా ఆశించడం! ఏమీ మాట్లాడలేదు సుజాత.
“నీకు నేనేమి అన్యాయం చెయ్యను. ఇంట్లో నీస్థానం నీకే వుంటుంది” అన్నాడతను.
అప్పటిదాకా తమిద్దరిమధ్యనీ పెరిగిన దూరాన్ని మనసులోనే కొలుస్తున్న సుజాత నిదానంగా వుండడానికి ప్రయత్నం చేస్తూ అంది. “రిపోర్ట్స్ వచ్చి వారంరోజులైంది. అప్పట్నుంచి మనం ఒక్కసారిగూడా మాట్లాడుకోలేదు”
“వాటిని చూసి నేను చాలా బాధపడ్డాను. ప్రపంచం తలకిందులైనట్టైంది”
“బాధ మీ ఒక్కరిదే కాదు, నాదికూడా. ఈ పరిస్థితుల్లో ప్రతిమగవాడూ చేసేపనే మీరూ చెయ్యాలనుకున్నారు. సబబో కాదో! వద్దనను. కానీ మధ్యలో నేనెందుకు?”
“… కాదు సుజా!” అతనికి ఆమె ఏం చెప్పబోతోందో అర్థమవలేదు.
అతన్ని వారించిందామె. “నాకూ ఒక మనసుంది, బాధ వుంటుంది. మిమ్మల్ని నేను మరో స్త్రీతో పంచుకోలేను. ఐనా ఇద్దరు భార్యల్తో మీరు తిరగ్గలరేమోగానీ నేనలా వుండలేను… నలుగుర్లో అదెంతో అసహ్యంగా వుంటుంది. అసహజంగా వుంటుంది”
“నాకు పిల్లలు కావాలి సుజాతా!” బైటపడిపోయాడు. తలొంచుకుని అన్నాడు. ఇంకా నిలబడే.
“ఎవర్నేనా పెంచుకుందాం” నాలిక చివరిదాకా వచ్చినమాటల్ని మింగేసింది. అని ప్రయోజనం వుండదని. “మీకు నేను అడ్డురాదల్చుకోలేదు. కానీ నేనిక్కడ వుండబోవడంలేదు. నా చేతిలోంచి జారిపోయినదాన్ని మరో ఆడపిల్ల అందుకుని నా కళ్ళెదుటే తిరుగుతుంటే చూస్తూ సహించలేను. పోగొట్టుకున్నదాని గురించి ఆశాంతితో నేను, పొందాల్సినదాన్ని పరిపూర్ణంగా అందుకోకుండా నేను అడ్డంగా వున్నానని ఆమె… ఇంత అసహజమైన వాతావరణంలో మీరింతగా కోరుకునే పిల్లలు సరిగా పెరుగుతారా?”
ఒక్కక్షణం వుక్కిరిబిక్కిరయ్యాడు సంతోష్. ఆనందమేనా, అది? పూర్తిగా కాదు. లోపల్లోపలెక్కడో లోకభీతి… నలుగురూ ఏమనుకుంటారోనన్న భయం.
“దానంతట అది విడాకులు కావాలంటుంటే మధ్యలో నువ్వేమిటలా మొహం వేళ్ళాడేసుకున్నావ్?” అంతా విన్నాక కొడుకుని మరో అడుగు ముందుకి నెడ్తూ అంది అతని తల్లి.
“నీ నిర్ణయం తప్పేమో మరోసారి ఆలోచించుకో సుజా!” అన్నాడు శరత్.
“అంతకన్నా నాకు మరో మార్గం లేదు. దేవుడు నాకు అన్యాయం చేసాడు. బతికి వున్న నాకన్నా ఇంకా పుట్టని పిల్లలు నా జీవితగతిని నిర్ణయించడం ఒక వైచిత్రి. ప్రతిక్షణం దాన్ని నాకు గుర్తుచేసేచోట నేనెందుకుండాలి? నా బతుకు నేను బతుకుతాను” స్థిరంగా జవాబిచ్చింది సుజాత.
ఫలితం… సుజాతకి విడాకులిచ్చాడు సంతోష్


సుజాత తండ్రి దగ్గరకి వెళ్లిపోయింది. ప్రైవేటు కాలేజీలో ట్యూటర్‍గా చేరింది. నెలకి రెండువేలొస్తోంది. మొదట్లో సంతోష్ ఆమెకి వుత్తరాలు వ్రాసేవాడు. ఆమె జవాబిచ్చేది కాదు. తర్వాత అతనికి పెళ్ళైంది. కొత్త భార్య, కొత్త జీవితం, కొత్త పరిచయాలు. ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
అవంతీపురం స్టేషన్లో నిలబడ్డాడు సంతోష్. భార్య, పిల్లల్ని తీసుకుని వేసవిసెలవులకని పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి. ట్రెయిను గంట లేటు. పేపరుకొన్నాడు. చదివేసాడు. అప్పుడే అది పదిచేతులు మారిందికూడా. అతని దృష్టి దూరంగా నిలబడ్డ యువతిమీద పడింది. సుజాత!
అతన్లో జ్ఞాపకాల ధూళి రివ్వుమని లేచింది. గబగబ అటుకేసి అడుగులేసాడు. ఆమె సుజాతే. కూడా ఏడెనిమిదేళ్ళ పాప వుంది. అతన్ని చూడగానే అభిమానంగా నవ్వింది సుజాత. “బావున్నారా?” తనే ముందు పలకరించింది.
“నువ్వు?’
“చూస్తున్నారుగా? “
“ఈ పాప?”
“నాపాపే. పెంచుకుంటున్నాను. ఎలా వుంది? నాలుగు చదువుతోంది. పేరు మధు” అంది.
సంతోష్‍కి ఆమెని చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది. ఆమె ఆనందంగా వున్నానంటోంది. తనవరకు తనూ హాయిగానే వున్నాడు. ఆరోజు ఆమె అంత తెగింపైన నిర్ణయం తీసుకోకపోతే యిద్దరూ యిప్పుడిలా వుండగలిగేవారేనా?
తనది తప్పని అప్పుడూ అనిపించలేదు. ఆమె నిర్ణయం సరైనదని మాత్రమే అనుకున్నాడు.
ఇంతలో ఆమె ఎక్కవలసిన రైలొచ్చింది. బై చెప్పి ఆమె కదిలింది. రైల్లో కూర్చున్నాక మధు అడిగింది. “ఆయనెవరు మమ్మీ?”” అని.
“ఒకప్పటి స్నేహితుడు” జవాబిచ్చింది సుజాత,
(వనిత, నవంబర్ 1996, సాహితి అనే కలంపేరుతో)