పూర్ణ భర్త పోయాడు! నిశ్చలంగా ఉన్న తటాకంలోకి రాతిని విసిరినట్టైంది నా పరిస్థితి. ఉత్తరం చేత్తో పట్టుకుని రాతిబొమ్మలా కూర్చుండిపోయాను.
“ఆ ఉత్తరమేమిటి నాన్నా? ఎక్కడినుంచి?” రఘు వచ్చి ఆత్రంగా నా చేతిలోంచి ఉత్తరం తీసుకున్నాడు.
“మామయ్యగారు పోయారా? పూర్ణత్తయ్యగారికి ఈ వయస్సులో చాలా కష్టం” వాడు పూర్ణపట్ల సానుభూతి ప్రకటించి తన బాధ్యత తీర్చేసుకున్నాడు.
కానీ నాకు పూర్ణతో అలాంటి బాధ్యతని మించిన అనుబంధమే ఉంది. తను నాకు తోబుట్టువు కాదు. కనీసం చుట్టంకూడా కాదు. అంతకు మించిన బాంధవ్యం, స్నేహం మా ఇద్దరి మధ్యా ఉంది. ఉత్తరం చింపేసి అలసటగా కుర్చీలో వెనక్కి వాలిపోయాను. మనస్సులో ఎన్నెన్నో జ్ఞాపకాలు కెరటాల్లా ఉవ్వెత్తున లేచి విరిగి పడుతున్నాయి.
సావిత్రమ్మత్తయ్యకి పాప పుట్టిందంటే అమ్మతో కలిసి వెళ్ళాను. తెల్లగా మల్లెమొగ్గలా ఉంది పాపాయి. దానికి అన్నపూర్ణ అని పేరు పెట్టారు. అది పెద్దదైతుంటే నాకు వాళ్ళల్లు వదిలిపెట్టి వెళ్ళాలనిపించేది కాదు. ఎన్నెన్ని ఆటలాడేదని! ఎన్నెన్ని కబుర్లు చెప్పేదని! చెవుల లోలక్కులు ఊగేలా తల ఊపుతూ ఎన్నెన్ని తమాషాలు చేసేదని! బడి ఎగ్గొట్టి తనతోఆడుతూ కూర్చునేవాడిని. అందుకుగాను అమ్మతో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నానో! సావిత్రమ్మత్త కూడా దెబ్బలాడేది.
“చంటిపిల్ల, ఆడపిల్లతో నీకు ఆటలేంటి, తోటిపిల్లల్తో ఆడుకోవాలిగాని” అని అమ్మ అంటే, “అలా స్కూలు మానకూడదు” అని అత్త బుజ్జగించేది.
వాళ్ళమ్మ ఏ తాయిలం పెట్టినా పరికిణీ అంచుతో చుట్టి కాకెంగిలి చేసి నాకు పెట్టేది. మా బళ్ళోనే దాన్ని చేర్చారు. నాతో స్కూలుకి వచ్చేది. తన క్లాసులో తనని కూర్చోబెట్టి నా క్లాసుకి నేను వెళ్ళేవాడిని. ఇంటర్వెల్లో మళ్ళీ నా దగ్గరకి పరిగెత్తుకొచ్చేది. నా స్నేహితులతో భుజాలమీద చేతులేసి ఎలా నడుస్తానో నాతోటి అలాగే నడవాలని ప్రయత్నించేది. వాళ్ళలాగే సుబ్బా అని పిలిచేది. భూమికి జానెడుండే పూర్ణ! నేను థర్డ్ఫారం చదువుతుంటే, తను ఒకటో క్లాసు చదివేది. పదిహేనేళ్ళు రాగానే పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది. నేను మగవాడిని కాబట్టి ఆ ఊరొదిలి పెట్టి రావల్సిన అవసరం లేకపోయింది. దాదాపు నలభయేళ్ళు నాతో సహజీవనం చేసిన నా ఇల్లాలిని సుమంగళిగా ఈ ముంగిట్లోంచే సాగనంపాను. నా వొంట్లో ఓపికకూడా తనతో తీసుకువెళ్ళిపోయింది. మొదటిసారి హార్టెటాక్ వచ్చినప్పుడు పిల్లలు బలవంతంగా ఆ పల్లెతో బంధాలు తుంచి పట్నానికి నా మకాం మార్చారు.
పూర్ణ పెళ్ళివేడుకలు, ఇంకా అందుకు అనుబంధమైన ఎన్నో సంఘటనలు నా కళ్ళముందు లీలగా కదులుతున్నాయి. నా కళ్ళముందు పుట్టి పెరిగిన పిల్ల, సుబ్బా సుబ్బా అంటూ నా వెంట తిరిగిన పిల్ల తనే పిల్లలతల్లి కావటం, తల్లిచాటుని గారాబంగా పెరిగిందల్లా ఒక యింటిని నిభాయించుకు రావటం ఇవన్నీ తమాషాలా చూసాను. ఈ వయస్సులో యిలా జరగటం తనకెంత పెద్దదెబ్బ! జీవితభాగస్వామిని కోల్పోవడమనేది ఎంత దుస్సహమో నాకు తెలుసు, స్వయంగా అనుభవించాను కాబట్టి,
ఒకవిధంగా చెప్పుకోవాలంటే పూర్ణ అదృష్టవంతురాలే. సూర్యం బాధ్యతలన్నీ తీర్చుకున్నాకే వెళ్ళిపోయాడు. అయిదుగురు కొడుకులూ మంచిమంచి హోదాల్లో ఉన్నారు. ఆడపిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేశారు. ఇంకేం కావాలి? పుట్టిన ప్రతిమనిషీ చావక తప్పదు. కొందరు ముందు, కొందరు తరువాత. అంతేగానీ, ఆత్మీయులనుకున్న వాళ్ళంతా ఒక్కసారే చచ్చిపోలేరు కదా! ఇలా అనుకున్నాక నా మనస్సు కాస్త తేలిగ్గా అనిపించింది.
లేచి రెండు జతల బట్టలు బాగ్లో సర్దుకుని ఇంట్లోవాళ్ళకి చెప్దామని వంటింటికేసి వెళ్తుంటే రఘు భార్య మంజుల ఎదురొచ్చింది. నా చేతిలోని బాగ్నీ, నన్నూ మార్చిమార్చి ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె వెనుకే రఘూ వచ్చాడు.
విషయం వాడికి తెలుసుగా! అందుకే వారించాలని చూశాడు. “ఈ పరిస్థితుల్లో ప్రయాణమేమిటి, నాన్నా! అంతగా కావాలంటే నేనో, తమ్ముడో వెళ్ళాస్తాం” అన్నాడు.
“మీరెళ్ళి ఏం చేస్తారు? ఆవిడ దుఃఖం వీసమెత్తుకూడా తగ్గించలేరుకదా!” ఇలా సాగింది వాడి ధోరణి.
“అదే నా సొంతచెల్లెలైతే వెళ్ళక తప్పుతుందారా? నా ఒంట్లో ఇప్పుడు కులాసాగానే ఉంది. ఎవరం ఏమీ చెయ్యలేని మాట నిజమేకానీ నాలుగు ఉపశమనవాక్యాలు పలుకుతాం. అక్కడికీ బాధ తగ్గకపోతే అంతా కలిసి కాసేపు ఏడుస్తాం. సూర్యంకూడా నాకు పైవాడేమీ కాదు” నచ్చజెప్తున్నట్టుగా అన్నాను. చేసేదేమీ లేక ఊరుకున్నాడు రఘు.
నేను వెళ్ళేసరికి అక్కడి పరిస్థితి నేను ఊహించినదానికి చాలా భిన్నంగా ఉంది. తమనింత ఉన్నతికి తీసుకొచ్చిన సంగతి విస్మరించి తండ్రి అంత్యక్రియలు ఎంతో క్లుప్తీకరించాలాని ఆలోచిస్తున్నారు పూర్ణ కొడుకులు. సూర్యం టీచరు. బ్రాంచిపోస్టుమాస్టరుగానూ చేసేవాడు. ఆయుర్వేదవైద్యం చేసేవాడు. అనేకరకాల పరిచయాలు, కృతజ్ఞతలు… చాలామంది వచ్చారు. వచ్చినవాళ్ళు అదో ప్రసాదంలా భోజనం చేసి వెళ్తున్నారు. ఉత్తిచేతుల్తో రాకుండా కూరలో, ధాన్యమో ఏవో ఒకటి తెస్తున్నారు.
ఒకవైపు లోకభీతి… మరోవైపు ధనప్రీతి…
“చచ్చిపోయిన వ్యక్తికి యింత ఆర్భాట మెందుకు? ఆయనకి అవేమైనా అందుతాయా, చేస్తాయా! మరీ ఈ పెద్దవాళ్ళంతా చాదస్తం. తీర్థప్రజల్లా వస్తున్న ఈ జనాన్నందర్నీ మేపడానికి నాన్న మనకేమీ మిగల్చలేదని అమ్మకిమాత్రం తెలీదా?” వాళ్ళ చిన్నవాడు అంటున్నాడు.
“అమ్మ బాధపడుతుందేమోరా?” పెద్దవాడిలో ఇంకా పూర్తిగా మానవత్వపు ఛాయలు మాసిపోలేదు.
“నా దగ్గర పెద్దగా డబ్బేమీ దన్నయ్యా! ఈమధ్య ప్రాక్టీసు దెబ్బతింది. గవర్నమెంటిచ్చే జీతంతోనే క్లుప్తంగా గడుపుతున్నాం” డాక్టరైన రెండోకొడుకు ఉవాచ. ఈ ఖర్చంతా తనమీదే ఎక్కడ పడుతుందోనని పెద్దవాడు మరింక మాట్లాడలేదు.
“ఆవిడ గాజుల జత ఇచ్చింది కదా! ఆ విషయం పైకి చెప్పకుండా రెండువేలో, మూడువేలో గుట్టుచప్పుడు కాకుండా ఇచ్చెయ్యండి. మంచి బంగారం. చెయ్యిదాటితే మళ్ళీ తిరిగిరాదు. కనీసం ఆరు తులాలైనా ఉంటాయి. మీ అన్నదమ్ములు అందర్లోనూ తీసిపారేసినట్టు మనమే ఉన్నాము. అయినా, వాళ్ళకెంత కక్కుర్తో! పైస కనిపిస్తే చాలు, ఎగబడిపోతారు…” ఇంకోమూల భర్తకి తెలివితేటలు నూరిపోస్తోంది నాలుగోకోడలు
నా తల తిరిగిపోయింది. పూర్ణ… నేనెంతో ఉన్నతంగా ఊహించుకున్న పూర్ణ ఇంత హేయమైన పరిస్థితుల్లో ఉందా? నాకు తెలీకుండానే నా కళ్ళలోంచి కన్నీళ్ళు జారాయి.
బంధువులు పెద్దగా రాలేదు. ఈ పరిస్థితులు అందరికీ తెలుసేమోననుకుని అనుకుని పూర్ణపట్ల జూలిపడ్డాను. తనైతే నెత్తిమీద నీళ్ళకుండ పెట్టుకున్నట్టుంది. నేనెరిగిన పూర్ణ వేరు. నేనూహించిన పూర్ణ వేరు. ఈ పూర్ణ వేరు! మనిషిలో ఎంతో మార్పు. వెనుకటి చలాకీతనం వయస్సులో కలిసిపోతే తరువాత వచ్చిన నిండుతనం భర్తృవియోగంలో కరిగిపోయింది. బోసిబొమ్మలా ఉంది.
కర్మకాండ పూర్తయ్యాక పన్నెండవరోజు రాత్రి అన్నాను “బాబూ! ఓ వారం రోజులు అమ్మని నాతో పంపించండి. తోబుట్టువులాంటివాడిని. ఆమెకి వేరే పుట్టిల్లేమీ లేదుకదా!” అని.
ఈమాటకి అన్నదమ్ములు ముఖాలు చూసుకున్నారు. కొన్నిక్షణాల తర్వాత పూర్ణ పెద్దకొడుకు సమాధానం చెప్పాడు. “ఆవిడకి వచ్చిన కష్టం పెద్దదేకానీ, తను లేకపోతే ఇక్కడ ఒక్క క్షణంకూడా గడవదండీ, మామయ్యగారూ! నేనూ, మా ఆవిడా ఉద్యోగస్థులంకదా! పిల్లలకి భోజనాలూ అవీ ఇబ్బంది. మరోలా అనుకోకండి. ఏడాది వెళ్ళాక నేనో, మా ఆవిడ సెలవు పెట్టి అమ్మని తీసుకుని తప్పకుండా మీ ఇంటికి వస్తాం”
నేను మాత్రం ఇంకే మనగలను? పరిగెత్తే రోజులతో పందెం వేసుకుని పరిగెత్తాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. సంప్రదాయాలనో, సరదాలనో బలిపెట్టక తప్పదు.
ఆరోజు రాత్రి నాకని కేటాయించిన గదిలో విశ్రాంతిగా పడుకున్నాను. ఎంత ప్రయత్నించినా నిద్ర మాత్రం రావడం లేదు, ఏమిటీ జీవితపయనం? ఇంత చిన్న జీవితంలో ఎన్నో పరిచయాలు, అనుబంధాలు చోటుచేసుకుంటాయి. మనిషి బతికి ఉన్నంతకాలం అవేవో చిక్కుముడిలాగానూ, ఆమధ్యని మనం చిక్కుపడిపోయినట్టుగానూ అనిపిస్తుంది. ఏ పని చెయ్యాలన్నా ఏదో ఒక ప్రతిబంధకం ఏర్పడుతుంది. కానీ, మృత్యువు తన రాకని ప్రకటించాక మాత్రం ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఈ బంధాలన్నిటినీ తెంచుకుని జీవి సీతాకోకచిలుకలా ఎగిరిపోతాడు. ఎక్కడికి? అసలు యీ చచ్చిపోయినవాళ్ళంతా ఏమౌతారు? ఎక్కడికి వెళ్తారు?
“నువ్వేమీ చెప్పకపోతే ఆయన అలా ఎందుకు అడుగుతాడమ్మా?” బిగ్గరగా వినిపిస్తున్న బొంగురుగొంతు నా ఆలోచనల్ని చెదరగొట్టేసింది. అది… పూర్ణ పెద్ద కొడుకుది. నేను నిద్రపోతున్నాననుకుని పక్కగదిలోనే యదేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు.
“ఇది మన కుటుంబవ్యవహారం. మధ్యలో ఆయన జోక్యం దేనికి? మా అమ్మకి మేం ఆపాటి తిండి పెట్టుకోలేమా? లేక ఆయనో వారంరోజులు తీసుకెళ్ళి ఉంచుకుంటే మా భారం తిరిపోతుందా?”
“నలుగుర్లోనూ మా పరువు యాగీ చెయ్యకమ్మా! నీకు పుణ్యం ఉంటుంది. ఐనా మనకీ వాళ్ళకీ చుట్టరికాలేం వున్నాయి? అమ్మమ్మావాళ్ళూ, వీళ్ళూ ఇరుగుపొరుగువాళ్ళు… అంతేకదా?”
ఎవరిని వాళ్ళు నిలదీస్తున్నది? తల్లీ, తోబుట్టువులూ లేనిదికదా, పుట్టింటికి తీసుకెళ్ళాల్సిన సంప్రదాయం తీరుద్దామని రమ్మన్నానేగానీ, తల్లీకొడుకుల మధ్య తంపులు పెడదామనా? పూర్ణ ఏడుపు నా హృదయాన్ని పరపర కోసేస్తోంది. ఎలాంటి అర్థం తీశారు వీళ్ళు! వీళ్ళా, కొడుకులు? నవమాసాలు మోసి కన్నందుకు, సుఖసంతోషాలని త్యాగం చేసి పెంచి పెద్దచేసినందుకు తల్లితండ్రులకి యిచ్చే ప్రతిఫలం ఇదా?
“పుత్రోత్సాహము తండ్రికి తనయుడు కల్గినప్పుడు కాదు…” చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తొచ్చింది. నిర్లిప్తత వహించి ఉండలేకపోయాను. అసలే బీపీ వుంది. అదికూడా పెరిగింది. ఊరుకోనివ్వలేదు. లేచి నెమ్మదిగా వాళ్ళున్నవైపు వెళ్ళాను. నన్ను చూడగానే అక్కడున్నవాళ్ళంతా కంగారుపడ్డారు.
“చూడండి బాబూ, ఐదుగురుకొడుకులుండి పూర్ణకేదో తక్కువ జరిగిందని నేను అనుకోలేదు. అలా అని తనూ చెప్పలేదు. మేమంతా పాతకాలపువాళ్ళం. మాకూ మీకూ చుట్టరికం లేనిమాట నిజమే. కానీ పూర్ణ మాయింట్లో నా చెల్లెళ్లతో సమంగా ఎన్నోసార్లు పసుపుకుంకాలు ఎత్తుకుంది. ఇరుగుపొరువాళ్ళమనేది మీకు చిన్నవిషయంలా అనిపించవచ్చు. అరవయ్యేళ్ళ పరిచయం చిన్న విషయం కాదు. ఈరోజుని మీ అందర్నీ మీమీవాళ్ళొచ్చి ఆశీర్వచనం చెప్పి వెళ్ళారు. మరి పూర్ణకి నాలుగు వోదార్పుమాటలు చెప్పేవాళ్లెవరు? నెత్తిమీద చెయ్యేసి, నిమిరి దైర్యం చెప్పేవాళ్ళెవరు? తనని తనే ఓదార్చుకోవాలా? ” అడిగాను. ఇంకెవరూ ఏమీ అనలేదు.
పూర్ణని నాతో తీసుకొచ్చి వారం రోజులైంది. ఇక్కడి పిల్లల ఓదార్పువల్లనేమిటి, వాతావరణంలో మార్పువల్లనేమిటి తన బాధని చాలావరకూ మర్చిపోయింది. చిన్నప్పటి కబుర్లు గుర్తుచేసుకుని చెప్పుకోవడం, రామాయణ, భారతాలని చదివి చర్చించుకోవడం… కాలం చాలా వేగంగా
జరిగిపోతోంది. జీవితం కొత్తవడితో ప్రవహిస్తోందనిపించింది నాకు.
ఈ ఒకటిరెండురోజుల్లో ఇంట్లో ఏదో మార్పు వచ్చినట్టు గమనించాను. కానీ, దాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు. ఇదివరకులా ఇంటి విషయాల్లో కుతూహలం కలగటం లేదు. పొద్దుటే స్నానం చేసి వచ్చి ఈజీచెయిర్లో కూచున్నాను. వేపచెట్టుమీంచి వస్తున్న చల్లటిగాలి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. వేపపూల వాసన మైమరిపిస్తోంది.
గుమ్మం దగ్గర ఎవరో కదిలినట్టైతే పూర్ణ అనుకుని ఆత్రంగా చూశాను. నా అంచనా తప్పు. వచ్చింది ప్రభాకర్, నా చిన్నకొడుకు. సంకోచిస్తూనే వచ్చి, పూర్ణకోసమని పరిచిన చాపమీద కూర్చున్నాడు. వాడేదో చెప్పడానికని వచ్చి సంశయిస్తున్నాడని గ్రహించాను. అంత సంకోచించే విషయం ఏమై ఉంటుందో అర్థం కాలేదు, ఎక్కువసేపు తటపటాయించకుండా నెమ్మదిగా విషయం బయటపెట్టాడు.
“నాన్నా, నాకు నాగపూర్నుంచీ పూనా ట్రాన్స్ఫరైంది. ఆస్తి పంపకాలు… చేస్తే నావాటా పొలం అమ్మేసి… అక్కడ సెటిలై పోదామని… పెద్దన్న నా వాటా తీసుకుని డబ్బిచ్చేస్తానన్నాడు…” అంతా సగంసగం… అర్థమయేలాగే… చెప్పి, తలదించుకుని వచ్చినట్టే వెళ్ళిపోయాడు.
నేనేం విన్నానో నాకేమీ అర్ధంకాలేదు. అంతా గందరగోళంగా ఉంది. ఆస్తి పంపకాలా? నేను బతికి ఉండగానేనా? అదీ నా స్వార్జితం… అందులోనూ వీళ్ళంతట వీళ్ళు ప్రపోజ్ చెయ్యడం. నా అపరాథమేమిటి? ప్రభాకర్ చెప్పినది కుంటిసాకులా అనిపించింది. దూరంగా ఉంటున్నాడని వాడికి తక్కువేమీ చెయ్యడంలేదే?
సన్నగా గుండెలో నెప్పి మొదలైంది. లేచి మాత్రకోసం లోపలికి వెళ్ళబోయి గుమ్మం దగ్గరే ఆగిపోయాను.
“ఆవిడకి ఏడుగురు పిల్లలుండగా మనింట్లో వచ్చి ఉండడమేమిటండీ? వెళ్ళే ఉద్దేశం అవిడకికానీ, పంపే ఉద్దేశం మానుయ్యగారికికానీ ఉన్నట్టు లేదు. ఆయనకి చేసేసరికే నా పని అయిపోతోంది. ఒకరికిద్దరు ముసలాళ్ళు…” మంజుల సణుగుతోంది. రఘు చాలా ప్రశాంతంగా విన్నాడు.
“పెద్దైతున్నకొద్దీ నాన్నకి మతిపోతోంది. లేకపోతే ఈ చాదస్తపు పనేమిటి? ఎక్కడో ఒక ఊరివాళ్ళమన్న పరిచయం…ఎవరావిడ అని ఇంటికి వచ్చినవాళ్ళు అడిగితే ఏం చెప్తాం?” వాడు సమాధానం చెప్తున్నాడు. నా పిడికిలి బిగుసుకుంది.
“పంపకాల గురించి ప్రభాకర్ మాట్లాడతానన్నాడు. ఇలా ఎక్కడెక్కడి చుట్టరికాలో కలుపుకుని అందర్నీ ఉద్దరిస్తూ వెళ్తే మన పిల్లలకి మిగిలేది చిప్పే!” భర్త సమర్థన విన్నాక మంజుల గొంతు స్థాయి పెరిగింది.
నాకు గుండెలో నొప్పి పెరిగింది. మంజుల బుద్ధి ఇంత చిన్నదా? నాకు ఆత్మీయురాలైన వ్యక్తిని కొద్దిరోజులపాటు ఇంటికి తీసుకొచ్చేపాటి స్వతంత్రం లేదా? పూర్ణ ఆమెకి బరువైందా? నా పెద్దరికానికి ఉన్న విలువ యిదేనా? పూర్ణ మరో వాకిట్లోంచీ వస్తూ కనిపించింది. తన మొహం చిన్నబోయి వుంది. వాళ్ళ మాటలు విన్నట్టుంది.
మాత్ర వేసుకుని నేను వచ్చేసరికి తను చాపమీద కూర్చుని వుంది.
“ఎవరి తప్పూ లేదు సుబ్బా! మనం తీరం చేరిన నావలం. వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. వడ్డుని దిగి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళాలనుకుంటే నావ వెంట వస్తానంటుంది. అక్కడుంది చిక్కంతా” అంది నెమ్మదిగా.
“మీ పిల్లలూ అంతేనా?” అని అడిగాను.
“కుటుంబం అంటే ఒకళ్ళకి అనువుగా మిగతావాళ్ళంతా మారిపోవటంకదా? ఆ ఒకళ్ళూ ఎవరనేది మన తలరాతని నిర్ణయిస్తుంది. కొడుకా, కోడలా దిక్సూచి అనేదానిమీద ఈ మంచిచెడ్డలు ఆధారపడి వుంటాయి. ఎందుకంటే చూపులో తేడా వుంటుంది. కొడుకులు మన చేతిమీద పెరిగినవాళ్ళు. కోడళ్ళు మనకి అలవాటులేని పద్ధతిలో పెరిగి వుంటారు. ఐదుగురూ ఐదు పద్ధతుల్లో. ఐనా ఈవేళ మా పెద్దాడు వచ్చేస్తాడులే. సరిగ్గా వారమే వుంటానని చెప్పాను. రావాలి” అంది. నాకు బాధ కలిగింది. ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పాలనిపించింది. నేను అస్వతంత్రుడినని ఇప్పుడే గుర్తించానేమో, దాన్ని అంత తొందరగా జీర్ణించుకోలేకుండా వున్నాను. మాటలు రాలేదు.
“పెద్దతనంలో వచ్చే శారీరిక దుర్బలత, మరోమనిషి సాయం లేకుండా ఏదీ చెయ్యలేకపోవటం, వ్యవహారాలని చక్కబెట్టుకోవటానికి అనిచ్ఛ… ఇందుకేకదూ, పిల్లలకి లొంగిపోయి వుంటాం. తప్పదులే… వృద్ధులు గౌరవంగా బతికే వీలు లేదు. మా వదిన అమ్మని కొట్టేది… మా తోడికోడలు… నలుగురు కొడుకుల దగ్గిరా తలో మూడు నెలలూ వుంటుంది. ఏ కొడుకు దగ్గర వుంటే ఆ కొడుకు పెన్షను కాగితంమీద వేలిముద్ర వేయించుకుని పెన్షను తెచ్చేసుకుంటాడు. ఇక్కడున్న ఈ వారంరోజుల్లో నేనేమిటీ, ఎలా వుండాలీ అని ఆలోచించుకోగలిగాను. తోడబుట్టినవాడివి కాకపోయినా నాకా వీలు కల్పించావు. ఈ వెసులుబాటు లేకపోతే ప్రవాహంలో గడ్డిపరకలా వాళ్ళెలా అంటే అలా కొట్టుకుపోయేదాన్ని” అంది.
“ఏం చెయ్యాలనుకుంటున్నావు పూర్ణా?”
నవ్వింది. “నా దారేమిటో తెలుసుకోగలిగానుగానీ అందులో వెళ్ళగలనని చెప్పలేదుగా?”
పూర్ణ అన్నట్టే ఆ సాయంత్రానికి పూర్ణ పెద్దకొడుకొచ్చి ఆమెని తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకోమాటు కలుసుకోగలమని అనిపించలేదు నాకు.
(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 17-7-85)
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.