జీవితంలో విజయాలు… అహంకారం… అభిజాత్యం… మనుషులు పొరపాట్లు చెయ్యడానికి ఇవే కారణాలు అయితే నేను ఈ కారణాలచేతనే ఒక పొరపాటు చేశాను.
ఒక వ్యక్తి… ఆ వ్యక్తి నా సంతోషపు జీవితంలో ముల్లులా కదులుతుంటాడు. అతన్ని తలుచుకుని పద్మజ దిగులు పడుతుంది. అతను జ్ఞాపకానికొస్తే ఉదాసీనంగా ఉంటుంది. ముభావాన్ని ముసుగేసుకుంటుంది.
అతను… నాకు ఒక పెద్ద సమస్యే.
అతను… పద్మజ తండ్రి. పద్మజ? నా భార్య. బ్యాంక్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను.పదిహేను లక్షలకు పైగా వచ్చాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్. బాధ్యతలు లేవు. ఉన్న ఇద్దరు కూతుళ్ళకీ సర్వీసులో ఉండగానే పెద్ద చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేశాను. అమ్మ, నాన్న గగన్ విహార్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ తీసుకుని విడిగా ఉంటారు. తమ్ముడిది పక్క ఫ్లాట్. వాళ్లని చూసుకుంటాడు. నేను, పద్మజ ఇద్దరమే ఇప్పుడు.
డబ్బుని ఏం చేయాలా అని ఆలోచించాను. కూతుళ్లు ఇద్దరికీ చెరో లక్షా కానుకగా ఇవ్వచ్చు. ఇచ్చాను. వాళ్లు సంతోషపడ్డారు. ఇంకా? చిన్నప్పుడు నాకు లెక్కలు చెప్పిన మాస్టారు ఇంకా బతికే ఉన్నారు. పిల్లలు పట్టించుకోరట. దయనీయంగా బ్రతుకుతున్నారు. వెళ్లి పదివేలు ఇచ్చి వచ్చాను. ఆయన కళ్ళు కృతజ్ఞతతో మెరవటం నేను మర్చిపోలేను.
ఆ తర్వాత?
ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. జీవితంలో సఫలమైన వ్యక్తిని కాబట్టి నా సిద్ధాంతాలు నాకు ఉన్నాయి. వాటి వెంబడే అహంకారం, అభిజాత్యం. నాకు వచ్చిన ఆలోచన తప్పనిపించలేదు.
పద్మజని పిలిచాను. పనిలో ఉన్నట్టుంది. చేతిబట్టతో చేతులు తుడుచుకుంటూ వచ్చి కూర్చుంది.
“వంటా?” అడిగాను తను చేస్తున్న పని గురించి.
“అయిపోయింది. ఇడ్లీ పిండి గ్రైండ్ చేస్తుంటే పిలిచారు. దేనికి?”
“చూడు, నీకు కాలేజీలో చదువుకునేటప్పుడు ఆశయాలేం ఉండేవి కాదా?” నేను చెప్పబోయే విషయానికి ఒక ఫ్రేమ్ తయారు చేస్తూ అడిగాను.
” ఇప్పుడు ఎందుకు అవన్నీ?” అడిగింది పద్మజ. నేను పిలిచింది అంత ముఖ్యమైన విషయం కాదనకున్నట్టుంది, సర్దుకుని తీరిగ్గా కూర్చుంది కబుర్లు వినటానికన్నట్టు.
” ఎమ్మెస్సీ చదివి లెక్చరర్ అవ్వాలని ఉండేది. మా నాన్న వినలేదు. ఇంట్లో పెద్దదానివి. నిన్నే ఎమ్మెస్సీ అనీ పీహెచ్డీ అనీ పాతికేళ్లదాకా వుంచేస్తే నీ తర్వాతవాళ్ళకి పెళ్లిళ్ళెప్పుడు చెయ్యాలిని కోప్పడ్డారు”
“పెళ్లయ్యాక నాతో నువ్వెప్పుడూ అనలేదు, చదువుకుంటానని” ఆరోపించాను.
“నిజమే. మొదట్లో అత్తింటి కాపురం. తర్వాత వెంటవెంటనే పిల్లలు పుట్టడం. ఐదారేళ్ళపాటు ఏదీ ఆలోచించడానికి వీలులేకుండా వుండేది. ఆ తర్వాత ఆసక్తి పోయింది. “
“పెళ్లిగురించి నువ్వేం అనుకోలేదా? కట్నం ఇవ్వకూడదనీ…ఇలా… సాధారణంగా ఆడవారికి కట్నం ఇవ్వకుండా చేసుకోవాలని వుంటుందటగా?”
“నాకంత ఆలోచనలేం లేవు. మా నాన్న ఇవ్వాలనుకున్నాడు. ఇచ్చాడు. అంతే. నా సుఖం కోసం ఇచ్చాడు”
“కట్నం తీసుకోవడం నాకెప్పుడూ ఉండేది కాదు తెలుసా?”
” మరి ఎందుకు తీసుకున్నారు?” తను నవ్వుతూనే అడిగినా చురుక్కుమంది.
” మా నాన్న పడనివ్వలేదు. నా చదువుకి చాలా ఖర్చయింది. నా తర్వాత తమ్ముడు ఉన్నాడు. వాడి చదువు, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి… నా చదువుకి ఖర్చు పెట్టింది తిరిగిచ్చేస్తే నేను కట్నం తీసుకోకపోయినా అడగనన్నాడు. అంత డబ్బు ఎక్కడినుంచి తేను? “
” అందరికీ ఏవో ఒక కారణాలు ఉంటాయిలెండి. తీసుకునే వీలున్నప్పుడు తీసుకోకుండా ఉండేందుకు ఎవరూ చూడరు. తీసుకుని సమర్థించుకోవడానికి కారణాలు వెతుక్కుంటారు. అంతే”
” అలా అందరితోటీ నన్ను కలిపివేయకు. తీసుకున్నాక ఇంక ఆ విషయాన్ని వదిలేస్తారు చాలామంది. తీసుకున్నదానికి కొసరు వేయించుకుంటారు ఇంకొంతమంది. నా వరకు నాకు కట్నం తీసుకున్నందుకు చాలా బాధగా ఉంటుంది. అవమానంగా అనిపిస్తుంది”
” అయినా తీసేసుకున్నారు. అందరూ చేసే పనే మీరూ చేశారు. లోక విరుద్ధంగా చేస్తే బాధపడాలిగానీ లోకసహజమైనదానికి ఎందుకు? పరిణామాలు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి కదా?”
” నీకు తెలీదులే పద్మజా! ఈ ముప్పయ్యైదేళ్లలోనూ నేను ఎంత బాధ పడ్డానో! ఎప్పటికైనా మీ నాన్నకి ఆ డబ్బు తిరిగిచ్చేయాలనుకునేవాడిని. ఎప్పటికప్పుడు ఏవో ఒక ఖర్చులు”
పద్మజ నవ్వింది. ఆ నవ్వులో అదోలాంటి విరుపు.
” ఆరంకెల్లో జీతం తీసుకుంటూ కోటీశ్వరుల జాబితాలో చేరిన మనం అలా అనడం అసంబద్ధంగా ఉండొచ్చుగానీ ఎంత చెట్టుకు అంత గాలి. ఒక పని చేస్తే బాగుంటుందనిపిస్తోంది. పెళ్లప్పుడు మీ నాన్న ఇచ్చిన యాభైవేలకీ మరో యాభైవేలు కలిపి తిరిగి యిచ్చేద్దామనుకుంటున్నాను. ఇదిగో, చెక్కు. కొరియర్లో పంపించి వస్తాను” అన్నాను లేస్తూ.
పద్మజ నా ముఖంలోకి తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఏదో చెప్పబోయి ఆగిపోయింది. తన పెదాలమీది నవ్వు కూడా ఎగిరిపోయింది.
రెండురోజులక్రితం కూడా ఇలాగే ఏదో చెప్పబోయి ఆగిపోయింది. అంతక్రితం ఒకసారి…. దానికి ముందు మరోసారి… నాలుగైదుసార్లు ఇలాగే జరిగింది ఈమధ్య. తనకి నా దగ్గర సంకోచం ఉంటుందని అనుకోను. చెప్పదగ్గదైతే తనే చెప్తుందని ఊరుకున్నాను. ఇప్పుడు అంతే.
నేను తిరిగి వచ్చేసరికి తను మళ్లీ కిచెన్ లో ఉంది. ముఖం భావరహితంగా ఉంది. ఎప్పుడూ పెదాల మీద మెరిసే చిరునవ్వు లేదు. ఆలోచించాను. తనిలా ఉన్న సందర్భాలు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.
పద్మజకి ముగ్గురు చెల్లెళ్లు. మా పెళ్లయిన మూడేళ్ళకి పెద్ద చెల్లెలికి అయింది. ఆ సమయంలో మేము కొంత సాయం చేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది తను.
” ఆడపిల్ల పెళ్లికున్నప్పుడు మీ నాన్న ఏదో ఒక ఏర్పాటు చేసుకోడా? చేసుకోకుండానే పెళ్లి సన్నాహాల్లో ఉంటాడా?” అని నేను కొట్టిపారేసిన సందర్భం ఒకటి.
పద్మజ తల్లి చనిపోయింది. తర్వాత ఆఖరు చెల్లెలు పెళ్లి చేశారు. తండ్రిని మా దగ్గరికి తెచ్చుకుంటే బావుంటుందని పద్మజా అంది.
” మనకేనా బాధ్యత? మీ చెల్లెళ్ళు ముగ్గురికీ ఉండదా?” అని నేనన్న సందర్భం మరొకటి.
ఇలా వరుసగా కొన్ని గుర్తొచ్చాయి నాకు. మరిప్పుడు? నలుగురు ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసి అన్ని విధాలా చితికిపోయి వృద్ధాశ్రమంలో ఉంటున్న ఆయనకి డబ్బు పంపిస్తే కూడా ఎందుకలా ఉండటం? అడగడానికి అహం అడ్డు వచ్చింది.
….
అనూహ్యంగా నేను పంపించిన చెక్కు తిరిగి వచ్చింది. మొదట డెలివరీ కాక తిరిగి వచ్చిందేమోననుకున్నాను. కానీ పద్మజ తండ్రి దస్తూరీలో ఉన్న వేరే కవర్లో వచ్చింది. దాంతోపాటే చిన్న ఉత్తరం.
క్షేమ సమాచారాలు, ఆశీస్సులు షరా మామూలే. వాటితోపాటు –
రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకుని, నాకెందుకయ్యా లక్ష రూపాయలు? ఈ పెద్ద వయస్సులో మనశ్శాంతి లేకుండా చెయ్యడానికి కాకపోతే? నువ్విచ్చిన దాన్ని తిప్పి పంపిస్తున్నాననుకోకు. పద్మజకి కానుకగా ఇస్తున్నానని తీసుకో-
అని ఉంది.
ఉన్న డబ్బులతో పెద్దకూతురికీ, అప్పుల్తో రెండో కూతురికీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో మూడో కూతురికీ చేసి, క్యాన్సర్తో తీసుకున్న భార్య కోసం ఇంటి మీద అప్పు చేసి ఆవిడని సాగనంపి, ఇల్లు అమ్మి నాలుగో కూతుర్ని అంపకం పెట్టి, దిక్కూ మొక్కూ లేకుండా పెన్షన్ డబ్బులతో వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్న ఆ ముసలాయన చేసిన పని నాకు చాచి పెట్టి చెంప దెబ్బ కొట్టినట్లయింది.
అతడివల్ల పద్మజకి విచారం, దుఃఖం… నాతో ఉన్నప్పుడు ముభావం, ఉదాసీనతాను.
నేను పదివేలు ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకున్న లెక్కల మాస్టారు గుర్తొచ్చారు. ఆయనకలా ఇచ్చినప్పుడు గురువు రుణంనుంచి విముక్తుడిని అయిన ఆనందం కలిగింది నాకు. ఈ డబ్బు ఇచ్చేసి కనీసం ఇలాగేనా రుణ విముక్తుణ్ని అవ్వాలనో, ఇప్పటికైనా కట్నం తీసుకోని ఆదర్శవాదుల జాబితాలోకి చేరాలనో అనుకున్న నాకు తీవ్రమైన ఆశాభంగం కలిగింది.
” పద్మజా!” కొంచెం గట్టిగానే పిలిచాననుకుంటా.
” ఏమిటి?” విసురుగా వచ్చింది జవాబు.
” ఓమాటిలా రా!” ధాటిగా పిలిచాను.
వచ్చింది.
” మీ నాన్న చెక్కు తిప్పి పంపించాడు. నీకు కానుకగానట. ఉంచుకో” కొంచెం వెటకారంగా అని చెక్కు తీసి ఇచ్చాను. వద్దంటుందనుకున్నాను. కానీ అందుకుంది.
“నిజంగానేనా?” అడిగింది.
కొంచెం ఆశ్చర్యంగా చూసి తలూపాను.
“ డబ్బు తెచ్చుకోనా” మళ్లీ అడిగింది.
“ఏం చేసుకుంటావు? రవ్వల నెక్లెస్ కొంటావా?” పరిహాసంగా అడిగాను.
” చెప్తాను” అంటూ బెడ్రూమ్ లోకి వెళ్లి సూట్ కేస్ తో తిరిగొచ్చింది. అంతసేపూ నేను సస్పెన్స్ తో సర్కస్ చేశాను. తను గదిలోంచీ రాగానే అది విడిపోతుందనుకుంటే చేతిలో ఇప్పుడు ఈ సూట్ కేస్.
” మా నాన్న నిజమే చెప్పాడు.డబ్బయ్యెనిమిదేళ్ళ వయసులో ఆయనకి కావలసినది డబ్బు కాదు. ఆదరణ. ఆప్యాయత. అందరం వదిలేస్తే ఆశ్రమంలో ఉంటున్న ఆయన దగ్గర డబ్బు చేరితే అది అల్లుళ్ళ మధ్య కలహాలకి కారణం కావచ్చు. అందుకే ఇల్లు అమ్మాక అప్పులు ఖర్చులు పోను మిగిలిన దాన్ని కూడా ఎవరిది వాళ్లకి పంచి ఇచ్చేసాడు”
” అయితే?!”
” అల్లుడిగా ఆయన పట్ల మీకు ఎలాంటి బాధ్యత లేదేమోగానీ కూతురిగా నాకు ఉంటుందనే ఎప్పుడూ అనుకుంటూ వచ్చాను”
” బాధ్యత లేకపోతేనే ఈ వయసులో ఉపయోగపడాలని అంత డబ్బు పంపించానా?”
” అది బాధ్యత కాదు. కట్నం తీసుకున్నానన్న వ్యధో, ఆ డబ్బుతో పైకి వచ్చాననే కించపాటో… దానినుంచి బయటపడి ఆయనకన్నా మీరో మెట్టు పైకి చేరటానికి ఇచ్చారు. బాధ్యతతో ఇవ్వడం వేరేలా ఉంటుంది” తన గొంతు పదునుగా ఉంది.
” అదెలా ఉంటుందో తమరే సెలవివ్వండి” వళ్ళు మండిపోతుంటే వెటకారంగా అన్నాను.
” అసలది ఎవరి డబ్బు? ఎవరికి ఇచ్చారు?”
” అంటే?”
” ఆడపిల్లకి పెళ్లప్పుడు తండ్రి ఇచ్చేది స్త్రీ ధనం. అభిమానం, పౌరుషంగల మగవాళ్ళు ఎవరూ దాన్ని వాడుకోరు. వాడుకున్నా వృద్ధి చేస్తారు. అది ఎప్పటికీ ఆమెదే. అలాంటి డబ్బుకి కట్నం అనే పేరు పెట్టి అప్పున్నట్టు తీసుకుని వాడుకుంటున్నారు మగవాళ్లు. ఆ డబ్బుతో పునాది వేసుకుని ఎదిగి ఇన్నేళ్లు ఆ ప్రగతిని అనుభవించి ఈ రోజున ఒక లక్ష రూపాయలు వడ్డీతో కలిపి పారేస్తే రుణ విముక్తులవ్వరు ఎవరూ. అలా తీరిపోయే రుణాలే అయితే ఈ ప్రపంచంలో ఎవరికెవరం ఏమీ కాము”
” చెప్పేదేదో సరిగ్గా ఏడువు” విసురుగా అరిచాను.
” నాకు నచ్చినది ఏ ఒక్కటీ చెయ్యడానికి స్వతంత్రం లేని ఈ ఇంట్లోగానీ, మీకేవి సంతోషం కలిగిస్తాయో, గర్వాన్నిస్తాయో అవే తప్ప నాకు కావలసినవి, నేను కోరుకున్నవి ఎప్పుడూ ఇవ్వాలనుకోని మీలోగానీ నాకెలాంటి ఆకర్షణా లేదు… ముఖ్యంగా ఇప్పుడు.”
” అంటే?” నా గొంతు నాకే వికృతంగా వినిపించింది.
” నా తండ్రికి ఎంతోకొంత సాయం చేయాలనే తపన నాలో ఉండేది. బ్యాంకు లాకర్లో నిరర్థకంగా పడి ఏడుస్తున్న పాతిక తులాల బంగారంలోంచి ఒక్క గొలుసు, జత గాజులు పెద్ద చెల్లి పెళ్ళికి పెట్టి ఉంటే మా అమ్మ ఒంటి మీది నానుతాడు కదిలేది కాదు. గిల్టు గొలుసుతో ఆవిడ, కళ్ళలో నీళ్ళు దాచుకుని అదీ ఉంటే ఇంత బంగారం దిగేసుకుని వాళ్ల మధ్యని ఎలా తిరగ్గలననుకున్నారు? అమ్మకి క్యాన్సర్ వస్తే చూసేవాళ్ళు లేక చిన్నదాని పెళ్లి వాయిదా వేశారు. ఆవిడ పోయాక ముప్పయ్యైదేళ్లు వచ్చాక దాని పెళ్లయింది. అంతకన్నా ముందు మన పెద్దదాని పెళ్లి చేశారు మీరు. ఆ రోజుల్లో నేనెంత క్షోభపడ్డానో తెలుసా మీకు? మీరు ఎప్పుడు పట్టించుకోలేదు” నిలదీస్తున్నట్టు అంది.
నిజమే! అక్కడ ఆఖరి మరదలు పెళ్లి కాకుండా ఉంటే ఇక్కడ నా కూతురు పెళ్లి చేసేసాను. అందులో నాకు తప్పుగానీ అనౌచిత్యంగానీ కనిపించలేదు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా. ” ఎవరి ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది” విసుగ్గా జవాబిచ్చాను.
” అలా ఊరుకుని ఎవరి కర్మకు వాళ్లని వదిలేస్తే సరిపోయేది. ఈ పరిస్థితుల్లో మా నాన్న కి ఏం కావాలో మీకు తెలుసు. తెలిసీ దాన్ని గుర్తించడానికి మీ అహం ఒప్పలేదు. పెళ్లయ్యాక ఆడపిల్లకి పుట్టింటితో సంబంధం తెగిపోతుందనేది కాలం చెల్లిన మాట. అదేనా ఆర్థికసూత్రాలకి సంబంధించిందేమోగానీ అంతరంగాలకీ అనుబంధాలకీ సంబంధించినది కాదు.
మీరు చేసిన పనితో ఎంతోకాలంగా సంఘర్షించి, అలిసిపోయి, ఓటమిని అంగీకరించిన నా అంతరాత్మని నిద్ర లేపారు. నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను. ఆయన వయసుకి ఒక అటెండెంట్ ఉండచ్చట. ఆయన ఖర్చులకి పెన్షన్ ఉంది. ఇది కొన్నాళ్లు నాకు సరిపోతుంది. తర్వాత ఆలోచిస్తాను” అంది.
నేను నిశ్చేష్టుడినైపోయాను.
లెక్కల మాస్టారికి పదివేలు ఇవ్వటానికీ, పిల్లనిచ్చి నన్ను సంసారీకుణ్ణి చేసిన మామగారికి లక్ష ఇచ్చి రుణం తీర్చుకోవాలనుకోవడానికీ గల తేడా అస్పష్టంగా అర్థం అవుతుంటే…
నన్ను ఆ అయోమయంలో అలాగే వదిలేసి వెళ్ళిపోయింది పద్మజ. ఆమె వెళ్ళాక అర్థమైంది… అంచనాలు అప్పుడప్పుడు తప్పుతూ ఉంటాయని.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.
చాలామంది మధ్య తరగతి, అప్పటి తరం స్త్రీ భావాలను చక్కగా చెప్పారు 👏👏👏👏