“పిల్లలు నీ దగ్గరే పెరిగితే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నాలా మరో స్త్రీ బాధపడకూడదు. అంతేకాదు, తక్షణం నువ్వీ జీవితాన్ని మర్చిపోయి ఎక్కడికైనా వెళ్లి కొత్తగా మొదలుపెట్టు” ఒక్క క్షణం ఆగి “నువ్విక్కడే వుంటే ఏం జరుగుతుందో చెప్తాను. ఇకమీదట రాజ్ దగ్గిర్నుంచీ చిల్లిపైసా రాదు. నువ్వెవరివో తెలుసుకాబట్టి ఎవరూ ఉద్యోగం యివ్వరు. ఆకలి నీ ప్రేమనీ, నీలో యిప్పటిదాకా రాజ్ కాపాడుతూ వచ్చిన నైతికతనీ చంపేస్తుంది” ఆమె చెప్తుంటే నేను తెల్లబోయాను.
“మా నాన్న వుంచుకున్నామె ఆయనకి పక్షవాతం వచ్చి మంచానపడగానే మరొకడితో తిరగడం మొదలు పెట్టింది. మా నాన్న రాసిచ్చిన యింట్లోనే వ్యాపారం మొదలుపెట్టింది….”
అలాంటి మాటలు వూహించలేదేమో స్థాణువయ్యాను.
“ప్రమీలా!” రాజ్‌మోహన్ గట్టిగా అరిచాడు. “వసంతనేమీ అనకు. తను వెళ్లిపోతుంది. నువ్వు కోరుకున్నట్టే” అన్నాడు. కోపంతో మనిషి నిలువెల్లా వూగిపోతున్నాడు. అతనికేదైనా జరుగుతుందేమోనని ఆ క్షణాన్న కూడా నేను భయపడ్డాను.
“ఐతే వెళ్లమనండి. ఎందుకీ వాదన?” ప్రమీలాదేవి తగ్గకుండా అంది.
రాజ్ టేబుల్ డ్రాలోంచీ చెక్కుబుక్కు తీసాడు. గబగబ సంతకంచేసి నావైపు వస్తుంటే ఆమె అందుకుని సంఖ్య వేసింది. లక్ష! నా విలువ… నా ప్రేమ విలువ లక్ష. నేను కోల్పోయిన విలువల ఖరీదు, మిగిలివున్న నా భవిష్యత్తు ఖరీదు లక్ష! కేవలం లక్ష.
“ఇదేనా ఎందుకో తెలుసా?” ఆమె గొంతులో కసి, హేళన!
“వసంతా! నేనేదైనా చెయ్యగలగటం నా చేతుల్లో లేదు. పిల్లలకి ఎలాంటి హానీ జరగదు. వాళ్లు నాకూ పిల్లలే. ఈ డబ్బు తీసుకుని దగ్గర వుంచుకుని ఏదో ఒక జాబ్ చూసుకో. లేకపోతే నీ పేరెంట్స్ దగ్గరకి వెళ్ళు” అన్నాడు రాజ్ నాతో. అతను నన్నేవిధంగానూ సమర్ధించడంలేదు. నాతో బంధాన్ని తెంచేసుకుని, భార్యతో జత కలిసి నన్ను వెళ్లగొడ్తున్నాడు. లక్ష్మణరేఖ అవతల మొదలైన నా జీవితం ఇలాంటి మలుపు తిరుగుతుందని ఎంతమాత్రం వూహించకపోవడంతో వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి కొంత వ్యవధి పట్టింది. నిశ్శబ్దంగా లేచి నిల్చున్నాను.
“చెక్కు తీసుకో” ఆజ్ఞాపించినట్టే అన్నాడు.
“వద్దు”
“మొండితనం వదిలిపెట్టి ముందు దాన్ని తీసుకో” అతను విసుగ్గా అన్నాడు.
“నిన్నిలా యింటికి పిలిపించి నీతో యివన్నీ చర్చించాల్సిన అవసరం నాకు లేదు. అతనికోసం చేసాను. నీకు అతని క్షేమమే కావాలనుకుంటే చెప్పినట్టు చెయ్యి” కటువుగా అంది ప్రమీలాదేవి. నాకు వళ్లు మండిపోయింది. ఏమిటీ అహంభావం? నామీద యీమెకున్న హక్కేమిటి? అసలు నేనెందుకు వినాలివన్నీ? ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రమీలాదేవి లోపలికెళ్లిపోయింది. నేను కూడా వెళ్లాలని లేచాను.
“వసూ!” రాజ్ అన్నాడు.
“అయ్యాయా? ఇంకా ఏమైనా మిగిలాయా?” విసురుగా అడిగాను. అతను ఆపరాధిలా అన్నాడు.
“నీతో కేవలం ఆ ఒక్క విషయమే మాట్లాడతానంది. ఇలా మండిపడుతుందనుకో లేదు. అసలిలాంటిదేదో జరుగుతుందనే ఎంతగా చూడాలనిపించినా నిన్ను పిలిపించలేదు. నేనే తగ్గాక నీ దగ్గరికి రావచ్చునుకున్నాను” రాజ్ గొంతు నాలో ఎలాంటి స్పందనా కలిగించలేదు. యాంత్రికంగా అతను చెప్పేది విన్నాను. అతను తన నిస్సహాయతని… ప్రత్యేకించి నా విషయంలో ప్రకటించుకున్నాడు.
“పిల్లలకి నా దగ్గర ఎలాంటి లోటూ జరగదు. నువ్వే జాగ్రత్తగా వుండు. నువ్విక్కడే వుండి అవమానాలు పొందటం భరించలేను. ఇంకా నాకు పూర్తి స్వస్థత రాలేదు. ఏ క్షణాన్నేనా ఆరిపోయే దీపాన్ని. నాకేదైనా అయితే నువ్వింకా అన్యాయమౌతావు. కొద్దిరోజులు…. అంతా సర్దుకునేదాకా దూరంగా వెళ్లివుండు” అతని గొంతు బొంగురుపోయింది.
నేను నిరాసక్తంగా అతనికేసి చూసాను. అతనికింకా నామీద ప్రేమ మిగిలినందుకు సంతోషపడాలో, ఆ ప్రేమని నన్ను వాళ్ల మధ్యనుంచీ తప్పించడానికి ఉపయోగించుకుంటున్నందుకు బాధపడాలో తెలీలేదు. నిజంగా అతనికలాంటి ప్రేమే మిగిలివుంటే ఆమె నన్నలా అంటూ వుంటే నన్ను తీసుకుని బైటికొచ్చేవాడు. అతన్ని కంటికి రెప్పలా నేను చూసుకోలేనా? నాకసలు డబ్బులేని పరిస్థితి ఎందుకొచ్చింది? ఇతనివలన కాదూ? ప్రతి కుటుంబానికి ఆర్థికప్రతిపత్తి వుండాలని యితనికి తెలీదా? కూలివాళ్ళ దగ్గర్నుంచి మద్యతరగతిదాకా. మధ్యతరగతినుంచీ ధనికవర్గంవరకూ ప్రతి మగవాడూ తన కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాడు. తనకేమైనా ఐతే తనవాళ్లు అన్యాయం కాకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఈ వ్యక్తి నేను ప్రేమ అన్నానని ప్రేమని మాత్రమే పంచిచ్చాడు. ఆస్తులు సంపాదించమని ప్రమీలాదేవి కూడా అడిగివుండదు. ఆమేకాదు, ఏ స్త్రీ కూడా అలా అడగదు. అదొక బాధ్యతగా తనే సంపాదిస్తాడు. అన్ని సమకూర్చుతాడు. ఇతనికలాంటి బాధ్యత నా గురించి అనిపించలేదు. ఆమె గురించి అనిపించింది. అదే మా యిద్దరి మధ్యగల తేడా.
నాకిప్పుడు ప్రమీలాదేవిమీద వున్న కోపం కరిగిపోయింది. నమ్మించి మోసం చేసిన రాజ్ మీద కూడా కోపం లేదు. అంత తెలివితక్కువగా నమ్మిన నామీదే నాకు కోపం వచ్చింది. అసహ్యం వేసింది.
నేనేం చెయ్యాలో నాకే అర్ధమవని పరిస్థితి. ప్రమీలాదేవి నా పిల్లల్ని ఎంతకాలం చూస్తుంది? రాజ్‌కే అవసరం లేని బాధ్యతని అనిపించాకకూడా చూస్తుందా? ఒకవేళ అతనికేదైనా ఐతే? అప్పుడు కూడా చూస్తూందా? నేను బ్రతికి వుండాల్సిన అవసరం స్పష్టంగా కనిపించింది. నిశ్శబ్దంగా లేచి నిల్చున్నాను. చెక్కుకూడా తీసుకున్నాను. ప్రమీలాదేవి అన్న నిజాలు శిలాక్షరాల్లా నా మనసుమీద నిలిచిపోయాయి.
రాజ్ మరోదారి చూపించాడు. కారు కూడా వేరేది. డ్రైవరూ మారాడు, నేనిక్కడికి రావడం చూసినవాళ్లకి నేనెప్పుడు వెళ్లానో ఇక్కడేం జరిగిందో తెలీకుండా జాగ్రత్తపడుతున్నారన్నమాట! పైగా రాజ్‌ని చూడటానికి నన్ను పిలిపించిందనే విషయం అందరికీ తెలిసింది. ఆమె వుదాత్తతని అందరూ మెచ్చుకుంటారు.
అంత బాధలోనూ నవ్వొచ్చింది.
కారు కదిలింది. వచ్చేటప్పుడేదో జరుగుతుందన్న ఆరాటం వుంది. రాజ్‌ని చూడబోతున్న ఆశ…. అతనెలా వున్నాడోనన్న ఆతృత… అన్నిటికన్నా ముఖ్యంగా అతను నావాడేనన్న నమ్మకం వుండేవి. ఇప్పుడు మాత్రం జరగడానికి ఇంకేవీ లేవన్న నిరాసక్తత నా నిలువునా నిండిపోయింది. ఇప్పుడేం చెయ్యను? వాళ్లు చెప్పినట్లు వాళ్లకి పిల్లల్ని వదిలేసి వెళ్లిపోనా? ఇక్కడే వుండిపోయి పోరాడనా? వాళ్లనీ నాతో తీసికెళ్లనా? ఆమె అన్నట్టు రాత్రికి రాత్రే… వాళ్లు నా దగ్గర సరిగ్గా పెరగరా? ఎంతమంది సింగిల్ పేరెంట్ పిల్లలు లేరలా? వాళ్లంతా చెడిపోయారా? ఎంత కౄరంగా కక్ష తీర్చుకోవాలని చూస్తోంది ప్రమీలాదేవి? రాజ్ మనసులో కూడా విషం నింపింది! లేకపోతే తన పిల్లల్ని తనే అక్రమసంతానమని ఎలా అనుకోగలడు అతను? దెబ్బ తగుల్తున్నప్పుడు నొప్పి తెలీదు. తగిలాక తెలుస్తుంది. అలాంటి నొప్పి నా గుండెల్ని వడిపెడ్తోంది. ఆలోచనలకి తల నరాలు చిట్లిపోతాయన్న భావన!
“స్కూలుకి వెళ్లాం” డ్రైవరుకి చెప్పాను.
“పాపలకోసమా అమ్మా?” అడిగాడు.
తలూపి, “”ఉంటావా, వెళ్లిపోతావా?” అడిగాను. అతను వుంటానని జవాబిచ్చాడు.. కారు దిగి ప్రిన్సిపాల్ గదికి వెళ్లాను.
అక్కడ మరో టీచరు కూడా వుంది. “పిల్లలకోసమా మేడమ్? ఇందాకే రాజ్మోహన్గారు పిలిపించుకున్నారు. మీరొస్తే చెప్పమన్నారు”” అడక్కముందే చెప్పింది ప్రిన్సిపాల్. స్థాణువయ్యాను. కాళ్లక్రింది నేల కదుల్తున్న ఫీలింగ్! వాళ్లిద్దరూ నాకేసి కుతూహలంగా చూస్తున్నారు.
రాజ్‌మోహన్ పిల్లల్ని పిలిపించుకోవడం సాధారణమైన విషయమేగానీ అది నాకు తెలీకపోవడం పెద్ద సంచలనం. మా యిద్దరిమధ్యా కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందన్న విషయం అక్కడ సుస్పష్టమైపోయింది. నిశ్శబ్దంగా వెనక్కి తిరిగాను.
నా వెనుక ప్రిన్సిపాల్ ఏదో అనటం, ఆ టీచర్ నవ్వటం వినిపించాయి. ఎందుకేనా కావచ్చు…. ఆ సందర్భాన నన్ను గురించే అనిపించింది. నాగురించి అందరికీ తెలుసు. ఇల్లు దాటి ఎక్కడికీ వెళ్లనూ, రాజ్ చుట్టే నా ప్రపంచాన్ని నిర్మించుకున్నానూ కాబట్టి నాకే ప్రపంచాన్ని గురించి తెలీదు.
డ్రైవరు డోర్ తెరిచి పట్టుకున్నాడు. రాజ్‌కి నాపట్ల యింకా కొంచెం కన్సర్న్ మిగిలుందని గుర్తించాను. అందుకే తిరిగొచ్చేటప్పుడు అతన్ని పంపించాడు. ఇతడికి నాపట్ల అభిమానం, గౌరవం వున్నాయి. నా మానసిక పరిస్థితిని గ్రహించి ప్రవర్తిస్తున్నాడు. కార్లో కూర్చున్నాక యింక నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. చేతుల్లో ముఖం కప్పుకున్నాను. డ్రైవరు విండో గ్లాసెస్ దించేసాడు. కారు నెమ్మదిగా కదుల్తోంది. అతను సంకోచాన్ని వదిలిపెట్టాడు.
“పెద్దింటి యవ్వారాలన్నీ యిలాగే వుంటాయమ్మా! ఏడవకండి. మీరు నోరు లేనోరు, లోకం తెలీనోరు కావటాన అన్యాయవుతున్నారు. ఐనా, రాజ్మోహన్బాబుకి నయమౌతే మిమ్ములను మంచిగనే చూసుకుంటారు. ప్రమీలమ్మ కొంచెం కోపదారి మనిషి. ఆయమ్మకి అన్నదమ్ముల బలం బాగా వుందమ్మా. ఆళ్ళతో రాజ్మోహన్బాబే నెగ్గలేరు” అన్నాడు అనునయిస్తున్నట్టు. అతనికేం తెలుసో, ఎంతవరకూ తెలుసో నాకైతే తెలీదుగానీ ఆ అనునయం నన్ను మరికాస్త కదిలించింది.
“ఎందరికి లేరమ్మా యిద్దరేసి? చేతినిండా డబ్బున్నాక ఏ మొగోడమ్మా మడికట్టుకునేది?”
నాకా సంభాషణ యిబ్బందిని కలిగించింది. గాడి తప్పుతున్నట్టు అనిపించింది. నన్ను నేను కంట్రోల్ చేసుకుని కూర్చున్నాను. ఇంటి ముందు ఆగాము.
“ఒక్కమాట చెప్పనామ్మా, మీరేమనుకోకపోతే?” ఆగాడు సంకోచంతో. ఇబ్బందిగానే తలూపాను.
“మీవాళ్లెవరూ లేరామ్మా? రాజ్మోహన్బాబుకి తక్కువైందాకా కొన్నాళ్లు వెళ్లి వుండండి. ఎన్ని కోపాలున్నా యిలాంటప్పుడు పుట్టింటోళ్లు అయ్యన్నీ మనసులో వుంచుకోరు. ఈ వూళ్లోనే వుంటే ప్రమీలమ్మ అన్నదమ్ముల్తో మీరు నెగ్గలేదు. ఆళ్లు కాసుకుని వున్నారు. మీమీద చానా కోపముంది. ప్రమీలమ్మ మీ యిషయంలో చెడ్డదేగానీ పిల్లలకి సెడుపు చెయ్యదు” అన్నాడు. అంటే అన్ని విషయాలూ బహిర్గతంగానే వున్నాయన్నమాట. దీని వెనుక స్ట్రాటజీ ఏమిటో నాకు అంతు చిక్కలేదు. నిర్వేదంగా నవ్వుకున్నాను.
కారు దిగి ఇంట్లోకెళ్లాను. శూన్యంలోకి అడుగుపెట్టినట్టనిపించింది. ఇక్కడినుంచి వెళ్లాలి. కానీ ఎక్కడికి? వందకోట్ల జనాభా వున్న యీ దేశంలో బస్సులనీ రైళ్లనీ తగలబెట్టినవాళ్లకీ, మనుషుల్ని చంపే మానవబాంబుల్ని తయారుచేసినవాళ్లకీ, వురిశిక్షపడ్డవాళ్లకీ కూడా క్షమాభిక్ష దొరుకుతుంది. పెద్దపెద్ద దోపిడీలూ దొంగతనాలు చేసినవాళ్లూ, లంచగొండితనంతో ఒకరి అవకాశాలని మరొకరికి దానం చేసేవాళ్లూ దర్జాగా తిరుగుతున్నారు. ప్రపంచమంతా వాళ్లదే. కానీ ప్రేమని వెతుక్కుంటూ వెనక్కి తిరిగి వెళ్లలేనంత దూరం వచ్చేసిన నాకు మాత్రం శిక్ష. ఏ ఒక్క చెయ్యీ నా కన్నీళ్లు తుడవటానికి ముందుకి రాదు. నాకు నేనే తుడుచుకోవాలి. నన్ను నేనే ఓదార్చుకోవాలి.
క్రమంగా నాలో విచక్షణ మేల్కొంది. ఆరోజుని రాజ్కోసం వచ్చినప్పుడూ నేను వంటరిదాన్నే. ఇప్పుడు విడిపోతున్నప్పుడూ అంతే. నాది వంటరిపోరాటమే.
ప్రమీలాదేవి యిచ్చిన చెక్కు నా చేతిలో అలాగే వుందింకా. అప్పటిదాకా నేను ఏ విలువా యివ్వని ఆ కాగితం ముక్కే యిప్పుడు నాకు ప్రాణాధారం. మనిషి ప్రాధమిక అవసరం డబ్బు. నేను పతనమవ్వకుండా బతకాలంటే మొదట కావల్సిందీ డబ్బే. తల బలంగా విదిల్చాను. ఆ చెక్కు వాడుకోవాలంటే ఒళ్లంతా వెలపరం లాంటిది కలిగింది. కానీ తప్పదు. అర్ధంలేని ఆత్మాభిమానంకన్నా అహాన్ని చంపుకోవడం వుత్తమం.
నా గమ్యం ఏదిగా వుండాలో క్రమంగా రూపుదిద్దుకోసాగింది. దుఃఖంతోటీ అవమానంతోటీ వూగిపోతున్న నా మనసుకి దృఢత్వం వచ్చింది.

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.