ఈ సమాజంలో అధికభాగం మధ్యతరగతివాళ్లు. ఏ వ్యాపారసంస్థేనా వాళ్లనికూడా దృష్టిలో వుంచుకుంటుంది. ఉత్పత్తులు తయారుచేస్తుంది. సమాజంలోని ఏ మార్పైనా మధ్యతరగతి నుంచే రావాలి. వాళ్లు తిరస్కరిస్తే అంతే సంగతులు. ఎలక్ట్రానిక్ యుగంలో బైటపడిన పెద్ద ఆవిష్కరణ ఇది. అంతకుముందు నాణ్యత, వైవిధ్యం, ధర ఇలా ఎన్నిటిదగ్గరో రాజీపడాల్సివచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి చాలావరకూ మారింది.
నా కన్సల్టెన్సీకి ఉద్యోగస్థులనుంచీ క్రమంగా స్పందన పెరుగుతోంది. వాళ్ల అవసరాలకి నా పరిధే చిన్నగా వుంది. నేను ఆ అవసరాలతో వ్యాపారం చేసిందీ తక్కువేగానీ వాటివలన బాగా ప్రచారం వచ్చింది. ఎవరికి ఏ అవసరం వచ్చినా అది నానుంచి ఔతుందా లేదా అని చూడకుండా ఓమాటు ఫోన్ చేస్తున్నారు.
ఒక బ్రేక్ కావాలి. దానికోసం చూస్తున్నాను..
ఒకటిరెండు టీజింగ్ కాల్స్, మైకేల్తోటీ, ప్రభాకర్తోటీ పెరుగుతున్న అనుబంధం… రుక్మిణమ్మగారితో బలపడుతున్న బాంధవ్యం… కొద్దికొద్దిగా పైకి లేస్తున్న బిజినెస్ గ్రాఫ్… ఇవన్నీ రోజంతా నన్ను బిజీగా వుంచినా రాత్రిమాత్రం వంటరితనం కోరలు చాచుకుని నన్ను హింసిస్తోంది.
రాజ్ గుండెల్లో తలదాచుకుని పడుకున్నప్పటి రోజులు… అతను రాని రోజుని పిల్లలిద్దరి మధ్యనీ పడుకుని వాళ్ళతో అతని కబుర్లు చెప్పుకుంటూ గడిపిన రోజులు… ఆ నిశ్చింత… రేపటి గురించి ఆలోచించని నిశ్చింత… చెదిరిపోయి, ఆరోజులు కలలా అనిపిస్తున్నాయి. ఎందుకు? అతన్లో ఒక్కసారి అంత కాఠిన్యం చోటుచేసుకుంది? నా వెనుక మూసుకుపోయిన దుర్భేద్యమైన ఆ కోట తలుపుల్ని పగలగొట్టి నా పిల్లల్ని ఎలా తెచ్చుకోను? ఇక్కడ ఈ ఫాల్స్ ఇమేజితో ఎంతకాలం బ్రతకను?
ఆలోచనల్తో తల పగిలిపోతోంది. నిద్ర రావడం లేదు. తలనొప్పికి మాత్ర వేసుకుని టేబుల్లేంపు ముందు కూర్చుని నవల అందుకున్నాను. చదువుతూ కూర్చునే నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారుజామున కొద్దిగా మెలకువ వస్తే శరీరాన్ని మంచంమీదికి చేర్చి మళ్లీ నిద్రలో మునిగిపోయాను.
లేచేసరికి బాగా పొద్దెక్కింది. చేతిలో పుస్తకం అలాగే వుంది. లేంప్ వెలుగుతోంది. దాన్ని ఆర్పేసి, పుస్తకం మూసి మంచం దిగాను. ఎదురుగా అద్దంలో నా ముఖం కనిపిస్తోంది. నాకే భయం కలిగించేంత మార్పు… చూసుకుంటే మనసెలాగో అయింది. వేలికొసల్తో జుత్తు సరిచేసుకుని, బ్రష్షుమీద పేస్టు వేసుకుని పెరట్లోకి వచ్చాను. రుక్మిణమ్మగారు ఎదురొచ్చింది.
“నిన్ను లేపుదామనే వస్తున్నాను. రాత్రి చాలాసేపటిదాకా మేలుకునే వున్నట్టున్నావు. లైటు వెలుగుతూనే వుంది” అంది.
“పుస్తకం చదువుతూ వుండిపోయానాంటీ” అన్నాను.
“అంత రాత్రిదాకా మేలుకోవడం మంచిదికాదమ్మా!” అని ఒక్క క్షణం ఆగి అంది, “నీ గురించి నీకు తెలీడంలేదుగానీ వసంతా, యీ కొద్దిరోజుల్లోనే బాగా చిక్కిపోయావు, నల్లబడ్డావు కూడా. మనసులో ఏదైనావుంటే చెప్పుకోమ్మా! మీ అమ్మగారిలాంటిదాన్ని. బాధని దాస్తే నిప్పులా కాలుస్తుంది”
నేను తడబడ్డాను. ఎంత మంచివాళ్లు వీళ్లు! వీళ్లని మోసం చేస్తున్నానా? మానమైంది నా ముఖం. వెంటనే సర్దుకుని నవ్వేస్తూ “అలాంటిదేం లేదాంటీ! వుంటేగనుక మీకుగాక ఎవరికి చెప్తాను?” అన్నాను.
“అన్నిటికీ ఆ నవ్వే!” అంది తనూ నవ్వి, “”అలా నవ్వుతుంటే పర్వాలేదు. కాఫీ యిస్తాను రా. ఒక్కదానికీ వంటేమిటంటే వినట్లేదు. నువ్వు” అంటూ వాళ్ల వాటావైపు వెళ్లింది. నేను వూపిరి పీల్చుకున్నాను.
బ్రష్ చెయ్యడం ముగించి కాఫీగ్లాసు తెచ్చుకుని రాత్రి మధ్యలో ఆగిపోయిన నవలని చదవడం మొదలుపెట్టాను. ప్రభాకర్ లేడు. చీరల స్టాకు తీసుకురావడానికి ఎవరింటికో వెళ్లాడు. కాఫీ తాగడం అయేసరికి మైకేల్ వచ్చాడు. శుభోదయం చెప్పాడు.
మొదట్లో నా ఒక్కదానికీ ఒక గది చాలనుకున్నాను. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా యింకొకటి అవసరమనిపించింది. వరుసగా వున్న మూడుగదుల్లో మధ్యదికూడా తీసుకుని అది నేనుంచుకుని ముందుగదిని ఆఫీసురూముగా మార్చి టేబులు, నాలుగు కుర్చీలు వేసాను. అలా మార్చాక మైకేల్ ఫ్రీగా రాగలుగుతున్నాడు. లోపల నా పనిలో నేనున్నా ఎంతసేపైనా కూర్చుని కన్సల్టెన్సీ పనులు చూసుకుంటున్నాడు.
“ఈ వేళ నువ్వు ఫ్రీయేనా?” అడిగాడు వచ్చీ రావడంతోనే.
“ఎందుకు?”
“మా యింటికి వెళ్దాం. మా అమ్మావాళ్లని పరిచయం చేస్తాను” అన్నాడు. నాకందులో అభ్యంతరం ఏమీ కనిపించలేదు. అసలే ఆఫ్ మూడ్స్‌లో వున్నందుకు కొంచెం మార్పుగా వుంటుందనిపించింది. వెంటనే తయారయ్యాను. మైకేల్‌తో బైటికి వెళ్తున్నట్టుగా రుక్మిణమ్మగారికి చెప్పి, ఏవేనా ఫోన్ కాల్స్ వస్తే రిసీవ్ చేసుకుని రాసిపెట్టమని కూడా చెప్పాను. ఆవిడ కొంచెం ముభావంగా తలూపింది. నేను గేటు దాటేసరికి అతను బైక్‌తో సిద్ధంగా వున్నాడు. అతని వెనక ఎక్కి కూర్చున్నాను.
నేనిలా వున్నపళంగా రావడంతో అతని ఇంట్లోవాళ్లు కంగారుపడిపోయారు. నన్ను తీసుకొస్తానని ముందుగా చెప్పనట్టుంది. నేను ఖాళీగా వుండటం చూసి అప్పటికప్పుడు అడిగివుంటాడు.
“ముందుగా చెప్పద్దురా?” అని కోప్పడింది మైకేల్ తల్లి. అతన్ని కోప్పడుతూనే “రండమ్మా?” అని సాదరంగా నా చెయ్యి పట్టుకుని లోపలికి తీసికెళ్లింది. మేరీ కూర్చోమని కుర్చీ వేసింది. కుర్చీలో కూర్చుంటూ యిల్లంతా పరీక్షగా చూసాను. ఇప్పుడే వస్తానని మైకేల్ బైటికెళ్లాడు.
మైకేల్ తండ్రిది రైల్వేలో ఉద్యోగం. చాలా చిన్న ఉద్యోగమనుకుంటాను. క్వార్టరు కూడా చిన్నగానే వుంది. రెండే చిన్న గదులు, రెండు వరండాలు, చిన్న వంటిల్లు. మనుషుల సంఖ్య ఎక్కువ కావడంతో సామాన్లతో క్రిక్కిరిసిపోయి వుంది. లేమి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నా గుండెల్లో సన్నటి బాధ. మగవాళ్ల మూర్ఖత్వానికి ఆడవాళ్లెలాగో ఒకలా బలైపోతూనే వున్నారు. దానికొక కచ్చితమైన సారూప్యత వుండదుగానీ బాధ బాధే.
మేరీ, లూసీ నన్ను ఆరాధనగా చూస్తున్నారు.
వాళ్లు ముగ్గురూ నాపట్ల చూపిస్తున్న ఆదరణ, గౌరవం మైకేల్ మనసుకి అద్దం పడుతున్నాయి. వయసులో బాగా చిన్నదాన్నికాబట్టి నన్ను నువ్వనాలో లేక కొడుకు నా దగ్గర చేస్తున్నాడుగాబట్టి మీరని మన్నించాలో ఈ రెండిటికన్నా ముఖ్యంగా ఏమంటే నేనేమనుకుంటానోనని మైకేల్ తల్లి ఇబ్బందిపడుతుంటే గ్రహించి ముందే చెప్పాను. “నన్ను నువ్వనే అనండి. మేరీ లూసీల్లాంటిదాన్నే” అని.
సంతోషపడిపోయింది. ఎంత చిన్న సంతోషాలు మనుషులవి! సాటి మనిషిగా గుర్తిస్తే ఒక సంతోషం. గొడ్డుచాకిరీ చేసినా తినటానికి ఇంత తిండి దొరికితే మరో సంతోషం. ఇలాంటి చిన్న జీవితాలు, చిన్న ఆనందాలు పెనుమార్పులకి గురౌతున్నాయి. ఇంకెవరికో పెద్ద ఆనందాలు తెచ్చిపెట్టడానికి. ప్రపంచీకరణ తర్వాత ఇలాంటి చిన్న సంతోషాలు కనుమరుగవ్వడం తెలుస్తోంది. అవసరాల మౌలికరూపం మారలేదు.
“నీదగ్గర చేరకముందు వాడు ఏవేవో దందాలు చేసేవాడు. దాదాగిరి చేసేవాడు. అలాంటి బతుకు మనకొద్దని ఎన్నోసార్లు చెప్పాలనుకునేదాన్ని. కానీ ఎలా? అవన్నీ మానుకుంటే డబ్బెలా వస్తుంది? డబ్బు లేకపోతే యిల్లెలా జరుగుతుంది? ఆడపిల్లల పరువుమర్యాదలు ఎలా నిలుస్తాయి? గుండె రాయి చేసుకున్నాను. ఒక కొడుకుని వదులుకుంటే మిగిలిన ముగ్గురు పిల్లలూ దక్కుతారనుకున్నాను” అందావిడ నా చేతులు పట్టుకుని కళ్ళనీళ్ళపర్యంతమౌతూ.
ఇంతలో చేతినిండా పేకెట్స్తో మైకేల్ వచ్చాడు. ఆవిడ చప్పుని కళ్లు తుడుచుకుని అతనికి ఎదురెళ్లింది. అతను తెచ్చినవాటిని ప్లేటునిండా సర్ది తెచ్చి ఇస్తుంటే “”ఇవన్నీ ఏమిటి?””మందలింపుగా అడిగానతన్ని.
“పెద్దగా ఏమున్నాయి? తినమ్మా! ముందుగా చెప్పివుంటే యింట్లోనే ఏదో ఒకటి తయారుచేసేదాన్ని. అన్నీ బజారువే తెప్పించాను” అంది మైకేల్ తల్లి.
“ఈ మర్యాదలేమిటి మైకేల్? నాకు చాలా యిబ్బందిగా వుంది. ఇలా చేస్తే నన్ను వేరుగా చూపిస్తున్నట్టనిపిస్తోంది. మీఇంట్లో కలవలేను. అందరం ఒక పడవలోనే ప్రయాణం చేస్తున్నాం. నేను కొంచెం స్వతంత్రించాను కాబట్టి కన్సల్టెన్సీ తెరవగలిగాను”” అన్నాను.
“ఇందులో నా స్వార్థం కూడా వుంది వసంతా! లూసీ, మేరీలు నిన్ను చూసి నీలా తయారవ్వాలని నా ఆకాంక్ష. నీలాంటి ఆడపిల్లలు మా సర్కిల్లో వుండరు వాళ్ళకి పరిచయం చెయ్యాలన్నా, చూపించి నేర్చుకోమనాలన్నా” అన్నాడతను.
“నాలో నువ్వేం చూసావు?” నా గొంతు మూగపోయింది.
“నువ్వు రావటం మొదటిసారికదా, యీపాటి చెయ్యకపోతే అమ్మ బాధపడ్తుంది. మాతో భోజనం చేసి సాయంత్రందాకా వుండి వెళ్తువుగాని. ప్రభాకర్‌ని కూడా రమ్మంటాను”” అన్నాడు.
అతను తెచ్చినవాటిని అందరం పంచుకుని తిన్నాము. మేరీ పక్కవాళ్లని అడిగి క్యారంబోర్డు తెచ్చింది. ఆడుతూ కూర్చున్నాం. ఈలోగా మైకేల్ ఇంట్లోకీ బైటికీ తిరుగుతూనే వున్నాడు. అతనికి అస్సలు నిలకడలేదనే విషయం గుర్తించాను. ప్రభాకర్ యింకా రాలేదట. ముఖ్యమైన మెసేజీలు కూడా ఏవీ లేవని రుక్మిణమ్మగారు చెప్పిందట.
మైకేల్ లేకుండానే మా భోజనాలు మొదలయ్యాయి. తింటుంటే అతనొచ్చి కలిసాడు. లేమితో వున్నా ఆ ఇల్లు మనుషుల్లో నిండివుంది. మనుషులన్నాక అనివార్యంగా వుండే ప్రేమలూ అభిమానాలూ వుంటాయి. మొదటిసారి చాలాకాలం తర్వాత… మా యిల్లు గుర్తొచ్చింది. మైకేల్ తమ్ముడు అల్లరిచిల్లరిగా తిరుగుతాడని తెలుసు. నేనున్న అంతసేపట్లో అతనొక్కసారి కూడా రాలేదు. అలా రాని మరో వ్యక్తి మైకేల్ తండ్రి. ఒకరు రాకపోవడం మైకేల్‌కి బాధనీ మరొకరు రాకపోవడం అతనికి సంతోషాన్నీ కలిగించి వుంటుంది.
సాయంత్రం ప్రభాకర్ వచ్చాడు. ఎవరో ఫ్రెండ్స్ కలిస్తే వాళ్లతో వుండిపోయాడట. అతనితో కలిసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను.
డాక్టర్ రావ్గారి కూతురి పెళ్లి నా కన్సల్టెన్సీకి ఒక బ్రేక్‌నిచ్చింది. ఆయన మనుషులకోసం నా దగ్గిరకొచ్చాడు. ఊళ్లోకెల్లా పేరున్న సర్జన్. ఆయన భార్య మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్. వాళ్లకి ఒక్క కూతురు. ఆమె కూడా డాక్టరే. ఆమెకి కెనడాలో వుండే వ్యాపారస్తుడితో సంబంధం స్థిరపడింది. ముహూర్తానికి వ్యవధి లేదు. నిశ్చితార్థం తర్వాత వారానికే పెళ్లి. “
“నీ కన్సల్టెన్సీ గురించి ఎవరో చెప్పారమ్మాయ్. నాకు మెరికల్లాంటి పదిమంది కుర్రాళ్లని యివ్వు” అన్నాడాయన వెతుక్కుంటూ తనే స్వయంగా ఆఫీసుకొచ్చి. “”హైద్రాబాద్‌లాంటి సిటీస్లోనైతే మ్యారేజి కాంట్రాక్టర్సని వుంటారు. వాళ్లే ఏర్పాట్లన్నీ చేస్తారు. మనం వెళ్లి తతంగం కానియ్యడమే. అక్కడికీ హైదరాబాద్నుంచీ వాళ్లని తెప్పిద్దామని చూసాను. పెళ్లిళ్ల సీజన్ కదా. ఎవరూ ఖాళీగా లేరు”
“నాకొక అవకాశమివ్వండి” అన్నాను.
“నువ్వా?”” అన్నాడాయన అపనమ్మకంగా చూసి.
“ప్లీజ్ సర్! మీరడిగినట్లే పదిమంది పిల్లలనిస్తాను. ఏర్పాట్లన్నీ మేమే చూసుకుంటాం. మీరు పైనుంచీ చూసుకోండి. నచ్చితేనే డబ్బివ్వండి” అన్నాను అభ్యర్ధిస్తూ.
ఆయన ఒప్పుకున్నారు. ఇందులో ఆయనకి సమస్యేం లేదు. పిల్లల్నిస్తే ఆయన స్వయంగా పనులన్నీ చేయించుకోవాలి. ఇప్పుడు నేను అన్నీ చేయిస్తే ఆయన పైనుంచీ చూసుకోవడమే. చకచక కొన్ని ప్రశ్నలడిగాను.
ముహూర్తం పగలా? రాత్రా? ఎంతమంది వస్తారు? వాళ్లలో వీఐపీలెందరు? కార్డులెన్ని ప్రింటు చేయిస్తారు? ప్రశ్నలమీద ప్రశ్నలు వేసేసరికి తికమకపడిపోయి “ఇవన్నీ ఇంటికెళ్లి నా భార్యనడిగి చెప్పాలి. ఒక్కడినే ఎలా చెప్పగలను? నీ ఫోన్ నెంబరు యివ్వమ్మాయ్! ఇంటి దగ్గర్నుంచీ మాట్లాడతాను” అన్నాడు.

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.