తిరస్కృతులు – 8 by S Sridevi

  1. తిరస్కృతులు – 1 by S Sridevi
  2. తిరస్కృతులు – 2 by S Sridevi
  3. తిరస్కృతులు – 3 by S Sridevi
  4. తిరస్కృతులు – 4 by S Sridevi
  5. తిరస్కృతులు – 5 by S Sridevi
  6. తిరస్కృతులు – 6 by S Sridevi
  7. తిరస్కృతులు – 7 by S Sridevi
  8. తిరస్కృతులు – 8 by S Sridevi
  9. తిరస్కృతులు – 9 by S Sridevi
  10. తిరస్కృతులు – 10 by S Sridevi
  11. తిరస్కృతులు – 11 by S Sridevi
  12. తిరస్కృతులు – 12 by S Sridevi
  13. తిరస్కృతులు – 13 by S Sridevi
  14. తిరస్కృతులు – 14 by S Sridevi
  15. తిరస్కృతులు – 15 by S Sridevi
  16. తిరస్కృతులు – 16 by S Sridevi
  17. తిరస్కృతులు – 17 by S Sridevi
  18. తిరస్కృతులు – 18 by S Sridevi
  19. తిరస్కృతులు – 19 by S Sridevi
  20. తిరస్కృతులు – 20 by S Sridevi

ఆవిడతో ఫోన్లో మాట్లాడాక యింటికి ఎవరినైనా పంపించమంది. ప్రభాకర్ వెళ్లాడు. తెలుసుకోవలసిన వివరాలన్నీ కొశ్చనీర్‍లా రాసిచ్చాను. వాటికి కచ్చితమైన జవాబులు రాబట్టుకున్నాం. ఆ తర్వాత ఏర్పట్లన్నీ చకచక చేసేసాం. పగలూ రాత్రీ నిర్విరామంగా కష్టపడ్డారు మైకేల్, ప్రభాకర్.
డాక్టరుగారిది చాలా పెద్ద సర్కిలు. పెళ్లికొచ్చినవారంతా ఏర్పాట్లు చాలా బావున్నాయని మెచ్చుకున్నారు. ఆ సంతోషంలో ఆయన నేను చార్జి చేసినంతా యిచ్చేసాడు. మార్జినల్‍గా లాభం వచ్చింది. ఈ పెళ్లి నా కన్సల్టెన్సీకి పెద్ద పబ్లిసిటీ అయింది. ఒకదానివెనుకగా ఒకటి పెళ్లిళ్లకీ, బారసాలలకీ, నిశ్చితార్థాలకీ ఆఫర్సొచ్చాయి.
“ఎలా జరుగుతుందోనని భయపడ్డాను తెలుసా?”” అన్నాడు ప్రభాకర్.
“భయపడితే ఏదీ చెయ్యలేం. ఆయన అడిగినట్టు పదిమంది అబ్బాయిల్నే పంపించి వూరుకుంటే హైదరాబాద్నుంచీ మ్యారేజి కాంట్రాక్టర్స్‌ని ఎలాగోలా తెప్పించుకునేవారు. అదేం పెద్ద చదువు కాదు. ఎవరో తెలివైనవాడు తన అనుభవాన్ని ఆరకంగా మార్చుకున్నది. ఆ వచ్చేవాడు మనని వర్కర్స్‌గా ఉపయోగించుకుని ఇక్కడకూడా ఒక బిజినెస్ స్పేస్‍ని సంపాదించుకునేవాడు. మనం ఎప్పటికీ వర్కర్స్‌గానే మిగిలిపోయేవాళ్లం. అందుకే ఆయన ప్రపోజల్ని ముందుకి సాగనివ్వలేదు. ప్రత్యామ్నాయాలు ఆలోచించబోయినా, మనమే ఆ ప్రత్యామ్నాయం అనిపించేలా చేసాను. కొంచెం రిస్క్ తప్పదు… ఎక్కడా వుండేదే”” అన్నాను.
వచ్చిన లాభాన్ని ముగ్గురం పంచుకున్నాం. లక్షో పదిలక్షలో ఖర్చుపెట్టే దగ్గర మరో వెయ్యో పదివేలో ఎక్కువైతేనేం, రిస్కు తప్పుతుందనుకునేవాళ్లు కొందరైతే ఆ వెయ్యో పదివేలో మిగిలినా మిగిలినట్టేననుకునేవాళ్ళు యింకొందరు. మొదటివర్గంవాళ్లు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. రెండోవర్గంలో కూడా మాకు యిచ్చేదానికి సరిపోను తాము మెటీరియల్‍గా లాభాన్ని పొందుతున్నామనుకునేవాళ్లు వస్తున్నారు. అమెరికానుంచీ దిగుమతి అవుతున్న డాలర్లూ, అరబ్బుదేశాలనుంచీ వర్షంలా కురుస్తున్న దీనార్లూ మనుషుల్లో సుఖలాలసని పెంచుతున్నాయి. నా వ్యాపారాన్ని కూడా.
చేతినిండా పని, డబ్బుకి డబ్బు. మైకేల్ ఎవరెవర్నో తీసుకొస్తున్నాడు. ఇలాంటి పిల్లలు అతని చేతిలో చాలామంది వున్నారు. అల్లరిచిల్లరగా తిరిగే యీ పిల్లలంతా గౌరవంగా బతకడానికి అలవాటుపడుతున్నారు. మా కన్సల్టెన్సీ కోసం పార్ట్‌టైమ్‍గా చేస్తారు. వారానికి యిన్ని గంటలని వాళ్ల సమయాన్ని వెచ్చించి గంటకింతని తీసుకుంటారు. ఆత్మగౌరవం దెబ్బతినకుండా కాలేజీ అవర్స్ పాడవకుండా వాళ్ల ఖర్చులకి వాళ్లు చిన్నచిన్నపనులు చేసి సంపాదించుకోవడంలోగల సరదా పిల్లలకి యిప్పుడిప్పుడే అర్థమౌతోంది. ఏదైనా పని చెప్పమని చాలామంది పిల్లలొస్తున్నారు. వాళ్లనిబట్టి ఎన్నోరకాల పనులు టేకప్ చేస్తున్నాను.
అంతా స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు. కాలేజీ అయాకో, లీజర్ అవర్స్‌లోనో వచ్చి తమ చిన్నిచిన్ని ఖర్చులకి సంపాదించుకుని వెళ్తున్నారు. ప్లమింగ్, ఎలక్ట్రికల్ వర్కు, ఏదేనాసరే. వీళ్ళందరి కాంటాక్ట్ అడ్రస్ నా కన్సల్టెన్సీ. ఫోన్ నెంబర్లో, ఎవరికి సమాచారం ఇస్తే వాళ్ళు వెంటనే దొరుకుతారో ఇవన్నీ రిజిస్టరు పెట్టి జాగ్రత్తగా రాయిస్తున్నాను. ఇదంతా ఒక ఉద్యమంలా ముందుకి వెళ్తోంది. నాకు తెలుసు, కొంతకాలానికి పడిపోయిన కెరటంలా వెనక్కీ వెళ్లగలదని. గుత్తాధిపత్యం వున్నంతవరకే ఏ వ్యాపారమేనా. పోటీ మొదలైతే ఈ ఆటలోని నిబంధనలు మారిపోతాయి.
డబ్బు… డబ్బు… నా ధ్యేయం అదే. ఏ చిన్న ప్రతిఘటనేనా చేసి రాజ్‍కి నా అసహ్యాన్ని తెలియచెయ్యాలంటే కనీసంగా అవసరమయేంత డబ్బు
సంపాదించాలి. ఒకప్పుడు అతని దగ్గర పెదవి విప్పి ఒక్కమాట అనుంటే వర్షంలా కురిపించేవాడు. ఆ డబ్బే వుంటే యిప్పుడు నాకీ పరిస్థితి వచ్చేది కాదు. ఇది నాలోని నమ్మకాల ఒక పార్శ్వం. ఇప్పుడిప్పుడే మరో పార్శ్వం కూడా కనిపిస్తోంది. రాజ్‍నుంచి డబ్బే ఆశించివుంటే నా స్థానం, ఆ కొద్దికాలమేనా అక్కడంత పటిష్టంగా వుండేదికాదు. మామధ్య డబ్బు ప్రస్తావన లేదుగాబట్టే అతను నన్నంతగా ప్రేమించగలిగాడేమో! డబ్బు ప్రస్తావన వచ్చాక నాకూ ప్రమీలాదేవికీ భేదం కనిపించేదికాదు. ఆమె పెళ్లి అనే సురక్షితమైన చట్రంలో వుంది, నేనలా లేనుగాబట్టి యిప్పటి ఈ పరిస్థితి మొదట్లోనే ఎదురైవుండేది.


ఉద్యోగస్తుల పిల్లలకోసం సమ్మర్ క్లబ్ పెట్టాను. పిల్లలకి వేసవికాలం సెలవులుంటాయి. తల్లిదండ్రుల్లో కనీసం ఒకరేనా టీచింగ్ లైన్లో వుంటే ఫర్వాలేదు. అలా కాకపోతే దానంత పెద్ద సమస్య అదేగానీ ఇంకొకటి వుండదు. అందరికీ ఇళ్ళలో పెద్దవాళ్ళు వుండరు. అన్నిరోజులు సెలవుపెట్టలేక, పెట్టినా పైవాళ్లు యివ్వక పిల్లల్ని యింట్లో వదల్లేక, వచ్చి తోడుండేవాళ్లు లేక ఎక్కడికి పంపించాలో తెలీక…. అదో వర్ణనాతీతమైన స్థితి,
“ఇన్ని అవసరాలు వుంటాయా వసంతా, మనుషులకి? సాయం చేసే చేతికోసం ఇంత తపించిపోతారా?” విస్మయంగా అడిగాడు ప్రభాకర్.
“ఇంకా చాలా వుంటాయి. మనం కొన్నిటినే తీసుకుంటున్నాం. ఇళ్ళలో వుండే పెద్దవాళ్ళని చూసుకోవటం, అనారోగ్యం వచ్చినవాళ్ళకీ, హాస్పిటల్స్‌లో వుండేవాళ్ళకీ దగ్గర వుండటం, అలా వుండేవాళ్ళకి తిండి, బట్టలలాంటివి ఇంటినుంచీ తెచ్చి అందించడం, ఉద్యోగాలకి వెళ్ళేవాళ్ళకి ముఖ్యంగా మహిళలకి లంచిబాక్సులు అందించడం, యిళ్ళలో జరిగే రకరకాల పూజలకి పూజసామగ్రి సేకరించి ఒక పేకేజిలా ఇవ్వటం … ఇంకా చాలా వుంటాయి. మనిషికి మనిషి సాయం. అలా అనుకుని చేయాలి. డబ్బుకన్నా పెద్ద పెట్టుబడి ఎంపతీ, నమ్మకం, సమయం. స్వయంగా వాళ్ళ అవసరాన్ని మనసులోకి స్వీకరించి చేయాలి. నమ్మకంగా చేయాలి. అడిగిన వెంటనే చేయాలి. కస్టమర్‍మీద వత్తిడి వుండకూడదు. కన్సల్టెన్సీకి చెప్పాం, మన పని ఐపోయినట్టే అనే భరోసాఇవ్వగలగాలి. అలా చెయ్యగలిగితే ఇంకా ఎన్నో అవకాశాలు” అన్నాను.
మంచిసెంటర్లో రెండు పెద్దపెద్ద అద్దెకి ఫ్లాట్స్ తీసుకున్నాను. అద్దెకి రెండు కంప్యూటర్లు తెప్పించి గేమ్స్ లోడ్ చేయించాను. ఇంకా యిండోర్ గేమ్స్, కామిక్స్, కథల పుస్తకాలు కొన్నాను. ఎయిర్ కూలర్లు, వట్టివేళ్ల తడకలు తెప్పించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరిచాను. ఇప్పటిదాకా నా దగ్గరున్నదంతా దాదాపుగా పెట్టేసాను. నాకు కావల్సింది పైసపైన కూడ బెట్టి డబ్బు పోగుచేయడంకాదు. వీలైనన్ని పెంచర్లలో వీలైనంత సంపాదించడం. నరకం యథాతథంగా అనుభవిస్తే బాధనిపించదు. స్వర్గం తర్వాత అక్కడికెళ్లడం బాధాకరం. ఏదైనా కాంట్రాస్ట్‌లోనే తన ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుంది.
క్లబ్‍కి వస్తున్న పిల్లల్నీ, వాళ్లని వదిలిపెట్టడానికి వస్తున్న తల్లిదండ్రులనీ చూస్తుంటే మనసు కదిలిపోతోంది. సుధాసుమలకోసం ఆక్రోశిస్తున్నాను. రాజ్ ప్రేమరాహిత్యం నన్ను బాధపెడ్తోంది. రేపటి ఆశతో నన్ను నేను నిలువరించుకుంటున్నాను. ఎప్పటికేనా వాళ్లు తిరిగొస్తారనే ఆలోచన నన్ను నైరాశ్యంలో కూరుకుపోకుండా ఆపుతోంది.
రాత్రులు వంటరిగా వున్నప్పుడు నాలోని శూన్యం విస్తృతమౌతోంది. దాన్ని భరించలేక నిస్సహాయంగా ఏడుస్తున్నాను. నవ్వేవారి చుట్టూమాత్రమే ప్రపంచం తిరుగుతుంది. అందుకని పగలు నవ్వుని మేకప్ వేసుకుంటున్నాను. ఏడవటం అందరికీ వస్తుంది. ఎవరి సమస్య వారిది. ఎవరి బాధ వారిది. నవ్వటం కొందరికే వస్తుంది. అందుకే అందరూ నవ్వుల్నే పంచుకోవాలనుకుంటారు.
ఉన్నట్టుండి మధుకర్ ఫోన్ చేసాడు.
“ఆరోజు భలే హేండిచ్చి వెళ్లిపోయావు వసంతా! తర్వాతి రోజంతా పేపర్లు తయారుచేసి నీకోసం ఎదురుచూసాను. చాలా డిజపాయింట్ చేసావు. కనీసం యిప్పుడేనా పెట్టుబడి పెట్టకూడదూ? ఒక్క లక్ష… ఆదాయం బాగానే వున్నట్టుంది. ఏ సెంటరుకెళ్లినా నీ కన్సల్టెన్సీ గురించే చెప్పుకుంటున్నారు. బ్రహ్మాండమైన ఐడియాని క్లిక్ చేసావు. సరేగానీ వసంతా, హూ యీజ్ ద మేన్ బిహైండ్ దిస్?’ అని ఆపకుండా అరగంట మాట్లాడి, నా డిప్లమాటిక్ నవ్వుల్ని విని చేసేదేంలేక పెట్టేసాడు.
నా ఆలోచనలు రాజ్‍మీదికి మళ్లాయి. ఏదో ఒకటి చెయ్యగలిగే పరిస్థితి వచ్చిందనిపించింది. పిల్లలెక్కడున్నారో తెలుసుకోవాలి. వాళ్లని మర్చిపొమ్మని ఎలా శాసించగలిగాడు? మర్చిపోవటం అంత తేలికా? ప్రమీలాదేవి మాటలు గుర్తొచ్చి నా రక్తం వుడికింది. అసలెక్కడున్నారు వాళ్లు? రాజ్ దగ్గిరే వున్నారా? ఎక్కడికైనా పంపించిందా? ఎన్నో సందేహాలు. అవే ప్రశ్నలు. ఎన్నిసార్లు వేసుకున్నా జవాబు దొరకనివి.


సెకండ్‍హేండ్ కారొకటి అమ్మకానికి వుందని డాక్టర్ రావుగారు ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు వాళ్ల కుటుంబంతో నాకు బాగా సంబంధాలు ఏర్పడ్డాయి. రావుగారి భార్య ప్రొఫెసర్, పేరు కళావతి. ఆవిడకి ఆరుగురు అక్కచెల్లెళ్లు, యిద్దరన్నలు. అందరూ మంచి పొజిషన్స్‌లో వున్నారు. ఒకే దగ్గర యిళ్లు కట్టుకుని వుంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక ఫంక్షన్.
“మా అక్క మనవడి బారసాల”
“చెల్లి కొడుకు స్టేట్స్‌కి వెళ్తున్నాడు. పార్టీ యివ్వాలి “
“చెల్లెలి మనవడి పుట్టినరోజు. టాయ్ ఐలాండ్ సెట్ వేయ్యాలి. ఎలా చేస్తావో నీ యిష్టం”
ఇలా వూదరగొట్టేస్తూ వుంటుందావిడ. కొన్ని చిన్నచిన్న వైఫల్యాలున్నా, అంతిమంగా పెద్ద విజయాలని అందుకున్న వ్యక్తుల్లో ఎలాంటి సరదా, వుల్లాసం వుంటాయో, అలాంటివి వాళ్ళిళ్ళలో కనిపిస్తాయి. చక్కటి చదువులు, అనువైన పెళ్ళిళ్ళు-భర్తలు-కాపురాలు, పిల్లల అభివృద్ధి… మన సమాజంలో మనిషి ఆనందానికి ఇవి కొలతబద్దలు. మంచి వ్యక్తుల సృజనాత్మకత కళ. కళాపోషణ. చెడ్డవారి సజనాత్మకత పర్వర్షన్.
మొదట్లో యీ ఫంక్షన్స్‌కి నన్ను పైపైని ఆహ్వానించేవారు. వేడుకరోజుదాకా అన్నీ చూసుకుని ఆరోజుని ప్రభాకర్‍కి అప్పజెప్పి వచ్చేసేదాన్ని. ఇప్పుడలా కాదు. రాకపోతే వదిలి పెట్టడంలేదు.
ఎప్పట్నుంచో అంటున్నారు, భార్యాభర్తలు కారు తీసుకొమ్మని. నేను వాయిదా వేస్తున్నాను. ఇప్పుడింత చవకలో వచ్చింది కాబట్టి నాకూ తీసుకోవాలనే వుంది. రావుగారి కొలీగ్ స్టేట్స్‌లో వున్న కొడుకు దగ్గరకి వెళ్లిపోతూ యిక్కడివన్నీ ఎంతో కొంతకి అమ్మేస్తున్నాడు. లాభాపేక్షలేని బేరం కాబట్టి చవక. కారు కొనడంలో కొన్ని లాభాలున్నాయి.
నేను, మైకేల్, ప్రభాకర్ ముగ్గురం కలిసి వెళ్లాలంటే యిబ్బందిగా వుంది. రెండు బైకులో రెండు ట్రిప్పులో అవసరమవుతున్నాయి. దానివలన ఆఖరినిముషంలో అనివార్యంగా చెయ్యాల్సిన మార్పుల గురించి చర్చించుకోవటానికి కుదరటంలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను తిరుగుతున్న సర్కిల్లో నాకొక కారుండటం ప్లస్‍పాయింట్ ఔతుంది. ఇవన్నీ ఆలోచించుకుని సరేనన్నాను.
“ఇప్పుడంత అవసరమా వసంతా?” అన్నాడు ప్రభాకర్.
“నువ్వే చూద్దువుగాని” అన్నాను. అతనుగానీ మైకేల్‍గానీ యింకేం తర్కించలేదు. నా తెలివిమీద యిద్దరికీ అపారమైన నమ్మకం ఏర్పడిపోయింది.


ప్రభాకర్ ఎక్కడికైనా వెళ్లామన్నాడు. బోర్ కొట్టినప్పుడు అలా వెళ్లడం అలవాటే. నేనూ, ప్రభాకర్, మైకేల్ అతని యిద్దరు చెల్లెళ్ళూ కలిసి వెళ్తాం. ప్రభాకర్ చుట్టూ ఒక విషాదం సుడిలా తిరుగుతుంటుంది. అతని చెల్లెలిది కట్నంచావు. తండ్రికి మతి తప్పింది. జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్నారు తల్లీకొడుకులు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాక కూడా భార్యాభర్తలు ఒకరి చావుకి ఇంకొకరు కారణమౌతే ఇంక ఆ పెళ్లికి అర్థమేమిటి? ప్రభాకర్ చెల్లెలిగురించి ఆలోచిస్తూ చీర కట్టుకుంటున్నాను.
ఈ ప్రపంచంలో నవ్వుతూ బ్రతుకుతున్నవారెవరూ లేరు. సమస్యలూ బాధలూ మన చుట్టే వుంటాయి. వాటి మధ్యలోనే మనం యీదులాడతాం. కొంత వయసు వచ్చేదాకా అవి మనని అంటవు. ఆ తర్వాత క్రమంగా తమలోకి పీల్చేసుకుని మనకంటూ అస్తిత్వం లేకుండా చేస్తాయి.
లేత నీలిరంగుమీద పింక్‍కలర్ ప్రింటున్న షిఫాన్‍చీర కట్టుకుని కుచ్చెళ్లు సరిచేసుకుంటుంటే ప్రభాకర్ వచ్చేసాడు.
“రెడీయా?” అడిగాడు నన్ను చూస్తూ.
“ఒక్క నిముషం కూర్చో వచ్చేస్తాను” అని జుత్తుకి వున్న రబ్బర్‍బాండ్ తీసి దువ్వుకోసాగాను. అతనక్కడే కుర్చీలో కూర్చున్నాడు.
“నువ్వెప్పుడూ యిలాంటి చీరలే కడతావేమిటి? అందులోనూ లైట్ కలర్స్?” నన్ను పరీక్షగా చూస్తూ అడిగాడు.
“సింపుల్‍గా వుంటాయి” మామూలుగా జవాబిచ్చాను. అతను లోతులు వెతికాడు.

1 thought on “తిరస్కృతులు – 8 by S Sridevi”

Comments are closed.