తిరస్కృతులు – 11 by S Sridevi

  1. తిరస్కృతులు – 1 by S Sridevi
  2. తిరస్కృతులు – 2 by S Sridevi
  3. తిరస్కృతులు – 3 by S Sridevi
  4. తిరస్కృతులు – 4 by S Sridevi
  5. తిరస్కృతులు – 5 by S Sridevi
  6. తిరస్కృతులు – 6 by S Sridevi
  7. తిరస్కృతులు – 7 by S Sridevi
  8. తిరస్కృతులు – 8 by S Sridevi
  9. తిరస్కృతులు – 9 by S Sridevi
  10. తిరస్కృతులు – 10 by S Sridevi
  11. తిరస్కృతులు – 11 by S Sridevi
  12. తిరస్కృతులు – 12 by S Sridevi
  13. తిరస్కృతులు – 13 by S Sridevi
  14. తిరస్కృతులు – 14 by S Sridevi
  15. తిరస్కృతులు – 15 by S Sridevi
  16. తిరస్కృతులు – 16 by S Sridevi
  17. తిరస్కృతులు – 17 by S Sridevi
  18. తిరస్కృతులు – 18 by S Sridevi
  19. తిరస్కృతులు – 19 by S Sridevi
  20. తిరస్కృతులు – 20 by S Sridevi

మైకేల్ కొన్ని ఫొటోలు నా ముందు పరిచి అన్నాడు. “”డాక్టర్ చంద్రలేఖ వచ్చింది నిన్న మీరిద్దరూ లేనప్పుడు. నువ్వు లేవనేసరికి బాగా డిసప్పాయింటైంది”
“ఏంటట?”
“అక్క పెళ్లట. వాళ్ల నాన్నగార్తో కలిసి వచ్చింది. ఇదుగో, యీ డెకరేషన్స్ సెలక్టు చేసుకుంది. మిగతా విషయాలు నీతో వివరంగా మాట్లాడతారట”
చంద్రలేఖ రావుగారి కొలీగ్. నా వయసే వుంటుంది. ఒక కోణంలోంచీ చూస్తే గమ్మత్తు మనిషని అనిపిస్తుంది. మరో కోణంలో చదువుతో మనుషుల నైజగుణం మారదనిపిస్తుంది. తెల్లగా పొడుగ్గా నూలుచీరల్లో ఎంతో హుందాగా కనిపించే ఆమెలో బైటికి కనిపించని లేకితనం వుంది. ఎదుటివారి వ్యక్తిగత విషయాల్లోకి ప్రోబ్ చేస్తుంది. నేను చేసే సర్వీసెస్‌కన్నా నేనెవర్నో తెలిస్తే ఆమెకి గొప్ప సంతృప్తి.
నేనెవర్ని? ఇక్కడికెందుకొచ్చాను? ప్రభాకర్‍గానీ మైకేల్‍గానీ నాకేమౌతారు? వాళ్లలో ఎవరితోటేనా నాకేదైనామైనా అఫేరుందా? ప్రభాకర్ నాకెందుకు ఆశ్రయమిచ్చాడు? ఇత్యాది ప్రశ్నలన్నీ మార్చిమార్చి అడుగుతుంది. మరీ తప్పనిసరైతే కొన్నిటికి అతికీఅతకనట్టు చెప్తాను. ఇంకొన్నింటిని దాటేస్తాను. ఒక్కొక్కసారి నాతో చాలా చనువుగా మేమిద్దరం ఒకటేనన్నట్టు వుంటుంది. మళ్లీ తనే ఏదో స్వర్గంలోంచీ నాకోసం ఒక మెట్టు దిగి వచ్చినట్టు మాట్లాడుతుంది.


పెళ్లంటే తాటాకుపందిళ్లూ, మామిడితోరణాలూ, పెట్రోమాక్స్ లైట్లూ అనే రోజులు పోయాయి. మేరేజిబ్యూరోతో మొదలౌతోంది. ఫంక్షనుహాలు, మేరేజి కాంట్రాక్టర్సు, కేటరర్సు, బ్యూటీషియన్లు… యిలా పొరలుపొరలుగా విడిపోయి రంగురంగుల కాగితాల్లో చుట్టబడిన బహుమతిలా తయారైంది. ఆ బహుమతి ఏమిటో, అది ఆ జంటకి ఉపయోగపడుతుందా లేదా అన్న విశ్లేషణకి చోటులేదు.
గేటు దగ్గర్నుంచీ మొదలుపెట్టి పెళ్లిమంటపందాకా అలంకరణ ఎలావుండాలో రకరకాల ఫోటోలు తీయించాను. కొన్ని పెళ్లిళ్లలో తీసిన వీడియో టేపులు, సీడీలు కూడా వున్నాయి. వాటిని చూసి నా కస్టమర్లు ఎంచుకుంటారు. కొన్ని సలహాలూ మార్పులూ కూడా చెప్తుంటారు. అంతా సినిమా సెట్టింగ్‍లా వుండాలి. వీడియో లేదా డిజిటల్ రికార్డింగ్ చేయిస్తారు. ఈ సీడీలు, టేపులు స్నేహితులకోసం, బంధువులకోసం దేశవిదేశాలు తిరుగుతాయి. ఈ సెట్టింగ్స్ ఎంత గొప్పగా ఎంత రిచ్చిగా ఎంత అట్టాహాసంగా వుంటే అంత గొప్ప.
ప్రభాకర్ నన్ను మళ్లీ ఏమీ అడగలేదు. రక్మిణమ్మగారుమాత్రం నా ముఖంకేసి పరీక్షగా చూసేది తరుచు. నేనైమైనా చెప్తానేమోనని. అలాంటప్పుడు నా చూపులు అపరాధభావనతో వాలిపోయేవి. స్త్రీకీ పురుషుడికీ సమాజంలో వున్న విలువల్లో తేడా స్పష్టంగా అర్థమౌతోంది. ప్రభాకర్ ప్రతిపాదన ఆమెకు ఇంకా తెలియకపోవచ్చు. ఆమె తెలుసుకోవాలనుకుంటున్నది నా గురించి. నా గతాన్ని గురించి. ఇప్పటికే చాలా ఓపిక పట్టింది, కుతూహలాన్ని ఆపుకుందుకు.


చంద్రలేఖ యింట్లో పెళ్లి. నేను రాకపోతే వదిలిపెట్టేది లేదని చంద్రలేఖ, ఆమె తల్లీకూడా పదేపదే చెప్పారు. ఇష్టం లేకపోయినా బయల్దేరాను. ఇక్కడ నా వ్యక్తిగత యిష్టాయిష్టాలు చెల్లుబాటవవు. కన్సల్టెన్సీ నడవాలంటే మనుషులతో కలవడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు. పరిచయాలు పెంచుకోవాలి. అవసరాలని గుర్తించాలి. అక్కడ నా అస్తిత్వాన్ని ప్రకటించాలి. నేను తప్ప ఇంకెవరూ లేరని నమ్మిమ్చాలి. ఇప్పుడీ పెళ్లి…
మేరేజి డెకర్స్‌గా ఎంత పేరొస్తున్నా యీ ఫంక్షన్లకి వెళ్లాలంటే ఎలాగో వుంటుంది. నాకు జరగని ఈ సందర్భం… తుంచుకున్న బంధుత్వాలు… యింతచేసీ ఎలాంటి విలువా లేక పరిస్థితుల ముందు వీగిపోయిన అనుబంధాలు… యివన్నీ నా మనసుని గుచ్చిగుచ్చి బాధపెడతాయి.
“వెళ్దామా?” అన్నాడు ప్రభాకర్ నా గదిలోకి వస్తూ.
“మైకేల్?” అడిగాను.
“వాడక్కడి ఎరేంజిమెంట్స్ చూడటానికి ఉదయాన్నే వెళ్లిపోయాడు”
నేను ప్రభాకర్లో బైటికి నడిచాను.
“రామ్మా!” అంటూ గేటు దగ్గర కళావతిగారు ఎదురుపడి, నన్ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. కష్టపడి పైకొచ్చానని ఆవిడకి నేనంటే అభిమానం. ఆవిడతో లోపలికి వెళ్లాను.
“ఎరేంజిమెంట్సు చాలా బావున్నాయి” అంది చంద్రలేఖ తల్లి. చంద్రలేఖ దూరంనించే పలకరించింది. అతిథుల మధ్య కూర్చున్నాను. అక్కడున్న కొంతమంది నన్ను కుతూహలంగా చూడటం గుర్తించాను.
క్రమంగా నేనెవరో అక్కడివాళ్లకి తెలియడం, అక్కడికక్కడే నలుగురైదుగురు నా విజిటింగ్ కార్డు తీసుకోవడం జరిగింది. పెళ్లి చాలా గ్రాండుగా ముగిసింది. తలంబ్రాలు, చదివింపులు అయ్యాక అందరూ భోజనానికి లేస్తుంటే ప్రభాకర్ వచ్చి నన్ను కలిసాడు. ఎలాగో తిన్నాననిపించి, చంద్రలేఖ తల్లితో చెప్పి రావడానికి వెళ్లాను. ఆవిడ నన్ను కూర్చోబెట్టి చీర,జాకెట్టుముక్క యిచ్చింది.
“ఇప్పుడివన్నీ ఎందుకండీ? బిల్లు ఎలాగా ఇస్తున్నారుకదా?” మొహమాటంగా అన్నాను.
“అలా అనకమ్మా! పెద్దమ్మాయి పెళ్లి చేసినప్పుడు వళ్లు హూనమైపోయింది. హైదరాబాద్‍నుంచీ డెకర్స్‌ని తెప్పించాంకానీ ఏర్పాట్లు ఎవరికీ నచ్చక అభాసయ్యాం. మరిప్పుడు? చిన్నపిల్లవైనా బాగా ఆర్గనైజ్ చేసావు. మగపెళ్లివారికన్నా మేమే ఫ్రెష్‍గా వున్నాం. డాక్టర్‍గారు, కళావతి చెప్తుంటే ఏమిటో అనుకున్నానుగానీ, నాకైతే సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టినట్టుంది. ఇదుగో వసంతా! మా యింట్లో ఫంక్షన్లన్నీ యింక మీవే. అంతే కాదు, నీ పెళ్లికి నేనే నిన్ను స్వయంగా పెళ్లికూతుర్ని చేస్తాను” అంది.
నాతో తిరుగుతున్న ప్రభాకర్ని దృష్టిలో వుంచుకుని చివరి మాటల్ని అందని గ్రహించాను. నా ముఖం ఎర్రబడింది. చీరపాకెట్ తీసుకుని యివతలికి వస్తుంటే ఆవిడా నాతో కొంతదాకా వచ్చి, యింకెవరో రావడంతో ఆగిపోయింది. షామియానాలోంచీ నడుస్తుంటే చంద్రలేఖ తండ్రి
ఎదురుపడ్డాడు. “ఆర్గనైజేషన్ చాలా బాగుంది. థాంక్సమ్మా! పేమెంటు…?” అంటూ ఆపాడు.
“ఆఫీసులో యివ్వండి”” అన్నాను.
సరిగ్గా అప్పుడే “సర్!” అన్న పిలుపు వినిపించింది. ఆ గొంతు… నన్ను వులిక్కిపడేలా చేసింది.
“అరె… రాజ్! ఇప్పుడా రావడం? అమ్మాయేది?” అని ఆయన అడుగుతుంటే, మనిషిని నేనింకా చూడకపోయినా నా కాళ్లు భూమికి అంటుకుపోయాయి. నా వులిక్కిపాటు పొరపాటుకాదు.
“తను రాలేదు. ఏవో పనులు…” అతని జవాబు.
అతికష్టమ్మీద అక్కడినుంచీ బయటపడ్డాను. అతను నన్నిక్కడ చూస్తే? దెబ్బతిన్న మా సంబంధాలు బాగుపడటం అటుంచి నా పరువుపోతుంది… గేటు అవతల కార్లో కూర్చుని ప్రభాకర్ నాకోసం ఎదురు చూస్తున్నాడు.
“ఎందుకింత లేటైంది?” అని అతను అడుగుతున్నా జవాబివ్వకుండా ఫ్రంటుడోరు తెరుచుకుని అతని పక్కని కూలబడి “పోనీ ప్రభాకర్!” అన్నాను. నా నుదుట చిరుచెమట్లు పట్టాయి. నేను రాజ్‍కి భయపడ్తున్నానా? ఎందుకిలా పారిపోయినట్టు వచ్చేసాను? కూర్చున్నచోట అస్థిమితంగా కదిలాను.
“ఏం జరిగింది?” చేతిని నా వెనుకనుంచీ చాపి దగ్గరికి తీసుకుంటూ అడిగాడు. సీటుమీద వెనక్కి తలాన్చి కళ్లు మూసుకున్నాను. కొద్ది క్షణాలే! సడెన్ బ్రేక్‍తో కారాగడంతో వులిక్కిపడి కళ్లు తెరిచాను. మా పక్కనుంచీ దాటుకుని వెళ్లిన రాజ్ మాకు అడ్డంగా ఆపాడు. నేను దిగాలి. అతన్తో మాట్లాడాలి. తప్పదు.
“ప్రభాకర్, నువ్వెళ్లిపో. తర్వాత నీకన్నీ చెప్తాను” అని దిగాను. నాకోసం డోర్ తీసి పట్టుకున్నాడు రాజ్. నేను కూర్చోగానే సైడుకి తీసుకున్నాడు. రెండు నిమిషాలలాగే వుండి, ప్రభాకర్ వెళ్లిపోయాడు. ఆతర్వాత రాజ్‍కూడా స్టార్ట్ చేసాడు.
“నన్ను చూసి పారిపోయావేం?” అడిగాడు రాజ్ మోహన్.
చురుగ్గా చూసాను.
“పారిపోవటమేమిటి? వాళ్లింట్లో మన వ్యక్తిగత విషయాలు చర్చించుకోవాలా?”
“మామూలు పరిచయస్తుల్లాగేనా మాట్లాడుకోకూడదా?”
“నీతో నాకు మాటలేముంటాయి?” నేను కఠినంగా వున్నాను. ఎలాంటి సాదరభావాలూ కలగలేదు అతనిపట్ల.
“పిల్లల గురించి అడగవేం?”
పిల్లల ప్రస్తావన తేగానే లోలోపల దాచుకున్న బాధ ఎగజిమ్మింది. పల్చటి కన్నీటిపార కళ్లలో కదిలింది. దాన్నతను చూడకూడదని అనుకున్నానుగానీ చూసాడు.
“వాళ్లు చాలా హేపీగా వున్నారు. మామధ్యని యిమిడిపోయారు” అన్నాడు, పరిశీలనగా నాకేసి చూస్తూ. “నువ్వు వాళ్లగురించి మర్చిపోయి సంతోషంగా వుండు. వాళ్లకే లోటూ జరగదు. ప్రమీల నిర్ణయం చాలా సరైనదని యిప్పుడర్ధమైంది” అన్నాడు తనే మళ్లీ. నేను విండోలోంచి బైటికి చూస్తూ కూర్చున్నాను.
“వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నావో చెప్పకుండా వెళ్ళిపోవటమేనా? దాసుగాడిని చితక్కొట్టినా చెప్పడే? ఎక్కిన రైలు తెలుసటగానీ ఏవూరో తెలీదట. హౌరా మెయిల్లో ఎక్కావు. ఎక్కడ దిగావనుకోవాలి?” కోపంగా అడిగాడు. మెల్లిగా కదుల్తున్న కార్లోంచీ చూస్తుంటే చెట్లూ, కొండలవీ వెనక్కి జరుగుతూ మాకు దారిని యిస్తున్నట్టున్నాయి. చిక్కుల ముడిలాగా కీకారణ్యంలాగా వున్న నా జీవితంలో ఒక గమ్యం ఎప్పటికేనా దొరుకుతుందా?
“కన్సల్టెన్సీ రన్ చేస్తున్నావట, ఏం కన్సల్టెన్సీ?”
దానిక్కూడా నేను జవాబివ్వలేదు.
“నీతో వున్నతనెవరు?” వున్నట్టుండి కంగుమంది అతని గొంతు.
“…”
“నీతో అతనికంత చనువేంటి?”
“…”
“ఇప్పుడతనితో వుంటున్నావా?” సాదాసీదా మగవాడిలా అడిగాడు. ఏదేనా సందర్భంలో ప్రమీలాదేవిని కూడా ఇలాగే అడిగి వుండేవాడా అనేది తక్షణం నాకు స్పురించిన ప్రశ్న. నేను చివ్వుమని తల తిప్పాను. అతని కళ్లలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. నన్ను గాయపర్చి నా కన్నీళ్లతో దాన్ని చల్లబరచాలన్న ఆకాంక్ష వ్యక్తమౌతోంది. న్యాయం చేయాల్సిన స్థానంలో వున్న వ్యక్తి ఆశించిన న్యాయానికి బదులు అన్యాయం చేసి, తలదించుకోవలసిన పరిస్థితి ఎదురైనపుడు, అలా దించుకోకుండా తను చేసింది సరైనదెనని సమర్ధించుకుంటున్నట్టు వున్న తన ప్రవర్తన నాకు చాలా చక్కగా అర్థమౌతోంది. ఏమూలో ఇంకా కొనవూపిరితో వున్న అతనిమీది గౌరవం ఇప్పుడు పూర్తిగా పోయింది.
“నాగురించి ఏదైనా అడగటానికిగానీ, అలా మాట్లాడటానికిగానీ నీకు హక్కు లేదు. ఎప్పుడైతే లక్ష రూపాయలిచ్చి పొమ్మన్నావో ఆరోజే నీకూ నాకూ తెగిపోయింది. నా పిల్లలు నీ దగ్గరున్నారు. అందుకు నిన్ను గౌరవిస్తున్నాను”
“వసూ!” ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని రెండోచేత్తో నా భుజం దగ్గర గట్టిగా గుచ్చి పట్టుకుని అడిగాడు, “అతనెవరని అడుగుతున్నాను”
“మేం పెళ్లి చేసుకోబోతున్నాం” నొప్పిని వోర్చుకుని ఇంకా తీసుకోని నిర్ణయాన్ని చెప్పాను. మనిషి చేసే అనేకానేక తప్పుల్లో మొదటిది, అనేక తప్పులు చేయించేదీ తొందరపాటుతనం. అది నన్ను వదిలిపెట్టదు. అతను షాకు తిన్నట్లై నన్నొదిలేసాడు.
“వసూ!” అపనమ్మకంగా అన్నాడు. “నేను… నిన్నంత బాధపెట్టానా?” అడిగాడు.
“అదేదో నిన్ను నువ్వు ప్రశ్నించుకో”
“చాలా మాసివ్ అటాక్ వచ్చింది. బతుకుతానని ఎవరూ అనుకోలేదు. అక్కడ ఎవరికీ నీపట్ల ఎలాంటి అపేక్షా లేవు… మా అమ్మతోసహా… కనీసం జాలికూడా. నువ్వు అక్కడ వుండటం క్షేమం కాదనుకున్నాను. అది చాలా నిస్సహాయస్థితి. నువ్వు… నువ్వది అర్ధం చేసుకుంటావనుకున్నాను. కొంత డబ్బు చేతిలో వుంటే కొన్నాళ్లు దూరంగా వెళ్లి ఎక్కడో ఒకచోట వుండగలుగుతావని భావించాను”
“సమర్ధించుకోవాలని ప్రయత్నించకు. ఆరేళ్లపాటు బైట ప్రపంచం తెలీకుండా బ్రతికిన నన్ను, నువ్వెంత నిర్లజ్జగా, నిస్సంకోచంగా యింట్లోంచి వెళ్లగొట్టేవో గుర్తుతెచ్చుకో. నీ భార్యకి ఎదురవ్వలేదేం అలాంటి పరిస్థితి? నాకు నీ గురించి బాగా అర్థమైంది. నాకులాగే, నీ సరదా తీరగానే… లేదా నీకు మరోకష్టం రాగానే నా పిల్లల్నీ వెళ్లగొట్టేస్తావు. ఆరోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు వాళ్లు వీధిన పడకుండా వుండటంకోసం నేను బతుకుతున్నాను. ఒక్కదాన్నీ యీ ప్రపంచంలో నెగ్గుకు రాలేనుకదా? అందుకు పెళ్లి చేసుకుంటున్నాను. ఏం చెయ్యాలో, ఎక్కడికెళ్లాలో తెలీక అయోమయంగా రైలెక్కిన నాకు ఆశ్రయమిచ్చిన వ్యక్తి అతను. నాకతను ప్రేమ కబుర్లు చెప్పలేదు. అవసరాన్ని గుర్తించి ఆసరా యిచ్చాడు. నాగురించి ఏమీ తెలీకపోయినా పెళ్లి చేసుకుందామన్నాడు. సంఘంలో గౌరవాన్నీ గుర్తింపునీ యిస్తానన్నాడు. కాబట్టి… అన్నివిధాలా … నాదారి నాది, నీదారి నీది. పిల్లల్ని పంపించెయ్ మర్యాదగా” అన్నాను. నా గొంతులో అతనెప్పుడూ రుచి చూడని కరుకుతనం వుంది. అతనికి సుపరిచితమైన మృదుత్వం లేదు.