నేను ప్రభాకర్ గురించి ఒక్కొక్క విషయం చెప్తుంటే అతనికోపం పెరుగుతోంది. కారు స్పీడు లిమిట్స్ దాటుతోంది. ఎదురుగా లారీలొస్తున్నాయి. దేనికేనా డేష్ యిస్తాడేమోనని భయం వేసింది. మొండిమనిషి.
“రాజ్, అన్నీ చెప్పానుకదా, ఇంక కారాపు. దిగుతాను” అన్నాను. అతను వినిపించుకోలేదు.
“నేను దిగేస్తున్నాను” డోర్ హేండిల్‍మీద చెయ్యేసి గట్టిగా చెప్పాను. అతను ఏదో లోకంలోంచీ యీ లోకంలోకి వచ్చినట్టు సడెన్‍బ్రేక్ వేసాడు. నాకేసి చూడలేదు. నేను పట్టించుకోలేదు. దిగేసాను. డోర్ వేసీ వెయ్యగానే మళ్లీ అదే స్పీడుతో అతను నన్ను దాటుకుని వెళ్లిపోయాడు.
నేను దిగినది నేషనల్ హైవేమీద. లారీలూ, బస్సులూ తప్ప రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది. జరిగినదంతా గుర్తొచ్చి మనసు పచ్చిపుండులా తయారైంది. మెదడు మొద్దుబారినట్టు ఆ జ్ఞాపకాలు తప్ప వేరే ఆలోచనలేవీ రావడంలేదు. గమ్యం లేనట్టు… కలలోలా నడుస్తున్నాను. అసలెక్కడ దిగానో, వూరికి ఎంత దూరంలో వున్నానో, రాజ్ నన్నెక్కడికి తీసికెళ్లాలనుకున్నాడో అర్ధమవలేదు. ఎంత దూరం నడిచానో, ఇంకా అలా నడుస్తూనే వున్నాను. చాలా అరుదుగా ఒకటి రెండు మోటారు సైకిళ్లు నన్ను దాటుకుంటూ వెళ్లాయి. వాటిలో ఒకటి నన్ను దాటుకుని ముందుకెళ్లి మళ్లీ రివర్స్ చేసుకుని వెనక్కొచ్చి నాపక్కని ఆగింది.
“మైగాడ్! వసంత!! నువ్విక్కడున్నావేంటి?” మైకేల్ విస్మయంగా అడిగాడు.
నేను ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాను. అదీ అర్ధచేతనావస్తలోనే అతని వెనక బైక్ ఎక్కి కూర్చున్నాను. మద్యమాంసాలతో బలిష్టంగా పెరిగిన శరీరం అతనిది. సంస్కారం కూడా వుండటంతో కంచుకోటలా అనిపించింది. అప్పుడొచ్చింది దుఃఖం. అమ్మానాన్నల్నీ వున్న ఒక్క తోబుట్టువునీ దూరం చేసుకున్నాను. సంఘం నిర్దేశించిన హద్దులన్నీ దాటాను. చివరికేం మిగిలింది? వాస్తవంలా యిద్దరు పిల్లలు. వాస్తవాలే మిగుల్తాయి. ఊహలు మంచులా కరిగిపోతాయి. అతని ప్రేమ వూహ. అనుబంధం వూహ. పిల్లలు వాస్తవం.
“వసంతా! ఏడుస్తున్నావా?” బైక్ వేగం తగ్గించి , వెనక్కి చూస్తూ అడిగాడు మైకేల్. నేను అరచేతిని వెనక్కి తిప్పి, కళ్లకి అడ్డం వుంచుకుని కన్నీళ్లు దాచుకునే ప్రయత్నం చేసాను. ఆ ప్రయత్నంలో వుక్కిరిబిక్కిరయాను.
“ఏం జరిగిందనలు? ఇక్కడికెందుకు వచ్చావు? ప్రభాకర్ యేదైనా అన్నాడా?” అడిగాడు. అతనికి జవాబు చెప్పే పరిస్థితిలో లేను. అది గుర్తించి దగ్గర్లో వున్న దాబాముందు ఆపాడు.
“మొహం తుడుచుకుని మామూలుగా వుండు. కొద్దిసేపు యిక్కడ కూర్చుని వెళాం” అన్నాడు. నేను కర్చీఫ్‍తో ముఖాన్ని గట్టిగా తుడుచుకున్నాను. పక్కకి జరిగిన బొట్టు స్టిక్కర్ని అతను సరిచేసి “పద” అన్నాడు.
“హలో మైక్!” అనే గొంతు వినిపించింది.
“హాయ్ విశాల్!” అని జవాబిచ్చి, “కాటేజి ఖాళీగా వుందా? ఎండలో వచ్చేసరికి వసంత బాగా అప్‍సెటైంది. కొద్దిసేపు కూర్చుని వెళ్తాం” అన్నాడు చక్కగా కవర్ చేస్తూ.
“హలో వసంతా! హౌ ఆర్యూ?” అని నన్ను విష్ చేసి ఖాళీ కాటేజి చూపించాడు. మేం లోపల కూర్చోగానే కూల్‍డ్రింక్స్ పంపించాడు.
విశాల్‍కి దాబా, కేటరింగ్ ఏజన్సీ వున్నాయి. వాళ్ళకే మేము కేటరింగ్ ఆర్డరిస్తాము. అలా అతనికి నేను పరిచయం.
నేనూ మైకేల్ ఎదురెదురుగా కూర్చున్నాము. రాత్రంతా నిద్రలేక మైకేల్ ముఖం అలసటగా వుంది. కళ్లుకూడా ఎర్రగా వున్నాయి. ఇప్పుడు మేరేజిహాలు ఖాళీ చేసేటప్పుడుకూడా అతనుండాలి. ఎవరివి వాళ్లకి జాగ్రత్తగా అప్పచెప్పాలి.
“పెళ్ళి ఏర్పాట్లు చూసి, నేను ఆఫీసుకి వెళ్లిపోయాను. ఇప్పటిదాకా అక్కడే వుండి విశాల్‍కోసం యిటు వస్తున్నాను. ప్రభాకర్ యింకా రాలేదు. మొత్తం అంతా రామకృష్ణ చూసుకుంటున్నాడు. అసలేం జరిగింది వసంతా?” అడిగాడు మైకేల్.
నేను తల దించుకున్నాను. చాలా యిబ్బందిగా వుంది. ఎలా చెప్పను? ఇంత జరిగాక కూడా ఏమీ చెప్పపోతే ఎలా? నెమ్మదిగా లేచి కిటికీలోంచి చూస్తూ నిలబడ్డాను. కొంచెం మబ్బు పట్టింది. వానపడే సూచనలు కనిపిస్తున్నాయి.
నాకూ మైకేల్‍కీ మధ్యవున్న మౌనాన్ని ఛేదిస్తూ అడిగాను. “నీకు స్యూడోరిచ్చి కల్చరంటే తెలుసా మైకేల్? ఎప్పుడేనా విన్నావా?”
అతను వులిక్కిపడ్డాడు. “ఏమిటది?” అడిగాడు.
మళ్ళీ చెప్పాను.
“అంటే?”
“చేతినిండా డబ్బుంటుంది. డబ్బుందికదాని బాగా ఖర్చుపెడ్తారు. కానీ బేంకు బేలన్సులు నిల్, ఆస్తులూ నిల్లే. ఇంట్లో ఫ్రిజ్, టీవీ, కంప్యూటరు కారు… అన్నీ వుంటాయి. ఇల్లు స్వంతిల్లే. అన్నీ యిన్‍స్టాల్‍మెంట్స్‌లో కొనేసుకుని జీవితాన్ని అనుభవించెయ్యాలన్న ఆతృత… కరప్ట్ ఫాదర్స్, ఎంప్లాయిడ్ మదర్స్ కలిసి సృష్టించిన కల్చర్ అది”
“…”
“మా అమ్మ ఫీల్డ్ ఆఫీసరు. నాన్న ఇంజనీరు. రెండు జీతాలు, రెండు పై ఆదాయాలు. డబ్బు మా యింట్లోకి వరదలా ప్రవహించేది. దాన్ని బేంకులో నిలవచేసుకోవడానికి లేదు. వచ్చింది వచ్చినట్టు ఖర్చుపెట్టెయ్యాలి, లేదా దొంగతనంగా దాచుకోవాలి. చాలా విలాసంగా ఖర్చుచేసేవాళ్ళం. నాకు ఒక అక్క. మా పసితనాలు క్రెష్‍లోనూ, కాస్త పెద్దయాక రెసిడెన్షియల్‍స్కూల్స్‌లోనూ ఆపై కాలేజి హాస్టల్స్‌లోనూ గడిచాయి”
“ఏం చదువుకున్నావు వసంతా, నువ్వు?”
“ఏంబియ్యే పూర్తి చెయ్యలేదు” చెప్పాను. అతను అపనమ్మకంగా చూసాడు “ఐసెట్లో రేంకుకి వరంగల్లో సీటు వస్తే పంపించారు. ఇక్కడే చదివాను”
చెప్పడం కొనసాగించాను. “పై ఆదాయం పోతుందని అమ్మ సెలవులు పెట్టేది కాదు. మాకు సరైన న్యాయం చెయ్యలేకపోతున్నానని అపరాథభావన. దాన్ని కాంపన్సేట్ చేసుకునే ప్రయత్నంలో మాకు పుష్కలంగా డబ్బు పంపేది. ఫ్రెండ్సు, పార్టీలు, పిక్నిక్‍లు… లగ్జరీగా గడిపేవాళ్లం. నేను పుస్తకాలు విపరీతంగా చదివేదాన్ని మిల్స్ అండ్ బూన్ నవలలతో మొదలుపెట్టి ప్రబంధాలదాకా… కానీ అవేవీ నాకు జీవితమంటే ఏమిటో నేర్పలేదు. పైగా యీ ప్రపంచానికి నన్ను దూరంగా వుంచాయి.”
“ఇప్పుడింత హఠాత్తుగా యివన్నీ ఎందుకు చెప్తున్నావ్? ప్రభాకర్ ఏమైనా అన్నాడా? వుదయం పెళ్ళికి వచ్చినప్పుడు బాగానే వున్నారుగా యిద్దరూ?” వాచీలో టైము చూస్తూ అన్నాడు. అతని అభిప్రాయం నాకర్థమైంది. మేరేజిహాల్లో చాలా పనుంది అతనికి.
“ఒక్క నిముషం. ఇప్పుడే వస్తాను” లేచి వెళ్లి మళ్లీ పావుగంటకి వచ్చాడు. “రామకృష్ణని అక్కడే వుండమన్నాను. తను చూసుకుంటానన్నాడు” అన్నాడు.
నేనతన్ని చూస్తూ వుండిపోయాను. నా వాక్రవాహానికి ఆటంకం రావటంతో మాటలన్నీ గొంతు దగ్గర ఆగిపోయాయి. రాజ్ గురించి చెప్పాల్సిన సందర్భంలో యిలా జరగడం అసందర్భంగా అనిపించింది. ఈ క్షణాన్న నేను చెప్పలేకపోతే యింతదాకా వచ్చి ఆగిపోతే, యింకెప్పటికీ చెప్పలేక దోషిని ఔతాననిపించింది. భగీరథప్రయత్నంలాంటిది చేసి గొంతు కుహ్వరంలో దాక్కుండిపోయిన వాక్ప్రవాహాన్ని మళ్లీ లాక్కొచ్చాను. మైకేల్ అడిగిన ప్రశ్నలకు జవాబివ్వలేదు. నేను మధ్యలో ఆపేసిన దగ్గర్నుంచి కొనసాగించాను.
“ఒకసారి ఎక్స్కర్షన్‍కి వెళ్లినప్పుడు రాజ్‍మోహన్‍తో పరిచయమైంది”
అప్పటిదాకా కొంత కేజువల్‍గా నేను చెప్పినది వింటున్న మైకేల్ వులిక్కిపడి “ఎవరతను?” ముందుకి వంగి అడిగాడు. అతనిముఖంలో రంగులు మారటం నేను గమనించలేదు.
“హైద్రాబాద్‍లో పెద్ద ఇండస్ట్రియలిస్టు. నాకతను పరిచయమైనప్పుడు అతని ఆస్తుల గురించిగానీ, వాటి విలువగురించిగానీ తెలీదు. నేను నా ఫ్రెండ్సుతో వెళ్లినట్టే అతను బిజినెస్ పనిమీద వచ్చాడు. మామూలుగా పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్యా ఆకర్షణ చోటుచేసుకుంది.”
“…”
“ఉన్న వారంరోజుల్లో చాలాసార్లు కలుసుకున్నాం. మేము వున్న హోటల్ రూముకి ఫోన్ చేసేవాడు. ఎవరిదారిన వాళ్లం వెళ్లిపోయేముందు తన ఫోన్, నెంబరిచ్చాడు. హాస్టల్‍కి ఫోన్ చేసేవాడు. అతని నోట్లోంచి వచ్చిన ప్రతి మాటా నా గుండెగూట్లో గువ్వపిట్టలా వదిగిపోయేది. అతని ఫోన్ గురించి ఎదురుచూసేదాన్ని”
“ఇట్ సో హేపెన్స్ యిన్ లవ్” మైకేల్ అన్నాడు. నేను చెప్పిన విషయాలని విని అతను పెద్దగా ఆశ్చర్యపోలేదు.
“ఈ ఆకర్షణ ఎంతగా పెరిగిపోయిందంటే అతను లేకుండా బ్రతకలేని పరిస్థితి వచ్చేసింది. ఒకరోజుని అన్ని బంధాలూ వదిలిపెట్టేసి అతనిదగ్గరికి వెళ్ళిపోయాను. అతనికి అప్పటికే పెళ్లయిపోయింది. ఇద్దరు పిల్లలు. ఆ విషయాలు నాకు తెలీదు, తెలిసినా పట్టించుకునే స్థితిలో లేను. నన్ను యిల్లీగల్‍గా స్వీకరించాడు” ఆగిపోయాను. నా ముఖం ఎర్రబడింది. మైకేల్ ఇబ్బందిగా తలొంచుకున్నాడు. నాక్కూడా అతని ఎదురుగా కూర్చోవడం ఇబ్బందిగానే అనిపించింది. లేచి కిటికీ దగ్గరకి వచ్చాను సన్నగా తుప్పరపడుతోంది.
“ఆరేళ్లు అలా కలినున్నాం. అతని భార్యనుంచీ బంధువులనుంచీ ఎంత ప్రతిఘటన వచ్చినా తట్టుకుని నిలబడ్డాం. అతను నా చుట్టూ ఒక కంచుకోటలా ఆవరించుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత అతనికి హార్టెటాక్ వచ్చింది. పరిస్థితులు తలకిందులయ్యాయి. అతను హాస్పిటల్లో వున్నపుడు ఏం జరిగిందో తెలీదు. డిశ్చార్జయ్యాక భార్యాభర్తలిద్దరూ కలిసి నా పిల్లల్ని లాక్కుని నన్ను వెళ్లగొట్టారు” నేను ఎఫెక్టుకోసం వెనక్కి తిరిగి చూడలేదుగానీ మైకేల్ చాలా పెద్ద షాకు తిని వుంటాడని వూహించాను.
“ఈ వూరొచ్చినప్పుడు నా ధ్యేయం ఒక్కటే… కాళ్లానించడానికి చిన్ననేల చూసుకుని పిల్లల్ని వెనక్కి తెచ్చుకోవడం. ఇప్పటికీ నా ధ్యేయం అదే. మొదటి సగం పూర్తయింది. రెండోసగం కోసం రాజ్మాహన్‍మీద యుద్ధాన్ని ప్రకటించాను… అది యీరోజే జరిగింది”
“మరి ప్రభాకర్?” మైకేల్ గొంతు తీవ్రంగా వుంది. “నువ్వీ విషయాలన్నీ ముందే ఎందుకు చెప్పలేదు?
“ఎందుకు చెప్పాలి? నేనిలా జీవితంలో మోసపోయాననిగానీ, మోసం చేసాననిగానీ నువ్వు చెప్పావా? అతను చెప్పాడా? నేనే ఎందుకు చెప్పాలి? ఇదంతా చెప్పి, నేనొక తెలివితక్కువదాన్నని పరిచయం చేసుకోవాలా?”
“కానీ వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు వసంతా!”
“నేనతన్నుంచీ ప్రేమని ఆశించలేదు. అతన్లో ఒక స్నేహితుడినే చూసాను. అతను ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఔననలేదు. కుదరదనే అన్నాను. నా హద్దులు నాకు తెలుసు”
“కనీసం వాడలా ప్రపోజ్ చేసినప్పుడైనా ఎంతో కొంత చెప్పవలసింది” మైకేల్ గొంతు చాలా తీవ్రంగా వుంది. నన్ను తప్పుపడుతున్నాడా?
చురుక్కుమంది. గిర్రుమని వెనక్కి తిరిగాను. అతని చూపులు నన్ను చీల్చి చెండాడుతున్నట్టున్నాయి. ఐనా నేను కంగారు పడలేదు. నా అభిప్రాయాలన్నీ స్పష్టంగా చెప్పాను.
“నేను ఒక మగవాడిని అయ్యుంటే యీ పెళ్ళిప్రస్తావన తలెత్తేదే కాదు. ఏం, ఆడపిల్లైతే ప్రేమ, పెళ్ళి తప్ప స్నేహం కుదరదా?” సూటిగా అడిగాను. అలాంటి ప్రశ్నలు చాలామందికి అర్థమవ్వవు.
“నాకతన్ని చేసుకునే అభిప్రాయంలేదు. అలాంటప్పుడు నా గతంతో అతనికి ఏమి సంబంధం? నాకు అతనంటే గౌరవం వుంది. అడక్కుండా. ఆశ్రయం యిచ్చాడు. అన్నీ తనే అయ్యి నా ప్రక్కన నిలబడ్డాడు. కానీ ద్వంద్వనీతి వున్న సొసైటీ మనది. ఒకేరకమైన తప్పుకి స్త్రీ, పురుషులు యిద్దర్నీ చెరోరకంగా శిక్షిస్తాం. నన్ను మోసం చేసిన రాజ్‍మోహన్ యథాతథంగా సమాజంలో తిరుగుతున్నాడు. నేనుమాత్రం చట్టం కళ్లుకప్పిన నేరస్తుడిలా వున్నాను. నేను ప్రభాకర్‍కిగానీ యింకెవరికిగానీ నా గురించి ఏమీ చెప్పలేదు. నిజమే… ఎందుకు చెప్పాలి? నాకు కుదిరినప్పుడు చెప్పేదాన్ని. అసలే చెప్పేదాన్నికాదేమో! చెప్తే యిక్కడ నా వునికి ప్రశ్నార్థకమౌతే? ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని నా పిల్లలకోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. మళ్లీ ఎక్కడికో వెళ్లి యిదంతా మళ్లీ మొదలుపెట్టగలనా? అక్కడ యింకో ప్రభాకర్ తటస్థపడితే?”

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.