తిరస్కృతులు – 14 by S Sridevi

  1. తిరస్కృతులు – 1 by S Sridevi
  2. తిరస్కృతులు – 2 by S Sridevi
  3. తిరస్కృతులు – 3 by S Sridevi
  4. తిరస్కృతులు – 4 by S Sridevi
  5. తిరస్కృతులు – 5 by S Sridevi
  6. తిరస్కృతులు – 6 by S Sridevi
  7. తిరస్కృతులు – 7 by S Sridevi
  8. తిరస్కృతులు – 8 by S Sridevi
  9. తిరస్కృతులు – 9 by S Sridevi
  10. తిరస్కృతులు – 10 by S Sridevi
  11. తిరస్కృతులు – 11 by S Sridevi
  12. తిరస్కృతులు – 12 by S Sridevi
  13. తిరస్కృతులు – 13 by S Sridevi
  14. తిరస్కృతులు – 14 by S Sridevi
  15. తిరస్కృతులు – 15 by S Sridevi
  16. తిరస్కృతులు – 16 by S Sridevi
  17. తిరస్కృతులు – 17 by S Sridevi
  18. తిరస్కృతులు – 18 by S Sridevi
  19. తిరస్కృతులు – 19 by S Sridevi
  20. తిరస్కృతులు – 20 by S Sridevi

ఇద్దరం యిల్లు చేరుకున్నాం. ఎప్పట్లానే ఎవరి పోర్షన్‍లోకి వాళ్ళం వెళ్ళాక రుక్మిణమ్మగారు నా దగ్గరకి వచ్చింది.
“రాత్రి మైకేల్ వాళ్లింట్లో ఆగిపోయావనేసరికి చాలా కంగారనిపించింది వసంతా! వాడితో ఎక్కువ చనువుగా వుండకు. అదో తాగుబోతుల కొంప. తండ్రికి తండ్రీ వీడికి వీడూ అంతే! చిన్నప్పట్నుంచీ ప్రభాకర్‍తో తిరిగినవాడని రానిస్తున్నాను” అంది. ఆవిడ నాతో ఆప్యాయంగా మాట్లాడిన ఆఖరి మాటలు అవే.
ప్రభాకర్ నన్ను చేసుకోబోతున్నట్టు ఆరోజే ఆవిడతో అన్నాడు.


తల్లీ కొడుకులు నా విషయంలో గొడవ పడుతున్నారు. ఇద్దరూ వాదించుకోవడం, అరుచుకోవడం రెండు వాటా మధ్యనున్న తలుపుల్లోంచీ గోడల్లోంచీ దూసుకొచ్చి నా గుండెల్ని తూట్లు పొడుస్తోంది.
“నట్ట నడిరోడ్డులో నిలబడ్డ ఆడపిల్ల. చెయ్యగల సాయం చేసాము. అది వేరు, పెళ్ళి వేరు. కులం, గోత్రం అటుంచి ఎవరో, ఏమిటో తెలుసుకోకుండా పెళ్ళేమిటి?” అంటోంది ఆవిడ.
నా నిస్సహాయ స్థితిపట్ల రుక్మిణమ్మగారికి జాలివుంది. దాన్ని నేను అధిగమించటంపట్ల గౌరవం వుంది. ప్రభాకర్‍ని ప్రయోజకుడిగా సమాజం ముందు నిలబెట్టానన్న కృతజ్ఞత వుంది. ఆ మూడిట్లో ఏ ఒక్కటిగానీ, మూడూ కలిపిగానీ అతనూ నేనూ పెళ్లి చేసుకోవటానికి కారణాలు కాలేకపోయాయి ఆవిడకి. అలాగే వాటితో నిమిత్తం లేకుండా నేనొక వ్యక్తిగా అనుకుని పెళ్లికి వప్పుకునేంత మానసికవికాసం ఆవిడలో లేదు.
నలుగురూ తప్పుగా ముద్రవేసిన విషయం ఒప్పే అయినా తప్పనిపిస్తుంది మనిషికి. అది అతన్లో న్యూనతాభావానికి నాంది. పదేపదే తుంచి పారేసినా ఏదో ఒక సంఘటన జరిగి నాలో న్యూనతాభావన మళ్లీమళ్లీ మొలకెత్తుతోంది.


ఉన్నట్టుండి ప్రమీలాదేవి దగ్గిరనుంచి ఫోను.
“ఏం కొట్లాడుకుని యిదైపోతున్నారు మీరిద్దరూ? రాజ్ నీ పిల్లల్ని హాస్టల్‍నుంచి తీసుకొచ్చేసాడు. వాళ్లని నీ దగ్గరకి పంపెయ్యమన్నాడు. ఇప్పుడిద్దరూ యింట్లోనే వున్నారు. వాళ్లని వెంటేసుకుని అతను తిరుగుతుంటే నాకు కంపరమెత్తిపోతోంది. నాకేం ఖర్మ, వాళ్ళని యింట్లో పెట్టుకోవటానికి? వెంటనే వచ్చి తీసుకెళ్లు”” అంది.
ఇలా జరుగుతుందని వూహించినదే కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు నేను. ఎవరి పిల్లల్ని ఎవరు మాత్రం ఎంతకాలం చూడగలరు? భేషజం కోసం అలా చూడగలమని చెప్పినా వాస్తవంలో అది ఎనాళ్ళో సాధ్యపడదు.
“నేను వాళ్లని తీసుకొచ్చి యివ్వలేదు, నేనే వచ్చి తీసికెళ్లడానికి. మీరే పంపించండి” పదునుగా అన్నాను.
“పంపించకపోతే?”
“ఉంచుకోండి. నాలాగ ఎవరికీ వలలు విసరకుండా పెంచండి. పెళ్లిళ్ళు చేయండి.”
కొద్దిసేపటి తర్వాత ఆమె సుదీర్ఘంగా నిశ్వసించి అంది. “”నువ్వేదో నాతో సమానమని అనుకుంటున్నావేమో! నక్కకీ నాగలోకానికి వున్నంత వ్యత్యాసముంది మన మధ్య… సరే, నీ పిల్లల్ని నేనే తెప్పించుకున్నాను కాబట్టి నేనే పంపిస్తాను. ఎడ్రెస్ చెప్పు”
చెప్పాను.
పిల్లలు తిరిగొస్తున్నందుకు సంతోషంగా వున్నా మనసు లోపల్లోపల వాడియైన ముల్లు దిగబడినంత బాధగా వుంది. రాజ్ విషయంలో నా అంచనాలు తప్పనందుకు పెద్దగా ఆశ్చర్యం కలగలేదుగానీ అలాంటి వ్యక్తికోసం నా జీవితాన్ని వ్యర్ధం చేసుకున్నానని బాధేసింది. ఆ బంధం అలా వదిలిపోతున్నందుకు నాకు సంతోషమే కలిగింది. దుఃఖం రాలేదు. సంతోషం… రెక్కలిప్పుకుని తూనీగలా… సీతాకోకచిలుకలా ఎగరాలనిపించింది.
“ఏమిటంత సంతోషం?” వెలిగిపోతున్న నా ముఖంలోకి వింతగా చూసి అడిగాడు ప్రభాకర్. పిల్లల విషయం చెప్పాను. వాళ్లు నాకు మాత్రమే పిల్లలుగానీ అతనికేం కారు, వాళ్ల రాక అతనికి కొన్ని సమస్యలని తెచ్చి పెడుతుందని వూహించలేదు. నా మాటల్ని విని అతను ఆలోచనలో పడ్డాడు. అతన్నలా చూసాక నా సంతోషం మంచులా కరిగిపోయింది. ఏదో యిబ్బంది… అతన్లో… నాలోకూడా. నెమ్మదిగా కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. ఎవరికీ వీలుగా లేని యీ పెళ్ళి అవసరమా? ప్రశ్న. అసలు నాకు ఈ పరిస్థితుల్లో పెళ్ళి అవసరమా? దాని వెంబడే మరో ప్రశ్న. పిల్లలని దగ్గిరకి తెచ్చుకోవాలనుకున్నాను, వచ్చేస్తున్నారు. ఇంకా పెళ్ళెందుకు? ఇంకా యింకా ప్రశ్నలు.
నేను రెండుగా విడిపోయాను. అంతర్గత సంఘర్షణ ఒక నేను, బైటి వ్యవహారం మరో నేను. ఈ యిద్దరిమధ్యా సయోధ్య కుదరటం లేదు. ఎవరికివారు తనే అసలైన నేనని అనుకుంటున్నారు.
“మనం వేరే యిల్లు తీసుకుందాం వసంతా!” అన్నాడు చాలాసేపటికి.
“ఎందుకు?” వట్టి మట్టిబుర్రలా అడిగాను.
అతను నాకేసి యిబ్బందిగా చూసి, “నీకు పెళ్ళైందని చెప్తేనే అమ్మ అంత గొడవ చేసింది. కేవలం నాకోసం సరేనంది. అలాంటిది ఈ సంగతి తెలిస్తే తను తట్టుకోలేదు. ప్లీజ్.. అర్ధంచేసుకో” అన్నాడు.
“బాధపడుతున్నావా?”” మెత్తగా అడిగాడు మళ్లీ తనే. నాకేసి సూటిగా చూడలేకపోయాడు.
“నాకు ప్రేమించడం ఒక్కటే తెలుసు. దానికిగల హద్దులు తెలీవు”” అన్నాను.
“నువ్వు వాస్తవంలోకి రావాలి వసంతా! ఇదేం అమెరికానా? నిన్నటిదాకా బేచిలరుగా వున్న వ్యక్తి ఒక్కసారిగా ఒక స్త్రీతోటీ ఆమె పిల్లలతోటీ తిరిగి వాళ్లని తన ఫేమీలీగా డిక్లేర్ చెయ్యడానికి? మనచుట్టూ ఎంతమంది వుంటారు? వాళ్లకెన్నెన్ని రకాల మనస్తత్వాలు? అక్కడిలా
ఏది చూసినా డిప్లమాటిగ్గా చూసీ చూడనట్టు వదిలెయ్యరు. అన్నిటిలోకీ ప్రోబ్ చేస్తారు. ఇది యిక్కడి సమాజం. వాళ్ల మధ్యనే వుండాల్సినప్పుడు వాళ్లకి తగ్గట్టేవుండాలి”
“మరైతే ఏంచేద్దాం?”
“వేరేచోటెక్కడేనా ఫ్లాట్ తీసుకుందాం. అమ్మకీ విషయం తెలీకుండా కొంతకాలం మేనేజి చేస్తే తర్వాత ఆలోచిద్దాం” అన్నాడు.
సరేనన్నానేగానీ వున్న యిద్దరు పిల్లల్ని రుక్మిణమ్మగారికి తెలీకుండా పెంచటమెలాగో అదెలా సాధ్యమో తెలీలేదు నాకు. ప్రభాకర్, పిల్లలని రాజ్ వదిలెయ్యటంచేత నాకు చుట్టుకున్న ఆబ్లిగేషన్‍గా అనుకుంటున్నాడు. అతని కోణంలోంచీ చూస్తే ఇదొక సమస్య. అదే కోణంలోంచీ దాన్ని పరిష్కరించాలని చూస్తున్నాడు. ఇవన్నీ నాకు అర్థమవటానికి కొంత సమయం పట్టింది. ఇద్దరు మనుష్యులు ఒకటవాలనుకున్నప్పుడు వాళ్ళకి వ్యక్తిగతమైన సమస్యలు వుండకూడదు. ఒకరి సమస్యలు రెండోవారికి భిన్నమైన కోణంలోంచీ కనిపిస్తాయి.
వెళ్లి ఫ్లాట్ చూసుకుని ఎడ్వాన్స్ యిచ్చి వచ్చాము.
మారిన ఎడ్రెసు వివరాల ప్రమీలాదేవికి ఫోన్ చేసి చెప్పాను. ఏ క్షణాన్న పిల్లలొచ్చేస్తారోనని భయం.
అందుకే వెంటవెంటనే సామాన్లు సర్దేశాను. రుక్కిణమ్మగారు వచ్చింది. ఏడ్చేడ్చి ఎర్రబడ్డాయి ఆవిడ కళ్లు, తప్పు చేసినట్టనిపించింది. ఆశ్రయమిచ్చిన వ్యక్తి….
“నువ్వు చాలా తెలివిగలదానివి” అని ఒక్క క్షణం ఆగి, “వాడికి నువ్వు సంపాదించి యిచ్చినదంతా తీసేసుకో. వాడినొదిలెయ్” అంది.
ఛెళ్లుమని చరిచినట్లైంది నాకు. రెండోసారి…. డబ్బుతో బార్గెయిన్ చెయ్యబడటం. ఇదంతా ప్రభాకర్‍కి తెలుసో, తెలీదో! పిల్లలొస్తున్నారని తెలిసి అతనే ఆవిడతో చెప్పిస్తున్నాడేమో! ఒకసారి అనుభవంలోకి వచ్చింది కాబట్టి నా ఆలోచనలు అలాగే సాగాయి.
ఇంతలో ప్రభాకర్ వచ్చాడు. ఆవిడ చప్పుని అక్కడినుంచీ వెళ్లిపోయింది. “ఆటో తెచ్చాను. వెళ్దాం, పద”” అన్నాడతను తొందరపెడూ. తల్లి కేసి చూడనుకూడా చూడలేదు. అతన్ని అనుమానించినందుకు సిగ్గుపడ్డాను.
ఇల్లు మారటంలో పెద్ద ప్రాబ్లమేం లేదుగానీ ఆఫీస్ షిఫ్టింగే సమస్యైపోయింది. ఇన్‍కేబుల్లోనూ, సిటీ కేబుల్లోనూ యాడ్స్ యివ్వటం, పాంప్లెట్స్
కొట్టించడం, రెగ్యులర్ కస్టమర్సందరికీ ఫోన్ చేసి చెప్పడం యివన్నీ మైకేల్ చూసుకున్నాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఫోన్ నెంబరు మారింది. ఫోన్ రుక్మిణమ్మగారికి వదిలిపెట్టి కొత్తగా సెల్ ఫోన్ తీసుకున్నాను.
ఊరికి కాస్త దూరంగా వున్న అపార్టుమెంటులో మూడో అంతస్తులో వుంది మా ఫ్లాట్. ఇక్కడ అపార్టుమెంటు కల్చరు కొత్త. ఇప్పుడిప్పుడే ఒకట్రెండు తయారయ్యాయి. ఇప్పుడు మేం దిగినది చాలా పెద్దదనే చెప్పుకోవచ్చు. దాదాపు వంద ఫ్లాట్స్ వున్నాయి. వ్యక్తిగతజీవితం గురించి పెద్దగా పట్టించుకునేవాళ్లు లేరు. కాబట్టి ప్రశాంతంగా వుండవచ్చు. మేం వెళ్లేసరికే మైకేల్ వచ్చి వున్నాడు.
“ఆల్ ద బెస్ట్” అన్నాడు బొకే అందించి.
ఇంట్లోకి ఏమేం కావాలో, ఏమేం కొనాలో ప్రభాకర్ లిస్టు తయారుచేసాడు. ఇద్దరం వెళ్లి ముఖ్యమైనవి కొనుక్కొచ్చాం. పాలు పొంగించి వంట చేసాను. భోజనాలు చేస్తుంటే డోర్‍బెల్ మోగింది. వచ్చి కొన్ని గంటలైనా కాలేదు, మాకోసం ఎవరొస్తారు? చెయ్యి కడుక్కుని లేచాను.
ఆఫీసు యింకా మారలేదు. ఇంతకుముందు వుండినవాళ్లకోసం వచ్చారేమోననుకుంటూ తలుపు తీసాను. ఎదురుగా వున్న వ్యక్తిని చూసి నివ్వెరపోయాను. ప్రమీలాదేవి యింత త్వరగా స్పందిస్తుందనుకోలేదు. పిల్లలిద్దర్నీ చెరోచేత్తోనూ ఎత్తుకుని దాసు గుమ్మంలో నిలబడి
వున్నాడు. నన్ను ప్రమీలాదేవి ఇంటినుంచి స్టేషన్‍కి చేర్చిన డ్రైవరు.
“బాగున్నారామ్మా?” అడిగాడు.
నేను జవాబు చెప్పేలోపు పిల్లలిద్దరూ “”అమ్మ!” అంటూ చుట్టుకుపోయారు. సుధని ఒకసారి ఎత్తుకుని దింపి సుమని తీసుకున్నాను. అది బల్లిలా కరుచుకుపోయింది. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. డ్రైవరు కిందికెళ్లి పెద్దపెద్ద సూట్‍కేసులు పట్టుకుని వచ్చాడు.
“ఇవన్నీ ఏమిటీ?” ఆశ్చర్యంగా అడిగాను.
“రాజ్‍బాబే అన్నీ దగ్గరుండి సర్దించారమ్మా!” అన్నాడు. నాకు జవాబేం చెప్పాలో తోచలేదు.
“ఎప్పుడు బయల్దేరావో…. అన్నం తిని వెళ్లు” అన్నాను. అనేసి మళ్లీ ప్రభాకర్, మైకేల్ వున్న దగ్గరికి వెళ్లాను. వాళ్లు తినడం అప్పుడే ముగిసింది. సుమని ఎత్తుకుని వున్న నన్ను వింతగా చూసారు. సుధ నాకూడానే వుంది.
“అంకుల్‍కి హలో చెప్పు”” సుధకి చెప్పాను.
అది యిద్దరికీ షేడ్ హేండిచ్చి “”హలో అంకుల్! అయాం సుధ, ఫస్ట్ స్టాండర్డ్”” అని పరిచయం చేసుకుంది. సుమ కనీసం తల తిప్పి కూడా చూడలేదు. బాగా బెంగ పెట్టుకున్నట్టుంది, రెప్పవేసినా నేను మాయమైపోతానేమో నన్నంత భయంగా నన్నే గమనిస్తూ వుండిపోయింది.
నేను డ్రైవరుకి అన్నం వడ్డిస్తుంటే ప్రభాకర్, మైకేల్ హాల్లోకి వెళ్లారు. సుధ వాళ్లతో వెళ్లింది. వెళ్తూ బొమ్మలు చూపిస్తానని సూట్‍కేసు తాళం తీసుకుంది.
“నువ్వూ అక్క దగ్గరకెళ్ళు” అన్నాను సుమతో, తల అడ్డంగా వూపింది.
“సరే మరిక్కడ కూర్చో” అని అక్కడున్న కుర్చీలో దింపాను. నన్ను వెళ్లనివ్వకుండా కొంగు గట్టిగా పట్టుకుంది. పెద్దపెద్దగా వున్న దాని కళ్లలో బెదురు. కలుక్కుమంది నాకు.
“ఎక్కడికీ వెళ్లనమ్మా! దాసుకి అన్నం పెట్టద్దూ? మరి ఆకలేస్తుందిగా?” అన్నాను దాన్ని మరోసారి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ. నా చీర వదిలేసింది. దాసు కాళ్లూ చేతులు కడుక్కుని వచ్చాడు. అతను తింటుంటే పిల్లలిద్దరికీ ప్లేట్లలో అన్నాలు కలిపిచ్చాను. భోజనం చేస్తూ అక్కడి విషయాలు చెప్పాడు దాసు.
“ఆరోజు మిమ్మల్ని స్టేషన్లో దింపి యింటికెళ్లాక రాజ్‍బాబు ఎంతో ఆశగా అడిగారమ్మా, ఏవూరో చెప్పారాని. చెప్పలేదనేసరికి కొట్టినంత పని
చేసారు. ప్రమీలమ్మమీద కూడా అరిచారు. పాపల్ని హాస్టల్లో ఏసినప్పుడల్లా యిద్దరికీ గొడవే వచ్చిందమ్మా మంచి కాన్వెంటులో ఎయ్యాలని
ఆయన… అంత కర్చెందుకని అమ్మా, సామాన్లన్నీ బాబే దగ్గరుండి సర్దించారు. ఊరి పొలిమేరలదాకా వచ్చారు. పాపలైతే తమతో వచ్చెయ్యమని ఒకటే ఏడుపు. బాబుకూడా కళ్లు తుడుచుకున్నాడమ్మా” అన్నాడు. నా మనసేమీ కరగలేదు. ఆరోజు నేనెంత నిర్దయగా వెళ్లగొట్టబడ్డానో మర్చిపోలేదు.
తిన్నాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు.