వెళ్తూ చెప్పాడు, “నల్లసూట్ కేసులో ఫైలుందటమ్మా! అది చూసుకోమన్నారు బాబు”
నేను ఆసక్తి చూపించలేదు. కొంచెం తటపటాయించి తనే అడిగాడు, “”ఏమైనా చెప్పమంటారామ్మా ” అని.
“ఏముంటాయ్? ఏమీ లేవు” అన్నాను,
వెయ్యి రూపాయలిచ్చి, “”నీ పిల్లలకేదైనా కొని తీసుకెళ్లు”” అని చెప్పాను. అతను తీసుకోలేదు.
“ఎందుకమ్మా?” అన్నాడు మొహమాటపడుతూ,
“ఈరోజు నాకు చాలా సంతోషంగా వుంది. నువ్వు నాకిచ్చిన ఆనందం ముందు యిదెంత?”” అని బలవంతంగా యిచ్చాను.
“మళ్లీ అక్కడికి రారామ్మా?”” అడగలేక అడిగాడు.
ప్రభాకర్ దిగ్గుమని తల తిప్పి చూసాడు. సుధ, మైకేల్ యిద్దరూ కూడా కుతూహలంగా చూసారు, నేనేం చెప్తానోనని.
“అక్కడ ఇంక నాకేముంది దాసూ?”” అన్నాను.
“అంతేనమ్మా, అంతే”” అంటూ అతను వెళ్లిపోయాడు. కొద్దిసేపుండి మైకేల్కూడా వెళ్లిపోయాడు. సుమ నిద్రపోయింది, సుధ కాసేపు ఆడుకుంటానంది. నామంచంమీద సుమని పడుకోబెట్టి దానికీ చోటుచేసాను.
“నిన్నతను చాలా ప్రేమించేవాడా వసంతా?”” నెమ్మదిగా అడిగాడు. ప్రభాకర్. అతన్లో ఒకలాంటి నిస్పృహ కనిపించింది. అది సమాజవిరుద్ధంగా
నన్ను చేసుకోవాలనుకుని కొంతా, తల్లి అయిష్టతవల్ల యింకొంతా, యిప్పుడీ సంఘటనలవల్ల మరికొంతా… అతను తన మనసుతో చాలా సంఘర్షిస్తున్నాడు. ఐనా నేనతన్ని మభ్యపెట్ట దలచుకోలేదు. అలా మభ్యపెట్టి అతనికి సంతోషాన్ని కలిగించి ఒక బంధంలో యిరికించడం నా స్వభావమే కాదు. ఏదైనా స్పష్టంగా చెప్పి సరైన నిర్ణయం తీసుకోనివ్వాలి. ఇంతదాకా వచ్చాక కూడా అతనికి తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాన్ని నేను లేకుండా చెయ్యను.
“అతను నన్ను తన ప్రేమతో ముంచెత్తేసాడు ప్రభాకర్. ప్రపంచాన్నే మరిపించాడు. అతనికి హార్ట్ అటాక్గనుక రాకపోతే మా ప్రేమకి అంతరాయం వచ్చేది కాదు. ఎప్పుడైతే నన్ను ఇంటికి పిలిచి అవమానం చేసాడో ఆ క్షణాన్నుంచే అతనిపట్ల నా ప్రేమ చచ్చిపోయింది. పిల్లలకోసం బతకాల్సిన అవసరం ఒకటుంది కాబట్టి నా ఆలోచనలు చావు దిశగా పయనించలేదు. పిల్లలు అతని దగ్గర వున్నంతకాలం క్షేమంగానే వున్నా వాళ్ళు అతని ఎప్పటికేనా బరువనిపించచ్చు. ఆ క్షణాన్ని ఎదుర్కోవడంకోసం నేను చెదిరిపోయిన బ్రతుకుశకలాలని ప్రోగుచేసుకుంటుంటే పిల్లల్ని అడ్డుపెట్టుకుని మళ్లీ నామీద పట్టు బిగించాలనుకున్నాడు. అది సాధ్యపడక వాళ్లని పంపేసాడు. కానీ… వాళ్లకీ
కక్షలూ, కుత్సితాలూ తెలీవుకదా? పసివాళ్ళు. అతను వాళ్ళకి తండ్రే. అతన్ని చాలా యిష్టపడతారు. అతనూ మనసులో ఏమున్నా వాళ్లతో
అలాగే వుంటాడు”” నా గొంతు వణికింది.
“పసిపిల్లల్ని హింసించేంత మూరుణ్ణి కాను వసంతా, నేను. వాళ్లు మన దగ్గిర ఏ లోటూ లేకుండా పెరుగుతారు. ప్రామిస్. బాగా చదివిద్దాం ” ప్రభాకర్ నా చేతిని అందుకుని మృదువుగా పెదాలకి తాకించుకున్నాడు.
గుండెల్లో బరువేదో దిగిపోయినట్టైంది. ఆడవాళ్ళుకానీ, మగవాళ్ళుకానీ ఒక్కొక్కసారి చాలా అంధత్వంలోకి జారిపోతుంటారు. అసలు నేను అతనిమీద దేనికి ఆధారపడ్డానో నాకే తెలీని క్షణం అది. డబ్బు, ధైర్యం, తెలివి అన్నీ వున్న నేను అతన్నుంచీ ఏమి ఆశిస్తున్నాను? ఒక గందరగోళం.
రాత్రయేదాకా వుండి వెళ్లాడు ప్రభాకర్. డ్రైవర్ చెప్పిన నల్లసూట్కేసులోని ఫైల్ విషయం గుర్తొచ్చింది. ఏముంది అందులో? కుతూహలంగా తీసి
చూసాను. పిల్లలిద్దరి పేరా ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లున్నాయి. ఇకమీదట నాకూ తనకీ ఎలాంటి సంబంధం వుండబోదని రాసిచ్చిన లీగల్ అఫిడవిట్ వుంది. కళ్లు చెమర్చాయి. ఆ బంధం పూర్తిగా తెగిపోయినందుకేమో!
సూట్‌కేసు చాలా పెద్దది. నా చీరలూ, అతనితో టూర్లకి వెళ్లినప్పుడు కొన్న బొమ్మలూ వున్నాయి. ఆర్ట్పీసెసూ, నా పుస్తకాలూ, వస్తువులు… ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడి నా ప్రపంచమంతా యిక్కడికి తరలి వచ్చేసింది. ఒక తండ్రి ఆడపిల్లని కాపురానికి పంపించినట్టుంది. మిగిలిన సూట్కేసులనిండా పిల్లల బట్టలూ, సరంజామా. తేలికపడ్డ గుండె మళ్లీ బరువెక్కింది. ఎన్ని జ్ఞాపకాలు… ఎన్నిటి గుర్తులివన్నీ? అతని ప్రేమ నిజమేనా? లేకపోతే నాతో అలా నటించాడా? అంత ప్రేమని ఎలా నటించగలిగాడు? అది నటన కాకపోతే దాన్ని అంత తేలిగ్గా ఎలా తుంచుకోగలిగాడు?
వాటినలాగే ఎదురుగా వుంచుకుంటే మరీమరీ బాధనిపిస్తుందని గ్రహించాను. వెంటనే దగ్గర్లో వున్న రిస్క్యూహోమ్కి ఫోన్ చేసి చెప్పాను, ఎవర్నేనా పంపమని. మర్నాడు ఉదయం తామే వస్తామని చెప్పింది మేట్రన్. అన్నట్టుగానే ఉదయం మనిషిని తీసుకుని ఆమే స్వయంగా వచ్చింది. పిల్లల వస్తువులూ బట్టలు తప్ప నావన్నీ యిచ్చేసాను. ఆమె తెల్లబోయింది. నా ముఖం చూసి ఏదీ మాట్లాడలేక అన్నీ పట్టించుకుని వెళ్లిపోయింది. ఫండ్స్కోసం ఏ సెకండ్హేండుకైనా అమ్ముతారేమోనని బాధనిపించినా వెంటనే సర్దుకున్నాను. నేనేం అలమారాని కాను, ఒక్కొక్కరి ప్రేమ గుర్తుల్ని జాగ్రత్తచేసి దాచడానికి!
సుమనీ సుధనీ స్కూల్లో వేసాను. నేనే గార్డియన్‌గా సంతకాలు చేసాను. ప్రభాకర్ నాపక్కన నిలబడి వున్నాడంతే. నా సమస్యల్లోకి అతన్ని
లాగదల్చుకోలేదు. మా యిద్దరి మధ్యా ఒప్పందం అది. జీవితం దార్లో పడ్డట్టే. చేతినిండా పుష్కలంగా సంపాదన. పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకోవాలనుకున్నాం. పిల్లల్లో ప్రభాకర్ సరదాగా వుంటాడు. వాళ్లూ అతన్ని యిష్టపడుతున్నారు.
“నాన్న ఎప్పుడొస్తారమ్మా యిక్కడికి?”” ఉన్నట్టుండి సుధ అడిగింది, ప్రభాకర్ వున్నప్పుడే. వాళ్లకి చెప్పాలి అంకుల్ వున్నప్పుడు తండ్రిగురించి అడగకూడదని.
“మా స్కూలుకొచ్చారు. ఇంటికి రమ్మంటే రానన్నారు”” అంది. నేను షాకయ్యాను. “
“నాన్న స్కూల్కొచ్చాడా?”” అపనమ్మకంగా అడిగాను. అప్పటికే ప్రభాకర్ ముఖంలో రంగులు మారుతున్నాయి. అతనికి రాజ్ ప్రస్తావన ఎంతమాత్రం యిష్టం వుండదు. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే చాలా స్పష్టంగా చెప్పాడు, మా జీవితంలో అతని ప్రమేయం
వుండకూడదని. నేనూ వప్పుకున్నాను.
“నన్నూ చెల్లినీ తనతో పంపించమన్నారు. మా మిస్ వప్పుకోలేదు. నాన్నకి కోపం వచ్చిందిగానీ వూరుకున్నారు. మాతో కొద్దిసేపుండి వెళ్లిపోయారు”
“నాకు నాన్న కావాలి”” అంది సుమ ఏడుపుముఖం పెట్టి, అది నా దగ్గరున్నంతసేపూ అతను కావాలని ఏడ్చేది. అతను తీసికెళ్లగానే నాకోసం ఏడ్చేదట.
“ఇది అక్కడ కూడా ఏడ్చింది”” సుధ చెప్పింది.
“ఎందుకు?” అడిగాను.
“నాన్నతో వెళ్లిపోతానని. కానీ తనొద్దన్నారు”
నేను సుదీర్ఘంగా నిశ్వసించాను. మా యిద్దరి దారులూ తిరిగి కలుసుకోలేనంతగా విడిపోయాయని వీళ్లకెలా చెప్పను? ఇప్పుడిప్పుడే వీళ్లు ప్రభాకర్‌ని ఫ్రెండుగా వప్పుకుంటున్నారు. అతనితో నేను మాట్లాడినా చనువుగా వున్నా పట్టించుకోవడం లేదు.
సుమకి పొసెసివ్‌నెస్ బాగా ఎక్కువ. సుధని ఎప్పుడేనా ఎత్తుకున్నా వూరుకునేది కాదు. దింపేదాకా ఏడ్చేది. అలాంటి పిల్లల్ని అతనొచ్చి డిస్టర్బ్ చెయ్యటమేమిటి? చికాగ్గా అనిపించింది. దానికి తగ్గట్టు ప్రభాకర్ ముభావంగా వుండిపోయి, కాసేపటికి లేచి వెళ్లిపోయాడు.
రుక్మిణమ్మగారు మా విషయంలో రాజీపడలేదు. ఒకవేళ రాజీపడాలని వున్నా పిల్లల విషయం ఒకటి వుంది కాబట్టి అతనూ రాజీదిశగా ప్రయత్నించట్లేదు. నిజంగా అదొక సమస్యే. అయినా దాన్ని సమస్యగా గుర్తించడానికి నా మనసు వప్పుకోవడంలేదు.
సమస్య అంటే? నాకు పిల్లలు వుండటం కాదు, పిల్లలు మామధ్య వుండటం. వాళ్ళకి నామీదా, రాజ్‌కి వాళ్ళమీదా హక్కులు, అధికారం వుండటం. ప్రభాకర్‌ని పంపించాక నేను పిల్లల్నిద్దర్నీ దగ్గిరకూర్చోబెట్టుకున్నాను.
“మనం ఆ వూర్నించీ వచ్చేసాం. ఇంక నాన్న విషయం ఎత్తకూడదు” అన్నాను.
“ఎందుకు?”
“అంకుల్‌కి యిష్టముండదు”
“అంకుల్‌కి ఎందుకు యిష్టముండదు?”
“నాకు అంకులొద్దు. నాన్నే కావాలి” ప్రశ్నా, జవాబు రెండూ ఒక్కసారే వచ్చాయి.
ఎలా చెప్పను వీళ్లకి? ఎలా చెప్తే అర్థమౌతుంది? రాజ్ మాకు చేసిన ద్రోహం వీళ్లకి తెలీదు. అతను నవ్వుతూ పలకరిస్తుంటే వీళ్లు దాన్ని నిజమైన ప్రేమనుకుంటున్నారు. విడాకులు తీసుకుని పిల్లల కస్టడీ తీసుకున్న స్త్రీ విషయంలోకూడా ఇలాగే జరుగుతుంది. తల్లి కష్టపడి వాళ్ళ అవసరాలన్నీ చూస్తుంది. నెలకోసారి తండ్రి వచ్చి వాళ్ళముందు చిటికెలు వేసి, చక్కిలిగింతలు పెట్టి కిలకిల్లాడించి వెళతాడు. ఇదంతా ఒక నాటకం. నేనూ ప్రభాకర్ ఘర్షణ పడేదాకా సాగుతుంది. అది వేరే విషయం. వీళ్లని అతన్నుంచీ ఎలా దూరం చేసేది? ప్రభాకర్ ఎవరని చెప్తే వీళ్లు గ్రహిస్తారు? ఎవరని చెప్పినా తండ్రి తర్వాతే. ఆ తండ్రి ప్రేమలో నిజాయితీ వున్నా లేకపోయినా. అదీకాక పరిస్థితుల్ని అర్థం చేసుకునే వయసులేదు వీళ్లకి. వీళ్లకి చెప్పడంకన్నా రాజ్‌కే చెప్పడం బెటర్. అర్థం చేసుకుంటే చేసుకుంటాడు. లేకపోయినా నేనింత వోపెన్గా చెప్పాక అతను మళ్లీ నా జోలికి రాడు. అతనికి పట్టుదల చాలా ఎక్కువ.
పిల్లల్ని ఆడుకోవడానికి పంపి రాజ్ నెంబరు ట్రై చేసాను.
“వసంతని”” అన్నాను కలవగానే.
“ఏంటి?””
“నువ్వు స్కూల్ కి వెళ్లావా?” అతని మాటింకా పూర్తికాలేదు, కోపంగా అడిగాను.
“ఏం? వెళ్లకూడదా? వాళ్లని చూడాలనిపించింది. వెళ్లాను”” నిర్లక్ష్యంగా వుంది జవాబు.
“ఎందుకెళ్లావు? నాతో నీకింక ఎలాంటి సంబంధం వుండదని రాసిచ్చి మళ్లీ యిదేంటి?”
“నేనేం దాన్ని బ్రీచ్ చెయ్యలేదు””
“మరి స్కూల్‌కి ఎందుకెళ్లావు?””
“దానికీ దీనికి ఏమిటి సంబంధం? నేను బ్రేక్ చేసుకున్నది వాళ్లతో కాదు, నీతో”
అతను చాలా తెలివైనవాడని నాకు తెలుసు. లిటిగెంటు కూడానని యిప్పుడే తెలిసింది.
“ఔనౌను. వాళ్లమీద నీకు ప్రేమ చాలా ఎక్కువగానీ వాళ్లని కలిసే ప్రయత్నం చెయ్యకు”” అన్నాను విసుగ్గా.
“నువ్వెవరు? వాళ్లని కలవద్దని చెప్పడానికి?” అంతకంటే విసుగ్గా అడిగాడతను.
“వాళ్ల మంచికోరేవాడివైతే మరోసారి వాళ్లని కలనకు వాళ్ళకి సంఘంలో గౌరవం వుండదనికదా, నువ్వు, నీ భార్య ఆరోజుని నన్నంత అవమానం చేసింది? వాళ్లకోసం నేనో కుటుంబాన్ని సృష్టిస్తున్నాను. వాళ్లు నిన్ను మర్చిపోయి స్మూత్‌గా అందులో యిమిడిపోవాలి. ప్రభాకర్‌ని తండ్రిగా వప్పుకోవాలి” కచ్చితంగా చెప్పాను.
“గార్డియన్ సిగ్నేచర్ పెడతాననికూడా అననివాడు తండ్రా?” హేళనగా అడిగాడు. నేను నివ్వెరబోయాను. ఇతను తెలుసుకోని విషయమంటూ వుండదా?

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.