తోడబుట్టిన బంధం by Tulasibhanu

  1. తోడబుట్టిన బంధం by Tulasibhanu
  2. సరైన న్యాయం by Tulasi Bhanu

సూర్య, శ్వేత ముచ్చటైన జంట. వారికి ఒక ముద్దుల కొడుకు మహాదేవ్. అతనికి ఇప్పుడు పదేళ్ళు. శ్వేతకు శివుడంటే ఇష్టమని మహాదేవ్ అని పేరు పెట్టుకుంది కొడుకుకి.
ఇప్పుడు మళ్ళీ నిండునెలల గర్భిణి. సూర్య, శ్వేతకోసం నాలుగురోజుల ముందునుంచే ఆఫీసుకి సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. సూర్య, శ్వేతది ప్రేమవివాహం . కులాలు వేరు. అందుకే ఇటు పెద్దలు, అటు పెద్దలు ఎవ్వరూ దగ్గరికి రారు, వీరినీ దగ్గరకు రానియ్యరు. ఎప్పుడన్నా ఫోన్‍చేసుకుని బావున్నారా అంటే బావున్నారా అనుకుని పెట్టేయటమే.
మహాదేవ్‍తో శ్వేత చెబుతోంది ” దేవా, మనకు పుట్టేది చెల్లికానీ, తమ్ముడుకానీ నువ్వు వారితో అనవసరంగా పోటీలు, పంతాలు పెట్టుకుని గొడవలు వేసుకోకు. మీరు ఇద్దరూ ఎప్పుడూ స్నేహంగానే ఉండాలి ” అని.
“సరే అమ్మా.. ఎందుకు అన్నిసార్లు చెబుతావు, నేను అంత గొడవ పడేవాడిలాగా కనిపిస్తున్నానా ” అని దేవా అలుకగా అనేవాడు.
“ఆ< అంతేకదా మరి ” అని సూర్యకూడా దేవాకి మద్దతు ఇస్తూ దగ్గరకు తీసుకునేవాడు.
శ్వేత మనసులో అనుకుంది, పక్కింట్లో అన్నదమ్ములిద్దరూ ఎప్పుడూ పోటీలు పడుతూ పంతంగా అమ్మకి నేనంటే ఇష్టం అంటే, కాదు అమ్మకి నేనంటేనే ఎక్కువ ఇష్టం అని నిత్యం గొడవలు పడుతూ, దెబ్బలు కొట్టుకునేదాక వెళ్ళేవారు. అందుకే నాకీ భయం అని.
ఆరోజు పొద్దున్నే శ్వేతకి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే హాస్పిటల్‍కు వెళ్ళిపోయారు. మధ్యాహ్నంవరకూ నొప్పులు ఆగి, మళ్ళీ వస్తూ శ్వేత చాలానే అలిసిపోయి నీరసపడింది. “ఆపరేషన్ వద్దు మళ్ళీ పిల్లలకు నేను నెలరోజులు ఏమీ సరిగ్గా చేసుకోలేను, నార్మల్ డెలీవరీకే కష్టపడతాను” అని బలంగా చెప్పింది శ్వేత. కానీ ఆమెకి తెలీదు రాబోతున్న ప్రమాదం.
మధ్యాహ్నం నర్సు ఆనందంగా బయటికి వచ్చి సూర్యకు, మహాదేవ్‍కు చెప్పింది పండంటి పాపాయి పుట్టింది అని.
సూర్య “శ్వేత ఎలా ఉంది?” అని అడిగితే,
“కొంచెం ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతోంది. డాక్టర్ గమనిస్తున్నారు. ఓ పావుగంట తరువాత రూమ్‍కి మారుస్తారు.” అని చెప్పింది.
“అయ్యో!” అన్నాడు అప్రయత్నంగా సూర్య.
“ఏం నాన్నా, ఏమయ్యింది అమ్మకి? ” అడిగాడు మహాదేవ్.
“ఏమీలేదు నాన్నా, కాస్త నీరసంగా ఉందట” చెప్పాడు సూర్య. కాసేపాగి నర్స్ పాపని తీసుకొచ్చింది.
మహాదేవ్ “నాన్నా, చెల్లి…” అని గంతులు వేసాడు. సూర్య అపురూపంగా పాపను తీసుకుని మురిపెంగా కొడుక్కి చూపిస్తున్నాడు.
“నాన్నా, చెల్లిని నేను ఎత్తుకుంటా” అడిగాడు మహాదేవ్. సరే అని సూర్య పాపను దేవా చేతులకు అందించాడు.
నర్స్‍వైపు చూసి శ్వేత గురించి అడగబోతుంటే, నర్స్ పక్కకు రమ్మని సైగ చేసి,” శ్వేత ఇంక బతికి లేరు” అని చెప్పింది సూర్యతో నెమ్మదిగా. “ఆ< శ్వేత… శ్వేత” అనేసాడు సూర్య బాధగా.
దేవాకు అనుమానం వచ్చేసి, ” ఏమయ్యింది నాన్నా అమ్మకి? ” అని అంటూ పాపను ఎత్తుకునే గబగబా సూర్య దగ్గరకు వచ్చేసాడు. పిల్లలు ఇద్దరినీ కన్నీళ్ళతో మసకబారిన కళ్ళతో చూస్తుంటే, శ్వేత మాటలే గుర్తొచ్చాయి, ఆపరేషన్ అయితే నెలరోజులు పిల్లలను నేను చూసుకోలేనుగా… అని… మరి ఇప్పుడు పిల్లలను శాశ్వతంగా చూసుకోలేవుగా శ్వేతా అని మనసులోనే గావుకేక పెట్టుకుంటూ మోకాళ్ళమీద కూర్చుండిపోయి దేవాను, దేవా చేతుల్లోని పాపను రెండు చేతులతో చుట్టేసి ఆపుకోలేక బయటికే ఏడ్చేస్తున్నాడు సూర్య. ఇహ విషయం అర్ధమైన దేవా వెక్కివెక్కి ఏడుస్తూ తండ్రి భుజంలో తలను దాచేసుకున్నాడు. దుఃఖం దేవాను పట్టి కుదుపుతున్నా చేతుల్లో ఉన్న చిట్టిచెల్లిని మాత్రం భద్రంగానే పట్టుకుని ఉన్నాడు.


శ్వేతకు ఇష్టమైన శివుడి పేరు మీదనే పాపకు శివాని అని పేరు పెట్టారు సూర్య, మహాదేవ్. శివానీని అపురూపంగా చూసుకుంటున్నారు తండ్రి, అన్న…
అప్పుడప్పుడూ చెల్లెలిమీద అన్నకి, అన్నమీద చెల్లికి కోపం వచ్చి గొడవలు పడినా మహాదేవ్‍నే ముందుగా రాజీ పడిపోయేవాడు. గొడవలు పడద్దమ్మా అని తల్లి ఎదురుగా ఉండి చెబుతున్నట్లే అనిపించేది దేవాకి.
శివానీకి ఎప్పుడన్నా ఏ పిల్లలు అయినా తల్లిప్రేమ రుచి చూస్తుంటే చూసి, మరి నాకు అమ్మ ఎక్కడ అని గోల చేసేది, బాధగా ఏడ్చేది. అలాంటప్పుడు దేవాకికూడా తల్లి గుర్తొచ్చి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుని వెక్కివెక్కి ఏడ్చేవాడు. ఇటు శివానీని ఊరడించుకుంటూ, అటు దేవా బాధను అర్ధం చేసుకున్న సూర్యకి ఒకేసారి పిల్లలిద్దరినీ సంభాళించుకోవడం చాలాకష్టం అయ్యేది, ఎందుకెళ్ళిపోయావు శ్వేతా పిల్లలను ఇలా దిక్కులేనివాళ్ళను చేసి అని అసహాయంగా మనసులోనే చెప్పలేని బాధపడేవాడు.
ఎలాగో ఒకలాగా బతుకుబండిని లాగిస్తూ పిల్లలను పెద్దవాళ్ళను చేసాడు ఒంటరి సూర్య. శివానీకి ఇప్పుడు ఇరవైరెండేళ్ళు, దేవాకి ముప్పైరెండు. ఎందుకోగానీ దేవా అస్సలు పెళ్ళి చేసుకోనని చెల్లిని, తండ్రిని చూసుకుంటూ ఉండిపోయాడు. శివానీ నచ్చింది అంటూ ప్రణయ్, తన తల్లితండ్రులను తీసుకుని, సూర్య ఇంటికి వచ్చాడు.
“అమ్మో, అప్పుడే శివానీకి పెళ్ళా, వేరే ఇంటికి పంపించేయాలా?” అని ఇప్పుడే పెళ్ళి వద్దంటే వద్దన్నారు సూర్య, దేవా, శివాని.
ప్రణయ్‍వాళ్ళు నిరుత్సాహంగా వెనక్కివెళ్ళారు. ప్రణయ్ మాత్రం శివానితో మాట్లాడుతూ, ప్రేమసందేశాలు పంపుతూ, తన ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. అరునెలల తరువాత శివాని పెళ్ళికి ఇష్టపడింది.
దేవా చెల్లిని చూడకుండా ఉండలేను అని చెబుతుంటే. సూర్యనే ఆలోచించి మనమ్మాయిని ఇష్టపడి వచ్చారంటే శివానీని బాగా చూసుకుంటారు దేవా, అని దేవాని ఒప్పించాడు.
శివాని ప్రణయ్‍ల పెళ్ళి బాగా జరిపించారు సూర్య, మహాదేవ్. పెళ్ళి అప్పగింతలప్పుడు సూర్యకి, దేవాకి ఏడుపు, దిగులు ఆగలేదు. ఇక శివానీ అయితే,
“నేను ఎక్కడికీ వెళ్ళను నాన్నా, అన్నతో, నీతోనే ఉంటాను” అని చిన్నపిల్లలాగా ఒకటే మొండితనం.
ప్రణయ్‍కి సరదాగా అనిపించి నవ్వొస్తోంది. ప్రణయ్ తల్లిదండ్రులు, బంధువులూ ఏమో, ఇదెక్కడి గోలరా బాబూ అన్నట్లు చూస్తున్నారు. చివరికి సూర్యనే తేరుకుని పిల్లలు ఇద్దరికీ ముద్దుగా నచ్చచెప్పుకున్నాడు.


హనీమూన్‍కి ప్రణయ్,
“స్విట్జర్లాండ్‍కి పంపించండి” అని మావగారిని అడిగాడు పెళ్ళిలో. సరే అని పెళ్ళైన వారానికి వాళ్ళ ప్రయాణానికి ఏర్పాట్లు చేసాడు సూర్య. ఈలోగా శివాని కూడా ప్రణయ్‍తో ఉండటానికి కాస్తంత అలవాటు పడింది.
ఆరునెలలు దాటాక ప్రణయ్ వాళ్ళ అసలురంగు బయటపడింది. శివాని అంటే సూర్యకి, దేవాకి పిచ్చిప్రేమ, ఎంత డబ్బులు అడిగినా చచ్చినట్లు ఇస్తారని ప్రణయ్ వాళ్ళ ఆలోచన.
“యాభైలక్షల డబ్బు మీ నాన్నని అడిగి తీసుకునిరా, ప్రణయ్ ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తాడు” అని వారంరోజులనుంచీ శివానిమీద వత్తిడి తెస్తున్నారు ప్రణయ్ తల్లిదండ్రులు.
“నేను తీసుకుని రాను, మా నాన్న ఎందుకివ్వాలి? మీ అబ్బాయికి కావాలంటే మీరే ఇవ్వండి” అని శివాని ఆత్మగౌరవం నిండిన సమాధానాలు. అది వారం రోజులుగా సాగుతుండగా, ప్రణయ్‍ని ఆరోజు బాగా రెచ్చగొట్టి వదిలారు ప్రణయ్ తల్లిదండ్రులు.
ప్రణయ్ మూర్ఖంగా ముందూవెనుకా ఆలోచించకుండా శివానీని చెంపమీద కొట్టి ఇంకొన్ని దెబ్బలుకూడా వేయబోయాడు. శివాని ఆడపులిలా ఎదురుతిరిగి వెంటనే తన సామానులు సర్దుకుని నాన్నా, అన్న దగ్గరకు వచ్చేసింది. తన బాధను, అసలు కారణాన్ని దాచేసింది సూర్య, దేవా దగ్గర.
“మీఇద్దరి దగ్గరా ఉండాలనిపించి వచ్చాను” అని చెప్పింది.
“సరే అమ్మా, అంతకన్నా మాకు కావల్సింది ఏముంది?” అని సూర్య, మహాదేవ్ శివానీతో సరదాగా ఉన్నారు.
పదిహేనురోజుల తరువాత సిగ్గువదిలేసి భయపడుతూ ప్రణయ్ సూర్య ఇంటికి వచ్చాడు శివానికోసం.
“క్షమించండి మావయ్య, శివాని విషయంలో తొందరపడ్డాను, ఇంకెప్పుడూ ఇలా జరగదు, శివానీని నాతో రమ్మనండీ” అని. అప్పుడుకూడా విషయం సరిగ్గా అర్ధంకాని దేవా, సూర్య శివాని వైపు చూసారు. సరే అన్నట్లు తల ఊపింది.
ప్రణయ్ పంపమనడమేంటీ పొరపాటు చేసినవాడులాగా, శివానీ వెళ్తానని అనటమేంటీ అని సూర్య, దేవా అయోమయ పడ్డారు.
“నువ్వెళ్ళు ప్రణయ్, నేను అన్నతో వస్తాను” అంది శివాని. సరే అన్నట్లు తలూపి శివాని వస్తే చాలు అనుకుని వెళ్ళిపోయాడు ప్రణయ్.
“అన్నా! నీకొక మేనకోడలు రాబోతోంది. మరి నువ్వూ తనకి ఒక తోడుని కనిపెట్టాలి, ఒక సంవత్సరం తేడాలో అయినా సరే ” అంది నవ్వుతూ తన పొట్ట మీద చెయ్యేసుకుని శివాని.
“వావ్! నిజంగా బుజ్జిశివానీని చూడబోతున్నామా?” అని సూర్య, దేవా ఇద్దరూ శివానీని తమ రెండు చేతులతో చుట్టేసారు. కాసేపు ముగ్గురూ రక్తసంబంధం తాలూకు మధురిమను ఆస్వాదించాక శివానీ మళ్ళీ చెప్పింది అన్నకి “ఒరేయ్, నువ్వు వెంటనే పెళ్ళి చేసుకోవాలి, మా వదిన రావాలి, మీకు సంవత్సరంలో బిడ్డ పుట్టాలి, నా బిడ్డకు తోడవ్వాలి, అంతే” అని.
“అలా కాదురా నాన్నకు నేను తోడు, నాకు నాన్న తోడు” అని దేవా చెప్పబోతుంటే
“అదేం కుదరదు, నీ మేనకోడలిని ముట్టుకోనుకూడా ముట్టుకోనివ్వను. పెళ్ళి చేసుకో, భార్యాసమేతంగా వచ్చి నా బిడ్డతో ఆడుకో” అంది శివాని స్పష్టంగా.


దేవాకి, పారుల్ కి పెళ్ళి నిరాడంబరంగా జరిగిపోయింది. దేవా అభ్యర్థన వలన. పారుల్‍ కూడా కుజదోషం ఉండటంవలన అప్పటివరకూ పెళ్ళి జరగలేదు. బహుశా దేవాకి, పారూకి పెళ్ళి రాసిపెట్టిఉంటుంది. పారూ మంచి అమ్మాయి. సూర్యని బాగా చూసుకుంటుంది. శివానీకి తల్లిలేని లోటుని తీర్చేలా పరిణితిగా ప్రవర్తిస్తుంది. ఇహ దేవాకి అయితే ఇన్నిరోజులు ఆలస్యం చేసానే పారుల్‍లాంటి మంచిస్నేహితురాలిని పొందకుండా అనే భావన వచ్చింది. శివానీకి అన్న పక్కన తోడుగా వదిన రావడం చూసి మనసుకి నిండుగా అనిపిస్తుంది. సూర్యకి కూడా ఏదైనా ఆలోచనలలో ఒక మంచి సలహా ఇస్తూ తోడుగా ఉంటూ సూర్యలోని ఒంటరితనాన్ని కాస్తంత తగ్గించింది పారుల్.
శివానీకి అయిదోనెల వచ్చింది. బొజ్జ కాస్తకాస్తగా తెలుస్తోంది. పుట్టింటి సీమంతం చేస్తామన్నారు సూర్యావాళ్ళు. ఇదే అదనుగా కాచుకు కూర్చున్న ప్రణయ్ తల్లిదండ్రులు, శివానీకి తెలియకుండా సూర్యకి చెప్పారు
“మేము మీ ఇంటికి శివానీని పంపాలన్నా, శివానీ సీమంతంలో మేము ఉండాలన్నా మీరు మాకు యాభైలక్షలు ఇవ్వండి, మాకోసం కాదు, మీ అమ్మాయి అల్లుడు బాగుకోసమే ” అని. సూర్యకి కాసేపు వారి మాటల అంతరార్ధం అర్ధం కాలేదు, తరువాత తప్పదుకదా, అమ్మాయికోసం అని అనుకుని సరే అని చెప్పాడు.
డబ్బులు అన్నీ సర్దుబాటు కాలేకపోతే, పారుల్ తన బంగారంకూడా తీసిచ్చింది. అప్పుడు ప్రణయ్ తల్లిదండ్రులు సీమంతంలో సంతోషంగా పాల్గొన్నారు. సీమంతం హడావుడి అంతా సంబరంగా జరిగింది, శివానీ తాను పుట్టింట్లోనే కొన్నిరోజులు ఉంటానంది.
“మాకు నీతో పనేముంది, మా డబ్బులు మాకు ముట్టాయిగా ” అనుకుని ప్రణయ్ వాళ్ళు వెళ్ళిపోయారు.
ఆరాత్రి శివానీ కాళ్ళకు పారూ చిన్నగా మర్ధనా చేస్తుండగా శివానీ అడిగింది ” ఏంటి వదినా, శుభవార్త ఇంకా చెప్పట్లేదే, పిల్లలు ఇప్పుడే వద్దనుకున్నారా మీరు?” అని.
“లేదమ్మా మా ప్రయత్నాలలో లోపం ఏమీ లేదు, నీ కోరిక తీర్చాలనే ఆయన ఎప్పుడూ ఆశ పడతారుగా, ఆ దేవుడు ఇంకా కరుణించలేదేమిటో ” అని చెప్పింది పారూ.
“కానీలే వదినా, చూద్దాములే మన అద్ష్టం ఎప్పుడొస్తుందో…” అంది శివాని.
శివానీకి నిండునెలలు. సూర్యకి, దేవాకి ఒకటే కంగారుగా ఉంది. శ్వేత సంఘటనే కళ్ళముందు మెదుల్తోంది వారిద్దరికీ. తిండి, నిద్ర కరువు అయ్యాయి ఇద్దరికీ. పారూ నే ఇద్దరికీ ధైర్యం చెబుతోంది. శివానీకి అన్నా,వదినా ఇంక శుభవార్త చెప్పలేదే అన్న బాధ వెంటాడుతోంది… మహాదేవ్‍కికూడా చెల్లి అడిగిన కోరికను ఇంకా తీర్చలేదనే బాధ ఉంది… కానీ ఎవ్వరూ ఎవరి బాధనీ బయటకు వ్యక్తపరచట్లేదు. బంగారంలాంటి మనసున్న పారూ ఈ విషయమై దిగులుపడకూడదు అన్నదే అన్నాచెల్లెళ్ళ ప్రయత్నం…
శివానీకి నొప్పులు మొదలయ్యాయి. ప్రసవానికి సమయం పడుతోంది.
సూర్య డాక్టర్‍లను అడిగాడు “అవసరమైతే ఆపరేషన్ అయినా చేయండి కానీ తల్లీబిడ్డలను క్షేమంగా నా చేతికి అందివ్వండి” అని.
దేవా బయటకు ఏమీ చెప్పట్లేదు కానీ మౌనంగానే మనసులోనే కుమిలిపోతున్నాడు చెల్లెలు ఏమయిపోతుందా అని. పారూ భర్త చేయిని పట్టుకుని వదలడం లేదు, ” మన శివానీకి, తన బిడ్డకు ఏమీ కాదు ” అని ధైర్యం చెబుతూ.
మరో గంటకి చక్కటి పాపాయికి జన్మనిచ్చింది శివాని. శివానికూడా ఆరోగ్యంగా బావుంది. దేవుళ్ళకి మనసులోనే వేల నమస్కారాలు చెప్పుకున్నారు సూర్య, దేవా, పారూ.
శివానీ బిడ్డకు శ్వేత అనే పేరుపెట్టారు.
“ఆ దురదృష్టమైన పేరు వద్దూ” అని ప్రణయ్ తల్లిదండ్రులు అడ్డు చెప్పబోతే,
“మీరు మొదటినుంచే అన్నీ ఎక్కువే చేస్తుంటారు. ఇది మా అమ్మ పేరు. మా ఇంటికి ఆవిడే దేవత. మీకు ఆవిడ పేరు ఇష్టం లేకపోతే, నేను, నా బిడ్డ మా అన్న దగ్గరే ఉంటాం” అంది కోపంగా శివాని. ఏం మాట్లాడలేక నోరు మూసుకున్నారు ప్రణయ్‍వాళ్ళు.
పారుల్‍కి, మహాదేవ్‍కి పిల్లలు కలగట్లేదు ఎందుకూ అని పరీక్షలు చేయించారు. పారుల్‍కి గర్భసంచిలో సమస్య ఉందని, పిల్లలు కలగటం కష్టం అని చెప్పారు. పారుల్ కి ఈ విషయం తెలియగానే కుంగిపోతుందేమో అనుకున్నారు సూర్య, దేవా, శివాని.
“కానీయండి, ఏం చేద్దాం? శివానీ బిడ్డనే నా బిడ్డ, అయినా మా అత్తగారు ఇన్నాళ్ళు పోగొట్టుకున్న ప్రేమంతా తనొక్కతే పొందాలనుకుంటున్నారేమో ” అంది వాతావరణాన్ని తేలికపరుస్తూ పారుల్…
“అమ్మా ,తల్లీ! నీ ఆశావహ దృక్పధానికి ఓ దండం ” అంది శివానీ, పారూల్ ని దగ్గరకు తీసుకుంటూ.
“ఒరేయ్ శివాని బంగారం, అన్నీ మనిద్దరం తోడబుట్టినవాళ్ళం సమంగా పంచుకోవాలన్నదేగా మన అమ్మ కోరిక, ఈ బిడ్డ శ్వేతకూడా మనిద్దరికీ బిడ్డే ” అన్నాడు మహాదేవ్ బుజ్జి శ్వేతకు నుదుటిమీద మంచి మేనమామ ముద్దును ఆప్యాయంగా అందిస్తూ. తోడబుట్టిన బంధం అన్నీ సమంగా పంచుకోవాలే కానీ ఇది నాది ఇది నాకే అని పంతాలకు పోకూడదు, నాటకాలాడి లౌక్యం అనే పేరుతో మోసాలు చేసుకోకూడదు.