The Chronology of India from Manu to Mahabharata by Vedveer Arya Review by S Sridevi

వేల సంవత్సరాల సుదీర్ఘమైన, నిరంతరాయమైన చరిత్ర వుండికూడా అదేమిటో తెలియని, ఆ చరిత్ర రాయబడిన భాష రాని, జాతి ఏదేనా వుందంటే అది భారతజాతి. ఆ లోపాన్ని సవరిస్తూ కొంతమంది ఔత్సాహికులు, చరిత్రకారులు సంస్కృతగ్రంథాలలో వున్న చరిత్రని బయటికి తీసి మనకి అనువైన భాషలో రాసి అందించారు. వారిలో వేదవీర్ ఆర్య ఒకరు. భౌతికమైన ఆధారాలు లేని కారణంచేత వాటిని మనం నమ్మవచ్చు, నమ్మకపోవచ్చుగానీ, ఇదిమాత్రం చాలా చక్కటి, ఎంతో అవసరమైన ప్రయోగం. ఈ విషయాలమీద రచయిత ఎన్నో పుస్తకాలు రాసారు. వాటిలో ఒకటి ప్రస్తుతపు పుస్తకం.
యుగం అంటే జోడించేది అని, కాలంలో ఒక భాగం అనీ అర్థాలున్నాయి. మొదట్లో 5 సంవత్సరాల కాలాన్ని యుగం అనేవారు. మనకి సూర్య చంద్రమానాలలో కాలాన్ని లెక్కవేయటం వుంది. 62 చంద్రమాన నెలలు 60 సూర్యమాసాలకి సరిపోతాయి. తేడాగా వున్న రెండు చంద్రమాసాలనీ రెండున్నరేళ్లకి ఒకసారి అధికమాసంగా కలిపి, రెండిటినీ అనుసంధానం చేసారు. తరువాత 1200 సం, ఆ తర్వాత 12000 యుగానికి కొలమానంగా తీసుకున్నారు. అటుతర్వాత ఇంకా విస్తృతమైన, కచ్చితమైన ( elaborate and accurate ) ఖగోళగణనకోసం 12000*360=43,20,000 సంవత్సరాల యుగాన్ని తీసుకున్నారు. ఈ లెక్కలు పురాణాల్లో వాడటంచేత అనేక అసంబద్ధతలు చోటుచేసుకుని వాటిలో యిచ్చిన సమాచారాన్ని ప్రశ్నార్థకం చేసారు.
ఇతిహాసాలు, పురాణాలు అనగానే ముందు ముఖ్యంగా మనకి నమ్మశక్యంకాని విషయాలు చాలా వుంటాయి. వ్యక్తుల ఆయు:పరిమాణాలు, అతీంద్రియ శక్తులు, మాయలు, మంత్రాలు. తేదీలు మొదలైనవి. ఇలాంటివన్నీ తీసేస్తే భారతం ఎలా వుంటుందో ఎస్.ఎల్. బైరప్పగారి తమ “పర్వ” అనే పుస్తకం తెలుపుతుంది. అదేవిధంగా ఎన్నో అసంబద్ధతలని తొలగిస్తూ వేదవీర్ ఆర్యగారు ఇచ్చిన వివరణలు చాలా బాగున్నాయి. ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలియజెప్పటానికి పూర్వీకులు ఖగోళశాస్త్రాన్ని వాడుకున్నారు. ప్రాచీన భారతీయులకి ఖగోళంపైన అపారమైన పట్టు వుంది. ప్రతి సంఘటనకీ గ్రహాల, నక్షత్రాల స్థితిగతులని వివరించారు. వాటిని పరీక్షించి నిర్ధారించుకోవచ్చు.
ఐహోలు శాశనం, ఇంకా కొన్ని ఇతరమైన ఆధారాలతో భారతయుద్ధకాలాన్ని క్రీ.పూ. 3162గా నిర్ణయించినా రామయణకాలం ఇంకా మిత్‍గానే వుండిపోయింది. అంతేకాదు, ద్వారకానగరం దాదాపు క్రీ.పూ 9300 సంవత్సరాలక్రితం Melt water pulse 1B వలన సముద్రంలో మునిగిపోయిందని ఆధారాలు దొరికాయి. భారతయుద్ధం క్రీ.పూ 3162లో జరిగినప్పుడు, ద్వారక క్రీ.పూ 9300 లో ఎలా మునుగుతుంది అనే ప్రశ్నకూడా మనలో కలగడం సహజం. కృష్ణుడు 6000 సంవత్సరాలు బతికాడా అనే ఒక్క ప్రశ్నమీద భారతయుద్ధాన్ని అభూతకల్పన అని తీసిపారేసే అవకాశం వుంది. సముద్రంలో మొదట మునిగినది కుశస్థలి, తరువాత ద్వారావతి, ఆ తర్వాతే ద్వారక అనే వివరణ ఇస్తారు రచయిత. ఇప్పుడు మనకి 9300 సంవత్సరాలక్రితం ఒక ప్రణాళికాబద్ధమైన పట్టణాన్ని నిర్మించగలిగిన టెక్నాలజీ వుండేదని తెలుస్తుంది. అలాంటి టెక్నాలజీ ఒక్కరోజులో రాదనే విషయం అర్థమౌతుంది. మన నాగరికత ఇంకా పూర్వపుదని వప్పుకోవాలి. భారతయుద్ధం 3162లో జరిగి, ద్వారావతి 9300లో సముద్రంలో మునిగిన మధ్యకాలాన్ని రామాయణం ఎలా భర్తీ చేస్తుందో వివరించారు. అలాగే గౌతమబుద్ధుడు, వర్ధమానమహావీరుడు, ఆర్యభట్టు మొదలైనవారి జీవితకాలానికి, సంబంధించిన వివరాలుకూడా ఇచ్చారు. ఇంకా అనేక సందిగ్ధాలని పరిష్కరించారు.
బ్రహ్మ అనే వ్యక్తినుంచీ మొదలుపెట్టి, భారతకాలందాకా పాలించిన రాజులు, అనేకమంది ఋషుల వంశానుక్రమణికని రచయిత హేతుబద్ధంగా అందించారు. మతవిశ్వాసాలు వేరు, చరిత్ర వేరు. చారిత్రక స్పృహ వున్న పుస్తకం ఇది. చరిత్రపైన ఆసక్తి వున్నవారు చదవదగ్గ పుస్తకం.